పని సూత్రాలు . 37.మీ మాట జాగ్రత్త !
క్రితం టపాలలో , మీరు మీ ఉద్యోగాలలో , ఓపిక గా వినడం వల్ల ప్రయోజనాలు, అదే విధం గా , ఇతరులను తిట్టడం లేదా విమర్శించడం లో ఉన్న నష్టాల గురించీ వివరం గా తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు మరి మనం చేసే ఉద్యోగాలలో ఏమి మాట్లాడాలో కూడా తెలుసుకుందాం ! చాలా మంది, వారి చదువులు పూర్తి అయి ఉద్యోగాలలో చేరాక , ఉద్యోగ వాతావరణం లో ఎట్లా మాట్లాడాలో తెలియక, వారి కాలేజీల లో ప్రవర్తించినట్టే , ఉద్యోగం చేసే చోట కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ! అది కొంత వరకూ వారి వయసు వల్ల కూడా అవవచ్చు ! కానీ ఉద్యోగం లో, మన ప్రవర్తన , మన ఇమేజ్ ను ప్రతిబింబించే విధం గా ఉండాలి ! అదీ , మన ఉద్యోగం లో చేరినప్పటి నుంచీ కూడా ఉండాలి ! ఆ ఇమేజ్ ” మనం ఎప్పుడూ , తెలివిగా , విశ్వాస పాత్రులు గా , పరిణితి చెందిన వారిగా , అంటే మెచూర్ గా , కూల్ గా ” కనిపించాలి ! ( కూల్ గా ఉండడం అంటే ఏమిటో మనం క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ) అంటే , సహజం గా మనలో ఉండే ఆ లక్షణాలు, బయటకు కూడా అవే లక్షణాలు గా కనిపిస్తూ ఉండాలి ! కానీ ,ఆకతాయి పనులు కాలేజీ లో చేసినట్టు, ఉద్యోగం లో కూడా చేస్తూ , పై అధికారుల దృష్టి లో కేవలం బాధ్యతలు మరిచి , సరదా గా ఉద్యోగం చేస్తున్న వారిలా ‘కనపడకూడదు ‘ ! మనం కాలేజీ లలో , కొంత ఆకతాయి గా , చిలిపి గా , సరదా గా కాలం గడిపి ఉంటాము ! చదువును అశ్రద్ధ చేయకుండానే ! కానీ చేసే ఉద్యోగాలలోనూ , కార్పోరేట్ సంస్థ లలోనూ , మన ప్రవర్తనను నిరంతరం , ఏదో రకం గా గమనిస్తూ ఉంటారు ! పై అధికారులు కానీ , లేదా బాసులు కానీ ! వారికి కావలసినది మనం చేసే పని ! ఆ పని ద్వారా లాభాలు ! అంతే ! అదే వాతావరణం లో మనకు కావలసినది , మన జీతం ( తాత్కాలిక లక్ష్యం ) తో పాటుగా మన దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా !
మరి మీరు మీ నాలుకను ఎట్లా నియంత్రించు కోవాలి ?:
1. అన్ పీసీ ( un pc ) వ్యాఖ్యానాలు : మీరు మీ ఉద్యోగం లో ఎప్పుడూ ” అన్ పీసీ ” కామెంట్స్ చేయకూడదు ( pc అంటే పర్సనల్ కంప్యూటర్ అనే అర్ధం తీసుకో కూడదు ఇక్కడ ! ఇక్కడ pc అంటే పొలిటికల్లీ కరెక్ట్ అని అర్ధం ) ఉదాహరణకు, మీరు చేసే ఉద్యోగాలలో , కులం గురించి కానీ రిజర్వేషన్ ల గురించి కానీ మీరు ఏవిధమైన వ్యాఖ్యానాలూ ఎప్పుడూ చేయ కూడదు ! మీరు ఆ విషయాలలో ఏ విధం గా ( అ )న్యాయం పొందుతున్నా కూడా !
2. ఒక వర్గానికే చెందిన వారిని కించ పరిచే విధం గా విమర్శలూ , వ్యాఖ్యానాలూ చేయకూడదు !
3. లింగ పరం గా కామెంట్స్ కూడా చేయకూడదు ! కేవలం స్త్రీ పురుషుల లింగ పరం గానే కాకుండా , స్వలింగ పరుల గురించి కూడా ఏ రకమైన వ్యాఖ్యానాలూ చేయ కూడదు !
4. మీ పై అధికారిని, ఇతర ఉద్యోగుల ముందు ” విపరీతం గా కాకా పట్టే ” పనులు చేయకూడదు !
5. ఎట్టి పరిస్థితులలోనూ , మీరు మీ టెంపర్ కోల్పో కూడదు , అంటే మీ సహనాన్ని కోల్పోకూడదు !
6. ఏ రకమైన పరుష పదజాలమూ ఎవరి మీదా ఉపయోగించ కూడదు ! అంటే తిట్లు ! ఎవరినీ తిట్ట కూడదు !
7. ఇతర వ్యక్తుల మీద మీకున్న నిజమైన అభిప్రాయాన్ని కూడా తెలుప కూడదు !
8. ఇతర సహచరులతో , ఉద్యోగం లో ఉన్నప్పుడు బాతా ఖానీలు , హస్కులూ వేస్తూ ఉండ కూడదు !
మీరు మీ ఉద్యోగం లో మితం గా మాట్లాడే అలవాటు చేసుకోవాలి ! ( కేవలం మీరు కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుంటే తప్ప ! ) మాట్లాడే ముందు ప్రతి సారీ ,మీరు మాట్లాడేది ఏమిటో ఆలోచించి మరీ మాట్లాడాలి ! మీ మాట క్లుప్తం గా , స్పష్టం గా , ఖచ్చితం గా , అర్ధ వంతం గా ఉండాలి ! మీ మాటను ” నాన్చుతూ ” మాట్లాడ కూడదు ! అట్లా అలవాటు చేసుకుంటే , మీరు నోరు జారే పరిస్థితి ఉండదు ! మీకు తెలుసు కదా , కాలు జారితే మీరు సరి చేసుకోవచ్చు , కానీ ఒక సారి నోరు జారితే , ఆ మాటను వెనక్కి తీసుకోవడం కష్టం , ఈ లోగా జరగ వలసిన నష్టం జరుగిపోతుంది ! మనం తరచూ చూస్తూనే ఉంటున్నాం కదా ! నోరు జారిన బడా ” నాయకులూ , అధికారులూ , ” ఎంత త్వరగా వారి పదవులు కోల్పోతున్నారో ! మీరు మితం గా , లౌక్యం గా మాట్లాడడం అలవాటు చేసుకుంటే , మీ సహచరులకే కాకుండా , మీ పై అధికారులకు కూడా విశ్వాస పాత్రులవుతారు ! అప్పుడు మీకు ప్రమోషన్లు, అంటే పదోన్నతులు ఖాయం !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !