దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ) .1.
బాడీ లాంగ్వేజ్ లేదా దేహ భాష మానవులు తమ శరీర కదలికలతోనూ, కళ్ళ కదలికలతోనూ , ముఖంలో చూపించే హావభావాలతోనూ తమ మనసులో భావాలను , మాట్లాడకుండానే ఎదుటి వారికి ఎట్లా తెలియ చేస్తారో తెలిపే ‘ భాష ‘ .జేమ్స్ బోర్గ్ అనే శాస్త్రజ్ఞుడి అంచనా ప్రకారం, మానవుల పరస్పర సంబంధాలు తొంభై మూడు శాతం కేవలం వారి దేహ భాష తోనూ , కేవలం ఏడూ శాతం మాత్రమె వారి మాటల ద్వారానూ తెలియ చేసుకుంటారు .వివిధ పరిశోధనల ప్రకారం , అరవై నుంచి డెబ్బై శాతం మానవుల కమ్మ్యునికేషన్స్ , దేహ భాష ద్వారానూ , మిగతా ముప్పై నుంచి నలభై శాతం మాత్రమె మానవుల మాటల ద్వారానూ తెలుసుకోవచ్చు ఆని తేలింది. మానవులలోని అనేక లక్షణాలు కేవలం వారి దేహ భాష ద్వారా తెలుసుకోవచ్చు. ఆనందం , క్రోధం, విచారం , దుఖం , ఆశ్చర్యం , ఇట్లా అనేక భావాలు భాష తో అవసరం లేకుండా కేవలం దేహభాష ద్వారా కనుక్కోవచ్చు. ఇట్లా మన దేహం కదలికలనూ , ముఖ కవలికలనూ అధ్యయనం చేసే శాస్త్రాన్ని కైనెసిక్స్ ( kinesics ) అని అంటారు.
మనం ఇప్పుడు ఈ దేహ భాష లో కొన్ని అర్ధాలు పరిశీలిద్దాం !
1. ఇరువురి మధ్య దూరం : మీరు మీతో మాట్లాడుతున్న వారు మీకు ఎంత దగ్గర గా వస్తున్నారో గమనించండి. సూత్రం: మీ ఇరువురి మధ్య దూరం పెరిగితే వారు కూడా మీతో స్నేహానికి తొందర పడడం లేదని గమనించాలి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , వారు మీకు దగ్గర గా వచ్చి మాట్లాడడం చేస్తూ ఉంటె , మీ పొందు కోసం లేదా స్నేహం కోసం ‘ చేతులు చాస్తున్నారని ‘ అనుకోవచ్చు. ఇంకో అడుగు మీరు నిజం గానే ముందుకు వేశి ఎదుటి వారి తో మాట్లాడడానికి , లేదా సమయం గడపదానికీ మీరు ప్రయత్నించారనుకోండి . ఆ సమయం లో ఎదుటి వారు కూడా అక్కడే ఉండి కానీ, మీకు దగ్గర గా జరిగి కానీ మీతో మాట్లాడడం చేస్తూ ఉంటె వారు మీకు దగ్గరగా ఉండడానికీ , మీ స్నేహానికీ సుముఖత గా ఉన్నట్టు భావించ వచ్చు. ఈ రకం గా దగ్గర అవుతే పొందు కోరుతూ ఉన్నట్టు అనుకోవడం , వివిధ దేశాల లో ఉన్న ఆచార వ్యవహారాల మీద కూడా ఆధార పడి ఉంటుంది.
2. తల గమనించండి : అంటే ఎదుటి వారి హెడ్ పొజిషన్ ఎట్లా ఉంటుందో గమనించండి: కొంత వంచిన తలతో మీతో ఎవరైనా మాట్లాడుతుంటే , వారు మీతోనూ , మీ విషయాలనూ సానుభూతి తో అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. వారు వారి తలను వంచి మీవైపు చూస్తూ మీతో ఒక చిరు మంద హాసం చేస్తే , వారు మీతో కొంత చిలిపి గా కూడా ఉంటున్నట్టు అనుకోవచ్చు. అట్లా కాకుండా తలను ముందుకు వంచితే , అది చాలా అర్ధాలకు తావిస్తుంది. వినయం తో నూ , లేదా నేర భావనతోనూ , లేదా బిడియం తోనూ కూడా తలను ముందు కు వంచినట్టు అనుకోవచ్చు. ఈ పరిస్థితి కూడా వివిధ దేశాల ఆచార వ్యవహారాల మీద ఆధార పడి ఉంటుంది. మీరు ఏదైనా చెప్పినప్పుడు ఎదుటి వారు తల ముందుకు వంచితే , మీరు చెప్పినది వారికి అర్ధం కాక తికమక పడుతున్నట్టూ , లేదా ఆ విషయం మీద ఆలోచిస్తున్నట్టూ కూడా అనుకోవచ్చు. మీరు యువకుడైతే , మీ ఎదురుగా మీ దగ్గరగా ఉన్న అమ్మాయి ముందుకు తల వంచి కొద్దిగా చిరునవ్వు నవ్వితే , ఆమె కు మీతో పొందు ఇష్టమైనట్టు అనుకోవచ్చు. ( కనీసం తాత్కాలికంగా అయినా ! ) ( పైన ఉన్న చిత్రం చూడండి )
3. కళ్ళు : మన హావ భావాల ప్రకటన లో మన కళ్ళు చాలా ముఖ్యమైనవి. అనేక రకాల భావనలు , మాటలతో పని లేకుండా , కేవలం మన కళ్ళతో నే ఎదుటి వారికి తెలియ చేయ వచ్చు. మీ ఎదురు గా ఉన్న వారు పక్క చూపులు చూస్తూ ఉంటె , వారు నెర్వస్ గా ఉన్నారనీ , లేదా వారి దృష్టి వేరే వైపుకు మళ్ళింది అనీ , లేదా వారు మీతో అబద్ధాలు ఆడుతున్నారనీ కూడా అనుకోవచ్చు. అట్లాగే నేల వైపు చూస్తూ ఉంటె కూడా వారు బిడి యస్తులనీ , లేదా వారు ఎమోషనల్ గా అప్సెట్ అయ్యారనీ కూడా అనుకోవచ్చు.అందుకే అంటూ ఉంటాము ‘ వాడు ఏంటో నేల చూపులు చూస్తున్నాడు ‘ అని ( అంటే ‘ వాడి ప్రవర్తన సందేహ కరం గా ఉందని అర్ధం వచ్చేట్టు అంటాము )
కళ్ళు చెప్పే భావనలు మన తెలుగు సినీ కవులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే ఆశ్చర్య పడనవసరం లేదు కదా !
ఉదా: ‘ నీ కళ్ళు చెపుతున్నాయీ నను ప్రేమించావనీ ! అని ఒక పాట . కనులు కనులు కలిసెలే , కన్నె మనసు తెలిసే లే , విసురులన్ని పై పై నే అసలు మనసు తెలిసే లే ! అనీ ఇట్లా అనేకమైన పాటలు ఉన్నాయి. మీకు సమయం ఉంటె , పాటలు వినండి , ఇంకా సరదా గా యు ట్యూబ్ లో ఆ పాటలు చూస్తూ కూడా వినండి.
వచ్చే టపాలో బాడీ లాంగ్వేజ్ గురించి ఇంకొంత !
ఈ లోగా మీ అభిప్రాయాలు కొంత తెలియ చేయండి.!