పని సూత్రాలు. 24. మరి మీ తాత్కాలిక లక్ష్యాలు ఏమిటి ?:
క్రితం టపాలో మనం తెలుసుకున్నాం కదా ,జీవితం లో దీర్ఘ కాలిక లక్ష్యాలు పెట్టుకుంటే ఉండే ప్రయోజనాలు. మరి కేవలం వాటితోనే ముందుకు పోవడం కంటే ,వర్తమానం అంటే ప్రస్తుతం , మనం చేయ వలసిన కార్యక్రమాలు కూడా మనకు తెలిసి ఉంటే ఎక్కువ ప్రయోజనం. అంటే తాత్కాలిక లక్ష్యాలు. ఈ దీర్ఘ కాలిక , తాత్కాలిక లక్ష్యాలను , మనం గమ్యం లేదా మన లక్ష్యాలను చేరుకోడానికి ఉపయోగ పడే మార్గాలు లేదా రోడ్డులు ( roads ). మనం ప్రధాన రహదారి ను చేరుకోడానికి , చిన్న చిన్న సందులలో కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది కదా ! మరి ఎట్లాగూ ప్రధాన రహదారి , అదే మెయిన్ రోడ్డు లో ప్రయాణం చేయ బోతున్నామని , చిన్న, చిన్న సందులలో మన ప్రయాణాన్ని అశ్రద్ధ చేయ లేము కదా ! ఆ సందులలో కూడా మన ప్రయాణానికి అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోతేనే , పెద్ద రోడ్డు ను చేరుకొనేది ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , తాత్కాలిక లక్ష్యాలు అన్నీ కలిసే దీర్ఘ కాలిక లక్ష్యాలకు పునాది గా ఏర్పడతాయి.
ఉదాహరణకు వచ్చే నెలలో మీ కార్యక్రమాలు ఏమిటి ? మీ ఉద్యోగం గురించి మీరు చేయవలసినవి ఏమిటి ? మీ ప్రాజెక్ట్ లు ఏమిటి ? వాటి గురించి మీరు చేయవలసిన హోమ్ వర్క్ ఏమిటి ? మీరు కలవ వలసిన వారు ఎవరు ? ఎప్పుడు వారితో మీట్ అవాలి ? మీ వర్క్ కాకుండా , మీ కుటుంబ కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయా మీకు ? వాటిని ఏ విధం గా మీరు ( మీ ఉద్యోగం చేస్తూ ) నిర్వర్తించ గలరు ? మీ ఫ్రీ టైం అంటే మీ విరామ సమయాన్ని మీరు ఏ విధం గా వినియోగించ దలచారు ? మీ స్నేహితులతో కానీ , మీ ప్రేయసి తో కానీ , లేదా ప్రియుని తో కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ , కలిసి వెళ్ళ వలసిన ప్రదేశాలు ఉన్నాయా ? ఇవన్నీ కూడా మీ తాత్కాలిక లక్ష్యాలు అవుతాయి. అట్లాగే మీరు ప్రస్తుత సంవత్సరం , లేదా వచ్చే రెండేళ్ళు , మూడేళ్ళు , లేదా నాలుగేళ్ళు కూడా తాత్కాలిక లక్ష్యాలు ఏర్పరుచుకోవచ్చు !
మీరు ఈ ఈ లక్ష్యాలు ఏర్పరుచుకున్నప్పుడు, వాటిని చేరుకోవలసిన మార్గాలు కూడా నోట్ చేసుకోవడం మంచిది. అంటే మూడు నెలలో ఇంకో సిటీ వెళ్ళే యోచన ఉంటే , ఆ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు , రైలు, లేదా విమాన టికెట్ బుకింగ్ , మీ వసతి ఏర్పాట్లు , మీ బట్టలు , ఇట్లాంటి విషయాలు కూడా ఒక రమారమి తేదీల వారీ గా కార్యక్రమం మీరు ముందే నోట్ చేసుకుంటే , మీ కార్య క్రమాలు సులువు అవుతాయి ! ముఖ్యం గా మీరు వీటి తో పాటుగా , ఒక వేళ , మీరు ముందు గా అనుకున్నట్టు , ఏ కారణం వల్ల నైనా జరగక పొతే ( ఉదా రైలు క్యాన్సిల్ అవడమో , లేదా వాతావరణం బాగోలేక పోవడమో, లేదా ఆరోగ్యం అనుకూలించక పోవడమో జరిగితే ) ఆసమయం లో మీరు తీసుకోవలసిన చర్యల గురించి కూడా మీకు ఒక యోచన లేదా ఐడియా ముందుగానే ఉంటే , అట్లాంటి సంఘటనలు నిజం గా జరిగినప్పుడు కంగారు పడకుండా , సరి అయిన నిర్ణయాలు తీసుకో గలరు !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !