అప్పుతో మనశ్శాంతి కి ముప్పు. 4. కర్తవ్యం ?
ఋణ బంధాలలో చిక్కుకునే వారికి , ఇంగ్లండు లో ఒక అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ గారు ఇచ్చే సలహా చూడండి !
1. మీకు ఉన్న ఆర్ధిక పరిస్థితులు మీ మానసిక ఆరోగ్యాన్ని ఏ విధం గా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించండి, కొంత సమయం తీసుకుని. ప్రత్యేకించి , తీవ్రమైన వత్తిడి కి లోనవడమూ , లేదా డిప్రెషన్ కో ,నిద్ర లేమి కో లోనవడమూ కూడా మీరు నిశితం గా పరిశీలించు కోవాలి. అట్లాగే ,మీరు చీటికీ మాటికీ, చీకాకు పడడం , ప్రత్యేకించి , మునుపెన్నడూ లేని విధం గా అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడే , ఈ చీకాకూ , అశాంతీ , ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి !
2. ప్రత్యేకించి , మీరు మీ ఆలోచనా ధోరణి సరిగా ఉందో లేదో అని రోజూ లేదా తరచూ ఆత్మావలోకనం చేసుకోవాలి ! అప్పులు పాపాల పుట్ట లా పెరుగుతున్నా , ఏమీ పట్టనట్టు, ” ఆనందో బ్రహ్మ ” అనే ఆత్మ వంచన కు మీ ఆలోచనలు మిమ్మల్ని గురిచేస్తున్నాయా ? లేదా పెరుగుతున్న అప్పులు , మిమ్మ్మల్ని నిరాశావాదులు గా , నిర్వీర్యులు గా చేస్తూ , మీకు జీవితం మీద వైరాగ్యం లేదా నెగెటివ్ అంటే నిరాశావాదపు ఆలోచనలూ , ఈ లోకం లో జీవించి ఉండడం అనవసరం ” అనే విధం గా మీ చేత ఆలోచింప చేస్తున్నాయా ?పైన వివరించిన రెండు పద్ధతులూ అప సవ్యమైనవే అని ఎవరూ చెప్పకనే మనకు తెలుస్తున్నాయి కదా ! అందువలన మీ ఆలోచనా ధోరణి పాజిటివ్ దృక్పధం తో ఉండాలి . మీ అప్పులు పెరుగుతున్నా , మీ ఆలోచనలు గాడి తప్పకూడదు !
3. మీరు ఎక్కువ సమయం పడక లోనే గడుపుతూ, మీ సొంత వాళ్ళనూ , మీ స్నేహితులకు మీ ముఖం చూపించ కుండా , మీరు తీర్చ వలసిన అప్పు ల గురించే దీర్ఘం గా ఆలోచిస్తున్నారా ? అయితే అది కూడా ఒక తిరోగమన చర్యే !
అయితే , మీరు చేయ వలసినది ఏమిటి ? :
ఎట్టి పరిస్థితులలోనూ మీ ప్ర ప్రధమ కర్తవ్యం ” మీ జీవితం ఎంత విలువైనదో గుర్తుంచు కోవడం ” ఈ విశాల ప్రపంచం లో మీరు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన , ఒక ప్రత్యేకమైన వ్యక్తి ! అంతే కాక మీ జీవితం ఎంతో అమూల్యమైనది. మీరు ఎంత అప్పు చేసినా , మీరు ఎంత తీర్చలేక పోయినా , ఆ అప్పు కన్నా మీ ప్రాణం ఎంతో మిన్న ! అందు చేత మిమ్మల్ని మీరు ఏ విధమైన హానీ చేసుకో కూడదు ! తిరోగమన చర్యలు చేపట్టడం ఏ విధం గానూ సమంజసం కాదు , సమర్ధనీయం కాదు , హేతు బద్ధం కాదు ! మీరు అప్పు ల ఊబి లో నుంచి బయట పడే ముందు , ఏ రకమైన నెగెటివ్ ఆలోచన ల ఊబి లోనూ కూరుకు పోకుండా మీరు జాగ్రత్త వహించాలి ! నిండా మునిగిన వారికి చలి ఏమిటి ఇంకా అనే ” పలాయన వాదం ” తో చాలా మంది , తాగుడు , జూదం , సిగరెట్టూ , ఇట్లా రక రకాల వ్యసనాలకు బానిస లవుతుంటారు ! తెలిసి తెలిసీ ఒక విష వలయం లో కూరుకు పోతుంటారు , అది చాలా పొర పాటు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !