Our Health

Archive for జూలై, 2012|Monthly archive page

నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం. 8.

In మానసికం, Our minds on జూలై 3, 2012 at 10:33 ఉద.

నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం. 8.

దీనినే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆంగ్లం లో అంటారు.మేగాలో మానియా అని కూడా ఈ వ్యక్తిత్వం పిలవ బడుతూ ఉంటుంది. నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం అనే  పేరు ఎందుకు వచ్చిందంటే , గ్రీకు ఇతిహాసాలలో నార్సిస్సస్ అని ఒక వేట గాడు ఉండే వాడు.ఆ వేట గాడు అందం గా అంటే హ్యాండ్సం గా ఉండి తన అందం చూసుకుని అతి గర్వ పడే వాడు. నెమిసిస్ అనే దేవత ఈ అంద గాడయిన నార్సిస్సస్ ను ఒక కొలను దగ్గరికి తీసుకు వెళ్లి ఆ కొలను లో అతడి ప్రతిబింబాన్ని చూపించింది. దానితో , నార్సిస్సస్  ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటూ , కొలను దగ్గరే ఉండి, కొంత కాలమైన తరువాత తనువు చాలించాడు.
నార్సిసిస్టిక్ వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి ?:
ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వారు , వారి పైన ఏ విమర్శలు చేసినా, విపరీతమైన , అవమానం చెంది , క్రోధం తో స్పందిస్తారు. వారు ఇతరులను తమ స్వంత లాభానికి ఉపయోగించు కుందామని సర్వదా ప్రయత్నిస్తూ ఉంటారు.వారి ప్రాముఖ్యతనూ , ప్రతిభా పాటవాలను , ఉన్న వాటికంటే ఎక్కువ చేసి అందరికీ తమ ‘ గొప్ప ‘ లు చెపుతూ ఉంటారు. వారు అవాస్తవికమైన ఊహా ప్రపంచం లో విహరిస్తూ ఉంటారు. అంతే కాక వారు, అధిక సామర్ధ్యం కలవారుగానూ , అధిక శక్తి మంతులు గానూ , చాలా తెలివైన వారిగానూ, రొమాంటిక్ గానూ ఊహించుకుంటూ ఉంటారు. శులభం గా ఇతరులను చూసి అసూయ చెందుతూ ఉంటారు. ఇతరులు తమను నిరంతరం పొగుడుతూ, సద్విమర్శలు చేస్తూ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల సానుభూతి చాలా తక్కువ గా ఉంటుంది వీరిలో.ఎంత సేపూ  సొంత డబ్బా కొట్టుకుంటూ , స్వార్ధ పూరితమైన ప్రవ్రుత్తి  కలిగి ఉంటారు. వారు చాలా  గట్టి వారు , ఎమోషన్స్ ఎక్కువగా లేని వారు గా కనిపిస్తూ ఉంటారు. అవాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించు కుంటూ ఉంటారు, వారి జీవితాలలో. అంటే అన్ రియలిస్టిక్ గోల్స్. వారికి ప్రతిదీ అత్యుత్తమమయినదే కావాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ రకమైన మనస్తత్వం వల్ల, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం లో తరచూ విఫలం అవుతూ ఉంటారు.
విపరీతమైన ఆత్మ విశ్వాసం కలవారికి కూడా పైన చెప్పిన లక్షణాలలో చాలా ఉంటాయి. కానీ గమనించ వలసినది ఏమిటంటే , నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం ఉన్న వారు, వారి సెల్ఫ్ ఇమేజ్  తక్కువ గా కలిగి ఉంటారు.అంటే వారికై వారు చాలా ఆత్మ న్యూనతా భావం కలిగి ఉంటారు. దానితో ఇతరులు తమ మీద చేస్తున్న విమర్శలు వారు హుందా గా స్వీకరించక, అతి గా స్పందించడమే కాకుండా , ఇతరులను బాగా కించ పరుస్తూ ఉంటారు. 
వర్తమానం లో ఈ వ్యక్తులు మనకు ఎక్కడ తారస పడతారు?:  మన రాజకీయ నాయకులు పైన ఉన్న లక్షణాలకు ప్రత్యక్ష సాక్షులు. ఆనూహ్యం గా ఈ రకమైన వ్యక్తిత్వం కలవారు, భారత దేశ రాజకీయాలలో ఎక్కువ గా కనిపిస్తారు. మనం పని చేసే ప్రదేశాలలోనూ , మన బంధువులలో కూడా మనం తరచూ గమనిస్తూ ఉంటాము , ఈ వ్యక్తిత్వం కల వారిని. మీకు తెలిసిన వారెవరైనా ఈ వ్యక్తిత్వం కలిగి ఉంటే తెలియచేయండి.
మిగతా సంగతులు వచ్చే టపా లో చూద్దాము ! 
 
 

ఆధార పడే వ్యక్తిత్వం – చికిత్స.7.

In మానసికం, Our minds on జూలై 2, 2012 at 7:31 సా.

ఆధార పడే వ్యక్తిత్వం. 7.

మరి ఈ డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వానికి చికిత్స ఏమిటి ?: 
మనం చికిత్స గురించి మాట్లాడుకునే ముందు , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు, తమ మనస్తత్వం సరి అయినది అవునా కాదా అని ప్రశ్నించు కోవాలి ? 
అంటే ఈ ఆధార పడే వ్యక్తిత్వం , దేశ,  కాల , సంప్రదాయ , పరిస్థితుల బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు: ఇంగ్లండు దేశం లో యుక్త వయసు వచ్చిన యువతి కానీ, యువకుడు కానీ ఏ కారణం చేతనైనా తాము ఉంటున్న ఇంటి నుండి ( అంటే సాధారణం గా తల్లి దండ్రుల ఇంటి నుండి ) బయటకు కనుక వచ్చేస్తే , వెంటనే వారికి  సోషల్ సర్వీసెస్ వారు, నిలవడానికి నీడ ( అంటే ఒక మంచి వసతి ) తినటానికి తిండీ ( అంటే ప్రతి వారమూ కొంత డబ్బు భత్యం గా నూ ) ఉచితం గా  ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వారికి వీలైనంత రక్షణ కూడా కలిగిస్తారు.
మరి భారత దేశం లో అయితే  ఇదే పరిస్థితి లో ఉన్న యువతి కి కానీ యువకుడికి కానీ ఏ విధమైన సహాయం ఇవ్వక పోగా ,  వారిని మానసికం గానూ , భౌతికం గానూ , లేదా కామ పరం గానూ , హింస పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ( ఆ అవకాశాలు పాశ్చాత్య దేశాలలో కూడా ఉంటున్నా , మరీ రోడ్డు మీద పడరు కదా , డబ్బూ ,ఆహారమూ , వసతీ లేకుండా ! ) అంటే భారత దేశం లో మరి యువతీ యువకులు తమ తల్లి దండ్రుల మీద ఆధార పడుతుంటే, అది ఆధార పడే వ్యక్తిత్వం అవ్వదు కదా ! అంతే కాక , భారత దేశం లో తల్లిదండ్రులు ఇంకా , తమ పిల్లల విద్యకు అవసరమయే డబ్బు చాలావరకూ  తామే సహాయం చేస్తారు, సంతోషం గా ! కానీ పాశ్చాత్య దేశాలలో పిల్లలు విశ్వ విద్యాలయం లో చేరాక , ‘ అతి స్వతంత్రులు ‘ అవుతారు. వారు తమ తల్లి దండ్రుల వద్ద ఉండరు. అంతే కాక వారి చదువులకు అయ్యే ఖర్చు వారే  బ్యాంకు లో లోన్ తీసుకుని, వారి చదువులు పూర్తి  అయి , ఉద్యోగాలలో చేరాక , వాయిదాల పధ్ధతి లో  తీర్చు కుంటారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే , యువతీ యువకులను, భారత దేశం లో నైనా , పాశ్చాత్య దేశాలలో నైనా , మనం ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారని ముద్ర వేయలేము పైన చెప్పిన కారణాల వల్ల. అంతే కాక వారు కూడా ఈ వ్యక్తిత్వం ఉన్న వారని అనుకోరు కదా!
ఎవరికి చికిత్స కావాలి మరి?: ఈ వ్యక్తిత్వ రీతులు అన్నీ ఇగో  సిం టోనిక్,  అంటే, ఈ వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు , తమ వ్యక్తిత్వ రీతులు సరి అయినదే అని అనుకుంటూ ఉంటారు. వారికి వారి వ్యక్తిత్వం ఏవిదం గానూ అప సవ్యం గా తోచదు. ఇట్లాంటి వారికి , వారి వ్యక్తిత్వం అపసవ్యం అని చెప్పడం , హాస్యాస్పదం గా ఉంటుంది. వారికి వారి మనస్తత్వాల మీద ఒక మంచి అవగాహన ఏర్పడితేనే వారు తమను ఇంకో కోణం లో పరిశీలించు కోవడానికి ఉత్సాహం చూపుతారు. 
చికిత్సా పద్ధతులు ఏమిటి? : 
1. గ్రూపు సైకో థెరపీ.
2. మందుల ద్వారా చికిత్స. 
ఇక్కడ,  అంటే ఆధార పడే వ్యక్తిత్వం సవ్య మైనది గా మార్చడానికి కొన్ని పరిస్థితులలో మందులు బాగా పని చేస్తాయని పరిశోధనల వల్ల విశదం అయింది.
ఈ డిపెండెంట్ వ్యక్తిత్వం అట్లాగే ఉంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి? : 
ఈ రకమైన వ్యక్తిత్వం  చాలా కాలం ఉంటే , డిప్రెషన్ , యాంగ్జైటీ, ఫోబియా , లాంటి రుగ్మతలకు దారి తీయ వచ్చు , లేదా ఈ వ్యక్తిత్వం లో భాగం ఆవ వచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 
 
 
 

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

In మానసికం, Our minds on జూలై 1, 2012 at 10:58 సా.

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

క్రితం టపా లో చూశాము కదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఏ లక్షణాలు కలిగి, ఎట్లా వారు ‘ అంధ కార మయ జీవితం ‘ లో  వెలుగునిస్తూ, తాము మైనం లా కరిగి పోతూ ఉంటారో !  ఈ ఆధార పడే మనస్తత్వం , వ్యక్తిత్వం ఉన్న వారు పలు రకాలు గా  కూడా ఉండ వచ్చు.  మిల్లన్ అనే సైకాలజిస్ట్  వారి వారి మనస్తత్వాల, వ్యక్తిత్వ తీరు ల బట్టి మళ్ళీ ఈ ఆధార పడే వ్యక్తిత్వాన్ని కొన్ని రకాలు గా విభజించాడు. ఒక రకానికి చెందిన వారు , ఇతరుల మీద ఆధార పడినా, ఆ విషయం పెద్ద గా వారు సీరియస్ గా తీసుకోరు. అది వారి విజ్ఞానం మీద కూడా ఆధార పడి ఉంటుంది. అంటే వారు  విద్యావంతులు కాక పొతే, వారు వారి జీవితాలను ఇతరుల చేతుల్లో పెట్టామనే విషయం వారికి తట్టదు. ఇంకో రకం వారు ,ఆ విషయ పరిజ్ఞానం ఉన్నా , అసంతృప్తి గానే, ఇతరుల మీద ఆధార పడతారు. ఇంకో రకం వారు ఇమ్మేచూర్ గా అంటే వారు మానసికం గా పరిణితి చెంద కుండా, ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవరచుకుంటారు.  ఇంకో రకం వారు తాము ఎట్లాగూ  తమ జీవితం లో సవాళ్ళను సమర్ధ వంతం గా ఎదుర్కో లేక , ఇతరుల మీద ఎక్కువ గా ఆధార పడతారు. ఇంకో రకం వారు తమ స్వార్ధం చూసు కోకుండా, త్యాగ శీలురై , ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటారు. ఈ రకానికి చెందిన వారు మాసోచిజం  అనే ప్రవ్రుత్తి కి కూడా లోనవుతారు. ( మాసోచిజం అంటే , తాము  పొందే బాధ, కష్టాల తో తాము సంతృప్తి , ఆనందం పొందడం ! ఆశ్చర్యం గా ఉంది కదా ! కానీ, భౌతికం గానూ , మానసికం గానూ తాము హింశించ బడితే, సంతృప్తి , సంతోషం పొందే వారు , ఈ ప్రపంచం లో చాలా మంది ఉన్నారు ! ) 
మరి ఇతరుల పైన ఆధార పడే ఈ డిపెండెంట్ వ్యక్తిత్వాన్ని ఎట్లా కనుక్కోవచ్చు ? : ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని లక్షణాలు ఒక వ్యక్తి లో ఎక్కువ కాలం అంటే కనీసం కొన్ని నెలలూ , లేదా సంవత్సరాలూ ఉంటే , వారిలో ఆధార పడే వ్యక్తిత్వం ఉందని తెలిపింది. ఆ లక్షణాలు ఇవే : 
1. తమ జీవితాలలో తమకు చెందిన , ముఖ్య మైన సంఘటనలకు సంబంధించిన నిర్ణయాలను , ఇతరులనే తీసుకోమని, ఇతరులను ప్రోత్సహించడం , లేదా ఇతరులు తీసుకుంటుంటే దానిని ఆమోదించడం. 
2. తాము ఆధార పడిన వారికి విధేయత కలిగి ఉండడం , వారి ఆశయాలకు తాము అంగీకార యోగ్యం గా ప్రవర్తించడం. 
3. తాము ఆధార పడిన వారిమీద , తాము , కనీస ఆంక్షలు కూడా విధించడానికి అయిష్టం గా ఉండడం ,  ఆ కనీస ఆంక్షలు హేతు బద్ధమైనవి అయినా కూడా  !.
4. తాము ఒంటరి గా ఉన్నప్పుడు , ఇబ్బంది గా , నిస్సహాయత గా ఉండడం, ( ఎందువల్ల నంటే , వారు తాము స్వతంత్రం గా ఉండలేమేమో అన్న భయం తో ) 
5. తమ జీవిత విషయాల మీద నిర్ణయాలు చేస్తున్న వారు, తమను ఎక్కడ , ఎప్పుడు వదిలేస్తారో అన్న ఆలోచలనలతో దిగులు గా ఉండడం. 
6.ఇతరుల సహాయ సహకారాలు పొందలేక పొతే , తమంత తాము గా పరిమితమైన ప్రతిభా సామర్ధ్యాలు మాత్రమే కలిగి ఉండడం. 
పైన చెప్పిన లక్షణాలలో ఏ మూడు ఉన్నా , వారు , ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారని నిర్ధారించ బడుతుంది.
ఒక సమస్య : జ్యోతి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయింది. మనసు కూడా వెన్న. తండ్రి రెండు మూడేళ్ళలో రిటైర్ అవుతాడు. తల్లి కి కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయి. చెల్లెలు కూడా ఇంజినీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తుంది. సంబంధాలు వెతుకుతున్నారు. జ్యోతికి సమర్ధుడైన భర్త దొరికాడు. అంతే కాక , ఒక నిలకడ అయిన ఉద్యోగం కూడా చేస్తున్నాడు.సంపాదనా చెప్పుకో తగ్గదే ! ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల, జ్యోతి కి ఉద్యోగం చేయడానికి అవకాశం చిక్కలేదు, పెళ్లి అయిన పది ఏళ్ల వరకూ . ‘ పిల్లలు పెరుగుతున్నారు కదా ! స్కూల్ కు కూడా వెళుతున్నారు. ‘ నేను ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను ‘ అని తన ఆంతర్యం తెలిపింది భర్త తో ఒక సందర్భం లో ! అప్పటి నుంచీ ‘ ఆయన గారి చికాకూ , చిర్రు బుర్రు లాడడం మొదలైంది. మొదటి లో జ్యోతికి, ఈ పరిస్థితి వల్ల ఆందోళన అధికం అయింది. ‘  చక్కని సంసారం లో  అలలు , ఆటు పొట్లూ ఎందుకు ?, పిల్లలు కూడా చక్క గా పెరుగుతున్నారు , చదువు కుంటున్నారు అని’ మధన పడుతూ , ప్రశాంతత వహించింది. కొంత కాలం అయిన తరువాత ఆ ప్రస్తావన మళ్ళీ తెచ్చింది భర్త దగ్గర. ‘ నేను నీకేం తక్కువ చేస్తున్నాను ! అన్నీ నేనే చూసు కుంటున్నా కదా ! నీవు ఉద్యోగం చేస్తేనే జరుగుతుందా ? అన్నాడు ! ‘  నేను ఇప్పటి వరకూ పిల్లల సంరక్షణ చూశాను కదా ఇంటి దగ్గరే ఉండి ! వారు మరీ చిన్న వారు కాదు కదా ఇప్పుడు ! నేను కూడా స్వతంత్రం గా కొంత సంపాదించ గలిగే అవకాశం కూడా ఉంది కదా ! అన్నది జ్యోతి. అప్పటి నుంచీ ఆయన  ముభావం గా ఉంటారు. ఈ మధ్య కొద్ది గా ఆలస్యం గా ఇంటికి రావడం. కొన్ని సార్లు పిల్లలు  నిద్ర పోయిన తరువాత ,   ఇంటి లోనే ‘ మందు ‘ పుచ్చు కోవడం !  ఇప్పుడు  జ్యోతి పరిస్థితి మీరు వ్యాఖ్యానించ గలరా ? జ్యోతి సమస్య కు  ( అసలు జ్యోతి కి సమస్య ఒకటి ఉందని మీకు అనిపిస్తే ) ,  మీ పరిష్కారాలు  ఏమిటో తెలియ చేయండి ! 
వచ్చే టపాలో మిగతా వివరాలు తెలుసుకుందాము ! 

డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం. 5.

In మానసికం, Our minds on జూలై 1, 2012 at 9:35 ఉద.

డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం. 5.

పేరు లోనే ఉంది కదా ! ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు , ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. అందులో తప్పు ఏముంది ? మానవుడు సంఘ జీవి కదా ! నలుగురితో సహాయ సహకారాలు తీసుకోవడమే  స్థిత ప్రజ్ఞుల లక్షణం కూడా కదా అని మీరు అన వచ్చు.డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు, వారి జీవితం లో ప్రతి విషయానికీ ఇతరుల మీద ఆధార పడుతూ ఉంటారు. అంతే కాక , ఇతరులను , తమ జీవితం లో జరుగుతూన్న సంఘటనలకూ , సమస్యలకూ, కీలకమైన నిర్ణయాలు తీసుకోమని వారికి  వదిలేస్తారు. ఒక విధం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారి పరిస్థితి ఎమోషనల్ గా ‘ తెగిన గాలి పటం ‘ మాదిరిగా ‘గాలి దయా దాక్షిణ్యం’ మీద ఉన్నట్టు గా ఉంటుంది, వారు ఇతరులను , తమ జీవిత నౌక కు చుక్కాని అయి, వారిని దరి  చేర్చాలని అనుకుంటారు. వారి జీవితం మీద , వారి జీవిత నిర్ణయాల మీద ఏమాత్రం భారమూ , బాధ్యతా వారికి లేనట్టు ప్రవర్తిస్తారు. వీరి దృష్టి లో ఇతరులు తమ అంచనాలకూ , ఊహలకూ అనుగుణం గా ఉండాలని అనుకుంటారు కానీ , ఇతరులు ఒక వ్యక్తిత్వం కలిగి వారికై వారు ప్రత్యేకతలు కలిగి ఉంటారనే విషయాన్ని విస్మరిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకో వలసి వచ్చిన ప్రతి పరిస్థితినీ వీరు దాట వేస్తూ ఉంటారు. 
ఈ ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు వారిమీద ఏ విధమైన సెల్ఫ్ ఇమేజ్ కలిగి ఉంటారో చూద్దాము:
వీరు తాము అసంపూర్ణ వ్యక్తులమనీ , ఈ ‘ మోస పూరిత , ప్రమాద కర బాహ్య ప్రపంచం ‘ లో తాము ఇమడలేమనీ, అసహాయత ఎర్పరుచుకుంటారు. అందువల్ల తమ జీవిత నిర్ణయాలు , ఇతరులకు వదిలేస్తారు. దానితో , వీరికి , పెద్ద కోరికలూ, ఆశయాలూ , ఆకాంక్షలు కూడా తక్కువ గా ఉంటాయి. ఈ విధమైన అభిప్రాయం కలిగి వారు ఇతరుల ‘ రక్షణ ‘ లో ఉండడమే మంచి మార్గం అనుకుంటారు. అందుకోసం వారు, ఇతరులు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉన్నా , వాటిని ఆమోదిస్తూ ఉంటారు.వారి వ్యక్తిత్వాన్ని ,ఇతరుల ఆమోదం కోసం ‘ తాకట్టు ‘ పెడుతూ ఉంటారు. అట్లాగే అతి విధేయత తో ఇతరుల ‘రక్షణ’ లో ‘ అణిగి మణిగి  ఉంటారు. దీనితో అనేక కీలకమైన జీవిత నిర్ణయాల సమయం లో వీరు ఎక్కువ గా ‘ తమ మెదడు కు పని పెట్టరు’ అంటే ఎక్కువ గా ఆలోచించరు.
ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఇతరులతో ఏ రకమైన సంబంధాలు కలిగి ఉంటారు? : వీరు తాము మనుగడ సాగించాలంటే , తమ కన్నా గొప్ప వారితో సంబంధాలు ఎప్పుడూ అవసరమని భావిస్తారు. వారు ఇన్ఫీరియర్ గా ఫీలవుతూ , సుపీరియర్స్ ను విధేయత, ప్రేమ , వాత్సల్యలతో చూసుకుంటూ ఉంటారు. అంతే కాక , వారికి ఆమోద యోగ్యం కాని పనులు కూడా చేస్తూ , త్యాగ మయ జీవితాలను గడపడానికి కూడా వీరు వెనుకాడరు. ఈ విధమైన సంబంధాలు ఏర్పరుచుకున్నాక , వారికి, లేక వారు ఆధార పడిన వ్యక్తులకూ ఏ రకమైన వైఫల్యాలు ఎదురైనా కూడా , వాటిని సీరియస్ గా తీసుకోకుండా , వాటిని అల్ప విషయాలు గా పరిగణిస్తారు. వారికై వారు కేవలం ఇతరులతో ఎట్టి పరిస్థితులలోనైనా సహకారమూ, తాము ఆమోదించ  పడటమూ ఆశిస్తారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !