Our Health

Archive for ఆగస్ట్ 6th, 2012|Daily archive page

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 6, 2012 at 8:10 సా.

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

క్రితం టపాలో మనం గర్భవతులు మొదటి మూడు మాసాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అందుకు గల కారణాలు కూడా తెలుసుకున్నాము కదా ! 
ప్రశ్న:  మరి మొదటి మూడు మాసాలలో గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సామాన్య లక్షణాలు ఏమిటి? :
జవాబు: నెల తప్పిన మొదటి మాసం లోనే  గర్భవతులు పలు లక్షణాలు అనుభవిస్తారు. దీనికి కారణం స్త్రీలలో ఉండే హార్మోనులలో వచ్చే పలు మార్పుల వల్లే !  అంటే  గర్భాశయం లో ఏర్పడిన పిండం, నిర్మాణం అయి , సక్రమం గా పెరగటానికి ఈ హార్మోనుల మార్పులు అత్యవసరం. ఈ హార్మోనుల మార్పుల వల్ల స్త్రీ లోని ప్రతి భాగం ప్రభావితమవుతుంది.
మరి ఏ లక్షణాలు సామాన్యం గా ఉంటాయి?:
1.తీవ్రమైన అలసట.
2.స్తనాలలో నొప్పులు రావడం, పుండు లా అయినట్టు నొప్పి కలగడం, కుఛ ద్వయం కూడా పొడుచుకు వచ్చినట్టు ఉండడం.
3.కడుపులో తిప్పినట్టు ఉండడం, కొన్ని సమయాలలో వాంతి వచ్చే ఫీలింగ్ కలగడం లేదా వాంతి కూడా రావడం. దీనినే ఆంగ్లం లో మార్నింగ్ సిక్ నెస్ అంటారు.
4. కడుపులో వికారం గా అయి, అంతకు ముందు రుచి గా ఉన్న పదార్ధాలు రుచించక పోవడం, లేదా కొన్ని పదార్ధాలు ఎక్కువ గా తినాలని తాపత్రయ పడడం. దీనిని ఆంగ్లం లో క్రేవింగ్ అంటారు.
5. మానసిక స్థితి అంటే మూడ్ మారడం. సామాన్యం గా ఆనందం తగ్గి , దిగాలు పడి ఉండడం. 
6. కడుపు లో మంట గా ఉండడం,  మల బద్ధకం అంటే కాన్స్తిపేషన్  అవడం.
7. తల నొప్పి.
8. మూత్రం రాకపోయినా , తరచూ , బాత్ రూం కు వెళ్లాలని పించడం.
9.కొంత బరువు తగ్గడమూ లేదా పెరగడమూ . 
ప్రశ్న : మరి ఈ లక్షణాలకు చికిత్స ఉందా ?: 
జవాబు: పైన తెలుసుకున్నట్టు, ఈ లక్షణాలన్నీ సాధారణం గా ప్రతి గర్భవతి లోనూ, అన్నీ కానీ , కొన్ని కానీ , కనిపించే లక్షణాలే. ప్రతి లక్షణానికీ ఒక టాబ్లెట్ వేసుకుని, చికిత్స చేయించుకోవాలనే భావన మానుకోవాలి స్త్రీలు , ఈ సమయం లో( ప్రత్యేకించి మొదటి మూడు మాసాలూ, పిండం నిర్మాణ దశలో ఉంటుంది కనుక ) . ఆహారం కొంచం పరిమాణం లో ఎక్కువ సార్లు తినడం, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం లాంటి చిన్న చిన్న కిటుకులు పాటించాలి.  క్రమేణా అంటే  మూడు, నాలుగు మాసాల గర్భం సమయం లో ఈ లక్షణాలు తగ్గు ముఖం పడతాయి. లక్షణాలు తీవ్రం గా ఉన్నప్పుడే వైద్య సలహా తీసుకోవాలి.
గర్భవతులు – బాడీ ఇమేజ్  అంటే ఏమిటి ?: 
కొందరు స్త్రీలు తాము గర్భం దాల్చగానే , తమ శరీరం లో క్రమేణా వస్తున్న మార్పులతో తాము నెగెటివ్ గా ప్రభావితం అవుతారు. తమను తాము, తమ క్రితం రూపం తో గర్భం దాల్చిన తరువాత మారుతున్న రూపం తో పోల్చుకుని, తీవ్రం గా నిస్పృహ చెందుతారు. ఈ విధమైన భావన ఒక మానసిక స్థితి.  ప్రత్యేకించి, నవీన ప్రపంచం లో చక్కటి అవయవ సౌష్టవం కల స్త్రీని మాత్రమె ఆదర్శ మైన అందమైన యువతి గా చూపించే వివిధ వ్యాపార , వాణిజ్య ప్రకటనల ప్రభావమే అది. 
ప్రశ్న : మరి  గర్భవతులు వారి బాడీ ఇమేజ్ గురించి ఏమి చేయాలి? 
జవాబు : 
1. మీరు గర్భం దాల్చక ముందు మీ శరీరాన్ని ప్రేమించండి. గర్భం దాల్చడం అనేది ఒక తాత్కాలిక శరీర స్థితి. ఆ స్థితి అత్యంత సహజమైన స్థితి. దాని  ప్రధాన ఉపయోగం శిశువుకు జన్మ నీయడం. ఆ మహత్తర కార్యం  అవగానే మీ శరీరం మామూలు స్థితి కి చేరుకుంటుంది. అందువల్ల గర్భం దాల్చిన సమయం లో మీరు ప్రశాంతం గా శిశువు కు జన్మ నీయడం మీదనే మీ దృష్టి కేంద్రీకరించండి.
2. ఈ విషయం మీద మీకు ఉన్న అపోహలూ , ఆలోచనలూ , నిర్భయం గా, సంకోచం లేకుండా , మీ జీవిత భాగస్వామి తో పంచుకోండి. ఆ రకమైన ఆలోచనలు మీలోనే నిగూడమై ఉంటే, మీ మానసిక స్తితి మరింత దిగాలు పడవచ్చు.
3. సెల్ఫ్ మస్సాజ్ అంటే మీ శరీరాన్ని మీరే సున్నితం గా స్పృశించడం. ఈ విధం గా చేయడం వల్ల మీ శరీరం మీద మీకు ఇష్టత ఎక్కువై  మీరు మీ ( గర్భం దాల్చిన ) స్థితిని ఆమోదించే  వీలు ఎక్కువ అవుతుంది.
4.  మీకు అనుకూలమైన వ్యాయామం చేయడం , స్విమింగ్ చేయడం లాంటివి కూడా మీకు ఉపయోగ పడతాయి.
5.  సున్నితమైన వ్యాయామం తో పాటు యోగాభ్యాసం కూడా గర్భవతులకు ఎంతో ఉపయోగ పడుతుంది. 
6. సహజమైన గర్భ ధారణ అంటే ప్రెగ్నెన్సీ గురించి , ప్రెగ్నెన్సీ లో వచ్చే సహజమైన మార్పుల గురించీ వీలైనంత ఎక్కువ అవగాహన ఏర్పరుచుకోండి. దీని వల్ల మీ సందేహాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. అపోహలు మాయమవుతాయి.
ప్రశ్న : నా మునుపటి శరీరం పోయింది , నేను తల్లి నయ్యాక ! ఈ లాంటి ఫీలింగ్స్ కు చికిత్స ఏమిటి?:
జవాబు: ఈ భావన కూడా చాలా మంది స్త్రీలలో కలుగుతుంది, శిశువు జన్మించిన తరువాత. ఈ భావన కు కూడా  మీకు ప్రెగ్నెన్సీ మీద మంచి అవగాహన ఏర్పడితే  పోతుంది. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ , డెలివరీ అయ్యాక స్త్రీలు పాల్గొనే వివిధ వ్యాయామాలతో , గర్భం దాల్చడానికి ముందు ఉన్న శరీరం ను తిరిగి పొంద వచ్చు అని వివిధ పరిశీలనల తరువాత, స్త్రీలకు రికమెండు చేస్తుంది. అందువల్ల నిరుత్సాహ పడనవసరం లేదు. 
 
ప్రశ్న: మొదటి మాసాలలో గర్భవతులు చేయించు కోవలసిన పరీక్షలు ఏమిటి ?: 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం.
%d bloggers like this: