Our Health

Archive for ఆగస్ట్, 2012|Monthly archive page

ప్ర.జ.లు.14.ప్రెగ్నెన్సీ లో ప్రయాణం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 12, 2012 at 10:15 ఉద.

ప్ర.జ.లు.14.ప్రెగ్నెన్సీ లో ప్రయాణం.

ప్రశ్న:  ప్రెగ్నెన్సీ సమయం లో  ప్రయాణం చేయ వచ్చా?  అందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? : 
జవాబు:  ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.  గర్భవతులు ప్రయాణం చేయకూడదు అనే నియమం ఏదీ లేదు.  కానీ అందరు గర్భ వతులు  ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచు కోవాలి.
తాము వెళ్ళే చోట  మంచి వైద్య వసతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అందుకు తగ్గ  ఏర్పాట్లు చేసుకోవాలి. తమ వైద్య వివరాలు తెలిపే ఒక కార్డును కానీ, ఒక ఫైలు ను కానీ ప్రయాణ సమయం లో వారి దగ్గర ఉంచుకోవాలి తప్పని సరిగా. పాశ్చాత్య దేశాలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా , మంచి వైద్య వసతులు ఉంటాయి కనుక , అక్కడ నివశించే వారు విచార పడ నవసరం ఉండదు. కాక పొతే , మెడికల్ ఇన్స్యురెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే  వైద్య చికిత్స కు అయ్యే ఖర్చులు, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి కనుక. తగిన వైద్య వసతులు, మీ వైద్య వివరాలు తెలుసుకున్న డాక్టరు , భారత దేశం లో  ఎక్కడకు వెళితే , అక్కడ ఉండరు కదా ! అందువల్ల ఈ విషయం లో భారత దేశం లో ఉండే స్త్రీలు , ప్రత్యెక శ్రద్ధ వహించాలి.ఇక వివరాలు చూద్దాము.
ప్రశ్న : ఎప్పుడు ప్రయాణం చేయ వచ్చు? : 
జవాబు : కనీసం మూడు నెలల గర్భం దాటిన తరువాత , దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ఉత్తమం. ఎందుకంటే , నెల తప్పిన మొదటి మూడు మాసాలలో , వికారం, కడుపు లో తిప్పడం, తీవ్రమైన అలసట , వాంతులు , ఇలాంటి లక్షణాలు తరచూ  వచ్చేవే కదా ! సహజం గా మొదటి మొదటి మూడు మాసాలలో గర్భం పోవటానికి మిగతా నెలలలో కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, గర్భవతులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినా , ఉన్న చోటే ఉన్నా ! అందువల్ల కొందరు స్పెషలిస్టులు , కొన్ని ప్రత్యెక కాంప్లికేషన్స్ ఉంటే తప్పితే , ప్రయాణం చేయ కూడదనే నిబంధన ఏమీ లేదు అని అభిప్రాయ పడతారు. 
విమాన ప్రయాణం :  సాధారణం గా ప్రతి ఎయిర్ లైన్స్ వాళ్ళూ , 28 వారాల గర్భం దాటిన తరువాత , ప్రయాణం చేయ దలుచుకుంటే , స్పెషలిస్టు అబ్స్తేట్రి షియన్ నుంచి ఒక ధ్రువ పత్రాన్ని అడుగుతారు,  34 వారాల గర్భవతులను సాధారణం గా ఎయిర్ లైన్స్ లో ప్రయాణాలకు అనుమతించరు. ఎందువంటే  ఈ 34 వారాలు  దాటిన తరువాత , కవలలు గర్భం లో ఉన్నప్పుడు, 37 వారాలు  దాటిన తరువాత ఒక శిశువు గర్భం లో ఉంటేనూ  ప్రసవ వేదన  మొదలవడానికి అవకాశాలు హెచ్చు. విమానం లో ఎక్కువ సమయం ప్రయాణం చేసే గర్భవతులలో , వారి కాళ్ళ లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. దీనిని డీ వీ టీ ( డీప్ వీన్ త్రాంబోసిస్  అంటారు ) .
గర్భవతులు, ప్రయాణానికి ముందు అవసరమయే వాక్సినేషన్ అంటే టీకాలు వేయించు కోవచ్చా?:
జవాబు:  చాలా పాశ్చాత్య దేశాలలో , ప్రజలు ఇతర దేశాలు ప్రయాణం  చేయ దలుచుకుంటే , ఆ యా దేశాలలో ఉండే అంటు వ్యాధుల నివారణ లో భాగం గా వాక్సినేషన్ అంటే టీకాలు  వేస్తారు. ఈ టీకాలు   గర్భం లో ఉన్న శిశువు కు హాని కలిగించే ప్రమాదం ఉంది. అందు వల్ల , టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అయిన దేశాలు మీరు వెళ్ళడం మానుకోవడం ఉత్తమం. గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం.  మలేరియా నివారణకు వేసుకునే మందులు కూడా గర్భం లో ఉన్న శిశువుకు హాని కలిగించ వచ్చ్చు. అందువల్ల  మలేరియా మందులు తీసుకునే వారు కూడా  స్పెషలిస్టు ను సంప్రదించాలి. 
ప్రశ్న : గర్భవతులు కారు ప్రయాణం చేయ వచ్చా ? :
 జవాబు:  పాశ్చాత్య దేశాలలో పరవాలేదు. భారత దేశం లో కూడదు. ఎందుకంటే భారత దేశం లో కారు ప్రయాణం చాలా ప్రయాస తో కూడినది , గర్భవతులు కాని వారికే ! ఇక గర్భం లో ఉన్న శిశువు కు ఆ ప్రయాసలు అప్పుడే ఎందుకు ? ఒక వేళ కారు ప్రయాణం తప్పని సరి అయితే , తక్కువ దూరాలు మాత్రమె ప్రయాణం చేయడం , తరచూ అంటే ప్రతి రెండు గంటలకూ, ప్రయాణం ఆపి , విరామం తీసుకోవడం, తగిన  శుభ్రమైన నీరు , ఆహారం కారులో ఉంచుకోవడం, లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఆహారం, ద్రవాలు :  
గర్భవతులు వారి ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళినా , వారు తీసుకునే ద్రవాహారం , ఇంకా ఘనాహారం అంటే నీరు , పాలు , మజ్జిగ , పళ్ళ రసాలు, టీ , కాఫీ , లాంటి ద్రవాలు ,  ఇంకా తినే వంటలు – ఈ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు ,గర్భవతులు గా ఉన్నప్పుడు ఏ ఇంఫెక్షనూ రాకుండా జాగ్రత్త వహించాలి. ఇన్ఫెక్షన్లు  వారిని బలహీన పరచడమే కాకుండా, శిశువు పెరుగుదలను కూడా నిదానం చేస్తాయి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు. 13. ప్రెగ్నెన్సీ లో , ప్రణయం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 11, 2012 at 3:24 సా.

ప్ర.జ.లు. 13. ప్రెగ్నెన్సీ  లో , ప్రణయం. 

ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయం లో,  భార్యా భర్త లు సంగమించ వచ్చా? : 
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. తల్లి దండ్రులవబోతున్నారని తెలిసినప్పటి నుంచీ , ప్రతి జంటకూ , సహజం గా ఉండే సందేహమే ! 
ఒక వాక్యం లో చెప్పాలంటే,  భార్యా భర్తలు, ప్రెగ్నెన్సీ సమయం లో  నిరభ్యంతరం గా సంగమించ వచ్చు. ఈ విషయం మీద చేసిన పరిశోధనలలో ,  ఆరోగ్య వంతులైన దంపతులు , గర్భ ధారణా సమయం లో సంగమించడం వల్ల, తల్లికి కానీ , గర్భాశయం లో పెరుగుతున్న శిశువు కు కానీ ఏ విధమైన హానీ జరగదు అని స్పష్టమైనది. ఇక వివరాలలోకి వెళితే  ఈ విషయం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది.
1. మీకు సెక్స్ మీద గతం లో ఉన్న అభిప్రాయాలు.
2. మీ భాగ స్వామికి గతం లో సెక్స్ మీద ఉన్న అభిప్రాయాలు.
3. మీ భౌతిక ఆరోగ్యం.
4. మీ మానసిక అంటే ఎమోషన్స్ లేదా భావోద్వేగాలు.
ప్రశ్న : మూడవ వంతు రూలు అంటే ఏమిటి ? : జవాబు: గర్భవతులైన స్త్రీలందరిలో , మూడవ వంతు మందికి ప్రెగ్నెన్సీ సమయం లో కామ వాంఛ అధికం గా ఉంటుంది. ఇంకో మూడవవంతు స్త్రీలలో కామ వాంఛ తక్కువ అవుతుంది. ఆఖరి మూడవ వంతు వారిలో మునుపటి మాదిరిగా ఉంటుంది అంటే ఎక్కువ అవడం కానీ , తక్కువ అవడం కానీ జరగదు. మరి మీరు  ఏ మూడవ వంతుకు చెందుతారో ! 
ప్రెగ్నెన్సీ సమయం లో  సంగమం చాలా కారణాల వల్ల , ఎక్కువ ఆనంద దాయకం గా కూడా ఉంటుంది.  సామాన్యం గా ప్రెగ్నెన్సీ సమయం లో అంతకు ముందు కంటే తక్కువ సార్లు సంభోగం లో స్త్రీ పురుషులు పాల్గొనడం జరుగుతుంది. దీని వల్ల కామ వాంఛ అధికం అవుతుంది.  స్త్రీ జననేంద్రియాలు, అనేక హార్మోనుల చర్యల వల్ల , ఎక్కువ స్రావాలు జరుగుతాయి, వజైనా ప్రాంతం లో. దీనివల్ల పురుషాంగం శులభం గా ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది.  అంతే కాక హార్మోనులలో వస్తున్న హెచ్చు తగ్గుల వల్ల కొందరు స్త్రీలలో సామాన్యం గా వచ్చే ఆర్గాజం ల కంటే ఎక్కువ సార్లు కూడా  ఆర్గాజం వస్తూ ఉంటుంది. ఇంకా , గర్భ నిరోధానికి ఏ పద్ధతులూ ఎట్లాగూ అమలు పరచ నవసరం లేదు కనుక , స్త్రీ పురుషులు  ఏ సంకోచాలూ లేకుండా రతి క్రియ లో పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల కూడా అధికానందం పొందుతారు. 
కొన్ని కారణాల వల్ల , ఆనంద దాయకం గా లేకనూ పోవచ్చు.  సామాన్య మైన కారణం , భార్యా భర్తలు ఇరువురూ , శిశువుకు  ఎక్కడ హాని కలుగుతుందో అన్న భయం , ఆందోళన వల్ల కూడా మనస్పూర్తి గా  సెక్స్ లో పాల్గొనలేక పోవచ్చు. ఇంకా గర్భవతి అయిన తొలి మాసాలలో , వికారం, అలసట , ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ ఏమిటి అనే భావన కూడా కలిగి  క్రితం మాదిరి గా కామోత్తేజం పొందలేక పోవచ్చు.  
 
ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ , ఏ ఏ సందర్భాలలో కూడదు? : 
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో , గర్భవతులు , ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ లో పాల్గొన కూడదు.
1. అంతకు ముందు కనుక  నెలలు నిండని శిశువును ప్రసవిస్తే.
2. కారణాలు తెలియని విధం గా గర్భ ద్వారం నుంచి అంటే వజైనల్ లేదా సర్వికల్ బ్లీడింగ్ ,  ప్రెగ్నెన్సీ సమయం లో ఎప్పుడైనా కలిగితే, అంటే , మొదటి నెల నుంచి , తొమ్మిదో నెల వరకు ,  ఏ నెలలో నైనా   రక్త స్రావం జరిగితే .
3.  గర్భాశయ పొర అంటే మెంబ్రేన్  నెలలు నిండక ముందే చీలి పోవడం . ( ఈ పొర లేదా మెంబ్రేన్ గర్భాశయాన్ని నెలలు నిండే వరకూ శిశువును భద్రం గా గర్భాశయం లో కాపాడుతుంది. నెలలు నిండగానే ఆ పొర తెగి పోతుంది, శిశు జననం జరగడానికి , కానీ కొన్ని ప్రత్యెక పరిస్థితులలో, ప్రమాద వశాత్తు , ఆ పొర లేదా మెంబ్రేన్ నెలలు నిండక ముందే తెగి పోతుంది. అప్పుడు సెక్స్ లో  పాల్గొన కుండా వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించాలి ) 
4. ఇంకా కొన్ని ప్రత్యెక సందర్భాలలో , కొందరికి గర్భాశయం క్రింద అంటే సర్విక్స్ ప్రాంతం లో శిశువు కు పోషకాలు అందించే ప్లాసేంటా ఏర్పడుతుంది.ఈ పరిస్థితిని ప్లాసేంటా ప్రీవియా అంటారు. ఈ ప్లాసేంటా చాలా రక్త నాళాల తో నిర్మించిన వల లా ఉంటుంది. సామాన్యం గా ఈ ప్లాసేంటా , గర్భాశ యానికి పై భాగం లో ఏర్పడుతుంది. పైన ఉన్న చిత్రం చూడండి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు.12. ప్రెగ్నెన్సీ లో పత్యం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 9, 2012 at 7:29 సా.

ప్ర.జ.లు.12. ప్రెగ్నెన్సీ లో  పత్యం.

బొప్పాయి పండు తినకూడదు; బొప్పాయి పండు , గర్భ ధారణా సమయలో  ఏ మాత్రం తినకూడదు.
ప్రశ్న : క్రితం టపాలో గర్భ ధారణా సమయం లో తినవలసిన సమ తుల్యమైన ఆహారం గురించి తెలుసుకున్నాము కదా ! మరి తిన కూడని ఆహార పదార్ధాలు ఏమిటి ? : 
జవాబు:  ప్రెగ్నెన్సీ సమయం లో తినకూడని పదార్ధాలు చాలా రకాలు గా ఉండ వచ్చు. ఒకటి. వారికి అంతకు ముందు ఏ ఆహార పదార్దాలైతే పడలేదో వాటిని గుర్తుంచుకొని , ఎప్పుడూ తిన కూడదు. ప్రత్యేకించి గర్భ ధారణా సమయం లో. రెండు. కొత్త ఆహార పదార్ధాలు వీలైనంత వరకూ ఇంటి లో వండినవే తినడం. ఈ విధం గా చేయడం వల్ల, మీకు  ఇష్టమైన వంటకాలు మీకు నచ్చినట్టు వండుకుని తినే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యం గా వండడం లో శ్రద్ధ వహిస్తారు కాబట్టి ,ఉడికీ ఉడకని వంటకాలు తినడం అనే సమస్య ఉత్పన్నం అవదు. 
మరి ఏ ఆహార పదార్ధాలు తిన కూడదు? : 
1.సరిగా ఉడకని కోడి   గుడ్లు : కోడి గుడ్లు  తినే అలవాటు ఉన్న వారు, వాటిని బాగా గట్టి పడే వరకూ ఉడికించి తినాలి. సరిగా ఉడకని కోడి గుడ్డు లో సాల్మొనెల్లా అనే బ్యాక్తీరియం ఉంటుంది. అది మనుషుల ఆహారం లో ప్రవేశించితే, తీవ్ర మైన అస్వస్థత కు కారణం అవుతుంది.
2.సరిగా ఉడికించని చేపలు , మాంసమూ కూడా తినకూడదు. అంతే కాక , రొయ్యలు , ఆలి చిప్పలు తినే వారు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ విషయం లో ! 
3. పాశ్చరైజ్ చేయని పాలు , జున్ను, పెరుగు కూడా తినకూడదు. పాశ్చ రైజేషన్ అంటే ప్రతి ఆహారాన్నీ ఒక నిర్ణీత మైన ఉష్ణోగ్రత వరకూ వేడి చేసి, ఆ పైన త్వరగా చల్లార్చడం. ఇట్లా చేయడం వల్ల ఆ ఆహార పదార్ధం లో ఉన్న బ్యాక్టీరియాలు చాలా వరకూ నశించుతాయి.ఒక వేళ ఈ విషయం పట్టించుకోకుండా కనుక ఆ ఆహార పదార్ధాలను తింటే, ఆ యా బ్యాక్టీరియాల వల్ల  మనుషులలో  వాంతులు , విరేచనాలు కలిగి తీవ్ర అస్వస్థత కలగ వచ్చు. 
4. సరిగా ఉడకని బంగాళా దుంపల కూరలు కూడా తిన కూడదు. బంగాళా దుంప ల లో సోలానిన్ అనే విష పదార్ధం ఉంటుంది. బాగా ఉడికిస్తే కానీ వేయిస్తే కానీ ఈ విష పదార్ధం విరిగి పోతుంది. అందు వల్ల మనుషులకు ఏ హానీ కలిగించదు. అంతే కాక , లిస్టీరియా అనే బ్యాక్టీరియాలు   కూడా ఉంటాయి ఉదికించని బంగాళా దుంప లలో, అవి గ్యాస్ట్రో ఎంటి రైటిస్ కలిగించ వచ్చు గర్భిణి స్త్రీలలో. 
5.బొప్పాయి పండు తినకూడదు; బొప్పాయి పండు , గర్భ ధారణా సమయలో  ఏ మాత్రం తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండు , గర్భ నిరోదానికీ , అబార్షన్ కూ కారణమవుతుంది. పూర్వం వెస్టిండీస్ లో బానిస స్త్రీలు తాము గర్భవతులు కాకుండా ఉండడానికి బొప్పాయి పళ్ళు తినే వారు ( ఎందుకంటే , వారికి కలిగే ఇల్లీగల్ సంతానం కూడా బానిసలు గా బ్రతకడం వారికి ఇష్టం లేక ! ) 
5.మద్యం ఏ రూపం లోనైనా తాగ కూడదు ప్రెగ్నెన్సీ సమయం లో ! అంటే బీరు, వైన్ , విస్కీ , సైడర్ , ఇట్లా ఏ రూపం లో ఉన్నా అందులో ఆల్కహాలు ఉంటుంది కాబట్టి. ఆల్కహాలు నిర్మాణం అవుతున్న శిశువు లో అనేక అవయవ లోపాలు కలిగిస్తుందని , అనేక పరిశీలనల వల్ల ఖచ్చితం గా, అంటే ఏ విధమైన అనుమానాలూ , సందేహాలూ లేకుండా విశదమైంది.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు.11. ప్రెగ్నెన్సీ లో ఆహార నియమాలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 8, 2012 at 7:31 సా.

ప్ర.జ.లు.11. ప్రెగ్నెన్సీ లో ఆహార నియమాలు. 

ప్రశ్న : గర్భధారణ సమయం లో  ఏ ఆహారం తీసుకోవాలి ? పత్యం ఏమైనా ఉందా? : 
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న , ముఖ్యమైన ప్రశ్న కూడా ! 
ప్రెగ్నెన్సీ లేదా గర్భ ధారణా సమయం లో  సమ తుల్యమైన ఆహారం తీసుకోవడం  రెండు విధాలు గా ముఖ్యం, అంటే తల్లి ఆరోగ్యానికీ, గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం కూడా ! 
మరి సమ తుల్యమైన ఆహారం అంటే ఏమిటి ?:  అంటే కేవలం త్రాసు తో తూచి సమం గా అంటే రోజూ ఇన్ని గ్రాముల ఆహారం అని కాదు కదా!  సమ తుల్యమైన ఆహారం అంటే  కార్బోహైడ్రేటు లు , కొవ్వు, మాంస కృత్తులు, విటమిన్లు , ఇంకా ఖనిజాలూ , తల్లికీ ,  శిశువు పెరుగుదలకూ  సరిపోయినంత పరిమాణం  లో రోజూ తీసుకోవడం. అంటే అన్ని పోషక పదార్ధాలూ  రోజూ ఆహారం లో సమ పాళ్ళలో ఉండేట్టు చూసుకొని తినడం.  ఒక ఉదాహరణ:  తోలి మాసాలలో, తల్లికి ఇష్టమైన ఆహారం అని  మెక్ డొనాల్డ్స్ లోనూ ,లేదా కే ఎఫ్ సి లోనూ రోజూ   పిజ్జాలూ , చిప్స్ , బర్గర్ తిన్నారనుకోండి. వాటిలో కేవలం  కొవ్వు, ఇంకా  కార్బోహైడ్రేటులు మాత్రమె ఉండే ఆహారం అవుతుంది అది. అది సమతుల్యమైన ఆహారం కాదు కదా ! అది జంక్ ఫుడ్ అనబడుతూ ఉంటుంది పాశ్చాత్య దేశాలలో ! 
మన భారత దేశ ఆచార వ్యావహారాలు గమనించి నట్టయితే , గర్భవతులకు శ్రీమంతం అని చేస్తారు. అంటే మొదటి మూడు మాసాలలో గర్భవతి అని తెలియగానే కుటుంబం లో అందరూ ఆనందం గా చేసుకునే పండగ. అందులో గర్భవతి కోసం మొలకలు వచ్చిన శనగలూ ఇంకా బెల్లం తో చేసిన చలిమిడి ఉండలూ , నువ్వులూ తినమని పెడతారు. శాస్త్రీయం గా చూస్తె మన పెద్దలకు ఎంత దూర దృష్టి ఉందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే , మొలకలు వేస్తున్న శనగలు , పెసలలో విటమిన్ లు సంవృద్ది గా ఉంటాయి , ప్రత్యేకించి  ఫోలిక్ యాసిడ్ మిగతా బీ కాంప్లెక్స్ విటమిన్లు. చలిమిడి ఉండలు బెల్లం తో చేయబడినవి కాబట్టి వాటిలో ఇనుము అంటే ఐరన్  సరిపడినంత గా ఉంటుంది. ఇక నువ్వులూ , ఇతర  విత్తనాలలో  మినరల్స్ లేదా ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. ఈ ఖనిజాలూ,విటమిన్లూ పెరుగుతున్న శిశువు కు ఎంతో ముఖ్యం ప్రత్యేకించి మొదటి మూడు మాసాలలో. ఇంకా ఇవన్నీ సహజం గా దొరికేవే కదా !  కాల క్రమేణా  ఈ ఆచార వ్యవహారాలు ఎంత మంది పాటిస్తున్నారో మనకు తెలుసు కదా ! 
సరే మనం ఇప్పుడు ముఖ్యమైన విషయం తెలుసుకుందాము.  
ప్రశ్న :  నేను  ప్రెగ్నెన్సీ సమయం లో ఏ ఆహారం తినాలి ? : 
జవాబు: మీరు రోజూ మూడు సార్లు  భోజనం చేయాలి అంటే మేజర్ మీల్స్. ఇంకా కనీసం రెండు మూడు సార్లు రోజుకు టిఫిన్లు కానీ స్నాక్స్ ( లేక చిరుతిళ్ళు )  కానీ తినవచ్చు. ముఖ్యం గా భోజనం సమతుల్యం గా ఉండేట్టు చూసుకోవాలి.  పళ్ళూ , కాయగూరలూ , ఆకు కూరలూ వీలైనన్ని తింటూ ఉండాలి. విటమిన్లు కాక పీచు పదార్ధం కూడా సరిపడినంత గా ఉంటుంది.  హోల్ గ్రేయిన్స్ అంటే పొట్టు తీయని  పప్పు ధాన్యాలు విటమిన్లకు నిలయాలు. లో ఫాట్  పాలు , పళ్ళ రసాలూ , సూప్స్ కూడా తీసుకోవచ్చు. సంవృద్ది గా నీరు తాగడం కూడా చేస్తూ ఉండాలి.  వంటకాలలో నూనె వీలైనంత వరకు తక్కువగానూ , వెజిటబుల్ నూనె , మొక్కజొన్న అంటే కార్న్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ , ఇంకా సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడడం మంచిది. ఈ నూనెలు మార్చి వాడడం వల్ల కూడా , శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు లభిస్తాయి. ప్రాసెస్స్ చేసిన ఆహార పదార్ధాలు అంటే డబ్బాలలో అమ్మే ఆహార పదార్ధాలు తినడం మానాలి, వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండడమే కాక , విటమిన్లు , ఏవీ ఉండవు. అంతే కాక నిలువ చేయడం వల్ల రుచి కూడా తగ్గుతుంది, తాజా దనం కోల్పోయి. టీలూ కాఫీలూ రోజుకు మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువగా తాగ కూడదు. అవి గుండె ను  వేగం గా కొట్టుకునేట్టు చేయడమే కాక , స్వేదం అంటే చెమట పుట్టించడం,యాంగ్జైటీ కలిగించడం, నిద్ర కోల్పోవడం – వీటికి కారణమవుతాయి. చిరుతిళ్ళు తినవలసి వస్తే , చాక్లెట్లూ , బిస్కెట్ లూ, కేకులూ , క్రిస్ప్ లూ  చాలా తగ్గించితే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో మీకు కావలసినది సమతుల్యమైన ఆహారం. కేవలం  కాలరీలు మాత్రమె కాదు కదా ! 
ప్రశ్న: మరి తినగూడనివి ఏమిటి ? 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము.
 

ప్ర.జ.లు.10. గర్భ వతులు చేయించుకోవలసిన పరీక్షలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 7, 2012 at 7:37 సా.

ప్ర.జ.లు.10. గర్భ వతులు చేయించుకోవలసిన పరీక్షలు.

ప్రశ్న: గర్భవతులు చేయించుకోవలసిన పరీక్షలు ఏమిటి ? ముఖ్యం గా,  ఆ పరీక్షలు అవసరమా? : 
జవాబు:  గర్భ వతి అని నిర్ణయం అయిన   వెంటనే మొదటి సారిగా స్పెషలిస్టు డాక్టరు ( అంటే అబ్స్తే ట్రిషి యాన్ ) ను సంప్రదించే సమయం లో ఆ డాక్టరు మీ వద్ద నుంచి కొన్ని వివరాలు అడగటమే కాకుండా ,కొన్ని పరీక్షలు కూడా చేయించు కొమ్మని సలహా ఇస్తారు.ఆపరీక్షలు ఏమిటో , ఎందుకు చేయించుకోవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. 
1. మీ యొక్క మెడికల్ సమస్యలు , లేదా సర్జికల్ సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం. ఒక వేళ ఉంటే , వాటి వివరాలు కూడా తెలుసుకోవడం. ఇంకా మీ ఆహారపు అలవాట్లు, అంటే మీరు పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా ! అని కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
2.మీ మానసిక , సామాజిక జీవన శైలి: అంటే స్మోకింగ్ చేస్తారా లేదా , మద్యం తాగుతారా లేదా, మాదక ద్రవ్యాలు ఏవైనా తీసు కుంటున్నారా ? మీకు మీ బంధువుల నుంచి కానీ , స్నేహితుల నుంచి కానీ మీ గర్భ దారణ సమయం లో ఎంత సహాయం అందుతుంది?మీరు మానసిక వత్తిడి తట్టుకోగలరా?  శారీరికం గా మీరు ఎంత శ్రమ పడుతున్నారు? ఈ విషయాలన్నీ స్పెషలిస్టు  మిమ్మల్ని అడగ వలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ , మీ గర్భం లో ఉన్న శిశువు నిర్మాణాన్నీ , పెరుగుదలనూ ప్రభావితం చేస్తాయి కాబట్టి. 
3. డాక్టరు చేసే పరీక్షలు ఏమిటి ? : ముఖ్యం గా మీ బరువు ఎంత ఉంది ? , మీ రక్త పీడనం, అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందీ ?  ఇంకా మీ వక్షోజాల ఆరోగ్య స్థితి , అట్లాగే మీ గర్భాశయం ఆరోగ్య స్థితి తెలుసు కోవడానికి ( స్పెషలిస్టు చేతులతో ) పరీక్షలు చేస్తారు. వక్షోజ పరీక్ష ( బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ) , గర్భాశయ పరీక్ష ( పెల్విక్ ఎగ్జామినేషన్ ) అని  ఆంగ్లం లో అంటారు వీటిని .
4. ఇక ప్రయోగశాల పరీక్షలు ఏవి చేయించుకోవాలి ? :  1. హీమోగ్లోబిన్ పరీక్ష. ఇంకా 2. మూత్ర పరీక్ష. ఈ రెండు పరీక్షలూ  అందరు గర్భవతులూ  తప్పని సరిగా చేయించుకోవలసిన పరీక్షలు.  హీమోగ్లోబిన్ పరీక్ష మీలో రక్త హీనత ఉంటే తెలియ చేస్తుంది. రక్త హీనత ఉంటే , శిశువు పెరుగుదల సరిగా జరగదు.అంతే కాక  డెలివరీ సమయం లో రక్త స్రావం  సహజం గా జరిగే రక్త స్రావానికీ , లేదా ఆకస్మికం గా మీలో ఎక్కువ గా జరిగే రక్త స్రావానికీ మీరు సన్నద్ధులు అవాలి గర్భ ధారణ తోలి దశల నుండీ, అందువల్ల హీమోగ్లోబిన్ పరీక్ష అత్యంత ముఖ్యమైన పరీక్ష. అట్లాగే మూత్ర పరీక్ష కూడా ముఖ్యమైనదే. మూత్రం లో ఇన్ఫెక్షన్ ఉంటే,  గర్భాశయం లో పెరుగుతున్న పిండానికి  పాక డానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు అబార్షన్ అయ్యే రిస్కు ఏర్పడుతుంది.ఇక కొందరు ప్రత్యెక కారణాల వల్ల , షుగర్ పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబం లో డయాబెటిస్ ఉన్న స్త్రీలు. అట్లాగే రీసస్ అంటే Rh అనే రక్త గ్రూపు పరీక్ష కూడా చేయించుకోవలసిన అవసరం ఏర్పడ వచ్చు కొందరిలో. ఇంకా సిఫిలిస్ పరీక్షలూ , గోనేరియా పరీక్షలూ కూడా కొందరికి చేసుకోవలసిన అవసరం రావచ్చు.
5. ఇంకా ప్రతి గర్భవతి అయిన స్త్రీకీ, గర్భ ధారణ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలూ, ఆహార నియమాలూ, వ్యాయామాలూ, వీటన్నిటి గురించీ తగిన విధం గా సలహా ఇచ్చి , వారికి గర్భం దాల్చడం , ప్రసవించడం, శిశు పోషణ ఇలాంటి విషయాల మీద తగిన అవగాహన కలిగించి, వారి సందేహాలు, అపోహలూ తీర్చి , వారిని ఆనంద కరం గానూ , ఆరోగ్యం గానూ  శిశు జననానికి సమాయత్తం చేయడం కూడా మొదటి దఫా స్పెషలిస్టు ను సంప్రదించినప్పుడు చేయవలసిన కార్యాలే ! 
 
ప్రశ్న:  మూడు నుంచి ఆరు నెలల గర్భధారణ సమయం లో ఏ మార్పులు జరుగుతాయి?  గర్భవతులకు ఏ జాగ్రత్తలు అవసరం ?:
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము. 

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 6, 2012 at 8:10 సా.

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

క్రితం టపాలో మనం గర్భవతులు మొదటి మూడు మాసాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అందుకు గల కారణాలు కూడా తెలుసుకున్నాము కదా ! 
ప్రశ్న:  మరి మొదటి మూడు మాసాలలో గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సామాన్య లక్షణాలు ఏమిటి? :
జవాబు: నెల తప్పిన మొదటి మాసం లోనే  గర్భవతులు పలు లక్షణాలు అనుభవిస్తారు. దీనికి కారణం స్త్రీలలో ఉండే హార్మోనులలో వచ్చే పలు మార్పుల వల్లే !  అంటే  గర్భాశయం లో ఏర్పడిన పిండం, నిర్మాణం అయి , సక్రమం గా పెరగటానికి ఈ హార్మోనుల మార్పులు అత్యవసరం. ఈ హార్మోనుల మార్పుల వల్ల స్త్రీ లోని ప్రతి భాగం ప్రభావితమవుతుంది.
మరి ఏ లక్షణాలు సామాన్యం గా ఉంటాయి?:
1.తీవ్రమైన అలసట.
2.స్తనాలలో నొప్పులు రావడం, పుండు లా అయినట్టు నొప్పి కలగడం, కుఛ ద్వయం కూడా పొడుచుకు వచ్చినట్టు ఉండడం.
3.కడుపులో తిప్పినట్టు ఉండడం, కొన్ని సమయాలలో వాంతి వచ్చే ఫీలింగ్ కలగడం లేదా వాంతి కూడా రావడం. దీనినే ఆంగ్లం లో మార్నింగ్ సిక్ నెస్ అంటారు.
4. కడుపులో వికారం గా అయి, అంతకు ముందు రుచి గా ఉన్న పదార్ధాలు రుచించక పోవడం, లేదా కొన్ని పదార్ధాలు ఎక్కువ గా తినాలని తాపత్రయ పడడం. దీనిని ఆంగ్లం లో క్రేవింగ్ అంటారు.
5. మానసిక స్థితి అంటే మూడ్ మారడం. సామాన్యం గా ఆనందం తగ్గి , దిగాలు పడి ఉండడం. 
6. కడుపు లో మంట గా ఉండడం,  మల బద్ధకం అంటే కాన్స్తిపేషన్  అవడం.
7. తల నొప్పి.
8. మూత్రం రాకపోయినా , తరచూ , బాత్ రూం కు వెళ్లాలని పించడం.
9.కొంత బరువు తగ్గడమూ లేదా పెరగడమూ . 
ప్రశ్న : మరి ఈ లక్షణాలకు చికిత్స ఉందా ?: 
జవాబు: పైన తెలుసుకున్నట్టు, ఈ లక్షణాలన్నీ సాధారణం గా ప్రతి గర్భవతి లోనూ, అన్నీ కానీ , కొన్ని కానీ , కనిపించే లక్షణాలే. ప్రతి లక్షణానికీ ఒక టాబ్లెట్ వేసుకుని, చికిత్స చేయించుకోవాలనే భావన మానుకోవాలి స్త్రీలు , ఈ సమయం లో( ప్రత్యేకించి మొదటి మూడు మాసాలూ, పిండం నిర్మాణ దశలో ఉంటుంది కనుక ) . ఆహారం కొంచం పరిమాణం లో ఎక్కువ సార్లు తినడం, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం లాంటి చిన్న చిన్న కిటుకులు పాటించాలి.  క్రమేణా అంటే  మూడు, నాలుగు మాసాల గర్భం సమయం లో ఈ లక్షణాలు తగ్గు ముఖం పడతాయి. లక్షణాలు తీవ్రం గా ఉన్నప్పుడే వైద్య సలహా తీసుకోవాలి.
గర్భవతులు – బాడీ ఇమేజ్  అంటే ఏమిటి ?: 
కొందరు స్త్రీలు తాము గర్భం దాల్చగానే , తమ శరీరం లో క్రమేణా వస్తున్న మార్పులతో తాము నెగెటివ్ గా ప్రభావితం అవుతారు. తమను తాము, తమ క్రితం రూపం తో గర్భం దాల్చిన తరువాత మారుతున్న రూపం తో పోల్చుకుని, తీవ్రం గా నిస్పృహ చెందుతారు. ఈ విధమైన భావన ఒక మానసిక స్థితి.  ప్రత్యేకించి, నవీన ప్రపంచం లో చక్కటి అవయవ సౌష్టవం కల స్త్రీని మాత్రమె ఆదర్శ మైన అందమైన యువతి గా చూపించే వివిధ వ్యాపార , వాణిజ్య ప్రకటనల ప్రభావమే అది. 
ప్రశ్న : మరి  గర్భవతులు వారి బాడీ ఇమేజ్ గురించి ఏమి చేయాలి? 
జవాబు : 
1. మీరు గర్భం దాల్చక ముందు మీ శరీరాన్ని ప్రేమించండి. గర్భం దాల్చడం అనేది ఒక తాత్కాలిక శరీర స్థితి. ఆ స్థితి అత్యంత సహజమైన స్థితి. దాని  ప్రధాన ఉపయోగం శిశువుకు జన్మ నీయడం. ఆ మహత్తర కార్యం  అవగానే మీ శరీరం మామూలు స్థితి కి చేరుకుంటుంది. అందువల్ల గర్భం దాల్చిన సమయం లో మీరు ప్రశాంతం గా శిశువు కు జన్మ నీయడం మీదనే మీ దృష్టి కేంద్రీకరించండి.
2. ఈ విషయం మీద మీకు ఉన్న అపోహలూ , ఆలోచనలూ , నిర్భయం గా, సంకోచం లేకుండా , మీ జీవిత భాగస్వామి తో పంచుకోండి. ఆ రకమైన ఆలోచనలు మీలోనే నిగూడమై ఉంటే, మీ మానసిక స్తితి మరింత దిగాలు పడవచ్చు.
3. సెల్ఫ్ మస్సాజ్ అంటే మీ శరీరాన్ని మీరే సున్నితం గా స్పృశించడం. ఈ విధం గా చేయడం వల్ల మీ శరీరం మీద మీకు ఇష్టత ఎక్కువై  మీరు మీ ( గర్భం దాల్చిన ) స్థితిని ఆమోదించే  వీలు ఎక్కువ అవుతుంది.
4.  మీకు అనుకూలమైన వ్యాయామం చేయడం , స్విమింగ్ చేయడం లాంటివి కూడా మీకు ఉపయోగ పడతాయి.
5.  సున్నితమైన వ్యాయామం తో పాటు యోగాభ్యాసం కూడా గర్భవతులకు ఎంతో ఉపయోగ పడుతుంది. 
6. సహజమైన గర్భ ధారణ అంటే ప్రెగ్నెన్సీ గురించి , ప్రెగ్నెన్సీ లో వచ్చే సహజమైన మార్పుల గురించీ వీలైనంత ఎక్కువ అవగాహన ఏర్పరుచుకోండి. దీని వల్ల మీ సందేహాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. అపోహలు మాయమవుతాయి.
ప్రశ్న : నా మునుపటి శరీరం పోయింది , నేను తల్లి నయ్యాక ! ఈ లాంటి ఫీలింగ్స్ కు చికిత్స ఏమిటి?:
జవాబు: ఈ భావన కూడా చాలా మంది స్త్రీలలో కలుగుతుంది, శిశువు జన్మించిన తరువాత. ఈ భావన కు కూడా  మీకు ప్రెగ్నెన్సీ మీద మంచి అవగాహన ఏర్పడితే  పోతుంది. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ , డెలివరీ అయ్యాక స్త్రీలు పాల్గొనే వివిధ వ్యాయామాలతో , గర్భం దాల్చడానికి ముందు ఉన్న శరీరం ను తిరిగి పొంద వచ్చు అని వివిధ పరిశీలనల తరువాత, స్త్రీలకు రికమెండు చేస్తుంది. అందువల్ల నిరుత్సాహ పడనవసరం లేదు. 
 
ప్రశ్న: మొదటి మాసాలలో గర్భవతులు చేయించు కోవలసిన పరీక్షలు ఏమిటి ?: 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం.

ప్ర.జ.లు.8. గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 5, 2012 at 12:49 సా.

ప్ర.జ.లు.8. గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

( పైన  ఉన్న చిత్రాల వివరణ):
మొదటి నాలుగు వారాలలో ( రెండవ చిత్రం ): మీ శిశువు మెదడు, వెన్ను పూస ఏర్పడతాయి. హృదయం ఏర్పడడం మొదలవుతుంది.చేతులు , కాళ్ళు , బుడిపెల లాగా ( అంటే పూవులు ఏర్పడే ముందు వచ్చే మొగ్గలలాగా ) ఏర్పడతాయి. ఈ దశలో మీ శిశువు ( పిండం ) పరిమాణం ఎంతో తెలుసా ! కేవలం అంగుళం లో ఇరవై అయిదవ వంతు మాత్రమె ! 
ఎనిమిది వారాల వయసులో ( మూడవ చిత్రం ) : శిశువు గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. శిశువు లో అన్ని ముఖ్య అవయవాలూ ఏర్పడతాయి. జననాంగాలు ఏర్పడతాయి.  చేతి వేళ్ళు , కాలి వేళ్ళు ఏర్పడతాయి. ఈ ఎనిమిది వారాల వయసులో పిండం, మానవాకారం సంతరించు కుంటుంది. 
పన్నెండు వారాల వయసులో( నాలుగవ చిత్రం ) : శిశువు ఆడ , లేక మగ అనే విషయం నిర్ణయింప బడేది  ఈ వయసులోనే. అంతే కాక , శిశువు  తోలి సారి గా తన పిడికిలి బిగించ గలదు. తన కళ్ళు మూసుకుని, పెరుగుతున్న కళ్ళకు రక్షణ ఇస్తుంది. మళ్ళీ శిశువు ఇరవై ఎనిమిది వారాల వయసు లోనే కళ్ళు తెరుస్తుంది.ఈ వయసు లో శిశువు ఒక ఔన్స్ బరువు మాత్రమె ఉండి, మూడు అంగుళాల పొడవు ఉంటుంది ).

ప్రశ్న: స్త్రీలు, గర్భ వతులయ్యాక  తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 

జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న.  జన్మ నివ్వడం, సృష్టి లో జరిగే ఒక మహత్తర కార్యం. ఈ కార్యం లో ప్రతి స్త్రీ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. చక్కని, ఆరోగ్య వంతమైన శిశువు కు జన్మ నివ్వాలని, ప్రతి తల్లీ, తండ్రీ కూడా కోరుకోవడం, అంతే కాక తల్లి కూడా  ఆరోగ్యం గా ఉండాలనుకోవడం సహజమే కదా !  మరి గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తల మాటకొస్తే, ముందు గా కొన్ని విషయాలు వారు తెలుసుకోవాలి. గర్భం దాల్చిన తోలి మాసాలలో పిండం నుంచి ,  శిశువు నిర్మాణం అంటే సృష్టి జరుగుతూ ఉంటుంది. గర్భాశయం లో. ఈ  శిశు నిర్మాణం ముఖ్యం గా తోలి మూడు నుంచి ఆరు మాసాలలో ఎక్కువ గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ దశలో శిశువుకు అవయవాలు ఏర్పడడం, అంటే గుండె, రక్తనాళాలు, మెదడు , నాడీ మండలం ఏర్పడడం,  జరుగుతాయి. శిశు నిర్మాణం దశ దాటాక పెరుగుదల కూడా జరుగుతూ,  నవ మాసాలూ నిండిన తరువాత జననం జరుగుతుంది. అన్ని దశలూ ముఖ్యమైనప్పటికీ, తోలి మూడు మాసాలూ ఇంకా ముఖ్యమైనవి. 
ఈ తోలి మూడు మాసాలలో గర్భవతులు చేయ వలసినది ఏమిటి? :
1. స్పెషలిస్టు డాక్టర్ ను క్రమం తప్పకుండా  సంప్రదించడం.
2. ఫోలిక్ యాసిడ్  టాబ్లెట్ లు క్రమం గా వేసుకోవడం. ఎందుకంటే శిశువు నాడీ మండలం ఆరోగ్య వంతం గా పెరగటానికి,  న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ లు నివారణకు.( గర్భ ధారణ తోలి మాసాలలో , శిశువు నాడీ మండలం ఏర్పడడానికీ , పెరగటానికీ అవసరమయిన ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తల్లి దగ్గర నుంచి తీసుకో బడుతుంది. అందు వల్ల ఈ ఫోలిక్ యాసిడ్ ను తల్లులు ఎక్కువ గా తీసుకుంటూ ఉండాలి. లేక పొతే, తల్లుల లో ఫోలిక్ యాసిడ్  విటమిన్ లోపం కలిగి వారిలో అనీమియా, అంటే రక్త హీనత కలిగించవచ్చు. 
3, రక రకాల ఆరోగ్య పోషక పదార్ధాలు ఉన్న ఆహారం తింటూ ఉండాలి. అంటే  పళ్ళూ , తాజా కూరగాయలూ, ధాన్యం, పప్పు దినుసులు , ముఖ్యం గా పొట్టు తీసి వేయనివి ( ఎందు కంటే పొట్టు లో దేహానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిను లు ఉంటాయి.) మాంసాహారం తినే వారు, చేపలను తింటూ ఉండడం కూడా మంచిదే ! పళ్ళలో కూడా విటమిన్లు ఉంటాయి కదా ! వివిధ రకాల తాజా పళ్ళ ను తింటూ ఉంటే , పండంటి శిశువును కన వచ్చు ! 
4. భారత దేశ గర్భవతులలో  ఇనుము లోపం అంటే ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా చాలా సాధారణం గా ఉంటుంది. ఐరన్ బిళ్ళలు అంటే టాబ్లెట్ లు క్రమం గా తీసుకోవడం కూడా మంచిదే, వైద్య సలహాతో !
5. వీలైనన్ని సార్లు , స్వచ్చ మైన నీరు తాగుతూ ఉండడం చేస్తూ ఉండాలి. కోకు లు, టీలు , కాఫీలు మాని.
6. డాక్టర్ ను సంప్రదించి మీరు ఉండ వలసిన బరువు మాత్రమె ఉండేట్టు చూసుకోవాలి. గర్భ ధారణ సమయం లో అతి గా బరువు పెరగడం కూడా ఆరోగ్య కరం కాదు.
7. మనసు కు అధిక  వత్తిడి కలిగించే పరిస్థితిని దాట వేయాలి, ఎందు కంటే , ఆ వత్తిడి ప్రభావం పెరుగుతున్న శిశువు మీద కూడా పడుతుంది.
8.రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర పోవాలి, గర్భ ధారణ సమయం లో , ప్రతి స్త్రీ .
9. మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా, వాటిని తగిన నియంత్రణ లో ఉంచుకోవాలి, అవసరమైతే డాక్టర్ ను సంప్రదించి.
10. కారులో ప్రయాణించే సమయం లో సీటు బెల్టు ను తప్పనిసరిగా ధరించాలి. ప్రమాద నివారణ కోసం.
మరి గర్భవతులు చేయకూడనివి ఏమైనా ఉన్నాయా ?: 
1. శుభ్రత పాటించడం : అంటే క్రమం గా చేతులు కడుక్కుంటూ ఉండడం, పెంపుడు జంతువులను దగ్గర కు రానీయక పోవడం (  కుక్కలకూ , పిల్లులకూ వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్ లు శిశువుకు ప్రమాదకరం కావచ్చు ), విష పూరిత రసాయనాలు ముట్టుకోక పోవడం, ఎక్స్ రే లకు దూరం గా ఉండడం. తప్పని సరిగా చేయాలి. ( అల్ట్రా సౌండ్  పరీక్ష ఎక్స్ రే  పరీక్ష  కాదు, అందు వల్ల అది సురక్షితమే ! ).
2. స్మోకింగ్ చేయడం,  మద్యం తాగడం , లేదా ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోవడం, శిశువు ఆరోగ్యం ( తమ ఆరోగ్యం ) ముఖ్యమనుకునే స్త్రీలు చేయకూడదు. అట్లా చేస్తే , వాటి పరిణామాలు శిశువునూ , తల్లినీ ప్రభావితం చేయ గలవు.
3. గోరు వెచ్చటి నీటి తో నే స్నానం చేయాలి. చాలా వేడి గా ఉన్న నీటి తో స్నానం చేస్తే ,  గర్భం లో ఉన్న శిశువుకు మంచిది కాదు.  అంతే కాక గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు.7.పిల్లలలో కళ్ళ ప్రమాదాల నివారణ – ప్రధమ చికిత్స .

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 4, 2012 at 4:22 సా.

ప్ర.జ.లు.7.పిల్లలలో కళ్ళ ప్రమాదాల నివారణ – ప్రధమ చికిత్స .

ప్రశ్న : చిన్న పిల్లలలో కంటి ప్రమాదాలు నివారించడానికి తల్లి దండ్రులు, టీచర్లు చేయగలిగినది ఏమైనా ఉందా ? :

జవాబు: పిల్లలు ఇంటి లో ఉన్నప్పుడు కానీ , లేదా ఆడుకునే వివిధ ఆటలలో , లేదా స్కూలు రసాయన  ప్రయోగ శాల లో  ప్రయోగాలు చేసే సమయం లోనూ , లేదా క్రాఫ్ట్ తరగతులలోనూ , కళ్ళ గురించి అత్యంత జాగ్రత్త వహించాలి. బంతి తో ఆడే ఏ ఆటలలో నైనా రక్షక కళ్ళ జోడు ధరించడం అలవాటు చేయాలి , తల్లి దండ్రులు. ఈ రక్షక గాగుల్స్  పాలీ కార్బోనేట్ అనే పదార్ధం తో చేసినవి అయి ఉండాలి. ( Poly carbonate goggles  )( పైన ఉన్న చిత్రం చూడండి ).సాధారణ వస్తువులు ఉపయోగించే సమయం లో కూడా, తల్లి దండ్రులు కానీ, టీచర్లు కానీ పర్య వేక్షణ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు , పెన్సిల్ మొనలు, పేపర్ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్ లు , కత్తెరలు , కోటు హంగర్ – ఇటువంటి  వస్తువులు చాలా సామాన్యం గా వాడే వస్తువులు అయినప్పటికీ , చిన్న పిల్లలకు వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన లోపం వల్ల , పెద్దల పర్య వేక్షణ అవసరం అవుతుంది.ఇంట్లోనూ , రసాయన శాలలోనూ , వాడే వివిధ రసాయనాలు , పిల్లలకు దూరం గా ఉంచాలి. ఆట వస్తువులు కూడా ఏ వయసు లో ఆ వయసు ఆట వస్తువులే కొనాలి. అంటే  పది ఏళ్ల వారు ఆడుకునే టాయ్స్ నాలుగు ఏళ్ల వారికి సరి పడవు. ప్రమాదాలకు తావు అవుతాయి. పిల్లలు పిస్టల్ తోటి లేదా గన్ తోటీ ఆడడం చాలా ఇష్ట పడతారు. కొన్ని  అనుమతి లేని  టాయ్స్  ప్లాస్టిక్ బులెట్స్ ను కూడా అమ్ముతుంటారు. ఈ రకమైన టాయ్స్ కూడా కంటి ప్రమాదాలకు కారణం.పెంపుడు జంతువులూ , ప్రత్యేకించి , కుక్కలు , పిల్లులు కూడా కంటి ప్రమాదాలకు కారణం.  మూడు నాలుగు వయసు ఉన్న పిల్లలతో పెంపుడు జంతువులూ ఆడుతున్నప్పుడు, కళ్ళ ప్రమాదాలు జరిగే అవకాశాలు హెచ్చుతాయి. ముఖం పెంపుడు జంతువుల మూతులకు, కాళ్ళకు  దగ్గర గా పెట్ట రాదు ప్రత్యేచించి చిన్న పిల్లలు. ఇంకా పదునైన  వస్తువులతో అంటే డార్ట్ ఆటలు , విల్లు బాణం ఆటలు ఆడే సమయం లో పెద్దలు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండి ప్రమాద నివారణ చేయాలి.

ఒక ఉదాహరణ : చిన్న పిల్లలకు రామాయణం, మహా భారత కధలు తెలుసుకున్నవయసులలో  విల్లు బాణం తో ఆడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఒక తాడు తీసుకుని వెదురు కర్రలతోవిల్లు  తయారు చేయడమూ , కొబ్బరి పుల్లలతో బాణాలు చేసి ఆడడమూ చాలా సాధారణమే  కదా ! ఒక సారి పిల్లలు ఆ ఆట ఆడుతున్నప్పుడు ఒక అన్న, తమ్ముడికి ఇట్లా చేసిన బాణాన్ని గురి పెట్టి ‘ చక్క గా గురి పెట్టాను నీకు , వదలనా ? ! అని అడిగాడు. తమ్ముడు ధీమా గా నీ బాణం నన్ను తాక లేదు వదులు చూద్దాం ! అన్నాడు.  ఆ బాణం సరిగ్గా వెళ్లి తమ్ముడి కంటి లో గుచ్చుకుంది. ఆ కంటి లో చూపు పోయి, ఎన్ని ప్రయత్నాలు వైద్యులు చేసినా దృష్టి మళ్ళీ రాలేదు. ఈ సంఘటన యదార్ధం గా జరిగినది, ఆంద్ర దేశం లో ! కారులో పిల్లలు కూర్చున్నప్పుడు కూడా సరి అయిన రక్షక సూచనలు పాటించాలి.  విదేశాలలో కారు సీటు బెల్టు పెట్టుకోక పోవడం ఒక నేరం. అది గమనించితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధిస్తారు.అంతే కాక పన్నెండు ఏళ్ళు , అంతకు తక్కువ వయసు ఉన్న పిల్లలు ముందు సీటు లో కూర్చోవడం కూడా నేరమే విదేశాలలో !   భారత దేశం లో కూర్చున్నవారి మాట దేవుడెరుగు కారు నడిపే డ్రైవర్ లకు కూడా సీటు బెల్టు పెట్టుకోవాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదు. ఎందు కంటే ,  కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న విధంగా కారు నడిపే డ్రైవర్ కు తన ప్రాణాల మీద లేని తీపి వేరే ( ప్రభుత్వానికి ) వారికి ఎందుకు ఉంటుంది? అందులోనూ భారత దేశం లో ?! 

ప్రధమ చికిత్స: 
కంటి లో ఏదైనా గుచ్చుకోవడం కానీ , ఏదైనా తగిలి  కంటికి గాయం అవడం కానీ జరిగితే , వెంటనే స్పెషలిస్టు వైద్య సహాయం తీసుకోవాలి. గాయ పడిన కంటిని , తాకడం , తుడవడం , లేదా వత్తిడి పెట్టడం అంటే , గట్టిగా ఆదమడం లాంటివి కానీ చేయకూడదు.చిన్న నలకలు ఏవైనా పడినప్పుడు మాత్రం, జాగ్రత్తగా కంటి రెప్పను ఎత్తి , కంటి లో ఊదడం చేస్తే , ఆశ్రువుల తో ఆ నలకలు బయటకు వస్తాయి. అట్లా జరగక పొతే , కంటిని గట్టిగా రుద్దడం చేయకూడదు. వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి. కంటికి కట్ అంటే కోత లాంటి గాయం అయినప్పుడు ఒక శుభ్రమైన నూలు బాండేజీ తో కవర్ చేసి డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాలి. కేవలం మంట కలిగించే రసాయనాలు కంటిలో పడినప్పుడు మాత్రమె , మంచి నీటితో ఆ కంటిని జాగ్రత్తగా కడగాలి.అప్పుడు కంటి స్పెషలిస్టు దగ్గరకో , లేదా డాక్టర్ దగ్గరకో తీసుకు వెళ్లి చూపించాలి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు. 6.బాల్యం లో కళ్ళ జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 3, 2012 at 8:07 సా.

ప్ర.జ.లు. 6.బాల్యం లో కళ్ళ జాగ్రత్తలు.

ప్రశ్న: బాల్యం లో పిల్లల కళ్ళ గురించిన జాగ్రత్తలు, తల్లి దండ్రులు తీసుకోవాలా ?: 
జవాబు: ఇది  చాలా ముఖ్యమైన ప్రశ్న.  తల్లి తండ్రులు సహజం గా తమ పిల్లలను అత్యంత శ్రద్ధ తో చూసుకుంటారు. వారికి ఏ చిన్న అవస్థ,  ఏ వయసులో కలిగినా తల్లడిల్లి పోతారు.వారికి ఆ అవస్థ , అనారోగ్యం ఎందుకు కలగాలి ? అనుకుంటూ, బాధ పడతారు. కానీ తమ పిల్లలను చూసుకోవడం లో కేవలం, వారికి కావలసిన , ఆహారం , బట్ట, ఆట పాటలకు సమయం ఇలాంటి విషయాలలో శ్రద్ధ వహిస్తారు. అంతే శ్రద్ధ తో వారు పిల్లల ఇంద్రియాలను కూడా గమనించాలి.  పిల్లలు జన్మించి నప్పటి నుంచీ , చురుకు గా తమ పరిసరాలను గమనిస్తూ , ప్రపంచాన్ని చూస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉండాలంటే, వారికి ఇంద్రియ లోపం ఉండ కూడదు. ప్రత్యేకించి కళ్ళు , చెవులు, భాషా జ్ఞానము , చక్క గా ఉంటే వారు ఎంతో చురుకు గా , తెలివి తేటలు అలవరచు కుంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే మనకు ఉన్న ఇంద్రియాలన్నింటి కంటే కళ్ళు ప్రధాన మైనవి. ఇంత ముఖ్యమైన కళ్ళు బాల్యం లో  తమ తల్లి దండ్రులు గమనించి నంతగా  ఎవరూ గమనించరు. కళ్ళలో ఏ మార్పులు ఉన్నా అవి తల్లిదండ్రులు  మొదట గమనించాలి. అప్పుడు ఏ మార్పులు ఉన్నా తగిన నిపుణుల సలహా తీసుకుని , ఆ మార్పులను సరి చేయించుకోవచ్చు.
మరి తమ చిన్నారుల కళ్ళ జాగ్రత్త విషయం లో, తల్లి తండ్రులు చేయ వలసిన దేమిటి ? : 
జవాబు: ముందు గా సహజం గా చిన్నారుల కళ్ళలో బాల్యం లో వచ్చే సహజమైన మార్పులు తెలుసుకోవడం , మార్పులను తొలిదశల లో కనిపెట్టడానికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. మరి ఈ సహజమైన మార్పులు ఏమిటి ? : ఒక నెల వయసు ఉన్న శిశువులు  తన చుట్టూ ఉన్న వారిని చూడగలరు. దీనినే పెరిఫెరల్ విజన్ అంటారు. ఈ  వయసు లో తమకు మూడు అడుగుల దూరం లో ఉన్న వస్తువులను దృష్టి సారించి కొన్ని క్షణాల పాటు చూడ గలరు. దీనిని ఫోకస్ చేయగలగటం అంటారు.రెండు నెలల వయసులో వారు ట్రాకింగ్ కూడా చేయ గలరు. అంటే ఒక కదులుతున్న వస్తువును కూడా గమనించ గలరు. మూడు నెలల వయసు లో తమ దగ్గరలో ఉన్న వస్తువులను తమ చేతులతో పట్టుకోడానికీ , తోసివేయడానికీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇట్లా మూడు నెలల వయసు లో పైన చెప్పిన విధం గా ఫోకసింగ్, ట్రాకింగ్ , ఇంకా హాండ్ కంట్రోల్  శిశువులలో కనిపించక పొతే అంటే వారు చూపక పొతే , వెంటనే వారిని  చిన్న పిల్లల స్పెషలిస్టు కు చూపించాలి.అదే విధం గా కాంతిని గమనించ గలగడమూ , రంగులను గమనించ గలగటమూ కూడా మూడు నాలుగు నెలల వయసు వచ్చే సరికి శిశువులు చక్కగా చేయగలరు వారి కళ్ళ తో ! ప్రత్యేకించి వారు ముఖాలను , కళ్ళ నూ  కూడా నిశితం గా గమనించ గలరు.నాలుగు అయిదు ఏళ్ల వయసులో  పైన ఉదాహరించిన లక్షణాలు ఇంకా వృద్ధి చెందుతాయి. అంతే కాక వారు ఒక వస్తువును రెండు కళ్ళూ కేంద్రీకరించి నిశితం గా పరిశీలించ గలరు కూడా ! 
రిఫ్రాక్టివ్ ఎర్రర్ లు ఏమిటి ?:  రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే కళ్ళు ఒక ఆబ్జెక్టు లేదా వస్తువు  మీద సరిగా  కేంద్రీకరించలేక  పోవడము లేదా ఫోకస్ చేయలేక పోవడము. ఈ లోపాన్ని తొలిదశల లోనే కనుక్కుంటే దృష్టి లోపాన్ని నివారించ వచ్చు లేదా సాధ్యమైనంత వరకూ తగ్గించ వచ్చు. 
ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ లు ఏ రకం  గా ఉంటాయి? : మయోపియా :అంటే కేవలం దగ్గర గా ఉండే వస్తువులనే స్పష్టం గా చూడ గలగటం, ( దూరం గా ఉన్న వస్తువులు మసక గా కనిపిస్తాయి వారికి ). దీనికి వ్యతిరేకం గా హైపర్ మెట్రోపియా : అంటే దూరం గా ఉన్న వస్తువులు మాత్రమె స్పష్టం గా కనిపించడం, దగ్గర వస్తువులు మసక బారటం జరుగుతుంది. ఎస్తిగ్మా టిజం : అంటే  దగ్గర వస్తువులు కానీ దూరం వస్తువులు కానీ పెద్దగా ఉన్నవి చిన్నగానూ లేదా కొన్ని భాగాలు మాత్రమె చిన్న గానూ , లేదా చిన్న వస్తువులలో కొన్ని భాగాలు మాత్రమె పెద్దగానూ కనిపిస్తాయి.  ఈ లక్షణాలు పిల్లలలో గమనించాలి. ఒక వేళ గమనించితే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి. ప్రత్యేకించి కొందరు  పిల్లలు తమ క్లాసులలో కూడా ముందు వరుసలలోనే కూర్చుంటూ ఉంటారు. వారిని వెనుక వరుసలోకి బలవంతాన టీచర్ లు మారిస్తే వారు చదువులో కూడా వెనుక బడుతూ ఉంటారు. సరిగా బోర్డు మీద రాతలు గమనించలేక, ఒక వేళ వారికి మయోపియా ఉంటే ! ఈ విషయాలు టీచర్లూ , తల్లి తండ్రులూ గమనించాలి, తోలి దశలలోనే. త్వరగా వారికి స్పెషలిస్టు సహాయం అందితే , కేవలం చూపు బాగు పడడమే కాకుండా, తల్లి దండ్రుల ముందు చూపు కు కూడా తార్కాణం అవుతుంది ఆ చర్య.పిల్లలు చక్కగా నేర్చుకుంటే వారి భవిష్యత్తు కూడా సవ్యం గా సరిదిద్దినట్టే కదా , తల్లి తండ్రులు, కేవలం వారి దృష్టి మాత్రమె కాక ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.

ప్ర.జ.లు.5. కంప్యూటర్ వాడకం, కళ్ళ జాగ్రత్తలూ !

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 1, 2012 at 7:59 సా.

ప్ర.జ.లు.5. కంప్యూటర్ వాడకం, కళ్ళ జాగ్రత్తలూ ! 

 

ప్రశ్న : కంప్యూటర్ ను ఎక్కువగా వాడుతున్నప్పుడు, కళ్ళ కోసం  తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?:
జవాబు :కంప్యూటర్ తెరను గానీ, వీడియో గేమ్స్ చూస్తున్నప్పుడు కానీ, లేదా స్మార్ట్ ఫోను ను , లేదా ఇతర డిజిటల్ స్క్రీనులు తదేకం గా చూడడం వల్ల,శాశ్వత దృష్టి లోపం ఏమీ ఉండదు. కానీ తదేకం గా స్క్రీను ను చూస్తూ ఉండడం వల్ల , కళ్ళు ఎండి పోవడం అంటే డ్రై నెస్ ఏర్పడడం , లేదా కళ్ళు బాగా అలసి పోయినట్టు అనిపించడం జరుగుతుంది. కొన్ని సమయాలలో , తల తిరిగినట్టు అనిపించదమూ , తల నొప్పులు రావడమూ , మోషన్ సిక్ నెస్ రావడమూ కూడా జరగ వచ్చు. ప్రత్యేకించి త్రీ డీ చిత్రాలు చూస్తున్నప్పుడు ఇట్లా జరగ వచ్చు.  కళ్ళకు తీవ్రమైన అలసట ఈ క్రింది పరిస్థితులలో ఎక్కువ అవవచ్చు:
1. నిద్ర లేమి : మన దేహం లో ప్రతి భాగం మాదిరిగానే కళ్ళకు కూడా తగినంత విశ్రాంతి అవసరం. ఎందుకంటే విశ్రాంతి సమయం లో బాగా పని చేసి ,అలసిపోయిన అతి సున్నితమైన కంటి కండరాలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. అంటే ఆ కండరాలలో ఏర్పడిన మేట బోలైట్ లు అంటే మలిన పదార్ధాలు రక్తం లో కలవడమూ, అంతే కాక , కంటి కండరాలకు రక్త ప్రసరణ సాఫీ గా జరిగి , తగినంత ప్రాణ వాయువు అందడమూ జరుగుతుంది. నిద్ర లేమి వల్ల ఈ క్రియలు అన్నీ అస్తవ్యస్త మవుతాయి. దానితో కళ్ళకు లేదా కంటి రెప్పలకు ఇన్ఫెక్షన్ లు రావడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకించి కాంటాక్ట్ లెన్సులు వాడే వారికి ఈ రిస్కు ఎక్కువగా ఉంటుంది. 
ఒక వేళ మీకు కంప్యూటర్ మీద అతి ముఖ్యమైన పనులు చాలా సమయం చేయ వలసి ఉంటే ,  ఒక క్రమ సమయం లో పవర్ నాప్స్ అంటే కళ్ళకు విశ్రాంతి ఇస్తూ ఉండాలి. శుభ్రమైన గోరు వెచ్చటి నీటిలో తడిపిన నూలు గుడ్డను మూసి ఉంచిన కళ్ళ  మీద పెడుతూ ఉండాలి. ఇంకా అవసరం అనిపిస్తే , చేస్తున్న పని తాత్కాలికం గా ఆపి తగిన విరామం, విశ్రాంతి తీసుకోవడం చేయాలి. 
2. సరిగా అడ్జస్టు కాని కాంటాక్ట్ లెన్సులు వాడే వారిలో కూడా కళ్ళు త్వరగా అలసి పోతాయి:  కాంటాక్ట్ లెన్సులు నిపుణులైన వారి సలహా మీదే వాడాలి. వాటిని శుభ్ర పరచుకునే పద్ధతులను నిరంతరం పాటించాలి. అంతే కాక కాంటాక్ట్ లేన్సులను నిద్ర పోయే సమయం లో ఎప్పుడూ కళ్ళ మీద  ఉంచుకో కూడదు, ఎంత ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్సులు అయినా సరే! ఎందుకంటే కాంటాక్ట్ లెన్సులు ఉన్న కార్నియా కణాలలో రక్త సరఫరా సరిగా జరగదు. దాని వల్ల కార్నియా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుంది, నిద్ర పోయే సమయం లో కూడా వాడితే !  కాంటాక్ట్ లెన్సులు అదే పని గా వాడక, కళ్ళ జోడు ను కూడా మధ్య మధ్య వాడుతూ ఉంటే కళ్ళకు తగిన విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది, కాంటాక్ట్ లెన్సుల నుంచి. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్సులు వాడడం తో కళ్ళు ఎర్ర పడడమో,  అదే పని గా కళ్ళ నుంచి నీరు కారడమో, చూపు మందగించ డమూ , కళ్ళు వాచి పోవడమూ, ఎక్కువ వెలుతురు లో చూడ లేక పోవడమూ, ఈ లక్షణాలు ఏర్పడితే , కాంటాక్ట్ లెన్సులు వాడకుండా  వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా !  
కంప్యూటర్ వల్ల కంటి అలసట ఎందుకు కలుగుతుంది? : 
సామాన్యం గా మన కంటి రెప్పలు నిమిషానికి 18 సార్లు కొట్టుకుంటూ ఉంటాయి. దాని వల్ల కంటి లో ఉండే పలుచని పొరలా ఉన్న ద్రవం మన కటి గుడ్డు కూ కంటి రెప్పలకూ మధ్య లూబ్రికెంట్ లేదా కందెన లా  కదులుతూ , ఉంటుంది. కానీ మనం కంప్యూటర్ ను తదేకం గా చూస్తున్నప్పుడు, అందులో సగం సార్లు అంటే ఎనిమిది, పది సార్లు మాత్రమె కంటి రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయని పరిశీలన వల్ల తెలిసింది. మనం కంపూటర్ తెరకు కనీసం పాతిక అంగుళాలు అంటే యాభై అయిదు సెంటీ మీటర్ ల దూరం నుంచి చూడడం అలవాటు చేసుకోవాలి.  అంతే కాక 20-20-20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ తెర నుంచి దృష్టి మరల్చి కనీసం ఇరవై అడుగుల దూరం లో ఉన్న వస్తువుల వైపు దృష్టి సారించాలి. అదీ ఒక ఇరవై సెకన్ లు మాత్రమె ! అందుకే 20-20-20 ను గుర్తు ఉంచుకోవాలి. ఇంకా సహజం గా చేసే కంటి రెప్పలను కొట్టడం కూడా చేస్తూ ఉండాలి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.