Our Health

Archive for ఆగస్ట్ 1st, 2012|Daily archive page

ప్ర.జ.లు.5. కంప్యూటర్ వాడకం, కళ్ళ జాగ్రత్తలూ !

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 1, 2012 at 7:59 సా.

ప్ర.జ.లు.5. కంప్యూటర్ వాడకం, కళ్ళ జాగ్రత్తలూ ! 

 

ప్రశ్న : కంప్యూటర్ ను ఎక్కువగా వాడుతున్నప్పుడు, కళ్ళ కోసం  తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?:
జవాబు :కంప్యూటర్ తెరను గానీ, వీడియో గేమ్స్ చూస్తున్నప్పుడు కానీ, లేదా స్మార్ట్ ఫోను ను , లేదా ఇతర డిజిటల్ స్క్రీనులు తదేకం గా చూడడం వల్ల,శాశ్వత దృష్టి లోపం ఏమీ ఉండదు. కానీ తదేకం గా స్క్రీను ను చూస్తూ ఉండడం వల్ల , కళ్ళు ఎండి పోవడం అంటే డ్రై నెస్ ఏర్పడడం , లేదా కళ్ళు బాగా అలసి పోయినట్టు అనిపించడం జరుగుతుంది. కొన్ని సమయాలలో , తల తిరిగినట్టు అనిపించదమూ , తల నొప్పులు రావడమూ , మోషన్ సిక్ నెస్ రావడమూ కూడా జరగ వచ్చు. ప్రత్యేకించి త్రీ డీ చిత్రాలు చూస్తున్నప్పుడు ఇట్లా జరగ వచ్చు.  కళ్ళకు తీవ్రమైన అలసట ఈ క్రింది పరిస్థితులలో ఎక్కువ అవవచ్చు:
1. నిద్ర లేమి : మన దేహం లో ప్రతి భాగం మాదిరిగానే కళ్ళకు కూడా తగినంత విశ్రాంతి అవసరం. ఎందుకంటే విశ్రాంతి సమయం లో బాగా పని చేసి ,అలసిపోయిన అతి సున్నితమైన కంటి కండరాలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. అంటే ఆ కండరాలలో ఏర్పడిన మేట బోలైట్ లు అంటే మలిన పదార్ధాలు రక్తం లో కలవడమూ, అంతే కాక , కంటి కండరాలకు రక్త ప్రసరణ సాఫీ గా జరిగి , తగినంత ప్రాణ వాయువు అందడమూ జరుగుతుంది. నిద్ర లేమి వల్ల ఈ క్రియలు అన్నీ అస్తవ్యస్త మవుతాయి. దానితో కళ్ళకు లేదా కంటి రెప్పలకు ఇన్ఫెక్షన్ లు రావడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకించి కాంటాక్ట్ లెన్సులు వాడే వారికి ఈ రిస్కు ఎక్కువగా ఉంటుంది. 
ఒక వేళ మీకు కంప్యూటర్ మీద అతి ముఖ్యమైన పనులు చాలా సమయం చేయ వలసి ఉంటే ,  ఒక క్రమ సమయం లో పవర్ నాప్స్ అంటే కళ్ళకు విశ్రాంతి ఇస్తూ ఉండాలి. శుభ్రమైన గోరు వెచ్చటి నీటిలో తడిపిన నూలు గుడ్డను మూసి ఉంచిన కళ్ళ  మీద పెడుతూ ఉండాలి. ఇంకా అవసరం అనిపిస్తే , చేస్తున్న పని తాత్కాలికం గా ఆపి తగిన విరామం, విశ్రాంతి తీసుకోవడం చేయాలి. 
2. సరిగా అడ్జస్టు కాని కాంటాక్ట్ లెన్సులు వాడే వారిలో కూడా కళ్ళు త్వరగా అలసి పోతాయి:  కాంటాక్ట్ లెన్సులు నిపుణులైన వారి సలహా మీదే వాడాలి. వాటిని శుభ్ర పరచుకునే పద్ధతులను నిరంతరం పాటించాలి. అంతే కాక కాంటాక్ట్ లేన్సులను నిద్ర పోయే సమయం లో ఎప్పుడూ కళ్ళ మీద  ఉంచుకో కూడదు, ఎంత ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్సులు అయినా సరే! ఎందుకంటే కాంటాక్ట్ లెన్సులు ఉన్న కార్నియా కణాలలో రక్త సరఫరా సరిగా జరగదు. దాని వల్ల కార్నియా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుంది, నిద్ర పోయే సమయం లో కూడా వాడితే !  కాంటాక్ట్ లెన్సులు అదే పని గా వాడక, కళ్ళ జోడు ను కూడా మధ్య మధ్య వాడుతూ ఉంటే కళ్ళకు తగిన విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది, కాంటాక్ట్ లెన్సుల నుంచి. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్సులు వాడడం తో కళ్ళు ఎర్ర పడడమో,  అదే పని గా కళ్ళ నుంచి నీరు కారడమో, చూపు మందగించ డమూ , కళ్ళు వాచి పోవడమూ, ఎక్కువ వెలుతురు లో చూడ లేక పోవడమూ, ఈ లక్షణాలు ఏర్పడితే , కాంటాక్ట్ లెన్సులు వాడకుండా  వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా !  
కంప్యూటర్ వల్ల కంటి అలసట ఎందుకు కలుగుతుంది? : 
సామాన్యం గా మన కంటి రెప్పలు నిమిషానికి 18 సార్లు కొట్టుకుంటూ ఉంటాయి. దాని వల్ల కంటి లో ఉండే పలుచని పొరలా ఉన్న ద్రవం మన కటి గుడ్డు కూ కంటి రెప్పలకూ మధ్య లూబ్రికెంట్ లేదా కందెన లా  కదులుతూ , ఉంటుంది. కానీ మనం కంప్యూటర్ ను తదేకం గా చూస్తున్నప్పుడు, అందులో సగం సార్లు అంటే ఎనిమిది, పది సార్లు మాత్రమె కంటి రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయని పరిశీలన వల్ల తెలిసింది. మనం కంపూటర్ తెరకు కనీసం పాతిక అంగుళాలు అంటే యాభై అయిదు సెంటీ మీటర్ ల దూరం నుంచి చూడడం అలవాటు చేసుకోవాలి.  అంతే కాక 20-20-20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ తెర నుంచి దృష్టి మరల్చి కనీసం ఇరవై అడుగుల దూరం లో ఉన్న వస్తువుల వైపు దృష్టి సారించాలి. అదీ ఒక ఇరవై సెకన్ లు మాత్రమె ! అందుకే 20-20-20 ను గుర్తు ఉంచుకోవాలి. ఇంకా సహజం గా చేసే కంటి రెప్పలను కొట్టడం కూడా చేస్తూ ఉండాలి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 
%d bloggers like this: