పని సూత్రాలు. 35. పని లో దూషణ పనికి రాదు !
ఉద్యోగ సూత్రాలలో ఇంకో ముఖ్యమైన సూత్రం. పనిలో దూషణ పనికి రాదు !
మీరు రోజూ చేసే పనిలో , అనేకమైన సమస్యలు ఉండవచ్చు ! అనేక వత్తిడులు ఉండవచ్చు , మీ సహచరులు లీవ్ మీద వెళ్ళ వచ్చు ! మీరు ఒక్కరే ఎక్కువ పని తో సతమతమవుతూ ఉండవచ్చు ! ఈ పరిస్థితులన్నీ సహజం గానే మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి ! మీకు చీకాకు కలిగిస్తూ ఉంటాయి !
మీరు ఇట్లాంటి పరిస్థితులలో చేయకూడనిది ఉంది , అది మీరు మీ చుట్టూ ఉన్న వారినీ , లేదా మీలో మీరూ కూడా తిట్టుకోకూడదు ! ప్రత్యేకించి మీరు పని లో అంటే మీ ఉద్యోగం లో ఉన్నపుడు ! ఉదాహరణ: చిదానంద్ ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆఫీసు లో ! పేరు మాత్రమే ఆనందాన్ని తెలుపుతుంది కానీ అతడికి ఎప్పుడూ ముక్కు మీద కోపం ! ఆఫీసులో ప్రతి వారి మీదా విసుక్కుంటాడు తరచూ ! ఆఫీసుకు ఏకారణం చేతనైనా రాని వారిగురించి మిగతా కొలీగ్స్ తో ” జ్వరమనీ, కాలు నొప్పనీ ఆఫీసు మానేస్తారు, రోడ్డు మీద జులాయి వెధవల్లా తిరుగుతూ ఉంటారు , ” అనీ ” ఉద్యోగం సరిగా చేయడం చేత కాదు అనీ కు విమర్శలు చేస్తూ వారిని హేళన చేస్తూ ఉంటాడు ! ఇతర కొలీగ్స్ అది విని మొహాలు చూసుకుంటూ ఉంటారు ! చిదానంద్ కు దూరం గా ఉంటారు ! ఇక్కడ చిదానందుల వారు చేసే పొరపాటు ఏమిటంటే , తన చీకాకు లనూ , తన పని వత్తిడినీ , ఆగ్రహాన్నీ , ఇతరులమీద ఆపాదించడమే కాకుండా , ఇతరులను తిట్టడం , హేళన చేయడం చేస్తున్నాడు ! ఈ చర్య ఏ రకం గానూ ఆయన కు ఉపయోగ పడదు !
రోజూ చేసే ఉద్యోగం లో మీరు ఈ క్రింది విధం గా చేస్తారా?:
1. మీరు చేసే పనిలో ఏ పొర పాటైనా సంభవిస్తే , మీరు తిడతారా ?
2. ఫోనులో ఎవరినైనా తిడతారా ?
3. మీ పై అధికారి ముందు కానీ మీ బాస్ ముందు కానీ మీ నోట్లో నుంచి తిట్లు వస్తాయా ?
4. మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా , లేదా ఏ బిజినెస్ లోనైనా ఉద్యోగం చేస్తున్నా, మీ కస్టమర్ ల ముందు తిట్టడం జరిగిందా ?
5. మీరు కొన్ని తిట్లే తిడుతూ , బూతులను తిట్టకుండా నియంత్రించు కోగలుగు తునారా?
6. లేక మీరు తిట్టినప్పుడు నానా బూతులూ తిడుతుంటారా?
పై వాటిలో కొన్నిటికి కానీ , అన్నిటికీ కానీ మీ సమాధానం ఔనని ఉంటే, మీరు మీ బంగారు భవిష్యత్తు మార్గం లో మందు పాత్రలను మీ చేతులతోనే స్వయం గా అమర్చుకోవడం అవుతుంది ! ఎందుకంటే దూషణ , లేదా తిట్లు తిట్టడం అనేక విధాలు గా మీకు చేటు ! మీ అమూల్యమైన పని సూత్రాలకు విరుద్ధం !
మరి క్రోధాన్నీ , చీకాకునూ , ఏ విధం గా బయటకు తిట్ల రూపం లో డ్రెయిన్ చేయాలి ? :
మీరు ఏకాంతం గా ఉన్నప్పుడు , మీరు మీ కారులో ఒక్కరే డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు , లేదా ఇంట్లో మీరు ఏకాంతం గా ఉన్నపుడు మాత్రమే చేయాలి ( అదీ మీకు చేయాలని అనిపిస్తేనే , కానీ పని కట్టుకుని చేయనవసరం లేదు కదా ! )
తరచూ తిట్టే వారూ , బూతులు తిట్టే వారు వ్యాధి గ్రస్తులా ?:
సామాన్యం గా తరచూ తిట్టే వారు కేవలం చీకాకు వల్ల, తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు తట్టుకోలేకనో , లేదా తీవ్రమైన వత్తిడి వల్లనో తిడుతూ ఉంటారు ! వారికి ఎవరినైనా తిడితే ” మనశ్శాంతి ” ఏర్పడుతుంది ! కానీ అరుదుగా ‘ టూరెట్ సిండ్రోం ‘ అనే వ్యాధి ఉన్న వారు, విపరీతం గా బూతులు తిడుతూ ఉంటారు , వారికి వారి నోటి ” దురద ” బూతులు తిడితే కానీ తీరదు ! మీ బాస్ ఎవరైనా బూతులు అదే పనిగా తిడుతూ ఉంటే , వారిని టూరెట్ వ్యాధి గ్రస్తులని అనుమానించాల్సిందే !
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం !