వెనక నొప్పి . 7. సయాటికా కు చికిత్స ఏమిటి ?
మునుపటి టపాలో, సయాటికా కు వాడే మందులతో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ! ప్రధానం గా చికిత్స మూడు పద్ధతులలో ఉంటుంది. 1. మందులతో 2. వ్యాయామం తో 3. శస్త్ర చికిత్స తో .
మందులతో వెనక నొప్పి ని తగ్గించు కోవడం ఎట్లాగో తెలుసుకున్నాం కదా క్రిందటి టపాలో. ఈ మందులు రోజూ తీసుకుంటున్నప్పుడు , సాత్విక ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి . ఎందుకంటే నొప్పి నివారణకు వేసుకునే మందులు చాలా వరకూ కడుపులో మంట పుట్టిస్తాయి . దానికి తోడుగా , కాఫీలూ , టీలూ , ఎక్కువగా తీసుకుంటూ , స్పైసీ ఫుడ్ అంటే మసాలాలూ , పచ్చళ్ళూ , ఎక్కువగా ఉన్న ఆహారం కూడా తింటూ ఉంటే , కడుపులో మంట రెండింతలవుతుంది. అట్లా జరుగుతుదని డాక్టర్ తో చెబితే , కడుపులో సహజం గా ఉత్పత్తి అయే ఆమ్లాలు తగ్గించడానికి ఇంకో ట్యా బ్లెట్ రాస్తాడు ! సాధారణం గా డాక్టర్ రాసే ప్రతి ట్యా బ్లెట్ కూ ఏదో రకం గా ప్రతి ఫలం ముడుతుంది ! సాత్విక ఆహారం అందుకే ఆ సమస్యలను నివారిస్తుంది , అలవాటు చేసుకునే వారిలో ! అట్లాగే , రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు తాగడం కూడా మాన కూడదు , ఈ రకమైన మందులు తీసుకుంటున్నప్పుడు ! ప్రతి ఆరు నెలలకూ ఒక సారి , కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాలి ( కిడ్నీలు లేదా మూత్ర పిండాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం కేవలం రక్త పరీక్ష తో కూడా సంభవం ! )
2. వ్యాయామం తో వెనక నొప్పి తగ్గుతుందా ?
వెనక నొప్పి ఉన్న వారు , వీలైనంత వరకూ , శారీరిక వ్యాయామం , క్రమం గా అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉండడం ఎంతో ఆరోగ్య కరం. నొప్పి తగ్గిస్తూ , వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు బలం గా ఉండడం కోసం అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం చేయక పొతే , ఆ కండరాలు బలహీన పడి , నొప్పి ఎక్కువ అయే ప్రమాదం ఉంటుంది.
కంప్రెషన్ ప్యాక్స్ తో నొప్పి నివారణ : ఇవి ప్రత్యేకం గా మందుల షాపులలో అమ్ముతూ ఉంటారు . వీటితో ఏ సైడ్ ఎఫెక్ట్ లూ ఉండవు. ఈ ప్యాక్ లలో ఐసు ముక్కలు కానీ లేదా వేడి నీళ్ళు కానీ పోసుకుని ‘ కాపడం ‘ లాగా నొప్పి ఉన్న చోట కొంత సేపు ఉంచడం చేస్తూ ఉంటే , నొప్పి కి ఉపశమనం ఉంటుంది !
దీర్ఘ కాలిక , వెనక నొప్పి కి చికిత్స ఏమిటి ?
కొందరి లో వెనక నొప్పి , కొన్ని నెలలు గానూ , సంవత్సరాల గానూ ఉండి , బాధ పెడుతూ ఉంటుంది. వారిలో ముందుగా తీసుకునే మందులలో మార్పులు చేసి , నొప్పి నివారణ కు ప్రయత్నం చేయాలి. పారా సెట మాల్ ( క్రోసిన్ ) , కోడీన్ , ప్రీగాబాలిన్ , గాబా పెంటిన్ , లాంటి మందులు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తాయి.
ఇంజెక్షన్ లతో ప్రయోజనం ఉంటుందా ?
సామాన్యం గా నొప్పి తీవ్రం గా ఉంటే , ఆ నొప్పి కలిగిస్తున్న చోట , స్టీరాయిడ్ ఇంజెక్షన్ లు చేసి నొప్పి ని తగ్గించడం కూడా జరుగుతుంది. మునుపటి టపాలలో చెప్పుకున్నట్టు గా , నొప్పి ఉన్న చోట , కండరాలు వాచి , ఆ వాచి ఉన్న కండరాలు పక్కనే ఉన్న నాడిని నొక్కడం వల్ల నొప్పి ఎక్కువ అవడం జరుగుతుంది.
స్టీరాయిడ్ ఇంజెక్షన్ , ఆ రకమైన వాపును తగ్గిస్తుంది. దానితో , పక్కన ఉన్న నాడికి వత్తిడి తగ్గి , పర్యవసానం గా నొప్పి కూడా తగ్గుతుంది. కానీ ఈ రకమైన ఇంజెక్షన్ లు నిపుణి డి తో నే అంటే ఎముకల స్పెషలిస్ట్ తోనే చేయించుకుంటే మంచిది. ఎవరితో బడితే వారితో చేయించుకుంటే , ‘ కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు , తయారవుతుంది , వెనక నొప్పి ! అందుకని జాగ్రత్త అవసరం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !