మరి నవ్వడం ఎట్లా ? 6.
3. హా హా హా అనండి, బూ హూ హో అని కాదు :
మనం నవ్వే సమయం లో సాధారణం గా హా హా హా అని నవ్వుతాము. కొందరు ‘ నవ్వు సాంగులు ‘ ఉంటారు . వారు వెకిలి నవ్వులు నవ్వుతారు. ఉదా: హా హా హా కు బదులు బో హూ హో అనో లేదా సివంగి అరిచి నట్టో, పిల్లి క్రోధం తో వికృతం గా అరిచినట్టో నవ్వుతారు. ఇంకొందరు నవ్వితే ఏవో వింత వింత ధ్వనులు – మనం అంతకు క్రితం ఎప్పుడూ వినని ధ్వనులు విన్పిస్తూ ఉంటాయి. మరి కొందరు నవ్వుతూ ఉంటే, వారు నవ్వుతున్నారో , ఏడుస్తున్నారో తెలియదు. మనసులో ఏడుస్తున్నా కనీసం పైకి నవ్వే సమయం లో కూడా వారి ఏడుపు నవ్వు కనిపిస్తుంది , వినిపిస్తుంది కూడా ! అందువల్లనే మనం నవ్వుతూ ఉన్నప్పుడు సహజం గా హ్హ హ్హ ,హ్హ అని నవ్వుకుంటే నిజం గా సహజమైన నవ్వు లా ఉంటుంది , ఇంకో విధం గా నవ్వే నవ్వు , అసహజం గానూ , ఏవగింపు కలిగించేది గానూ ఉంటుంది.
4. మీ పొట్టలో నవ్వును ఫీల్ అవ్వండి : అంటే మీరు నవ్వే నవ్వు , మీ పొట్టలో నుంచి పుట్టాలి ! మీరు మీ పొట్ట లోనుంచి కాక పై పైకి హ హ హ అన్నారనుకోండి. అది నవ్వులా లేకుండా , పేలవం గా జీవం లేకుండా ఉంటుంది. అది నవ్వు అని పించుకోదు కూడా ! మనస్పూర్తి గా నవ్వే నవ్వు ,మీ ఉదర కండరాలను కూడా బాగా సంకోచింప చేస్తుంది. అంటే మీ అబ్డామినల్ మసుల్స్ ను సంకోచ వ్యాకోచ పరుస్తుంది. అది మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ కరం కూడానూ ! అందుకే మనం అంటూ ఉంటాము, సామాన్యం గా బాగా నవ్వితే ‘ పొట్ట చెక్కలయ్యే లాగా నవ్వాము ‘ అని.ఇట్లా నవ్వుకునే నవ్వు కొన్ని తరంగాల లాగా వస్తుంది కూడా !
5. మీ నవ్వును కుదించండి : అంటే మనం నవ్వే నవ్వు సహజం గా మొదట ఎక్కువ శబ్దం చేస్తూ కొంత సమయం కాగానే ఆ శబ్దం తగ్గి మనం నవ్వడం క్రమం గా ఆపేస్తాము. కానీ కొందరు నవ్వు మొదలెట్టారంటే ఆపకుండా , విపరీతమైన శబ్దం చేస్తూ చుట్టూ ఉన్న వారు నివ్వెర పోయేట్టు చేస్తారు. ఇంకొందరు తడిసి పోయిన దీపావళి చిచ్చు బుడ్లలా ‘ పుసుక్కు ‘ మని నవ్వుతూ ఉంటారు. మరి కొందరు పెద్దగా నవ్వడం మొదలు పెట్టి , సడన్ గా ఆపేస్తారు. ఇట్లా ఆకస్మికం గా నవ్వు ఆపే వారినీ , లేదా ఒక మాదిరి శబ్దం చేస్తూ మొదలు పెట్టిన నవ్వును క్రమేణా ఎక్కువ చేస్తూ నవ్వే వారిని అనుమానించ వలసినదే ! ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యెక మైన నవ్వు ఉంటుంది. నవ్వడం సహజమైన ఆనంద మైన భావన ను సంతోషం గా వ్యక్తం చేయడం. మీరు నవ్వుతూ ఉన్నారంటే , మీరు మీ చుట్టూ ఉన్న వారికే మీరు ఆనందం గా ఉన్నారని కూడా తెలియ చేస్తూ ఉన్నారన్న మాటే కదా ! అందు వల్ల మీరు ఈ మాత్రం బిడి య పడకుండా , సందేహించ కుండా సహజం గా నవ్వండి ఆనందం తో , ఆ నవ్వు మీ ఆరోగ్యాన్ని కూడా ఆనంద పరుస్తుంది !
మీకు తెలిసిన వారు నవ్విన నవ్వు మీకు బాగా నవ్వు తెప్పిస్తే , తెలియ చేయండి , నవ్వుతూ !
వచ్చే టపాలో ఇంకొన్నినవ్వు సంగతులు తెలుసుకుందాం !