Our Health

Archive for జూన్, 2012|Monthly archive page

మానవులలో ఉత్తేజం ( మోటివేషన్ ) గురించి శాస్త్రవేత్తలు ఏమంటారు ?.3.

In మానసికం, Our minds on జూన్ 11, 2012 at 10:17 ఉద.

మానవులలో  ఉత్తేజం ( మోటివేషన్ ) గురించి శాస్త్రవేత్తలు ఏమంటారు ?.3.

 

మానవులు  అభివృద్ధి పధం లో ముందుకు పోవడానికి అతి కీలకమైన ‘ ఉత్తేజానికి కారణాలు ‘ అనేక మంది శాస్త్ర వేత్తలు, సైకాలజిస్ట్ లు అనేక దశాబ్దాలు గా పరిశోధనలూ, పరిశీలనలూ చేశారు. ఈ పరిశోధనా వివరాలను మనం రెండు రకాలు గా చెప్పుకోవచ్చు.ఒకటి:   మానవ ప్రవర్తన కు సంబంధించిన ఉత్తేజం ( behaviour  model ). రెండు:. మానవ జ్ఞానానికి సంబంధించిన ఉత్తేజం ( cognitive model ).
మానవ ప్రవర్తన కు సంబంధించిన ఉత్తేజం గురించి కొంత తెలుసుకుందాము.
ఈ థియరీ ప్రకారం, మానవులలో ఉత్తేజం వారి మూల అవసరాలు , అంటే బేసిక్ డ్రైవ్ ల   ను బట్టి వస్తుంది అని.  బేసిక్ డ్రైవ్ లు , అంటే  ఆకలి, కామ కోరికలు , లాంటి  ఎమోహన్స్. ఉదాహరణకు , మనకు ఆకలి అయినప్పుడు , ఆహారం కావాలి అనిపిస్తుంది కదా, అట్లా ఆహారం కోసం ప్రయత్నించాలనే ఉత్తేజం వస్తుందన్న మాట. అట్లాగే  మనకు కామ వాంఛ తీర్చుకోవాలనే బేసిక్ డ్రైవ్  ( అంటే మూల అవసరం ) కలిగినప్పుడు, మనం ఉత్తేజం అంటే మోటివేట్ అయి తదనుగుణం గా ప్రయత్నాలు ప్రారంభిస్తాము. అంటే మనకు ఒక ప్రేరణ లేదా స్తిమ్యులాస్  కలిగినప్పుడు, ఆ స్తిమ్యులాస్ కు అనుగుణం గా మనం  చేసే ప్రతి చర్య అంటే రెస్పాన్స్ – వీటి పైన మన ఉత్తేజం కూడా ఆధార పడి ఉంటుందని భావించ బడుతూ ఉంది.
ఇలాంటి బేసిక్ నీడ్స్ ను సంతృప్తి పరుచుకోవడానికి , మానవులు పొందే ఉత్తేజం , రెండు రకాలు గా , అంటే మనకు రివార్డ్ గానూ , లేదా పనిష్మెంట్ గానూ మార వచ్చు. అంటే మనకు ఆకలి అయినప్పుడు, మనం ఉత్తేజం పొంది, ఆహారం సంపాదించుకుని, తింటే , అది రివార్డ్ అనబడుతుంది. అంటే మనం పొందిన ఉత్తేజం , ఫలితాన్ని వెంటనే ( ఆహార రూపం లో ) ఇచ్చింది కనుక దానిని రివార్డ్ అంటారు. అదే ఆహారం దొరకని సమయం లో మనం ఉత్తేజం పొందుతున్నా , ఫలితం ( ఆహారం దొరకలేదు కాబట్టి ) శూన్యం కాబట్టి దానిని పనిష్మెంట్ అంటారు. పైన వివరించిన థియరీ లో  గమనించ వలసినదేమిటంటే ,  మనం పొందే ఉత్తేజానికి కారణాలు , బాహ్య పరమైనవి అంటే ఎక్స్టర్నల్ ( external stimuli ). అంటే మన మానసిక మార్పులు కాదు. కేవలం మన భౌతిక కారణాలను సంతృప్తి పరుచుకోవడానికి మాత్రమె మనం ఉత్తేజం చెందుతున్నట్టు ఈ థియరీ వివరిస్తుంది. 
కానీ గత పాతిక సంవత్సరాలలో , సైకాలజిస్ట్ లు ఈ ఉత్తేజానికి కొత్త నిర్వచనం ఇవ్వటానికి ప్రయత్నించారు. వారి వాదన ప్రకారం, మానవులలో ఉత్తేజానికి మూల కారణం , వారి ఆలోచనలు, ఆలోచనా సరళి. అంటే వీరి ప్రకారం ఉత్తేజం మన బేసిక్ డ్రైవ్ వల్ల వస్తున్నది కాదు అని.  ఈ రెండవ రకాన్ని కాగ్నిటివ్ మోడల్ అఫ్ మోటివేషన్ అంటారు.  ఇది మన నిత్య జీవితం లో అత్యంత ఉపయోగకారి అయిన విధానం. దీని వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాము ! 

ఉత్తేజం మనకు ఎట్లా ఉపయోగ పడుతుంది?. 2.

In మానసికం, Our minds on జూన్ 10, 2012 at 5:47 సా.

 ఉత్తేజం మనకు ఎట్లా ఉపయోగ పడుతుంది?. 2.

