Our Health

Archive for సెప్టెంబర్, 2014|Monthly archive page

ఇదో రకం మోసం . 6. ఆన్ లైన్ డేటింగ్ లో, చీటింగ్ !

In Our Health on సెప్టెంబర్ 27, 2014 at 10:30 ఉద.

ఇదో రకం మోసం . 6. ఆన్ లైన్ డేటింగ్ లో, చీటింగ్ !  

ఒంటరిగా , డబ్బు ఉన్న బ్రహ్మ చారులను కానీ ,  పెళ్లి కాని యువతులను కానీ , ఈ భూగోళం లో ఎక్కడ ఉన్నా,  అంతర్జాలం లో కనుక  డేటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే  , మోసం చేయడానికి నేరస్థులు కాచుకుని ఉంటారు ! వారికి  ఆన్ లైన్ డేటింగ్ ఒక ఉత్తమ సాధనం గా ఉపయోగ పడుతుంది !
వాళ్ళ కు లక్ష్యం గా సామాన్యం గా,  ముప్పై , నలభై ఏళ్ళు దాటి , ఆస్తి పాస్తులు ఉన్న యువతులు కానీ , లేదా ,విడాకులు తీసుకున్న యువతులు కానీ లేదా యువకులు కానీ  ! ఏ దేశానికి చెందిన వారైనా ! మోసగాళ్ళ మోసాలకు  కేవలం అంతర్జాలమే పరిధి , దేశాలూ , ఖండాలూ కాదు ! అట్లాగే వారికి జాతి మత , కుల భేదాలు కూడా తెలియవు ! సామాన్యం గా అంతర్జాలం లో  భాగస్వామిని కోరుకునే పురుషులు ,  అమెరికా పౌరసత్వం ఉన్న వారని గానీ , లేదా అమెరికా పౌరసత్వం కలిగి విదేశాలలో పని చేస్తున్నట్టు కానీ చెప్పుకుంటారు ! కానీ , ఈ నేరస్థులు  ఆఫ్రికా లోనూ , ఇతర దేశాలలోనూ ఉండే  వారు ! అమెరికా తో ఏ రకమైన సంబంధమూ లేని వారు !
ఆ మోసగాళ్ళు , మీ   పొందు ఎట్లా కోరుకుంటారు ? 
మీరంటే ఎంతో  ఆసక్తి కనబరుస్తారు ! మీరు కూడా ఉత్సాహం కనబరుస్తే , మీతో స్నేహం కొనసాగిస్తారు , చాలా ప్రేమ పూర్వకం గా ! మీకు పూలూ , ఇంకా ఇతర చిన్న చిన్న బహుమతులు కూడా అంద వచ్చు  ఈ స్నేహం ప్రారంభం లో ! అప్పుడు మీమనసు పులకరించి పోతూ ఉండ వచ్చు ,  ఆ ‘ ప్రేమ పూర్వకమైన ‘ బహుమతులు అందుకుంటూ ! ఇట్లా కొన్నివారాలు కానీ ,  నెలలు కానీ , స్నేహం పెరిగిన తరువాత , అసలు సంగతి బయట పెడతారు , అప్పుడు వారికి కావలసినది మీ పొందు కాదు , మీ ప్రేమ కాదు !  కేవలం మీ డబ్బు !  ఏదో ఒక రకం గా మీ డబ్బు, ఏదో రూపం లో వారికి అందాలని మీకు సూచిస్తారు,  లేదా స్పష్టం గా అడుగుతారు !  అంతటి తో ఆగదు ఈ వ్యవహారం !  మీరు డబ్బు పంపుతున్న కొద్దీ ,  ఆ మోసగాళ్ళ కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ! వాటితో పాటుగా కష్టాల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది ! కొన్ని సందర్భాలలో , వాళ్ళు మీకు ఒక చెక్కు పోస్టులో పంపించి , ఆ చెక్కును క్యాష్ చేసుకోమని కూడా చెబుతారు !  లేదా మీకు  ఏదో ఒక ప్యాకెట్ పోస్టు చేసి , దానిని ఇంకొకరికి అంద జేయమని కూడా చెబుతారు , ప్రాధేయ పూర్వకం గా !
అసలు జరిగిందేమిటి ? 
మీతో  పరిచయం చేసుకుని , ఆ పరిచయాన్ని పెంచుకున్న మీ ఊహా సుందరులు లేదా సుందరీ మణులు వాస్తవానికి  , మిమ్మల్నిలక్ష్యం గా పెట్టుకుని  , మీదగ్గర నుంచి వీలైనంత డబ్బు లాగుదామని ప్రయత్నించే మోసగాళ్ళు ! మరి వారికి మీ వివరాలు ఎట్లా తెలుస్తాయి ?  అంటే ,  మీరు రిజిస్టర్ చేయించుకున్న డేటింగ్ సైట్ లలో , వాళ్ళు , మారుపేర్లతోనూ , తప్పుడు సమాచారం తోనూ ప్రవేశిస్తారు ! మీ వివరాలు చూసి వల వేస్తారు ! వాళ్ళు ఇచ్చే వివరాలు అన్నీ తప్పు గానే ఉంటాయి !  వాళ్ళ ఫోటో కూడా వాళ్ళది అయి ఉండదు ! నకిలీ దే ఉంటుంది ! మీకు ఆసక్తి ఉన్న విషయాలలో వారికీ ఎంతో ఆసక్తి ఉన్నట్టు  వారి వివరాలు  ఉంటాయి , రిజిస్టర్ లో ! మీకు , మీ డబ్బు పోతూ ఉండడం తో పాటుగా , మీకు తెలియకుండానే , నల్ల ధనం మార్పిడి వ్యవహారాల్లోనూ , లేదా మాదక ద్రవ్యాల ప్యాకెట్ లు ( ఆ విషయం మీకు తెలియక నే ) చేరవేస్తూ ఉండడం లోనూ , ఇరుక్కుని ,  మీ గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు ! విషయం తీవ్రమైనది అయితే , మీ పని , ( ప్రత్యేకించి,  అసలు నేరస్థులను  వదిలేసి , నిరపరాధులనూ , అమాయకులనూ ) మన పోలీసులు ఏరకం గా పడతారో , మీకు అనుభవం అయే ఉంటుంది ! అందువల్ల ఇక్కడ ప్రస్తావించడం లేదు ! ఈ మొత్తం వ్యవహారం లో , నిజాయితీ గా , స్నేహం కోసమో , లేదా జీవిత భాగస్వామి కోసమో ,  మీరు చేసే ప్రయత్నాలు ఫలించక పోగా , మీ సమయమూ , డబ్బూ , ప్రతిష్టా  కూడా  నష్ట పోతారు ! ఇక మానసిక వత్తిడి మాట  చెప్పనవసరం లేదు !
మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? మీ  నమ్మకం వంచన కాకుండా ఉండాలంటే , మీ అనుమానమే మీకు శతమానం ! 
1. మీరు,  ఏ ఆన్ లైన్ డేటింగ్ లో నైతే రిజిస్టర్ చేసుకున్నారో , ఆ వేదిక  కాకుండా , వ్యక్తి గత , అంటే పర్సనల్ మొబైల్ నంబర్ తో నే , అక్కడ పరిచయమైన వ్యక్తి , మీతో మాట్లాడ డానికి  ప్రయత్నాలు చేస్తుంటే ,
2. మీరు పరిచయం అవగానే , ప్రేమ ఒలక పోస్తూ ఉంటే , 
3. సినిమా స్టార్ లా తమ ఫోటోలు ఎంతో అందం గా ఉన్నవి పంపిస్తే ,
4. అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కానీ , లేదా ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండి , ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్నట్టు గానీ చెబుతుంటే ,
5. మిమ్మల్ని కలవడానికి విపరీతం గా ప్రయత్నం చేస్తున్నా కూడా , ఏదో విషాద కర సంఘటన జరగడం వల్ల కలవలేక పోతున్నట్టు , ఎప్పుడూ చెబుతూ ఉంటే ,
6. వైద్య ఖర్చులకూ ,  ఏదో ఒక నేరం లో తమను ఇరికించి నందుకూ , లేదా తమ పాస్ పోర్ట్ పోయినందుకూ ,లేదా తాము అకస్మాత్తు గా అనేక లక్షలు , తమ వ్యాపారం లో నష్ట పోయినందుకూ ,  హోటల్ బిల్లు కట్ట డానికీ , తమ బంధువు లూ , లేదా , వారి చిన్న పిల్లలూ , హాస్పిటల్ లో చేరి ఉన్నందుకూ , ఇట్లా అనేక కారణాలు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బు కావాలని అడిగే వారినీ , 
ఎంత మాత్రమూ నమ్మ కూడదు !  అట్లాంటి వారు చేసేది,  ఆన్ లైన్ చీటింగ్ ! ఆన్ లైన్ డేటింగ్ కాదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

కృత్రిమ తీపి రసాయనాలు ( ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ ) డయాబెటిస్ ను ఎందుకు ఎక్కువ చేస్తాయి ?

In Our Health on సెప్టెంబర్ 21, 2014 at 9:37 ఉద.

కృత్రిమ తీపి రసాయనాలు (  ఆర్టి ఫీషియల్  స్వీ టె నర్స్  )   డయాబెటిస్ ను ఎందుకు ఎక్కువ చేస్తాయి ? 

నడి వయసులో వచ్చే టైప్ టూ  ( type 2 diabetes  )  మధుమేహ వ్యాధి ఈ రోజుల్లో  ప్రపంచం లోని అనేక దేశాలలో , అతి త్వరగా  , ఎక్కువ మంది లో కనిపిస్తూ ,  ఆ వ్యాధి గ్రస్తులకే కాకుండా , ఆ యా  దేశాల ప్రభుత్వాలకు కూడా ఒక తీవ్రమైన సమస్య గా పరిణమించింది !
సర్వ సాధారణం గా, ఈ రకమైన నడి వయసు లో వచ్చే డయాబెటిస్  ఉన్న వారికి , ఇప్పటి వరకూ డాక్టర్లు , షుగర్ అంటే చక్కెర  ను నేరుగా , వారు తినే ఆహారం లో కానీ , తాగే పానీయాలలో కానీ , అసలు వేసుకోక పోతేనే ఉత్తమం అని సలహా ఇస్తారు ! 
అంతే కాకుండా , వారికి ,చక్కెర కు బదులు గా  కృత్రిమం గా లభ్యమయే , శాకరిన్ , లేదా సుక్రాలేజ్ అనే ‘ షుగర్ ట్యా బ్లెట్  ‘ లు నిరభ్యంతరం గా తీసుకోవచ్చని శెలవిస్తారు !  
శాకరిన్ లేదా షుగర్ ట్యా బ్లెట్  కనుక్కున్న కొత్తల్లో , అది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఒక ‘ వరం ‘ లా భావించ బడింది !  ఎందుకంటే , ఈ రసాయనం లో కేవలం తీపి కలిగించే లక్షణాలే ఉన్నాయి కానీ , క్యాలరీలు ఏవీ ఉండవు ! అంటే , రక్తం లో చక్కర శాతం ఎక్కువ అవదు , ఈ ట్యా బ్లెట్ లు   చక్కెర కు బదులు గా ఆహారం లోనూ , పానీయాల లోనూ తీసుకుంటే ! అందువల్లనే , ఈ షుగర్ ట్యా బ్లెట్  లు  ప్రపంచం లో అనేక దేశాలలో , టన్నుల కొద్దీ  అమ్మ బడుతూంది !  కేవలం మధు మెహ వ్యాధి గ్రస్తులే కాకుండా ,  ఊబకాయం , అంటే ఒబీసిటీ  సమస్య ఉన్న వారు, లేదా సన్న బడాలనుకునే వారూ కూడా విస్తృతం గా ఈ షుగర్ ట్యా బ్లెట్ లను వాడుతున్నారు , రోజూ ! 
వారందరూ ఇప్పుడు ఆశ్చర్య పోవడమే కాకుండా , ఈ విషయం లో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం కూడా తాజా పరిశోధన ఫలితాల వల్ల , తప్పని సరి అవుతుంది ! ఆ వివరాలు చూద్దాం ! 
చేంతాడంత చదవడం ఎందుకు అసలు విషయం చెప్పడానికి ‘ అనుకునే వారికి  ‘ షుగర్ ట్యా బ్లెట్ లు ‘  మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇక ముందు నుంచి నిషేధం ‘ అనే వార్నింగ్ గుర్తు ఉంచుకుని  ఆచరిస్తే , వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది ! 
కారణం : షుగర్ ట్యా బ్లెట్ లు లేదా కృత్రిమ  తీపి రసాయనాలు , డయాబెటిస్ ను ఎక్కువ చేస్తాయి ! 
పరిశోధనా స్థలం : ఇజ్రాయల్ లోని వీజ్ మన్ విద్యాలయం.
ఆ పరిశోధన ఎందువల్ల మొదలు పెట్టడం జరిగింది ? : ఆశ్చర్య కరం గా ,  ఈ తీపి రసాయనాలు ( షుగర్ ట్యా బ్లెట్ లు ) వాడుతున్న అనేకమంది లో డయాబెటిస్ ఏమాత్రమూ కంట్రోలు లో లేక పోగా , వారి ఊబకాయం కూడా తగ్గక పోవడం  జరిగింది , అందుకని శాస్త్రజ్ఞులు కారణాలు వెదకడం మొదలు పెట్టారు ! 
పరిశోధన ఎట్లా జరిగింది ? : ముందుగా  వారు  ఎలుకల మీద ప్రయోగం చేశారు.  ఎలుకలకు , ఈ తీపి రసాయనాలు ఉన్న ఆహారం , పానీయాలు ఇచ్చారు !  ఇంకో రకం ఎలుకలకు  షుగర్ ట్యా బ్లెట్ లు లేకుండా , సహజమైన  తీపి అంటే  చక్కెర వేసిన ఆహారమే ఇచ్చారు !తీపి ( కృత్రిమ ) రసాయనాలు  ఉన్న ఆహారం తిన్న ఎలుకలకు డయాబెటిస్ వచ్చింది ! దీనికి కారణాలు వెతుకుతుంటే , శాస్త్రజ్ఞులకు ఒక ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది !  మన దేహం లో , ప్రత్యేకించి మన జీర్ణ వ్యవస్థ లో ఉండే అనేక లక్షల బ్యాక్టీరియా క్రిములు ,  నేరస్తుల లాగా , తీసుకున్న తీపి రసాయనాల తో  కుమ్మక్కయి ,   గ్లూకోజు ను తట్టుకో లేకుండా చేస్తున్నాయి అని ! అంటే  తీపి రసాయనాలు లేదా షుగర్ ట్యా బ్లెట్ లు  తీసుకుంటే ,  ఆ తీసుకున్న వారి రక్తం లో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది ! ఆ పరిస్థితి  స్థిరం గా ఉంటే , దానినే డయాబెటిస్ అని అంటాము ! 
మరి ఈ బ్యాక్టీరియా నే  నేరస్తులు గా ఎట్లా నిర్ణయించారు ? 
డయాబెటిస్ వచ్చిన ఎలుకల లోనుంచి బ్యాక్టీరియా ను తీసుకుని , డయాబెటిస్ లేని ( ఆరోగ్య వంతమైన ) ఎలుకలలోకి ప్రవేశ పెడితే , ఆ ఎలుకలకు కూడా డయాబెటిస్ వచ్చింది ! అందువల్ల  కృత్రిమ తీపి రసాయనాలకూ , ఈ బ్యాక్టీరియా లకూ మధ్య ఉన్న లింకు స్పష్టమయింది ! 
మనం నేర్చుకోవలసినది :  కృత్రిమ  తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్  స్వీ టె నర్స్   కానీ , లేదా ఆ కృత్రిమ  తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్  స్వీ టె నర్స్  ఉన్న ఏ ఆహార పదార్ధాలూ , పానీయాలూ కానీ , తినడమూ , తాగడమూ ,  కేవలం ఆ యా కంపెనీ లు సొమ్ము చేసుకోవడానికే  చేయాలి కానీ మన ఆరోగ్యం కోసం కాదు అని ! 
అవి తీసుకుంటే , మన ఆరోగ్యం బాగా ఉండడం మాట దేవుడెరుగు ,  అనారోగ్యం ( డయాబెటిస్ ) కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా !  అంతే కాకుండా , ఇప్పటికే డయాబెటిస్ వచ్చి ఉన్న వారికి కూడా , ఆ వ్యాధి కంట్రోలు తప్పి పోవడం జరుగుతుంది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

ఇదో రకం మోసం !5.కొంపలు కూల్చే అడ్వాన్స్ ఫీ స్కీములు !

In Our Health on సెప్టెంబర్ 15, 2014 at 8:07 సా.

ఇదో రకం మోసం !5. కొంపలు కూల్చే అడ్వాన్స్ ఫీ స్కీములు !

ఈ రకమైన స్కీములలో ముందుగా మన జేబు లోంచి డబ్బు , మోసగాళ్ళు  వీలైనంత త్వరగా తీసుకోవడానికి  పధకాలు వేస్తూ ఉంటారు ! అంటే ఈ రకాల మాసాలలో ముందుగా,  అంటే అడ్వాన్సు గా మన డబ్బు కొంత ఇవ్వాలని  షరతు లు పెడతారు ! ఒక సారి ముందుగానే కొంత డబ్బు వాళ్ళు చెప్పిన విధం గా ఇచ్చేస్తే , వాటికి ఇక తిలోదకాలు వదులుకోవాల్సిందే ! ఆ మోసగాళ్ళకు కావలసినదే అది !  ఒక పది వేల మందిని , మాయ మాటలు చెప్పి మోసగించితే ! అందులో ఒక వెయ్యి మంది కనీసం మోసపోయి , వాళ్లకు అడ్వాన్స్ గా డబ్బు ఇచ్చినా కూడా , వాళ్లకు ఎంతో లాభం !
ఈ అడ్వాన్సు గా మోసం చేసే వారి పధకాలు అనేక రకాలు గా ఉంటాయి. వాటిని  చదువరుల ఊహకే వదిలేయవచ్చు అంటే అన్ని రకాలు గా ఈ అడ్వాన్సు మోసగాళ్ళు మోసం చేస్తూ ఉంటారు !
మీ ఇంట్లో  నిధి ఉందనో ! లేదా మీకు లాటరీ బహుమతి వచ్చిందనో , లేదా  ఫలానా వ్యాపారం లో మీ డబ్బు పెడితే , అది పదింతలు అవుతుందనో , ఇట్లా అనేక రకాలు గా ముందు గా మన డబ్బు  అడ్వాన్సు గా కాజేయాలని పధకాలు వేస్తూ ఉంటారు వాళ్ళు !
కొన్ని సందర్భాలలో , మీకు  ఆ మోసగాళ్ళ మీద నమ్మకం కలిగించ డానికి , నోటు కూడా రాయించి మీ సంతకాలు తీసుకుంటారు ! కానీ ఆ నోటు చేల్లినా చెల్లక పోయినా , మన డబ్బు పోయినతరువాత , మనం చేసేది ఏమీ ఉండదు ! అంటే , ఆ నోటు పట్టుకుని లాయర్ చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా , ఇంకొంత డబ్బు క్షవరం అవడమే జరిగేది !
ఈ అడ్వాన్స్ మోసగాళ్ళ వల లో పడకుండా ఉండాలంటే మీరు చేయ వలసినది ! 
1. ఎప్పుడూ , ఊరూ , పేరూ వినని వారి  పధకాలు  సాధారణం గా మోస పూరితమైనవే అయి ఉంటాయి !  అట్లాంటి పధకాలు ఎవరైనా మీకు చెప్పి మీ డబ్బు ‘ కాజేయాలని ‘ పధకం వేస్తే ,  వారి గురించి ఆరా తీయండి ! అంటే ఒక రకం గా గూఢ చారులు గా మీరు వారి పధకాలు ఏమిటో తెలుసుకోవడం ! కొన్ని సమయాలలో , ఆ మోసగాళ్ళే ‘ మీకు నమ్మకం లేక పొతే , ఫలానా వారిని అడగండి  ‘ అని కొందరి ( సమాజం లో పలుకుబడి ఉన్న వారి ) పేర్లు చెబుతూ ఉంటారు ! మీరు గమనించ వలసినది ఏమిటంటే , ‘ ఈ పలుకు బడి ఉన్న వారు కూడా , ఆ మోసగాళ్ళ పధకం లో భాగాస్వాములయి ఉండ వచ్చు ! 
2. ఏవైనా పధకం గురించి చెప్పి , డబ్బు ముందుగా , అంటే అడ్వాన్సు గా ఇవ్వాలని అంటే , వెంటనే జేబు లో చేయి పెట్టకుండా , ఆ పధకం వివరాలన్నీ ,  తెలుసుకోండి ! , ఒక ప్రింటు చేసిన కాగితం మీద ఆ వివరాలు ఇవ్వమని అడగండి !  అంత మాత్రాన , ఆ పధకం  మోసం లేనిది అవదని గుర్తు ఉంచుకోండి ! 
3. ఎక్కడో ఫలానా అడవులలోనో , లేదా కలకత్తా లోనో కంపెనీ అడ్రస్ ఉంటే , అసలు నమ్మకండి !  ఎందుకంటే , అక్కడ ఆ అడ్రస్ లో ఎవరూ ఉండరు కనుక ! 
4. ఏ పధకం లోనైనా , మీరు ముందుగా ఒక అగ్రిమెంటు  మీద సంతకం పెట్టాలని కనక వత్తిడి చేస్తే ! ఆ పధకం మోస పూరితమైనదే అని గుర్తు ఉంచుకోండి ! ఎందుకంటే , నిజమైన పధకాలకు , మీకు తగినంత సమయం అంటే గడువు ఇచ్చి ,  మీకు ఆ తరువాత ఆ పధకం ఇష్టం లేక పోయినా ,  విరమించు కోవచ్చు అనే  అవకాశం కూడా ఇస్తారు !  కేవలం మోసగాళ్ళే ,  మీ మెదడు ను పని చేయ నీయకుండా , అంటే మీరు  ముందూ వెనకా ఆలోచించుకునే సమయం ఇవ్వ కుండా , తొందర పెట్టి , డబ్బు అందిన తరువాత , బిచానా ఎత్తేసే ప్రయత్నాల లో ఉంటారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఇదో రకం మోసం ! 4. 419 మోసం ఎట్లా చేస్తారు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on సెప్టెంబర్ 6, 2014 at 8:11 సా.

ఇదో రకం మోసం ! 4. 419 మోసం ఎట్లా చేస్తారు ? 

 

 

 ఇంటర్నెట్ లో జరుగుతున్న సర్వ సాధారణ మోసాలలో ఇది ఒకటి !  ఈ మోసానికి 419 మోసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే , నైజీరియా దేశం లో ఇట్లాంటి మోసాలు చేసే వాళ్ళను 419 సెక్షన్ క్రింద విచారిస్తారు , ఒక వేళ వాళ్ళను పట్టుకో గలిగితే ! 
419 మోసం అని దేనిని అంటారు ? 
ఈ మోసం చేసే మోసగాళ్ళు , ప్రధానం గా మన ఈమెయిలు అడ్రస్ కు ఈమెయిలు చేస్తూ ఉంటారు ! లేదా ఉత్తరాలు టైప్ చేసి మన ఫాక్స్ నంబర్ లకు  ఫాక్స్ చేస్తూ ఉంటారు ! కొన్ని కేసుల్లో , ఈ మోసగాళ్ళు , మన ఇంటికి పోస్టు ద్వారా ఈ మోసం మొదటగా, అమెరికా ,  ఇంగ్లండు , నైజీరియా , దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ , ఐవరీ కోస్టు , స్పెయిన్ దేశాలలో మొదలయింది ! 
419 మోసాన్ని ఎట్లా చేస్తారు ?
మనకు వచ్చే ఉత్తరం ఇట్లా మొదలవుతుంది ” లాయర్ ( ఒక పేరు ఉంటుంది ) డెస్క్ నుంచి రాయబడిన ఉత్తరం ” అని  కానీ , ” మీ సహాయం అవసరం  ” అని కానీ ఉంటుంది ! అందులో ప్రధాన పాత్ర ధారుడు ఒక బ్యాంకు ఉద్యోగి కానీ , లేదా , ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కానీ పరిచయం చేసుకుంటాడు ! వారికి , ఒక చోట అధిక మొత్తం లో డబ్బు ఉందనీ , లేదా బంగారం నిల్వలు ఉన్నాయనీ చెబుతారు ! అంటే ఆ బ్యాంకు ఉద్యోగి ‘ నాకు తెలిసిన ఒక కోటీశ్వరుడు నా బ్యాంకు లో అకౌంట్ కలిగి ఉన్నాడు ! ఆ కోటీశ్వరుడు , క్యాన్సర్ తో బాధ పడుతూ , అవసాన దశ లో ఉన్నాడు ! ఆయనకు ‘ నా ‘ అనే వాళ్ళెవరూ లేరు ! అని కానీ ‘ లేదా ఒక కోటీశ్వరుడు ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదం లో మరణించాడు ! అతని అకౌంట్ మా బ్యాంకు లో ఉంది , ఆ డబ్బు తీసుకోవడానికి , ఎవరూ లేరు ఆయనకు ! అట్లాంటి ధనాన్ని , ఆ బ్యాంకు అకౌంట్ లోనుంచి బయటికి చేర్చడానికి ‘ మీ సహాయం కావాలి ‘ అని చక్కగా వెన్న పూసినట్టు రాసిన ఉత్తరాలు మనకు అందుతాయి ! 
గమనించ వలసినది , ఇట్లా పంపే ఈమెయిలు లు కానీ పోస్టు చేసే ఉత్తరాలూ , ఫాక్స్ లూ కానీ , అనేక మిలియన్ల లో చేస్తూ ఉంటారు, రోజూ ! అందులో అనేక మిలియన్ల మంది కి పైగా జనాలు , అట్లాంటి ఉత్తరాలను , ఈమెయిలు లను పట్టించుకోరు ! కేవలం కొన్ని వందలో వేలో మంది మాత్రమే , వారికి సమాధానం రాస్తారు ! అదే ఆ మోసగాళ్ళకు కావలసినది ! అదే వాళ్ళ పధకం కూడా ! ఇట్లా ఆ డబ్బు ను తరలించడానికి , తమకు సహాయం చేస్తే , ఆ మొత్తం డబ్బులో 20- 30 – లేదా 40 శాతం  కమీషన్ మనకు ఇస్తామని నమ్మిస్తారు ! 
ఇక సమాధానం రాసిన వారికి నమ్మకం కలిగించడానికి , వాళ్ళు , తప్పుడు ID లు ఉపయోగించి , టైపు చేసిన అనధికార పత్రాలను , అధికార పత్రాలని చెప్పుకుంటూ , పంపిస్తారు ! కొన్ని రోజులయిన తరువాత , అంటే , ఆ మోసగాళ్ళు , మన విశ్వాసం పొందిన తరువాత , బ్యాంకు నుంచి , ఆ డబ్బును రిలీజ్ చేయించడానికి , కొన్ని అవరోధాలు ఉన్నాయనీ , అందుకు ముందే ఒప్పుకున్నందుకు , ఆ బ్యాంకు వాళ్లకు , లంచం ముందుగా ఇవ్వాలనీ , మనతో చెబుతారు ! అప్పుడే  ఆ మోసగాళ్ళు వేసిన పాచికలు పారతాయి ! మన అంగీకారం తెలిపాము కనుక , కొంత లంచం ఇచ్చామంటే , ఆ మొత్తం డబ్బు బయటకు వచ్చాక , మనకు వచ్చే కమీషన్ లో ఇది ఏ పాటి ? అని కొన్ని వేలల్లో , లేదా లక్షలలో ముందుగా , ఆ మోసగాళ్ళు చెప్పిన చోటికి పంపించడం జరుగుతుంది ! ఈ వ్యవహారం అంతా , రహస్యం గా జరుగుతుంది కాబట్టీ , మనం ఎవరికీ , ఈ విషయం చెప్పకుండా , మనకు మోసగాళ్ళ నుంచి వచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాము ! మన డబ్బు ఆ మోసగాళ్ళ కు అందుతుంది కానీ , వాళ్ళ నుంచి మనకు వచ్చే డబ్బు కోసం 419 రోజులు పడిగాపులు పడ్డా , అది వృధానే ! ఎందుకంటే ,  ఆ మోసగాళ్ళది  అంతా నాటకమే ! పోయేది మన డబ్బే , వచ్చేది ఏమీ ఉండదు !
వార్నింగ్ : మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరు అడిగినా అనుమానించాల్సిందే !  2. వెస్టర్న్ యూనియన్ లేదా మనీ గ్రామ్ ద్వారా పంపే డబ్బు  అంతే సంగతులు ! అంటే , ఆ డబ్బు ను క్యాన్సిల్ చేయడం కానీ , తిరిగి  మనం పొందడం కానీ జరగదు !  ఆ మోసగాళ్ళు కోరుకునేది అదే !  ఒక సారి మనం పంపిన మన డబ్బు , వారికే చెందాలి , మనకు చెందకూడ దనే ! 
పైన ఉన్న ఉత్తరం చదివితే తెలుస్తుంది , ఈ మోసగాళ్ళు ఎంత కమ్మగా రాస్తారో  ! ( అట్లాంటి ఈమెయిలు నాకూ ఒకటి వచ్చింది ! ) 
వచ్చే టపాలో ఇంకో రకం మోసం గురించి ! 
 

ఇదో రకం మోసం ! 3. పిరమిడ్ స్కీములు, లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి !

In Our Health on సెప్టెంబర్ 2, 2014 at 8:36 సా.

ఇదో రకం మోసం ! 3. పిరమిడ్ స్కీములు,  లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి !  

‘  ఏదైనా స్కీము లో,  చేరే వారే , ఇంకా కొందరిని చేర్పించాలి ‘  అని చెప్పే స్కీము వివరాలు తెలుసుకోగానే , వారి దగ్గర నుంచి శెలవు తీసుకోవడం మంచిది ! ఎందుకో ఇప్పుడు చూద్దాం ! 
పైన ఉన్న చిత్రం చూడండి !  శ్రద్ధతో గమనించితే , పిరమిడ్ ఆకారం లో ఉన్న ఆ చిత్రం లో శిఖరాన ఉన్న వాడు ( కొంపలు కూల్చే వాడు ) ఒక స్కీములో ఓ అర డజను మంది ని  చేర్చాడని అనుకుంటే , ఆ చేరిన ఆరుగురూ , తలా ఇంకో ఆరుగురిని చేర్పించాలని నిబంధన పెడతాడు ! ‘ అట్లా చేర్పించితేనే వారికి కమీషన్ ఉంటుందని ‘  ఆశ పెడతాడు ! అంటే మొదటి ఆరుగురు ఉదాహరణకు , తలా వంద రూపాయలు కట్టి స్కీములో చేరితే , ఆ ఆరువందలూ , శిఖరాన ఉన్న వాడు తీసుకుంటాడు ! మరి ఆ ఆరుగురికీ  లాభం రావాలంటే , ‘ ఒక్కొ క్కరూ మళ్ళీ ఇంకో ఆరుగురిని చేర్చితేనే ‘ అని చెబుతాడు ! ఆ ఆరుగురూ , ఇంకో ముప్పై ఆరుగురిని చేర్చ గలిగితేనే ,  వారికి లాభం ఉంటుంది ! ఇట్లా , ఆ ముప్పై ఆరుగురూ , తాము కట్టిన డబ్బుకు మళ్ళీ లాభం పొందాలంటే ,  వాళ్ళు తలా ఆరుగురిని ( అంటే 216 మందిని )  స్కీము లో చేర్పించితేనే వారికి లాభం వచ్చేది ! ఇట్లా గుణింపు చేసుకుంటూ వెళితే , అట్టడుగున ఉన్న వారి సంఖ్య ఈ భూమి మీద ఉన్న జనాభా సంఖ్య ను మించితే గానీ , వారి పైనున్న వారికి , లాభం రాదు ! అట్లాంటి పరిస్థితి లో పిరమిడ్ లో అడుగు భాగాన ఉన్న వారు,  లాభం ఏమీ పొంద కుండా , ఆ పిరమిడ్ క్రింద భూస్థాపితం అయి పోవాల్సిందే , ఆర్ధికం గా ! పిరమిడ్ స్కీములో అందరూ లాభ  పడడం అనేది అసాధ్యం. ఇంపాజిబుల్ ! ఈ వాస్తవం,  శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ( పిరమిడ్ స్కీము లో చేరిన వారిలో,  వందకు 88 మంది నుంచి 99. 88 మంది వారి డబ్బు ను కోల్పోతారని శాస్త్రీయం గా నిరూపించ బడింది ! )  ప్రపంచం లో  నేపాల్ దేశం తో సహా అనేక దేశాలలో నిషేధించ బడిన ఈ పిరమిడ్ స్కీములు , భారత దేశం లో  ‘ అవసరమైన వారి అండ దండలతో ‘ యధేచ్చ గా  నడుస్తూ ఉన్నాయి , పేదల కష్టార్జితం తో వారి మీదే పిరమిడ్ లు కట్టి , జీవితం లో కోలుకోలేకుండా చేయడానికి ! తస్మాత్ జాగ్రత్త ! 
 
వచ్చే టపాలో ఇంకో రకం మోసం గురించి  ! 
%d bloggers like this: