పొగాకు కు ఋణం – ప్రాణం పణం . 15. స్మోకింగ్ ఆపటం లో యువత పాత్ర.
ఇంతవరకూ పోస్టు చేసిన టపా ల లో పొగాకు గురించీ , పొగాకు పీల్చటం వల్ల మానవులలో జరిగే హానీ, మానవులు పొగ పీల్చుతూ, తమ చుట్టూ ఉన్న వారికి చేసే హాని గురించీ చాలా వివరంగా చర్చించటం జరిగింది. ఇంకా ఏవైనా విషయాలు ఏవైనా ముఖ్యమైనవి ఇక్కడ పొందు పరచనివీ ఉంటే దయచేసి తెలియ చేయండి.
నేను గమనించిన విషయం : మన దేశం లో యువత చాలా శక్తి వంతమైనది గా ఎదుగుతుంది. అనేకమంది యువకులు, అత్యంత ప్రతిభా సామర్ధ్యాలు ఉన్నా , మన దేశం లో వివిధ సేవా సంస్థలను స్థాపించి, అనేక వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటూ, ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు.
అనేకమంది నిపుణులైన యువతీ యువకులు బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ , కొందరు ఉద్యోగాలు త్యజించీ తమకు తోచిన రీతిలో మానవ సేవ చేస్తున్నారు.
పొగాకు నిర్మూలనలో కూడా మన యువత పాత్ర ఎంతో ఉంది.
వివిధ పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వాలు పొగాకు అరిష్టాలు గుర్తించి, పొగాకు నిర్మూలనకు అనేక బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. వారు కనిపెట్టి, ఉత్పత్తి చేసిన, చేస్తున్న సిగరెట్టులు చేస్తున్న హాని వారినే నిర్మూలిస్తూన్నందుకు చాలా ఆందోళన పడి అనేక చర్యలు తీసుకుంటున్నారు, వేగంగా.
ఇక మన దేశ పరిస్థితి: గత ఐదు సంవత్సరాలలో అక్షరాలా యాభయి వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, సహాయం మాట అటుంచి, కనీసం భారత పార్లమెంట్ లో చర్చ కూడా చేయలేదు ఇంతవరకూ అంటే మిగతా విషయాల పైన వారి ఉత్సాహం ఎంత ఉంటుందో ఊహించ వచ్చు.
అందులో పూర్తిగా స్వయంకృతమైన పొగాకు వాడకం మీద వారికి అంటే ప్రభుత్వానికీ , ‘ నాయకులకూ’ అసలే పట్టదు.
ఈ పొగాకు వాడకం వల్ల ఎక్కువ గా నష్ట పోయేది పేద ప్రజలే ! దానికి పేదరికం తో పాటు పొగాకు వల్ల కలిగే అనర్ధాలు వివరంగా వారికి తెలియని అజ్ఞానం వల్లనే.
ఇక్కడే మన యువత కర్తవ్యం ఎంతో ఉంది.
విజ్ఞానం కేవలం ఇంటర్నెట్ కో , గ్రందాలయాలకో , లేక విజ్ఞాన వంతుల మస్తిష్కాలకో పరిమితం కాకుండా నిజంగా కావలసిన వాళ్లకు పంచినప్పుడే దాని ప్రయోజనం.
అంకిత భావం కల విద్యావంతు లైన యువత స్వయంగా కానీ, వివిధ సేవా సంస్థల లో చేరి కానీ, పొగాకు నిర్మూలనా యజ్ఞం లో భాగ స్వామ్యులు కావచ్చు. వారం లో కనీసం ఒక రోజు మీరు పొగాకు నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు పొగాకు అనర్ధాలు తెలిపి , వారిచేత పొగాకు వాడకం మాన్పిస్తే అది మహత్తర కార్యం అవుతుంది.
రెండో ప్రపంచ యుద్ధం లో అణు బాంబు వల్ల మరిణించిన జపనీయులు మూడు లక్షల మంది. కానీ పొగాకు అనర్ధాల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనీసం ఒక లక్ష మంది మరణిస్తున్నారు, ప్రతి వారమూ అంటే ప్రతి ఏడు రోజులకూ !!! ( currently one lakh people are dying every seven days around the world due to cigarette smoking . according to the world health organisation report ) అంటే పొగాకు వాడకం ఒక నిశ్శబ్ద బాంబు . ఈ ‘ బాంబు ‘ అణు బాంబు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ఐతే ఈ ‘ బాంబు ‘ అతి నెమ్మది గా అనేక లక్షలమంది చేత ‘ ఆత్మహత్య ‘ చేయించుతున్న ‘ బాంబు ‘ !!! ఇతరుల ప్రమేయం లేకుండా !!!
క్రింద పొగాకు నిర్మూలన లో ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం కొన్ని వెబ్ సైట్లు పొందు పరచటం జరిగింది.
1.WWW.WHO.INT.tobacco/en. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటు. పొగాకు కంట్రోలు కు వివిధ కార్యక్రమాలు పొందు పరచ పడ్డాయి ఇందులో.
2. http://www.ash.org.uk. ( action for smoking and health ) పొగాకు వాడకం పైన అన్ని వివరాలూ ఉన్న ఇంకో మంచి సైటు.
3. http://www.quit. org.uk ( quit organisation UK ) పొగాకు మానేద్దాము అనుకునేవారికి అన్నివిధాలా సహాయం చేసే వెబ్సైటు.
4.www.tobaccocontrolgrants.org. అమెరికన్ దాత , ‘ న్యూ యార్క్ మహానగర మేయరు అయిన మైకేల్ బ్లూం బర్గ్ నెలకొల్పిన సేవా సంస్థ. ప్రధానం గా ఆయన దానం చేసిన నిధితో స్థాపించ పడ్డ సంస్థ. అంకిత భావమూ , ఉత్సాహమూ, పట్టుదలా, క్రుతనిశ్చయాలు కల యువతీ యువకులు. ఈ వెబ్సైటు కు వెళ్లి నేరుగా అప్లై చేయవచ్చు, గ్రాంటు కోసం.
మీకు తగిన ప్రావీణ్యత కూడా ఇస్తుంది ఈ సంస్థ, ఉచితంగా. వారు నడిపే ఆన్ లైన్ కోర్సు పూర్తిచేసి, ( ఇది కూడా ఉచితమే ) పొగాకు కంట్రోలు కార్యక్రమం లో క్రియా శీలురవచ్చు ఎవరైనా !! . ఈ సంస్థ ఆశయం ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొగాకు వాడకం వీలైనంత తగ్గించాలనే. అందు వల్ల మీకు అవకాశాలు ఎక్కువ, తగిన అర్హతలు ఉంటే !! ప్రయత్నించండి.
ప్రపంచ చరిత్రలో అనేక మంది లో మార్పు తెచ్చింది అతికొద్ది మంది మానవులే కదా !!! మీలో ఆ కొద్ది మంది ఉన్నారని నా సంపూర్ణ విశ్వాసం !!!
TRASH CIGARETTES !!! BEFORE THEY trash (Y)OUR LIVES !!!
( TRASH = Think Rationally And Stop Harming – yourselves and others )
అత్యంత ప్రతికూల పరిస్థితులలో , కృతనిశ్చయం లో తన లక్ష్య నిర్దేశనం చేసికొని విజయానికి అత్యున్నత శిఖరాలు అందుకొని , ఇటీవలే మరణించిన యాపిల్ కంపెనీ అధినేత యువతకు ఇచ్చిన స్ఫూర్తి దాయకమైన సందేశం చూడండి ! ఇందులో మన హిందూ వేదాంత ధోరణి కూడా సమ్మిళితమై ఉంది కదా !!!
ఈ టపా గురించి మీ అభిప్రాయాలు తెలుపండి !!!
చాలా చక్కని వ్యాసం వ్రాశారు.ప్రజలు ఆరోగ్యం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు.దానితో పేదరికంలోకి వెళుతున్నారు .పొగాకు ఉత్పత్తులన్నీ హానికర మైనవే !ప్రభుత్వం వాటిఫై పన్నులు భారీ ఎత్తున వేయాలి.వాటికి వ్యతిరేకం గా భారీ ఎత్తున ప్రచారం చెయ్యాలి.
రవిశేఖర్ ఒద్దుల
కృతఙ్ఞతలు రవిశేఖర్ గారూ,
నిజమే ! పొగాకు వాడకం తగ్గించటంలో ఎక్కువ పన్నులు వేయటం ఒక ముఖ్య చర్య !
ఓట్ల ముందు, ప్రజల ప్రాణం విలువ ఏ పార్టీ కీ అక్కరలేదు కదా ! అందువల్లనే ఏ పార్టీ కూడా వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళదు. వెళ్ళినా పెద్దగా ప్రజలకు చేసిందీ ఏమీలేదు, కాగితాల మీద చర్యలు తప్ప.
అందుకే అందరిలోనూ పొగాకు అనర్ధాల గురించి మంచి అవగాహన ఏర్పడాలి. ఒక లక్ష మంది పొగాకు రైతులూ వారి కుటుంబాలకోసం, ఎన్నో లక్షల మంది ప్రాణాలను పణం గా పెట్టడం సమంజసం కాదు. ఆ రైతులకు పునరావాసం కలిగించేందుకు ఖర్చు చేసే డబ్బు , లక్షలాది ప్రజల ధన , ప్రాణ నష్టాల తో పోలిస్తే ఎంతో తక్కువ. ఇక్కడ లోపించినది కేవలం దీర్ఘ కాలిక ప్రణాళికా, చిత్త శుద్ధి మాత్రమే !!
సుధాకర్.