పక్ష వాతం. 6.( T.I.A. ). తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ?:
ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ? దానిని పట్టించుకోక పొతే పరవాలేదా?
జవాబు: తాత్కాలిక పక్ష వాతం అంటే పక్ష వాత లక్షణాలు కొన్ని మాత్రమే వచ్చి , మళ్ళీ రమారమి ఇరవై నాలుగు గంటలలో , ఆ లక్షణాలు అన్నీ పూర్తిగా మటుమాయం అవుతాయి. ఇది వినటానికి విడ్డూరం గా ఉంది కానీ యదార్ధం. దీనిని ఇంగ్లీషు లో ట్రాన్సి ఎంట్ ఇస్కీమిక్ ఎటాక్ అనీ , లేదా క్లుప్తం గా టీ ఐ ఏ అనీ అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఇంగ్లీషులో. టీ ఐ ఏ ను మినీ స్ట్రోక్ ( mini stroke ) అని కూడా అంటారు. ఈ తాత్కాలిక పక్ష వాతం , పెద్ద కధ లో పిట్ట కధ లాగా , పక్ష వాతం కధలో ఒక ముఖ్యమైన చిన్న కధ ఇది. ఈ తాత్కాలిక పక్ష వాతం కధ ను మనం పూర్తిగా నూ శ్రద్ధ గానూ అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
ప్రశ్న: టీ ఐ ఏ , లేదా తాత్కాలిక పక్ష వాతాన్ని పట్టించుకోక పొతే ఏమవుతుంది?
జవాబు: ఈ తాత్కాలిక పక్ష వాతం వచ్చిన ప్రతి పది మంది లో ఒకరికి , నాలుగు వారాలలో గా మళ్ళీ వస్తుంది పక్ష వాతం. కానీ ఈ మళ్ళీ వచ్చే పక్ష వాతం , తాత్కాలికం కాదు. దాని తీవ్రత ఎక్కువ గా ఉండడం వల్ల , ఆ పక్ష వాతం లక్షణాలు మటు మాయం అవ్వవు కదా శాశ్వతం గా ఉంటాయి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ తాత్కాలిక పక్ష వాతం కేవలం ముందు ముందు ( అంటే నాలుగు వారాల లో గా ) ఉధృతం గా వచ్చే పక్ష వాతానికి సూచన !. దీని లక్షణాలు కనిపించిన వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించి అవసరమైన పరీక్షలూ , చికిత్సలూ చేయించు కోవాలి. సాధారణం గా అందరూ అనుకునేది , ఆ లక్షణాలు కొంత సమయమే ఉన్నాయి కదా , మళ్ళీ మనిషి మామూలు గా మాట్లాడ గలుగు తున్న్డాడు, చేయి, కాలు ఊప గలుగుతున్నాడు, అంతే కాక మామూలు గా నడుస్తునాడు కదా, ఎందుకొచ్చిన తిప్పలు , ఇంటికి తీసుకు వెళదాం , పరీక్షలకూ , హాస్పిటల్ కూ ఖర్చులు తడిసి మోపెడవుతాయి ‘ అనుకుంటూ వాస్తవం గ్రహించక , ఇంటికి తీసుకు వెళ్లి అశ్రద్ధ చేస్తారు. అట్లా ఎంత మాత్రమూ చేయ కూడదు. అట్లా చేస్తే వారికి మళ్ళీ రావడానికి పక్ష వాతం పొంచి ఉంటుందని తెలుసుకోవాలి.
ప్రశ్న:మరి ఈ తాత్కాలిక పక్ష వాతానికి సూచనలు ఏమిటి ?
జవాబు: తాత్కాలిక పక్ష వాతం లేదా టీ ఐ ఏ వస్తే , దాని లక్షణాలు కూడా పక్ష వాతం సూచనలలాగానే ఉంటాయి. అంటే మనం క్రితం గుర్తు ఉంచుకునట్టు, F.A.S.T. ( మునుపటి టపాల లో చూడండి దీని వివరాల కోసం ) కాక పొతే ఈ లక్షణాలు, లేదా సూచనలు, మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టు , ఇరవై నాలుగు గంటలలోగా మటు మాయ మవుతాయి. అంతే కాక ఈ ఇరవై నాలుగు గంటలలో ఈ లక్షణాలు కూడా ఎక్కువ ఉధృతం గా ఉండవు. కానీ , ఒక చేయి ఆకస్మికం గా తిమ్మిరి ఎక్కి నట్టు అనిపించ డమో , లేదా మాట తడ బడటమో , నడుస్తున్నప్పుడు కాలు ఆకస్మికం గా బలహీనమయి నడవలేక పోవడమో, లేదా నుంచో వాలని ప్రయత్నిస్తే , బాలన్స్ తప్పి పోతూ ఉండడమో కూడా జరగ వచ్చు. అకస్మాత్తు గా దృష్టి మందగించడం , లేదా , భోజనం చేస్తూ ఉన్నప్పుడు , మింగ లేక పోవడం , కళ్ళు తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు.
ఉత్సాహం ఉన్న వారందరూ ఈ క్రింది వీడియో కూడా చూడ వచ్చు. ( ఇంగ్లీషులో ఉంది కానీ సరళం గా నే ఉంది భాష అర్ధ మయే లాగా ! )
ప్రశ్న: మరి ఈ తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోకు కు కారణాలు ఏమిటి ?
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం !