Our Health

Archive for అక్టోబర్, 2014|Monthly archive page

నిద్రలో ఏం జరుగుతుంది ?2. గాఢ నిద్రలో మనకు జరిగే మంచి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 31, 2014 at 10:04 సా.

నిద్రలో ఏం  జరుగుతుంది ?2. గాఢ నిద్రలో మనకు జరిగే మంచి !

 

మనలో వందకు నలభై మంది , పగటి పూట ఆవులిస్తూ ఉంటారు ! కనీసం సగం మంది అమెరికన్లు , వారి నిద్రలేమి , వారి ఏకాగ్రత ను ప్రభావితం చేస్తుందని  చెప్పారు !  కనీసం వందలో 45 మంది అమెరికన్ విద్యార్ధులు , వారు పోవలసిన దానికన్నా , తక్కువ గంటలు నిద్ర పోతున్నారు ! అందులో కనీసం 25 శాతం మంది  కనీసం వారం లో ఒకసారైనా , క్లాసులో నిద్ర పోతారు లేదా కునుకు తీస్తారు ! 
గాఢ నిద్రలో మనకు జరిగే మంచి :
1. మన ఎముకలలో , చెడు కణాలను తొలిగించి , ఉపయోగ కరమైన కణజాలం నిర్మితం అవడం ! 
2. కండరాలలో : పగలు కష్ట పడి పని చేయడం వల్ల కండరాలలో కలిగే  మార్పులను రిపేరు చేస్తుంది నిద్ర : అంటే  ఎక్కువ గా పని చేసిన కండరాలలో పేరుకున్న మలినాలను తొలగించి , కండరాలను మళ్ళీ ప్రాణవాయువు తో నింపడం , ఇంకా , ఎక్కువ గా సాగ దీయడం వల్ల  పాడయిన కండరాల పొరలను దృఢ మైనవి గా తయారు చేయడం కూడా  నిద్ర లోనే ఎక్కువ  ప్రభావ శీలం గా జరుగుతుంది ! 
3. నిద్రా సుందరుల చర్మం కాంతి వంతం గా నిగ నిగ లాడుతూ ఉంటుంది ! ఎందుకంటే , చర్మ కణాలలో అనేక జీవ రసాయన చర్యలు, మనం నిద్ర పోతున్నప్పుడే జరుగుతాయి ! అంతే కాకుండా , మన చర్మ సహజ పోషణ కు అవసరమైన గ్రోత్  ఫ్యాక్టర్ లు నిద్ర లోనే ఉత్పత్తి అవుతాయి !  ఆ పదార్ధాలన్నీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి !
చర్మ కణాలకు తగినంత  పోషక పదార్ధాలను సరఫరా చేయడం తో పాటుగా , చర్మాన్ని  చక్కటి సాగే గుణం కొన సాగించే పనులు అన్నీ కూడా నిద్ర సరిగా పోతున్నప్పుడే జరుగుతాయి ! 
4. ప్యాంక్రియాస్ : ఈ గ్రంధి మన దేహం లో ఉండే అతి ముఖ్యమైన గ్రంధి ! :   ఇది కూడా ఒక చిన్న పాటి కర్మాగారం మన దేహం లో !  ఈ గ్రంధి చేసే అతి ముఖ్యమైన  పనులలో ఒకటి , మన రక్తం లోని చెక్కర శాతాన్ని తగు పాళ్ళలో నియంత్రించడం !  ఉదాహరణ కు రెండో మూడో లడ్డూ లు తిన్నా కూడా , రక్తం లో వెంటనే చెక్కర శాతం కంట్రోలు చేసేది  ప్యాంక్రియాస్ గ్రంధి మాత్రమే !  నిద్ర లేమి వల్ల , ఈ  ప్యాంక్రియాస్ కర్మాగారం లో క్రియలు  వేగం గా జరగవు ! అంటే , రక్తం లో చెక్కర  ఎక్కువ అవుతుంది !  ఈ పరిస్థితి చాలా కాలం కొన సాగితే , మధుమేహం  గా మారుతుంది ! అంటే డయాబెటిస్ వస్తుంది ! 
5. మెదడు లో : మనం వేగం గా నడవడం గానీ , లేదా పరిగెత్తడం కానీ , లేదా ఏపని అయినా శ్రమ  పడి చేసినప్పుడు కానీ ఏ రకం గా చెమట ఏర్పడి , ఆ ఏర్పడిన చెమట చర్మం ద్వారా బయటకు వస్తుందో , అదే రకం గా , మనం పగలంతా పని  చేశాక , లేదా చదువుకున్నాక , మెదడు లో కణాలన్నీ కూడా అలసి పోయి , వివిధ రకాల జీవ రసాయన పదార్ధాలను , ఉత్పత్తి చేస్తాయి ! అందులో మలిన పదార్ధాలు కూడా చాలా  ఏర్పడతాయి !  ఈ రకం గా ఏర్పడిన మలిన పదార్ధాలు , కేవలం  నిద్ర లోనే  , మన రక్తం లో కలవడం , తద్వారా , మన మూత్ర పిండాల ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది ! 
పైన చెప్పుకున్న వన్నీ చదివాక మనకు తెలిసేది ఒకటే !  పగలు , మన దేహం, మనం చేసే  అన్ని రకాల పనులకూ , సంపూర్ణం గా తన సహకారం అందించి , రాత్రి సమయం లో మనం నిద్ర పోతున్నప్పుడు మాత్రమే , అవసరమైన రిపేరు చేసుకుంటుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

నిద్రలో ఏమి జరుగుతుంది ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 25, 2014 at 5:52 సా.

నిద్రలో ఏమి జరుగుతుంది ? 1. 

‘ మత్తు వదలరా నిద్దుర , మత్తు వదలరా’  ! అని ఘంటసాల గారు పాడిన పాట , సినిమా సంగీత ప్రియులందరూ విని వుంటారు ! అతినిద్రా లోలుడు , తెలివిలేని మూర్ఖుడు ! అని  కర్తవ్యాన్ని బోధిస్తాడు కృష్ణ పరమాత్ముడు ! భీముడికి ! ఆ పాట లో !  అతి నిద్ర ఎంత ప్రమాదమో , నిద్ర లేమి కూడా అంతే ప్రమాదం ! అది కూడా అనేక అనర్ధాలకు హేతువు ! ఇటీవలి పరిశోధనల ఫలితం గా ఈ నిజాలు తెలిశాయి ! 
మనం సామాన్యం గా , నిద్ర పోవడం అంటే , ఏపనీ చేయకుండా ,  కళ్ళు మూసుకుని  విశ్రాంతి తీసుకోవడం అనే అనుకుంటాం ! కానీ ,  మన దేహం లో అనేక  అవయవాలు , మనం నిద్ర పోయే సమయం లో అనేక జీవ రసాయన చర్యలలో పాలు పంచుకుంటాయి ! శాస్త్రజ్ఞులు ఈ నిద్ర వల్ల ఉపయోగాలను ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు ! అలసి పోయి , నిస్తేజం గా ఉన్న  మన దేహాన్నీ , మన మెదడునూ , ఏ  మందుల అవసరమూ లేకుండా , సహజం గానే  మళ్ళీ ఉత్తేజం కలిగించి ,  శక్తివంతం చేయగలిగే  సామర్ధ్యం కేవలం నిద్రకు మాత్రమే ఉందని ! కాక పొతే , ఈ నిద్ర వల్ల మనం పొందే ప్రయోజనాలు , సరి పడినంత నిద్ర పోతేనే  పొంద గలుగు తామని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు ! ఆత్మ న్యూనతా భావాలూ , ఆందోళనా మనస్తత్వం , ఇవి కూడా  నిద్ర సరిగా ఉంటే , మటు మాయ మవుతాయని తెలిసింది ! 
నిద్ర వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు , నిద్ర లేమి లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ఉత్తమం ! 
మన మెదడును ఒక హార్డ్ డిస్క్ గానూ , ఒక మంచి ప్రాసెసర్ గానూ మనం ఊహించుకుంటే ,మన కంప్యూటర్ లకు కనుక మనం రాత్రి సమయం లో  స్విచ్ ఆఫ్ చేసి,  చల్ల బరచి నట్టు గా,మన నిద్ర ను, పోల్చుకోవచ్చు ! మనం మెళుకువ గా ఉన్నప్పుడు మెదడు లో ఏర్పడ్డ అనేక హాని కర పదార్ధాలు ( వీటిని ఫ్రీ రాడికల్స్ అంటారు, జీవ రసాయన శాస్త్ర పరం గా అంటే, బయో కెమిస్ట్రీ లో సాంకేతిక నామాలు ) , రాత్రి సమయం లో, మెదడు నుంచి కడిగి వేయ బడుతూ ఉంటాయి.  ఇట్లా కడిగి వేసే అనేక యాంటీ ఆక్సిడెంట్ లు, రాత్రి సమయం లో, మనం నిద్ర పోతున్నప్పుడే ఎక్కువ గా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మన మెదడు కణాల లో ! నిద్ర లేమి లో,   మన మెదడు లో నిర్మితమై ఉన్న అనేక లక్షల నాడీ  కణాలు ,  బాగా అలసి పోయి ఉంటాయి , మనతో పాటుగా ! ఆ పరిస్థితి లో , హానికర పదార్ధాలను కడిగే యాంటీ ఆక్సిడెంట్ లు తక్కువ అవుతాయి !  ఒక వేళ , మనకు ఒక్క సారిగా ఎక్కువ సమయం ( లేదా తగినంత సమయం ) నిద్ర పోవడానికి అవకాశం లేక ,  గంట , రెండు గంటలు కునుకు తీసినా కూడా ,  తగినంత లాభం ఉండదు ! సరే, మరి  ఈ యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ గా లేక పొతే ఏమవుతుంది ? అనుకునే వారు చాలా మంది ఉన్నారు ! మెదడు లో ఈ  పరిస్థితి ని , మనం, కిటికీలు మూసి వేసిన గదిలో , ఒక నాలుగు గంటలు ఉంటే ఎట్లా ఉంటుందో , దానితో పోల్చుకోవచ్చు ! లేదా, కారులో విండోస్ మూసేసి  ఒక గంట సమయం కూర్చున్న పరిస్థితి తో పోల్చుకోవచ్చు ! అప్పుడప్పుడూ , నిద్ర కోల్పోవడం సహజమే ! అనుకోని పరిస్థితులలో ఇట్లా జరగ వచ్చు ! కానీ, నిద్ర లేమి ఒక అలవాటు గా మారుతున్నప్పుడే  , పరిస్థితులు తల్ల క్రిందు లవుతాయి , మెదడులోనూ , తద్వారా మన జీవితాలలోనూ !  ఇట్లా  ఫ్రీ రాడికల్స్  ఎక్కువ గా మెదడులో పేరుకు పోతూ ఉంటే , అవి మెదడు కణాలను దెబ్బ తీయగలవని , ఎలుకల మెదడుల మీద చేసిన పరిశోధనల లో ఋజువైంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ ! 4. అనంత యంత్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు ?

In Our Health on అక్టోబర్ 12, 2014 at 12:05 సా.

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ ! 4. అనంత యంత్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు ? 

quantum computer tutorial

మునుపటి టపా లలో అనంత యంత్రం గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ! మరి  ఆ యంత్రాన్ని ఏ రకం గా మనం ఉపయోగించుకోవచ్చు ? 
వ్యాధులను కనుక్కోవడం లో :మన దేహం లో మనకు తెలియ కుండానే , పెరిగే క్యాన్సర్ కణ జాలాన్ని , అతి ముందు దశల లోనే కనుక్కోవడం సాధ్యమవుతుంది , క్వాంటం కంప్యూటర్ ల ద్వారా !
విమానాలు సురక్షితం గా నడపడం లో : ప్రస్తుతం విమానాలలో ఉన్న కంప్యూటర్ ల కన్నా ఎంతో మెరుగు గా ఈ అనంత యంత్రాలు పనిచేసి , విమాన ప్రయాణాన్ని ఇంకా సురక్షితం చేయగలవు ! 
దూర గ్రహాలను కనుక్కోవడం లో :ప్రస్తుతం , ప్రపంచం లో అనేక దేశాలలో అమర్చి ఉన్న టెలిస్కోపు ల సమాచారాన్నంతటి నీ అతి త్వరగా విశ్లేషణ చేసి , నూతన గ్రహాల ను కనుక్కోవడం లో ప్రధాన పాత్ర వహిస్తాయి  ఈ రకమైన కంప్యూటర్ లు ! 
చోదకులు లేని కార్లు సురక్షితం గా నడపడం కూడా ! :ఈ దిశ లో ఇప్పటికే అనేక పరిశోధనలు జరుగుతున్నాయి , టెస్లా అనే కంపెనీ ఒక కారు ను కూడా మార్కెట్ లో విడుదల చేయ బోతున్నది , డ్రైవర్ తో పని లేకుండా నడవ గలిగే కారు ను !  అనంత యంత్రం , కారు వెళ్ళే అనేక మార్గాలను ముందే విశ్లేషణ చేసి ఏక కాలం లో  కారుకు  అంద చేస్తుంది ! దానితో ఆ కారు ,అవరోధాలను అధిగమించి , సురక్షితం గా  ప్రయాణీకులను తమ గమ్యానికి చేర్చుతుంది , కైలాసానికి  కాకుండా ! అంతే కాకుండా , ట్రాఫిక్ సమస్యలను కూడా , ఈ అనంత యంత్రం ,  అనేక రెట్లు వేగం గా చేసి , ప్రయాణ కాలం తగ్గిస్తుంది ! 
కొనుగోలు దార్లను ఎక్కువ చేయడం ! :ఇప్పటి కే , అనవసరమైన వాటినన్నిటినీ ఎడా పెడా కొనేసే సంస్కృతి ని   పోషిస్తున్న అంతర్జాలం లో అనేక కంపెనీలు ముందు ముందు , ఈ అనంత యంత్రాల ను ‘ తెలివి ‘ గా ఉపయోగించు కొని , కొను గోలు దార్ల చేత , అంతర్జాల విపణి లో విపరీతం గా ఖర్చు చేయించ గలదు ఈ అనంత యంత్రం ! దానితో బడా కంపెనీలు ఇంకా ఇంకా బడా కంపెనీలు గా తయారవుతాయి ! ఇక ,  కొనుగోలు దారుడి దారి ! (  అవుతుంది గోదారి ?! ) 
ఎన్నికలలో : అనంత యంత్రాన్ని ఎన్నికల సమయం లో ఉపయోగించే పార్టీలు , ఓటరు , వివిధ ప్రాంతాలలో ఓటు వేసే తీరు తెన్నులు , సరిగా అంచనా వేసుకుని , అందుకు తగినట్టు గా తమ పధకాలు మార్చుకుని , విజయం పొందడానికి కూడా అవకాశం ఎక్కువ అవుతుంది !  
ఈ అనంత యంత్రం గురించిన వివరాలు  ఇటీవలి టైం పత్రిక ముఖ పాత్ర వ్యాసం  ఆధారం గానూ , ఇంకా అంతర్జాల వ్యాసాల ఆధారం గానూ రాయడం జరిగింది ! ఉత్సాహం ఉన్న వారు, www. dwavesys .com  వెబ్ సైట్ ను కూడా చూడవచ్చు , మరిన్ని వివరాల కోసం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనంత యంత్రం . ఇన్ఫినిటీ మెషీన్ !. 3.

In Our Health on అక్టోబర్ 11, 2014 at 9:49 ఉద.

అనంత యంత్రం . ఇన్ఫినిటీ మెషీన్ !. 3. 

క్రితం టపాలో , అనంత యంత్రం , ప్రస్తుతం అందుబాటు లో ఉన్న  కంప్యూటర్ ల కంటే భిన్నం గానూ , ఎన్నో రెట్లు వేగం గానూ , ఎట్లా పని చేయ గలదో  తెలుసుకున్నాం కదా !  అందుకే ,  అమెరికా జాతీయ నిఘా వ్యవస్థ కూడా  ( అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ) 80 మిల్లియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి , ఈ క్వాంటం కంప్యూటర్ ల మీద పరిశోధన  ప్రారంభించింది ‘ అని ఎడ్వర్డ్ స్నోడెన్  తాను లీక్ చేసిన రహస్యాలలో పేర్కొన్నాడు ! ఈ పధకానికి  అమెరికా  ‘ పెనె ట్రే టింగ్ హార్డ్ టార్గెట్స్’  అని రహస్యమైన కోడ్ పేరు కూడా పెట్టింది ! దానికి కారణం : ప్రస్తుతం  అందుబాటు లో ఉన్న కంప్యూటర్ లు  ఎన్క్రి ప్షన్ ను విశ్లేషణ చేయడానికి సంవత్సరాలు పట్టే సమయాన్ని క్వాంటం కంప్యూటర్ లు కేవలం కొన్ని  రోజులలో చేయగలవు !
అందుకే , ఆ దిశలో అనేక పరిశోధనలు శర వేగం తో జరుగుతున్నాయి !  ఇప్పుడు పరిశోధకుల ప్రధాన సమస్య , కేవలం క్వాంటం కంప్యూటర్  ల ప్రధాన  సూత్రం ( సూపర్ పొజిషన్ ) మాత్రమే కాదు !  అట్లా సూపర్ పొజిషన్ చేయగలిగి ,  ఇతర అణువులతో లింక్ అవగలిగితేనే , సమాచారం వేగం గా విశ్లేషణ చేయబడుతుంది ! ఇట్లా అనేక వేల లక్షల సూపర్ పొజిషన్ స్థితులు , ఒకదానితో ఒకటి సంధానం కావడాన్ని  ఎంటాంగిల్మెంట్  ( entanglement ) అని అంటారు ! ఈ  ఎంటాంగిల్మెంట్  చేయడానికి , క్వాంటం కంప్యూటర్ ను ఒక స్థిరమైన వాతావరణం లో ఉంచాలి ! అంటే ,  బాహ్య వాతావరణం ఏమాత్రం మారకూడదు ! అంటే , ఉష్ణోగ్రత లోకానీ , లేదా కుదుపులు లేకుండా నూ ,అయస్కాంత ప్రభావం కూడా లేకుండా , ఎప్పుడూ ఒక సమ స్థితి లో ఉంచితేనే , క్వాంటం కంప్యూటర్  సరిగా పని చేయగలుగుతుంది ! D wave  కంపెనీ కూడా ఇట్లా ఎంటాంగిల్మెంట్ , సూపర్ పొజిషన్ తో పాటుగా చేయగలిగే కంప్యూటర్ లను తయారు చేసే ప్రయత్నం లో ఉంది !
క్వాంటం కంప్యూటర్ లు ఇంకో పధ్ధతి లో కూడా పని చేయగలుగుతాయి ! దానిని క్వాంటం అన్నీలింగ్ ( quantum annealing ) అని అంటారు.  ఈ పద్దతి గురించి , ఈ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు !  ఒక యాభై  చిన్న చిన్న పర్వతాలు ఉన్న ఒక ప్రాంతం ఉందనుకోండి !  ఆ పర్వతాలన్నిటికీ ఎత్తు కనుక్కోవాలంటే , ఒక మనిషి యాభై పర్వతాలనూ ఒకదాని తరువాత ఒకటి , ఎక్కి  , కనుక్కోవాలి ! ఇట్లా ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ లు చేస్తాయి ! కానీ యాభై మంది మనుషులు ఒకే సారి , ఆ యాభై పర్వతాలలో ఒక్కో దాన్ని ఎక్కి నా ,  ఆ యాభై మంది సమాచారం ఒకే సారి తెలుసుకునే అవకాశం ఉంటుంది ! ఇట్లా క్వాంటం కంప్యూటర్ లు అన్నీలింగ్ అనే సూత్రం ద్వారా సులభం చేయ గలుగుతాయి , ఆ పనిని ! ఈ సూత్రం ద్వారా పనిచేసే క్వాంటం కంప్యూటర్ లను అడయాబాటిక్ కంప్యూటర్ అని అంటారు ( adiabatic computers ).
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ ! 2. ఈ 60 కోట్ల రూపాయల కంప్యూటర్ ఎట్లా పని చేస్తుంది ?

In Our Health on అక్టోబర్ 4, 2014 at 11:59 ఉద.

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ ! 2. ఈ 60 కోట్ల రూపాయల కంప్యూటర్ ఎట్లా పని చేస్తుంది ? 

క్రితం టపాలో, ఈ అనంత యంత్రం గురించిన ఉపోత్ఘాతం చదివారు కదా ! మరి,  ఈ అరవై కోట్ల రూపాయల కు పైగా  ధర ఉన్న కంప్యూటర్  , మిగతా కంప్యూటర్ లకన్నా  , ఎట్లా భిన్నం గా ఉంటుంది ? వాటికన్నా ఎక్కువ సామర్ధ్యం తో ఎట్లా పని చేయగలుగుతుంది ? అన్న సందేహాలు మనకు సహజం గానే వస్తాయి కదా ! ఆ వివరాలు తెలుసుకుందాం ! 
మనం ప్రస్తుతం వాడే కంప్యూటర్ లు,  వాటికి ఫీడ్ చేసిన వివరాలను కేవలం 1 లేక 0  అంటే బైనరీ బిట్స్  ఆధారం గానే పని చేస్తాయి ! అంటే,  ఏ క్షణం లోనైనా ,  వివరాలు  కేవలం సున్నా కానీ లేదా ఒకటి కానీ అయి ఉంటాయి ! అంటే,  కంప్యూటర్ కు ఇచ్చిన ఏ రకమైన లెక్క లైనా కూడా , ఏ క్షణం లోనైనా , ఒక స్థితి   లోనే పని చేస్తుంది ! అంటే, ఒక నియమిత  క్రమం లోనే పనిచేయ గలుగుతాయి , ఒక దాని తరువాత ఒకటి గా !   అందుకే, మన కంప్యూటర్ లను డిజిటల్ కంప్యూటర్ లు అని కూడా అంటారు ! కానీ అందుకు భిన్నం గా, క్వాంటం నియమాల ఆధారం గా పనిచేస్తుంది ఈ అనంత యంత్రం ! 
క్వాంటం నియమాలు ఏమిటి ? : 
క్వాంటం నియమాలలో ప్రధానమైనది,   సూపర్ పొజిషన్ :  సూపర్ పొజిషన్ అంటే  ,  ఒకే సమయం లో రెండు స్థితులలో  పని చేస్తుంది కంప్యూటర్ ! అంటే, రెండు రకాలైన లెక్క లను ఏక కాలం లో చేయ గలదు , ఒక్క బిట్  సమాచారం కనుక ఈ  కంప్యూటర్ కు ఇస్తే ఇస్తే !  రెండు బిట్స్  కనుక  కంప్యూటర్  లో ఉంటే  2x 2 = 4  లెక్కలను, ఏక కాలం లో చేయగలదు !  మూడు బిట్స్ ఉంటే , 2x 2x 2=8  లెక్కల నూ , ఇట్లా అనేక లెక్కలను ఏక కాలం లో చేయగలదు !  ఇప్పుడు మన అనంత యంత్రం సంగతి చూద్దాం ! ఈ యంత్రం లో  అత్యంత శీతల స్థితి లో , అంటే మైనస్ 273 డిగ్రీల శీతల స్థితి లో ఉంచిన నియోబియం చిప్  లో 512 బిట్స్ అమర్చి ఉన్నాయి ( వీటిని క్వాంటం బిట్స్ లేదా క్యూ బిట్స్ అని అంటారు )  !  అంటే,  ఈ D వేవ్ టూ  కంప్యూటర్ ఏక కాలం లో 2 టు ది పవర్ అఫ్ 512 లెక్కలను  చేయగలదు , ఏక కాలం లో !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే,  ఈ 2 టు ది పవర్ అఫ్ 512 విలువ , ఈ విశ్వం లో ఉన్న మొత్తం   పరమాణువుల సంఖ్య కన్నా  ఎక్కువ అవుతుంది !  ఇట్లా ,  ఇన్ని లెక్కలు ఏక కాలం లో పరిష్కారం చేయ గలిగే సామర్ధ్యం , ప్రస్తుతం ఉన్న ఏ సూపర్ కంప్యూటర్ కూ లేదు ! అని అంటారు  కాలిన్ విలియమ్స్  ( D వేవ్  కంప్యూటర్స్ డైరెక్టర్ , ఈయన  నోబెల్ బహుమతి గ్రహీత స్టీఫెన్ హాకింగ్ శిష్యుడు ). 
( పైన ఉన్న చిత్రం  చూసి , స్థూలం గానూ , క్రింద ఉన్న చిత్రం మీద క్లిక్ చేస్తే సూక్ష్మం గానూ , ఈ క్వాంటం కంప్యూటర్ మూల సూత్రం గురించి తెలుసుకోవచ్చు ! )
quantum computing
వచ్చే టపాలో , ఈ అనంత యంత్రం గురించిన  ఇంకొన్ని సంగతులు ! 

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ !1.

In Our Health on అక్టోబర్ 2, 2014 at 7:56 సా.

అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ !1. 

img-0-8395013.jpg

పైన చిత్రం లో కనిపించేది,   డీ వేవ్ టూ ( D wave two  )  కంప్యూటర్ లో అమర్చబడే 512 క్యూ బిట్ ప్రాసెసర్  ఫోటో ! 

ఈ నూతన అనంత యంత్రం  అనేక  సమస్యలను పరిష్కరించడమే కాకుండా ,  రోగ నివారణ తీరునూ  ,   ఈ అనంత విశ్వాన్ని పరిశీలన నూ ,  ప్రపంచం లో వ్యాపారాలు జరిగే తీరునూ , విప్లవాత్మకం గా మారుస్తుందని భావిస్తున్నారు ! కానీ ఇంకొందరు శాస్త్రజ్ఞులు మాత్రం ,  అది  అంత సులభం కాదని కూడా భావిస్తున్నారు ! ఆ వివరాలు తెలుసుకుందాం ! 
చాలా ఏళ్ళు గా , ఈ విశ్వం లో  అత్యంత శీతలమైన ప్రాంతం ,  భూమికి  5 వేల కాంతి సంవత్సరాల దూరం లో ఉండే  ‘ బూమెరాంగ్ నెబ్యులా ‘ అనే ప్రదేశం  లో  విస్తరించి ఉన్న  ఒక విశాలమైన  వాయు మేఘం అని  శాస్త్రజ్ఞలు భావిస్తున్నారు ! కానీ అది ఇప్పుడు వాస్తవం కాదు ! 
ఎందుకంటే , అత్యంత శీతలమైన ప్రదేశం ఇప్పుడు  కెనడా లోని బర్నబీ అనే ఒక పట్టణం లో ఉంది !  డీ వేవ్ ( D  – wave ) అనే ఒక కంపెనీ ప్రధాన కార్యాలయం ఈ బర్నబీ పట్టణం లోనే ఉంది !  
ఈ డీ వేవ్ కంపెనీ తయారు చేసిన  అత్యాధునిక  కంప్యూటర్  పేరు   డీ వేవ్ టూ ( D wave two  ) ఈ డీ వేవ్ టూ లు కేవలం ఐదింటిని మాత్రమే ,  తయారు చేసింది ఇప్పటి వరకు , డీ వేవ్ కంపెనీ !  ఖరీదు పది మిలియన్ల డాలర్లు . నిజం . ఒక్కో కంప్యుటర్ ఖరీదు పది మిలియన్  డాలర్లు ! అంటే అక్షరాలా అరవై ఒక్క కోట్ల రూపాయలు !  డీ వేవ్ టూ   మూడు మీటర్ల ఎత్తు ఉన్న ఒక నల్లటి పెట్టె ! అంటే బ్లాక్ బాక్స్ ! ఈ నల్లటి పెట్టెలో ఒక  శీతలీకరణ  యంత్రం  ఉంది ! ఆ శీతలీకరణ యంత్రం  లోపల నిక్షిప్తమై ఉన్నదే  ‘ నియోబియం కంప్యూటర్ చిప్ ‘ ! అదే డీ వేవ్ టూ ! ( నియోబియం  అనే మూలకం పరమాణు సంఖ్య 41. ఈ మూలకం అత్యంత తక్కువ బరువు ఉన్నా కూడా అత్యంత రెసిస్టన్స్ అంటే నిరోధక శక్తి ఉన్న మూలకం . ) ఈ శీతలీకరణ యంత్రం  నియోబియం చిప్ ను  అత్యంత శీతలం గా, అంటే మైనస్  273. 1 డిగ్రీల శీతలం గా ఉంచుతుంది ! ఆ డీ వేవ్ కంపెనీ లో  పని చేస్తున్నది కేవలం 114  మంది ఉద్యోగులే !  కానీ ఈ కంపెనీ కి పెట్టుబడి పెడుతున్నది మాత్రం , ప్రపంచం లోని అత్యంత ధనవంతులలో కొందరు !  వారిలో అమెజాన్  స్థాపకుడు  బెజోస్ కూడా ఉన్నారు !  అట్లాగే డీ వేవ్ టూ కొనుగోలు దారులు అంటే కస్టమర్ లు కూడా అతిరధ మహారధులే ! వారిలో గూగుల్ కంపెనీ , నాసా , ఇంకా అమెరికా గూఢ చార వ్యవస్థ కూడా ఉంది ! దానికి కారణం ఏమిటంటే,  డీ వేవ్ టూ కంపెనీ తయారు చేసే క్వాంటం కంప్యూటర్  చాలా విచిత్రమైనదీ , విప్లవాత్మకమైనదీ అవడం వల్ల !  జనాలు ఇంకా , ఈ రకమైన కంప్యూటర్ ను తాము ఎట్లా ఉపయోగించు కొవచ్చో తెలుసుకునే పని లో ఉన్నారు ! ఈ క్వాంటం కంప్యూటర్ లు, సాధారణ కంప్యూటర్ లు అనేక శతాబ్దాలు చేసే  పనిని  కొన్ని రోజుల్లోనే చేయగల సామర్ధ్యం కలిగి ఉంటాయి ! 
మిగతా సంగతులు వచ్చే టపాలో ! 
%d bloggers like this: