వెనక నొప్పి . 5. సయాటికా ఎట్లా కనుక్కోవచ్చు ?
వెనక నొప్పి అనేక విధాలు గా కనబడుతూ ఉంటుంది , ఒక్కొక్కరిలో ! ఆ లక్షణాలు చాలా వరకూ మునుపటి టపాలలో తెలుసుకోవడం జరిగింది కదా !
కనీసం ఆరు వారాల లోపు గా ఆ లక్షణాలు కనుక చాలా వరకు తగ్గి పొతే , ఆ వెన్ను నొప్పి ని గురించి ఆందోళన పడనవసరం లేదు ! అంటే , ప్రత్యేకమైన చికిత్సలు అవసరం ఉండదు , అట్లా తగ్గిపోయే నొప్పులకు. ఆరు వారాలు దాటాక కూడా , నొప్పి పోకుండా , వివిధ రకాలు గా బాధ పెడుతూ ఉంటే , అందుకు కారణాలు కనుక్కోవడం ఉత్తమం ! నొప్పి కి కారణాలు కనుక్కోవడం వల్ల ఏ చికిత్స ఎక్కువ ఉపయోగమో తెలుస్తుంది !
వెనుక నొప్పి కారణాలు కనుక్కొనే పరీక్ష ల లో మొట్టమొదటిది చాలా తేలిక , దీనికి డబ్బు ఖర్చు ఏమీ అవ్వదు ! ఇంట్లోనే పరీక్షించుకో వచ్చు ! కానీ, పక్కన సహాయానికి ( అవసరం ఉంటే ) కుటుంబ సభ్యులో, లేదా స్నేహితులో ఉంటే మేలు !
వివరాలు : ఎత్తు పల్లాలు లేని సమతలం గా ఉన్న బెడ్ మీద వెల్లికిలా పడుకోవాలి ! నిద్ర పోకూడదు ! ఆ తరువాత ఒక కాలును వంచ కుండా , నిటారు గా పైకి ఎత్తాలి కనీసం నలభై అయిదు డిగ్రీలు అంటే , బెడ్ మీద ఉన్న స్థానం నుంచి , పై చిత్రం లో చూపినట్టు. ఆ తరువాత మీ పక్కన ఉన్న వారు ఎత్తి ఉంచిన కాలు పాదాన్ని మీ వైపుకు వంచాలి ! గమనించ వలసింది , కేవలం పాదాన్ని మాత్రమే తలవైపు వంచాలి. కాలును అదే స్థానం లో అంటే చిత్రం లో చూపిన విధం గా నే నలభై అయిదు డిగ్రీల కోణం లో ఉంచాలి. ఈ విధం గా ఇంకో కాలునూ పరీక్షించాలి. అప్పుడు వెన్ను నొప్పి కలగడం కానీ , అప్పటికే ఉన్న వెన్ను నొప్పి ఎక్కువ అవడం కానీ జరిగితే , వెన్ను నొప్పి సమస్య ఉన్నట్టు లెక్క !
మిగతా పరీక్షలు :
రక్త పరీక్షలు : వెన్ను నొప్పి వస్తే రక్త పరీక్షలు ఎందుకు ?
వెన్ను నొప్పికి కారణమైన ఇన్ఫెక్షన్ , రక్త పరీక్ష లలో కనుక్కోవచ్చు ! CRP అనే పరీక్ష ఇంకా తెల్ల కణాల పరీక్ష ఈ రెండు పరీక్షలలో CRP , ఇంకా తెల్ల కణాలూ ఉండవలసిన దానికన్నా ఎక్కువ గా ఉంటే , ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ప్రత్యేకించి ఆ ఇన్ఫెక్షన్ కొద్ది రోజులూ , లేదా వారాలూ ఉంటే , ఈ పరీక్షలు అబ్నార్మల్ గా ఉంటాయి .
అట్లా కాకుండా , ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ వారాలూ లేదా నెలలూ కనుక శరీరం లో ఉంటే , అప్పుడు ESR అనే పరీక్ష అబ్నార్మల్ గా కనబడుతుంది రక్త పరీక్ష లో ! దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ లు శరీరం లో ఉన్నా లేదా , క్యాన్సర్ ఉన్నా కూడా ESR అనే పరీక్ష అబ్నార్మల్ గా ఉండ వచ్చు !
Xray పరీక్ష : వెన్నెముక Xray తీయిస్తే , డిస్క్ బయటకు రావడం కానీ , లేదా వెన్ను పూస ఎముకలు , వర్టిబ్రా అని అంటారు , అవి అరిగి పోయినా లేదా విరిగి పోయినా లేదా , బలం లేకుండా ఉన్నా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎముకల మధ్యలో కానీ లేదా వాటి చుట్టూ కానీ చీము చేరినా కూడా ,తెలుసుకోవచ్చు.
MRI స్కాన్: MRI స్క్యాన్ వల్ల పైన చెప్పిన అంటే Xray లో కనబడేవే , ఇంకా స్పష్టం గా కనబడతాయి ! MRI లో అయస్కాంత ప్రభావం తో శరీరం లోపలి భాగాలను పరిశీలించి వాటి ఫోటోలు తీయడం జరుగుతుంది. ( Xray లో X కిరణాలను పంపి శరీరం లోపలి భాగాలను ఫోటో తీయడం జరుగుతుంది ).
మరి శరీరం లో ఇన్ఫెక్షన్ కానీ , క్యాన్సర్ కానీ ఉంటే , వెన్ను నొప్పి తో పాటుగా మిగతా లక్షణాలు ఎట్లా ఉంటాయి ?
మన శరీరం లో ఏదో మూల దాక్కుని ఉండే ఇన్ఫెక్షన్ ఇంకో రకం గా అంటే వెన్ను నొప్పి తోనో లేదా ఇంకో నొప్పితోనో, కనిపించ కుండా బాధ పెడుతూ ఉంటే ఒక పట్టాన కనుక్కోవడం కష్టం ! ప్రత్యేకించి వెన్ను నొప్పి కి క్యాన్సర్ కారణ మవుతే , ఇంకా బాధాకరం ! ఇట్లాంటి పరిస్థితులలో , ఆ నొప్పులతో పాటుగా మిగతా లక్షణాలను కూడా ఆ బాధ పడే వారు కానీ , లేదా వారికి ఆప్తులు , బంధువులు అయిన వారు కానీ , పరిశీలించి చూస్తే , గోచరిస్తాయి . అవి ఈ క్రింది విధం గా ఉండ వచ్చు :
1. సామాన్యం గా వయసు ఒక యాభై సంవత్సరాలు పైబడిన వారిలో
2. ఇంతకు ముందు ఎప్పుడూ వెన్ను నొప్పి రాని వారిలో
3. వంశ పారంపర్యం గా కుటుంబం లో( ఆ ) క్యాన్సర్ వచ్చి ఉంటే,
4. జ్వరం , వణుకూ , తరచు గా వస్తూ , బరువు తగ్గి పోతూ ఉంటే ,
5. పుట్టుకతో నే వెన్నెముక పెరగడం లో అవక తవకలు ఉండి ఉంటే,
6. సుఖ వ్యాధులు ఉన్న వారిలో ( అంటే ఎయిడ్స్ కూడా ) .
పైన చెప్పిన లక్షణాలు , ఆందోళన పడడానికి కాదు , కేవలం ముందు జాగ్రత్త తో సరి అయిన చికిత్స అవసరం అవుతే చేయించు కోవడం కోసమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !