Our Health

Archive for మార్చి, 2012|Monthly archive page

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 1.

In Our Health on మార్చి 14, 2012 at 11:11 సా.
కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 1.
కామ వాంఛ లేక ‘ lust’ లేక ‘ sexual desire ‘ .
మన దేహం లో ఎన్నో ఎండోక్రైన్ గ్రంధులు ఉన్నాయి. వీటిని తెలుగు లో వినాళ గ్రంధులు అంటారు.ఈ గ్రంధులలోనుంచి ప్రత్యెకమైన జీవ రసాయనాలు విడుదల అవుతుంటాయి, నిత్యమూ. ఈ ప్రత్యేక జీవ రసాయనాలను  హార్మోనులు అంటారు. ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు ఏ నాళమూ లేకుండా సరాసరి మన రక్తంలోకి విడుదల అవుతుంటాయి. అందుకే వీటికి ‘ వినాళ గ్రంధులు ‘  అని పేరు వచ్చింది ( అంటే ‘ Endocrine glands ‘ ) 

ఈ గ్రంధులలోనుంచి  హార్మోనులు చాలా స్వల్ప పరిమాణం లో విడుదల అవుతుంటాయి. అయినప్పటికీ ఈ హార్మోనులు మనకు ఎంతో ముఖ్యం.  అనేక కీలకమైన జీవ క్రియలను ఈ హార్మోనులు ప్రభావితం చేస్తాయి,  మన జీవితాంతమూ. ఈ హార్మోనుల లోపం వల్ల మన దేహం లో తీవ్ర అస్వస్థత కలగ వచ్చు.
ఉదాహరణకు : థైరాయిడ్ గ్రంధి నుంచి థైరాయిడ్ హార్మోను విడుదల చేయ బడుతుంది. అట్లాగే మగవారి లో యాన్డ్రోజనులు, అంటే ‘ androgens’ , ఆడ వారిలో ఈస్త్రోజెనులు, లేక ‘ estrogens’ విడుదల అయి మనలో మన లింగ నిర్ధారణకు కారణమవుతాయి.
అలాగే ఇన్సులిన్ హార్మోను మన రక్తములో గ్లుకోసు ను నియంత్రించటమనే ముఖ్య విధి నిర్వర్తిస్తుంది.
మనలో కామ కోరికలు లేక కామ వాంచలు రేకెత్త టానికి సెక్స్ హార్మోనులు కారణం. కామ కోరికలూ , రతి క్రియ అంటే సెక్స్ , ఇవి ప్రతి ప్రౌఢ వయసు వచ్చిన ప్రతి స్త్రీ కీ , పురుషునికీ ఎంతో ముఖ్యము. అందుకే ఐక్య రాజ్య సమితి సెక్సువల్ హెల్త్ లేక లైంగిక ఆరోగ్యాన్ని ప్రతి మానవుని ప్రాధమిక హక్కు గా గుర్తించింది.
స్త్రీలలోనూ , పురుషుల్లోనూ, ఈ కామ వాంచలు, రతిక్రియ ఎట్లా ప్రేరేపించ బడతాయో రేపటి టపా నుంచి మనం తెలుసుకుందాము. దానితో పాటు మానవులలో వాటి లోపాల వల్ల తలెత్తే సమస్యలూ, వాటిని ఎట్లా సరి చేయ వచ్చో కూడా మనం కొంత తెలుసుకుందాము.
ఈ విషయాలు పెద్దలకు మాత్రమే !!
ఎవరికైనా ఈ లైంగిక విజ్ఞానము అభ్యంతర కరం గా తోస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. 

ఆకర్షణ,ప్రేమ,కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.13

In Our Health on మార్చి 13, 2012 at 10:47 సా.

ఆకర్షణ,ప్రేమ,కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.13.

 
సంస్కృతి, జీవ శక్తుల కలగలుపు:
లెక్కకు మించిన ఆచార వ్యవహారాలూ, అలవాట్లూ, సాంఘిక కట్టుబాట్లూ, నాగరికతలూ, ఈ మూడు  జీవ శక్తులు అంటే ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ ల నుంచి పరిణామం చెందినవే !!
అవి ఒక కుటుంబం గానే కావచ్చు,  అతడు, ఆమె సంగమించే ఆచారాలే  కావచ్చు, లేక పిల్లల పెంపకమే కావచ్చు, లేక మనం అభిమానించి పెంచే  కళలే కావచ్చు.
ఈ మూడు జీవ శక్తులు ( అంటే  ఈ ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ అనే అనుభూతులు ) కొన్ని విపరీత పరిణామాలకు కూడా దారి తీయవచ్చు. అవే : డిప్రెషన్, స్త్రీలపైన అత్యాచారాలు చేయటము, సంబంధాలు  తెగి పోవటము, కుల టత్వము ( అంటే adultery )  విడాకులు, హింస, ఆత్మ హత్య లేక హత్య.
మనము కేవలం ఈ జీవ శక్తులకు బానిసలమా ? మనం మనలో ఈ జీవ శక్తులకు కారణమైన డీ ఎన్యే అంటే ‘ DNA ‘ నే మన పొరపాట్లకూ, మన విపరీత ప్రవృత్తికీ, కామ విశృంఖలతకూ బాధ్యులను చేస్తూ ఉందామా?   వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక్క పదం లో చెప్పవచ్చు: కాదు !

మానవుడు పరిణామం చెందుతున్న కొద్దీ అతడి లో ఉన్న మెదడు కూడా పరిణామం చెందుతూ ఉన్నది.
ప్రీ ఫ్రాన్టాల్ కార్టెక్స్  లేక ( pre frontal cortex ) కూడా పరిణామం చెంది అది మానవులు చేసే వివిధ  క్రియలను  హేతువాద బద్ధంగా చేయటానికీ ముఖ్య కారణం అవుతుంది. 
ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ , మెదడు లో ఒక ముఖ్యమైన భాగం. ఈ భాగం మన నుదిటి వెనుకనున్న మెదడు భాగం.  ఈ భాగం కంప్యుటర్ లోని ప్రాసెసర్ లాగా మనలో పని చేస్తుంది. ఈ భాగం మన మెదడు లోని మిగతా భాగాలతో అనుసంధానమై ఉంటుంది.  మెదడు లో ఉన్న లేక వస్తున్న సమాచారాన్నంతా  ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ , 
విచారించి,  మంచీ, చెడూ విచక్షణ చూపి, హేతు వాద బద్ధం గా ఒక నిర్ణయం  తీసుకునేట్లు చేస్తుంది. అలాగే భవిష్యత్తు కు సంబంధించిన పధకాలు వేసుకోవడం , వాటిని అమలు పరచడం లో కూడా ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ కీలక పాత్ర వహిస్తూంది.
ఈ ప్రీ ఫ్రాన్ టాల్ కార్టెక్స్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఈ భాగమే మానవులను కేవలం జీవ ప్రవ్రుత్తి తోనే ప్రేరేపింప పడకుండా, తమ  విచక్షణా జ్ఞానాన్ని కూడా ఉపయోగించి  తదనుగుణంగా కీలకమైన విషయాలలో సరి అయిన నిర్ణయాలు తీసుకునేట్లు చేస్తుంది. 
అందు వల్లనే, ఆకర్షణ కు లోనైన వారందరూ  విపరీతం గా ప్రవర్తించరు ! . ప్రేమించే వారందరూ కామ విశృంఖలత చూపరు !!.  కామ వాంఛ ఉన్న వారందరూ హింసకు, అత్యాచారాలకూ పాల్పడరు !!. వివాహం చేసుకున్న  వారందరూ విడిపోరు !! 
ఇంకో విధం గా చెప్పాలంటే   ‘  most humans are not just driven by their basic instincts, but by their intellect  too !! 

జీవ శక్తులు, సంస్కృతి- ఈ రెండూ  ‘ nature and nurture ‘ గా  మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.  మన హేతు వాద ఆలోచనా ధోరణి – ఈ మూడూ కూడా  ఒకదాని మీద ఇంకొకటి ముడి పడి ఉంటాయి మనలో ! ఈ మూడు శక్తుల కలగలుపుల పరిణామమే మన నడవడిక, ప్రవర్తన.
అందు వల్లనే విపరీతమైన కోరికల అలలు చెలరేగినా, ప్రణయాకర్షణ, ప్రేమ, లేక అంతులేని కామవాంఛ లు ఉత్పన్నమైనా , వాటిని  మనలో మనమే కనిపెట్టి , తగు నిర్ణయాలు హేతు బద్ధంగా తీసుకోగాలుగుతున్నాము .  

అందు కే వివాహ వ్యవస్థ ఇంకా వర్దిల్లుతూంది ప్రపంచం లో !!!

తరువాతి టపాలో కామ వాంఛ గురించి తెలుసుకుందాము !!


ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 12.

In Our Health on మార్చి 12, 2012 at 8:43 సా.
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 12.
 
 
క్రితం టపాలో చూసినట్లు,  మానవులు తమ జీవిత కాలం లో  ఒకరికన్నా ఎక్కువ మంది తో  అనుబంధాలను ఎర్పరుచుకుంటారు. అది ఒకే సమయం లోనే కాక పోవచ్చు.
వేరే జీవ జాతుల లో  చూసినట్లయితే ఈ అనుబంధాలు  ఏర్పరుచుకునే గుణం, వాటిలో కూడా  నిక్షిప్తమై ఉంటుంది.
ఒక పరిశీలనలో తొమ్మిది వేల జాతుల పక్షులలో తొంభై శాతం కన్నా ఎక్కువ పక్షి జాతులు వాటి  సంగమ దశలో ఇంకో పక్షి తో  అనుబంధం కలిగి ఉంటాయి. అంటే బ్రీడింగ్ సీజన్ లో.
కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ పక్షి జాతులలో యాభయి శాతం కన్నా ఎక్కువ పక్షులు బ్రీడింగ్ సీజన్ లో కలిసిన పక్షులతో జీవితాంతమూ కలిసి ఉండవు. బ్రీడింగ్ సీజన్ అయిపోయి గుడ్లు పొదగటం పూర్తి అయాక వాటి దోవలో అవి పోతాయి. అలాగే  క్షీరదాల లో అంటే స్తన్య జంతువులలో అంటే పిల్లలకు తమ పాలు ఇచ్చి పెంచే జంతువులు కూడా పిల్లలు పుట్టిన తరువాత , వేరు పడతాయి. 
మానవులలో కూడా పుట్టిన వారికి ( అబ్బాయి అయినా అమ్మాయి అయినా ) నాలుగు సంవత్సరాలు వచ్చే సరికి  అయ్యే విడి పోయే వారి  సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. మానవులలో సరాసరి కాలం  అంటే ఒక సారి తల్లి అయి మళ్ళీ తల్లి అవటానికి మధ్య కాలం కూడా నాలుగు సంవత్సరాలే !! 
ఒకసారి పుట్టిన వారు నడవగలిగి వారి బంధువుల నీడలో పెరగ గలిగే బలం తెచ్చుకుంటే, వారి తల్లి తండ్రులు,  వేరే అటాచ్మెంట్లు   లేక ‘ pair bonding ‘ ఏర్పరుచుకునే వారు  అనాది కాలం లో , మళ్ళీ బలవంతమైన , శక్తివంతమైన సంతానం ఉత్పత్తి చేయటం కోసం. ప్రత్యుత్పత్తి జీవ లక్షణం కదా !!
పరిణామ రీత్యా చూస్తే మానవులలో ప్రస్తుతం ప్రబలుతున్న ఎక్కువ మంది తో కామ సంబంధమైన అనుబంధం , మానవ పరిణామం లో  మొదటి దశలలో జరిగిన బ్రీడింగ్ సీజన్ లో మానవుల నడవడిక ను తలపించే పరిణామం యొక్క జీర్ణావస్థ అంటే  ‘ రేమ్నెంట్ ‘ అని అనుకోవచ్చు. 
మానవులలో ఒకే సంబంధం లో  ఎక్కువ కాలం   ఉంటే  కలిగే అసంతృప్తి కి మానవ దేహం లో జరిగే మార్పులు కూడా ప్రోద్బలం కావచ్చు. 
అవి రెండు రకాల కన్నా ఎక్కువ గా ఉండవచ్చు. ఒకటి అటాచ్మెంట్ జరిగేందుకు అవసరమయే జీవ రసాయనాలు, ఎక్కువ అయి అవి జీవ నాడీ కణ గ్రాహకాలను అంటే న్యూరో  రిసెప్టార్స్ ను ఎక్కువ గా క్రియా శీలం చేయవచ్చు. లేక తక్కువ జీవ రసాయనాలు ఉత్పత్తి అయి అవి నాడీ కణ గ్రాహకాలను అంటే మెదడు లో ఉండే న్యూరో రిసెప్టార్స్ ను తక్కువగా  క్రియా శీలం చేయటం వల్ల మానవులు ఇంకో అట్టాచ్మెంట్ లేక ‘  pair bonding  ‘ కోసం తపిస్తూ తనతో ఉంటున్న వారిని వదిలేయవచ్చు.
 
 
తరువాతి టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము. 
 
 
 

ఆకర్షణ,ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 11.

In Our Health on మార్చి 11, 2012 at 10:15 ఉద.

ఆకర్షణ,ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 11.

ఒకే సంబంధమూ – విడాకులూ :
స్త్రీ పురుషుల మధ్య సంబంధము,  ప్రణయాకర్షణ లో తన్మయత్వం చెంది, ప్రేమానురాగాలు గా మారి, వివాహమూ, తదనంతరం జరిగే  రతీ మన్మధ కేళీ విలాసాలకు నిలయం గా  పరిణమిస్తుంది సహజంగా – ఇంత వరకూ అత్భుతంగా ఉంది కధ!.
కానీ ఈ స్త్రీ పురుష సంబంధము మానవ నాగరికత  పరిణామం చెందుతున్న కొద్దీ, మారిపోతున్నది. అంటే ఒక సారి స్త్రీ పురుష సంబంధం (  సాధారణం గా  వివాహం ద్వారా ) ఏర్పడ్డ తరువాత, అది శాశ్వతం అవట్లేదు.
ఇటీవల జరిపిన ఒక సర్వే లో ప్రపంచం లో ఉన్న 62  అభివృద్ధి చెందిన, లేక అభివృద్ధి చెందుతున్న సమాజాలూ, వ్యవసాయమే ప్రధానం గా కల సమాజాలలో విడాకుల సంఖ్య గణనీయం గా పెరిగిందని తెలిసింది.  సర్వే చేసిన ఈ సమాజాలలో విడాకులు,  సంప్రదాయ బద్ధం గా,  ఇప్పటి వరకూ చాలా అరుదు గా ఉన్న సమాజాలు కూడా ఉన్నాయి.
దీనిని బట్టి తెలుస్తున్నదేంటంటే, విడాకులు క్రమేణా  విశ్వ వ్యాప్తంగా  బలహీన పడుతున్న వివాహ బంధాలకు కొలమానాలవుతున్నాయి. విడాకులు స్త్రీ పురుష ఆర్ధిక స్వాతంత్ర్యానికి కూడా అవినాభావ సంబంధం తో ఉంటున్నాయి. అంటే ఎక్కడైతే ఆర్ధిక స్వాతంత్ర్యం ( ముఖ్యంగా స్త్రీలకు ) ఎక్కువ అవుతుందో  అక్కడ విడాకుల సంఖ్య కూడా ఎక్కువ గా ఉంటూంది.
ఈ విడాకులు  స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి సామర్ధ్యం ఎక్కువ గా ఉన్నప్పుడు అంటే వారు ఇరవై , ముప్పై సంవత్సరాల మధ్య లో ఉన్నప్పుడు, వారికి వివాహం అయి నాలుగు ఏళ్ళు అయినప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా !  సాధారణం గా పెళ్లి అయి నాలుగు ఏళ్ళు ఆయే సరికి ఒక బాబు లేక పాప పుట్టటం జరిగి వారు కొంత స్వతంత్రత కలిగి ఉంటారు. అంటే వారికి తల్లి పాలు అప్పుడు అవసరం ఉండవు కదా. అలాగే వారు వారి పనులు వారు, చెపితే చేసుకునే వయసు లో ఉంటారు. సంతానం ఏమీ లేని దంపతులు కూడా ఎక్కువ గా విడిపోతున్నారు.
ఎక్కువ కాలం వివాహం చేసుకుని జీవిస్తున్న వారు , పిల్లల తో ఉన్న వారు , వీరిలో తరువాత విడాకుల సంఖ్య తక్కువ గా ఉంటోంది. 
ప్రపంచ వివాహ వ్యవస్థ ను పరిశీలిస్తే  ఒకే స్త్రీ తో నూ లేక పురుషుని తోనూ శాశ్వత  సంబంధం కలిగిన వారు తగ్గి ,  ఒక నిర్ణీత సమయం వరకే వారు సంబంధం కలిగి వుంటున్నారు. అంటే స్త్రీ పురుషులు వారి జీవిత కాలం లో ఒకరి కన్నా ఎక్కువ భాగస్వాముల తో సంబంధం కలిగి ఉంటున్నారు. దీనినే  ‘ serial monogamy ‘ లేక ‘ pair bonding ‘ అని కూడా అంటారు . ఇలా ఒక పురుషునితో కొంత కాలమే జీవించే  స్త్రీల సంఖ్యా , అలాగే ఒక స్త్రీ తో కొంత కాలమే జీవించే పురుషుల  సంఖ్యా ,  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ  అవుతుంది,  క్రమేణా !!!
వివాహ వ్యవస్థ లో ఈ మార్పులకు, పరిణామ రీత్యా ఉన్న కారణాలు వచ్చే టపాలో చూద్దాము !!!

