ప్ర.జ.లు. 13. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవడం ?
ప్రశ్న: క్రితం టపాలో తెలుసుకున్నట్టు , ఎమోషనల్ గా దూరం గా ఉండడం, డిప్రెషన్ లో కూడా జరుగుతుంది కదా, మరి ఇన్ ఫిడిలిటీ కీ డిప్రెషన్ కూ ఈ లక్షణాలలో తేడా ఏమిటి? :
జవాబు: ఇది చాల ముఖ్యమైన ప్రశ్న. నిజమే, డిప్రెషన్ లో కూడా ఎమోషనల్ గా దూరం గా ఉండడం జరుగుతుంది. అంతే కాక సెక్స్ అంటే ఉత్సాహం లేకపోవడం, ఏ పని మీదా ఏకాగ్రత తో కేంద్రీకరించలేక పోవడం , మోటివేషన్ లేక పోవడం, ఎప్పుడూ విచారం గా ఉండడం , బ్రతుకు అంటే జీవితం మీద ఆశ సన్నగిల్లడం కూడా జరుగుతుంది. అంతే కాక , డిప్రెషన్ లో నిద్రలేమి , ఆకలి తక్కువ అవడం , తరువాత సరిగా తినక పోవడం వల్ల , బరువు కూడా తగ్గి పోవడం లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. కానీ ఇన్ ఫిడిలిటీ లో, ఉద్యోగం సరిగానే చేస్తుంటారు, అప్పుడు ఏకాగ్రతా , పని జాగ్రత్త కూడా బాగానే ఉంటుంది ( లేక పొతే డబ్బులు ఉండవు కదా ! ), కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమె , అంటే, భార్య దగ్గర లేదా భర్త దగ్గర మాత్రమె వీరు , ముభావం గా ఉంటూ , ఎక్కువ మాట్లాడ కుండా , ఏదో కోల్పోయిన వారిలా ప్రవర్తించు తూ ఉంటారు. అంటే, వీరు ద్వి పాత్రాభినయం చేస్తూ ఉంటారు. అంతే కాక వీరు డిప్రెషన్ వచ్చిన వారిలా ఒక జీవితం మీదనే విరక్తి కలిగిన వారిలా కాక , రెండు జీవితాలను గడుపుదామని కూడా అనుకుంటారు. అంటే, వీరికి బ్రతుకు మీద ఆశ డబుల్ అవుతుంది , సన్నగిల్లదు, డిప్రెషన్ లో ఉన్న వారి ఆలోచనా ధోరణి లాగా !
ఇక మిగతా లక్షణాల గురించి తెలుసుకుందాము.
2. క్రోధం , క్రూరం , విమర్శ : అప్పుడప్పుడూ క్రోధం రావడం సహజమే కదా ! కానీ ఈ ఎఫైర్స్ లోనూ ఇన్ ఫిడిలిటీ లోనూ మునిగిన వారు తరచూ, కోపం తెచ్చు కుంటూ ఉంటారు. ప్రత్యేకించి , అంతకు ముందు , కోపతాపాలు అరుదు గా చూపించే వారు కూడా , ఇంకో సంబంధం ఉన్నప్పుడు , పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విధం గా , అంత వరకూ తాము కలిసి ఎవరితో నైతే ఉంటారో , వారి మీద కోపాన్నీ , క్రోధాన్నీ ప్రదర్శించుతూ ఉంటారు. ఉదా: లక్ష్మి నిజం గానే ఇంటికి మహా లక్ష్మి గా ఉంటుంది. ఉదయం లేవగానే స్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని , వేడి కాఫీ తో పడక గదిలో అమృతం తీసుకు భాండం తీసుకు వస్తున్న మోహిని లా ప్రత్యక్షమవుతుంది, ఈలోగా బ్రష్ చేసుకుని బెడ్ మీదే వెయిట్ చేస్తున్న భర్త ముందు.’ కాఫీ చాలా వేడి గా ఉంది , చల్లారే వరకూ మనం వెచ్చ గా కబుర్లు చెప్పుకుందాం అని, చెంత కు చేర్చుకుని , ఆ మాటా , ఈ మాటా చెప్పి సరసాలాడే వాడు. అదేంటో మాయ కానీ , ఆ సమయం లో , వేడి వేడి కౌగిళ్ళతో పాటుగా , అధరామృతం కూడా ఇచ్చి పుచ్చుకోవడం జరిగేది, తన భర్త తో ! అదే తను పూజ తరువాత ఇచ్చే ప్రసాదమని ఎన్నో సార్లు భర్త తనతో అంటే , ఆనందం తో సిగ్గు పడి పోయేది తను. మరి ఈ మధ్య కాఫీ అందివ్వగానే తీసుకుని , రుచి చూస్తూ , కనీసం ముఖం వైపు కూడా చూడకుండా , చెక్కర తక్కువైంది , కాఫీ సరిగా చేయడం కూడా నేర్చుకోలేదు ! ఇన్ని సార్లు చేస్తున్నా ! అని ఖంగు మన్న శబ్దం తో కాఫీ కప్పును ప్రక్కన పెట్టేస్తున్నాడు ! కళ్ళ నీళ్ళు కొంగు తో తుడుచుకుంటూ , తను కాఫీ కప్పు ను తీసుకు వెళుతూ ఉంటే , ‘ ఇంకా మొసలి కన్నీరు కారుస్తావేం , నేనేమన్నాను నిన్ను ? చీటికీ మాటి కీ ఏడుస్తావు ? ‘ అని మందలిస్తున్నాడు, కసురుకుంటున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ‘ మీరు వచ్చే దోవలో షాప్ లో పాలూ , పంచదారా తెమ్మని చెప్పాను తెచ్చారా ? అని లక్ష్మి అడిగితే ‘ఇంట్లో కాలు పెట్టానో లేదో , పాలు తెచ్చారా , పంచదార తెచ్చారా అని వెధవ ప్రశ్నలు వేస్తావు ! నువ్వు తెచ్చుకుని ఏడవలేక పోయావా ? ఎంత మునిగి పోయే పనులున్నాయనీ నీకు ? ‘ అదేంటండీ , మీరు ‘ సరే తెస్తాను నేనే ‘ అని అన్నారు కదండీ పొద్దున్న ఆమాట అడిగితే ! ‘ ‘ మళ్ళీ ఎదురు సమాధానమూ నువ్వూ , సంసారం లో సుఖం లేదూ, చట్టు బండ లేదూ ! ఛీ ఛీ ! అని సంచీ ని విదిలించు కుంటూ బయట పడ్డాడు భర్త ! దానితో , ఆయన క్రూర స్వభావం కూడా బయట పడింది. అకారణం గా అల్ప విషయాలకు ఇంటి ఇల్లాలిని, అవమానం చేస్తూ మాట్లాడడం, తీవ్రం గా మానసికం గా హింసించడం ఇక్కడ జరుగుతుంది. ఇట్లాంటి లక్షణాలు, ఆకస్మికం గా కనుక, అంతకు ముందు, ఎంతో ప్రేమ గా ఉండే వారు కనుక చూపితే , అనుమానించాల్సిందే !
వచ్చే టపాలో ఇంకొన్ని లక్షణాలు !