ఎట్లా నవ్వాలి ?.7. నవ్వడం ముఖ్యం !
క్రితం టపాలో మనము ఎట్లా నవ్వాలో కొంత వరకు తెలుసుకున్నాము కదా! మరి నవ్వడానికి విషయాలు ఏముంటాయి ? అని అనుకుంటే , మనకు ‘ మెదడుకు మేత ‘ లాగా, నవ్వుకు కూడా ‘ తినగలిగినంత ‘ అంటే నవ్వ గలిగినంత మేత పుష్కలం గా లభిస్తుంది మనకు !
ఎందుకంటే , మనం ఆంద్ర దేశం లో పుట్టాము ! తెలుగు వారం మనమందరం ! ఎందరు నాయకులు మనలను సమస్యల వలయాలలో ముంచే సినా , మనం మాత్రం నవ్వుల నావలలో తేలి పోగలము ! కష్టాల కడలిలో నవ్వుతూ ఈదుకుంటూ , దరి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము నిరంతరం ! రాష్ట్రాన్ని , దేశాన్ని , చివరకు మనుషులను కూడా చీల్చే , మహా మోసగాళ్ళు వివిధ రూపాలలో మనలను ప్రలోభ పెడుతున్నా , వారు జోకర్లు అనుకుంటూ కూడా , నవ్వుతూ , వారి ప్రలోభాలకు పొంగి పోతూ ఉంటాము ! నవ్వుతూ ఓట్లు వేస్తాము ! ( ఈ మాట, వోట్లు వేసే వారికే వర్తిస్తుంది ! ) ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కట్టి , మనకు అంద వలసిన నీరు అందక పోయినా మనకూ, ముఖ్యం గా మన ‘ నాయకులకూ ‘ ఏమాత్రం పట్టదు ! అఖండ భారత దేశం లో అపారం గా ఉన్న ఖనిజ సంపదను అప్పనం గా దోచుకుంటూ ఉన్న వారికి మనం నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ,చట్ట సభలకు కూడా వారిని గెలిపిస్తాము, నవ్వుతూ ! అడవుల ను నాశనం చేసి వాతావరణాన్ని చిన్నా భిన్నం చేసే పరిణామాలను కూడా మనం పట్టించుకోము ! ఎందుకంటే మనం, మన ఇంటి చుట్టూ గ్రీన్ బెల్టు లు పెంచమని మహా మేదావులైన మన నాయకులు ( జోకు ) సలహా ఇచ్చారు కదా అందువల్ల మనం విపరీతం గా ఆనంద పడి పోతాము, మన వంతు , వాతావరణం కోసం చేస్తున్నందుకు ! కుహానా నాయకులు, ఏనుగంత సమస్యలను చీమంత చేసీ , చీమంత సమస్యలను ఏనుగంత చేసి మాయ చేస్తున్నా , మనకు నవ్వు మాత్రమె వస్తుంది ! ఏ రక్షణ ఏర్పాట్లూ లేని అపార్ట్ మెంటు లో మనకు ఒక ఫ్లాటు దొరికిందని సంతోష పడి , మన పాట్లు మనం పడే , అల్ప సంతోషు లం మనం ! ట్రాఫిక్ నిరంతరం నత్త నడక లా సాగినా , నవ్వుతూ మన కార్య క్రమాలను చేసుకుంటూ ఉంటాము రోజూ ! మతం మానవులకు మత్తు మందు అని అన్నాడు మార్క్స్ . అదే విధం గా సినిమా మనకు ఆనందాన్ని కలిగించే మత్తు మందు. ‘ ఆ మందు ‘ ను ‘ ఆస్వాదించు తూ , అన్ని బాధలనూ మరిచిపోయి , ‘ హాయి ‘ గా మనలను నవ్వించ డానికీ , నవ్వుకొడానికీ , మనకు అనేక మంది హాస్య నటులు ఉన్నారు. ఇప్పుడు తెలిసింది కదా ! మనకు నవ్వుకోడానికి ఎంత ‘మేత ‘ లభిస్తుందో ! అందు వల్లనే మనం, కనీసం మనుగడ సాగించ గలుగుతున్నాము ! సుఖాల మాట దేవుడెరుగు ! ఎందుకంటే , ఆమాత్రం ‘ హాస్య పోషణ ‘ మనలను ‘ఆమాత్రం ‘ ఆరోగ్యం గా ఉంచుతుంది ! మిగతా వారెవరైనా , ఇప్పటికీ నవ్వని వారు కనుక ఉంటే , ఇక ఆలస్యం చేయ నవసరం లేదు ! ‘ ఈ నవ్వుల బండి ని ఎక్కండి ! ‘ నవ్వుకుంటే ‘ బలుసాకు తినవచ్చు ! ‘ సుఖం గా ‘ ! అసలు సుఖాల మాట ఎట్లా ఉన్నా ! ఎవడు మనలను, ఎడా పెడా దోచి పారేస్తున్నా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !