Our Health

Archive for సెప్టెంబర్, 2012|Monthly archive page

తాత్కాలిక పక్ష వాతం.8. మరి చికిత్స ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 30, 2012 at 10:13 ఉద.

తాత్కాలిక పక్ష వాతం.8. మరి చికిత్స ఏమిటి ? : 

ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోక్ ఒక సారి వస్తే , చికిత్స ఏమిటి?:
జవాబు:  తాత్కాలిక పక్ష వాతం లక్షణాలు ఒక సారి కనిపించ గానే, ముందుగా చేయవలసినది స్పెషలిస్టు డాక్టర్ ద్వారా అవసరమైన పరీక్షలు అన్నీ , అశ్రద్ధ చేయకుండా చేయించు కోవాలి. ఎందుకంటే , నివారణ చర్యలు తీసుకోక పొతే , మళ్ళీ మినీ స్ట్రోకు రావడానికీ , లేదా శాశ్వత పక్ష వాతం రావడానికి కూడా అవకాశాలు హెచ్చు.  మరి  చికిత్సా పద్ధతులు ఏమిటో చూద్దాము. ఇక్కడ మనం తెలుసుకోవలసినది మందుల ద్వారా చికిత్స ఏమిటో అంటే టాబ్లెట్స్  ఏ విధం గా పక్ష వాత నివారణకు ఉపయోగ పడతాయో  తెలుసు కుంటే  క్రమం తప్పకుండా , రోజూ ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలో అవగాహన అవుతుంది.
యాంటీ ప్లేట్లెట్స్ మందులు : మన రక్తం లో ఉండే అనేక కణాలు వివిధ పనులు చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు మనం పీల్చే గాలిలో ఉన్న ప్రాణ వాయువు ను అంటే ఆక్సిజెన్ ను మోసుకుపోయి మన శరీరం లో ప్రతి భాగానికీ చేరవేస్తాయి.అట్లాగే రక్తం గడ్డ కట్టడానికి ప్లేట్ లెట్స్ అనే కణాలు  ఉన్నాయి రక్తం లో. వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే , ఆ కణాలు చిన్న చిన్న ప్లేట్ ల లాగా ఉంటాయి కనుక.  సరే  ఇప్పుడు ఆ కణాల సంగతి ఇప్పుడు ఎందుకంటే ,  తాత్కాలిక పక్ష వాతం వచ్చినపుడు కానీ , శాశ్వత పక్ష వాతం వచ్చినప్పుడు కానీ , మెదడు లో రక్త నాళాల లో  రక్తం గడ్డ కడుతుంది.  మనకు తెలుసుకదా  రక్తం గడ్డ కడితే , ఆ ప్రాంతం అంతా పని చేయ కుండా పోతుంది అని. దానికి నివారణ రక్తం గడ్డ కట్టకుండా చూడడమే !  ప్లేట్ లేట్ లను కనుక రక్తం గడ్డ కట్టించే పనిని చేయకుండా నివారించడానికే మనం మందులు తీసుకోవాలి. ఆ మందులే యాస్పిరిన్ ( aspirin )  ఇంకా డై పిరడమాల్ ( dipyridamol ). ఈ రెండూ (  సామాన్యం గా ఏదో ఒకటి వేసుకోవాలి ) చాలా ముఖ్యమైన టాబ్లెట్స్.
( పైన ఉన్న చిత్రం చూడండి ) వీటిని క్రమం తప్పకుండా వేసుకుంటే , తాత్కాలిక పక్ష వాతమే కాకుండా , శాశ్వత పక్ష వాతాన్ని కూడా నివారించు కోవచ్చు.అనేక పరిశోధనల వల్ల ఇరవై అయిదు శాతం వీటిని తగ్గించుకోవచ్చు అని తెలిసింది. అంతే కాక ఈ టాబ్లెట్స్ గుండె పోటును అంటే హార్ట్ ఎటాక్ ను కూడా తగ్గిస్తాయని తెలిసింది. క్లోపి డోగ్రెల్  
( clopidogrel  )ఇంకా వార్ఫారిన్ ( warfarin )   అనే మందులు కూడా ఇంచు మించు ఇట్లాగే పని చేసి  పక్ష వాతాన్ని నివారిస్తాయి. కొన్ని పరిస్థితులలో, మెదడుకు సరఫరా చేసే రక్త ధమనులు రెండు మెడలో ఉంటాయి. వీటిని  కేరాటిడ్ ధమనులు అంటారు, వీటిలో పేరుకున్న కొవ్వు ను కూడా ఆపరేషన్ ద్వారా తీసి వేసి పక్ష వాతాన్ని నివారించ వచ్చు. 
ఇప్పుడు మనకందరికీ స్పష్టం గా అవగాహన అయింది కదా , పక్ష వాత నివారణకు మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే ఎంత గా ఉపయోగ పడతాయో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తాత్కాలిక పక్ష వాతం. 7. ఏ ఏ పరీక్షలు ఎందుకోసం ?:

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 29, 2012 at 5:47 సా.

తాత్కాలిక పక్ష వాతం. 7. ఏ ఏ పరీక్షలు ఎందుకోసం ?: 

ప్రశ్న: మినీ స్ట్రోకు లేదా తాత్కాలిక పక్ష వాతం వస్తే , మళ్ళీ త్వరగానే పోతుంది కదా, అంటే ఇరవై నాలుగు గంటలలోపే , ఆ లక్షణాలు మాయ మవుతాయి కదా , మరి  పరిక్షలు ఎందుకు చేయించుకోవాలి ? 
జవాబు:  మంచి ప్రశ్న. చాలా వరకు ఈ మినీ స్ట్రోకు లు  చాలా తక్కువ సమయం వాటి లక్షణాలను చూపిస్తాయి. అతి జాగ్రత్తగా అప్రమత్తత  తో ఉంటే తప్పితే ,ఈ లక్షణాలను గమనించడం కష్టం. మనం క్రితం టపాలో తెలుసు కున్నట్టు ,  ‘ ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది ‘ అని ముందు ముందు రాబోయే జడి వానకు కానీ , తుఫాను కు కానీ హెచ్చరిక ఎట్లా చేస్తారో ఆ విధం గానే , మన జీవితాలలో ఈ మినీ స్ట్రోకు లు ముందు ముందు రాబోయే పక్ష వాతానికి  సూచనలు. మరి మనం ఈ సూచనలను అశ్రద్ధ చేయగలమా ?! 
మరి ఏ పరీక్షలు ఎందుకోసమో తెలుసుకుందాం ఇప్పుడు.
1. రక్త పరీక్షలు : 
రక్త పరీక్షలలో ముఖ్య మైనవి, 
a. రక్త పీడనం లేదా బీపీ  కనుక్కోవడం : ఇది తెలుసుకోవడం ఎందుకంటే, అధిక రక్త పీడనం ఉండి, దానిని నియంత్రణ లో ఉంచుకోక పొతే , వారికి మినీ స్ట్రోకు లూ , లేదా పక్ష వాతాలూ వచ్చే అవకాశం హెచ్చు.
b. రక్తం లో కొలెస్ట రాలు ఎంత ఉందొ కనుక్కోవడం: ఎందుకంటే  రక్తం లో కొలెస్ట రాల్ అధికం గా ఉన్న వారికి పక్ష వాతం వచ్చే అవకాశం హెచ్చు. 
c. రక్తం గడ్డ కట్టడం సరిగా ఉందొ లేదో కనుక్కోవడం : ఎందుకంటే  మన శరీరం లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువ గా ఉన్నప్పుడు కూడా  పక్ష వాతమూ , లేదా తాత్కాలిక పక్ష వాతమూ రావడానికి అవకాశాలు ఎక్కువ.
d.రక్తం లో షుగర్ ఎక్కువ గా ఉందా లేదా అని కనుక్కోవడం:  ఎందుకంటే  మధుమేహం ఉండి , అది నియంత్రణ అంటే కంట్రోలు లో లేనప్పుడు కూడా  ఆ పరిణామాలు పక్ష వాతానికి దారి తీయ వచ్చు. 
2. ఈ సి జీ : అంటే ఎలెక్ట్రో  కార్డియో గ్రామ్ : ఎందు కంటే , మన హృదయం లేదా గుండె లయ బద్ధం గా కొట్టుకుంటూ ఉంటే  రక్తం కూడా సవ్యం గా ప్రవహిస్తూ ఉంటుంది. అట్లా కాక, లయ తప్పితే , లేదా అప సవ్యం గా కొట్టుకుంటూ ఉంటే , చిన్న చిన్న రక్తపు గడ్డలు గుండె లో ఏర్పడి అవి రక్త నాళాల ద్వారా  మెదడు లోకి ప్రవహించి ( అంటే రక్తం తో పాటుగా ) అక్కడ ఉన్న చిన్న చిన్న రక్త నాళాల లో ఇరుక్కు పోయి , పక్ష వాతానికి , లేదా తాత్కాలిక పక్ష వాతానికీ కారణ మవుతాయి. 
3. స్కానింగ్ :  a, b  స్కాన్ లు ఎందుకంటే, అవి మెదడు లో పక్షవాతం వల్ల వచ్చే మార్పులను తెలియ చేస్తాయి. అల్ట్రా సౌండ్ స్కాన్ గురించి మనం క్రితం టపాలో పటం సహాయం తో కూడా తెలుసుకున్నాం కదా. అట్లాగే ఎకో కార్డియో గ్రామ్ గుండె కండరాలనూ , కవాటాలనూ పరీక్ష చేసి , అవి సరిగా ఉన్నాయో లేదో , వాటిలో రక్త ప్రవాహం సరిగా ఉందొ లేదో కూడా తెలియ చేస్తుంది. 
a. సీ టీ స్కాన్ 
b. ఎం ఆర్ ఐ స్కాన్ 
c. అల్ట్రా సౌండ్ స్కాన్ 
4.ఎకో కార్డియో గ్రామ్. 
5. ఎక్స్ రే : ఎందుకంటే మన శరీరం లో మిగతా సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. 
ఇప్పుడు మనం ఏ పరీక్షను  కాదనగలం మన ఆరోగ్యం కోసం ?
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పక్ష వాతం. 6.( T.I.A. ). తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 27, 2012 at 7:52 సా.

పక్ష వాతం. 6.( T.I.A. ). తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ?: 

 
ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ? దానిని  పట్టించుకోక పొతే పరవాలేదా? 
జవాబు: తాత్కాలిక పక్ష వాతం అంటే  పక్ష వాత లక్షణాలు కొన్ని మాత్రమే వచ్చి , మళ్ళీ రమారమి ఇరవై నాలుగు గంటలలో , ఆ లక్షణాలు అన్నీ పూర్తిగా మటుమాయం అవుతాయి. ఇది వినటానికి విడ్డూరం గా ఉంది కానీ యదార్ధం. దీనిని ఇంగ్లీషు లో ట్రాన్సి ఎంట్ ఇస్కీమిక్ ఎటాక్ అనీ , లేదా క్లుప్తం గా టీ ఐ ఏ అనీ అంటారు.  దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఇంగ్లీషులో. టీ ఐ ఏ ను మినీ స్ట్రోక్  ( mini stroke ) అని కూడా అంటారు.  ఈ తాత్కాలిక పక్ష వాతం , పెద్ద కధ లో పిట్ట కధ లాగా , పక్ష వాతం  కధలో ఒక ముఖ్యమైన  చిన్న కధ ఇది.  ఈ తాత్కాలిక పక్ష వాతం కధ ను మనం పూర్తిగా నూ శ్రద్ధ గానూ అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. 
ప్రశ్న: టీ ఐ ఏ , లేదా తాత్కాలిక పక్ష వాతాన్ని పట్టించుకోక పొతే ఏమవుతుంది?
జవాబు: ఈ తాత్కాలిక పక్ష వాతం వచ్చిన ప్రతి పది మంది లో ఒకరికి ,  నాలుగు వారాలలో గా మళ్ళీ వస్తుంది పక్ష వాతం. కానీ ఈ మళ్ళీ వచ్చే పక్ష వాతం , తాత్కాలికం కాదు. దాని తీవ్రత ఎక్కువ గా ఉండడం వల్ల ,  ఆ పక్ష వాతం లక్షణాలు మటు మాయం అవ్వవు కదా శాశ్వతం గా ఉంటాయి.  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ  తాత్కాలిక పక్ష వాతం కేవలం ముందు ముందు ( అంటే  నాలుగు వారాల లో గా ) ఉధృతం గా వచ్చే పక్ష వాతానికి సూచన !. దీని లక్షణాలు కనిపించిన వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించి అవసరమైన  పరీక్షలూ , చికిత్సలూ చేయించు కోవాలి. సాధారణం గా అందరూ అనుకునేది ,  ఆ లక్షణాలు కొంత సమయమే ఉన్నాయి కదా , మళ్ళీ మనిషి మామూలు గా మాట్లాడ గలుగు తున్న్డాడు, చేయి, కాలు ఊప గలుగుతున్నాడు, అంతే కాక మామూలు గా నడుస్తునాడు కదా, ఎందుకొచ్చిన తిప్పలు , ఇంటికి తీసుకు వెళదాం , పరీక్షలకూ , హాస్పిటల్ కూ ఖర్చులు తడిసి మోపెడవుతాయి ‘ అనుకుంటూ  వాస్తవం గ్రహించక , ఇంటికి తీసుకు వెళ్లి అశ్రద్ధ చేస్తారు. అట్లా ఎంత మాత్రమూ చేయ కూడదు.  అట్లా చేస్తే వారికి  మళ్ళీ రావడానికి  పక్ష వాతం పొంచి ఉంటుందని  తెలుసుకోవాలి. 
ప్రశ్న:మరి ఈ తాత్కాలిక పక్ష వాతానికి సూచనలు ఏమిటి ?
జవాబు:  తాత్కాలిక పక్ష వాతం లేదా టీ ఐ ఏ  వస్తే , దాని లక్షణాలు కూడా పక్ష వాతం సూచనలలాగానే ఉంటాయి. అంటే  మనం క్రితం గుర్తు ఉంచుకునట్టు,  F.A.S.T. ( మునుపటి టపాల లో చూడండి దీని వివరాల కోసం ) కాక పొతే ఈ లక్షణాలు, లేదా సూచనలు, మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టు , ఇరవై నాలుగు గంటలలోగా మటు మాయ మవుతాయి. అంతే కాక ఈ ఇరవై నాలుగు గంటలలో  ఈ లక్షణాలు కూడా ఎక్కువ ఉధృతం గా ఉండవు. కానీ , ఒక చేయి ఆకస్మికం గా  తిమ్మిరి ఎక్కి నట్టు అనిపించ డమో , లేదా  మాట తడ బడటమో , నడుస్తున్నప్పుడు కాలు ఆకస్మికం గా బలహీనమయి నడవలేక పోవడమో, లేదా నుంచో వాలని ప్రయత్నిస్తే , బాలన్స్ తప్పి పోతూ ఉండడమో కూడా జరగ వచ్చు.  అకస్మాత్తు గా దృష్టి మందగించడం , లేదా , భోజనం చేస్తూ ఉన్నప్పుడు ,  మింగ లేక పోవడం ,  కళ్ళు తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు. 
ఉత్సాహం ఉన్న వారందరూ ఈ క్రింది  వీడియో కూడా చూడ వచ్చు. ( ఇంగ్లీషులో ఉంది కానీ సరళం గా నే ఉంది భాష  అర్ధ మయే లాగా ! ) 
 
ప్రశ్న: మరి ఈ తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోకు కు కారణాలు ఏమిటి ? 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం ! 

పక్ష వాతం.5.మరి ఎట్లా కనుక్కోవచ్చు? .

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 24, 2012 at 10:57 ఉద.

పక్ష వాతం.5.మరి ఎట్లా కనుక్కోవచ్చు? .

ప్రశ్న:  మనం పక్ష వాతం సూచనలూ , కారణాలూ  తెలుసుకున్నాం కదా ! మరి పక్ష వాతం  వచ్చినట్టు ఎట్లా కనుక్కోవడం జరుగుతుంది.
జవాబు: పక్ష వాతం ( stroke ) అనగానే మనకందరికీ స్మరణ కు వచ్చేది , చేయి , లేదా కాలు బలహీన పడి పోయిన వారో , లేదా మాట పోయిన వారో గుర్తుకు వస్తారు. 
కానీ పక్ష వాతం తీవ్రత చాలా రకాలు గా ఉంటుంది. అంటే  కొద్ది గా వస్తే , మెదడు లో కొద్ది మార్పులు జరుగుతాయి. అందుకు తగినట్టుగా  శరీరం లో కండరాల బలహీనత కూడా కొద్ది మాత్రం గా ఉంటుంది. కానీ అదే పక్షవాతం తీవ్రం గా వస్తే , మెదడులో మార్పులు కూడా తీవ్రం గా ఉండి, బలహీనత కూడా ఎక్కువ కండరాలలో కనిపిస్తుంది.  
ప్రశ్న: కొద్ది మార్పులు వస్తే , మరి  పక్ష వాతం వచ్చిందో , లేదో తెలుసుకోవడం ఎందుకు ? దాని వల్ల ప్రయోజనం ఏమిటి ? 
జవాబు:  ఇక్కడే  అందరూ గమనించ వలసిన విషయం ఉంది. పక్ష వాతం కొద్ది గా వచ్చినా , తీవ్రం గా వచ్చినా , తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే , పక్ష వాతానికి కారణాలు, ఒకటి కానీ , ఒకటి కన్నా ఎక్కువ కానీ శరీరం లో ఉన్నట్టే కదా ! 
అంతే కాక , ఒక సారి పక్ష వాతం కనుక వస్తే , ‘ మిమ్మల్ని ఎప్పుడూ ఇక ఇబ్బంది పెట్టాను , మీ నుంచి శాశ్వతం గా శలవు తీసుకుంటాను ‘ అని పక్ష వాతం అనుకోదు. పక్ష వాతానికి అనుకూలమైన వాతావరణం అంటే కారణాలు మనలో ఉన్నంత కాలం, పక్ష వాతం మళ్ళీ మళ్ళీ వచ్చే రిస్కు కూడా ఉంటుంది. అందు వల్లనే , ఒక సారి ఆ సూచనలు  వచ్చినా, గమనించినా , వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు అంటే ఇన్వెస్టిగే షన్స్  చేయించుకుని , తగిన చికిత్స కూడా చేయించు కోవాలి. అప్పుడు పక్ష వాతం రాకుండా నివారించు కోవచ్చు.
ప్రశ్న: మరి ఏ ఏ పరీక్షలు అవసరమవుతాయి?: 
జవాబు: నిపుణుడైన డాక్టరు మొదట గా చేయవలసిన పరీక్ష  మీ బీ పీ , అంటే రక్త పీడనం కనుక్కోవడం. అట్లాగే మీకు షుగర్ ఉందొ లేదో తెలుసుకోవడం, అంటే మధు మేహం వ్యాధి. అట్లాగే మీ నాడి పరీక్ష చేసి , మీ పల్స్ సవ్యం గా ఉందొ లేక అప సవ్యం గా ఉందొ తెలుసుకోవడం , అవసరమైతే ఈ సి జీ పరీక్ష కూడా చేయడం. ఇందులో ఏవి చేయక పోయినా , రిస్కు ఫాక్టర్ లను  అశ్రద్ధ చేయడమే అవుతుంది.  కాబట్టి మీరు కూడా ‘ ఆ పరీక్షలూ , ఈ పరీక్షలూ అంటూ  వాయించేస్తారు డాక్టర్లు ‘ అని అనుకోకూడదు మరి ! 
ఈ మొదటి దశలో కనుక్కొన్న ఫలితాలను బట్టి మిగతా పరీక్షలు కూడా చేయించుకో వలసిన అవసరం ఉంటుంది.  మిగతా పరీక్షలు క్రింద పేర్కొనడం జరిగింది. 
1. CT scan.
2. MRI scan.
3. Swallow test.
4. Ultra sound ( Carotid ultra sonography )test.
5. Catheter angiogram or arteriography.
5. Echo cardiography.
క్రింద ఉన్న వీడియో లో సంక్షిప్తం గా పక్ష వాతాన్ని వెంటనే కనుక్కుంటే ఏ విధం గా చికిత్స చేయ వచ్చో తెలుప బడింది. చూడండి. ( ఆంగ్లం లో ఉంది )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పక్ష వాతం ( stroke ).4. రకాలూ , కారణాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 22, 2012 at 5:26 సా.

పక్ష వాతం ( stroke ).4. రకాలూ , కారణాలూ ! 

క్రితం టపాలో మనం సర్వ సాధారణం గా వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా  మెదడు లో రక్త లోపం తో వచ్చే పక్ష వాతం గురించీ , వాటిని నివారించడం లో మానవుల జీవనశైలి లో మార్పుల గురించీ తెలుసుకున్నాం కదా ! 
ఇప్పుడు రెండవ కారణమైన హెమరేజిక్ స్ట్రోక్ లేదా రక్త స్రావం వల్ల వచ్చే స్ట్రోక్ లేదా పక్ష వాతం గురించి తెలుసుకుందాం !
హెమరేజిక్ స్ట్రోక్ ను సెరిబ్రల్ హేమరేజ్  లేదా ఇంట్రా క్రేనియల్ హేమరేజ్ అని కూడా అంటారు.  సెరిబ్రల్ హేమరేజ్ అంటే మెదడు లో కలిగే రక్త స్రావం లేదా ఇంట్రా సెరిబ్రల్ హేమరేజ్ అంటే కూడా మెదడు లోపలి భాగాలలో కలిగే రక్త స్రావం అన్న మాట. 
ప్రశ్న : దీనికి కారణాలు ఏమిటి ? : 
జవాబు: మెదడు లో రక్త స్రావానికి ప్రధాన కారణం  అధిక రక్త పీడనం లేదా హై బీ పీ.  ఈ అధిక రక్త పీడనం వల్ల , అతి సున్నితమైన రక్తనాళాలు మెదడు లో ఉండేవి ,  ఈ రక్త నాళాలు చిట్లి పోవడం జరుగుతుంది. ఇట్లా రక్తనాళాలు చిట్లడం వల్ల ,  మెదడులో రక్త స్రావం అవుతుంది. అంటే బ్లీడింగ్. ఇట్లా బ్లీడింగ్ అవడం వల్ల , ఆ యా ప్రాంతాలలో మెదడు పనిచేయడం ఆగి పోతుంది.   
ప్రశ్న : మరి హై బీ పీ కి కారణాలు ఏమిటి ? 
 
జవాబు : 1. ఊబ కాయం లేదా ఓబీ సిటీ 
               2. వ్యాయామం లేక పోవడం లేదా చాలా తక్కువ గా ఉండడం.
               3. స్మోకింగ్ 
               4. అతి గా మద్యం సేవించడం.
పైన ఉన్న కారణాలు  మనం జాగ్రత్త గా గమనించి నట్లయితే ,  రెండు ,  నాలుగు  కారణాలు ఒకటో కారణాన్ని ప్రభావితం చేస్తాయి.  ఒకటీ , మూడు కారణాలు అధిక రక్త పీడనాన్ని కలిగిస్తాయి.  
 జీవితం ఎప్పుడూ ఆందోళన మయం గా ఉంటే , తీవ్రమైన మానసిక వత్తిడి ఏర్పడుతుంది. తీవ్రమైన మానసిక వత్తిడి తో ఎక్కువ కాలం, అంటే రోజులో ఎక్కువ భాగం తో పాటుగా , ఎక్కువ సంవత్సరాలు కూడా వత్తిడి ఉంటే , దాని ప్రభావం అధిక రక్త పీడనం గా చూప వచ్చు. 
ఈ అధిక రక్త పీడనం , పైన చెప్పిన ఏ కారణాల వల్ల నైతే నేమి ?  , మెదడు లోని అతి సున్నితమైన రక్త నాళాల ను చిట్లించి ,  పక్ష వాతానికి హేతువు అవుతుంది. 
అరుదు గా కొందరికి పుట్టుక తో వచ్చిన లోపాల వల్ల మెదడు లో రక్త నాళాలు కొన్ని బలహీనమైన వి గా ఉంటాయి. ( వీటిని ఆంగ్లం లో సెరిబ్రల్ ఎన్యురిజం అంటారు )  అందువల్ల వారి రక్త పీడనం లో ఏమాత్రం హెచ్చు తగ్గులు ఏర్పడినా , అవి తట్టుకోలేక చిట్లి పోతాయి. ఈ పరిస్తితి , అరుదుగా  వయసులో ఉన్న యువతీ యువకుల కు కూడా ఎర్పడ వచ్చు 
పైన ఉన్న చిత్రం చూడండి. ఇంకా ఆసక్తి ఉంటే , క్రింద ఉన్న వీడియో కూడా చూడండి. సందేహాలు ఉంటే తెలియ చేయండి. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

పక్ష వాతం. 3.రకాలు – కారణాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 20, 2012 at 8:56 సా.

పక్ష వాతం. 3..రకాలు – కారణాలూ ! 

మనం క్రితం టపాలో పక్ష వాతం ( stroke ) సూచనలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు పక్ష వాతం లో రకాలు , వాటి కారణాలూ చూద్దాము. 
ముఖ్యం గా పక్ష వాతం , రక్త లోపం వల్ల వచ్చే రకం ఒకటీ , రక్త స్రావం వల్ల వచ్చే రకం ఒకటీ గా మనం చెప్పు కోవచ్చు. 
1. రక్త లోపం వల్ల వచ్చే రకం. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ ( ischeamic stroke )  అని అంటారు.  ఈ రకం సర్వ సాధారణమైన పక్ష వాతం. రక్త లోపం అంటే మన శరీరం లో రక్త లోపం అని అర్ధం చేసుకో కూడదు. ఇక్కడ రక్త లోపం అంటే  మెదడు లో రక్త లోపం అని మననం చేసుకోవాలి.ఇది సర్వ సాధారణం గా రక్త నాళాలలో ప్లాక్  లేదా పెచ్చు ఏర్పడి తదనంతరం ఆ ప్రదేశాలలో రక్తం గడ్డ కడుతుంది. అంటే రక్తం క్లాట్ అవుతుంది.   ఒక ఉదాహరణ: రక్తనాళం ఒక అయిదు సెంటీ మీటర్లు ఉందనుకుంటే ,  ఆ రక్త నాళం లో మూడు సెంటీ మీటర్ల దూరం లో రక్తం గడ్డ కట్టిందను కొండి. అప్పుడు మిగతా రెండు సెంటీ మీటర్ల రక్తనాళం లో రక్తం ప్రవహించదు. దానితో ఆ రక్త నాళం సరఫరా చేస్తున్న మెదడు భాగం చచ్చి పోతుంది. అంటే ఆ భాగం లో ఉండే మెదడు కణాలు నశిస్తాయి. అప్పుడు  ఆ మెదడు భాగం లో  భాష అంటే లాంగ్వేజ్ సెంటర్ ఉంటే , ఆ సెంటర్ పని చేయక ,  పక్ష వాతం వచ్చిన వారిలో మాట పడి పోతుంది. అట్లాగే చేయి బలహీన పడడం , లేదా కాలు బలహీన పడడం  కూడా జరుగుతుంది.  మనం గమనించ వలసినది ఏమిటంటే , మెదడు అంతా , మన దేహం లో వివిధ అవయవాలకు కీలక స్థానాలు ఉంటాయి ఈ విధం గా . ఏ కీలక స్థాన మైతే , రక్త లోపం వల్ల పనిచేయదో , ఆ కీలక స్థానం కంట్రోలు చేసే అవయవాలు కూడా పని చేయడం మానేస్తాయి. మరి ఇట్లా రక్త నాళాల లో రక్తం గడ్డ కట్టడం ఎందుకు జరుగుతుంది? ఇది దైవాదీనమా , మన ప్రమేయం ఉందా దీనిలో ? :ఇక్కడే మానవులు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి.
1.స్మోకింగ్ 
2. అధిక రక్త పీడనం.
3. ఊబ కాయం లేదా ఓబీ సిటీ .
4. హై కొలెస్టరాల్  కలిగి ఉంటే 
5. అధిక మద్య పానం .
పైన ఉన్న అయిదు కారణాలూ  రక్త నాళాల లో పెచ్చులు ఏర్పడడానికి కారణ భూతమవుతాయి.  ఇక్కడ గమనించ వలసిన విషయం ఇంకోటి ఉంది.  1,3,4,5, కారణాలు 2 వ కారణానికి ప్రత్యక్షం గానో పరోక్షం గానో కారణ మవుతాయి. ఆ తరువాత రక్త నాళాల లో ప్లాక్ ఏర్పడడం ,  రక్తం గడ్డ కట్టడం సహజం గా జరిగే పరిణామాలు. ఈ కారణాలు అన్నీ కూడా మానవుల స్వయం క్రుతాలే  కదా  ! మరి ఇక్క్డడ మనం దైవాన్ని నిందించడం  ఎంతవరకు సమంజసం ?!! 
మన ఆసియా వాసులకు ఇంకో రిస్కు ఫాక్టర్ కూడా తోడవుతుంది  కర్ణుడి చావు కు పడి వేల కారణాలు అన్న చందాన , కంట్రోలు లో లేని మధుమేహ వ్యాధి కూడా  రక్త నాళాల లో మార్పులు అధికం చేస్తుంది. 
అంతే కాక  ఏ కారణం చేతనైనా గుండె అప సవ్యం గా కొట్టుకుంటూ ఉంటే కూడా , రక్తం చిన్న చిన్న క్లాట్ లు గా ఏర్పడి , మెదడులో ని రక్తనాళాలకు చేరుకొని వాటిని పూడ్చి వేయడం జరుగుతుంది. 
పైన ఉన్న చిత్రం చూడండి వివరాలకోసం. ఇంకా ఉత్సాహం ఉన్న వారు , ఈ క్రింద ఉన్న వీడియో చూడండి , అత్భుతం గా చిత్రీకరించ బడింది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు. 2 . పక్ష వాతం నివారణ మానవ సాధ్యమేనా ? అంతా దైవాదీనమా ?.

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 18, 2012 at 7:38 సా.

ప్ర.జ.లు. 2 . పక్ష వాతం నివారణ మానవ సాధ్యమేనా ? అంతా దైవాదీనమా ?.

ప్రశ్న : క్రితం టపాలో పక్ష వాతం సూచనలు తెలుసుకున్నాము కదా ! మరి  పక్ష వాతం నివారణ కు మానవ ప్రయత్నం ఏమైనా  అవసరమా? లేక అంతా దైవాధీనమా ?! 
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.  పక్ష వాతానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ కారణాలు మనం తెలుసుకుంటే , వాటిని నివారించు కోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వ కాలం లో లాగా కాక , ఆధునిక వైద్య శాస్త్రం  లో జరుగుతున్న అనేక పరిశోధనలూ, పరిశీలనల వల్ల పక్ష వాతానికి కారణాలు వెలుగులోకి వచ్చాయి.  
ప్రశ్న:  పక్ష వాతం గురించి కేవలం వయసు మీరిన వారు తెలుసుకుంటే సరిపోతుందా ? యువత కు ఎందుకు ఈ వెతలు ? :
జవాబు : అనేక కారణాల వల్ల పక్ష వాతం , వయసు మీరిన వారితో పాటు వయసులో ఉన్న వారి కి కూడా వస్తూ ఉందని , భారత దేశం లో వివిధ పట్టణాలలో చేసిన పరిశీలనల వల్ల తెలిసింది. అంతే కాక , పక్ష వాతం రాకుండా ముందు జాగ్రత్తలు ఏళ్ల తరబడి తీసుకుంటూ ఉంటేనే , ఒక్క సారి గా , ఆకస్మికం గా వచ్చే పక్ష వాతం రాకుండా ఉండడానికి అవకాశం హెచ్చుతుంది. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , బాల్యం లో , యవ్వనం లో యువత తీసుకునే ఆరోగ్య పరమైన జాగ్రత్తలూ , అలవాట్లూ ,  భవిష్యత్తులో వారికి వయసు మీరుతూ ఉన్నప్పుడు , వారిని ప్రభావితం చేస్తాయి, పాజిటివ్ గా కానీ , నెగెటివ్ గా కానీ , అంటే , వారి ఆరోగ్యాన్ని  పెంపొందించేవి గా కానీ , లేదా వారి ఆరోగ్యానికి హాని చేసేవి గా కానీ !  అందువల్ల , వయసు మీరిన వారితో పాటుగా , వయసు లో ఉన్న వారు కూడా అతి జాగ్రత్త గా   గ్రహించ వలసిన విషయాలు ఉన్నాయి ,  వారి ఆరోగ్యం కోసం ! 
పక్ష వాతానికి కొన్ని రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్నాయి.  ఆ రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్న వారిలో పక్ష వాతం రావడానికి అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే వారికి , ఆ రిస్కు ఫ్యాక్టర్ లు లేని వారితో పోలిస్తే , పక్ష వాతం వచ్చే అవకాశాలు ఉంటాయి , అంతే కానీ , వారికి తప్పనిసరిగా వస్తుందని అర్ధం చేసుకో కూడదు. 
 
ఆ రిస్కు ఫ్యాక్టర్ లు ఏమిటో చూద్దాము ఇప్పుడు .
1. వయసు  65  ఏళ్ళు  దాటిన వారిలో .
2. కుటుంబం లో , తల్లి దండ్రులు , తాత , సహోదరులు వీరిలో ఎవరికి పక్ష వాతం వచ్చి ఉన్నా , మిగతా కుటుంబ సభ్యులలో ఆ అవకాశం ఉంటుంది. 
3. ఆసియా వాసులలోనూ , ఆఫ్రికా , కరీబియన్ వాసులలోనూ పక్ష వాతం వచ్చే అవకాశాలు మెండు. దీనికి కారణం , వారికి ఉండే రక్త పీడనం , ఇంకా మధు మేహం లాంటి జబ్బుల వల్లనే అని భావించ పడుతుంది. 
4. అంతకు ముందే , గుండె పోటు కానీ ,  TIA  కానీ వచ్చిన వారికీ , ఇంకా అంతకు ముందు కొద్ది తీవ్రత తో పక్ష వాతం వస్తే కానీ , వారికి మళ్ళీ పక్ష వాతం వచ్చే అవకాశం హెచ్చుతుంది. 
పైన ఉదాహరించిన కారణాలను మార్చ లేము కదా అందువల్ల   మిగతా కారణాలను మనం వివరం గా తెలుసుకుంటే , వాటిని మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ. తద్వారా పక్ష వాతాన్ని చాలా వరకూ నివారించు కోవచ్చు. 
 
వచ్చే టపాలో పక్ష వాతం లో రకాలు , వాటి గురించీ తెలుసుకుందాము ! 
 

పక్ష వాతం లేదా స్ట్రోకు ( stroke ) సూచనలు.

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 17, 2012 at 7:58 సా.

పక్ష వాతం లేదా స్ట్రోకు ( stroke ) సూచనలు.


F.A.S.T.
ప్రశ్న : పక్ష వాతాన్ని ఎట్లా గుర్తు పట్ట వచ్చు ?
జవాబు : పక్ష వాతం, దీనినే స్ట్రోకు stroke అని కూడా అంటారు. ఆధునిక జీవన శైలి వల్లా , ఆహారపు అలవాట్ల వల్లా , పక్ష వాతం చాలా ఎక్కువ గా మానవులను బాధిస్తూ ఉంది. దీనిని ఎంత త్వర గా కనుక్కుంటే , అంత త్వరగా వైద్య సహాయం అందించి , శాశ్వతం గా పక్ష వాతం వల్ల దేహం లో వచ్చే మార్పులను నివారించడమే కాకుండా , వాటి తీవ్రతను కూడా తక్కువ చేయ వచ్చు. పక్ష వాతం వచ్చిన మొదటి గంట లో , దానిని గుర్తు పట్టి , వైద్య సహాయం అందిస్తే , మరణాలను కూడా నివారించ వచ్చు.
ప్రశ్న : ప్ర ప్రధమం గా కనిపించే సూచనలు ఏమిటి ?
జవాబు :
1. అకస్మాత్తు గా దేహం లో ఒక సగ భాగం కానీ , చేయి , కాలు , కానీ ,ముఖం కానీ మొద్దు బారటం
2. అకస్మాత్తు గా తిక మక పడడం ( confusion ) మాట తడ బడడం , లేదా మాట రాక పోవడం , లేదా ఎదుటి వారు మాట్లాడుతున్నది అర్ధం చేసుకోలేక పోవడం.
3. ఆకస్మికం గా ఒక కంటి లో కానీ రెండు కళ్ళ లో కానీ చూపు పోవడం లేదా చూపు చాలా మందగించడం.
4. ఆకస్మికం గా కళ్ళు తిరగడం , సరిగా నడవలేక పోవడం, లేదా నడిచే సమయం లో బ్యాలెన్స్ కోల్పోయి , పడ బోవడం లేదా పడడం.
5. ఆకస్మికం గా, అకారణం గా తీవ్రం గా తలనొప్పి రావడం.
పైన చెప్పిన మార్పులు , చాలా పరిశీలన చేస్తే కానీ సామాన్య జనానీకానికి అవగాహన ఉండదు.
తరువాత వచ్చే మార్పులు ఈ క్రింది విధం గా ఉంటాయి.
బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్విస్ వారు ఒక వీడియో ప్రకటన తయారు చేశారు. దాని ప్రకారం
ఫాస్ట్ అనే పదం గుర్తు ఉంచుకోండి. ఫాస్ట్ అంటే తెలుగు లో వేగం అని అర్ధం కదా ! దీని వివరాలు చూద్దాము. ఇది చదివిన తరువాత మీరు పైన ఉన్న వీడియో కూడా చూడండి.
సూచనలు సరిగా అర్ధం అవడం కోసం.
F.A.S.T.
F అంటే FACE. :అకస్మాత్తు గా ముఖం ఒక ప్రక్కకు లాగి నట్టు అవడం.
A అంటే ARMS. : ఒకటి కానీ రెండూ కానీ చేతులు శక్తి హీనం అయి పోవడం లేదా బలహీన పడి లేవ నెత్త లేక పోవడం.
S అంటే SPEECH.: మాట తడబడడం లేదా పూర్తి గా మాట పడి పోవడం, లేదా అర్ధం కాకుండా మాట్లాడడం.
T అంటే TIME . పైన ఉన్న లక్షణాలు ఎవరిలోనైనా గమనిస్తే వెంటనే కాల యాపన చేయకుండా , ఎమర్జెన్సీ వార్డు కు తీసుకు వెళ్ళాలి, తగిన చికిత్స కోసం.

వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.

ప్ర.జ.లు. 5. మరి హ్యాండ్ షేకుల మాటేంటి ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 16, 2012 at 3:35 సా.

 ప్ర.జ.లు. 5. మరి హ్యాండ్ షేకుల  మాటేంటి ?

మనం హగ్గు ల సంగతులు చాలా వరకు తెలుసుకున్నాం కదా ! మరి హ్యాండ్ షేకుల మాటేంటి ? 
జవాబు: హ్యాండ్ షేకు కూడా హగ్గు లాగానే , నవీన మానవ సంబంధాల పరంపర లో ఒక ముఖ్యమైన సాధనం. హ్యాండ్ షేకు కు కూడా , హగ్గు లానే , మీరు ఏమీ డబ్బు చెల్లించ నవసరం లేదు. కానీ ఎంతో విలువైన స్నేహాన్నీ , పరిచయలనూ , కేవలం మీరు హ్యాండ్ షేక్ చేయడం ద్వారానే పెంపొందిస్తుంది. కొందరు కరచాలనం అదే హ్యాండ్ షేక్ చేస్తే , వారిలో ఆత్మ విశ్వాసం ఉట్టి పడుతూ ఉంటుంది. మరి కొందరి హ్యాండ్ షేకు , బలహీనం గా , పేలవం గా ఉంటుంది. మరి మంచి హ్యాండ్ షేక్ ఎట్లా చేయాలి ?  ఆ విషయాలు ఇప్పుడు తెలుసు కుందాం !
మనం చాలా తేలిక గా తీసుకునే ఒక సాధారణ కరచాలనం లేదా హ్యాండ్ షేక్  మన గురించి ఎదుటి వారికి చాలా తెలియ చేస్తుంది. చక్కగా చేసిన హ్యాండ్ షేక్ మీలో ఆత్మ విశ్వాసాన్ని ఎదుటి వారికి తెలియ చేసి , వారికి మీపైన ఉన్న అభిప్రాయాన్ని పాజిటివ్ గా మారుస్తుంది. అదే హ్యాండ్ షేక్ మీరు సరిగా చేయక పొతే ,మీ వ్యక్తిత్వాన్ని ఎదుటి వారు డౌట్ చేసేలా లేదా అనుమానాలు వ్యక్తం చేసేలా చేస్తుంది. 
మరి హ్యాండ్ షేక్ ఎట్లా చేయాలి ? : 
1.ఎదుటి వారి తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ,  మీరు మీ కుడి చేతిని , మీరు హ్యాండ్ షేక్ చేయాలను కుంటున్న వారి దిశగా చాచండి.
2. అట్లా చాచుతున్నప్పుడు , మీ చేతిని భూమికి సమాంతరం గా ఉంచండి. మీ కుడి చేతి బొటన వేలు ఆకాశం వైపు ఉంచండి. 
3. ఎదుటి వ్యక్తీ వారి కుడి చేతిని చాచినప్పుడు , దానిని మీ హస్తం తో అందుకోండి.
4. మీ చేతి తో ఎదుటి వారి చేతిని ఫర్మ్ గా నొక్కండి అంటే స్క్వీజ్ చేయడం. అట్లా చేస్తున్నప్పుడు మీ హస్తం తో వారి హస్తాన్ని కొద్దిగా క్రిందకు, అంటే రమారమి రెండు సెంటీ మీటర్లు  క్రిందకు వంచండి.
5.తరువాత  మీ హస్తం లో ఉన్న ఎదుటి వారి హస్తాన్ని వదిలేయండి.
6.ముఖ్యం గా హ్యాండ్ షేక్ చేసిన వెంటనే , మీ హస్తాన్ని , మీ బట్టలకు కానీ , టవల్ కు కానీ తుడవడం మాత్రం చేయకండి. 
మీరు  ఈ హ్యాండ్ షేక్ ను మీ స్నేహితులతో ప్రాక్టిస్ చేసి వారి కామెంట్స్ తెలుసుకోండి. తరువాత జరిగే ఇంటర్వ్యు లలో మీదే విజయం ! 
ఇంకా వివరాలు కావాలంటే పైన ఉన్న వీడియో చూడండి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .4. గట్టిగానా, లేక వదులు గానా ?!

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 15, 2012 at 11:46 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .4. గట్టిగానా, లేక వదులు గానా  ?!

చాలా మంది హగ్గు చేసుకునే సమయం లో ఎంత గట్టిగా ఎదుటి వారిని హత్తుకోవాలో తెలియక తిక మక పడుతూ ఉంటారు. కొందరు ఇంకొంచం ముందుకు పోయి  ‘ పట్టు పట్ట రాదు , పట్టి విడువ రాదు ‘ అనే ధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్టు గా , భల్లూకపు పట్టు పట్టి ,ఎంత సేపటికీ వదలరు ! కొందరు పట్టీ పట్టనట్టు పేలవం గా ఎదుటి వారిని హత్తుకొని ‘ ఎందుకు హత్తుకోవలసి వస్తున్నది రా బాబూ ?! అని నోటితో చెప్పకనే చెపుతూ ఉంటారు ఎదుటి వారికి ! 
మరి గట్టి గా, లేక వదులుగా హత్తుకోవడం ఎట్లా నిర్ణయించు కోవాలి ? : 
అతి గట్టిగా హత్తుకోవద్దు:  మీరు హత్తుకునే సమయం లో అంటే హగ్గు చేసుకునే సమయం లో , ఎదుటి వారికే ఈ విషయాన్ని వదిలేయడం ఉత్తమం. వారు కనుక మిమ్మల్ని వదులు గా హత్తుకుంటే మీరు కూడా అదే పని చేయ వచ్చు. అట్లాగే వారు మిమ్మల్ని గట్టిగా హత్తుకుంటే , మీరు కూడా వారిని గట్టి గా హత్తుకోవడం చేయ వచ్చు. కానీ వారికి ఊపిరి ఆడనంత కాదు. మీ హగ్గు వారిని ఉక్కిరి బిక్కిరి చేయ కూడదు ! 
వెంటనే విడవ రాదు : హగ్గు లేక ఆలింగనం , మీరు హగ్గు చేసుకునే వారిని ఎంతగా అభిమానిస్తారో తెలియ చేసే ఉత్తమమైన సాధనం !  అది ఎదుటి వారికి ఒక గొప్ప అనుభూతి ని ఇస్తుంది . అంతే కాక వారి మూడ్స్ ను కూడా లిఫ్ట్ చేస్తుంది అంటే, వారిని ఉత్సాహ పరుస్తుంది. వారిని ఎక్కువ పాజిటివ్ గా మారుస్తుంది. కొన్ని సమయాలలో , ఎదుటి వారు అప్సెట్ అయి ఉన్నప్పుడు కానీ , విచారం గా ఉన్నప్పుడు కానీ , మీరు ఇచ్చే ప్రేమ పూర్వక హగ్గు , ఒక మందులా పని చేస్తుంది. అందువల్ల వారిని హగ్గు చేసుకునే సమయం లో వెంటనే వదిలించు కోవడానికి ప్రయత్నం చేయక , వారు ఎంత సేపు హగ్గు చేసుకుంటే , మీరూ అంత సమయమూ ఆ ఆలింగానాన్ని వదిలించు కోకుండా , వారు ఆ ప్రయత్నం చేసి నప్పుడు, మీరు కూడా వదులు చేస్తూ ఉండడం ఉత్తమం. 
మధ్యే మార్గం : ఎదుటి వారితో మీకు అంతకు ముందు ఏ రకమైన సంబంధం ఉన్నా , మీరు ఒక రెండు మూడు అడుగుల దూరం నుంచే, మీ చేతులు చాచి వారి మధ్య భాగం లో ఉంచి  కొన్ని క్షణాలు  హత్తుకొని వదిలేయడం  సురక్షితమైన పధ్ధతి. 
మీరు గుర్తు ఉంచుకొనే కిటుకులు కొన్ని : 
మీరు హగ్గు చేసుకోవాలని అనుకుంటున్న వారి ని , ఆహ్వానిస్తూ కనిపించండి. ప్రేమ పూర్వకం గా నూ , సుహృద్భావ వాతావరణం లోనూ మీరు కనిపిస్తే ,  ఆ క్షణాలలో  మీరు ఇరువు రే ముఖ్యం అన్న సురక్షితమైన భావన కలుగుతుంది  ఎదుటి వారికి కూడా  ! మీరు (   స్నానం చేసి ) పరిశుభ్రం గా ఉండండి , ( హగ్ చేసుకునే ముందు ). మీరు మీకు ఎవరైనా  అత్యంత పరిశుభ్రం గా  స్నానం చేసి , చెమట వాసన లేని ఉతికిన బట్టలు వేసుకుని , సువాసన లు చిమ్ముతూ ఎవరైనా ఒక వెచ్చని హగ్ ఇస్తే మీరు ఎట్లా అనుభూతి చెందుతారో , అదే అనుభూతి మీరు హగ్ చేసుకోవాలనుకునే వారికి అంద చేయండి , బలమైన మానవ సంబంధాల కోసం ! అట్లాగే నోటిలో ఏ విధమైన ( ఉదా: ఉల్లి పాయలు , వెల్లుల్లి , తిన్న ) వాసన రాకుండా , సిగరెట్ స్మోక్ చేసిన వాసనా రాకుండా  జాగ్రత్తలు తీసుకోండి.
ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అట్లాగే ఎదుటి వారి కదలికలను కూడా గమనిస్తూ ఉండండి. వారు ఎటో వెళుతూ ఉంటే మీరు అటే వెళ్లి వారిని హగ్ చేసుకోవడం  ఇరువురికీ ఇబ్బంది కరం గా ఉంటుంది.
మగ వారి తో చేసే హగ్ సామాన్యం గా వారి వీపును రెండు సార్లు చరిచి విడవ వచ్చు . అదే పని ఆడ వారిని హగ్ చేసుకున్నప్పుడు చేయ కూడదు. 
పప్పులో కాలు ఎప్పుడు వేయకూడదు ? : 
సామాన్యం గా ప్రేమికులతో చేసే హగ్ , స్నేహితులతో చేయకూడదు, ఇది చాలా ఇబ్బంది కరం గా పరిణమించ వచ్చు. ప్రేమికుల హగ్ సామాన్యం గా ఎక్కువ సమయం ఉంటుంది. కానీ స్నేహితుల హగ్ కొన్ని క్షణాలు మాత్రమె తీసుకోవాలి , ఇవ్వాలి. 
మీరు ఎవరినైతే మొదటి సారిగా హత్తుకోవాలని అనుకుంటున్నారో , వారిని ముందుగా అడిగి , వారు అంగీకరిస్తేనే హగ్ చేయండి. అట్లాగే , కొందరికి  కొన్ని సమయాలూ , కొన్ని ప్రదేశాలూ నచ్చక పోవచ్చు మీతో హగ్ చేసుకోవడానికి , ఈ విషయాలు మీరు గమనించాలి. మీరు ఎంత స్వతంత్రం గా ఉండాలనుకుంటూ ఉన్నారో , అట్లాగే వారి స్వతంత్రతనూ గౌరవించడం అలవాటు చేసుకోవాలి.  మీ హగ్గు ను వారి మీద ‘ రుద్ద కూడదు ‘ . వారు  మీలా వారి చేతులు చాచి మీ హగ్ స్వీకరించే ఏ ప్రయత్నమూ చేయక పొతే , మీరు కూడా  మీ ప్రయత్నాన్ని విరమించడం మంచిది. 
హగ్గు సంగతులు ఇన్ని తెలుసుకున్నారు కదా ! ఇక ఆచరణలో  పెట్టి అనుభవించడానికి ప్రయత్నించండి ,  ఇది విలువైనదే  కాక ఉచితం కూడా కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
%d bloggers like this: