వెనక నొప్పి . 9. నివారణ మార్గాలేమిటి ?
మునుపటి టపాలలో వెనక నొప్పి కి కారణాలేమిటి , చికిత్సా పద్ధతులేంటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ! మరి వెనక నొప్పిని నివారించు కో గలమా ?
దీనికి సమాధానం, చాలా వరకూ నివారించుకో గలమనే చెప్ప వచ్చు !
ఈ నివారణ మార్గాలు ముఖ్యం గా మూడు రకాలు
1. మన శరీర పోస్చర్ లేదా భంగిమ
2. వ్యాయామం
3. బరువులు ఎత్తే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు.
1. మన శరీర పోస్చర్ లేదా భంగిమ : మనం నిల్చోడమూ , కూర్చోవడమూ , పడుకోవడమూ , లేదా డ్రైవింగ్ చేయడమూ , ఈ వివిధ సందర్భాలలో మన భంగిమ ఎట్లా ఉంటుందనే దాని బట్టి వెనక నొప్పి రావడం , రాక పోవడం ఆధార పడి ఉంటాయి. ఈ చర్యలన్నీ , అప్పుడప్పుడూ అవక తవక గా చేస్తూన్నా , కొన్ని నెలలో లేదా కొన్ని సంవత్సరాలో చేస్తూ ఉంటే , తదనుగుణం గా వెన్ను పూస ఎముకలు , అవే వర్టిబ్రా , వాటి అమరిక , సహజ స్థానం నుంచి మారుతూ ఉంటాయి. ఈ అమరిక కేవలం కొన్ని కోణాలలోమారినా , ఆ ఎముకల పక్కన ఉన్న వెన్ను నాడి ని నొక్కి , నొప్పి కలిగించ గలవు ! అందుకే , మన ప్రతి భంగిమ లోనూ జాగ్రత్త పాటిస్తూ ఉండాలి.
ఉదాహరణకు , కూర్చునే పద్ధతిలో , నిటారు గా సీటు మీద కూర్చో కుండా , కుర్చీలో పూర్తి గా వేలాడుతున్నట్టు , ఏళ్ల తరబడి కూర్చుంటే , వెన్నుపూస ఎముకల అమరిక మారే రిస్కు ఉంది. అట్లాగే , చవక రకాల పరుపుల మీద పడుకుంటే , అవి అతి మెత్త గా ఉండి , వాటి మధ్య బాగం ఒక లోయ లా మారి , వెన్ను నొప్పి కలుగుతుంది.
2. వ్యాయామం : వ్యాయామం వల్ల , వెన్ను పూస చుట్టూ ఉండే కండరాలు దృఢ మైనవి గా ఉంటాయి. ఆ కండరాలు దృఢమైనవి గా ఉంటే , వెన్నుపూస ఎముకలు కేవలం సహజ స్థానాల్లోనే కదులుతూ ఉంటాయి. ఉదాహరణ కు , ఒక పది పుస్తకాలను ఒక దాని మీద ఒకటి పేర్చి , ఒక సంచీలో ఉంచి, పక్క నుంచి ఆ సంచీని తోస్తే , లోపల ఉండే పుస్తకాల వరుస పక్కకు జరుగుతుంది కదా ! అదే ఆ పది పుస్తకాలనూ , ఒక కార్టన్ లేదా చెక్క పెట్టె లో ఉంచి ఆ కార్టన్ ను కానీ , ఆ చెక్క పెట్టెను కానీ తోస్తే , ఆ పుస్తకాలు అదే వరస లో ఉంటాయి కదా ! వెన్ను పూస ఎముకల చుట్టూ ఉండే కండరాలు దృ ఢమ్ గా ఉంచుకోవడం అందుకే అవసరం ! అందుకే రోజూ వ్యాయామం ! ( పైన ఉన్న చిత్రం లో చూడండి , వ్యాయామం వివరాలు.) ఏ రకమైన వ్యాయామమైనా నిపుణుల సలహా తో నే చేయడం శ్రేయస్కరం. సామాన్యం గా ఈ వ్యాయామాలు నొప్పి తీవ్రతను బట్టి నిర్ణయించ నిర్ణయించ బడతాయి. గమనించ వలసినది , రోజూ కొంత బరువును మోస్తూ , నిలబడి పని చేస్తూ , నడుస్తూ ఉండే వారికి అంత సులభం గా వెనక నొప్పి రాదు. కేవలం , ఉద్యోగ రీత్యా , ఒకే స్థానం లో అంటే సీట్ లో కూర్చుని , ఏ రకమైన వ్యాయామ అలవాట్లూ లేని వారికే వెనక నొప్పి రిస్కు ఎక్కువ అవుతుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !