Our Health

Archive for మార్చి 2nd, 2012|Daily archive page

ఆకర్షణ , ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

In Our Health on మార్చి 2, 2012 at 10:50 సా.

ఆకర్షణ , ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

 
ఆకర్షణ లక్షణాలు : 
పరస్పర తదేక దృష్టి :
అంటే ప్రియుడు, ప్రియురాలి అన్ని హావ భావాలను, కదలికలను, భాషణను అంటే మాట్లాడటము, ఇవన్నీ ప్రత్యెక శ్రద్ధ తో గమనిస్తుంటాడు.
సాధారణం గా, అంతగా, పట్టించుకోని ఆమె అలవాట్లు కూడా అతనికి ఎంతో ప్రత్యేకంగా ఉండి , బాగా గుర్తువుంటాయి. ఉదాహరణకు, ఆమె తన తల ముంగురులు కళ్ళకు ముందు పడకుండా పక్కకు సవరించుకుంటే కూడా, అతను అతి శ్రద్ధ తో గమినించి గుర్తు పెట్టుకుంటాడు.
అలాగే, ఆమె అతడి లో ఉన్న సాధారణ కదలికలనూ, ముఖ కవళికలను శ్రద్ధతో  చూస్తూ, వాటినే మననం చేసుకుంటుంది.
ముఖ్యంగా ఆమె అన్న మాటలు అతనూ, అతను అన్న మాటలు ఆమె పొల్లు పోకుండా గుర్తు పెట్టుకుని ( అవి సాధారణ విషయాలైనా ) వాటినే పదే పదే మననం చేసుకుంటూ, ఆ మధుర క్షణాలను   మళ్ళీ మళ్ళీ   గుర్తు కు తెచ్చుకుంటారు.
ఈ  పరస్పర తదేక దృష్టి కి కారణం డోపమిన్ అనే  జీవ రసాయనము,  పదే పదే మననం చేసుకోటానికి నార్ ఎపినెఫ్రిన్  అనే జీవ రసాయనము కారణం. ఇలాంటి స్థితులలో ఆ జీవ రసాయనాలు ఎక్కువ గా ఉంటాయి ప్రేయసీ ప్రియులలో.
శక్తి వంతం గా అయిన అనుభూతి :
ఈ డోపమిన్, నార్ ఎపినెఫ్రిన్ లు ఇంకా ప్రేయసీ ప్రియులలో కనిపించే అనేక అనుభూతులు, ఆస్వాదనలకు కారణాలు.
హృదయం  తేలిక అయినట్టు అనిపించడం, వేగంగా కొట్టుకోవడం, శేదం పట్టడం, ఊపిరి వేగంగా తీసుకోవడం,  పెదవులు వణకటం, మేను పులకరించటం,  మాట తడబడటం, తత్తర పాటు పడటం , కడుపులో ఏదో తెలియని అనుభూతి  , ప్రియుని చెంత , ప్రియురాలి చెంత, ఏదో తెలియని ఆందోళనా, భయం, ఇవన్నీ కూడా ఈ డోపమిన్, నార్ ఎపినెఫ్రిన్ ల వల్లనే !
ఇంకా ఆకలి తగ్గి పోవటం,  నిద్ర కు దూరం అవటం, ఎక్కువ శక్తి వంతం గా అనుభూతి పొందటం, మనసు తేలిపోయినట్లు అనిపించటం కూడా ఈ రసాయనాల వలనే !
ఇంకొన్ని  ఈ ప్రణ యాకర్షణ అనుభూతులు వచ్చే టపాలో చూడండి. 
( ఈ టపా మీద మీ అభిప్రాయాలు తెలపండి  ) 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 4 .

In Our Health on మార్చి 2, 2012 at 4:20 ఉద.

ఆకర్షణ,ప్రేమ,కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 4.

 
ఆకర్షణ లక్షణాలు : 
 
అంతు లేని ప్రణయ ఆలోచనలు: 
ప్రణయాకర్షణ  దిన దినాభి వృద్ధి చెందుతున్న కొద్దీ , అతడిలోనూ , ఆమె లోనూ, ప్రణయాలోచనలు కూడా ఎక్కువ అవుతుంటాయి.
ఈ ప్రణయాలోచనలకు ఒక  కొన్ని ప్రత్యెక లక్షణాలు ఉంటాయి.
ఈ ఆలోచనలు అంతులేకుండా వస్తుంటాయి. అంటే రమారమి నిరంతరమూ, మెలకువ తో ఉన్నప్పటి నుంచీ మళ్ళీ నిద్రకు పోయే వరకూ.
ఈ ఆలోచనలకు ప్రత్యెక ఆహ్వానం అవసరం ఉండదు. అతడి మనసు, ఆమె మనసు  తలుపులు తట్టి, వారు ‘ ఆ తలుపు ‘ తీయక పోయినా, ప్రవేశించి ,  వారి మనో ప్రాంగణం లో తిష్ట వేస్తాయి.
ఈ ఆలోచనలు ఆమె, అతడు పిలవని అతిథులు గా వచ్చి,  మనసు లో తీవ్ర  అలజడి రేపుతాయి.
ఈ ప్రణయాలోచనల తీవ్రత ఎంత గా ఉంటుందంటే, అవి అబ్సెస్సివ్  గా మారుతాయి. అంటే  వద్దనుకున్నా వస్తుంటాయి. 
ఇటలీ లోని పీసా విశ్వ విద్యాలయానికి చెందిన నాడీ  శాస్త్రజ్ఞులు ఈ  అంతులేని ప్రణ యాలోచనలు  వస్తున్న ప్రేమికుల పై పరిశోధనలు చేసి వారి లో ఈ లక్షణాలు ,   వారిలో  సీరోటోనిన్  అనే జీవ రసాయనాన్ని తగ్గిస్తాయని ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్నారు. 
ప్రణ యాకర్షణ లో  ‘ పడ్డ ‘ ప్రేమికుల  రక్తం లో ఉండే ప్లేట్లెట్ లో  ఒక ప్రోటీన్  తక్కువ గా ఉందని తెలిసింది. ఈ ప్రోటీన్ పేరు  ‘ సీరోటోనిన్ ట్రాన్స్ పోర్టర్ ప్రోటీన్ ‘ .  సాధారణంగా ఈ ప్రోటీను, సీరోటోనిన్ ను ఒక నాడీ కణం నుంచి ఇంకో కణానికి చేరవేస్తుంది. ఈ ప్రోటీన్ తక్కువ అవటం వల్ల, సీరోటోనిన్ కూడా తక్కువ గా ఉంటుంది, ఆ ప్రేమికులలో.
క్లుప్తం గా చెప్పాలంటే  ప్రణయాకర్షణ నుంచి ప్రేమలో పడుతున్న కొద్దీ ఈ సీరోటోనిన్ తక్కువ అవుతూ వుంటుంది, ప్రేమికులలో. ఇక్కడ గుర్తు ఉంచుకో వలసిన విషయం ; ప్రేమికులిద్దరూ పరస్పరం ఈ ప్రణ యాకర్షణ అనుభూతులు పొందుతున్నప్పుడే. అంటే ఆకర్షించ బడుతున్నవారు కూడా ఆ అనిర్వచనీయమైన ప్రణ యాకర్షణ అనుభూతి పొందుతున్నప్పుడే ఇద్దరిలో నూ సీరోటోనిన్ తక్కువ గా ఉంటుంది. అలా కాక పొతే ఒకరిలోనే తగ్గుతుంది సీరోటోనిన్.
సీరోటోనిన్ యొక్క ప్రాముఖ్యత   గురించి ఇదే బ్లాగు లో , మునుపటి టపాలలో ఉన్న ‘  డిప్రెషన్ ఆత్మకథ’  వ్యాసం లో మీరు  వివరంగా చదివి వుంటారు. 
ఒక ఉదాహరణ: 
‘ మనసు కవి ‘ గా ప్రసిద్ధి చెందిన కీర్తి శేషుడు ఆచార్య  ఆత్రేయ గారి ఈ పాట రచన చూడండి,  ప్రణయాకర్షణ తీవ్రత  ఏక్కువైన   ప్రేమికుడు ఆవేశం తో   పాడే పాట: 
 
 ఏమనుకున్నావు ? నన్నేమనుకున్నావు ? పిచ్చి వాడిననుకున్నావా ? ప్రేమ బిచ్చ గాడిననుకున్నావా ?
వెళ్ళినట్టే  వెళ్లావు !!, కళ్ళ లోనే ఉన్నావు !! , మరచిపోను వీలు లేక మనసు లోనే  మెదిలావు !
నిన్ను నేను రమ్మన్నానా ? మనసు నాకు ఇమ్మన్నానా ? వచ్చి, వలపు రగిలించావు !!  చిచ్చు నాకు  మిగిలించావు !! ఏమనుకున్నావు ? 
ప్రేమంటేనే బాధన్నారు , ఆ బాధుంటేనే బ్రతుకన్నారు , అది  ప్రేమే కాదంటాను , ఆ బ్రతుకే వద్దంటాను , ఏమనుకున్నావు ? నన్నేమనుకున్నావూ ?
పిచ్చి వాడి ననుకున్నావా ? ప్రేమ బిచ్చ  గాడి ననుకున్నావా? !! 
 
( చక్కటి తెలుగులో చక్కగా వర్ణించిన ఈ పాట ఘంటసాల గారు నాగేశ్వర రావు గారి కోసం ‘  బంగారు బాబు’  చిత్రానికి పాడిన పాట – ఇంటర్నెట్ లో విని పూర్తిగా ఆస్వాదించండి !!!
ఇంకా నచ్చితే , యు ట్యూబ్ లో  ఈ పాటకు , నాగేశ్వర రావు గారి అత్భుత నటన కూడా చూడండి ).
 
 
వచ్చే టపాలో ఈ ప్రణయాకర్షణ  లక్షణాలు మరికొన్ని చూడండి 
 
( మీ అభిప్రాయం మరువకండి ! )