 

 
కదిలేదీ , కదిలించేదీ 
మారేదీ , మార్పించేదీ ,
పాడేదీ , పాడించేదీ ,
పెను నిద్దుర  వదిలించేదీ ,
మును ముందుకు సాగించేదీ ,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ,
కావాలోయ్ నవ కవనానికి.
శ్రీ శ్రీ  ( 03.08.1937. ) 
మహా కవి శ్రీ శ్రీ , అనేక దశాబ్దాల క్రితం వ్రాసిన కవిత్వం,  ఆఖరి లైను లో ‘  ఉత్తేజం కావాలోయ్ నవ జీవనానినికి ‘ అని మనం , ఉత్తేజం ప్రాముఖ్యత ను గుర్తు పెట్టుకోవచ్చు. 
మనందరికీ  ఏ పని చేస్తున్నా , కొద్దో , గొప్పో , ఉత్తేజం ఉంటేనే ఆ పని చేయ గలుగుతున్నాము.  కానీ ఉత్తేజం మనలో దిశా నిర్దేశనం చేస్తుంది. అంతే కాక , ఉత్తేజం మనం చేసే పని పట్ల మన అంకిత భావాన్ని  అంతే మన డెడికేషన్ తీవ్రతను కూడా తెలియ చేస్తుంది. 
మానవులు చేసే ప్రతి పని లోను , ఉత్తేజం ఉండడం సహజమే. అంటే మనం చేసే పని మంచిది అయినా , చెడు అయినా ఉత్తేజం మొదట పుట్టి  ఆ పని కార్య రూపం దాల్చుతుంది.
అంతే కాక, మానవుల ప్రవర్తన, సాధారణం గా , వారి క్రోధం, భయం, ప్రతీకార వాంఛ, ఇంకా  గిల్ట్  భావనలు ( guilt ) , ఇలాంటి నెగెటివ్ ఎమోషన్ ల వల్ల ఉత్తేజం పొందినదే ! 
అనేక పరిశోధనల వల్ల, మానవులు, వివిధ కార్యాలలో , తాము పొందే ఉత్తేజం తీవ్రతను పెంచుకో గలరని తెలిసింది. అంతే కాక, అట్లా పెంచుకున్న ఉత్తేజం తో ఎంతో లాభ పడగలరని కూడా పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి. 
క్రితం టపాలో చదివినట్టు, ఉత్తేజాన్ని , అనేక మంది శాస్త్ర వేత్తలు , అనేక రకాలు గా విశ్లేషించి మనకు అందించారు.  వాటిని తెలుసుకోవడం వల్ల  మనం , మన జీవితాలను , మన ప్రవర్తననూ , వివిధ కోణాలలో చూసుకొని, తద్వారా , అవసరమైన మార్పులు చేసుకొని , అధికోత్తేజం తో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. 
అందువల్ల మనం, ఈ ఉత్తేజం వివరాలు తెలుసుకుందాము.
మిగతా సంగతులు , వచ్చే టపాలో ! 
 
 
 

ఉత్తేజం ( మోటివేషన్ ) అంటే ఏమిటి ?. 1.

In మానసికం, Our minds on జూన్ 10, 2012 at 1:45 సా.

ఉత్తేజం ( మోటివేషన్ ) అంటే ఏమిటి ?. 1.

 
‘ ఉత్తేజం ‘ అంటే  మనల్ని కర్తవ్యోన్ముఖులు గా చేసే ఆలోచనలు.  మనం ఉదయం నుంచీ , నిద్ర పోయే వరకూ చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాము.  మన మెదడులో అనేక ఆలోచనలు ప్రవాహం లా వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు అయితే కార్య  రూపానికి పురి గోల్పుతాయో  దానిని ‘ ఉత్తేజం ‘ అంటారు. ఉత్తేజం మోటివేషన్ అనే ఆంగ్ల పదానికి , తెలుగు అనువాదం. ఆంగ్ల పదం , మోటివేషన్ ( motivation )  కూడా  ఒక లాటిన్ పదం ,మూవర్ ( movere ) నుంచి పుట్టిందే ! లాటిన్ భాషలో movere అంటే ‘ కదలడము ‘ లేదా ‘ కదిలించు ‘  అనే అర్ధం వస్తుంది.అంటే  మన ఆలోచనలు , మన మెదడు లో నే ఉండక , కార్య రూపం లో ‘ కదిలించే ‘ గుణాన్ని  మోటివేషన్ అంటారు. ఉదాహరణ :   తల్లి దండ్రులు  చాలా సమయాలలో  తమ సంతానాన్ని  కోప్పడడం అనుభవం లోనిదే !  కొన్ని సమయాలలో పిల్లలు సరిగా చదవక  పొతే , వారు విసుగు చెంది ‘   నీకు ఏ ఇబ్బందీ లేకుండా,  నీకు కావలసినవన్నీ చూసుకుంటున్నాము, స్కూల్ కు కూడా స్కూటర్ మీద దింపడం జరుగుతున్నది కదా రోజూ !  నీకు లోపించినదల్లా  మోటివేషన్ ! చక్కగా చదువుకొని  మంచి మార్కులు తెచ్చుకొని పై చదువులు చదవాలనే ‘తపన ‘ ఉండాలి నీకు, అది లేక పొతే పుస్తకాల ముందు ఎంత సేపు కూర్చున్నా ఉపయోగం ఉండదు ! అని మందలించడం అసాధారణం ఏమీ కాదు  కదా ! ఉత్తేజాన్ని ,  సాధారణం గా మన జీవితాలలో   పరీక్షలు, కష్టాలు ,   లేక చాలెంజేస్  ను మనం  ఎదుర్కునే  సామర్ధ్యం గా చెప్పుకోవచ్చు.  ఉత్తేజాన్ని స్పష్టం గా నిర్వచించడం కూడా అంత శులభం కాదు. కానీ , ఉత్తేజాన్ని ,  ఉత్సాహం , ఆత్మ విశ్వాసం ( కాన్ఫిడెన్స్ ) , ఇంకా  చేపట్టిన  పనిని నిర్విరామం గా కొనసాగించే గుణాల కలయిక గా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యం గా ఉత్తేజం మనకు , జీవితం లో ఒక దిశను నిర్దేశిస్తుంది. అలాగే , ఉత్తేజం ఉన్నంత సేపూ మనం చేపట్టిన కార్యాన్ని సఫలం చేయాలి అనే కృత నిశ్చయం తో ఉంటాము కూడా ! 
జీవితం లో మనం సాధించే అనేక విజయాల వెనుక  ఉన్న , లేక ఉండే శక్తి  మనం ఆ కార్యాల సాధన కై , పొందే ఉత్తెజమే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

ఉత్తేజం ( మోటివేషన్ ).

In మానసికం, Our minds on జూన్ 10, 2012 at 12:54 సా.

ఉత్తేజం ( మోటివేషన్ ).

 
మన జీవితం లో మనం, ప్రతి పని చేయడానికీ , ఏదో ఒక రకమైన ఉత్తేజం పొందాలి.  మనలో కొందరు , ఉన్న దాని తో సంతృప్తి చెందుతూ ఉంటే, ఇంకొందరు  నిత్యం, ఉత్తేజం పొందుతూ, నూతన కార్యక్రమాలలో పాల్గొంటూ , కొత్త గా యాక్టివిటీస్ ను పెంచుకుంటూ, జీవితం లో, ఎప్పుడూ ,  బిజీ గా ఉంటూ ఉంటారు.
చాలా మంది , అత్యంత శక్తి వంతులు గా, అంటే  ప్రతిభా సామర్ధ్యాలు  ఉండీ , స్తబ్దు గా ఉన్న చోటనే ఉండడం,  ఏమాత్రం పెరుగుదల, అభివృద్ధి  లేక ‘ ఎదుగూ , బొదుగూ ‘ లేని జీవితాలు గడుపుతూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం ఉన్నా, వారిలో ముఖ్యం గా లోపించేది ఉత్తేజం లేక మోటివేషన్. 
మరి మానవులను, మానవ జీవితాలనూ ఇంతగా ప్రభావితం చేసే ఈ ఉత్తేజం  గురించి వివరం గా తెలుసుకుందాము, అందరమూ ఉత్తేజం పొందుదాము, వచ్చే టపా నుంచి !  

ABCDE లతో ఆప్టిమిజం.26.

In మానసికం, Our minds on జూన్ 9, 2012 at 8:03 సా.

ABCDE లతో ఆప్టిమిజం.26.

వివాదం అంటే డిస్ ప్యు టేషన్ అనే పధ్ధతి తో  మనం మన నెగెటివ్ ఆలోచనలనూ , ఇర్రేషనల్ బిలీఫ్ లను  చాలెంజ్ చేసి పాజిటివ్ గా మార్చుకొని ఆప్టిమిస్టిక్ గా జీవితం లో పురోగమించ వచ్చో ! 
ఇప్పుడు  అయిదవ అక్షరమైన ఈ , అంటే E  గురించి తెలుసుకుందాము.  E is for Energizing ourselves. అంటే మిగతా నాలుగు స్టెప్స్  పాటించి విజయ వంతం గా  ,  మనం ఆప్టి మిస్టిక్ గా రూపొంది తద్వారా, నూతనోత్తేజం పొందడం, శక్తి వంతులు గా తయారవడం.  ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే , మన జీవితం లో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా !  మన నమ్మకాలు కూడా అనేక విధాలుగా , ఆ యా సంఘటనల బట్టి ఉంటాయి. అందు వల్ల,  ప్రతి సంఘటనలోనూ , మనం ఏర్పరుచుకునే   ఆధార రహిత బిలీఫ్ లను  ఈ  ABCD పద్ధతిని అనుసరించి , ఆశావాదులు , ఆప్టి మిస్టిక్ గా మారి మనం ఎక్కువ శక్తి వంతులు గా మార వచ్చు.  మానసిక శక్తి అంటే మనోధైర్యం కూడా మనలను ఉత్తేజ పరిచి అభివృద్ధి పధం లో కి తీసుకువెళుతుంది !  
మరి మీరు ప్రస్తుతం ఎంత ఆప్టిమిస్ట్ లో ఎట్లా తెలుసుకోవడం ? 
ఈ క్రింది స్టేట్మెంట్ లకు  సమాధానాలు  అయిదు రకాలు గా  మీరు చెప్ప వచ్చు. ఈ అయిదు రకాల సమాధానాలకూ,  అయిదు రకాలు గా మార్కులు ఇవ్వ బడ్డాయి. మొత్తం మార్కులు 24. మీరు ఇచ్చే సమాధానాలను బట్టి,  మీ మొత్తం స్కోరు  24 కు ఎంత దగ్గర గా ఉంటే , మీరు అంత ఆప్టి మిస్టు అయినట్టు !  మీరు ఇచ్చే సమాధానాల స్కోరు ఈ విధం గా ఉంటుంది.
0 – అస్సలు అంగీకరించను. ( strongly disagree )
1 – అంగీకరించను. ( disagree )
2 – ఏమీ చెప్పలేను. ( neutral )
3 – అంగీకరిస్తాను. ( agree  )
4 – చాలా గట్టిగా అంగీకరిస్తాను.( strongly agree ) 
ఇప్పుడు ఈ క్రింది స్టేట్మెంట్ లు  చూడండి : 
1. ప్రతి కూల పరిస్థితులలో నేను ఎప్పుడూ మంచి నే ఆశిస్తాను. ( మీ సమాధానం =     )
2.నాకు ఏదైనా చెడు జరగాలని ఉంటే, అది ఎట్లాగూ జరిగి తీరుతుంది. ( మీ సమాధానం =   )
3.నేను, నా భవిష్యత్తు ను ఎప్పుడూ ఆశావహం గానే ( అంటే ఆప్టి మిస్టిక్ గానే ) అనుకుంటాను.( మీ సమాధానం =    )
4. నా జీవితం లో జరిగే సంఘటనలు అన్నీ నాకు అనుకూలం గానే జరగాలని నేను ఎప్పుడూ అనుకోను. ( మీ సమాధానం  =   ) 
5.నేను అంత శులభం గా అప్సెట్ ( upset )  అవ్వను. ( మీ సమాధానం =   )
6. మొత్తం మీద నేను నా జీవితం లో నాకు , ఎక్కువ గా  మంచి సంఘటనలే జరగాలని అనుకుంటాను.  ( మీ సమాధానం =   ) 
( ఈ ఆరు స్టేట్ మెంట్ లకూ  మ్యాగ్జిమం మార్కులు ( 6 x 4 = 24 ) 24 మీకు వస్తే , మీరు ఆప్టి మిస్టులే !  బాగా తక్కువగా స్కోరు ఉంటే  ABCDE కిటుకులు మీకు బాగా ఉపయోగ పడతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 
 

ABCDE లతో ఆప్టిమిజం. 25.

In మానసికం, Our minds on జూన్ 9, 2012 at 4:39 సా.

ABCDE లతో ఆప్టిమిజం. 25.

మనం క్రితం టపాలో ‘ వివాదం ‘ అంటే డిస్ ప్యు టేషన్  ( Disputation ) మన ఆలోచనా ధోరణిని  ఎట్లా మార్చ గలదో  తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు ఒక ఉదాహరణ  తో  ఈ వివాదం  లోని నాలుగు మెట్లు  అంటే స్టెప్స్  పరిశీలిద్దాము :
సుమన్ ఒక ముఖ్యమైన ఇంటర్వ్యు  అటెండ్ అయ్యాడు.  అందులో తాను, తనకిచ్చిన సమయం కన్నా ఎక్కువ సేపు మాట్లాడాడు. అంతే కాక, రెండు మూడు సార్లు మాట్లాడే సమయం లో తడ బడ్డాడు.సమయం అయి పోవడం తో బయటికి వచ్చాడు.
 ( ఇంతవరకూ జరిగిన దానిని మనం ఒక సంఘటన లేదా ప్రతి కూల సంఘటన ( adverse event ) గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే , సుమన్ తాను అనుకున్నట్టు పర్ఫాం  చేయలేదు కదా, ఇంటర్వ్యు లో ! ) 
ఇప్పుడు సుమన్ నమ్మకాలు అంటే , బిలీఫ్ లు ( Belief ) ఎట్లా ఉన్నాయో చూద్దాము.
1. ‘ నేను ఎప్పుడూ ఇంతే ! ఇంటర్వ్యు దగ్గర మెస్ చేస్తాను, పాడు చేస్తాను ! 
2. ‘ నేను పబ్లిక్ స్పీకింగ్ లో సరిగా చేయను ‘ 
3.’  సెలెక్టర్ లు నా వాలకం చూసి నాకు ఆ ఉద్యోగం ఇవ్వరు’ .దీనితో ఈ ఉద్యోగం కూడా నా చేయి జారినట్టే ! ‘ 
ఇప్పుడు పై విధం గా ఆలోచించడం వల్ల సుమన్ ఏ పరిణామాలు ( consequences ) ఫేస్ చేస్తున్నాడో చూడండి.
1. సుమన్ లో ఒక రకమైన భయం, ఆందోళన,  యాన్ గ్జైటీ వచ్చేసింది.
2. దానితో బయటకు వెళ్ళడము, స్నేహితులను కలవడము తగ్గించేశాడు.
3. ఆందోళన, ఆత్రుత, యాంగ్జైటీ  ఎక్కువ గా ఉండడం వల్ల , అవే ఆలోచనలతో , ఇంకో రెండు సాధారణ అంటే మొదటి ఇంటర్వ్యు అంత కష్టం గా లేని ఇంటర్వ్యు లలో కూడా సరిగా చేయలేక ఆ ఉద్యోగాలు కూడా  ‘ పోగొట్ట్టు కున్నాడు ‘  
అదే సమయం లో సుమన్ తన స్నేహితుడి ప్రోద్బలం వల్ల  ఒక సైకాలజిస్ట్ ను సంప్రదించాడు. 
పట్టుదల తో సైకాలజిస్ట్ సలహా  పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఇక  తన విషయం లో ప్రయోగాత్మకం గా పరిశీలించాడు. 
ఇప్పుడు సుమన్ తన బిలీఫ్ లను వివాదించుకోవడం అంటే  ( disputation ) చేయడం ప్రారంభించాడు. 
1. మొట్ట మొదటి ఇంటర్వ్యు నాకు పూర్తిగా కొత్త మాట్లాడడం. 
2. అందులోనూ ఇంటర్వ్యు లో సెలెక్టర్ లు మొదటే చెప్పారు కదా ‘ నాకు విషయం తెలిసి ఉండాలని, కొంత తడ బడ్డా దానిని పట్టించుకోరని ‘ 
3. ఒక సెలెక్టర్ అయితే నాకు నాలెడ్జ్  బాగానే ఉందని కూడా ప్రశంశించాడు కూడా ! 
4. ‘ కొద్దిగా తడ బడ్డ మాట నిజమే కానీ నేను అంతా పాడు చేయలేదు కదా ! కొంచెం నెర్వస్ గా ఉన్నాను అప్పుడు ! బాగా ప్రిపేర్ అయి ఈ సారి చక్కగా పర్ఫాం  చేసి జాబ్ తెచ్చుకుంటాను ‘ 
a. ‘ నేను అంత నిరాశ గా ఫీల్ అవనవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో నెగెటివ్ అంటే ప్రతికూల నమ్మకాలు మన విపరీత ప్రవర్తన ఫలితాలే ( అంటే ఓవర్ రియాక్షన్ లు ).
b. ఒక వేళ నేను సెలెక్ట్ కాక పోయినా , నా మొదటి ప్రయత్నం అనుకుంటాను , ఈ సారి ఇంకా బాగా ప్రిపేర్ అయి ప్రయత్నిస్తాను ‘ 
c.ఈ జాబ్ ఇంటర్వ్యు లో నా పర్ఫామెన్స్ ఇక్కడే మర్చి పోతాను. దాని ప్రభావం ఇంకో ఇంటర్వ్యు లో పడనీయను.
d. జాబ్ ఇంటవ్యు లలో కొందరే సెలెక్ట్ అవడం సహజమే !  అందు వల్ల  నేను విపరీతం గా రియాక్ట్ ఆవ కూడదు. నేను ఇంకా  కృత నిశ్చయం తో ప్రయత్నిస్తాను ‘  
ఇలాంటి వివాదం తనలో తనే చేసుకుని, సుమన్ చాలా ఉత్తెజితుడైనాడు. సుమన్ ఇప్పుడు ఏ విధం గానూ నిరాశ చెందడం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు తనకు ఒకటి కాక పొతే ఇంకో జాబ్ తప్ప కుండా వస్తుందని, ఎందుకంటే తాను ఇప్పుడు ఆప్టిమిస్ట్ గా మారాడు కనక !  
మీరు కూడా మీ నిత్య జీవితం లో మీకు ఎదురయే ఒక అయిదు ప్రతి కూల సంఘటనలను ఈ విధం గా ఒక నోట్ బుక్ లో రాసుకుని అనలైజ్ చేసుకోండి. ఫలితం చూడండి. 
( సంఘటన ఏదైనా అవవచ్చు. కేవలం ఉదాహరణకు పైన  ఇంటర్వ్యు  ను ఒక సంఘటన గా వివరించడం జరిగింది )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 

ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ? .25.

In మానసికం, Our minds on జూన్ 9, 2012 at 9:31 ఉద.

ABCDE  లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ? .25.

ఇప్పుడు అక్షరం  D  అంటే  డిస్ ప్యు టేషన్  ( D is abbreviation for Disputation ) ఏ విధం గా మన ఆలోచనా ధోరణిని మార్చి , ఆప్టిమిజం వైపు మళ్లిస్తూ ఉంటుందో తెలుసుకుందాము. ఈ డిస్ ప్యు టేషన్ ను మనం తెలుగులో ‘ వివాదం’   అని అనవచ్చు.  మనలో సవ్యం గా జరిగే ఈ వివాదం,  మన ఆలోచనా ధోరణినీ , తద్వారా మన భవిష్య కార్యక్రమాలనూ ప్రభావితం చేయ గలదు. అందువల్ల ఈ ‘ వివాదం ‘  మనం ఆప్టిమిజం వైపు మళ్లడం లో అత్యంత కీలకమైనది.  మానవులు స్వతహాగా కీడు ఎంచి మేలు ఎంచే మనస్తత్వం కల వారు. అంటే మన మెదడు లో వివిధ నాడీ తంత్రులు , కీడును , లేదా నెగెటివ్ సంఘటనలనే మొదట శంకిస్తూ ఉంటుందని నిరూపణ అయింది. ఇక్కడే మనకు ‘ వివాదం ‘ చాలా అవసరం.  ఇలా మనం వివాదం లో దిగడం అతి ముఖ్యమైన అంశం. ప్రత్యేకించి, మనం నిరాధార నమ్మకాలు ఏర్పరుచు కుంటున్నప్పుడు, వాటి పరిణామాలు కూడా ఇర్రేషనల్ గా మారుతాయి. ఇట్లా పరిణామాలు ఇర్రేషనల్ గా అంటే హేతు వాద బద్ధం గా లేనప్పుడే , వివాదం మనలను సక్రమం గా ఆలోచింప చేస్తుంది.
మరి ‘ డిస్ ప్యు టేషన్ ‘ లేదా  ‘ వివాదం ‘ ఎవరి తో చేయాలి ? : 
మనం హేతు వాద బద్ధం కాని  ఇర్రేషనల్  నమ్మకాలు ఏర్పరుచుకున్నప్పుడు ,  వాటిని మన విజ్ఞత తో, మనమే  పరిశీలించాలి. అంటే మనమే మన ‘ చెడు ‘ ఆలోచనలతో, నెగటివ్ థింకింగ్ తో  ‘ వివాదానికి  దిగాలి ‘ . ఈ విషయం హాస్యాస్పదం గా అనిపించ వచ్చు కానీ నిజం గా ఈ విధానం మనకు  ఎంతో ఉపయోగ పడుతుంది.   ఈ వివాదం ఎట్లా చేసుకోవాలో  చూద్దాము . 
మనం ముందు గా మన నిరాధార నమ్మకాలను  నమ్మే ముందు 
1. ఆ నమ్మకానికి సరి అయిన ఆధారం ఉందా లేదా అని మనలనే ప్రశ్నించుకోవాలి.
2. తరువాత  ఆట్లాంటి నమ్మకం మనకు లేక పొతే , ఇతర మార్గాలు ఏమి ఉన్నాయో కూడా ప్రశ్నించుకోవాలి.
3. ఒక వేళ మన నిరాధార నమ్మకమే , లేదా అభిప్రాయమే నిజం గా జరిగితే, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా  ఆలోచించుకోవాలి. 
4. చివరగా  మన నమ్మకం అది  సరి అయిన ఆధారాలతో ఉన్నా, లేకున్నా , అది మన  భవిష్య జీవితం లో ఎట్లా ఉపయోగ పడుతుందో కూడా మనమే ఆలోచించుకోవాలి. 
వచ్చే టపాలో పైన చెప్పుకున్న నాలుగు అంశాలతో కూడిన ‘ వివాదాన్ని ‘  ఎట్లా ఉపయోగించుకొని , లాభ పడగలమో, ఉదాహరణ తో చూద్దాము ! 
 

ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.24.

In మానసికం, Our minds on జూన్ 8, 2012 at 3:21 సా.

ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.24.

మనం, క్రితం రెండు  టపాలలో వరుస గా  A అంటే అడ్వర్సిటీ ( Adversity ) అనీ, B అంటే బిలీఫ్ ( Belief ) అనీ, తెలుసుకున్నాము కదా ! 
ఇంకా అవి ఏమిటో , మన ఆలోచనలను ఎట్లా ప్రభావితం చేస్తాయో కూడా చూశాము కదా ! . ఇప్పుడు మనం మూడవ అక్షరం  సి  ‘ C ‘ ( emotional Consequences ) , అంటే కాన్సి క్వేన్సెస్, అంటే మనం చెందే అనుభూతుల పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలుసుకుందాము. ముందు చెప్పుకున్నట్టు, ప్రతి సంఘటన తరువాతా, మన నమ్మకాలూ , వాటితో మన  అనుభూతుల పరిణామాలు మనం నెమరు వేసుకుంటూ ఉంటాము. అంటే మన మనసులో మెదలుతూ ఉండి, మనం తరువాత చేయబోయే పనులలో, ప్రధాన పాత్ర వహిస్తాయి. మనం చూశాము కదా రేషనల్ ఇంకా ఇర్రేషనల్ బిలీఫ్ లు, అంటే హేతు బద్ధం అయినవీ, హేతుబద్ధం కాని నమ్మకాలు మనకు ఎట్లా ఏర్పడుతాయో ! ఇక్కడ గమనించ వలసినది , మన నమ్మకాలు, ఆధార రహితం గానూ, హేతుబద్ధం కానివి గానూ ఉంటే , తదనుగుణం గా వాటి  పరిణామాలు కూడా ఆధార రహితం గా హేతుబద్ధం కానివి గా ఉంటాయి. అదే విధం గా మన నమ్మకాలు , ఆధార సహితం గానూ , హేతు బద్ధం గానూ ఉంటే, పరిణామాలు కూడా అట్లాగే ఉంటాయి. 
ఒక ఉదాహరణ:  వినయ్ కాలేజీలో చాలా మిత భాషి.  మధ్య తరగతి కుటుంబం లో పెరుగుతూండడం తో  ఆశలు, ఆశయాలూ, ఆకాశాన్ని అంటుకునేట్టు, ఊహించు కుంటున్నా, ఆ  ఆలోచనలతోనే కాలం గడుపుతాడు.  కానీ చదువులో చురుకు.
ఈ అన్ని లక్షణాలూ చాలా నచ్చాయి  వినయ్ తో చదువుతున్న  అందమైన అమ్మాయి  హేమ కు.  హేమ ఆ విషయాన్ని ఎప్పుడూ వినయ్ కు తన చూపుల తోనే  తెలియ చేసేది.  వినయ్ వంక స్నేహ పూర్వకం గా , ఆరాధనా భావం తో చూసేది.
ఆమె కళ్ళు కూడా విశాలం గా అందం గా ఉండడం చేత ,  ఆ కళ్ళు తెలిపే భావాలు మిగతా క్లాస్ మేట్స్ కు చాలా వరకూ అర్ధమవుతున్నా , వినయ్  మాత్రం సందిగ్ధం తో పడ్డాడు. ‘ హేమ కు నేనంటే నిజంగా ఇష్టం ఉందా ? లేక ఇది ఆకర్షణా? ప్రేమా ? అని ఆలోచించ సాగాడు.  పరీక్షల ముందు హేమ చాలా సీరియస్ గా చదువుతూ ఉంది. వినయ్ వంక అసలు చూడట్లేదు. పరీక్షల వత్తిడి తో ఉన్నా , వినయ్ , హేమ ప్రవర్తన లో మార్పు సహించ లేక పోయాడు.  ‘ ఏమిటి హేమ ఇట్లా ప్రవర్తిస్తూంది ? వేరే ఎవరైనా పరిచయం అయి ఉంటారు. అందులో నేను ధనవంతుడిని కాను కదా ! నాకు హేమ దక్కదేమో ! ‘ ఇట్లాంటి నెగెటివ్ ఆలోచనలూ , ఇర్రేషనల్ బిలీఫ్ లతో ,  సరిగా చదవలేక పోయాడు.మిత భాషి అవడం వల్ల, తన సందేహాన్ని హేమను అడిగి తీర్చుకో లేక పోయాడు. అట్లాగే పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు.  హేమ కనిపించినా తరచూ మొహం చాటు చేసుకునే వాడు. అసలే మిత భాషి , దానికి తోడు ఇప్పుడు విచార వదనం కూడా !  ‘ హేమ లేని జీవితం ఊహించుకుంటూ , పరీక్షా ఫలితాలు కూడా నెగెటివ్ గా ఊహించుకుంటూ ,  జీవితం మీద విరక్తి కూడా పెంచుకుంటున్నాడు. ఏకాంతం గా క్యాంపస్ లో ఒక చోట దిగాలు పడి కూర్చున్నాడు, మొహం చాతీ మీద వంచుకుని !  ఒక్క సారిగా ప్రక్క నుంచి వచ్చిన పిలుపు తో ఉలిక్కి పడ్డాడు ‘ వినయ్ కాంగ్రట్యు లేషన్స్,  నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యావు !  నా నంబర్ క్రింద వరసలో చూశాను ! ఏమీ అనుకోకు ,   ఎక్జాంస్ టైం  లో నీతో మాట్లాడ లేక పోయాను. నాన్న గారు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది ఆ టైం లో. బాగా టెన్షన్ ఫీల్ అయ్యాను ! లకీలీ  ఎవ్రీ థింగ్ ఈజ్ ఫైన్ నౌ !  షల్ వి సెలెబ్రేట్ నౌ !  అంది హేమ, చాలా ఆనందం తో !  విషాదపు అంచులకు తనకు తానుగా తోసుకుంటున్న వినయ్ పరిస్థితి , ఒక్క ‘ కుదుపు ‘ తో అమృత భాండం లో పడేసినట్టు అయింది అప్పుడు.  ఒక్క సారిగా లేచి, తప్పు చేసినవాడి లాగా , సిగ్గు తో , హేమ చేతిని తీసుకుని క్యాంటీన్ వైపు నడిచాడు వినయ్ ! 
ఇప్పుడు వినయ్, హేమ లకు  ABCDE లతో పని లేదు, ఒక్క  ‘ L ‘  తో తప్ప ! ( కానీ  ABC లు, వినయ్ ను ఎట్లా మార్చాయో గమనించారా ?! ) 
వచ్చే టపాలో ఆప్టిమిజానికి ఇంకో ముఖ్యమైన అక్షరం, అదే నాల్గవ అక్షరం  ‘ D ‘ ( D is abreviation for Disputation ) గురించి తెలుసుకుందాము ! 

ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు?. 23.

In మానసికం, Our minds on జూన్ 8, 2012 at 9:12 ఉద.

ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు?. 23.

క్రితం టపాలో చూశాము కదా  A  అంటే  Adversity , అంటే ప్రతికూలత మన జీవితాలలో ఎన్ని విధాలుగా  మనకు ఎదురవుతూ ఉంటుందో ! 
ఇప్పుడు  ABCDE లలో రెండవ అక్షరం B,  అంటే బిలీఫ్  ( Belief ) గురించి తెలుసుకుందాము. 
Belief  ను మనం మన ‘ నమ్మకం ‘ లేక ‘ విశ్వాసం ‘ గా చెప్పుకోవచ్చు. ఏ విషయం గురించి అయినా  మనకు ఉన్న నమ్మకం, విశ్వాసం లేదా ఒక నిర్దిష్టమయిన అభిప్రాయం, మన జీవితాలలో జరిగే సంఘటనలను బలం గా ప్రభావితం చేస్తుంది.
ఆ నమ్మకం గానీ , నిర్దిష్టమయిన అభిప్రాయం గానీ ఏర్పడడానికి , మన గత అనుభవాలు, మన ఆచార వ్యవహారాలూ, లేక మన చుట్టూ ఉన్న వారి మనస్తత్వాలు, లేక మన మత సాంప్రదాయాలు కూడా  కారణం అవవచ్చు. ఈ కారణాలు అన్నీ కూడా, వ్యక్తిగత, లేదా , దేశ కాల పరిస్థితులతో కూడా కొంత వరకు మారుతుంటాయి. వాటితో పాటు మన అభిప్రాయాలు, నమ్మకాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కానీ ఈ మార్పుల వేగం  చాలా వరకు మన హేతువాద ఆలోచనా ధోరణి
( rational thinking or thinking with reason )  మీద ఆధార పడుతుంది. 
ఉదాహరణలు చూద్దాము :  మనలో చాలా మంది , ఏ పని అయినా మొదలు పెట్టే ముందు , పిల్లి ఎదురయితే కానీ , లేదా ఎవరయినా తుమ్మితే కానీ , అప శకునం గా భావిస్తారు, ఇప్పటికీ ! ఈ సంఘటనలు, వాటికి మనం ప్రతిపాదించే  అప శకునం పూర్తిగా ఆధార రహితాలు. అంటే మనం ఏ విధంగానూ , పిల్లి ఎదురవడాన్ని గానీ , లేదా ఎవరయినా తుమ్మడాన్ని గానీ, అప శకునాలకు కారణాలుగా నిరూపించలేము. కానీ మనలో అలాంటి నమ్మకం , లేదా విశ్వాసం లేదా గట్టి అభిప్రాయం, మన చిన్న తనం నుంచీ ఏర్పడితే,అది మన నమ్మకాలు లేదా,  Belief లలో ఒకటవుతుంది. అంతే కాక , అట్లాంటి నమ్మకం వల్ల, చేసే పనిని వాయిదా వేయడమో, ఆలస్యం గా మొదలు పెట్టడమో, లేక ఆ రోజంతా  సరిగా సాగదనే నెగెటివ్ దృక్పధం తో విచారం గా గడపడం కూడా జరుగుతూ ఉంటుంది.( మనం ఎప్పుడైనా తుమ్మినప్పుడు , పక్కనే ఉన్న మన పెద్దలు  ‘ శతాయుస్షు ‘ అని దీవించడం మన అనుభవం లోనిదే కదా !   ‘ అభివృద్ధి ‘ చెందిన దేశం గా భావించ బడుతున్న  ఇంగ్లండు లో కూడా ఎవరైనా తుమ్మితే , పక్కన ఉన్న వారు ‘ bless you ‘ అనడమూ, ఆ తరువాత  తుమ్మిన వారు ‘ thank you’ అనడమూ పరిపాటే ! కొన్ని పరిస్థితులలో ఈ ‘ సంప్రదాయం ‘  చాలా ఇబ్బంది గా ఉంటుంది. హే ఫీవర్ అని  ఒక ఎలర్జీ జబ్బు ఉన్న వారు ,  గాలిలో ఎక్కువ అయే  గడ్డి  పూవుల పుప్పొడి ( pollen ) కానీ, వేరే పూవుల పుప్పొడి  వల్ల కానీ  ఎలర్జీ వల్ల , అనేక సార్లు ,( తక్కువ సమయం లో ) తుమ్ముతూ ఉంటారు.  ఇట్లా జరిగినప్పుడు, ప్రక్కన ఉన్న వారు కొన్ని సార్లు ‘ bless you ‘ అనేసి  తరువాత ( తుమ్ములు తరచూ వస్తూ ఉంటే ) నిశ్శబ్దం గా ఉంటారు ! ) ఇట్లాంటి నమ్మకాలను  మూఢ నమ్మకం లేదా ఇర్రేషనల్ బిలీఫ్ ( irrational belief ) అంటారు. 
అట్లాగే నెగటివ్ థింకింగ్ కూడా పెసిమిజానికే దారి తీయవచ్చు. ఉదాహరణ : పరీక్షల ముందు విద్యార్ధులు, తాము మంచి మార్కులతో పరీక్షలో విజయవంతమవాలని  ఆశిస్తారు. వారు ఆ విధం గా ఆశించడం లో ఏ తప్పూ లేదు. కానీ ఫలితాలు చూసుకొని, మార్కులు తాము అనుకున్న విధం గా రాక పోవడమో, లేదా పరీక్ష లో ఫెయిల్ అవడమో జరిగితే , వారి నెగెటివ్ థింకింగ్, అంటే నిరాశా వాద మనస్తత్వం వారిని కబళించి వేస్తుంది.  అప్పుడు వారు ‘ పరీక్ష లో విఫలం అయాను, నేను నా స్నేహితులకు, తలిదండ్రులకు నా మొహం ఎట్లా చూపించ గలను ? అని నిరాశ చెంది, పెసిమిస్టిక్ గా ఆలోచించుతూ ,  వారికి ఇక భవిష్యత్తే లేదనుకునే హేతువాద బద్ధం కాని ఆలోచనలతో ( అంటే ఇర్రేషనల్ బిలీఫ్  లతో ) వారిని వారు నిందించుకుని, ఆత్మ హత్యా ప్రయత్నాలకు కూడా వెనుకాడరు.ఈ విధం గా మనకు జీవితం లో అనుభవమైన  అనుకోని లేదా ప్రతికూల సంఘటన  తరువాత మనం మనదైన శైలి లో ఒక నమ్మకాన్ని అంటే బిలీఫ్ ను ఏర్పరుచుకుంటాము. అప్పుడు మనం ఆ సంఘటన వివరాలు ఆలోచిస్తూ , అది ఎట్లా జరిగింది ?, అందులో మన పాత్ర ఎంత ఉంది ?  అని కూడా అంతర్మధనం మొదలు పెడతాము.  ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే , ప్రతి సంఘటనా, మన కు ఒక నమ్మకాన్ని  ఏర్పరుచుతుంది. ఇట్లా ఏర్పడిన ప్రతి అభిప్రాయం లేదా నమ్మకమూ,  కొన్ని అనుభూతులు ( emotional )గా పరిణామం చెందుతాయి ( అంటే emotional consequences ). అంటే మొదట A అంటే అడ్వర్సి  టీ ( Adversity )  తో బిలీఫ్ అంటే B ( Belief ) ఏర్పడి,  తరువాత ఎమోషనల్ కాన్సీ క్వేన్స్C’ ( C is abreviation for Consequences ) కు దారి తీస్తుందన్న మాట.   ఈ  మూడవ అక్షరం  ‘  C ‘ అంటే  ఎమోషనల్ కాన్సేక్వేన్స్ గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము ! 

ABCDE ల తో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.22.

In మానసికం, Our minds on జూన్ 7, 2012 at 12:48 సా.

ABCDE  ల తో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.22.

( ‘ మనం , అన్నీ కలిగి ఉన్నప్పుడు నిద్రాణ స్థితిలో ఉండే మన శక్తి సామర్ధ్యాలను, నైపుణ్యాన్నీ  వెలికి తీయగల ప్రభావం ,  మన జీవితాలలో మనం ఎదుర్కునే ప్రతికూలతకు  ఉంది ‘ – హోరేస్. )
 ఆప్టిమిజం అలవరుచు కోవడానికి ఆల్బర్ట్  ఎల్లిస్ సూచించిన   కిటుకులు ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యం గా మనం ఈ కిటుకులను ABCDE అని గుర్తు పెట్టుకోవచ్చు.
అందులో  ‘ A ‘  అంటే ఏమిటి ? : మన జీవితాలలో  ప్రతి రోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి.  అందులో  కొన్ని కానీ, ఎక్కువ గా కానీ సంఘటనలు, రోజూ కానీ , అప్పుడప్పుడూ కానీ మనం, అనుకున్న విధం గా జరగవు. అంటే మన జీవితాలలో మనకు సంబంధించిన సంఘటనలు, మనకు ప్రతికూలం గా జరుగుతాయి. ఆ పరిస్థితినే   అడ్వర్సి టీ  ( Adversity ) అంటారు (  A is abreviation for Adversity ). ఈ  పరిస్థితులు , మన ఆహారం, ఆరోగ్య విషయాలలో కానీ,  చదువు , ఉద్యోగం , ప్రయాణాలలో కానీ,  లేక మన కుటుంబ, ప్రేమ, లేక ఇతర మానవ సంబంధాలలో కానీ అవవచ్చు కదా ! ఉదాహరణలు చూద్దాము :  ఉదయమే  బ్రేక్ ఫాస్ట్  అనుకున్నట్టు లేకపోవడం , లేదా  బస్సు కానీ , కారు , స్కూటర్ కానీ, ప్రయాణించే రైలు కానీ  చెడి పోవడం వల్ల , స్కూల్, కాలేజీ, ఆఫీసు లేదా  చేరుకోవలసిన ఏ గమ్యం అయినా సరిగా చేరుకోలేక పోవడం : ఇట్లాంటివి ఒక రకానికి చెందుతాయి.. ఇంట్లో  ఉన్న వారితో చీకాకు పడటం ,  వాదులాడుకోవడం , లేదా  తిట్టుకొని , ఆగ్రహించుకోవడం , లేదా ఆందోళన చెందడం.  కాలేజీ లో కానీ ఆఫీసులో కానీ ఇతరులతో ఘర్షణ పడడం,  మాటా మాటా పెరిగి ఉద్రిక్త  వాతావారణం ఏర్పడడం, ఉద్యోగం ఏకారణం చేతనైనా ఊడి పోవడం ,  ప్రియమైన వారితో ఉన్న   సంబంధం బలహీన పడడం లేదా విఫలం అవడం, అది విడి పోవడానికీ, విడాకులకూ దారి తీయడం  : ఇలాంటివి  ఇంకో రకమైనవి. తీవ్ర అనారోగ్యం , లేదా మరణం – ఇలాంటివి ఇంకో విధమైన  ప్రతి కూల పరిస్థితులు కూడా సహజం గా  మానవ జీవితాలలో సంభవిస్తుంటాయి. వీటిని మనం ప్రతికూల పరిస్థితులు అని ఎందుకు అనుకుంటామంటే, అట్లాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ ,  అవి ఎంత అల్పమైనవి అయినా, తీవ్రమైనవి అయినా,  మన జీవితాలలో మనకు  జరుగ కూడదు అని అనుకుంటాము కనుక ! ,ఆప్టిమిజం  నేర్చుకోవడం లేదా అలవరుచు కోవడం లో  మరి  ఈ  ‘ A ‘  అంటే అడ్వర్సి టీ  ( Adversity ) పాత్ర ఏమిటి ? :: ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం వాటిని  మనదైన శైలి లో , ఆలోచనా ధోరణి తో  విశ్లేషణ చేస్తూ ఉంటాము !   దానిని   మన బిలీఫ్ సిస్టం ( Belief ) అంటారు.  Belief , మనం ఆశావాద మనస్తత్వం లేక ఆప్టిమిజం తో ఉండడానికి  ఉపయోగ పడే అత్యంత కీలకమైన కిటుకు. దీని గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము !