Our Health

Archive for సెప్టెంబర్ 20th, 2012|Daily archive page

పక్ష వాతం. 3.రకాలు – కారణాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 20, 2012 at 8:56 సా.

పక్ష వాతం. 3..రకాలు – కారణాలూ ! 

మనం క్రితం టపాలో పక్ష వాతం ( stroke ) సూచనలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు పక్ష వాతం లో రకాలు , వాటి కారణాలూ చూద్దాము. 
ముఖ్యం గా పక్ష వాతం , రక్త లోపం వల్ల వచ్చే రకం ఒకటీ , రక్త స్రావం వల్ల వచ్చే రకం ఒకటీ గా మనం చెప్పు కోవచ్చు. 
1. రక్త లోపం వల్ల వచ్చే రకం. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ ( ischeamic stroke )  అని అంటారు.  ఈ రకం సర్వ సాధారణమైన పక్ష వాతం. రక్త లోపం అంటే మన శరీరం లో రక్త లోపం అని అర్ధం చేసుకో కూడదు. ఇక్కడ రక్త లోపం అంటే  మెదడు లో రక్త లోపం అని మననం చేసుకోవాలి.ఇది సర్వ సాధారణం గా రక్త నాళాలలో ప్లాక్  లేదా పెచ్చు ఏర్పడి తదనంతరం ఆ ప్రదేశాలలో రక్తం గడ్డ కడుతుంది. అంటే రక్తం క్లాట్ అవుతుంది.   ఒక ఉదాహరణ: రక్తనాళం ఒక అయిదు సెంటీ మీటర్లు ఉందనుకుంటే ,  ఆ రక్త నాళం లో మూడు సెంటీ మీటర్ల దూరం లో రక్తం గడ్డ కట్టిందను కొండి. అప్పుడు మిగతా రెండు సెంటీ మీటర్ల రక్తనాళం లో రక్తం ప్రవహించదు. దానితో ఆ రక్త నాళం సరఫరా చేస్తున్న మెదడు భాగం చచ్చి పోతుంది. అంటే ఆ భాగం లో ఉండే మెదడు కణాలు నశిస్తాయి. అప్పుడు  ఆ మెదడు భాగం లో  భాష అంటే లాంగ్వేజ్ సెంటర్ ఉంటే , ఆ సెంటర్ పని చేయక ,  పక్ష వాతం వచ్చిన వారిలో మాట పడి పోతుంది. అట్లాగే చేయి బలహీన పడడం , లేదా కాలు బలహీన పడడం  కూడా జరుగుతుంది.  మనం గమనించ వలసినది ఏమిటంటే , మెదడు అంతా , మన దేహం లో వివిధ అవయవాలకు కీలక స్థానాలు ఉంటాయి ఈ విధం గా . ఏ కీలక స్థాన మైతే , రక్త లోపం వల్ల పనిచేయదో , ఆ కీలక స్థానం కంట్రోలు చేసే అవయవాలు కూడా పని చేయడం మానేస్తాయి. మరి ఇట్లా రక్త నాళాల లో రక్తం గడ్డ కట్టడం ఎందుకు జరుగుతుంది? ఇది దైవాదీనమా , మన ప్రమేయం ఉందా దీనిలో ? :ఇక్కడే మానవులు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి.
1.స్మోకింగ్ 
2. అధిక రక్త పీడనం.
3. ఊబ కాయం లేదా ఓబీ సిటీ .
4. హై కొలెస్టరాల్  కలిగి ఉంటే 
5. అధిక మద్య పానం .
పైన ఉన్న అయిదు కారణాలూ  రక్త నాళాల లో పెచ్చులు ఏర్పడడానికి కారణ భూతమవుతాయి.  ఇక్కడ గమనించ వలసిన విషయం ఇంకోటి ఉంది.  1,3,4,5, కారణాలు 2 వ కారణానికి ప్రత్యక్షం గానో పరోక్షం గానో కారణ మవుతాయి. ఆ తరువాత రక్త నాళాల లో ప్లాక్ ఏర్పడడం ,  రక్తం గడ్డ కట్టడం సహజం గా జరిగే పరిణామాలు. ఈ కారణాలు అన్నీ కూడా మానవుల స్వయం క్రుతాలే  కదా  ! మరి ఇక్క్డడ మనం దైవాన్ని నిందించడం  ఎంతవరకు సమంజసం ?!! 
మన ఆసియా వాసులకు ఇంకో రిస్కు ఫాక్టర్ కూడా తోడవుతుంది  కర్ణుడి చావు కు పడి వేల కారణాలు అన్న చందాన , కంట్రోలు లో లేని మధుమేహ వ్యాధి కూడా  రక్త నాళాల లో మార్పులు అధికం చేస్తుంది. 
అంతే కాక  ఏ కారణం చేతనైనా గుండె అప సవ్యం గా కొట్టుకుంటూ ఉంటే కూడా , రక్తం చిన్న చిన్న క్లాట్ లు గా ఏర్పడి , మెదడులో ని రక్తనాళాలకు చేరుకొని వాటిని పూడ్చి వేయడం జరుగుతుంది. 
పైన ఉన్న చిత్రం చూడండి వివరాలకోసం. ఇంకా ఉత్సాహం ఉన్న వారు , ఈ క్రింద ఉన్న వీడియో చూడండి , అత్భుతం గా చిత్రీకరించ బడింది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: