Our Health

Archive for జూలై 1st, 2014|Daily archive page

వెనక నొప్పి . 4. సయాటికా.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 1, 2014 at 9:17 సా.

వెనక నొప్పి . 4. సయాటికా. 

క్రితం టపా లో వెనక నొప్పి ఎట్లా వస్తుందో తెలుసుకున్నాం కదా , ఇప్పుడు సయాటికా లక్షణాలు చూద్దాం !
సయాటికా  అని దేనిని అంటారు ?
మన దేహం లో ప్రతి భాగానికీ విస్తరించి ఉన్న నాడీ మండలం లో ఉండే అన్ని నాడులూ తప్పనిసరిగా మెదడుతో అను సంధానమై  ఉంటాయి, అంటే మన శరీరం లో ఏ భాగమైనా కూడా స్పర్శ కానీ , నొప్పి కానీ , వత్తిడి కానీ ( అంటే టెన్షన్ కాదు ఇక్కడ ,  ఒక వేలు తో ఎక్కడైనా శరీరం మీద నొక్కితే ఏర్పడే అనుభవం ‘ వత్తిడి ‘ ) ఇట్లా ఎట్లాంటి స్పర్శ అయినా ఆ యా భాగాలలో ఉన్న నాడులు , మెదడుకు తెలియ చేయడం వల్లనే ‘ మనకు  తెలిసేది ‘ ! సయాటిక్ నాడి  కూడా  మెదడు తో అనుసంధానమై ఉన్న ఒక పొడవైన నాడి ! ఈ సయాటిక్ నాడి , నడుము దగ్గర నుంచి వెనుక భాగం లో రెండు కాళ్ళకూ రెండు నాడులు గా విస్తరించి ఉంటుంది. ఈ నాడి మార్గం లో ఎక్కడైనా, ఏ కారణం చేత నైనా వత్తిడి కలిగితే  , ఆ వత్తిడి తీవ్రత ను బట్టి నొప్పి కలుగుతుంది దీనినే సయాటికా అని అంటారు.
ఈ సయాటిక్ నాడి ఎంత వరకూ ఉంటుంది ? 
సయాటిక్ నాడి , మన శరీరం లో ఉండే నాడుల లోకల్లా అతి పొడవైన నాడి ! ఈ నాడి , కటివలయం అంటే పెల్విస్ నుంచి పిదురుల ( అంటే హిప్స్ ) గుండా పాదం వరకూ విస్తరించి ఉంటుంది !   అంటే, రెండు కాళ్ళ లోనూ రెండు సయాటిక్ నాడులు ఉంటాయి. 
సయాటిక్ నొప్పి ఎట్లా ఉంటుంది ?
మిగతా నొప్పులు సామాన్యం గా సమస్య ఉన్న చోటే నొప్పి కలిగిస్తాయి. కానీ సయాటికా నొప్పి  వత్తిడి ఉన్న చోట కాకుండా , ఆ నాడి విస్తరించి ఉన్న భాగం లో వస్తుంది ! సామాన్యం గా ఒకే పొజిషన్ లో ఎక్కువ సమయం నుంచుంటే కానీ, లేదా కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం కూర్చుంటే కానీ , లేదా , తుమ్మడం , దగ్గడం చేయడం ఎక్కువ సేపు బాగా నవ్వడం వల్ల , లేదా  ముందుకు వంగడం వల్ల కానీ నొప్పి ఎక్కువ గా ఉంటుంది ! కొన్ని సందర్భాలలో , నొప్పి లేకుండా , ఒక కాలు కానీ , పాదం కానీ చచ్చు బడి పోయినట్టు తిమ్మిరి గా ఉండడం, లేదా ఆ కాలు కు ఉన్న కండరాలు బలహీనం గా అనిపించడం కూడా జరుగుతుంది. వత్తిడి తీవ్రత ఎక్కువ గా ఉంటే , కొన్ని సందర్భాలలో  మల మూత్ర విసర్జన మన స్వాధీనం లో లేక పోవడం కూడా జరుగుతుంది ! అంటే మన కంట్రోలు లో లేక పోవడం ! 
మరి సయాటికా కు కారణాలు ఏమిటి ?
క్రితం టపాల లో చెప్పుకున్నట్టు గా , వెన్ను పూస ఎముకల మధ్య ఉండే డిస్క్ పదార్ధం బయటికి రావడం వల్ల కానీ , లేదా ఏదైనా ఇన్ఫెక్షన్  వెన్ను పూస లో చేరడం వల్ల కానీ ,అవ వచ్చు !  భారత దేశం లో వెన్నెముక లలో టీబీ  దానినే బోన్ టీబీ అని కూడా అంటారు , అట్లా టీబీ రావడం వల్ల  వెన్ను పూసను కరిగించి వేస్తుంది వచ్చిన ఇన్ఫెక్షన్ ! ఇంకా  క్యాన్సర్ వెన్నెముక కు పాకితే కూడా  సయాటికా లక్షణాలు కలగ వచ్చు! ప్రమాదాలు జరిగి , వెన్నెముక కు గట్టి దెబ్బ తగిలినా కూడా ఆ వెన్నెముక భాగం విరిగి పోయి సయాటిక్ నాడికి వత్తిడి కలిగి నొప్పీ , బాధా కలగ వచ్చు !  ఇక్కడ చెప్పుకున్న కారణాలలో ఇన్ఫెక్షన్ కానీ డిస్క్ కానీ ఏర్పడడం సామాన్య కారణాలు !  వెన్నెముక లో టీబీ కానీ క్యాన్సర్ కానీ రావడం అరుదు గానూ జరుగుతూ ఉంటుందనే విషయం గుర్తు ఉంచుకోవాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: