Our Health

Archive for మార్చి 24th, 2013|Daily archive page

పని సూత్రాలు. 31. పని లో గొణగడం కూడదు !

In మానసికం, Our minds on మార్చి 24, 2013 at 10:19 ఉద.

పని సూత్రాలు. 31. పని లో  గొణగడం కూడదు !

 
ఉదాహరణ :  ఓ కష్ట జీవి ,  తన పనిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు.  ఉదయమే బయల్దేరి సరిగా తొమ్మిది గంటలకల్లా  ఎట్టి  పరిస్థితులలోనూ  ఆఫీసుకు చేరుకుంటాడు ! తన టేబుల్ మీద అప్పటికే , ఒక అడుగు ఎత్తు పేరుకున్న ఫైళ్ళు  స్వాగతం పలుకుతాయి ! వాటిని చదివి , యాక్షన్ రాసే సమయం లోనే , తన సూపర్వైజర్  మూడు సార్లు ఇంకో మూడు విషయాల మీద తన క్యాబిన్ లోకి పిలిపించు కున్నాడు !  కష్ట జీవి భుజాలు ఆ పని భారానికి క్రుంగి పోయినాయి ! చీకాకు పడి  పోతున్నాడు ! తనలో తను గొణుగు  కుంటున్నాడు , తన టేబుల్ దగ్గరకు వచ్చిన ప్రతి వారితో ” చూశారా మాస్టారూ ఈ ఫైళ్ళు ?  ఇవి చాలవు అన్నట్టు సూపర్వైజర్  పిలుపులు ! రోజూ సాయింత్రం ఇంటికి వెళ్ళే సరికి ఏడు గంటలవుతుంది , మళ్ళీ ఉదయం ఏడింటికల్లా బస్ స్టాపుకు పరుగు ! గాడిద చాకిరీ లా ఉంది నాది  ! అని చెప్పుకుంటున్నాడు ! ఆ  మాటలు వింటున్న వారు ” ఆ సుత్తి భరించలేం , నా పని కొద్ది గా చేయమని టేబుల్ దగ్గరకు వెళితే , తన సుత్తి చెప్పుకుంటాడు అందరికీ ! నోరు మూసుకుని నా పని చేయక ! అని మిగతావారితో అంటారు ! 
చాలా ఆఫీసులల్లో  ఇట్లా కొందరికే ఎక్కువ పని ఉండడం , వారే ఎక్కువ పని చేస్తూ ఉండడం , వారు తమ పని ఎక్కువ గా ఉండి  గొణుక్కుంటూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటాయి !  అదే క్యాడర్ లో ఉన్న వారు ఇంకొందరు , వారు అసలు ఆఫీసు లో పని చేయడానికి వస్తున్నారా ? అని ఆశ్చర్య పోయే తీరు లో పూల రంగడు లా తమల పాకులు నములుతూ , ఎర్రటి పెదిమలతో ,  ఆఫీసును ఒక శృంగార మందిరం లా భావిస్తూ , ఇతర  స్త్రీ ఉద్యోగులను తమ ఓర చూపుల బాణాల తో ,సాయింత్రం వరకూ చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు !  కొందరు ఓనమాలు సరి గా రాని వారుకూడా , తమకన్నా ఎక్కువ గా చదువుకున్న వారు , ఉద్యోగం లో తమకన్నా సీనియర్ గా ఉన్నా , పదోన్నతులు పొంది , మిగతా వారిమీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు ! మీ ఉద్యోగం లో మీ పని ఎక్కువ గా ఉంటుంది !  అప్పుడు  ఆ పరిస్థితి అన్యాయం !  మీరు మాత్రమే ఎక్కువ పని చేస్తూ ఉంటారు !  మీ పని వత్తిడి గురించి ఆ సమయం లో గొణగడం ఎట్టి పరిస్థితులలోనూ శ్రేయస్కరం కాదు మీకు ! ఎందుకంటే ,
1. గొణగడం మిమ్మల్ని చాలా చులకన చేస్తుంది !
2. మీ సమయాన్ని వృధా చేస్తుంది 
3. మీ గొణుగుడు ,  మిమ్మల్ని మీ ఆఫీసులో ఉన్న మిగతా గొణుగుడు రాయుళ్ళ దగ్గరికి చేరుస్తుంది. 
4. మీరు ” అసలు చేయవలసిన పని చేయకుండా ” ఎప్పుడూ  ” గొణుగుతూ ఉంటారు ” అనే ముద్ర వేస్తుంది.  
5. మీలో చీకాకు , క్రోధమూ కలిగించి , మీ మానసిక ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. 
6. నిరంతరం గొణుగుడు అలవాటు చేసుకోవడం వల్ల , మీలో పని యందు ఉండే ఉత్సాహం కోల్పోయేట్టు చేస్తుంది. 
 
గొణగడం మానేయాలంటే ఏంచేయాలి ?
 
మీరు ప్రతి సారీ , ఏ సమస్య ను కష్టం గా అనుకుంటారో , ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచించండి , గొణిగే  ముందే !  కేవలం గొణుగుతూ ఉంటే , సమస్యలు పరిష్కారం కావు కదా ! ఒక వేళ  మీకు చక్కని పరిష్కారాలు తోచకపోతే కూడా , ఎవరైనా మీకు నమ్మకస్తుల తో ఆ సమస్య ను చర్చించి వారి సలహా తీసుకోండి !నిశ్శబ్దం గా చేయవలసింది చేయండి ! మీ తాత్కాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాలు విస్మరించకండి ! గొణుగుడు మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా మంచి ఫలితాలు కూడా ఎప్పుడూ ఇవ్వదు ! 
వచ్చే టపాలో ఇకో పని సూత్రం ! 
%d bloggers like this: