పని సూత్రాలు. 21. మీ మాటే మంత్రమూ !
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం – మీ సంభాషణ ! అవును ! చక్కటి భాష ప్రతి మానవుడికీ , ఇతర మానవులతో సంబంధాలు పెట్టుకో డానికీ , వాటిని చక్కగా కొనసాగించ డానికీ కూడా అతి ముఖ్యమైన సాధనం ! సాంకేతికం గా మానవులు ఎంత పురోగమిస్తూ ఉన్నా , అనేక రకాలైన గాడ్జెట్ లు ప్రతి రోజూ మార్కెట్ లోకి వస్తున్నా కూడా , వాటితో మాట్లాడడం మానవులే కదా చేయాల్సింది ! అంతే కాకుండా , వారు చేస్తున్న ఉద్యోగాలలో , లేదా ఏ రకమైన వర్క్ ప్లేస్ లోనైనా ఇతర ఉద్యోగులతోనూ , లేదా వారి పై అధికారి తోనూ , లేదా వారి క్రింద పని చేస్తున్న వారితోనూ , సవ్యమైన సంబంధాలు కలిగి ఉండడానికి వారి సంభాషణ ఎంతో ఉపయోగ పడుతుంది !
మనం చూస్తూ ఉంటాం ! చదువుకునే కాలేజీలలో కానీ స్కూళ్ళ లో కానీ , ప్రత్యేకించి భారత దేశ విద్యాలయాల లో , వైవా లేదా సబ్జెక్ట్ విషయాలు మీరు మాట్లాడుతూ సమాధానం చెప్పే విధానం – దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వ బడుతుంది ! దానికి తగ్గట్టు గానే , చాలా మంది విద్యార్ధులు కూడా , చాలా నిశ్శబ్దం గా , వారికి గొంతు ఉందా లేదా అన్నంత అనుమానం కలిగించే లా ఎప్పుడూ వారి మాట వినపడక పోయినా కూడా , లిఖిత పరీక్షల లో చాలా బాగా పర్ఫాం చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారు ! కానీ వారు వారి చదువులు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు , వారి లోపాలు వారికి తెలుస్తాయి. వారి లోపాలు అనడం కన్నా , విద్యా విధానం లో లోపాలు అనవచ్చు నెమో ! ఎందుకంటే , నిత్య జీవితం లో ప్రతి మానవులూ , ఇతరుల తో సంబంధాలు కేవలం లిఖిత పూర్వకం గా ఎప్పుడూ కోన సాగించ లేరు కదా !
మరి చక్కగా మాట్లాడడం ఆంటే ఏంచేయాలి ?:
1. ఇతరుల తో మాట్లాడుతున్న సమయం లో మనం మంబ్లింగ్ , అంటే గొణగడం , లేదా గుస గుసలాడం చేయకూడదు ! ఎందుకంటే , ఇతరులకు మనం మాట్లాడేది ఏమిటో సరిగా వినబడదు , వినపడ్డా , దానిలో స్పష్టత లోపిస్తుంది. అంతే కాక ముఖ్యంగా , గొణిగే వారిని ఆత్మ విశ్వాసం తక్కువ గా ఉన్నవారిలా అనుకునే ప్రమాదం ఉంది !
2. అతి నిదానం గా అతి మృదువు గా కూడా మాట్లాడ కూడదు ! ప్రత్యేకించి మీరు పని చేసే స్థానాల్లో ! మీ భాగ స్వామి తో కానీ , మీరు ప్రేమలో పడ్డప్పుడు కానీ అట్లా మాట్లాడడం మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా నే మీకు వస్తుంది, మీ హృదయం లో ప్రేమ తరంగాలు ఎగిసి పడుతున్నప్పుడు , మీ మనసు తేలిక అవుతుంది , మీ మాట బరువు అవుతుంది , దానితో అతి మృదువు గా మారి , వినే వారి చెవులకు ప్రేమ గంధం పూయ బడుతున్న భావన కలుగుతుంది ! మరి ఇంత ప్రత్యేకత ఉన్న మృదు భాష ను మీరు పని చేసే చోట ఉపయోగించడం ? కేవలం మీరు అక్కడ కూడా ఎవరితో నైనా ప్రేమాయణం సాగిస్తేనే చేయాలి !!!
3. కలగా పులగం గా మాట్లాడకూడదు !: అంటే మీరు పని చేసే ప్రదేశం ,ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ అవుతే , అక్కడ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సాంకేతిక పదాలు వాటికి సంబంధించిన మాటలే మాట్లాడాలి కానీ , మీరు తెలుగు కవిత్వం లో మీ పాండిత్యం అక్కడ చూపించ కూడదు ! అది పూర్తి గా అసందర్భం అవుతుంది !
4. భాష దేశ కాల పరిస్థితుల బట్టి , మన చుట్టూ ఉండే మనుషుల భాష ను బట్టీ కూడా మారుతూ ఉంటుంది ! ఒక్కో ప్రాంతం లో ఒక్కో యాస కూడా ఉంటుంది ! వీలైంత వరకూ మనం పని చేసే చోట , మన యాసలూ అంటే యాక్సెంట్ లు అతి తక్కువ గా ఉపయోగిస్తూ మాట్లాడితే లాభ కారి గా ఉంటుంది !
5. ఇంగ్లీషు మన భాష కాదు ! ఒక ఉదాహరణ : ఆంధ్ర దేశం నుంచి కొంత కాలం క్రితం, ఒక తెలుగు డాక్టర్ ఇంగ్లండు వెళ్ళాడు. అక్కడ ఆయన గారు , తన కొలీగ్స్ ( తెల్ల వారు ) తో ఒక డిన్నర్ కు వెళ్ళాడు. టేబుల్ దగ్గర ఆయన తన పక్కన ఉన్న ( తెల్ల ) వ్యక్తి తో అతని పక్కన ఉన్న నీటి జగ్గు అందివ్వమని ” ప్లీజ్ పాస్ వాటర్ ” అన్నాడు. అప్పుడు ఆ ( తెల్ల ) వ్యక్తి పగల బడి నవ్వాడు ట ! ఎందుకంటే లోకల్ గా ” పాస్ వాటర్ అంటే ” మూత్రం చేయమని కూడా అర్ధం వస్తుంది ! ( ఆ డాక్టర్ ప్లీజ్ పాస్ ది జగ్ అని ఉండాల్సింది ! ) అందువల్ల , భాష లో బాగా పట్టు ఉంటే తప్ప ఇతర భాషలలో మనం, ప్రత్యేకించి ఉద్యోగాలలో ఏ ప్రయోగాలూ చేయ కూడదు ! ( ఆ విషయం లో మనం ఎంతో మేలు ! ఎందుకంటే , భారత దేశం లో చాలా మందికి కనీసం మూడు భాషలు వస్తాయి ! కానీ పాశ్చాత్య దేశాలలో వారి మాత్రు భాష తప్ప ఇతర భాషలు తెలియవు ఉదాహరణకు ఇంగ్లండు పొరుగు దేశం అయిన ఫ్రెంచి వారికి ఇంగ్లీషు రాదు ! అట్లాగే ఇంగ్లండు లో ఇంగ్లీషు మాట్లాడే వారికి ఫ్రెంచ్ భాష తెలియదు !
మనం ఎట్లా మాట్లాడ కూడదో తెలుసుకున్నాం కదా మరి ఎట్లా మాట్లాడాలి ?:
మనం మాట్లాడే భాష స్పష్టం గా , ఇతరులకు అర్ధమయే రీతి లో , చిన్న చిన్న పదాలలో క్లుప్తం గా నూ , ఆహ్లాద కరం గానూ ఉండాలి ! అప్పుడు మీ మాట ఇతరులకు మంత్రం లా పని చేసి , మీతో సత్సంబంధాలు ఏర్పరిచే వారధి అవుతుంది !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !