Our Health

రచయత ఖజానా

పని సూత్రాలు 34. నచ్చితే, తెలియ చేయండి !

In మానసికం, Our minds on మార్చి 27, 2013 at 2:15 సా.

పని సూత్రాలు 34. నచ్చితే తెలియ చేయండి ! 

( చిత్రం లో ఉన్న ఫెమినా పాండ్స్ మిసిండియా  ( 2013 ) పోటీలో ” స్ట న్నర్ అప్ ” ( ఔను, అచ్చు పొరపాటు ఏమీ లేదు ” స్ట న్నర్  అప్ ” ! )   గా వచ్చిన మన తెలుగు వనిత ”  శోభిత ” అందాన్ని , మనం మెచ్చుకోకుండా ఉండ లేము కదా !  )

మనం సామాన్యం గా రోజూ చేసే ఉద్యోగం లో కానీ , పని చేసే చోట కానీ , వివిధ మనస్తత్వాల మనుషులను కలుసుకుంటూ ఉంటాం ! వివిధ మనస్తత్వాల మనుషులు ,వివిధ ఉద్యోగాలలో పని చేయడం చూస్తూ ఉంటాం ! వారి పని తీరు చూస్తూ ఉంటాం ! వారి వేష భాష లను గమనిస్తూ ఉంటాం !  కొన్ని సందర్భాలలో , మనకు వారిని చూసి నేర్చుకోవలసినది కూడా చాలా ఉందనిపిస్తుంది ! ఎందుకంటే మనం అన్నీ తెలిసిన ” రోదసీ మానవులం ” కాదు కదా ! మానసిక శాస్త్రం లో కూడా ఇట్లా ఇతరులను చూసి నేర్చు కోవడాన్ని సోషల్ లెర్నింగ్ అని అంటారు ( ఈ రకమైన లెర్నింగ్ ను మొదట ప్రతిపాదించినది ,  బండూరా అనే మనస్తత్వ శాస్త్ర వేత్త ) కొంత మంది పని తీరు మనకు నచ్చదు , కొంత మంది వేష భాషలు మనకు నచ్చవు. కొంతమంది  పనితీరు నచ్చుతుంది , వారి వేష భాషలు కూడా మనకు ఎంతో నచ్చుతాయి !  ఇట్లా మీకు నచ్చిన విషయాలను , ప్రత్యేకించి మీరు చేసే ఉద్యోగం లో , మీ ఇతర కొలీగ్స్ తో కానీ , లేదా మీ క్రింద పని చేసే వారితో కానీ ,తెలియ చేయడం , మీ మానవ సంబంధాలను వృద్ధి చేస్తుంది !   వారి బట్టలు బాగుంటే ” మీ చీర నాకు నచ్చింది అనో లేదా ” మీ సల్వార్ కమీజ్ నాకు నచ్చింది ” అనో,  లేదా మీ  టీ షర్ట్  చాలా బావుంది అనో మీరు వారిని ప్రశంసించ వచ్చు ! అట్లాగే  ” మీ హెయిర్ స్టైల్ నాకు నచ్చింది కొత్త గా ఉంది ! అని కానీ , మీ బ్యాంగిల్స్ బావున్నాయి అని కానీ  మీరు స్త్రీ లను ప్రశంసించ  వచ్చు !  అట్లాగే పురుషులను కూడా మీ షర్టు బావుందని కానీ మీ వాచ్ నాకు నచ్చింది అని కానీ మీ హెయిర్ స్టైల్  కొత్త గా ఉంది అని కానీ ప్రశంసించ వచ్చు ! 
అదే విధం గా  చేసే ఉద్యోగం గురించి కూడా ” ఆ కస్టమర్ తో నువ్వు డీల్ చేసిన విధానం నాకు నచ్చింది ! అనో లేదా ”  ఆ మీటింగ్ లో మీరు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చాయి ” అని కానీ , ” మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది  ”అని కానీ మీ అభినందన లను తెలియ చేయ వచ్చు ! మీ ప్రశంసలు సహజం గా , హృదయ పూర్వకం గా ఉండాలి !  ఇట్లా  మీరు ఇతర ఉద్యోగులను ప్రశంసిస్తే , మానవ సహజమైన  కృతజ్ఞతా భావం వారిలో మీ మీద వారికి ఏర్పడుతుంది. మనం , సహజం గా , ఇతరుల మెప్పు కోసం కూడా తహ తహ లాడుతూ ఉంటాం  !  ప్రతి మనిషి లోనూ ఏదో కొంత ప్రత్యేకతా , ఏదో కొంత నిపుణతా , కనీసం గానైనా ఉంటుంది ! ఇట్లా మీరు ఆ ప్రత్యేకతలను , గమనించి , వారిని ప్రశంసిస్తే , మీరు వారిలో పాజిటివ్ వైబ్స్,  అంటే ఆశావాద దృక్పధాన్ని ఇనుమడింప చేసిన వారవుతారు !  అంతే కాక మీరు పని చేసే చోట మీ మానవ సంబంధాలు కూడా మెరుగు పడతాయి ! 
మీ ప్రశంసలు సహజం గా ఉండాలనే విషయం మర్చి పోకూడదు ! అంటే మీరు యాంత్రికం గా ” వారిని పొగడాలనే ” ఉద్దేశం తో ప్రశంసించ కూడదు ! ఇతరుల లో మంచి  గమనించడమే కాకుండా , వారి మంచి తనాన్నీ , వారి మంచి పని తనాన్నీ , వారిలో ఉన్న మంచి టేస్ట్ నూ  మీరు గమనించి , వారికి  తెలియచేస్తే , మీ సహ్రుదయమే కాకుండా మీ హృదయం ఎంత విశాల మైనదో కూడా తెలుస్తుంది !  మంచి టీం వర్క్ కు ఇది ఎంతో  ముఖ్యమైన పని సూత్రం ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 

పని సూత్రాలు. 33. ప్లీజ్ , థ్యాంక్ యూ లతో, మీ పనులు సులువు చేసుకోండి !

In మానసికం, Our minds on మార్చి 26, 2013 at 7:53 సా.

పని సూత్రాలు. 33. ప్లీజ్ , థ్యాంక్ యూ  లతో, మీ పనులు సులువు చేసుకోండి ! 

మనం సర్వ సాధారణం గా ఇతరుల సహాయం రోజులో ఎప్పుడో ఒక సమయం లో తీసుకుంటూ ఉంటాము. మనం చేసే ఉద్యోగం లో కానీ , పని చేసే చోట కానీ ,ఇతరుల తో కొన్ని కొన్ని పనులు చేయమని అడగడమూ , చేయించు కోవడమూ , లేదా వారికి చేసి పెట్టడమూ , జరుగుతుంది రోజూ ! 
కానీ మీరు  ఇతరులతో పని చేయించుకునే ప్రతి సారీ , ” ప్లీజ్ ” అనడం కానీ , ” దయ చేసి ” అనడం కానీ అలవాటు చేసుకోండి !  అదే విధం గా మీరు అడిగిన పనిని చేసిన వారికి మీ కృతఙ్ఞతలు చెప్పడం మరచి పోకండి ! మానవులు సహజం గా  స్వేఛ్చా పిపాసులు ! వారు వారి పనులను , ఎవరో నిర్బంధించి చేయించుకుంటే ఇష్ట పడరు . వారు అయిష్టం గా  ఆ పనులు చేసినా , వారికి మనసులో ఒక అనీజీ అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. ప్రత్యేకించి, మీరు చెప్పిన పనిని చేశాక , మీరు వారికి ఏ రకమైన కృతజ్ఞతలూ తెలుపక పొతే , ఇంకా నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది !  ”పని చేయించుకుంటాడు కానీ  కనీస మర్యాద కూడా తెలియదు ” అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. భారత దేశం లోనైతే , మీరు చేసిన ప్రతి పనికీ  ” ఎంతో  కొంత ” మీ పని చేసిన వారికి ” ముడుపు ” గానో , ” దక్షిణ ” గానో , లేదా ” పర్సెంటేజ్ ” రూపం లోనో సమర్పించుకుంటూ ఉండ వలసిందే  కదా ! 
కానీ మీరు ఉద్యోగం చేసే చోట మీ కొలీగ్స్ తోనో , మీ క్రింద పని చేస్తున్న వారితోనో , పని చేయించుకోవాల్సి వచ్చినపుడు ” అట్లాంటి ముడుపులు ” సమర్పించు కోక పోయినా కూడా , మీరు కనీస మానవ విలువలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి ! మీరు చేయమని అడిగే ప్రతి పనికీ , ” దయ చేసి”  అని కానీ ” ప్లీజ్ ” అని కానీ అడిగితే మీకు కావలసిన పని త్వరగా జరుగుతుంది. పాశ్చాత్య దేశాలలో  ఈ పట్టింపులు చాలా ఉంటాయి ! అక్కడ ఎవరితోనైనా , ఎపనినైనా మనం చేయించుకుంటే , ఆ పని చేసినందుకు బోలెడంత ” ఫీజు ” మనం వారికి చేల్లిస్తున్నా కూడా , ప్లీజ్ అని పని పూర్తి  అయ్యాక  ” థ్యాంక్  యూ ” అని చెప్పడం సర్వ సాధారణం !  
భారత దేశం లో ఇంకో అలవాటు కూడా  మనకు కనిపిస్తూ ఉంటుంది !  మీరు ఇతరులను ఎవరినైనా వారు మీ పని చేసినందుకు  ప్రశంసిస్తే వారు వెంటనే ”ఆహా హా అదేంటండీ , భలే వారే మీరు , దాన్లో ఏముందండీ ” పరవాలేదండీ ” అంటూ మెలికలు తిరిగి పోతూ ఉంటారు ఒక అయిదు నిమిషాలు ! 
అట్లా కాకుండా ప్రశంసలను  స్వీకరించి ” థ్యాంక్ యూ ” అనడం సవ్యమైనది గా ఉంటుంది ! మీరు ఎవరినైనా  దయచేసి ఈ పని చేసి పెట్టండి అనడాన్ని  ఇంగ్లీషు పదం ప్లీజ్ ఉపయోగించినపుడు కూడా  ప్లీజ్ ఈపని చేసి పెట్టండి ” అని మాత్రమే అనండి , కానీ , ఆ ప్లీజ్ ను చాంతాడంత చేసి   pleeeeeeeeeeeeeeeeeeease   అని సాగ తీయకండి ! మీరు ప్లీజ్ అన్నపుడు కానీ , కృతఙ్ఞతలు చెబుతున్నపుడు కానీ మనస్పూర్తి గా  ఆ పదాలు వాడండి ! ఈ ప్లీజ్ లూ  థ్యాంక్ యూ లూ చాలా చిన్న పదాలూ , చాలా సాధారణ పదాలూ అయినా కూడా , ఆ పదాలతో మీరు మీ  మానవ సంబంధాలలో మ్యాజిక్ చేయవచ్చు ! ఇతరులతో మీ సంబంధాలను చెప్పుకో దగినంత గా పెంపొందించు కోవచ్చు ! 
ప్రయత్నం చేయండి , ప్లీజ్ ! , థ్యాంక్ యూ !
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు. 32. సదా, మందహాసం తో, పాజిటివ్ గా ఉండండి !

In మానసికం, Our minds on మార్చి 25, 2013 at 6:57 సా.

పని సూత్రాలు. 32. సదా, మందహాసం తో పాజిటివ్ గా ఉండండి !

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం,  మనం పని చేసే చోట ఎప్పుడూ చిరునవ్వుతో , ఆశావాద దృక్పధం తో పని చేయడం ! మీరు చేసే పని కష్టమైనదే కావచ్చు ! మీకు ఆ పని చేయడం లో తీవ్రమైన వత్తిడి కూడా కలుగుతూ ఉండ వచ్చు ! మీరు చీకాకు పడుతూ , మీ పరిస్థితినీ , ఇతరులనూ , లేదా  మీ పరిస్థితికి కారణమయిన వారినీ తిట్టుకుంటూ , మీరు పని చేస్తూ ఉంటే , ఆ పని సరిగా జరగదు ! పైగా మీకు కాల యాపన అవుతుంది అనవసరం గా ! ప్రతి రొజూ , ఉదయమే ఆఫీసుకు కానీ , మీరు పనిచేసే చోట గానీ , మీరు మంద హాసం చేస్తూ పని లో ప్రవేశించితే , మీకు ఆ రోజంతా సజావు గా సాగుతుంది ! మిమ్మల్ని చూసిన ప్రతి వారు  ఆమె ” చాలా నిదానస్తురాలు ! చాలా రిలాక్స్ అవుతూ , ఎపనినైనా ఆత్మ విశ్వాసం తో సులభం గా చేస్తుంది ! ” అనే ముద్ర వేయించుకుంటారు ! మీకు నిత్య జీవితం లో , ప్రత్యేకించి మీరు చేస్తున్న ఉద్యోగం లో కానీ , మీరు పని చేసే చోట కానీ , మీ చిరునవ్వును కానీ , మీ మందహాసాన్ని కానీ  దాచేసే అనేక పరిస్థితులు  మీరు ఎదుర్కో వచ్చు !  మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ కి లాభాలు రాక పోవచ్చు !  బయట వాతావరణం చాలా ప్రతి కూలం గా ఉండవచ్చు ! విపరీతం గా వర్షాలు పడుతూ ఉండడం కానీ , లేదా విపరీతమైన ఎండలు కాస్తూ ఉండడం , లేదా ఎముకలు కోరికే చలి కానీ ఉండ వచ్చు ! అవన్నీ ,మీ శక్తి వంతమైన చిరు నవ్వును దాచ లేవు ! మీ మనసు పొరలలో మీ మందహాసాన్ని కప్పలేవు ! అందుకే , మీ చిరునవ్వు చిందిస్తూ ఉండండి సదా !  
కానీ క్లిష్ట  పరిస్థితులలో కూడా చిరునవ్వు తో ఉండడం ఎట్లా ?: 
ఇది ఒక కళ ! మీరు మొదట గా మీకు చిరునవ్వు రాక పోయినా కూడా, కేవలం ఒక పని గా యాంత్రికం గా చిరునవ్వు నవ్వడం చేయండి ! అంటే మీ ముఖం పుష్పం లా వికసించడం ! మీరు ఆ పని రొటీన్ గా చేయడం మొదలెడితే , కొంత కాలానికి మీరు సహజం గా నే నవ్వ గలిగే స్థితి కి చేరుకుంటారు ! ఎందుకంటే, మొదటిలో యాంత్రికం గా నవ్వ గలుగుతున్న మీరు , ఆ చిరునవ్వుల ఫలితాన్నీ , ఆ ఆశా వాద దృక్పధం లో ఉండే శక్తి నీ ఆస్వాదించడం మొదలు పెడతారు ! దానితో , మీరు మీదైన ఒక యాటి ట్యూ డ్  ఎర్పరుచుకుంటారు ! నవ్వుతూ , ఆశావాద దృక్పధం తో మీ రోజు గడుపుతూ ఉండడం వల్ల , మీలో అనేకమైన శరీరానికి లాభ కరమైన హార్మోనులు ఉత్పత్తి అవుతాయి ! మనసార మీ ఉద్యోగం లో నవ్వుతూ పని చేయడం వల్ల  మీ  మానవ సంబంధాలు మెరుగు పడడమే కాకుండా , బలోపేతం కూడా అవుతాయి ! మీ ఇతర కొలీగ్స్ మీతో పని చేయాలని ఉత్సాహం చూపుతూ ఉంటారు !  
మీరు మీ పనిని తిట్టుకుంటూ , మీ పరిస్థితిని తిట్టుకుంటూ , చీకాకు పడుతూ , ఎప్పుడూ కంప్లెయిన్ చేస్తూ ఉంటే  ఆ సమయం మీరు మీ జీవితం లో కోల్పోతున్నట్టే ! కానీ మీరు  ఆశావాదులు గా , మీ ( పని ) రోజును మందహాసాలతో   ఎదురు చూస్తూ , మీ పని మీరు చేసుకుంటూ పోతుంటే  , మీ జీవితం లో ఆ సమయం ఎంతో విలువైనది గా అనిపిస్తుంది ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు. 31. పని లో గొణగడం కూడదు !

In మానసికం, Our minds on మార్చి 24, 2013 at 10:19 ఉద.

పని సూత్రాలు. 31. పని లో  గొణగడం కూడదు !

 
ఉదాహరణ :  ఓ కష్ట జీవి ,  తన పనిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు.  ఉదయమే బయల్దేరి సరిగా తొమ్మిది గంటలకల్లా  ఎట్టి  పరిస్థితులలోనూ  ఆఫీసుకు చేరుకుంటాడు ! తన టేబుల్ మీద అప్పటికే , ఒక అడుగు ఎత్తు పేరుకున్న ఫైళ్ళు  స్వాగతం పలుకుతాయి ! వాటిని చదివి , యాక్షన్ రాసే సమయం లోనే , తన సూపర్వైజర్  మూడు సార్లు ఇంకో మూడు విషయాల మీద తన క్యాబిన్ లోకి పిలిపించు కున్నాడు !  కష్ట జీవి భుజాలు ఆ పని భారానికి క్రుంగి పోయినాయి ! చీకాకు పడి  పోతున్నాడు ! తనలో తను గొణుగు  కుంటున్నాడు , తన టేబుల్ దగ్గరకు వచ్చిన ప్రతి వారితో ” చూశారా మాస్టారూ ఈ ఫైళ్ళు ?  ఇవి చాలవు అన్నట్టు సూపర్వైజర్  పిలుపులు ! రోజూ సాయింత్రం ఇంటికి వెళ్ళే సరికి ఏడు గంటలవుతుంది , మళ్ళీ ఉదయం ఏడింటికల్లా బస్ స్టాపుకు పరుగు ! గాడిద చాకిరీ లా ఉంది నాది  ! అని చెప్పుకుంటున్నాడు ! ఆ  మాటలు వింటున్న వారు ” ఆ సుత్తి భరించలేం , నా పని కొద్ది గా చేయమని టేబుల్ దగ్గరకు వెళితే , తన సుత్తి చెప్పుకుంటాడు అందరికీ ! నోరు మూసుకుని నా పని చేయక ! అని మిగతావారితో అంటారు ! 
చాలా ఆఫీసులల్లో  ఇట్లా కొందరికే ఎక్కువ పని ఉండడం , వారే ఎక్కువ పని చేస్తూ ఉండడం , వారు తమ పని ఎక్కువ గా ఉండి  గొణుక్కుంటూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటాయి !  అదే క్యాడర్ లో ఉన్న వారు ఇంకొందరు , వారు అసలు ఆఫీసు లో పని చేయడానికి వస్తున్నారా ? అని ఆశ్చర్య పోయే తీరు లో పూల రంగడు లా తమల పాకులు నములుతూ , ఎర్రటి పెదిమలతో ,  ఆఫీసును ఒక శృంగార మందిరం లా భావిస్తూ , ఇతర  స్త్రీ ఉద్యోగులను తమ ఓర చూపుల బాణాల తో ,సాయింత్రం వరకూ చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు !  కొందరు ఓనమాలు సరి గా రాని వారుకూడా , తమకన్నా ఎక్కువ గా చదువుకున్న వారు , ఉద్యోగం లో తమకన్నా సీనియర్ గా ఉన్నా , పదోన్నతులు పొంది , మిగతా వారిమీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు ! మీ ఉద్యోగం లో మీ పని ఎక్కువ గా ఉంటుంది !  అప్పుడు  ఆ పరిస్థితి అన్యాయం !  మీరు మాత్రమే ఎక్కువ పని చేస్తూ ఉంటారు !  మీ పని వత్తిడి గురించి ఆ సమయం లో గొణగడం ఎట్టి పరిస్థితులలోనూ శ్రేయస్కరం కాదు మీకు ! ఎందుకంటే ,
1. గొణగడం మిమ్మల్ని చాలా చులకన చేస్తుంది !
2. మీ సమయాన్ని వృధా చేస్తుంది 
3. మీ గొణుగుడు ,  మిమ్మల్ని మీ ఆఫీసులో ఉన్న మిగతా గొణుగుడు రాయుళ్ళ దగ్గరికి చేరుస్తుంది. 
4. మీరు ” అసలు చేయవలసిన పని చేయకుండా ” ఎప్పుడూ  ” గొణుగుతూ ఉంటారు ” అనే ముద్ర వేస్తుంది.  
5. మీలో చీకాకు , క్రోధమూ కలిగించి , మీ మానసిక ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. 
6. నిరంతరం గొణుగుడు అలవాటు చేసుకోవడం వల్ల , మీలో పని యందు ఉండే ఉత్సాహం కోల్పోయేట్టు చేస్తుంది. 
 
గొణగడం మానేయాలంటే ఏంచేయాలి ?
 
మీరు ప్రతి సారీ , ఏ సమస్య ను కష్టం గా అనుకుంటారో , ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచించండి , గొణిగే  ముందే !  కేవలం గొణుగుతూ ఉంటే , సమస్యలు పరిష్కారం కావు కదా ! ఒక వేళ  మీకు చక్కని పరిష్కారాలు తోచకపోతే కూడా , ఎవరైనా మీకు నమ్మకస్తుల తో ఆ సమస్య ను చర్చించి వారి సలహా తీసుకోండి !నిశ్శబ్దం గా చేయవలసింది చేయండి ! మీ తాత్కాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాలు విస్మరించకండి ! గొణుగుడు మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా మంచి ఫలితాలు కూడా ఎప్పుడూ ఇవ్వదు ! 
వచ్చే టపాలో ఇకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 30. ఉద్యోగం లో ఊక దంపుడు సంభాషణ !

In మానసికం, Our minds on మార్చి 23, 2013 at 11:24 ఉద.

పని సూత్రాలు. 30. ఉద్యోగం లో ఊక దంపుడు సంభాషణ ! 

 
మనం ఇంతవరకూ చాలా పని సూత్రాల గురించి తెలుసుకున్నాం కదా వివరం గా ! వీటన్నిటినీ , ప్రత్యేకం గా చదువు ముగించుకుని , ఉద్యోగాన్వేషణ మొదలు పెడుతున్న , లేదా కొత్తగా ఏ  ఉద్యోగం లోనైనా చేరిన , నవ యువతీ యువకుల కోసం  ఉద్దేశించి రాయడం జరుగుతూ ఉంది !  అంతే కాకుండా , ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న అనేక లక్షల మంది ఉద్యోగస్తుల కు కూడా వారి వారి పని నిపుణత ను , పని తీరునూ , ఇంకా ఇతర ఉద్యోగులతో , లేదా వారి పై అధికారులతో వారి సంబంధాలను పెంపొందించుకోవడం లో కూడా ఈ టపాలు ఉపయోగ పడతాయి ! వరుసగా వీటిని టపాలలో పోస్టు చేయడం ఎందుకంటే , ఉద్యోగం లో పాటించవలసిన సూత్రాలు అన్నీ కూడా ఒకే చోట లభ్యమవుతాయి కావాలనుకునే ( తెలుగు ) వారికి ! 
ఇప్పుడు మీరు చేసే ఉద్యోగాలలో ఊక దంపుడు సంభాషణల గురించి తెలుసుకుందాం ! 
ప్రతి మానవుడికీ , ఇతర మానవులతో సంబంధాలు , ప్రత్యేకించి కనీసం సంభాషణా పరమైన సంబంధాలు పెట్టుకుందాం అనుకోవడం  సహజమే ! మానవ సంబంధాలకు సంభాషణ  అతి ముఖ్యమైన వారధి !  మీరు చేసే ఉద్యోగం లో కూడా ఇతర ఉద్యోగులతోనూ , పై అధికారులతోనూ , మీరు నిరంతరం  కనెక్ట్ అయి ఉండడం మీ ఉద్యోగాన్ని మీరు శ్రద్ధ గా చేస్తున్నట్టు తెలియచేయడమే కాకుండా ,  టీమ్ స్పిరిట్ కూడా ఉన్నతం గా ఉండడానికి తోడ్పడుతుంది ! కానీ మీరు మీ ఉద్యోగం లో,  అనవసర ప్రసంగాలు , అంటే ఇతరులతో ఓక దంపుడు సంభాషణలు చేయకూడదు !
 ఉదాహరణ : మీరు  మీ ఆఫీసులో మీ కొలీగ్స్  అందరితోనూ స్నేహ పూర్వకం గా ఉంటున్నారు.  మీ పురుష కొలీగ్ మీతో ” నీకు తెలుసా ? మాధవి  కీ మన బాస్ కూ ఎంత చనువో ?   నేను మన T A  బిల్స్ సైన్ చేయించుకోడానికి  బాస్ ఆఫీసు లోకి వెళ్లాను  అప్పుడు మాధవి  చీర కొంగు సవరిస్తున్నాడు మన బాస్ !  నేను లిఫ్ట్ లో కూడా గమనించాను, ఏమాత్రం సంకోచం లేకుండా  మాధవి చేతి లో చేయి వేసి  గుస గుస లాడుతున్నాడు  బాస్ !  మాధవి జాతకం మారిపోయింది ! టైపిస్టు గా చేరిన మాధవి  పర్సనల్ సెక్రెటరీ అయి కూర్చుంది  ఆరు నెలలలోనే , ఇక మన నెత్తి మీద కూడా కూర్చుంటుంది !” అని చెబుతున్నాడు ! మీరు వింటున్నారు, అంత వరకూ పరవాలేదు ! ఎందుకంటే , మీ కొలీగ్ మీరు ” తన అంతరంగిక మిత్రులు , లేదా కొలీగ్  ” అనుకుని మీకు ఆ విషయాలు చెబుతున్నాడు !  మీకు ఆ విషయాలతో ఏమాత్రమూ సంబంధం లేదు ! అంతే కాక , మాధవి తో మీకు ఏవిధమైన సంబంధమూ లేదు ! మీ బాస్ తో మీకు అంతకన్నా సంబంధం లేదు , కేవలం మీ బాస్ గా తప్ప ! ఇట్లా ఇతర కొలీగ్స్గురించిన  ఊకదంపుడు సంభాషణ  మీరు చేసే ఉద్యోగానికి ఏ విధం గానూ ఉపయోగ పడదు ! పైగా మీరు నోరు జారి  ఏ వ్యాఖ్యానమైనా చేయడానికైనా ,మీరు  అక్కడ లేరుకదా !  మీరు ఆ సమయం లో చేయవలసినది నిశ్శబ్దం గా మీ కొలీగ్ చెప్పినది వినడం మాత్రమే !  ఎందుకంటే , మీ కొలీగ్ దృష్టిలో మీరు , ” ఇతరులకు ఏమీ చేర వేయరు ” అంటే మీతో  అన్న విషయాలను ఇతరులకు చెప్పరు ”  అతనికి మీపైన ఉన్న ఈ  అభిప్రాయాన్ని మీరు వమ్ము చేయకూడదు ! అంటే  మీకు అతనితో ఉన్న స్నేహానికి ఏమాత్రమూ భంగం కలిగించ కూడదు ! కానీ అదే సమయం లో మీరు ఏ రకమైన వ్యాఖ్యానాలూ చేయకూడదు ! 
మనం చూస్తూ ఉంటాము సామాన్యం గా , కొన్ని సమయాలలో మనం చెప్పే  విషయాలు తీవ్రం గా ఉన్నప్పుడూ , ప్రత్యేకించి ఇంకొకరి గురించి  నలుగురికి చెబుతున్నప్పుడు , మనం చెప్పే విషయం ఎంత సీరియస్ విషయమైనా , ఇతరుల తప్పు స్పష్టం గా కనబడుతున్నా కూడా , వినే వారిలో కొందరు ఏ విధమైన హావ భావాలూ ప్రదర్శించ కుండా , కేవలం మనం చెప్పేది విని , తప్పుకుంటారు !  మీరు కేవలం వినే వారిగానే ఉంటే  మీ కొలీగ్స్ దృష్టిలో ” వారిలో ఒకరిగా ” అనుకుంటారు మిమ్మల్ని ! సారాంశం:  మీ ఉద్యోగం లో మీరు  ఊకదంపుడు సంభాషణలు చేయకండి !  మీ కొలీగ్స్ చేస్తుంటే కూడా మీరు కేవలం, మీ చెవులకే పని చెప్పండి, నోటికి విరామం ఇవ్వండి !  ముఖ్యం గా,  మీరు ఆ ఊకదంపుడు సంభాషణ గురించి ఇతరులకు ఏమాత్రం తెలియ చేయకండి ! మీ తాత్కాలిక , ఇంకా శాశ్వత లక్ష్యాల మార్గం లో, ఊకదంపుడు సంభాషణలు కలుపు మొక్కలు !
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 29. అవకాశాలు, బంతులు !

In మానసికం, Our minds on మార్చి 22, 2013 at 10:53 సా.

పని సూత్రాలు . 29. అవకాశాలు, బంతులు ! 

 
 ( పై చిత్రం లో చిరునవ్వులు , మెలీనా రమిరెజ్  అనే కొలంబియన్  కోమలి వి !  ) 
ఉద్యోగాలలో అవకాశాలు అరుదు గా వస్తుంటాయి ! అంటే మీరు చేస్తున్న ఉద్యోగం  నుంచి పై ఉద్యోగానికీ లేదా ఇంకో సెక్షన్ లో ప్రమోషన్ కో  తరచు గా రావు కదా అవకాశాలు !  మీకు  ఉండ వలసిన దీర్ఘ కాలిక , ఇంకా తాత్కాలిక లక్ష్యాల గురించి మనం తెలుసుకున్నాం కదా వివరం గా క్రితం టపాలలో !  ఈ లక్ష్య మార్గాల మధ్య లో మనకు అకస్మాత్తుగా దర్శన  మయే  మంచి దారులే అవకాశాలు ! అంటే ఈ అవకాశాల రహదారిలో ప్రయాణం వేగం గా ఉండడమే కాకుండా సునాయాసం గా కూడా ఉంటుంది ! కాక పొతే ,  ఈ అవకాశాలు  మనవైపు విసిరి వేయబడే రబ్బరు బంతులు ! ఈ బంతులు లిప్త కాలం లో మన వైపు విసిరి వేయ బడతాయి కనుక వాటిని మనం అతి చాక చక్యం గా పట్టుకోవాలి !  ఆ క్షణాలలో , మనకు ఎక్కువ తాత్సారం చేయడానికీ , మీన మేషాలు లెక్క పెడుతూ , తీసుకో బోయే నిర్ణయం బాగోగులు ఆలోచించ డానికి  సమయం కూడా వృధా చేయ లేనంత తక్కువ సమయం ఉంటుంది. ఆ స్వల్ప సమయం లోనే మన వైపు వచ్చిన   ఆ అవకాశాన్ని గట్టి గా పట్టుకోవాలి !  లేదా అవకాశాలు  మన చేయి జారి పోతాయి ! 
అవకాశం ఎదురైనప్పుడు మీ కర్తవ్యం :
1. మీరు నేర్పుగా ఆ అవకాశాన్ని గుర్తించ గలగాలి 
2. ఆ అవకాశాన్ని ఒడుపు గా పట్టుకోవాలి , అంటే వినియోగించుకోవాలి, మీ ప్రయోజనాల కోసం ! 
3. కూల్ గా, ఆత్మ విశ్వాసం తో  ఉండాలి ! 
 
అవకాశం వచ్చినపుడు మీరు ఏమి చేయ కూడదు ? :
 
1. వచ్చిన అవకాశాన్ని ,  ఆ క్షణాల లో తీసుకోకుండా జార విడుచు కోవడం 
2. విపరీతం గా కంగారు కూ , ఆందోళన కూ  లోనవడం !
3. వచ్చిన అవకాశాన్ని ఆత్మ స్థైర్యం కోల్పోయి తీసుకోవడం , ఇట్లా చేయడం వల్ల  ఆ అవకాశాన్ని చేతిలో తీసుకున్నాక కూడా , సరిగా పట్టుకో లేక జార విడుచుకోవడం ! 
 
పైన చెప్పిన పరిస్థితులను ఒక క్రికెట్ మాచ్ లో  బౌండరీ దగ్గర గా ఉన్న ఫీల్డర్ కొన్ని సమయాలలో చేసే ఫీల్డింగ్ లా పోల్చ వచ్చు !  ఆ ఫీల్డర్ బౌండరీ దగ్గర ఎక్కువ శ్రమ పడకుండా , ప్రేక్షకుల తో పరాచకాలు ఆడుతూ , వారికి తన ఆటో గ్రాఫులు ఇస్తూ , ఒక హీరో లా పోజులు పెడుతూ ఉంటాడు సామాన్యం గా ! అతని దగ్గరికి క్రికెట్ బాల్  అప్రయత్నం గానే వస్తుంది ! అప్పుడు  ఆ ఫీల్డర్  తన నైపుణ్యం తో పట్టుకోక పొతే , ఆ బాల్  జారిపోతుంది. ఒక వేళ ఆ ఆటగాడు ఏమరు పాటున  ఉంటే, అంటే పూర్తి సంసిద్ధత గా ఉండక పొతే , చేతులలోకి వచ్చిన బాల్  కూడా జారిపోయి క్రింద పడి పోతుంది , అపుడు ప్రేక్షకుల తిట్లు భరించాల్సి ఉంటుంది ! వచ్చిన అవకాశాలు సరిగా మ్యానేజ్ చేయక పొతే కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ! కాక పొతే ఇక్కడ ప్రేక్షకులకు బదులు మన మనసే మనలను వెక్కిరిస్తూ ఉంటుంది ! అవకాశాలను సద్వినియోగం ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవడం ఒక కళ ! నేర్చుకుంటే అబ్బే నైపుణ్యం ! మీరు మీ జీవితాలలో గతం లో వచ్చిన అవకాశాలను ఏ విధం గా కోల్పోయారో , కారణాలు ఏమిటో , ఆత్మావలోకనం చేసుకోండి ! ఆ పరిస్థితులు మళ్ళీ ఎదురవుతే , మీరు ప్రస్తుతం  ఏమి చేస్తారో కూడా ఊహించు కొండి !  మీ బంగారు భవితకు సోపానాల వంటి అవకాశాలను కౌగిలించుకోండి , మీ ప్రేయసి లా ! తృప్తీ , ఆనందం కూడా అదే విధం గా ఆస్వాదించండి ! 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 28. అవాంతరాలను, అవకాశాలు గా భావించండి !

In మానసికం, Our minds on మార్చి 21, 2013 at 10:51 సా.

పని సూత్రాలు. 28.  అవాంతరాలను,  అవకాశాలు గా భావించండి !  

 ( చిత్రం ,   మిస్ కొసావో   సుందరిది !  ) 
మీరు అనునిత్యం మీ ఉద్యోగం లో అనేక రకాలయిన ఆపదలు ఎదుర్కొంటూ ఉంటారు !  అవి అనేక విధాలుగా ఉండ వచ్చు ! మీ ఆఫీసులో , మీరంటే గిట్టని వారు , మీ ఉద్యోగానికి ఎసరు పెట్ట వచ్చు !  మీ ఆఫీసులో సాంకేతికం గా వచ్చే మార్పులు మీకు కొత్త గా , క్లిష్టం గా ఉండ వచ్చు ! ఉద్యోగం ఊడి పోయే ప్రమాదం పొంచి ఉండ వచ్చు ! ఆఫీసులో నో లేదా మీరు పని చేస్తున్న స్థానం లోనో , కొత్త రూల్సూ , కొత్త పద్ధతులు ప్రవేశ పెట్ట వచ్చు ! అవి మీకు అనుకూలం గా ఉండక పోవచ్చు ! లేదా మీ మేనేజరో , లేదా మీ బాసో మిమ్మల్ని  ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండ వచ్చు !  ఇవన్నీ ఒక రకం గా మీకు ప్రతి కూల  పరిస్థితులే కదా ! మరి ఇట్లా ఆకస్మికం గా వచ్చి మీ మీద పడే అవాంతరాలను అన్ని సమయాలలో మనం ఎదుర్కొని  పోరాడుతున్నా కూడా మనకు అన్ని సమయాలలోనూ విజయం వరించదు కదా ! ఎప్పుడో ఒక సమయం లో  ఆ అవాంతరాలు మన ఉద్యోగ జీవితాన్ని , తద్వారా మన జీవితాలనూ చిన్నా భిన్నం చేయ వచ్చు ! మనం పరాజయం పొందవచ్చు !  
ఈ అవాంతరాలు  మొదట గా అంత  సీరియస్ గా మనకు అనిపించక పోవచ్చు !  కానీ వాటిని అశ్రద్ధ చేస్తున్న కొద్దీ , ఆ అవాంతరాలు , మీకు వాస్తవం గా సమస్యలు అయి , మీరు ఒక విషవలయం లో చిక్కుకు పోయినట్టు ఫీల్ అవవచ్చు ! ఇక్కడ చేయవలసినది , మీరు అవాంతరాలను కానీ , లేదా ప్రతి కూల  పరిస్థితి ని కానీ ఆది లోనే అంటే అది మొగ్గ గా ఉన్నపుడే గమనించి , తగిన జాగ్రత్తలు తీసుకోవడం !  మీ పావులను జాగ్రత్తగా కదిలించ గలగడం ,  ఆ అవాంతరాన్ని తుంచి వేయడమో లేదా , పరిస్థితి విషమం గా ఉంటే , దూరం గా వెళ్లి పోవడమో చేయాలి !  
ఉదాహరణ:  నవీన్ ఒక పట్ట భద్రుడు. రెండేళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసిన తరువాత ఒక ఉద్యోగం లో చేరాడు ! అది ప్రైవేట్ కంపెనీ ! మొదట్లో ఆ కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. దానితో నవీన్ ఉద్యోగం కూడా లాభ సాటి అయింది బోనస్ లూ  ఓవర్ టైం  లతో ! ఉన్నట్టు ఉండి , ఆ కంపెనీకి  ఆర్ధిక మాంద్యం వల్ల , ఆర్డర్లు రావడం తగ్గి ,  ఉద్యోగం నుంచి తీసి వేయవలసిన పరిస్థితి వచ్చింది ! నవీన్ కు ఈ విషయం గ్రహించ డానికి  ఎంతో సమయం పట్టలేదు ! కానీ తాను , ఆ కంపెనీ లో గడించిన అనుభవం తో  ఇంకో ఉద్యోగం కోసం  తన ప్రయత్నాలు , తనను ఉద్యోగం నుంచి తీసి వేయక ముందు నుంచే చేస్తూ , సరిగా తన బాసు ఇంటికి వెళ్ళ మని చెప్పే సమయానికి , తనే రాజీనామా ఉత్తరం ఇచ్చి ఆ ఉద్యోగానికి ‘ ఉద్వాసన ” చెప్పాడు ! ఆ పరిస్థితి లో నవీన్ తనకు ఎదురైన ప్రతి కూల  పరిస్థితిని ప్రశాంత చిత్తం తో , ఆప్రమత్తత తో  ఎదుర్కొని , ఆ పరిస్థితిని కేవలం ఒక అవాంతరం అని మాత్రమే  అనుకోకుండా  తన జీవితం లో , తనకు వచ్చిన  ఇంకో  అవకాశం గా భావించాడు !  జీవితాన్ని జీవించడానికి కేవలం తెలివి తేటలే కాకుండా , జీవితం మీద మనకు ఉండే యాటి ట్యూ డ్  కూడా మనం  ప్రయాణం చేయవలసిన దిశనే కాకుండా మన గమ్యాన్ని కూడా  నిర్దేశిస్తుందని నవీన్ గట్టిగా నమ్ముతాడు ! తన  పాజిటివ్ దృక్పధం ఎప్పుడూ కోల్పోడు అందుకే నవీన్ ముందుకు పోగలిగాడు !  ముందుకు పోతాడు కూడా !  
ప్రతికూల పరిస్థితులను , పాజిటివ్ దృక్పధం తో వాటిని , మన జీవిత దిశా నిర్దేశనం చేయగల అవకాశాలు గా , చాలెంజ్ లు గా తీసుకుని , వాటిని మనకు అనుగుణం గా మలుచుకోవడం ఒక స్కిల్ ! ఆ స్కిల్ ఒక్క సారిగా మనకు రాదు , అది నిరంతర సాధన ద్వారా అందరికీ సాధ్య మవుతుంది ! అది బ్రహ్మ విద్య కాదు ! కేవలం మానవులకు సాధ్య మయే నైపుణ్యమే ! 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 
 

పని సూత్రాలు. 27. మీ శక్తి మీ శక్తి యుక్తులను, మీ లక్ష్యం మీదే కేంద్రీకరించండి !

In మానసికం, Our minds on మార్చి 19, 2013 at 9:53 సా.

పని సూత్రాలు. 27. మీ శక్తి మీ శక్తి యుక్తులను, మీ లక్ష్యం మీదే  కేంద్రీకరించండి !  

  చిత్రం లో ఉన్నది ,   సృష్టి  శ్రేష్ఠ అనే నేపాలీ సుందరి !  ఇరవై ఒక్క సంవత్సరాల ఈ అందమైన నర్సును చూస్తుంటే ” ఎంత సుందరమైన సృష్టి ” అనిపిస్తుంది కదూ ! 
సామాన్యం గా చాలా మంది , తాము చేసే ఉద్యోగాలలో బండ చాకిరి చేస్తూ , నానా అవస్థలు పడుతూ ఉంటారు !  ఉదయం ఆఫీసుకు కానీ వారు ఉద్యోగం చోటికి గానీ బయల్దేరే ముందు నుంచీ , మళ్ళీ సాయింత్రం ఇంటికి చేరేదాకా , వారి ఉద్యోగం గురించే ఆలోచిస్తూ , ఆ ఉద్యోగం లో కష్ట పడుతూ ఉంటారు ! వారి ముఖం లో అంతకు ముందు ఉన్న కళా , కాంతీ కోరవడుతాయి !  వారి ఉద్యోగం లో ఉన్న సాధక బాధకాలు వారి జీవిత గమనాన్ని మార్చివేస్తాయి ! వారిని వత్తిడికి లోను చేయడమే కాకుండా , మానసికం గా క్రుంగ దీస్తాయి కూడా !  వారు పొందే ఫలితం శూన్యం అయినా కూడా , వారి జీవితాలు, వారి ఉద్యోగాలకు అంకితం చేస్తారు ! ఉద్యోగం గురించి ముందు గానే ఆలోచించడమూ , కొన్ని కష్ట సమయాలలో ఉద్యోగం లో ఉండే సమస్యల గురించి ఆఫీసు బయట ఆలోచించడమూ , పరిష్కార మార్గాలు కనుక్కోవడమూ , సామాన్యం గా అందరూ చేసే పనులే కానీ అదే పనిగా వారు చేసే  ఉద్యోగం గురించి తాపత్రయ పడడం  మీ ఆరోగ్యానికి మంచిది కాదు ! ఒక ఆంగ్ల సామెత ” డోంట్  వర్క్ హార్డ్ , బట్  వర్క్ స్మార్ట్ ” అని అంటే  ” బాగా కష్ట పడి  పని ( ఉద్యోగం ) చేయకండి , కానీ తెలివి గా పని చేయండి ! అని ! ఈ సామెత అందరికీ వర్తిస్తుంది ! 
మీరు నిరంతరం అయిన దానికీ , కానిదానికీ , విపరీతం గా శ్రమ పడితే , మీ అమూల్యమైన శక్తులు వృధా అవుతాయి !  మీరు బాగా కష్ట పడ్డ చోట , మీ కష్టానికి ఫలితం , మీ శ్రమ కు తగినంత గా ఉండక పోవచ్చు ! అట్లాగే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన చోట , మీరు చాలా అలసి పోవడం వలన మీ శ్రమ సరి పడినంత లేక పోవడం వల్ల , మీకు ఫలితమూ మీరు ఊహించినట్టు ఉండక పోవచ్చు ! 
అసలు విషయం ఏమిటంటే , మీరు మీ శక్తి యుక్తులు చాలా విలువైనవి, అమూల్యమైనవి కూడా !  . అందువల్ల వాటిని  , చాలా జాగ్రత్త గా ఉపయోగించాలి ! అంటే మీరు ఎక్కడ ఎక్కువ శ్రమ పడాలో , ఎక్కడ శ్రమ పడనవసరం లేదో తెలుసు కుంటూ ఉండాలి ! ఉదాహరణ: మీరు ఒక కోర్సు కనుక చదువుతూ ఉంటే ,  మీ సమయం లో చాలా భాగాన్ని , కేవలం ఒక బొమ్మ గీయడానికి వినియోగించి ( ఆ బొమ్మ గీసినందుకు మీకు పది మార్కులు గనుక వచ్చేట్టయితే ) మిగతా నలభై మార్కుల ప్రశ్నలను అశ్రద్ధ చేస్తే , దానికి మూల్యం చెల్లిస్తారు !  అట్లా కాకుండా , మీరు మీ సమయాన్ని యాభై మార్కులకూ కేంద్రీకరించి దానికి అనుగుణం గా మీ సమయాన్ని కూడా కేటాయిస్తే ఎక్కువ లాభం పొంద గలుగుతారు ! 
ఇంకో ఉదాహరణ : మీరు ఉద్యోగం గనక చేస్తూ ఉంటే ,  మీ బాసు ( అంటే మీ సూపర్వైజర్ కానీ మీ మేనేజర్ కానీ )  మీ పనిని పరిశీలించే అవకాశం ఉన్నప్పుడు అంటే మీ రిపోర్ట్ చూడడమో , లేదా మీ ప్రజెంటేషన్  సమయం లోనో లేదా , మీరు ఒక టాక్ ఇవ్వ వలసిన సమయం లోనో మీరు తక్కువ ప్రిపరేషన్ తో , పేలవం గా మీ ప్రతిభను చూపడం , మీకు అనేక విధాల నష్టం కలిగిస్తుంది !  అంతే కాకుండా , మీరు అట్లాంటి సమయాలలో మీరు పడే కష్టం , మీ శ్రమా , మిగతా సమయాలలో ఎవరూ చూడని సమయాలలోనూ , లేదా మీ జూనియర్ ల ముందూ , లేదా  మీ కు మీ పని యందు ఉన్న ఉత్సాహమూ , శ్రద్ధ వల్ల నైతే నేమి , చూపించుతూ ఉంటే , అది  వృధా గా పోతుంది.  అందు వల్ల  మీరు ముఖ్యం గా మీ శక్తి యుక్తులను ఈ క్రింది విధం గా కేంద్రీకరించుకోవాలి: 
 
1. మీరు ఉపయోగించే శక్తి యుక్తులు, మీరు చేసే పని కి  సరి అయిన వి గా ఉండాలి ! 
2. ఆ పని కోసం మీరు పడే శ్రమకు అర్ధం ఉండాలి ,
3. మీ శ్రమ ఫలితం మీకు ( అంటే మీ పురోగతి కి ) అనువు గా ఉండాలి 
4. మీరు పడే శ్రమ , మీకు లాభ దాయకం గానూ ఉండాలి ! 
5. మీరు చేసే పనిలో మీ శక్తి యుక్తులు అవసరమై ఉండాలి ! 
6. అంతే కాక , మీ శక్తి యుక్తులు , మీరు చేసే పనికి ఎంతో ముఖ్యమైనవి గా ఉండాలి ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు. 26. రోజు వారీ నిర్ణయాలు !

In మానసికం, Our minds on మార్చి 18, 2013 at 11:34 ఉద.

పని  సూత్రాలు. 26. రోజు వారీ నిర్ణయాలు ! 

(  పైన ఉన్న చిత్రం, పోయిన ఏడాది  మలేషియా సుందరి గా ఎన్నికైన మరియా సేలీనా ది !  పని సూత్రాలతో మీరు విసిగి పోకుండా ఈ చిత్రాన్ని చేర్చడం జరిగింది, బాగుంటే తెలపండి , ఇట్లాంటి సుందరుల ” చిత్రాలు ” మరికొన్ని చూద్దాం, ముందు ముందు  ! )
మనం ప్రతి రోజూ , మన ఉద్యోగానికి చాలా పాజిటివ్ దృక్పధం తోనే వెళతాము. ఉత్సాహం గా పని చేస్తాము. శ్రమ పడతాము ! కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది ! పూర్తి  ఏకాగ్రత తో  పని చేయాల్సిన అవసరం  కూడా ఉంటుంది ! కొన్ని సమయాలలో , మన ఓరిమి ని పరీక్ష చేస్తున్నట్టు గా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అది పేపర్ వర్క్ పూర్తి చేయడం ఆవ వచ్చు ! లేదా  ఏదైనా క్లిష్ట పరిస్థితిని మ్యానేజ్ చేయవలసిన అవసరం రావచ్చు !  లేదా చాలా కష్టమైన వ్యక్తులు , మిమ్మల్ని జలగల్లా  పట్టి వేధిస్తూ ఉండ వచ్చు ! లేదా మీ తో ఏదైనా కాగితాలు, బిల్లులు , మీకు ఇష్టం లేక పోయినా, మీచేత  సంతకాలు  చేయించ డానికి ప్రయత్నిస్తూ ఉండ వచ్చు ! మరి ఈ సమస్యలను సమర్ధ వంతం గా ఎదుర్కోవడం ఎట్లా ? దానికి సమాధానమే  రోజు వారీ నిర్ణయాలు ! అంటే మీరు రేపు ఉద్యోగం లో చేయ బోయే పనులగురించి లేదా తీసుకో బోయే నిర్ణయాల గురించి , ముందుగానే   మీ మనసులో సమీక్ష చేసుకుని , తదనుగుణం గా సంసిద్ధ పడడం ! 
ఉదా: ” రేపు  మీ ఆఫీసుకు ఒక  ” జిడ్డు ” గాడు వస్తున్నాడు ఫలానా మీటింగుకు ! అంతకు ముందే మిమ్మల్ని బురిడీ కొట్టించి మీ చేత పది లక్షల కాంట్రాక్ట్ కు సంతకాలు పెట్టించాడు మీ చేత ! ఆతరువాత  పని చేయడానికి మాత్రం అనేక వంకలు పెట్టి మిమ్మల్ని నానా తిప్పలూ పెట్టాడు ! మీరు పోయినసారి ఆ కాంట్రాక్టు ను కుదుర్చు కున్నందుకే , పొరపాటు చేశానని అనుకుంటున్నారు !  అదే పనిగా మిమ్మల్ని మభ్య పెట్టి , మళ్ళీ మీతో కాంట్రాక్టు ను పొడిగించు కోడానికీ , మీతో ఇంకా డబ్బు పెట్టించ డానికీ  వస్తున్నాడు రేపు ! ”  వాడి ఉద్దేశం మీకు తెలుసు ముందే ! మీరు చేయవలసినది  ” రేపు  ఆ జిడ్డు గాడు  చేసే ఏ  ప్రయత్నానికీ నేను లొంగ కూడదు ! ఏదో మాయ మాటలూ , అభ్యర్ధనలూ చేసి  క్రితం లాగా నా చేత సంతకాలు పెట్టించుకునే పరిస్థితి తెచ్చుకోను ! ఏమైనా సరే ! ” అనే స్పష్టమైన ,ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి మీరు ! 
అట్లాగే , మీరు ఆఫీసు లో ఒక మీటింగ్ లో మాట్లాడాలి రేపు ! మీకు తెలుసు ఒక నక్క జిత్తుల నాగన్న , ఇంకో వక్ర బుద్ధీ మీ సహనాన్ని పరీక్షిస్తూ , యక్ష ప్రశ్నలు వేస్తూ , మీతో పొరపాటు చేయించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు !  కొన్ని సార్లు మీరు అసలు మాట్లాడ వలసిన విషయం దాటి, కంగారు పడడమూ , తత్తర పడడమూ కూడా జరిగాయి ! సామాన్యం గా మీరు చాలా ప్రతిభావంతులు !  మీ వృత్తిని మీరు సీరియస్ గా తీసుకోవడమే కాకుండా , మీటింగుల కోసమూ ,ప్రాజెక్ట్ ల కోసమూ శ్రమిస్తూ ఉంటారు ! అందుకే మీరు  రేపు మీటింగు లో  ఆ నాగన్న లూ , వక్ర బుద్దులూ  ఎట్టి పరిస్థితులలోనూ మీ మీద గెలవ కూడదు ! వారి జిత్తులు పారకూడదు , మీరు మీ సహనం ఏకాగ్రతా కోల్పోకూడదు ! అనే నిర్ణయాలు ముందే తీసుకోవాలి ! 
అందువల్లనే ఈ రోజు వారీ నిర్ణయాలు ముందే మీరు తీసుకుంటే , మీ పని సులభం అవుతుంది , దీనికోసం మీరు ఎక్కువ సమయం కేటాయించ వలసిన అవసరం లేదు ! కేవలం  కొన్ని నిమిషాల లోనైనా , లేదా ఒక గంట లోనైనా మీరు  మీ కర్తవ్యాన్ని నిర్దేశించు కోగలరు ! 
మీరు చేయవలసినదల్లా :
1. అక్కడ మీరు ఎదుర్కొ బోయే సమస్య ఏమిటి ?
2. ఆ సమస్యను మీరు సమర్ధ వంతం గా ఎట్లా పరిష్కరించాలి ?
3. అందుకు మీరు చేయవలసినది ఏమిటి ?
4. మళ్ళీ అట్లాంటి సమస్య  పునరావృతం కాకుండా, మీరు ఏ  జాగ్రత్తలు తీసుకోవాలి ?  అనే విషయాల మీద మీ ఏకాగ్రతను కేంద్రీకరించడమే ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 25. మీ పధకం ఏమిటి ?

In మానసికం, Our minds on మార్చి 17, 2013 at 10:00 ఉద.

పని సూత్రాలు. 25. మీ పధకం ఏమిటి ? 

 
పని సూత్రాలలో ఒక ముఖ్య సూత్రం  మీ గేమ్ ప్లాన్ అదే మీ పధకం !  అంటే మీరు అనుకున్న లక్ష్యాలు ఎట్లా చేరుకుందామని అనుకుంటున్నారు ? అందుకు మీరు వేసుకున్న పధకం ఏదైనా ఉందా ?  ఆ పధకం వివరాలు ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం కొన్ని గంటలైనా , కొన్ని రోజులైనా మీరు సమయం తీసుకుని , ఆ విషయాలు వివరం గా   మీ మనసులో కానీ ,లేదా మీ మెదడులో కానీ సంభాషించారా ? కనీసం ఆ రకంగా మీరు ఆలోచించ వలసిన అవసరం ఉందని గ్రహించారా? అయితే మీ పధకం ఏమిటి ?
ఇక వివరాల లోకి వెళితే ,  జీవితం లో  మీ పధకం  ఏమిటి ?  మీ కర్తవ్యానికి మీరు సంసిద్ధులు గా ఉన్నారా?  మీరు జీవితాన్ని ఒక నాటకం గా భావిస్తే, మీరు మీ పాత్ర స్క్రిప్ట్ ను  తెలుసుకోకుండానే మీరు  నటించ లేరు కదా ?!!  ఆ స్క్రిప్టే మీ పధకం !  మీ పధకం మీకు స్పష్టం గా తెలిస్తే , మీరు మీ పాత్ర  సక్రమం గా పోషించ గలరు !  మీరు జీవితాన్ని ఒక ఆట గా అనుకుంటే కూడా , మీరు ఆ ఆట లో ఎప్పుడూ మీరు గెలవాలని అనుకుంటారు ! ఓడి పోవాలని ఎప్పుడూ అనుకోరు కదా ! కానీ చాలా మంది , ఓడిపోయే వారు కూడా ఉంటారు !  మీరు  జీవితం ఆటలో , ఆట ముందే మీ పధకాన్ని రచించి తదనుగుణం గా  ముందుకు పొతే , మీరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ! అందుకే మీరు  మీ పధకం రచించు కోవడం ఎంతో  ముఖ్యం !  
ఒక విధం గా చెప్పుకోవాలంటే, మీ జీవిత పధకం ” మీ వ్యక్తి గత  ప్రకటన ” !  అంటే మీకు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి  సన్నద్ద మయే , సైనికుని మానసిక సంసిద్ధత ! మీరు విజయం కోరుకుంటున్నారా ? లేదా అపజయం కోరుకుంటున్నారా ?  పరాజయం తొంగి చూస్తే , మీ లక్ష్యాలను కుదించుకుని , మీరు పలాయనం చిత్తగించుదామని అనుకుంటున్నారా ? లేక  పరాజయం ఎదురైనప్పుడు , కింద పడి  ” గాయాలయినా ” , దుమ్ము దులుపుకుని , మీ గాయాలకు కట్టు కట్టి ,  వెనుకాడ కుండా కర్తవ్యోన్ముఖులు అవుదామను కుంటున్నారా ? ” ఎట్టి పరిస్థితి లోనూ అపజయం పాలవకూడదు ” అనే కృత నిశ్చయం తో ఉన్నారా? ఈ విషయాలన్నీ మీరు  మీ సమయం తీసుకుని  తీరిక గా ఆలోచించి  ఒక పేపర్ మీద రాసుకోవడం ఉత్తమం ! మనం ఎవరమూ , ” నేను నా లక్ష్యాలు చేరుకోవడానికి  ఎవరినీ పట్టించుకోను , ఎంత మంది నా మూలం గా నష్ట పోయినా నాకు లెక్క లేదు !  నేను మోసం చేయ గలను , ఎందుకంటే , నేను నా లక్ష్యానికి దగ్గర అవుతాను ” అని  మన పధక రచన చేసుకోము కదా! ? కానీ మనం నిత్య జీవితం లో చూస్తున్నది అందుకు పూర్తి గా భిన్నం గా ఉంది !  నిత్యం అనేక  మోసాలు , క్రూర కృత్యాలు , హింస , జరుగు తున్నాయి ! ఆఫీసులలో , బ్యాంకులలో , దేశ ప్రాంత విభేదాలు లేకుండా , జనాలు ఇతరులను మోసం చేయడం , అలవాటు చేసుకుంటున్నారు ! కేవలం వారి లక్ష్యాలు ( వీలైనంత తక్కువ సమయం లో, వీలైనంత ఎక్కువ , అక్రమం గానైనా సరే ) , డబ్బు , ఆస్తులు , ” కీర్తి ” , ” ప్రతిష్ట ”  ” కూడ బెట్టడం ” ! 
అట్లాగే ఆఫీసులలో కూడా బాసులు , తమ క్రింది ఉద్యోగుల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు నిరంతరం ! తిడుతూ ఉంటారు ! కేవలం వారికి ఒక కొరడా ఒకటే తక్కువ అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు !  వారు వారి లక్ష్యాలు చేరుకోవడం లో మానవత్వపు విలువలు పూర్తి గా ” మంట గలుపుతారు ” మరి మీ పధక రచన  లో ఇట్లాంటి పద్ధతులు అవలంబించుదామని అనుకుంటున్నారా ?  ఆ రకం గా మీ లక్ష్యాలు చేరుకుంటే , మీరు ఆ ఫలాలు , ఏమాత్రం స్వీయ నింద ( గిల్టీ ) గా ఫీల్ అవకుండా అనుభవించ గలరా ? వీటన్నిటి సమాధానమే మీ పధకం !
మీ పధకం ఆదర్శ వంతమైనదీ , స్పూర్తి దాయకమైనదీ అయి ఉంటే , మీ విజయం కూడా ఎంతో విలువైనది గా మీకు కనిపిస్తుంది !  మీ పధకం ఉత్తమమైన ఆశయాలతో ఉంటే ,  మీరు దానిని పొందినపుడు కలిగే ప్రతిఫలం కూడా మీకు ఎంతో రుచి గా ఉంటుంది , దానిని మీరు తనివి తీరా ఆస్వాదించ గలుగుతారు ! ఇతరులకు కూడా దాని ప్రతి ఫలాలను ఆత్మీయత తో పంచుకో గలుగుతారు ! మీ పధకం స్వచ్ఛ మైనది గా ఉంటే , మీరు అడ్డ దోవలు వెతుక్కోకుండా , మీ లక్ష్యాలను , సరాసరి చేరుకో గలరు !  ఉన్నత మానవ విలువలతో , పరిపూర్ణ మానవులవుతారు !   అందుకే మీరు , మీకోసం , రచించుకునే , మీ జీవిత పధకం అతి ముఖ్యమైనది ! 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !