Our Health

రచయత ఖజానా

పని సూత్రాలు . 41. ఇతర ఉద్యోగుల అంతర్యం తెలుసుకోండి !

In మానసికం, Our minds on ఏప్రిల్ 8, 2013 at 6:15 సా.

పని సూత్రాలు . 41. ఇతర ఉద్యోగుల అంతర్యం తెలుసుకోండి ! 

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం , మన పరిసరాలలో , ప్రత్యేకించి మనం చేసే ఉద్యోగాలలో , ఆఫీసులలో ఉండే ఇతర ఉద్యోగుల అంతర్యం అంటే ఉద్దేశాలు తెలుసుకుని తదనుగుణం గా మనం ప్రవర్తించడం ! మీరు రోజూ చేసే ఉద్యోగం లో మీ శాయ శక్తులా మీరు శ్రమ పడి  మీ ఉద్యోగాన్ని చేసి , మీ బాసు , లేదా మీ యజమాని మెప్పు పొందుతూ , ఇంటికి వెళ్లి హాయి గా విశ్రమిస్తారు! మీరు ఆరోజు ఎవరినీ కష్ట పెట్టకుండా , ఎవరి మీదా ఏ  పొరపా టూ నెట్ట కుండా , మీ పని బాధ్యతా యుతం గా చేశామనే తృప్తితో నిద్ర  పోతారు ! అంత వరకూ బానే ఉంది ! అంతా సవ్యం గానే ఉంది , కానీ మీరు పని చేసే స్థానం లో  బెస్ట్ గా ఉండాలంటే ఫై నెస్ట్ గా ఉండాలంటే , కేవలం మీ పని మీరు గొప్ప గా చేస్తూ , అంతటి తో ఊరుకుంటే సరి పోదు ! మీరు మీ లక్ష్యం చేరుకునే దిశలో శ్రమించాలి ! అందుకు మీరు మీ ఆఫీసులో ఇతర ఉద్యోగుల ప్రవర్తన గమనిస్తూ ఉండాలి ! ఇతర ఉద్యోగుల ప్రవర్తన కు గల కారణాలు వెదుకుతూ ఉండాలి ! వారు మీతో పని చేస్తున్నప్పుడు , లేదా వారికై వారు పని చేస్తున్నప్పుడు , వారి వివిధ ప్రవర్తనల వెనుక , అంతరార్ధాలు ఉన్నాయేమో కూడా పరిశీలిస్తూ ఉండాలి ! శోధిస్తూ ఉండాలి కూడా ! 
మీ ఆఫీసులో ఇతర ఉద్యోగులు సామాన్యం గా వివిధ రకాలు గా ప్రవర్తిస్తూ ఉంటారు ! వాటిలో ప్రధాన మైనవి :
1. అధికారం కోసం 
2. డబ్బుకోసం 
3. ప్రతిష్ట కోసం 
4. ప్రతీకారం కోసం 
5. ఇతరులను హింస పెట్టాలనే  శాడిస్టిక్  లేదా హింసా ప్రవ్రుత్తి వల్ల 
6. లేదా కేవలం ఇతరుల చేత ప్రేమించ బడాలనే బలమైన కోరిక వల్ల !
ఇతరుల మనస్తత్వాన్ని చదవడం , పరిశీలించడం చేయాలంటే , మీరు కొంత మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి !  ఈ రకం గా అర్ధం చేసుకోవడం ఎందుకంటే , మీరు నడిచే దోవ అంతా  కేవలం పూల పానుపు కాదని గ్రహించి , అప్రమత్తత వహించడానికి  అందుకే ఒక సినిమా కవి అన్నాడు ” జీవితమే ఒక వైకుంఠ పాళీ నిజం తెలుసుకో భాయీ , ఎగదోశే నిచ్చనలే కాదు , దిగదోశే  పాములు ఉంటాయీ , చిరునవ్వులతో విష వలయాలను ఛే దించి ముందుకు పదవోయీ , ఛే దించి ముందుకు పదవోయీ ! అని !  మీరు మీ లక్ష్యం  అధిగమించే ప్రయత్నం లో నిజాయితీ గా వ్యవహరిస్తూ ఉన్నా కూడా , ఇతరుల అంతర్యాలను అర్ధం చేసుకుని , వారి ప్రవర్తనకు కారణాలు కనుక , లోభి తనం ( గ్రీడ్ ) , అవసరాలూ ( నీడ్ )  లేదా ఇతరులను భయపెట్టే మనస్తత్వం అయి ఉంటే , అట్లాంటి వ్యక్తుల కు మీరు ఆమడ దూరం లో ఉండాలి !   ఎందుకంటే మీరు వారి దోవలో పోలేరు కదా ! మీ దోవ మీది వారి దోవ వారిది ! అందుకు ! అందుకే మీకు ఈ విషయాల మీద అవగాహనా , విజ్ఞానమూ , మీకు శక్తి నిస్తుంది !  అంటే మీ విజ్ఞానమే మీకు శక్తి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

డయాబెటిస్ రిస్కు తగ్గించుకునే చర్యలు. 3. measures to minimize risk of diabetes.

In మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 7, 2013 at 11:40 ఉద.

డయాబెటిస్ రిస్కు తగ్గించుకునే చర్యలు. 3. 

క్రితం టపాలో మనం,  డయాబెటిస్ రిస్కు తగ్గించుకునే చర్యలలో భాగం గా ఏ ఏ  విషయాల మీద దృష్టి పెట్టాలో చూశాము కదా ! అందులో మొదటిది ఊబ కాయం అంటే ఒబీసిటీ.  ఈ ఊబకాయం గురించీ , ఊబకాయం వల్ల గుండె జబ్బులు ఎట్లా వస్తాయో , హై బీపీ , అంటే అధిక రక్త పీడనం ఎట్లా వస్తుందో   వివరించడం జరిగింది ,బాగు ఆర్కైవ్స్ లో ఆ టపాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఊబకాయం , డయాబెటిస్ రిస్కే కాకుండా , పక్షవాతం వచ్చే రిస్కు నూ, గుండె జబ్బు వచ్చే రిస్కునూ కూడా ఎక్కువ చేస్తుంది. ఆ పరిస్థితి మన రక్తం లో కొలెస్టరాల్ , ప్రత్యేకించి చెడు కొలెస్టరాల్ అయిన LDL  కొలెస్టరాల్ ను , ఇంకా గ్లూకోజు నూ అధికం చేసి తద్వారా దేహం లో కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ ఊబకాయం లేదా ఒబీసిటీ ని తగ్గించుకోవడం సామాన్యం గా క్లిష్టమైన పనే ! చాలా మంది ఒబీసిటీ  ఉన్న వారు , తమ బరువు తగ్గించుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటారు. వారు ఈ క్రింది విషయాల మీద ప్రత్యెక శ్రద్ధ వహించాలి !
1.  వారు తీసుకునే ఆహారాన్ని తగ్గించాలి ప్రత్యేకించి , క్యాలరీలూ , కొవ్వు పదార్ధాలూ తగ్గించాలి , రోజూ తినే ఆహారం లో !
2. వ్యాయామం చేస్తూ ఉండాలి రోజూ. 
3. ఉదయమే ఫల హారం అంటే బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా చేయాలి !
4. ఒక క్రమ పధ్ధతి లో వారి బరువును కొలుచు కుంటూ , ఒక చోట నోట్ చేసుకుంటూ ఉండాలి , తేడాలు తెలుసుకుంటూ ఉండడం కోసం !
పైన ఉదహరించిన వాటిలో మొదటిది తీసుకునే ఆహారం లో క్యాలరీలూ,కొవ్వు పదార్ధాలూ తగ్గించుకోవడం ఎట్లా ? : 
1. మీ భోజన పళ్ళెం  అంటే ప్లేట్ ( కంచం అని కూడా అంటాం కదా ! )  ను మీకు ఒక ఆరోగ్య కరమైన ఆహారం ఇచ్చేట్టు అమర్చుకోండి ,రోజూ !
మనం, రోజూ భోజనం పళ్ళెం లోనే కదా చేసేది , కాకపొతే చాలా ప్లేట్ లు ఉక్కు ,అంటే స్టీల్ పళ్ళాలు అయి ఉంటాయి , కొంత శాతం వెండి కంచాలు ఉంటాయి కూడా !ముఖ్యం గా మనం దృష్టి సారించ వలసిన విషయం – మన కంచాలలో ఉండే ఆహారం మీద ! పళ్ళెం లో ఎక్కువ గా ఫ్రెష్ గా, అంటే తాజా గా ఉన్న ఆకుకూరలూ , కూరగాయలతో చేసిన వంటకాలు ఉండేట్టు చూసుకోవాలి ! కొవ్వు తక్కువ గా ఉన్న పాలు , పెరుగు ఉండాలి !సోడాలూ, స్వీట్లూ , ఇతర పానీయాలూ తీసుకోక పోవడం ఉత్తమం చాలా తగ్గించడం మధ్యే మార్గం ! 
2. షాప్ స్మార్ట్ అంటే తెలివిగా షాపింగ్ చేయండి !
ధాన్యాలూ , పప్పు దినుసులు కొనే ముందు కేవలం అన్ పాలిష్డ్   పదార్ధాలనే కొనాలని నిర్ణయించుకోండి ! పాలిష్ చేసిన పప్పు దినుసులు , ధాన్యాలు వాటి విటమిన్ విలువలు కోల్పోయి  షైన్  అవుతూ కనిపిస్తూ ఉన్నా కూడా మీ ఆరోగ్యాన్ని ‘ పేలవం ‘ చేస్తాయి !ప్రాసెస్ చేసి డబ్బాలలో  అమ్మే ఆహార పదార్ధాలు తాజా గా ఉండక పోవడమే కాకుండా , నిలువ ఉంచడానికి కలిపిన ఉప్పు ఎక్కువ శాతం ఉండి  మీ ఆరోగ్యానికి ముప్పు  చేస్తాయి !మీరు ఎప్పుడూ ఆకలి తో ఉండి , షాపింగ్ చేయకండి. ఎందుకంటే మీ ఆకలి, మీ చేత  ఎక్కువ కొవ్వు , క్యాలరీలూ ఉన్న ఆహారాన్ని ” బలవంతం ” గా కొనిపిస్తుంది !
3 ఈట్ స్మార్ట్ అంటే  తెలివిగా తినండి !
తినడం లో తెలివి ఉపయోగించడం ఏమిటి హాయి గా తినక అని అనుకుంటా రేమో ! కొంత వరకూ నిజమే ! కానీ మీరు తినేది కేవలం ఆరోజు మీ ఆరోగ్యం కోసమే కాదని గుర్తు ఉంచుకోండి ! మీరు తినేది మిమ్మల్ని పది కాలాల పాటు డాక్టర్ చుట్టూ వెళ్ళకుండా చేసేది కావాలి కదా !అందువల్ల , మీ భోజనం మొదట తాజా ఆకులు , కూరగాయలూ ఉన్న సలాడ్ ను తినడం అలవాటు చేసుకోండి ! సలాడ్ లలో విటమిన్లూ , ఖనిజాలూ పుష్కలం గా ఉండడమే కాకుండా , పీచు పదార్ధాలు కూడా ఉండి  తిన్న ఆహారం సరిగా జీర్ణ మవడానికి ఉపయోగ పడతాయి !మీరు హోటళ్ళ లో తినే సమయాలలో  ఎక్కువ నూనె , వెన్న ఉన్న గ్రేవీతో చేసిన వంటకాలు ( శాక హారాలైనా , మాంసాహారాలైనా )  సెలెక్ట్ చేసుకోవడమో , లేదా అడిగి, చేయించుకుని తినడమో చేయండి , ప్రతి సారీ ! 
 వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

డయాబెటిస్ రిస్కు తగ్గించు కోవడం ఎట్లా ? .2. ways to lower the risk of diabetes.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 6, 2013 at 4:49 సా.

డయాబెటిస్  రిస్కు తగ్గించు కోవడం ఎట్లా ?  

క్రితం టపాలో మనం డయాబెటిస్ రిస్కు ఎట్లా కనుక్కోవాలో చూశాము కదా ! ఇప్పుడు మనం తీసుకోవలసిన నివారణ చర్యల గురించి కొంత తెలుసుకుందాం ! ఈ చర్యలన్నీ కూడా అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారి  సలహాలే ! కాక పొతే వారు పొందు పరిచిన వివరాలు ఆగ్లం లో ఉన్నాయి ! ఈ క్రింద ఇచ్చిన లింకు మీద మీరు క్లిక్ చేస్తే  అవి కనిపిస్తాయి. తెలుగు మాత్రమే వచ్చిన వారికోసం ఈ క్రింద ఆ నివారణ చర్యలు ఇవ్వడం జరుగుతూంది ! ఈ కారణాలన్నీమనలో చాలా మందికి తెలుసుకానీ ఈ కారణాలు ఏ విధం గా  మధుమేహానికి లేదా డయాబెటిస్ కు కారణ మవుతాయో అవగాహన ఉండదు. అందువల్ల మనం ఆ విషయాలు కూడా తెలుసుకోవడం ఉత్తమం ! 
 డయాబెటిస్  నివారణ చర్యలు: 
1. ఊబకాయం  
2. రక్తం లో అధిక గ్లూకోజు ( దీనినే హైపర్ గ్లైసీమియా అంటారు )
3. గర్భం దాల్చినపుడు వచ్చే డయాబెటిస్. 
4. అధిక రక్త పీడనం అంటే హై  బీ పీ 
5. చెడు కొలెస్టరాల్ 
6. చెడు ఆహారపు అలవాట్లు 
7. వ్యాయామం చేయక పోవడం 
8. స్మోకింగ్ చేయడం 
9. వయసు, మగ వారు, జాతి , ఇంకా కుటుంబం లో ఎవరికైనా డయాబెటిస్ అంత క్రితమే వచ్చి ఉండడం లాంటి ఇతర రిస్కులు. 
 
ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి ” చెకప్ అమెరికా ” అనే డయాబెటిస్ నివారణ వివరాల కోసం ! 
 
టపాలో మీకు కావలసిన విషయాలు లభించక పొతే లేదా, ఇంకా వివరాలు కావలిస్తే , తెలియ చేయండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !

మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? (type 2 diabetes-risk-test )

In ప్ర.జ.లు., Our Health on ఏప్రిల్ 5, 2013 at 12:02 సా.
మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? 
 
డయాబెటిస్ , అదే షుగర్ వ్యాధి , లేదా మధు మేహం అనబడుతుంది. ఈ వ్యాధి ముఖ్యం గా రెండు రకాలు గా ఉంటుంది . చిన్నతనం లో వచ్చే డయాబెటిస్ ను టైప్ వన్ డయాబెటిస్ అంటారు. కొంత వయసు మళ్ళాక ( అంటే ముప్పై నలభై సంవత్సరాల వయసున్నపుడు ) వచ్చే డయాబెటిస్ ను టైప్ టూ  డయాబెటిస్ అంటారు.మనం ఇప్పుడు మాట్లాడు కొనేది ఈ టైప్ టూ డయాబెటిస్ గురించి. ఈ టైప్ టూ డయాబెటిస్ ఆసియా వాసులలో అధికం గా వస్తూ ఉంటుంది. కొంత వరకూ ఆసియా వాసులలో జీన్స్ అంటే జన్యువుల  అమరిక వల్లనూ , ముఖ్యం గా వారి ఆహార అలవాట్ల వల్ల నూ  ఈ టైప్ టూ డయాబెటిస్ అధికం గా వస్తుంది !  ఇట్లా డయాబెటిస్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే , కొన్ని కారణాలు కలిసి ,మనలో డయాబెటిస్ ముందు ముందు వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి ! అందుకే ఈ కారణాలను రిస్కు ఫ్యాక్టర్ లు అంటారు ! ఈ రిస్కు ఫ్యాక్టర్ లను ముందే మనం తక్కువ చేసుకుంటే , ముందు ముందు డయాబెటిస్ రాకుండా నివారించు కోవచ్చు. లేదా ఆ వచ్చే అవకాశాలను చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు ! మన జీన్స్ అంటే జన్యువులలో మార్పులు మనం నియంత్రించడం కానీ , నివారించడం కానీ చేయ లేక పోయినప్పటికీ , ఈ రిస్కు ఫ్యాక్టర్ లను తగ్గించు కుంటే ,మనం డయాబెటిస్ ( అంటే టైప్ టూ డయాబెటిస్ ) వ్యాధి నివారణ లో విజయ వంతం అవవచ్చు !
 
ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు మీ రిస్కు ను లెక్క కట్టుకోండి ! ( లింకు మీద ఒక్క క్లిక్కు తో !  )  రిస్కు కనుక అధికం గా ఉంటే , మీరు మీ వైద్యుడిని సంప్రదించి , అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ! మీ ఆరోగ్యం కోసం ఈ ముందు జాగ్రత్త  తీసుకోవడం లో తప్పు లేదు కదా !  అంతే కాక ఇది ఉచితం కూడా ! ( ఒక గమనిక : పరీక్ష వివరాలలో మీ ఎత్తు అడుగులలో ఉంది కాబట్టి మీ బరువు కూడా పౌండ్ల లో రాయాలి. ఇది కష్టమేమీ కాదు. మీ బరువును కిలోలలో కొలుచుకుని, రెండు పాయింట్ రెండు తో గుణిస్తే మీ కిలోలలో ఉన్న మీ బరువు పౌండ్ల లో మారుతుంది ( ఎందుకంటే ఒక కిలో బరువు 2. 2 పౌండ్ల తో సమానం కనుక ).
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 
 
 
 
 
 
 

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

In మానసికం, Our minds on ఏప్రిల్ 3, 2013 at 10:45 సా.

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య మైన సూత్రం ” సత్యమునే పలుక వలెను ” ! అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ! మన మందరం , చాలా చిన్న తనం నుంచే ఈ సూక్తి నేర్చుకుంటాము.  ఈ సూక్తి మారుతున్న దేశ మాన కాల పరిస్థితుల దృష్ట్యా ఒక జోకు గా తయారయింది ! ” కాలం మారింది ” అని , మారుతున్నమనుషులంతా , కేవలం  ” వారి తప్పు కాదు  ( అసత్యం చెప్పడం ) కేవలం మారుతున్న కాలానిది ” అని తప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు !  కానీ కాలం అబద్దమాడ లేదు కదా ! కేవలం మానవులే  ఆ పని చేయ గలరు ! వారు సత్యమే చెప్పగలరు, అసత్యమైనా చెప్ప గలరు ! మరి  పైన ఉన్న సూక్తి ఎప్పుడూ మనకు వర్తిస్తుంది , ప్రత్యేకించి మనం చేసే ఉద్యోగాలలో ! 
ఒక ఉదాహరణ తీసుకుందాము ! :
మనం  అబద్ధాలు ఆడుదామని  అనుకుంటే , వివరం గా ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు గోచరమవుతాయి ! 
1. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ?
2. ఎక్కడ మనం ఒక గీత గీసుకుని, ఇంత వరకే అబద్ధాలు ఆడాలి అని అనుకోగలం మనం ? అంటే మనం ఆడే అబద్ధాలకు ప్రామాణికం ఏమిటి ?
3. మనం చిన్న అబద్ధాలే చెబుదామని అనుకుందామా? లేదా పెద్ద అబద్ధాలు కూడా చెబుదామా ? అవి ఏమిటి ? 
4.  మనలను రక్షించు కోడానికే నా , లేదా మన మిత్రులను, మనం పని చేసే కంపెనీ యజమాని కోసమా ?  మనం అబద్ధాలు చెప్పేది ?
5. ఒక అబద్ధానికి మనం తోకలు అతికించి , ఒక దాని మీద ఒక అబద్ధం చెప్పుకుంటూ పోదామా ?
6. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఎప్పుడు ఆపుదాము ? 
7. ఇతరులను కూడా మనం చెప్పే అబద్ధాలలో ఇరికించు దామా ? లేక మనమే బాధ్యత తీసుకుని అబద్ధాలు చెబుదామా !  
ఇట్లా ఆలోచించుకుంటూ పొతే , మనకు స్పష్ట మయ్యేది ఒకటే ” హాయిగా అసలు అబద్ధాలు చెప్పకుండా ”  ఉంటే సరిపోతుందని ! అబద్ద మాడ  కూడదనే ఒక్క నిర్ణయం కనుక మనం తీసుకుంటే , ఏ సమస్యా ఉండదు ! మనం అబద్ధమాడ దానికి ప్రయాస పడనవసరం లేదు !  ఆ అబద్ధాలను కప్పి పుచ్చుకోవడానికి సతమత  మవ నవసరం లేదు, మన మనసులో ఏ  రకమైన భయాందోళన లూ మనం పెట్టుకొనవసరం లేదు ! నిశ్చింత గా ఉండవచ్చు ! ఎప్పుడూ సత్యాన్నే చెప్పడం వల్లా  , అబద్దాలాడక పోవడం వల్ల  అనేక లాభాలున్నాయి ! మనకు ఏవిధమైన అపరాధ భావనా , ప్రాయశ్చిత్త భావమూ ఉండదు !  తప్పు చేసిన వారిలా , మనం రాత్రుళ్ళు నిద్ర పోలేక పోవడం ఉండదు !  చెప్పిన అబద్ధాలను గుర్తు ఉంచుకోవాలనే ” బాధ్యత  ” మనకవసరం లేదు ! ఎవరో మనలను అబద్ధాలు చెప్పామని శిక్షిస్తారనే భయం అంత కన్నా అవసరం ఉండదు !  మన మిత్రులలోనూ , మన కుటుంబ సభ్యులలోనూ , మనం ఉండే సమాజం లోనూ తలెత్తుకు తిరిగే  పరిస్థితి ఉండదనే భయం కూడా ఉండదు ! కేవలం ఒక్క నిర్ణయం , అదే , ఎప్పుడూ అబద్ధాలు చెప్ప కూడదనే ఒక్క నిర్ణయం కనుక తీసుకుంటే ! 
ఇటీవల ఇంగ్లండు లో జరిగిన ఒక సంఘటన :
ఒక  అధికార పార్టీ మంత్రి తన కారులో స్పీడు గా పోతున్నాడు ! ప్రక్కనే అతని భార్య కూడా కూర్చుని ఉంది. కారు స్పీడ్ అందుకుంది. ఆ రోడ్డు మీద పోవలసిన స్పీడు ను దాటింది ! అంటే అది చట్ట విరుద్ధం ! వెంటనే పోలీసు కారు లో పోలీసులు ఆ మంత్రి గారి కారు ను ఆపారు ! ఇంగ్లండు దేశం లో నియమిత వేగం కన్నా ఎక్కువ వేగం తో పోయే కారును ఆపి , ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కు  మూడు పాయింట్లు ఇస్తారు వారి లైసెన్స్ మీద ! ఇట్లా పాయింట్లు పన్నెండు పోగవు తే , డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు ! ఈ కారు నడుపుతున్న మంత్రి గారికి అంత క్రితమే తొమ్మిది పాయింట్లు వచ్చాయి ! అందువల్ల ఆ మంత్రి గారి భార్యామణి , ఆయనగారిని రక్షించే ప్రయత్నం లో ఆమే  కారు వేగం గా నడుపుతున్నట్టు పోలీసులకు ” అబద్ధం ” చెప్పింది ! అందువల్ల పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ మీద మూడు పాయింట్స్ ఇచ్చారు !  ఇంత వరకూ బానే ఉంది కధ ! కాలక్రమేణా  ఆ మంత్రిగారు వారి సెక్రెటరీ తో ప్రేమాయణం సాగించారు ! దానితో ” భార్యా మణి  గారికి మంత్రి గారి మీద కోపం వచ్చి ,పోలీసులకు ఫోను చేసి , తాను అబద్ధం ఆడాననీ , అసలు వేగం గా కారు నడిపింది తన ” భర్త ” అయిన మంత్రే అనీ తెలిపింది !  అప్పుడు జరిగింది ఏమిటో మీరు భారత దేశం లో ఉంటే ” ఆ పోలీసులకు ట్రాన్స్ఫర్ యోగం పట్టి ఉంటుందని ” లేదా ఆ పోలీసులను , అందరి సమక్షం లో, అసెంబ్లీ లోనే చితక కొడతారని అనుకుంటారు కదూ ! కానీ ఈ సంఘటన జరిగింది,ఇంగ్లండు దేశం లో కదా ! అందువల్ల కధ వేరే మలుపు తిరిగింది !  ఆ మంత్రి గారి మంత్రి పదవి పోయింది !  అంతే కాక , వారి భార్యామణి తో సహా ఆ మంత్రి గారిని కూడా జైలు లో పెట్టారు ! వారిద్దరూ ఇప్పుడు కటకటాల వెనక ఉన్నారు ! మంత్రి గారిని , మంత్రి పదవి లో ఉండి  అబద్ధం ఆడినందుకూ , ఆయన గారి భార్య ను,  అబద్ధం చెప్పినందుకూ ! కేవలం ఒక్క అబద్ధం  చెరి ఒకరూ చెప్పినందుకు ! 
 
అందుకే ” సత్యమునే పలుకవలెను ” 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు . 39. ప్రశ్నలు అడగండి !

In మానసికం, Our minds on ఏప్రిల్ 2, 2013 at 9:07 సా.

పని సూత్రాలు . 39.  ప్రశ్నలు అడగండి !

 
సాధారణం గా మనం చేసే ఉద్యోగాలలో , మన పని మనం అతి జాగ్రత్తగా చేసుకుంటూ పోతాము, ఇతరుల తో ఎక్కువ సంబంధం పెట్టుకోకుండా ! అది కేవలం మన పని లో నిమగ్నమవడం వల్ల కావచ్చు , లేదా మనం చేసే పని లో మనం కొంత వత్తిడి అనుభవిస్తూ , ఏకాగ్రత భగ్నం అవకుండా ఉండాలనే తపనతో కూడా ! దీనితో మనకు మన పక్క సెక్షన్ లో పని చేసే వారెవరో కూడా తెలియదు , కేవలం ఏదైనా పని ఉండి, అక్కడకు వెళితే తప్ప ! కానీ మనం పని చేస్తూ ఉన్న చోట కానీ , లేదా ఉద్యోగం చేస్తూ ఉన్న చోట కానీ , ఇతర ఉద్యోగులు చేసే ఉద్యోగం గురించి కూడా మనం తరచూ తెలుసుకుంటూ ఉంటే అది మనకు ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది !  ప్రశ్నలు వేసుకోవడం , ఇతరులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడం , మానవుడి తృష్ణకు కొల మానాలు ! మానవుడికి ఎంత తృష్ణ ఉంటే , పురోగతి కూడా అంత గానూ ఉంటుంది ! ముఖ్యం గా ఇతర ఉద్యోగులు చేసే పని గురించి కానీ , లేదా మీ సెక్షన్ లో నే ఉన్న మీ సహచరుల ఉద్యోగం గురించి కానీ అప్పుడప్పుడూ , మీకై మీరు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం అనేక విధాలు గా మీకు లాభ పడుతుంది ! 
1. మీరు మీ సహచరులలో పలుకుబడి కలవారవుతారు !
2. మీ పని సామర్ధ్యం మెరుగవుతుంది , మీరు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల  !
3. మీరు మీ సహచరుల పని గురించీ , సామర్ధ్యం గురించీ వివరాలు తెలుసుకుంటూ ఉంటుంటే , వారి దృష్టిలో మంచి వారవుతారు !  
మరి మీరు అడగ వలసిన ప్రశ్నలు ఏమిటి ?: 
మీరు అడగవలసిన ప్రశ్నలు , సహజం గా , యదార్ధం గా , దయతోనూ , సానుభూతి పూర్వకం గానూ   ఉండాలి ! ఉదాహరణకు : ఇతర ఉద్యోగి  వేసుకున్న చొక్కా కానీ కోటు కానీ అంత బాగా లేక పోయినా , మీరు వారిని ” నీ చొక్కా బాగుంది ఎక్కడ కొన్నావు ? ” అని అడిగితే వారిని మీరు హేళన చేస్తున్నట్టు అనుకోవచ్చు ! ” మీ ప్రెజెంటేషన్ బాగుంది మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకున్నారు ? అని కానీ , ” కస్టమర్ లను ఎక్కువ చేసుకోడానికి ఈ పధ్ధతి కన్నా మెరుగైనది ఏమైనా ఉందా మీ ఉద్దేశం లో ? అని కానీ , ” మీరు  ఆ రిపోర్టు చాలా చక్కగానూ , త్వరగానూ తయారు చేశారు ? ఏమైనా కిటుకులు ఉన్నాయా ”  ? అని కానీ అడిగి తెలుసుకోవచ్చు ! మీరు సరాసరి గా వారు చేసే ఉద్యోగం గురించీ , వారి సామర్ధ్యం గురించీ అడిగే ముందు ”  మీ పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారా ?  లాంటి   ప్రశ్న ( ల ) తో ప్రారంభం చేసి అడగ వచ్చు ! ఇట్లాంటి ప్రశ్నలు అడగడం వల్ల ,  మీ కంపెనీ  లో మిగతా ఉద్యోగులకూ , మీకూ మధ్య చక్కటి  టీం వర్క్ ఏర్పడుతుంది. మీ కొలీగ్స్ మిమ్మల్ని  ఒక సమర్ధత కలిగిన ఉద్యోగి గా గుర్తిస్తారు ! మీ మీద వారికి విశ్వాసం ఏర్పడుతుంది ! వారికి కూడా మీరు చేస్తున్న కంపెనీ లో ప్రాముఖ్యత కలిగిన ఉద్యోగులనే అభిప్రాయం కలిగి ,ఎక్కువ శ్రద్ధ తో ఉద్యోగాలు చేస్తారు !  మీ ప్రస్తుత ఉద్యోగం సులభమవడమే  కాకుండా , మీరు పదోన్నతి పొందడానికి కావలసిన  నాయకత్వ లక్షణాలూ మీకు అలవడుతాయి ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఏప్రిల్ 1, 2013 at 6:47 సా.

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త ! 

సాధారణం గా , మనం చేసే ఉద్యోగాలలో , ఇతర కొలీగ్స్ , లేదా ఇతర ఉద్యోగులలో అధిక శాతం  మంచి వారే ! వారూ మన లానే , కష్టపడి పని చేసే స్వభావం కల వారే ! కానీ కొద్ది శాతం మంది , మన మీద అసూయా ద్వేషాలు కలిగి ఉంటారు ! ఏదో రూపం లో వెన్ను పోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! ధర్మరాజుకు అందరూ మంచి వారిలానే కనిపించారు ట ! అంటే , ధర్మరాజు అందరిలోనూ మంచినే చూసే వాడుట ! కానీ దుర్యోధనుడు అందరిలోనూ చెడునే చూసే వాడుట ! అంటే దుర్యోధనుడికి అందరూ చెడ్డ వారిలానే కనపడ్డారు ట ! మీరు ధర్మరాజులూ , దుర్యోధనులూ కానవసరం లేదా ప్రస్తుత భారతం లో ! మీకు కావలసినది అప్రమత్తత ! మనం చీకటి గా ఉన్న దోవలో వెలుతురు తోడు లేకుండా నడవడానికి  సందేహిస్తాము !  కానీ ఆ చీకటి లో నడుస్తే, ఎప్పుడో కానీ  పాము కాటు వేయడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ , లేదా  గోతి లో పడడం కానీ సంభవించదు  ! ఎప్పుడో జరుగుతాయని , మనం చీకటి లో ఏ  దీపమూ లేకుండా నడవం కదా ! అదే పరిస్థితి మనం చేసే ఉద్యోగం కూడా !  మీ పని మీరు సవ్యం గా చేస్తూ , మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వారి గురించి మీరు అప్రమత్తత తో ఉండాలి ! ఎప్పుడూ ! మీ అప్రమత్తత మీకు విరోధులను తక్కువ చేస్తుంది. అట్లాగే మీ ఆపదలను కూడా తక్కువ చేస్తుంది ! 
అందుకు మీరు ఏమి చేయాలి ? 
1. వ్యక్తి గత విలువలు నిర్ణయించుకోవడం !  మీరు చేసే ఉద్యోగం లో అప్రమత్తులై ఉండడం అంటే, ముందుగా ,  మీకు మీరు గా,  కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి ! ఆ విలువలు మీ శీలాన్ని అంటే మీ క్యారెక్టర్ ను దృ ఢ మైనది గా చేస్తాయి ! ఇతరులు వేలు పెట్టి మీలో తప్పులు ఎంచ డానికీ , లేదా వెన్ను పోటు పొడవడానికీ జంకుతారు ! మీరు ఏర్పరుచుకునే వ్యక్తిగత విలువలు అనేకం ఉండవచ్చు ! కానీ అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగం లో మీ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ ను బలోపేతం చేసేవి గా ఉండాలి ! 
ఉదాహరణకు : మీరు ఈ క్రింది విధం గా,  మీలో మీరు ప్రతిన బూన వచ్చు : 
” నేను నా ఉద్యోగం కోసం ఇతరులను ( అంటే ఇతర ఉద్యోగులను ) ఏరకంగానూ శారీరికం గానైనా , మానసికం గానైనా హింసించను !”
నేను పని చేసే కంపెనీ నిబంధనలు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించను ”
” నేను నా నీతి నియమాలను కూడా ఎప్పుడూ పాటిస్తాను ” !
” నా యజమాని శ్రేయస్సుకూ , నా కుటుంబ శ్రేయస్సు కూ ఎప్పుడూ పాటు పడతాను ” !
”ఉద్యోగం లో నాకు తెలిసిన నిపుణత అంటే స్కిల్స్ , ఇతర ఉద్యోగులకు , ఏ స్వలాభాపేక్షా  లేకుండా నేర్పుతాను”  ! 
నేను ఉద్యోగం చేసే చోట , ఇతర సహోద్యోగులు ఎవరైనా పదోన్నతి పొందినా , నేను ఏ విధమైన అసూయా ద్వేషాలను పొందను , వారిమీద ప్రదర్శించను ”
ఈ రకమైన వ్యక్తి గత విలువలను మీకు మీరే ఏర్పరుచుకునే లక్ష్మణ రేఖలు ! వీటికి బద్ధులై ఎప్పుడూ , మీ పూర్తి శక్తి యుక్తులను మీరు చేసే ఉద్యోగం లో ప్రదర్శించడం అలవాటు చేసుకుంటే, మీరు మానసికం గా అత్యంత బలవంతులవుతారు ! దానితో మీ లక్ష్యాలు మీరు చేరుకోవడం సులభమవడమే  కాకుండా ,మీ ఉద్యోగం లో మీకు శత్రువులు ఏర్పడరు, ఒకవేళ ఏర్పడినా,  వజ్రం లాంటి మీ శీలాన్ని ఛే దించ లేరు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 37.మీ మాట జాగ్రత్త !

In మానసికం, Our minds on మార్చి 31, 2013 at 11:45 ఉద.

పని సూత్రాలు . 37.మీ మాట జాగ్రత్త ! 

 

క్రితం టపాలలో , మీరు మీ ఉద్యోగాలలో , ఓపిక గా వినడం వల్ల  ప్రయోజనాలు, అదే విధం గా , ఇతరులను తిట్టడం లేదా విమర్శించడం లో ఉన్న నష్టాల గురించీ వివరం గా తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు  మరి మనం  చేసే ఉద్యోగాలలో ఏమి మాట్లాడాలో కూడా తెలుసుకుందాం ! చాలా మంది, వారి చదువులు పూర్తి అయి ఉద్యోగాలలో చేరాక , ఉద్యోగ వాతావరణం లో ఎట్లా మాట్లాడాలో తెలియక, వారి కాలేజీల లో ప్రవర్తించినట్టే , ఉద్యోగం చేసే చోట కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ! అది కొంత వరకూ వారి వయసు వల్ల  కూడా అవవచ్చు ! కానీ ఉద్యోగం లో,  మన ప్రవర్తన , మన ఇమేజ్ ను ప్రతిబింబించే విధం గా ఉండాలి !  అదీ , మన ఉద్యోగం లో చేరినప్పటి నుంచీ కూడా ఉండాలి ! ఆ ఇమేజ్  ” మనం ఎప్పుడూ , తెలివిగా , విశ్వాస పాత్రులు గా , పరిణితి చెందిన వారిగా , అంటే మెచూర్ గా , కూల్ గా ” కనిపించాలి ! ( కూల్ గా ఉండడం అంటే ఏమిటో మనం క్రితం టపాలలో తెలుసుకున్నాం  కదా ! ) అంటే , సహజం గా మనలో ఉండే ఆ లక్షణాలు, బయటకు కూడా అవే లక్షణాలు గా కనిపిస్తూ ఉండాలి ! కానీ ,ఆకతాయి పనులు కాలేజీ లో చేసినట్టు, ఉద్యోగం లో కూడా చేస్తూ , పై అధికారుల దృష్టి లో కేవలం బాధ్యతలు మరిచి , సరదా గా ఉద్యోగం చేస్తున్న వారిలా  ‘కనపడకూడదు ‘ ! మనం కాలేజీ లలో , కొంత ఆకతాయి గా , చిలిపి గా , సరదా గా  కాలం గడిపి ఉంటాము !  చదువును అశ్రద్ధ చేయకుండానే !  కానీ చేసే ఉద్యోగాలలోనూ , కార్పోరేట్ సంస్థ లలోనూ , మన ప్రవర్తనను నిరంతరం , ఏదో రకం గా గమనిస్తూ ఉంటారు ! పై అధికారులు కానీ , లేదా బాసులు కానీ ! వారికి కావలసినది  మనం చేసే పని ! ఆ పని ద్వారా లాభాలు ! అంతే  ! అదే వాతావరణం లో మనకు కావలసినది , మన జీతం ( తాత్కాలిక లక్ష్యం ) తో పాటుగా మన  దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా ! 
 
మరి  మీరు మీ నాలుకను ఎట్లా నియంత్రించు కోవాలి ?:
1. అన్ పీసీ ( un  pc  )  వ్యాఖ్యానాలు : మీరు  మీ ఉద్యోగం లో ఎప్పుడూ ” అన్ పీసీ ” కామెంట్స్ చేయకూడదు ( pc  అంటే పర్సనల్ కంప్యూటర్  అనే అర్ధం తీసుకో కూడదు ఇక్కడ ! ఇక్కడ pc  అంటే పొలిటికల్లీ కరెక్ట్ అని అర్ధం ) ఉదాహరణకు,  మీరు చేసే ఉద్యోగాలలో , కులం గురించి కానీ రిజర్వేషన్ ల గురించి కానీ మీరు ఏవిధమైన వ్యాఖ్యానాలూ ఎప్పుడూ చేయ కూడదు ! మీరు ఆ విషయాలలో ఏ విధం గా  ( అ )న్యాయం పొందుతున్నా కూడా ! 
2. ఒక వర్గానికే చెందిన వారిని కించ పరిచే విధం గా విమర్శలూ , వ్యాఖ్యానాలూ చేయకూడదు !
3. లింగ పరం గా కామెంట్స్ కూడా చేయకూడదు ! కేవలం స్త్రీ పురుషుల లింగ పరం గానే కాకుండా ,  స్వలింగ పరుల గురించి కూడా ఏ రకమైన వ్యాఖ్యానాలూ చేయ కూడదు ! 
4. మీ పై అధికారిని, ఇతర ఉద్యోగుల ముందు ” విపరీతం గా కాకా పట్టే ” పనులు చేయకూడదు ! 
5. ఎట్టి  పరిస్థితులలోనూ , మీరు మీ టెంపర్ కోల్పో కూడదు , అంటే మీ సహనాన్ని కోల్పోకూడదు ! 
6. ఏ రకమైన పరుష పదజాలమూ ఎవరి మీదా ఉపయోగించ కూడదు ! అంటే తిట్లు ! ఎవరినీ తిట్ట కూడదు ! 
7. ఇతర వ్యక్తుల మీద మీకున్న నిజమైన అభిప్రాయాన్ని కూడా  తెలుప కూడదు ! 
8. ఇతర సహచరులతో , ఉద్యోగం లో ఉన్నప్పుడు బాతా ఖానీలు , హస్కులూ వేస్తూ ఉండ కూడదు !
మీరు మీ ఉద్యోగం లో మితం గా మాట్లాడే అలవాటు చేసుకోవాలి ! ( కేవలం మీరు కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుంటే తప్ప ! ) మాట్లాడే ముందు ప్రతి సారీ ,మీరు మాట్లాడేది ఏమిటో  ఆలోచించి మరీ మాట్లాడాలి ! మీ మాట క్లుప్తం గా , స్పష్టం గా , ఖచ్చితం గా , అర్ధ వంతం గా ఉండాలి ! మీ మాటను   ” నాన్చుతూ  ” మాట్లాడ కూడదు !  అట్లా అలవాటు చేసుకుంటే , మీరు నోరు జారే పరిస్థితి ఉండదు !  మీకు తెలుసు కదా , కాలు జారితే మీరు సరి చేసుకోవచ్చు , కానీ ఒక సారి నోరు జారితే , ఆ మాటను వెనక్కి తీసుకోవడం కష్టం , ఈ లోగా జరగ వలసిన నష్టం జరుగిపోతుంది ! మనం తరచూ చూస్తూనే ఉంటున్నాం కదా ! నోరు జారిన బడా ” నాయకులూ , అధికారులూ , ” ఎంత త్వరగా వారి పదవులు కోల్పోతున్నారో ! మీరు మితం గా , లౌక్యం గా మాట్లాడడం అలవాటు చేసుకుంటే , మీ సహచరులకే కాకుండా , మీ పై అధికారులకు కూడా విశ్వాస పాత్రులవుతారు !  అప్పుడు మీకు ప్రమోషన్లు, అంటే పదోన్నతులు ఖాయం ! 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 

పని సూత్రాలు. 36. వినదగు, ఎవ్వరు చెప్పిన !

In మానసికం, Our minds on మార్చి 30, 2013 at 11:52 ఉద.

పని సూత్రాలు. 36. వినదగు ఎవ్వరు చెప్పిన !

మీ ఉద్యోగం లో మీకు ఎవరు ఏమి చెప్పినా ముందు గా మీరు చేయవలసినది వినడం !  మీరు వారు చెప్పే విషయాలను ఓపిక గా వినాలి ! మనం సామాన్యం గా ఇంట్లో  మన పెద్ద వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు , ”  నేను చెప్పేది వింటున్నావా లేక చెవులప్పగించి చూస్తున్నావా ? ! ” అని అంటూ , ” అక్షింతలు ” వేస్తూ ఉండడం సామాన్యమే  కదా !   ! మన తెలుగులో ఈ వినడాన్ని కేవలం ఒక పదం తోనే, అంటే ” వినడం ” గానే  సంభో దిస్తాము కానీ , ఆంగ్లం లో రెండు పదాలు ఉన్నాయి ఈ వినికిడి జ్ఞానానికి ! హియరింగ్ ( hearing ) , అంటే కేవలం చెవులతో వినడం మాత్రమే ! కానీ  లిజనింగ్ ( listening  ) అంటే మాత్రం,  శ్రద్ధ గా ఆలకించడం !  అంటే, మనము చెవులతో వినక పొతే , ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధ గా ఆలకించ లేము !  ఈ విషయం కేవలం మాటలకే కాకుండా , మనం వినే శబ్దాలకు కూడా వర్తిస్తుంది ! అంటే వివిధ శబ్దాలు కూడా , మొదట గా మనం వినక పొతే , వాటిని శ్రద్ధ గా ఆలకించ  లేము ! కానీ మనం  చెవులతో విన్నా కూడా , చాలా సమయాలలో శ్రద్ధ గా ఆలకించం ! ప్రత్యేకించి ఇంటి ఇల్లాలు చెప్పే విషయాలు ! కానీ ఉద్యోగం లో అట్లా చేస్తే , ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది కదా ! కేవలం ఉద్యోగానికి ఎసరే  కాకుండా, ఇతరులు చెప్పేది విని , ఆలకించడం   జీవితం లో ” పైకి ” పోదామనుకుని ఉత్సాహ పడే ప్రతి వారికీ ఉండవలసిన ముఖ్య లక్షణం !  
మరి ఆఫీసులో ఈ వినడం ఎట్లా చేయాలి ?: 
1. మీరు వింటున్నప్పుడు  ఓహో ! ఆహా, ఊహూ అంటూ మధ్య మధ్య  చెప్పే వారికి తెలియ చేస్తూ ఉండాలి , కేవలం కళ్ళూ , చెవులూ అప్పగించడమే కాకుండా ! 
2. మీ దేహ భాష కూడా అంటే బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా ఉండాలి ! అంటే ఇతరులు చెప్పే మాటలు వింటున్నప్పుడు, తరచూ గోడ గడియారం ముళ్ళ వైపో , మీ వాచీ వైపో చూసుకుంటూ ఉండడం , ఇంకా  ఆవులించడం , లేదా  మీ బట్టలు సవరించు కుంటూ ఉండడం లాంటి పనుల లో ” నిమగ్నమవ ” కూడదు ! 
3. కొన్ని సమయాలలో ఇతరులు చెప్పే మాటల్లో ముఖ్యమైన పాయింట్స్ మీరు మళ్ళీ వారిని అడిగి నిశ్చయం చేసుకోవడం కూడా చేస్తూ ఉండాలి. ఉదా:  అంటే ఫలానా తారీఖున అనో , ఫలానా చోట అనో మీరు అడగడం చేస్తే , మీరు ఆ విషయం గుర్తుంచుకోడానికి కూడా ఉపయోగ పడుతుంది ! 
4. కొన్ని సార్లు , మీరు చెప్పే వారిని , వారు చెప్పిన మాటను మళ్ళీ చెప్పమని కూడా అడగవచ్చు ! మీకు ఆ విషయం స్పష్ట పడని సందర్భాలలో !
5. కొన్ని సార్లు , మీకు అర్ధం కాని విషయాలను  చెప్పే వారికి ప్రశ్నలు వేసి కూడా తెలుసుకోవచ్చు ! 
6. ఇంకో మంచి అలవాటు, మీరు ఒక నోట్ బుక్ లో సంగ్రహం గా చెప్పే వారి మాటలు మీకు గుర్తు ఉండే రీతి లో రాసుకోవచ్చు కూడా ! ఎందుకంటే , మీరు చాలా బిజీ అయే సమయాలలో కూడా , తరువాత  ఆ సంభాషణ వివరాలు మీకు అందుబాటు లో ఉంటాయి !
( ఆఫీసులలోనే కాకుండా , సరిగా విని ఆలకించడం విద్యార్ధులకు కూడా చాలా ఉపయోగ కరం !  చాలా మంది విద్యార్ధులు కేవలం వారి టీచర్లూ, లెక్చరర్ లూ చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని  వారి భవిష్యత్తు లోనూ , వారి జీవితాలలో నూ  ఎంతో  ముందుకు పోయిన వారూ, పోతున్న వారూ అసంఖ్యాకం ! ) 
 
