Our Health

Archive for మార్చి 26th, 2013|Daily archive page

పని సూత్రాలు. 33. ప్లీజ్ , థ్యాంక్ యూ లతో, మీ పనులు సులువు చేసుకోండి !

In మానసికం, Our minds on మార్చి 26, 2013 at 7:53 సా.

పని సూత్రాలు. 33. ప్లీజ్ , థ్యాంక్ యూ  లతో, మీ పనులు సులువు చేసుకోండి ! 

మనం సర్వ సాధారణం గా ఇతరుల సహాయం రోజులో ఎప్పుడో ఒక సమయం లో తీసుకుంటూ ఉంటాము. మనం చేసే ఉద్యోగం లో కానీ , పని చేసే చోట కానీ ,ఇతరుల తో కొన్ని కొన్ని పనులు చేయమని అడగడమూ , చేయించు కోవడమూ , లేదా వారికి చేసి పెట్టడమూ , జరుగుతుంది రోజూ ! 
కానీ మీరు  ఇతరులతో పని చేయించుకునే ప్రతి సారీ , ” ప్లీజ్ ” అనడం కానీ , ” దయ చేసి ” అనడం కానీ అలవాటు చేసుకోండి !  అదే విధం గా మీరు అడిగిన పనిని చేసిన వారికి మీ కృతఙ్ఞతలు చెప్పడం మరచి పోకండి ! మానవులు సహజం గా  స్వేఛ్చా పిపాసులు ! వారు వారి పనులను , ఎవరో నిర్బంధించి చేయించుకుంటే ఇష్ట పడరు . వారు అయిష్టం గా  ఆ పనులు చేసినా , వారికి మనసులో ఒక అనీజీ అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. ప్రత్యేకించి, మీరు చెప్పిన పనిని చేశాక , మీరు వారికి ఏ రకమైన కృతజ్ఞతలూ తెలుపక పొతే , ఇంకా నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది !  ”పని చేయించుకుంటాడు కానీ  కనీస మర్యాద కూడా తెలియదు ” అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. భారత దేశం లోనైతే , మీరు చేసిన ప్రతి పనికీ  ” ఎంతో  కొంత ” మీ పని చేసిన వారికి ” ముడుపు ” గానో , ” దక్షిణ ” గానో , లేదా ” పర్సెంటేజ్ ” రూపం లోనో సమర్పించుకుంటూ ఉండ వలసిందే  కదా ! 
కానీ మీరు ఉద్యోగం చేసే చోట మీ కొలీగ్స్ తోనో , మీ క్రింద పని చేస్తున్న వారితోనో , పని చేయించుకోవాల్సి వచ్చినపుడు ” అట్లాంటి ముడుపులు ” సమర్పించు కోక పోయినా కూడా , మీరు కనీస మానవ విలువలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి ! మీరు చేయమని అడిగే ప్రతి పనికీ , ” దయ చేసి”  అని కానీ ” ప్లీజ్ ” అని కానీ అడిగితే మీకు కావలసిన పని త్వరగా జరుగుతుంది. పాశ్చాత్య దేశాలలో  ఈ పట్టింపులు చాలా ఉంటాయి ! అక్కడ ఎవరితోనైనా , ఎపనినైనా మనం చేయించుకుంటే , ఆ పని చేసినందుకు బోలెడంత ” ఫీజు ” మనం వారికి చేల్లిస్తున్నా కూడా , ప్లీజ్ అని పని పూర్తి  అయ్యాక  ” థ్యాంక్  యూ ” అని చెప్పడం సర్వ సాధారణం !  
భారత దేశం లో ఇంకో అలవాటు కూడా  మనకు కనిపిస్తూ ఉంటుంది !  మీరు ఇతరులను ఎవరినైనా వారు మీ పని చేసినందుకు  ప్రశంసిస్తే వారు వెంటనే ”ఆహా హా అదేంటండీ , భలే వారే మీరు , దాన్లో ఏముందండీ ” పరవాలేదండీ ” అంటూ మెలికలు తిరిగి పోతూ ఉంటారు ఒక అయిదు నిమిషాలు ! 
అట్లా కాకుండా ప్రశంసలను  స్వీకరించి ” థ్యాంక్ యూ ” అనడం సవ్యమైనది గా ఉంటుంది ! మీరు ఎవరినైనా  దయచేసి ఈ పని చేసి పెట్టండి అనడాన్ని  ఇంగ్లీషు పదం ప్లీజ్ ఉపయోగించినపుడు కూడా  ప్లీజ్ ఈపని చేసి పెట్టండి ” అని మాత్రమే అనండి , కానీ , ఆ ప్లీజ్ ను చాంతాడంత చేసి   pleeeeeeeeeeeeeeeeeeease   అని సాగ తీయకండి ! మీరు ప్లీజ్ అన్నపుడు కానీ , కృతఙ్ఞతలు చెబుతున్నపుడు కానీ మనస్పూర్తి గా  ఆ పదాలు వాడండి ! ఈ ప్లీజ్ లూ  థ్యాంక్ యూ లూ చాలా చిన్న పదాలూ , చాలా సాధారణ పదాలూ అయినా కూడా , ఆ పదాలతో మీరు మీ  మానవ సంబంధాలలో మ్యాజిక్ చేయవచ్చు ! ఇతరులతో మీ సంబంధాలను చెప్పుకో దగినంత గా పెంపొందించు కోవచ్చు ! 
ప్రయత్నం చేయండి , ప్లీజ్ ! , థ్యాంక్ యూ !
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

%d bloggers like this: