Our Health

Archive for ఆగస్ట్ 5th, 2012|Daily archive page

ప్ర.జ.లు.8. గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 5, 2012 at 12:49 సా.

ప్ర.జ.లు.8. గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

( పైన  ఉన్న చిత్రాల వివరణ):
మొదటి నాలుగు వారాలలో ( రెండవ చిత్రం ): మీ శిశువు మెదడు, వెన్ను పూస ఏర్పడతాయి. హృదయం ఏర్పడడం మొదలవుతుంది.చేతులు , కాళ్ళు , బుడిపెల లాగా ( అంటే పూవులు ఏర్పడే ముందు వచ్చే మొగ్గలలాగా ) ఏర్పడతాయి. ఈ దశలో మీ శిశువు ( పిండం ) పరిమాణం ఎంతో తెలుసా ! కేవలం అంగుళం లో ఇరవై అయిదవ వంతు మాత్రమె ! 
ఎనిమిది వారాల వయసులో ( మూడవ చిత్రం ) : శిశువు గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. శిశువు లో అన్ని ముఖ్య అవయవాలూ ఏర్పడతాయి. జననాంగాలు ఏర్పడతాయి.  చేతి వేళ్ళు , కాలి వేళ్ళు ఏర్పడతాయి. ఈ ఎనిమిది వారాల వయసులో పిండం, మానవాకారం సంతరించు కుంటుంది. 
పన్నెండు వారాల వయసులో( నాలుగవ చిత్రం ) : శిశువు ఆడ , లేక మగ అనే విషయం నిర్ణయింప బడేది  ఈ వయసులోనే. అంతే కాక , శిశువు  తోలి సారి గా తన పిడికిలి బిగించ గలదు. తన కళ్ళు మూసుకుని, పెరుగుతున్న కళ్ళకు రక్షణ ఇస్తుంది. మళ్ళీ శిశువు ఇరవై ఎనిమిది వారాల వయసు లోనే కళ్ళు తెరుస్తుంది.ఈ వయసు లో శిశువు ఒక ఔన్స్ బరువు మాత్రమె ఉండి, మూడు అంగుళాల పొడవు ఉంటుంది ).

ప్రశ్న: స్త్రీలు, గర్భ వతులయ్యాక  తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 

జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న.  జన్మ నివ్వడం, సృష్టి లో జరిగే ఒక మహత్తర కార్యం. ఈ కార్యం లో ప్రతి స్త్రీ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. చక్కని, ఆరోగ్య వంతమైన శిశువు కు జన్మ నివ్వాలని, ప్రతి తల్లీ, తండ్రీ కూడా కోరుకోవడం, అంతే కాక తల్లి కూడా  ఆరోగ్యం గా ఉండాలనుకోవడం సహజమే కదా !  మరి గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తల మాటకొస్తే, ముందు గా కొన్ని విషయాలు వారు తెలుసుకోవాలి. గర్భం దాల్చిన తోలి మాసాలలో పిండం నుంచి ,  శిశువు నిర్మాణం అంటే సృష్టి జరుగుతూ ఉంటుంది. గర్భాశయం లో. ఈ  శిశు నిర్మాణం ముఖ్యం గా తోలి మూడు నుంచి ఆరు మాసాలలో ఎక్కువ గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ దశలో శిశువుకు అవయవాలు ఏర్పడడం, అంటే గుండె, రక్తనాళాలు, మెదడు , నాడీ మండలం ఏర్పడడం,  జరుగుతాయి. శిశు నిర్మాణం దశ దాటాక పెరుగుదల కూడా జరుగుతూ,  నవ మాసాలూ నిండిన తరువాత జననం జరుగుతుంది. అన్ని దశలూ ముఖ్యమైనప్పటికీ, తోలి మూడు మాసాలూ ఇంకా ముఖ్యమైనవి. 
ఈ తోలి మూడు మాసాలలో గర్భవతులు చేయ వలసినది ఏమిటి? :
1. స్పెషలిస్టు డాక్టర్ ను క్రమం తప్పకుండా  సంప్రదించడం.
2. ఫోలిక్ యాసిడ్  టాబ్లెట్ లు క్రమం గా వేసుకోవడం. ఎందుకంటే శిశువు నాడీ మండలం ఆరోగ్య వంతం గా పెరగటానికి,  న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ లు నివారణకు.( గర్భ ధారణ తోలి మాసాలలో , శిశువు నాడీ మండలం ఏర్పడడానికీ , పెరగటానికీ అవసరమయిన ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తల్లి దగ్గర నుంచి తీసుకో బడుతుంది. అందు వల్ల ఈ ఫోలిక్ యాసిడ్ ను తల్లులు ఎక్కువ గా తీసుకుంటూ ఉండాలి. లేక పొతే, తల్లుల లో ఫోలిక్ యాసిడ్  విటమిన్ లోపం కలిగి వారిలో అనీమియా, అంటే రక్త హీనత కలిగించవచ్చు. 
3, రక రకాల ఆరోగ్య పోషక పదార్ధాలు ఉన్న ఆహారం తింటూ ఉండాలి. అంటే  పళ్ళూ , తాజా కూరగాయలూ, ధాన్యం, పప్పు దినుసులు , ముఖ్యం గా పొట్టు తీసి వేయనివి ( ఎందు కంటే పొట్టు లో దేహానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిను లు ఉంటాయి.) మాంసాహారం తినే వారు, చేపలను తింటూ ఉండడం కూడా మంచిదే ! పళ్ళలో కూడా విటమిన్లు ఉంటాయి కదా ! వివిధ రకాల తాజా పళ్ళ ను తింటూ ఉంటే , పండంటి శిశువును కన వచ్చు ! 
4. భారత దేశ గర్భవతులలో  ఇనుము లోపం అంటే ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా చాలా సాధారణం గా ఉంటుంది. ఐరన్ బిళ్ళలు అంటే టాబ్లెట్ లు క్రమం గా తీసుకోవడం కూడా మంచిదే, వైద్య సలహాతో !
5. వీలైనన్ని సార్లు , స్వచ్చ మైన నీరు తాగుతూ ఉండడం చేస్తూ ఉండాలి. కోకు లు, టీలు , కాఫీలు మాని.
6. డాక్టర్ ను సంప్రదించి మీరు ఉండ వలసిన బరువు మాత్రమె ఉండేట్టు చూసుకోవాలి. గర్భ ధారణ సమయం లో అతి గా బరువు పెరగడం కూడా ఆరోగ్య కరం కాదు.
7. మనసు కు అధిక  వత్తిడి కలిగించే పరిస్థితిని దాట వేయాలి, ఎందు కంటే , ఆ వత్తిడి ప్రభావం పెరుగుతున్న శిశువు మీద కూడా పడుతుంది.
8.రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర పోవాలి, గర్భ ధారణ సమయం లో , ప్రతి స్త్రీ .
9. మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా, వాటిని తగిన నియంత్రణ లో ఉంచుకోవాలి, అవసరమైతే డాక్టర్ ను సంప్రదించి.
10. కారులో ప్రయాణించే సమయం లో సీటు బెల్టు ను తప్పనిసరిగా ధరించాలి. ప్రమాద నివారణ కోసం.
మరి గర్భవతులు చేయకూడనివి ఏమైనా ఉన్నాయా ?: 
1. శుభ్రత పాటించడం : అంటే క్రమం గా చేతులు కడుక్కుంటూ ఉండడం, పెంపుడు జంతువులను దగ్గర కు రానీయక పోవడం (  కుక్కలకూ , పిల్లులకూ వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్ లు శిశువుకు ప్రమాదకరం కావచ్చు ), విష పూరిత రసాయనాలు ముట్టుకోక పోవడం, ఎక్స్ రే లకు దూరం గా ఉండడం. తప్పని సరిగా చేయాలి. ( అల్ట్రా సౌండ్  పరీక్ష ఎక్స్ రే  పరీక్ష  కాదు, అందు వల్ల అది సురక్షితమే ! ).
2. స్మోకింగ్ చేయడం,  మద్యం తాగడం , లేదా ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోవడం, శిశువు ఆరోగ్యం ( తమ ఆరోగ్యం ) ముఖ్యమనుకునే స్త్రీలు చేయకూడదు. అట్లా చేస్తే , వాటి పరిణామాలు శిశువునూ , తల్లినీ ప్రభావితం చేయ గలవు.
3. గోరు వెచ్చటి నీటి తో నే స్నానం చేయాలి. చాలా వేడి గా ఉన్న నీటి తో స్నానం చేస్తే ,  గర్భం లో ఉన్న శిశువుకు మంచిది కాదు.  అంతే కాక గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 
%d bloggers like this: