ఇదో రకం మోసం . 6. ఆన్ లైన్ డేటింగ్ లో, చీటింగ్ !
ఒంటరిగా , డబ్బు ఉన్న బ్రహ్మ చారులను కానీ , పెళ్లి కాని యువతులను కానీ , ఈ భూగోళం లో ఎక్కడ ఉన్నా, అంతర్జాలం లో కనుక డేటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే , మోసం చేయడానికి నేరస్థులు కాచుకుని ఉంటారు ! వారికి ఆన్ లైన్ డేటింగ్ ఒక ఉత్తమ సాధనం గా ఉపయోగ పడుతుంది !
వాళ్ళ కు లక్ష్యం గా సామాన్యం గా, ముప్పై , నలభై ఏళ్ళు దాటి , ఆస్తి పాస్తులు ఉన్న యువతులు కానీ , లేదా ,విడాకులు తీసుకున్న యువతులు కానీ లేదా యువకులు కానీ ! ఏ దేశానికి చెందిన వారైనా ! మోసగాళ్ళ మోసాలకు కేవలం అంతర్జాలమే పరిధి , దేశాలూ , ఖండాలూ కాదు ! అట్లాగే వారికి జాతి మత , కుల భేదాలు కూడా తెలియవు ! సామాన్యం గా అంతర్జాలం లో భాగస్వామిని కోరుకునే పురుషులు , అమెరికా పౌరసత్వం ఉన్న వారని గానీ , లేదా అమెరికా పౌరసత్వం కలిగి విదేశాలలో పని చేస్తున్నట్టు కానీ చెప్పుకుంటారు ! కానీ , ఈ నేరస్థులు ఆఫ్రికా లోనూ , ఇతర దేశాలలోనూ ఉండే వారు ! అమెరికా తో ఏ రకమైన సంబంధమూ లేని వారు !
ఆ మోసగాళ్ళు , మీ పొందు ఎట్లా కోరుకుంటారు ?
మీరంటే ఎంతో ఆసక్తి కనబరుస్తారు ! మీరు కూడా ఉత్సాహం కనబరుస్తే , మీతో స్నేహం కొనసాగిస్తారు , చాలా ప్రేమ పూర్వకం గా ! మీకు పూలూ , ఇంకా ఇతర చిన్న చిన్న బహుమతులు కూడా అంద వచ్చు ఈ స్నేహం ప్రారంభం లో ! అప్పుడు మీమనసు పులకరించి పోతూ ఉండ వచ్చు , ఆ ‘ ప్రేమ పూర్వకమైన ‘ బహుమతులు అందుకుంటూ ! ఇట్లా కొన్నివారాలు కానీ , నెలలు కానీ , స్నేహం పెరిగిన తరువాత , అసలు సంగతి బయట పెడతారు , అప్పుడు వారికి కావలసినది మీ పొందు కాదు , మీ ప్రేమ కాదు ! కేవలం మీ డబ్బు ! ఏదో ఒక రకం గా మీ డబ్బు, ఏదో రూపం లో వారికి అందాలని మీకు సూచిస్తారు, లేదా స్పష్టం గా అడుగుతారు ! అంతటి తో ఆగదు ఈ వ్యవహారం ! మీరు డబ్బు పంపుతున్న కొద్దీ , ఆ మోసగాళ్ళ కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ! వాటితో పాటుగా కష్టాల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది ! కొన్ని సందర్భాలలో , వాళ్ళు మీకు ఒక చెక్కు పోస్టులో పంపించి , ఆ చెక్కును క్యాష్ చేసుకోమని కూడా చెబుతారు ! లేదా మీకు ఏదో ఒక ప్యాకెట్ పోస్టు చేసి , దానిని ఇంకొకరికి అంద జేయమని కూడా చెబుతారు , ప్రాధేయ పూర్వకం గా !
అసలు జరిగిందేమిటి ?
మీతో పరిచయం చేసుకుని , ఆ పరిచయాన్ని పెంచుకున్న మీ ఊహా సుందరులు లేదా సుందరీ మణులు వాస్తవానికి , మిమ్మల్నిలక్ష్యం గా పెట్టుకుని , మీదగ్గర నుంచి వీలైనంత డబ్బు లాగుదామని ప్రయత్నించే మోసగాళ్ళు ! మరి వారికి మీ వివరాలు ఎట్లా తెలుస్తాయి ? అంటే , మీరు రిజిస్టర్ చేయించుకున్న డేటింగ్ సైట్ లలో , వాళ్ళు , మారుపేర్లతోనూ , తప్పుడు సమాచారం తోనూ ప్రవేశిస్తారు ! మీ వివరాలు చూసి వల వేస్తారు ! వాళ్ళు ఇచ్చే వివరాలు అన్నీ తప్పు గానే ఉంటాయి ! వాళ్ళ ఫోటో కూడా వాళ్ళది అయి ఉండదు ! నకిలీ దే ఉంటుంది ! మీకు ఆసక్తి ఉన్న విషయాలలో వారికీ ఎంతో ఆసక్తి ఉన్నట్టు వారి వివరాలు ఉంటాయి , రిజిస్టర్ లో ! మీకు , మీ డబ్బు పోతూ ఉండడం తో పాటుగా , మీకు తెలియకుండానే , నల్ల ధనం మార్పిడి వ్యవహారాల్లోనూ , లేదా మాదక ద్రవ్యాల ప్యాకెట్ లు ( ఆ విషయం మీకు తెలియక నే ) చేరవేస్తూ ఉండడం లోనూ , ఇరుక్కుని , మీ గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు ! విషయం తీవ్రమైనది అయితే , మీ పని , ( ప్రత్యేకించి, అసలు నేరస్థులను వదిలేసి , నిరపరాధులనూ , అమాయకులనూ ) మన పోలీసులు ఏరకం గా పడతారో , మీకు అనుభవం అయే ఉంటుంది ! అందువల్ల ఇక్కడ ప్రస్తావించడం లేదు ! ఈ మొత్తం వ్యవహారం లో , నిజాయితీ గా , స్నేహం కోసమో , లేదా జీవిత భాగస్వామి కోసమో , మీరు చేసే ప్రయత్నాలు ఫలించక పోగా , మీ సమయమూ , డబ్బూ , ప్రతిష్టా కూడా నష్ట పోతారు ! ఇక మానసిక వత్తిడి మాట చెప్పనవసరం లేదు !
మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? మీ నమ్మకం వంచన కాకుండా ఉండాలంటే , మీ అనుమానమే మీకు శతమానం !
1. మీరు, ఏ ఆన్ లైన్ డేటింగ్ లో నైతే రిజిస్టర్ చేసుకున్నారో , ఆ వేదిక కాకుండా , వ్యక్తి గత , అంటే పర్సనల్ మొబైల్ నంబర్ తో నే , అక్కడ పరిచయమైన వ్యక్తి , మీతో మాట్లాడ డానికి ప్రయత్నాలు చేస్తుంటే ,
2. మీరు పరిచయం అవగానే , ప్రేమ ఒలక పోస్తూ ఉంటే ,
3. సినిమా స్టార్ లా తమ ఫోటోలు ఎంతో అందం గా ఉన్నవి పంపిస్తే ,
4. అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కానీ , లేదా ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండి , ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్నట్టు గానీ చెబుతుంటే ,
5. మిమ్మల్ని కలవడానికి విపరీతం గా ప్రయత్నం చేస్తున్నా కూడా , ఏదో విషాద కర సంఘటన జరగడం వల్ల కలవలేక పోతున్నట్టు , ఎప్పుడూ చెబుతూ ఉంటే ,
6. వైద్య ఖర్చులకూ , ఏదో ఒక నేరం లో తమను ఇరికించి నందుకూ , లేదా తమ పాస్ పోర్ట్ పోయినందుకూ ,లేదా తాము అకస్మాత్తు గా అనేక లక్షలు , తమ వ్యాపారం లో నష్ట పోయినందుకూ , హోటల్ బిల్లు కట్ట డానికీ , తమ బంధువు లూ , లేదా , వారి చిన్న పిల్లలూ , హాస్పిటల్ లో చేరి ఉన్నందుకూ , ఇట్లా అనేక కారణాలు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బు కావాలని అడిగే వారినీ ,
ఎంత మాత్రమూ నమ్మ కూడదు ! అట్లాంటి వారు చేసేది, ఆన్ లైన్ చీటింగ్ ! ఆన్ లైన్ డేటింగ్ కాదు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !