Our Health

Archive for మార్చి 7th, 2013|Daily archive page

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ మీ ఇంటర్వ్యూ రోజు అనుకోండి !

In మానసికం, Our minds on మార్చి 7, 2013 at 11:20 సా.

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ  మీ ఇంటర్వ్యూ  రోజు అనుకోండి ! 

 క్రితం టపాలో పని సూత్రాలలో వస్త్ర ధారణా , ఆభరణాలూ , పాద రక్షలూ మొదలైన విషయాలలో మీరు తీసుకో వలసిన జాగ్రత్తలూ, శ్రద్ధా  ఎట్లా ఉండాలో చూశాము కదా ! ఇప్పుడు ఇంకొన్ని వ్యక్తి గతమైన శ్రద్ధ ఏ  రకం గా మీ ఉద్యోగం లో మీ అభి వృద్ధి కి దోహద పడతాయో తెలుసుకుందాం ! 
1. మీరు ధరించే బట్టలు , ఎప్పుడూ ,  ఉతికి ఇస్త్రీ చేసినవీ , తాజాగా మడతలు లేకుండా ఉన్నవీ ధరించండి ! అంతే కాకుండా , గుండీలు అంటే బటన్స్ లేదా బొత్తాములు కొన్ని ఊడి పోయినవీ , లేదా కొన్ని చివర్లలో కుట్లు ఊడి పోయినవీ, లేదా చిన్న వైనా  మచ్చలు ఉన్న వస్త్రాలు ధరించి ఆఫీసుకు గానీ మీరు పని చేసే స్థానానికి గానీ వెళ్ళడం శ్రేయస్కరం కాదు ! 
2. రోజూ తాజాగా , స్నానం చేసి , డి  ఓడరెంట్  స్ప్రే చేసుకుని ఆఫీసు కు వెళితే  మీ శరీరం తో పాటుగా , మీ మనసు కూడా ఉల్లాసం గా ఉండి , మీరు బాగా పని చేయగలగడమే కాకుండా , మీ బాసు మెప్పు కూడా పొంద గలరు ! 
3. మీ కేశాలంకరణ కూడా తాజాగా చేసుకుని వెళ్ళడం మంచిది. ట్రిమ్ చేసిన హేర్ కట్ చేసిన తలలు కూడా  కార్పోరేట్ కల్చర్ కు అనుగుణం గా ఉంటాయి ! ఉష్ణ దేశాలలో , మీ తల మీద హేర్  ట్రిమ్ చేసి ఉంటే హాయి గా కూడా ఉంటుంది ! 
4. పురుషులు రోజూ షేవ్ చేసుకుని ఆఫీసు కు వెళితే వారు వారి బాసు మీద మంచి ఇంప్రెషన్ ఏర్పరచడమే కాకుండా , వారి సహచర యువతుల్లో ప్రేమ భావనలు, అవి లేక పొతే కనీసం స్నేహ భావనలైనా కలిగించ గలరు ! ఎందుకంటే చాలా మంది యువతులు, పురుషులు ఫ్రెష్ గా షేవ్ చేసుకుంటే నే ఇష్ట పడతారు ! 
5. చేతులు ఎప్పుడూ శుభ్రం గా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి !  కారు డ్రైవ్ చేసీ, లేదా  బైక్ కానీ సైకిల్ కానీ నడిపి , మాసి పోయీ , నల్లని గ్రీజ్ మరకలు, మసీ అంటి ఉన్న చేతులతో ఆఫీసులో ఎవరికీ కనపడడం మంచిది కాదు !  మీ పని రీత్యా,  కొంత సమయం మీ చేతికి మలినాలు అంటినా కూడా ! ఎందుకంటే , అపరి శుభ్రం గా ఉన్న చేతులు ముఖ్యం గా అనారోగ్య కరం !  మానవుల కు వచ్చే అనేక రకాలైన ఇన్ఫెక్షన్ లు కేవలం చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. మీ ఆఫీసు లో ఇతర ఉద్యోగులు కానీ  లేదా మీ కస్టమర్స్ కానీ మీతో హ్యాండ్ షేక్ లేదా కరచాలనం చేయడానికి ఇష్ట పడరు , మీ చేతులు మలినం గా ఉంటే ! ఇంకో ముఖ్య విషయం , ఆఫీసులలో కానీ , మీరు పని చేసే స్థానం లో కానీ , ప్రేమాయణాలు కనుక జరిపే వారి కి  మలినమైన చేతులు చాలా నష్ట దాయకం  ! 
6. చేతి వేళ్ళ గోళ్ళు , అమ్మాయిలకు అందం గానే ఉంటాయి , క్రమం గా మ్యానిక్యూర్ చేయించు కుంటూ ఉంటే , కానీ పెరిగి ఉన్న గోళ్ళు , లేదా గోళ్ళ క్రింద మలినాలతో నల్ల గా మారి ఉన్న గోళ్ళూ, పురుషులకు ఉంటే ఆ పురుషులు అపరిశుభ్రం గా ఉన్నట్టు కనిపిస్తారు !
7. చాలా మంది  ఆఫీసుకు వెళ్ళే తొందరలో ఫలహారం అంటే టిఫిన్ చేసీ , లేదా అన్నం తినీ , వెంటనే తమ వాహనాల మీద ఆఫీసులకు ప్రయాణం అవుతూ ఉంటారు ! దానితో , పళ్ళ మధ్య చేరిన ఆహార పదార్ధాలు ఇరుక్కుని, తరువాత కొన్ని గంటలకు, వారు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు , దుర్వాసన వస్తూ ఉంటుంది ! అందువల్ల క్రమం గా బ్రష్ చేసుకోవడమూ ( ప్రత్యేకించి ఏమైనా ఆహారం తిన్న తరువాత ), లేదా ఆ అవకాశం లేని స్థలాల్లో  నోటిని తాజాగా ఉంచే చూయింగ్ గం ను నమలడమో  చేయాలి ! కానీ ఆఫీసులో కాదు ! 
8. ఆల్కహాలు , టీలు , కాఫీలు అలవాటు ఉన్న వారు కూడా వారి నోటి పరిశుభ్రత విషయం లో శ్రద్ధ తీసుకోవాలి ! ప్రత్యేకించి ఆల్కహాలు తాగే అలవాటు ఉన్న వారి దగ్గర రెండు రకాలు గా వాసన రావడానికి అవకాశం ఉంది ! ఒకటి  వారు క్రితం రాత్రి ఎక్కువ  మోతాదు లో తాగితే , వారు ఊపిరి వదులు తున్నప్పుడు , ఒక రకమైన ఆల్కహాలు వాసన వస్తుంటుంది ! వారి శరీరం ఎక్కువ గా చెమట పట్టి కూడా వాసన వస్తుంది ! అంతే కాక , వారి నోటిలో ఆల్కహాలు నోటి చర్మం లో కలిగించే మార్పుల వల్ల కూడా వాసన వస్తుంది !   పని సూత్రాలలో ముఖ్య సూత్రం: సిగరెట్లూ ,  మద్యమూ , మాదక ద్రవ్యాలూ ముట్టుకోక పోవడం ! ఎందుకంటే అవి  పని సూత్రాలు పాటించే వారి  దీర్ఘ కాలిక లక్ష్యాలను  ఒక్క సారి గా అగాధం లో పడవేస్తాయి !  ఎందుకంటే ఆ లక్షాలు వారు చేరుకునే లోగానే , వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఇట్లాంటి అలవాటు ఉన్న వారు పని సూత్రాలు పాటించినా , వాటి ప్రయోజనాలు అనుభవించకుండానే అనారోగ్య బారిన పడతారు ! వారికి పని సూత్రాలు  నిరుపయోగం ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

%d bloggers like this: