Our Health

Archive for నవంబర్, 2014|Monthly archive page

అనుమానం , పెనుభూతం !3.పారనొయియా కారణాలు !

In Our Health on నవంబర్ 29, 2014 at 10:25 ఉద.

అనుమానం ,  పెనుభూతం !3.పారనొయియా కారణాలు  !

మరి అనుమానం పెనుభూతం అవడానికి కారణాలు ఏమిటి ?
సాంఘిక కారణాలు :  ఏమీ చేయలేని  నిస్సహాయ స్థితి , తాము పరిస్థితుల ప్రభావానికి బలిపశువుగా మారుతున్నామేమో నన్న  ఆత్మ న్యూనతా భావనలు , ప్రధానం గా ఈ అనుమానాలు , పెనుభూతాలు గా మారడానికి కారణాలు !  తమ జీవన పరిస్థితులకు , తాము కారణం కాదని , ఇతరుల వల్లే తాము, అంత అధ్వాన్న స్థితిలో ఉన్నామనే ఇతరుల మీద నింద వేసే మనస్తత్వం ఉన్న వారు , ఇంకా  దారిద్ర్య రేఖకు ఇంచుమించు దగ్గర గా  జీవిస్తున్న వారు , ఇట్లాంటి పెనుభూతాల వల  లో  ఎక్కువగా పడుతూ ఉంటారు !  పేద వారు ఎక్కువ గా తమ పరిస్థితులకు ఇతరులు కారణం అని భావిస్తూ ఉంటారు ! దానిలో కొంత వరకూ నిజం కూడా లేక పోలేదు ! ఒక కూలీ , తమ యజమాని వెట్టి చాకిరి చేయించుకుంటూ , తక్కువ జీతం ఇస్తూ ఉంటే , ఆ కూలీ పేద జీవన పరిస్థితి కి యజమాని కాక ఇంకెవరు కారణం అవుతారు ? ఎప్పుడూ కనబడని దేవుడు కాదు కదా ?  కానీ వారిలోనే , వారి అనుమానాలు పెనుభూతాలు అయ్యే అవకాశాలు హెచ్చు ! అట్లాగే , పురుషులకన్నా స్త్రీలు ఎక్కువ గా తమ పరిస్థితులకు ఇతరులే కారణమనే అనుమానాలు కలిగి ఉంటారు , అందుకే స్త్రీలలో , పురుషులకన్నా , వారి అనుమానాలు , పెనుభూతాలు అయ్యే ప్రమాదం ఎక్కువ ! ఈ విషయాలన్నీ పరిశోధనల వల్ల తెలినవే !  అందరు స్త్రీలూ  ఇట్లా  అనుమానాలూ , పెనుభూతాలతో బాధ పడుతూ ఉంటారని మాత్రం అనుకోవడం పొరబాటు !
పరిసరాల ప్రభావం : అంటే మనం చిన్న తనం నుంచీ పెరిగిన వాతావరణం ! మొదటగా మన తల్లి దండ్రుల పెంపకాల మీదే మన మెదడు లో వైరింగ్ జరుగుతుంది కదా ! అందుకే తల్లి దండ్రులు కనుక , తమ పిల్లలను , ( వారు అత్యంత ప్రతిభావంతులు కాకపోయినా కూడా ) వారు ఎంతో ప్రత్యేకమైన వారి గానూ , వారు ఎక్కడికి వెళ్ళినా ,ప్రత్యేకమైన  మర్యాదలూ , గౌరవాలూ ( అర్హత లేక పోయినా ) పొందాలనే  భావన వారిలో కలిగించడం కూడా , ఈ పారనోయియా కు కారణమవుతుంది !  ఆ భావనలు బలం గా నాటుకు పోయిన వారు , వారి తల్లి దండ్రుల తో పొందిన , ప్రత్యేకమైన , ప్రేమా , గౌరవాలూ , మర్యాదలు , పొందాలనే  భావిస్తూ , అవి పొందలేని వాతావరణం లో పారనోయియా అనుభవిస్తూ ఉంటారు ! దానికి తోడుగా , వారి జీవితాలలో , అనేక రకాలు గా నిరాశా నిస్పృహ లు అనుభవించినా , అనేక  సార్లు , వారి వారి ప్రయత్నాలలో విఫలం చెందినా  కూడా , తీవ్రమైన మానసిక వత్తిడి తో సతమత మవుతూ ఉంటారు !  ఆ కారణాలు కూడా ,  వారి అనుమానాలను తీవ్ర తరం చేస్తూ , అవి పెనుభూతాలు గా మారడానికి దారి తీస్తాయి ! తమ జీవితాలలో , అనేక మంది చేతుల్లో , అనేక రకాలు గా మోసపోయిన వారు కూడా , ఈ పారనోయియా తో బాధ పడుతూ ఉంటారు !
శారీరిక మార్పులు : వయసు పెరిగిన కొద్దీ , మెదడు రక్త ప్రసరణ లో మార్పుల వల్ల కూడా , కొందరు వృద్ధులలో , ఈ అనుమానాలు , పెనుభూతాలవుతాయి ! తీవ్రమైన వినికిడి లోపం ఉన్నవారి లో కూడా , ఈ రిస్కు హెచ్చుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 22, 2014 at 10:23 ఉద.

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా ! 

ఈ అనుమానం పెనుభూతం అయిన వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉంటాయో వారి మాటల్లోనే చదవండి !
సాల్లీ  ( అమెరికా ) 
” నాకు చిన్న తనం నుంచీ చీకటంటే భయం ! ఆ భయం తోనే నేను పెరిగాను కూడా , కానీ ఇప్పుడు నాకు చీకటంటే ఎక్కువ భయం లేక పోయినా , నేను ఉంటున్న రూమ్ లో నాకు కనబడనివి ఏమున్నాయో అనే భావన కలుగుతూ ఉంటుంది !  నా రూమ్ లో ఎవరో ,నన్ను కిడ్నాప్ చేయడమో , రేప్ చేసి చంపేయ డానికి ప్రయత్నం చేస్తున్నారనే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది ! నేను ఒంటరి గా ఇంట్లో ఉన్నా , ఎవరో ఒకరు , తలుపులు పగలగొట్టి , ఇంట్లో ప్రవేశించి , నాకు హాని తలపెడతారనిపిస్తూ ఉంటుంది !  నేను ఒక్కదానినే ఇంట్లో ఉంటే , ఇంట్లో అన్ని గదులూ , మారు మూలలూ , పదే ,పదే  వెదికి , ఎవరూ లేరని నిర్ధారించుకుంటాను !
నేను బాత్ రూమ్ లోకి వెళ్ళినా కూడా షవర్ కర్టెన్ ను తొలగించి , ఆ కర్టెన్ వెనక ఎవరూ లేరని నిశ్చయం చేసుకుంటాను ! నేను ఒంటరిగా , బయటకు వెళ్ళినా కూడా , ఎవరో ఒకరు నన్ను బలవంతాన ఎక్కడికో తీసుకు వెళ్లి మానభంగం చేస్తారని భయ పడుతూ ఉంటాను ! ”
వివియన్ ( అమెరికా )
” నేను బయట ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా , నా వెనక కారులో ఉన్న వారు నన్ను వెంతాడుతున్నారనే భయం నాకు ఉంటుంది !  నేను ఏ పార్టీకి వెళ్ళినా , అక్కడ ఎవరో ఒకరు , నా డ్రింకు లో మత్తు మందు కలిపి ఇస్తారనే భయం ఎప్పుడూ కలుగుతుంది ! ”
సారా ( ఇంగ్లండ్ )
” నేను నా స్నేహితురాలితో వాదులాట  కు దిగి నా స్నేహం చెడ గొట్టుకున్నా ! ఇప్పుడు , ఆ స్నేహితురాలు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుందని భయం గా ఉంది !  ఆమె మా ఇంటికి కూడా కొన్ని సార్లు వచ్చింది !  ఒక సారి నేను ఇంట్లో ఉన్న ఆహారాన్ని కూడా  చెత్త కుండీ లో పారవేశా , ఆ ఆహారం లో విషం కలిపారేమో అన్న భయం తో ” !
అహ్మద్ ( ఇండియా ) 
నేను బహిరంగ ప్రదేశాలలో వెళుతూ ఉన్నప్పుడు , మిగతా వాళ్ళంతా , నా మీసాలనూ , నా కళ్ళనూ , నా ముక్కునూ , తదేకం గా పరిశీలిస్తూ , నా మీద అభిప్రాయాలు ఏర్పరుచు కుంటున్నారని అనిపిస్తూ ఉంటుంది !  ఆ జనాలలోనుంచి , ఎవరో ఒకరు , ఏదో ఒకరోజు అకస్మాత్తుగా , నా మీద పడి , నా కళ్ళు పీకేయడమో , ఓ కత్తి తో నా ముక్కు కోసేయడమో చేస్తారనే భయం నన్ను పీడిస్తూ ఉంటుంది ! 
పైన ఉన్న అనుభవాలు చదువుతుంటే , మనకు ( బాగా విశ్లేషణ చేయగలిగే అనుభవం ఉన్న వారికి )  కలిగే అభిప్రాయం ఒకటే !  అది వారికి ఇతరుల మీద ఉన్న వక్ర అభిప్రాయం ! దానినే అట్రి బ్యూ షనల్ బయస్ అంటారు ! ( attribution bias ) అంటే , వారికి ఇతరుల మీద ఎప్పుడూ , వారు తమకు హాని కలిగిస్తారనే చెడు భావన మాత్రమే ఉంటుంది ! ఉదాహరణకు ,  ఒక బహిరంగ ప్రదేశం లో ఒక వంద మంది మనుషులు ఒక సమయం లో ఉన్నారనుకుంటే , అందులో కనీసం 90 మంది , వారి పని , వారు చేసుకు పోయే వారే ఉంటారు ! ఈ 90 మంది  ని విస్మరించి , కేవలం మిగతా పది మందీ , తమకు హాని కలిగిస్తారనే , విపరీతమైన భయం తో కాలం గడుపుతారు , ఈ పారనోయియా ఉన్న వారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం ! పారనోయియా .1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2014 at 8:49 సా.

అనుమానం పెనుభూతం  ! పారనోయియా .1. 

అనుమానం పెనుభూతం అనే సినిమా  వచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం ! ఆ సినిమా ను నేనైతే చూడలేదు ! కానీ  పేరు మాత్రం బాగుంది !  అనుమానం పెను భూతం ! అంటే, మన అనుమానమే పెనుభూతమై మనల్ని పట్టి పీడిస్తుందన్న మాట ! అదీ  పెనుభూతాలను నమ్మే వాళ్ళను ! (  నేను నమ్మను , అది అప్రస్తుతమేమో కూడా  !)
ఏ రకమైన అనుమానాలు పెను భూతాలవుతాయి ? ఆ పెనుభూతాల లక్షణాలు ఏమిటి ? అనుమానాలను పెనుభూతాలు గా పెరగకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి ?  ఒక సారి ఈ పెను భూతాలు , పట్టాక , వదిలించుకోవడం ఎట్లా ? మరి ఈ పెనుభూతాలు అసలు మనకు పట్టకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ తెలుసుకుందాం ! 
పెనుభూతాలయే అనుమానాలు : అనుమానం అంటే డౌట్ !  డౌట్ రావడం మానవులకు సహజమే !  కానీ ఆనుమానాలు పెనుభూతాలవుతే , అప్పుడు దానిని పారనోయియా అంటారు ( paranoia ) ! పారనోయియా అనే పదం గ్రీకు భాష నుంచి పుట్టింది ! దానికి తెలుగు లో అర్ధం ‘ పిచ్చి ‘ అని ! సాధారణం గా ఈ  పారనోయియా ఈ రకాలు గా ఉంటుంది !
1. తమకు హాని చేయడానికి  ఇతరులు కుట్ర పన్నుతున్నారనుకోవడం ! ఉదాహరణకు :తాము ఒక ప్రమాదం లో   చిక్కుకున్నా , లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఒక వేలు తెగడమో , లేదా కింద పడడమో జరిగినా కూడా , అట్లా  ఇతరుల  ప్రమేయం  తోనే జరిగి ఉంటుందనే , స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండడం !
ఫోబియా( phobia ) కూ పారనోయియా కూ తేడా ఏమిటి ?:  
ఆ అమ్మాయికి కుక్కలంటే ఫోబియా అనో ,  లేదా ఆ అబ్బాయి కి పిల్లులంటే ఫోబియా అనో వింటూ ఉంటాం మనం తరచుగా ! ఈ రకమైన భయాలు , ఒక నిజమైన  ఆపద ను విపరీతం గా విశ్లేషణ చేసుకుని ,ఎక్కువ ఆపద గా భావించడం !  ఉదాహరణకు , కొందరికి బాగా ఎత్తు ఉన్న బిల్డింగులు అంటే ఫోబియా ! అంటే , ఆ ఎత్తైన బిల్డింగు ఎక్కితే ఏదో ప్రమాదం తమకు జరుగుతుందనే విపరీతమైన భయం ! అంటే ఇక్కడ జరుగుతున్నది , ఉన్న భయాన్ని హేతు  రహితం గా అంటే ఇర్రేషనల్ గా ఎక్కువ అనుకోవడం ! కానీ పారనోయియా లో, లేని భయాలనూ , ఆపదలనూ , తమకు ఆపాదించుకోవడం జరుగుతుంది ! 
ఇంకొన్ని సంగతులు వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
ఈలోగా ,మీ అనుమానాలు ఏమైనా ఉంటే , అవి  పెనుభూతాలు కాక ముందే , తెలియచేయండి !

నిద్ర లేమి లక్షణాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 8, 2014 at 8:34 సా.

నిద్ర లేమి  లక్షణాలేమిటి ?

brain 2 300x299 Insomnia linked to brain loss

1. ఏకాగ్రత లోపించడం !
అలసి పోయిన మెదడు లో , జీవ రసాయనాలు కూడా హెచ్చు తగ్గులు జరుగుతూ , ఏకాగ్రత , అంటే కాన్సంట్రేషన్  , లోపించడానికి  దారి తీస్తుంది ! ఆ పరిస్థితి , మనం రోజూ పగలు చేసే ప్రతి పని లోనూ కనబడుతుంది ! 
2. వత్తిడిని తట్టుకోలేక పోవడం ! 
మనం , బాగా నిద్ర పోయి విశ్రాంతి తీసుకుంటేనే , అప్రమత్తం గా ఉండి ,  వత్తిడి కలిగించే పరిస్థితులను సమర్ధ వంతం గా ఎదుర్కొన గలమూ , పరిష్కరించు కో గలమూ కూడా ! నిద్ర లేమి తో ఈ సామర్ధ్యం  కుంటు పడుతుంది ! ఒక చిన్న ఉదాహరణ: రాత్రి సరిగా నిద్ర పోకుండా , ఉదయమే  ఆఫీసు కు డ్రైవ్ చేస్తుంటే , ట్రాఫిక్  లో ఎక్కువ పొరపాట్లకు అవకాశం ఎక్కువ అవుతుంది !  అది మనం అందరమూ గమనించి ఉంటాము ! అట్లాగే , ఆఫీసు లో కానీ , కాలేజీ లో కానీ , వత్తిడి కలిగించే ఏ పరిస్థితి నైనా , బాగా నిద్ర పోయిన తరువాతే , ప్రశాంత చిత్తం తో ఎదుర్కో గలము ! 
3. జ్ఞాపక శక్తి తగ్గి పోవడం !
 ఈ లక్షణం , ముఖ్యం గా విద్యార్ధులకూ , ఇంకా , ఎక్కువ ఏకాగ్రత అవసరం అయే ఉద్యోగస్తులకూ ఎక్కువ గా వర్తిస్తుంది !   అనేక పరిశోధనల్లో ఖచ్చితం గా తెలిసిన విషయం !  పరీక్ష ముందు రోజున రాత్రంతా మేలుకుని , చదివి , మంచి మార్కులు తెచ్చు కోవాలని , అనుకునే విద్యార్ధులు కేవలం అత్యాశ కు పోతున్నారే కానీ ,  వారు , పరీక్షా హాలు లో , సమాధానాలు సరిగా గుర్తు తెచ్చు కోలేక , మార్కులు కోల్పోతారనే సంగతి మర్చి పోకూడదు ! 
4. ఆకలి పెరగడం ! 
 నిద్ర తక్కువ గా పోయే వారికి , ఊబ కాయం వచ్చే రిస్కు హెచ్చుతుంది ! ఎందుకంటే , నిద్ర తక్కువ అయినప్పుడు ,  ఆకలి ని పెంచే హార్మోనులు ఎక్కువ గా రక్తం లో కలుస్తాయి ! దానితో ఆకలి పెరిగి , ఎక్కువ గా తినడం  జరుగుతుంది ! 
5. చూపు మందగించడం ! 
నిద్ర లోపం కలిగిన వారికి ,  పగలు  చూపు మందగిస్తుంది !  ఎందుకంటే , కంటి కటకాన్ని  , పలుచ గానూ , మందం గానూ చేసే కండరాలు బిగుతు గా అవుతాయి ! దానితో , చూపు స్థిరం గా ఎక్కువ సేపు వస్తువుల మీద ఉంచడం  జటిలం అవుతుంది !
6. నిర్ణయాలు తీసుకోవడం లో పొరపాట్లు !
మనం గమనించే ఉంటాము !  తగినంత నిద్ర పోయాక , మనసు ప్రశాంతం గానూ , ఉత్సాహం గానూ ఉండి , ఒక సమస్య ను అనేక కోణాలలో , వివరం గా విశ్లేషించి , ఏమాత్రం ఆదుర్దా లేకుండా , ఆ సమస్యను   పరిష్కకరించ డానికి ప్రయత్నం చేస్తాము !  మన మెదడు , నిద్ర లేమి వల్ల , అంత చురుకు గా ఉండక , నిర్ణయాలు తీసుకోవడం లో జాప్యం జరగడమే కాకుండా, తీసుకున్న నిర్ణయాలలో కూడా అవక తవకలు జరుగుతూ ఉంటాయి ! 
7. నిపుణత తగ్గడం !: 
  మనం చేసే ఏ పనికైనా , నైపుణ్యం , మన  మెదడు తోనూ , శరీరం తోనూ ముడి పడి ఉంటుంది !  అంటే ,  మన మెదడు తాజాగా ఉండి  ,  అనేక విధాలు గా , అనేక దశలలో , అతి చురుకు గా  పని చేస్తూ ఉంటేనే , మన నైపుణ్యాన్ని ,  ప్రయోగాత్మకం గా చూప గలుగుతాము ! అంటే , ప్రాక్టికల్ గా !  నిద్రలేమి తో మనం చేసే పనులు అన్నీ కూడా , ఒక మోతాదు లో మద్యం పుచ్చుకున్న వారు చేసే పనులతో సమానం గా చేస్తామని , శాస్త్రీయం గా నిరూపించ బడింది ! 
8. శారీరిక సమస్యలు : 
 ఈ శారీరిక సమస్యల గురించి , మునుపటి టపాలో వివరించడం జరిగింది , ఉత్సాహం ఉన్న వారు చూడ గలరు ! 
9. మూడ్స్ హెచ్చు తగ్గులు అవడం ! 
ఇది ఇంకో ముఖ్యమైన  లక్షణం !  కారణం లేకుండా చీకాకు పడడం , లేదా అత్యుత్సాహం గా అన్ని పనులూ , అతి వేగం గా చేయ గలననే మితి మించిన ఆత్మ విశ్వాసం కలగడం కూడా జరుగుతుంది ,నిద్రలేమి తో ! దానితో  అనేక రకాల ప్రమాదాలకు కారణ మవడమే కాకుండా ,  గాయ పడే రిస్కు కూడా హెచ్చుతుంది !  
10. మానవ సంబంధాలు దెబ్బ తినడం !
 రాత్రి నిద్ర పోకుండా , పగలు ,  ఆఫీసు లో కానీ , కాలేజీ లో కానీ , కునుకు తీస్తూ ఉంటే ,  వారి భవిష్యత్తు , వారే చేతులారా  , చెడ గొట్టు కున్న వారవుతారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: