Our Health

ప్ర.జ.లు.7.పిల్లలలో కళ్ళ ప్రమాదాల నివారణ – ప్రధమ చికిత్స .

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 4, 2012 at 4:22 సా.

ప్ర.జ.లు.7.పిల్లలలో కళ్ళ ప్రమాదాల నివారణ – ప్రధమ చికిత్స .

ప్రశ్న : చిన్న పిల్లలలో కంటి ప్రమాదాలు నివారించడానికి తల్లి దండ్రులు, టీచర్లు చేయగలిగినది ఏమైనా ఉందా ? :

జవాబు: పిల్లలు ఇంటి లో ఉన్నప్పుడు కానీ , లేదా ఆడుకునే వివిధ ఆటలలో , లేదా స్కూలు రసాయన  ప్రయోగ శాల లో  ప్రయోగాలు చేసే సమయం లోనూ , లేదా క్రాఫ్ట్ తరగతులలోనూ , కళ్ళ గురించి అత్యంత జాగ్రత్త వహించాలి. బంతి తో ఆడే ఏ ఆటలలో నైనా రక్షక కళ్ళ జోడు ధరించడం అలవాటు చేయాలి , తల్లి దండ్రులు. ఈ రక్షక గాగుల్స్  పాలీ కార్బోనేట్ అనే పదార్ధం తో చేసినవి అయి ఉండాలి. ( Poly carbonate goggles  )( పైన ఉన్న చిత్రం చూడండి ).సాధారణ వస్తువులు ఉపయోగించే సమయం లో కూడా, తల్లి దండ్రులు కానీ, టీచర్లు కానీ పర్య వేక్షణ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు , పెన్సిల్ మొనలు, పేపర్ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్ లు , కత్తెరలు , కోటు హంగర్ – ఇటువంటి  వస్తువులు చాలా సామాన్యం గా వాడే వస్తువులు అయినప్పటికీ , చిన్న పిల్లలకు వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన లోపం వల్ల , పెద్దల పర్య వేక్షణ అవసరం అవుతుంది.ఇంట్లోనూ , రసాయన శాలలోనూ , వాడే వివిధ రసాయనాలు , పిల్లలకు దూరం గా ఉంచాలి. ఆట వస్తువులు కూడా ఏ వయసు లో ఆ వయసు ఆట వస్తువులే కొనాలి. అంటే  పది ఏళ్ల వారు ఆడుకునే టాయ్స్ నాలుగు ఏళ్ల వారికి సరి పడవు. ప్రమాదాలకు తావు అవుతాయి. పిల్లలు పిస్టల్ తోటి లేదా గన్ తోటీ ఆడడం చాలా ఇష్ట పడతారు. కొన్ని  అనుమతి లేని  టాయ్స్  ప్లాస్టిక్ బులెట్స్ ను కూడా అమ్ముతుంటారు. ఈ రకమైన టాయ్స్ కూడా కంటి ప్రమాదాలకు కారణం.పెంపుడు జంతువులూ , ప్రత్యేకించి , కుక్కలు , పిల్లులు కూడా కంటి ప్రమాదాలకు కారణం.  మూడు నాలుగు వయసు ఉన్న పిల్లలతో పెంపుడు జంతువులూ ఆడుతున్నప్పుడు, కళ్ళ ప్రమాదాలు జరిగే అవకాశాలు హెచ్చుతాయి. ముఖం పెంపుడు జంతువుల మూతులకు, కాళ్ళకు  దగ్గర గా పెట్ట రాదు ప్రత్యేచించి చిన్న పిల్లలు. ఇంకా పదునైన  వస్తువులతో అంటే డార్ట్ ఆటలు , విల్లు బాణం ఆటలు ఆడే సమయం లో పెద్దలు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండి ప్రమాద నివారణ చేయాలి.

ఒక ఉదాహరణ : చిన్న పిల్లలకు రామాయణం, మహా భారత కధలు తెలుసుకున్నవయసులలో  విల్లు బాణం తో ఆడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఒక తాడు తీసుకుని వెదురు కర్రలతోవిల్లు  తయారు చేయడమూ , కొబ్బరి పుల్లలతో బాణాలు చేసి ఆడడమూ చాలా సాధారణమే  కదా ! ఒక సారి పిల్లలు ఆ ఆట ఆడుతున్నప్పుడు ఒక అన్న, తమ్ముడికి ఇట్లా చేసిన బాణాన్ని గురి పెట్టి ‘ చక్క గా గురి పెట్టాను నీకు , వదలనా ? ! అని అడిగాడు. తమ్ముడు ధీమా గా నీ బాణం నన్ను తాక లేదు వదులు చూద్దాం ! అన్నాడు.  ఆ బాణం సరిగ్గా వెళ్లి తమ్ముడి కంటి లో గుచ్చుకుంది. ఆ కంటి లో చూపు పోయి, ఎన్ని ప్రయత్నాలు వైద్యులు చేసినా దృష్టి మళ్ళీ రాలేదు. ఈ సంఘటన యదార్ధం గా జరిగినది, ఆంద్ర దేశం లో ! కారులో పిల్లలు కూర్చున్నప్పుడు కూడా సరి అయిన రక్షక సూచనలు పాటించాలి.  విదేశాలలో కారు సీటు బెల్టు పెట్టుకోక పోవడం ఒక నేరం. అది గమనించితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధిస్తారు.అంతే కాక పన్నెండు ఏళ్ళు , అంతకు తక్కువ వయసు ఉన్న పిల్లలు ముందు సీటు లో కూర్చోవడం కూడా నేరమే విదేశాలలో !   భారత దేశం లో కూర్చున్నవారి మాట దేవుడెరుగు కారు నడిపే డ్రైవర్ లకు కూడా సీటు బెల్టు పెట్టుకోవాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదు. ఎందు కంటే ,  కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న విధంగా కారు నడిపే డ్రైవర్ కు తన ప్రాణాల మీద లేని తీపి వేరే ( ప్రభుత్వానికి ) వారికి ఎందుకు ఉంటుంది? అందులోనూ భారత దేశం లో ?! 

ప్రధమ చికిత్స: 
కంటి లో ఏదైనా గుచ్చుకోవడం కానీ , ఏదైనా తగిలి  కంటికి గాయం అవడం కానీ జరిగితే , వెంటనే స్పెషలిస్టు వైద్య సహాయం తీసుకోవాలి. గాయ పడిన కంటిని , తాకడం , తుడవడం , లేదా వత్తిడి పెట్టడం అంటే , గట్టిగా ఆదమడం లాంటివి కానీ చేయకూడదు.చిన్న నలకలు ఏవైనా పడినప్పుడు మాత్రం, జాగ్రత్తగా కంటి రెప్పను ఎత్తి , కంటి లో ఊదడం చేస్తే , ఆశ్రువుల తో ఆ నలకలు బయటకు వస్తాయి. అట్లా జరగక పొతే , కంటిని గట్టిగా రుద్దడం చేయకూడదు. వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి. కంటికి కట్ అంటే కోత లాంటి గాయం అయినప్పుడు ఒక శుభ్రమైన నూలు బాండేజీ తో కవర్ చేసి డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాలి. కేవలం మంట కలిగించే రసాయనాలు కంటిలో పడినప్పుడు మాత్రమె , మంచి నీటితో ఆ కంటిని జాగ్రత్తగా కడగాలి.అప్పుడు కంటి స్పెషలిస్టు దగ్గరకో , లేదా డాక్టర్ దగ్గరకో తీసుకు వెళ్లి చూపించాలి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 
  1. Good. Write about care to be taken in early pregnancy and afterwards

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి