Our Health

నీరు, మానవుల ప్రాధమిక హక్కు కాదంటున్న నెస్లే అధినేత !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 21, 2013 at 10:56 ఉద.

నీరు,  మానవుల ప్రాధమిక హక్కు కాదంటున్న నెస్లే అధినేత ! 

 
నెస్లే !  ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటి ! అతి ఎక్కువ లాభాల బాట లో ఉన్న కంపెనీలలో కూడా ఒకటి ! ఆ కంపెనీలో, ప్రపంచ వ్యాప్తం గా కనీసం లక్షన్నర మంది ఉద్యోగులు పని చేస్తున్నారు !  తల్లి ( పోత ) పాల పొడి డబ్బాలూ , చాక్లెట్లూ ( కిట్ క్యాట్  చాక్లెట్ , ఉదాహరణకు ) , పలహార సీరియల్స్ , అంటే బ్రేక్ ఫాస్ట్  సీరియల్స్ , కాఫీ ( ఉదా: నెస్కెఫె  ) , ఇట్లా చెప్పుకుంటూ పొతే, అనేక ఉత్పత్తులు ! అతి ముఖ్యంగా , ప్రపంచం లో  నీటిని సీసాలలో నింపి అమ్మే, అతి పెద్ద కంపెనీ ! నెస్లే కంపెనీ గురించి తెలియని వారికి , ఈ పరిచయం చాలేమో ! ఇటీవల  నెస్లే కంపెనీ అధినేత  ఒక  ఉపన్యాసం ఇచ్చాడు. అందులో , తన కంపెనీ ఎంత పెద్దదో, ఎంత గొప్పదో కూడా వివరించాడు. అంతే కాకుండా , మానవులందరూ తాగే నీరు ను ప్రపంచం లో ఉన్న అతి ముఖ్యమైన వ్యాపార ముడి సరుకు  అన్నాడు !  తాగు నీటిని ప్రైవేటీకరణ చేస్తే , నీటిని సరిగా అందరికీ అందేట్టు చేయవచ్చు ” అని అన్నాడు ! అంతే కాక ,  తాగు నీరు ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అంటున్నది ,కేవలం తీవ్రవాద భావాలున్న  ప్రభుత్వేతర సంస్థలే !  అని కూడా చెప్పాడు !
 
ఆయన గారి ప్రసంగం లింకు వీడియో  క్రింద నొక్కి వినండి / చూడండి  !
ఆయన గారి దృష్టి లో నీరు కేవలం  ఒక వ్యాపార వస్తువు !  అంతే కాక , ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన నెస్లే కంపెనీ అధిపతి గా తాను , తన ఉద్యోగుల శ్రేయస్సు కోరుతూ, ఈ మాట చెబుతున్నాననీ , అది తన బాధ్యత అని కూడా చెప్పాడు ! దీనిలో అంతర్యం ఏమిటంటే , ఇంకా , ఇంకా వీలైనన్ని లాభాలు, నీటిని అమ్మి కూడా, నెస్లే కంపెనీకి కలిగించి , తద్వారా  తన ఉద్యోగులకు , ఉద్యోగ భద్రత కలిగించడమే ! ఈ నీటిని ప్రైవేటీకరించడం అనే విషయం లో విపరీతం గా నష్టపోయేది , మారు మూల గ్రామాలలోనూ ,  నగరాలలో మురికి వాడలలోనూ నివశిస్తూ , కేవలం సరిఅయిన తాగు నీటి వసతి కూడా లేని లక్షలాది పేద ప్రజలే ! ఇటీవల దక్షిణ ఆఫ్రికా లో తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఉన్నా కూడా,  నీటిని ప్రైవేటీకరించడం వల్ల , తాగే నీటిని కొనుక్కోలేక , కలుషిత నీటిని తాగి, కనీసం రెండు వందల మంది పేద ప్రజలు కలరా తో మరణించారు ! ఐక్య రాజ్య సమితి కూడా , జీవించే హక్కు తో పాటుగా , నీరూ , ఆహారం , బట్టా , ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అని తీర్మానించింది కూడా  ! కానీ ఇట్లా ప్రపంచం లోని బడా కంపెనీ లు నీటిని ఒక వ్యాపార వస్తువు గా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి ! ఇప్పటికే భారత దేశం లో కూడా ,నీళ్ళ ట్యాంకు వాడి దగ్గర నుంచి , నీళ్ళ బాటిల్స్ సరఫరా చేసే వాడి వరకూ విచక్షణా రహితం గా దోచుకుంటున్నారు ప్రజలను ! ఈ మధ్య నే మహా రాష్ట్ర లో తీవ్రమైన నీటి కరువు వచ్చి , మొక్కల కు సరఫరా చేసే నీటి ట్యాంకు వెంబడి ,  తాము  ఆ నీటిని తాగటానికి పరుగులు తీసే ప్రజలను ,కూడా చూశాము ! 
ముందు ముందు ,   సీసాలలో నింపి  ఉన్న, మనం పీల్చే గాలిని కూడా  కొనడానికి సిద్ధ పడదామా ?!!!
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. సంపాదన పెరిగి ఒళ్ళు తెలియక….

వ్యాఖ్యానించండి