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.10.

In Our Health on మార్చి 10, 2012 at 1:48 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 10.

 
ప్రేమ:
ఆకర్షణ లేక ప్రణయాకర్షణ , సృష్టి లో ఒక ముఖ్యమైన క్రియ నిర్వర్తిస్తుంది.  ఈ ప్రణ యాకర్షణ, క్రమంగా పరిణామం చెంది , ప్రత్యుత్పత్తికి అత్యంత ముఖ్యమైన రతిక్రియ కు మనల్ని సమాయత్తం చేస్తుంది. పోటీ పడుతున్న వారిలో నుంచి, మంచి లక్షణాలు కల, లేక ఎక్కువ ఆకర్షణీయం గా ఉన్న వారితో మన మనసు లగ్నం చేయటానికీ , అంటే కేంద్రీక రించడానికి , ఉపయోగ పడుతుంది.
ఈ ప్రక్రియలో మన శక్తులను అంటే ఎనర్జీ ఒకే భాగస్వామి మీద కేంద్రీకృతం చేసి ,   స్త్రీల గర్భాశయం లో వీర్య స్ఖలనం జరగటానికి   ప్రయోజన కారి గా ఉంటుంది. (  ప్రతుత్పత్తి కి నాంది అవుతుంది, వీర్య స్ఖలనం జరిగి వీర్యం,   అండాశయం నుంచి విడుదల ఐన  అండం తో సంగమం చెంది నప్పుడు )
కాలక్రమేణా ప్రపంచ మానవ నాగరికత లో జరిగిన పరిణామ రీత్యా , మానవులు ఎవరి ప్రేమ కోసం తపిస్తారో , ఎవరిని ప్రేమిస్తారో , ఈ విషయాలు , వారు పెరిగిన వాతావరణము, నాగరిగతా, దేశ కాల పరిస్థితులు , సంస్కృతీ విలువల మీద ఆధార పడి ఉంటుంది.
ఉదాహరణకు , స్త్రీలు, పురుషులు ఎక్కువగా , పరిచయం లేని, ఆకర్షణీయమైన వ్యక్తుల తో పొందు కోసం తహ తహ లాడతారు. పరిణామ రీత్యా , ఈ లక్షణం , స్వజాతి లో సంపర్కం తగ్గించ డానికి. జీవ పరిణామ రీత్యా ,  దగ్గరి బంధువులలో జరిగిన వివాహాలు, ప్రత్యుత్పత్తి కంటే, బంధుత్వం లేనివారితో వివాహాలు, ప్రత్యుత్పత్తి వల్ల మన జన్యువులు అంటే ‘ gentetic make up ‘ ఎక్కువ శక్తిదాయకంగా తయారవుతాయి. అలాగని దగ్గర బంధువులలో జరిగిన వివాహాలన్నీ మంచివి కాదని అర్ధం చేసుకో కూడదు. శాస్త్రీయం గా  చూస్తే, జన్యువులలో ప్రతికూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఎక్కువ , వివాహ  బంధుత్వం రక్త సంభంధం కూడా ఐనప్పుడు , మన ఆచార వ్యవహార రీత్యా చూస్తే ఒకే గోత్రం ఉన్న వారి లో  సాధారణంగా  వివాహ బంధం, పెద్దలు అంగీకరించక పోవడానికి కూడా ఇదే కారణం.
మనలో ప్రేమ జ్వాల రగిలించడానికి ముఖ్యమైన  తైలం – మన బాల్య అనుభవాలు. అంటే  మనం  ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య మనకు తెలియకుండా  అంటే సబ్ కాన్షస్ గా మన మనసులో ఒక ‘ ప్రేమ పటం ‘  చిత్రించు కుంటాము. ఈ అత్యంత వ్యక్తిగతమైన  అంటే ‘ very personal ‘ , ప్రత్యేకమైన  ప్రేమ పటంలో  మనకు కావలసిన భాగస్వామి లక్షణాలు  స్కెచ్ ‘ sketch ‘  వేసుకుంటాము.  సహజంగా ఈ ‘ rough sketch ‘ మన యుక్త వయసులో  సప్త వర్ణాలు కలిసిన ఒక అందమైన  ప్రేమ చిత్ర పటం గా మారుతుంది.
మనం ఎప్పుడు, ఎవరితో, ఏ సమయం లో ప్రేమలో పడతామో, ఏ ఆకర్షణ లక్షణాలు  మన భాగ స్వామి లో చూస్తామో, ఎప్పుడు సంగమించి, రతిక్రియ లో ఆనంద పడతామో, ఇదంతా మన వ్యక్తిగత లక్షణాల మీద, మన చుట్టూ ఉన్న సాంఘిక , కాల పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుంది.
కానీ ఒకసారి  మనం మనకు కావలసిన ప్రత్యెక భాగస్వామిని ఎంచుకున్న తరువాత,  మన జీవ రసాయనాలు , తదనుగుణంగా మనలో ఉత్పన్నం అయి , మనల్ని భౌతికంగా కూడా సమాయత్తం చేస్తాయి, ప్రేయసీ ప్రియ సంగమం లోని అత్భుత, ఆనంద అనుభూతులు చవి చూడటం కోసం!!!
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాము !!

గ్రోత్ హార్మోన్ లోపం తో పుట్టినా ‘ ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిన ‘ మెస్సీ !!!

In Our Health on మార్చి 8, 2012 at 9:49 సా.

గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నా ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిన మెస్సీ !!

 
మెస్సీ !!  ఫుట్ బాల్ ప్రపంచం లో తిరిగులేని వీరుడు !!
 
పూర్తి పేరు: లయోనేల్ ఆండ్రెస్ మెస్సీ 
జననం:  అర్జంటినా  ( పూర్వీకులు ఇటలీ నుంచి ఒక శతాబ్దం క్రితం వలస వచ్చారు )
జన్మ దినం : 24.06.84.
ఎత్తు: ఐదు అడుగుల ఆరున్నర అంగుళాలు 
తల్లి :  పార్ట్ టైం క్లీనర్ 
తండ్రి:  ఉక్కు ఫాక్టరీ కార్మికుడు.( మెస్సీ కి మొదటి ఫుట్ బాల్ కోచ్ కూడా ! )
పదకొండు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మెస్సీ కి  గ్రోత్ హార్మోన్ లోపం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ లోపం వల్ల, పెరుగుదల కుంటు పడుతుంది.  అప్పటికే మెస్సీ , తన ఊరిలో ఉన్న జూనియర్  ఫుట్ బాల్ క్లబ్ లో ఆడుతూ అత్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. 
వైద్య ఖర్చు నెలకు తొమ్మిది వందల డాలర్లు. అంటే రమారమి నలభై వేల రూపాయలు. ఖర్చు భరించటానికి అర్జెంటీనా లో ఎవరూ ముందుకు రాలేదు.
మెస్సీ బంధువులు స్పెయిన్  లో ఉంటారు. వారు స్పెయిన్ లో ప్రసిద్ధి పొందిన  బార్సిలోన ఫుట్ బాల్ క్లబ్  డైరెక్టర్ కు ఈ విషయం చెప్పారు. ఆయన జబ్బు నయం అయిన తరువాత తన క్లబ్ లో ఆడే షరతు మీద కాంట్రాక్టు ఒక మూతి తుడుచుకునే  కాగితం తువాలు మీద సంతకం చేసి ఇచ్చాడు మెస్సీ కి !! 
అప్పటి నుంచి మెస్సీ దశ తిరిగింది!!
ఇప్పటి వరకూ చేసిన గోల్స్ : 228.
అవార్డులు : ముప్పై ఐదు కు పైగా !!.
సంపాదన : ఇప్పటి వరకు ,  ముప్పై మిలియన్ల పౌండ్లు అంటే అంటే రెండు వందల నలభై కోట్ల రూపాయలు !!.
 
ఇటీవల ఒక జర్మనీ క్లబ్ తో జరిగిన ఒక మాచ్ లో బార్సిలోన తరఫున ఆడిన మెస్సీ చేసిన ఐదు గోల్స్ హై లైట్స్  క్రింద చూడండి !! ( యు ట్యూబ్  వీడియో !! ) 
 
 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 9 .

In Our Health on మార్చి 7, 2012 at 11:05 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 9.

అందమైన వారే ప్రేమించ బడతారా?

 
సాధారణం గా  అందమైన మానవులు స్త్రీలైనా , పురుషులైనా,  ఎక్కువ ప్రేమకు పాత్రులని అందరూ అనుకుంటుంటారు.
మన ఇతిహాసాలలో కానివ్వండి , చరిత్ర లో కానివ్వండి,  అనాది నుంచి ‘ అందం ‘ అనే రహదారి  ద్వారా వెళితేనే ‘ ప్రేమ సామ్రాజ్యాన్ని ‘ చేరుకోగలరని వివరింప బడింది.
 కృష్ణుడు, నీల మేఘ శ్యాముడు గా తన గోపికలనందరినీ  వశ   పరుచుకున్నాడనీ మనం అనేక సార్లు చదువుకున్నాము. అలాగే  మిగతా అందరికీ అందం గా అనిపించకపోయినా   మజ్నూ కు, లైలా ఎంతో అందమైనది గా అనిపించి ‘ నా కళ్ళు అరువు తీసుకుని    చూడండి లైలా అందం, అప్పుడు మాత్రమే ఆమె అందం కనిపిస్తుంది మీకు  !! ‘ అని అంటాడని మనకు తెలుసు.
అలాగే  డాంటే , బియాట్రిస్  అందం చూడాలని తపించిపోయే వాడని మనకు తెలుసు.
మరి నిజంగానే  అందమైన వారే ప్రేమ కు పాత్రులా ? ఈ కధా కమామీషు మనం కొంత తెలుసుకుందాము.
ప్రేమ, అందం  కలగలిసి కామ వాంఛ ల అలలు రేపుతాయి మనలో !! గాఢమైన ప్రేమ,   కామ పూరితమైన వాంఛ తో ముడి పడి ఉంటుంది.  మన మెదడు లో కూడా ఆశ్చర్యకరంగా ప్రేమ, అందం ఒకే  కేంద్రం లో ఉంటాయి.  ఒక అందమైన ఆకర్షణీయమైన  ముఖం, అలాంటి ముఖాన్ని చూస్తున్నామన్న అనుభూతి ,  ఆ అనుభూతి ద్వారా ఉత్పన్నమైయ్యే  కామోద్దీపన ,అంటే ‘ sexual arousal ‘  ఈ మూడు అనుభూతులకూ  మెదడు లో ‘ orbito frontal cortex ‘ అంటే ఆర్బిటో ఫ్రాన్ టాల్ కార్టెక్స్ ‘ అనే  కేంద్రం ఉంటుంది.
మనం ప్రేమిస్తున్న వారి ముఖం చూసినప్పుడు కలిగే అనుభూతులకు మెదడు లో ఇంకో రెండు భాగాలు కూడా ప్రేరేపితమౌతాయి.  వాటిని  ‘ insula ‘ and  anterior cingulate cartex’  అంటే ఇన్సులా మరియూ యాన్తీరియర్ సిన్గులేట్ కార్టెక్స్   అని అంటారు.
మనం పరిణామ రీత్యా చూస్తె ,  ఆందోళన పరిచే ఏ వ్యక్తినైనా, జంతువునైనా చూసినప్పుడు , మన మెదడు లో ఉన్న  ఫ్రాన్ టాల్ కార్టెక్స్ , ఇంకా  అమిగ్డలా  ( అంటే ‘ frontal cartex and amygdala ‘ ) అనే భాగాలు  ఎక్కువ క్రియాశీలమవుతాయి.
కానీ  పరిశోధనలలో  తెలిసిన విషయం. మనం మనకు ప్రియమైన వారిని చూసినప్పుడు  సహజంగా ప్రేరేపితమయ్యే పైన చెప్పిన మెదడు లోని భాగాలు  అసలు ప్రేరేపితం కావు.
దీనిని బట్టి తెలిసినదేంటంటే, మనకు ప్రియమైన వారిని చూసినప్పుడు, మనం ఏవిధమైన  ఆందోళన కూ లోను కాకుండా ప్రశాంతం గా  కామోద్రేకం ప్రేరేపించ బడే దిశలో ఉంటామని.
ఇంకో విధంగా చెప్పాలంటే, అందమైన ముఖం చూసి పొందే ప్రేమానుభూతి ,  కేవలం మన మెదడులో ఉండే .నాడీ వలయాలను ప్రతిబింబిస్తాయి. 
ఈ నాడీ కేంద్రాలనూ, నాడీ వలయాలనూ క్రియాశీలం చేయటంలో  మనకు అందం అంటే ఉన్న ఉద్దేశాలు, మన బాల్యం నుంచి మనకు అందం పైన ఉండే అవగాహన, మనం పెరుగుతున్నప్పుడు  అందం మీద ఏర్పడ్డ భావాలు, మన సాంస్కృతిక, దేశ, ప్రాంత పరిస్థితులు, వేష ధారణ , ఇవన్నీ ప్రధాన పాత్ర వహిస్తాయి.
 
వచ్చే టపాలో మరికొన్ని విషయాలు చదవండి ప్రేమ గురించి !!!
 
 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 8.

In Our Health on మార్చి 6, 2012 at 10:56 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – 8.

 

 
మానవులలో ప్రేమ మూలాలు: 
 
ప్రేమ, లేక అటాచ్మెంట్ మానవ పరిణామం లో ఏ దశ లో నైనా వృద్ధి  చెంది ఉండవచ్చు.
మానవ పరిణామంలో అందరికీ తెలిసిన విషయం మానవులు కోతి నుంచి పరిణామం చెందారని.
ఆఫ్రికా కు చెందిన కోతులలో ఎక్కువ జాతులలో మగ కోతి ఒకే ఆడ కోతి తో కాక చాలా ఆడ కోతులతో శారీరక సంబంధం కలిగి ఉంటాయి.అంటే వాటిలో ఒక ఆడ కోతి ఒక మగ కోతి తో జీవితాంతమూ ఉండటం జరగదు. మరి కోతులలోనుంచి పరిణామం చెందిన  ప్రపంచ మానవులలో ఎక్కువ మంది ఒకరి తోనే, ఒకరే   జీవితాంతము గడిపే దశ కు ఎలా పరిణామం చెందాడని ఆలోచిస్తే  మనకు కొన్ని  ఆశ్చర్య కర విషయాలు తెలుస్తాయి.
 
సుమారు నాలుగు మిలియన్ల సంవత్సరాల క్రితము , ఆఫ్రికా ఖండం నుంచి త్వరిత గతిన అంతరించి పోతున్న వృక్ష జాతుల నుంచి కోతులు పరిణామం చెంది క్రమేణా అనాది మానవులు గా మారి నేల మీద నివాసాలు ఏర్పరుచుకో సాగారు. క్రమంగా ఆ ఆది మానవులు భూగోళం మీద  ఉన్న వేరు వేరు ప్రదేశాలకు విస్తరించారు.
మనకు తెలుసు, కోతులు తమ పిల్లలను వాటి ఉదర భాగం లో నో  లేక వీపు మీదనో కరుచుకుని ఉండటం, అట్లాగే అవి నాలుగు కాళ్ళతో నడవటము, చెట్లు ఎక్కటము, పరుగెత్తడము.
కోతి నుంచి పరిణామం చెందిన మానవులు వెనుక కాళ్ళతో నుంచోవడం మొదలు బెట్టినప్పుడు  ముందు కాళ్ళు  చేతులు గా పరిణామం చెందాయి. దానితో రెండు కాళ్ళ మీద నిలబడి, నడవటమూ , పరుగేత్తడమూ చేయ సాగాడు.
ఆది మానవులలో స్త్రీలు  ప్రత్యుత్పత్తి చేస్తూ , తమ పిల్లలను చేతులతో   లో మోసే వారు. ఇలా చేస్తూ, వారు ఆహారాన్ని ఎలా సమకూర్చు కో గలరు?  వారు అంటే స్త్రీలు తమ పిల్లలను పాలిచ్చి, లాలన చేసి పెంచుకోవడం లోనే చాలా సమయం గడుపుతారు కదా !!. ఒక వేళ వారి ఒక చేతిలో పిల్ల ఉన్నా ఇంకో చేతిలో రాతి యుగపు పనిముట్లు ఉన్నా తమను తాము మిగతా కోతులనుంచీ , వేరే క్రూర మృగాల నుంచీ రక్షించుకోడానికి ప్రయాస పడేవాళ్ళు కదా !!  ఈ పరిస్థితులలో పురుషులు వారికి రక్షణ గా ఉండే వారు. కానీ పురుషులకు స్త్రీలకు రక్షణ ఒకటే బాధ్యత కాదు కదా, పిల్లలను పోషణ చేస్తున్న స్త్రీలకు, ఆ పురుషులు తమ పనిముట్లతో ఆహారం కూడా సంపాదించి, అంటే చెట్ల మీదనుంచి కానీ , వేటాడి కానీ సంపాదించ వలసినదే కదా !
ఈ రెండు బాధ్యతలు నిర్వర్తించే సరికి పురుషులకు, ఎక్కువ మంది స్త్రీలను చూసుకోవడము, వారికి రక్షణ గా నిలవడమూ, వారితో అటాచ్మెంట్ పెట్టుకోవడమూ జటిలం అయ్యింది.
అలా పురుషులలో నాడీ వలయం అంటే  మెదడు లో ‘ neural circuit ‘  ఒకే స్త్రీ తో అనుబంధానికీ, అటాచ్మెంట్ కూ  అలవాటు అయ్యింది  క్రమేణా !!  ఇది హెలెన్ ఫిషర్ అనే శాస్త్ర వేత్త  ప్రతిపాదన !! 
 
వచ్చే టపాలో ‘ ప్రేమ ‘ విషయాలు మరికొన్ని చదవండి !!

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.

In Our Health on మార్చి 5, 2012 at 9:30 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.7.

ప్రేమ :
ఇంత వరకూ టపాలలో ఆకర్షణ, ప్రత్యేకించి ప్రణ యాకర్షణ గురించి, వివరం గా తెలుసుకోవటం జరిగింది.
ఈ ప్రణయాకర్షణ, క్రమంగా ప్రేమ గా పరిణమించినప్పుడు వచ్చే మార్పులు ఇప్పుడు తెలుసుకుందాము.
ప్రేమ, లేక ‘ compassionate love ‘ , పక్షులలోనూ, మిగతా స్తన్య  జంతువులలోనూ   గమనించినప్పుడు , అవి  పరస్పరం,  ఆహారం పంచుకోవడము, గూడు కలిసి కట్టుకోవదమూ, తమ తమ పరిధులు నియంత్రించు కోవటము,  విడిపోయినప్పుడు ఆందోళన చెందటము,  తమ పిల్లలను కలిసి  పెంచడం లాంటి  క్రియల లో కనిపిస్తుంది.
మానవులలో ప్రేమ ,  ఒక విధమైన ప్రశాంతత గాను,  పరస్పర మనోభావ సంగమం గానూ ,  ఒక సాంఘిక అనుకూలత గానూ,  ఒక సురక్షణ వలయం గానూ కనిపిస్తూంది.
ప్రేమలో ఒక రకమైన అనుబంధత ఏర్పడుతుంది ప్రేయసీ ప్రియుల మధ్య. దీనినే  ‘ అటాచ్మెంట్ ‘ అని కూడా అనవచ్చు మనము.
ఈ రకమైన అనుబంధానికి  ఆమె లో ఆక్సీ టోసిన్, అతనిలో  వాసోప్రేస్సిన్ అనే  జీవ రసాయనాలు కారణం. ఈ ఆక్సీ టోసిన్ , వాసో ప్రేస్సిన్ లను  న్యూరో పెప్టైడ్స్ అని కూడా అంటారు.
 ఆకర్షణ, లేక ప్రణయాకర్షణ, ప్రేమ గా తప్పకుండా మారనవసరం లేదు. కొన్ని పరిస్థితులలో  కామోద్రేకం మొదట కలిగి, రతి క్రియ తరువాత, భావ ప్రాప్తి జరిగి ( అంటే ‘ orgasm ‘ ), అతడిలో  వాసో ప్రేస్సిన్ విడుదల అయి తద్వారా, ఆమె పైన అనుబంధం అభి వృద్ధి చేసుకో వచ్చు.  అంటే అతను మొదట సంబంధాన్ని ఆమె తో ఏవిధమైన ప్రణయాకర్షణ లేకుండా మొదలెట్టవచ్చును. శారీరిక సంభంధం ఏర్పడినాక, అతను గాఢమైన అనుబంధం అంటే ప్రేమానుబంధం ఏర్పరుచుకో వచ్చును. ఇలా జరగటానికి అతనిలో విడుదల ఆయే వాసోప్రేస్సిన్ కారణమని చెప్పవచ్చు.
శాస్త్రీయం గా చెప్ప్పలంటే, ప్రణ యాకర్షణ, ప్రేమ, మరియూ కామ వాంఛ లకు మూడు ప్రత్యేకమైన నాడీ వలయాలు మానవులలో ఉండి పని చేస్తాయి. కొన్ని పరిస్థితులలో ఈ మూడు నాడీ వలయాలు
( అంటే ‘  neural circuits ‘  ) ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా మనమీద ప్రభావం చూపించవచ్చు. అలాగే కొన్ని పరిస్థితులలో ఒక దానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉండవచ్చు.
కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం లో జరిపిన ఒక పరిశోధనలో నూట ఎనభై పక్షి జాతులలో  కేవలం  పది  శాతం పక్షులు  తాము మొదట కలిసి, సంగమించిన వాటితోనే జీవితం గడుపుతాయి, కానీ మిగతా తొంభై  శాతం పక్షులు , ఇతర పక్షులతో  కూడా సంగమిస్తాయని తెలిసింది.
ఈ విధంగా  ఎప్పుడూ కలిసి ఉంటున్న పక్షులతో కాక, ఇతర పక్షులతో సంబంధము పెట్టుకోవడం జీవ పరిణామ రీత్యా , వాటి ప్రత్యుత్పత్తి అవకాశాలను వీలైనంత ఎక్కువ చేసుకోవడానికి అని భావించడం జరుగుతుంది.
కాలక్రమేణా మానవులలో కూడా  ఈ లక్షణాలు పరిణామం చెందాయి. మానవులు ఒకరితో  ప్రేమానుభంధం తో జీవిస్తూ కూడా, ఇతరులతో ప్రణయాకర్షణ వలలో చిక్కుకో గలగటానికి ఇదే కారణం. అంటే మానవులు స్వాభావికంగా అనేక మంది తో సంబంధాలు పెట్టుకోగలిగి ఉంటారు. కేవలం సాంఘిక కట్టుబాట్ల వల్ల, ఒక్కో ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవహారాల వల్ల వారి ప్రవర్తన  సరిఐనది గానూ, లేక తప్పు గానూ వ్యాఖ్యానింప బడుతుంది.
ఈ స్పష్టమైన  మూడు రకాల నాడీ వలయాలూ , నవీన మానవ జీవితాన్ని అనేక విధాలు గా  క్లిష్టతరం చేశాయని చెప్ప వచ్చును.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, ప్రబలుతున్న విడాకుల సంఖ్య కూ ,  కామ విశృంఖలతకూ, ఏక పతీ, లేక ఏక పత్నీ వ్యవస్థ చెదరి పోతూ ఉండటానికీ, ‘ అనైతిక జీవనానికీ , గృహ హింస కూ,
ప్రియురాలినీ, ప్రియుడినీ, చాటు గా ఉండి అనుసరించటము, అంటే ‘ stalking ‘ , కామ అసూయ , అంటే ‘  sexual jealousy ‘ , డిప్రెషన్ ,  ఆత్మ హత్య, హత్యలు , వీటన్నిటికీ  మనలో ఉన్న  ఈ నాడీ వలయాలు, కొంత వరకు కారణమని జీవ పరిణామ శాస్త్ర వేత్తలు , సాంఘిక మనో విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే టపాలో ‘ ప్రేమ ‘ గురించి ఇంకొన్ని విషయాలు చదవండి!!.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

In Our Health on మార్చి 3, 2012 at 9:37 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

 
ఈ ప్రణయాకర్షణ హేల –  ప్రతి జీవితానికీ ఒక మధురానుభూతుల సుగంధ  సుమ  మాల !!
క్రింద వివరించిన అనుభూతులు ఇంకా ఏ శాస్త్రవేత్త కూ  అంతు పట్టని అనుభూతులు గానే ఉన్నాయి.
ఇవి ఇప్పటి వరకూ ఏ  జీవ రసాయనమో కారణం తెలియని  ప్రణయ రసానుభూతులు !!
 
ప్రేయసీ ప్రియులు పరస్పరం ఎమోషనల్ గా అంటే  మనోభావ పూర్వకం గా ఆధార పడటం మొదలు పెడతారు.
ఈ భావాలు,  ఆశ,  బిడియము, భావోద్వేగము, ఒకరి గురించి ఒకరు ఆలోచించ టము, ఒకరిని ఇంకొకరు విడిచి పెడతారని బెంగ పడటము, ఒకరి కొకరు దూరమైనప్పుడు ఆందోళన చెందటము,ఇలాంటివి. ఈ భావాలన్నీ వారిని ఇంకా అప్రమత్తులు గా చేసి ఒకరిని ఒకరు కనిపెడుతూ ఉండేట్టు చేస్తాయి.
వీరు భావ తమ ప్రియునితోనూ , లేక ప్రియురాలితోనూ భావ సంగమానికి తీవ్ర ఉత్కంథత  తో  ఎదురు చూస్తుంటారు.
తమ తమ దైనందిన కార్యక్రమాలలో, ఏ మాత్రము సంకోచము లేకుండా మార్పులు చేసి, తమ ప్రియురాలితో, తమ ప్రియునితో కలయిక కోసం ఎదురు చూస్తుంటారు.
అవసరమైన మార్పులు, తమ వేష ధారణ లోనూ , అలవాట్లలోనూ ,  హావ భావాల లోనూ చేస్తుంటారు.
ఒకరి గురించి ఒకరు బాధ్యతాయుతం గా  ఉండటము, ఒకరి కోసం ఇంకొకరు త్యాగం చేయటానికి కూడా సిద్ధ పడతారు, ఈ ప్రణయాకర్షణ  వల లో చిక్కుకుని !!
ఇక వారి ప్రణయానికి  అవరోధాలు ఎంత ఎక్కువ అవుతుంటే  అది అంత   ఎక్కువ తీవ్రం గా పరిణమిస్తుంది, బలపడుతుంటుంది !!
ఇంకో  విషయం:
ఈ ప్రణయాకర్షణ వల లో చిక్కుకున్న  ప్రియులు ఒకరితో ఒకరు  రతి క్రియ లో సంగమం అవ్వాలని ఎదురుచూస్తూ ఉంటారు, తీవ్రమైన కామ కోరికలతో !! ఈ ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే , తమ ప్రియులు తమకు పోటీ గా అనిపించిన ఎవరితో ఉన్నా  అత్యంత అసూయ చెందుతారు.
   జీవ పరిణామ పరం గా చూసినట్లయితే ఈ రకమైన మనోభావాలు తాము తమ ప్రియులతో రతిక్రియ లో పాల్గొని అతని లోని వీర్యం ఆమె లో చేరి  అండాశయ దిశలో ప్రయాణం చేయటానికి అంటే వారు ప్రత్యుత్పత్తి జరపటానికి ఎంతో ఉపయోగ పడతాయని తెలిసింది.
ఆమె, అతడు, రతిక్రియ కు ముందు మనో భావ సంగమం కోసం తాపత్రయ పడతారు. కానీ పాశ్చాత్య నాగరికతల లో ఎక్కువ మంది ప్రేయసి ప్రియులు, వారు రతీ సంగమమే వారికి మనో భావ సంగమం కన్నా ప్రధానమైనదని ఒక సర్వే లో తెలిపారు. 
ఈ ప్రణయానుభూతులూ, రతీ మన్మధులు వారిని గిలిగింతలు పెట్టిన మధురానుభూతులూ, ప్రేయసీ ప్రియుల  నియంత్రణ లో ఉండక,  వారు ఎంత ప్రయత్నించినా వారి ఆధీనం లో లేక వారిని ఉక్కిరి బిక్కిరి   చేస్తాయి.
ఈ ప్రణయానుభూతుల ఇంకో ప్రత్యెక లక్షణం ఏంటంటే, అవి తాత్కాలికాలు. 
అవరోధాలు ఏర్పడి ప్రేయసీ ప్రియులు, కలవటానికీ, సంభాషించు కోవటానికీ వీలు కానప్పుడు ఆ అనుభూతులు క్రమం గా బలహీనమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో పన్నెండు నుంచి పద్దెనిమిది  మాసాలలో ఈ అనుభూతులు మాయమయ్యే  ‘  అవకాశం ‘  ఉంటుంది.
( ప్రేయసీ ప్రియుల దృష్టి లో ఈ అనుభూతులు మాయమయ్యే ‘ ప్రమాదం ‘  ఉంటుంది. ) 
 
ఈ టపా పై మీ అభిప్రాయాలు తెలుపండి. 
వచ్చే టపాలో ప్రేమ గురించి వివరాలు చదవండి !!