మీరు పైన చెప్పినవి ఎందుకు ఆచరించాలి ?:
మీరు సరిగా ఇతరులు చెప్పేది వినడం , ప్రత్యేకించి మీ ఉద్యోగం లో , మీకు అనేక విధాలు గా లాభ దాయకం.
1. మీకు ఆ చెప్పే విషయం మీద మంచి అవగాహనా , పట్టూ ఏర్పడతాయి !
2. తద్వారా, మీ కర్తవ్యం , అంటే మీరు చేయవలసినది మీకు స్పష్టమవుతుంది !
3. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మీకు తెలుస్తాయి !
4. మీరు, ఇతరులు చెప్పేది , సహనం , సానుభూతి తో ఆలకిస్తారనే అభిప్రాయం , మీ కొలీగ్స్ కు ఏర్పడుతుంది !
5. మీరు  చురుకైన,  స్పురద్రూపి గా మీ సహచరులలో పేరు పొందుతారు ,  ఒక సోంబేరి గా , డల్ హెడ్ లా కాక !
6. మీరు చేసే పని , లేదా ఉద్యోగం లో మీరు చాలా శ్రద్ధ వహించి, ఇతరులు చెప్పేది కూడా సీరియస్ గా తీసుకుంటారని మిగతా వారు గమనిస్తారు !
 
వినడం ఒక నేర్పు. సాధనతోనే అది వస్తుంది. ఇతరులు చెప్పేది వినడం అలవాటు చేసుకోవడానికి , ఇంకో సులభమైన పధ్ధతి  మీరు  ఇతరులకు ఏదైనా చెబుతున్నపుడు , ఆ ఇతరులనుంచి ఏ రకమైన ప్రవర్తన  ఆశిస్తారో, అది ముందే ఊహించుకోవడం ! అప్పుడు సరిగా వినడం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోగలం !  అందుకే , వినదగు ఎవ్వరు చెప్పిన ……. ( మరి ఇప్పుడు వీరిలో ,  ఇల్లాలిని తప్పకుండా చేర్చు కోవాలి మరి !! )
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు. 35. పని లో దూషణ పనికి రాదు !

In మానసికం, Our minds on మార్చి 29, 2013 at 9:47 సా.

పని సూత్రాలు. 35. పని లో దూషణ పనికి రాదు ! 

 
ఉద్యోగ సూత్రాలలో ఇంకో ముఖ్యమైన సూత్రం. పనిలో దూషణ పనికి రాదు ! 
మీరు రోజూ చేసే పనిలో , అనేకమైన సమస్యలు ఉండవచ్చు ! అనేక వత్తిడులు ఉండవచ్చు , మీ సహచరులు లీవ్ మీద వెళ్ళ వచ్చు !  మీరు ఒక్కరే ఎక్కువ పని తో సతమతమవుతూ ఉండవచ్చు !  ఈ పరిస్థితులన్నీ సహజం గానే మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి ! మీకు చీకాకు కలిగిస్తూ ఉంటాయి ! 
మీరు ఇట్లాంటి పరిస్థితులలో చేయకూడనిది ఉంది , అది మీరు  మీ చుట్టూ ఉన్న వారినీ , లేదా మీలో మీరూ కూడా తిట్టుకోకూడదు ! ప్రత్యేకించి మీరు పని లో అంటే మీ ఉద్యోగం లో ఉన్నపుడు ! ఉదాహరణ:   చిదానంద్ ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆఫీసు లో !  పేరు మాత్రమే  ఆనందాన్ని తెలుపుతుంది కానీ అతడికి ఎప్పుడూ ముక్కు మీద కోపం ! ఆఫీసులో ప్రతి వారి మీదా విసుక్కుంటాడు తరచూ !   ఆఫీసుకు ఏకారణం చేతనైనా రాని వారిగురించి మిగతా కొలీగ్స్ తో ” జ్వరమనీ, కాలు నొప్పనీ ఆఫీసు మానేస్తారు, రోడ్డు మీద జులాయి వెధవల్లా తిరుగుతూ ఉంటారు , ” అనీ ”  ఉద్యోగం సరిగా చేయడం చేత కాదు అనీ  కు విమర్శలు చేస్తూ వారిని హేళన చేస్తూ ఉంటాడు !  ఇతర కొలీగ్స్ అది విని మొహాలు చూసుకుంటూ ఉంటారు !  చిదానంద్ కు దూరం గా ఉంటారు ! ఇక్కడ చిదానందుల వారు చేసే పొరపాటు  ఏమిటంటే , తన చీకాకు లనూ , తన పని వత్తిడినీ , ఆగ్రహాన్నీ , ఇతరులమీద  ఆపాదించడమే కాకుండా , ఇతరులను తిట్టడం , హేళన చేయడం చేస్తున్నాడు !   ఈ చర్య ఏ  రకం గానూ ఆయన కు ఉపయోగ పడదు ! 
రోజూ చేసే ఉద్యోగం లో  మీరు ఈ క్రింది విధం గా చేస్తారా?:
1. మీరు చేసే పనిలో ఏ  పొర పాటైనా సంభవిస్తే , మీరు తిడతారా ?
2. ఫోనులో ఎవరినైనా తిడతారా ?
3. మీ పై అధికారి ముందు కానీ మీ బాస్ ముందు కానీ  మీ నోట్లో నుంచి తిట్లు వస్తాయా ?
4. మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా , లేదా ఏ బిజినెస్ లోనైనా ఉద్యోగం చేస్తున్నా, మీ కస్టమర్ ల ముందు తిట్టడం జరిగిందా ?
5. మీరు  కొన్ని తిట్లే తిడుతూ , బూతులను తిట్టకుండా నియంత్రించు కోగలుగు తునారా?
6. లేక మీరు తిట్టినప్పుడు నానా బూతులూ తిడుతుంటారా? 
పై వాటిలో కొన్నిటికి కానీ , అన్నిటికీ కానీ మీ సమాధానం ఔనని ఉంటే,  మీరు  మీ బంగారు భవిష్యత్తు మార్గం లో మందు పాత్రలను మీ చేతులతోనే స్వయం గా అమర్చుకోవడం  అవుతుంది ! ఎందుకంటే దూషణ , లేదా తిట్లు తిట్టడం  అనేక విధాలు గా మీకు చేటు !  మీ అమూల్యమైన పని సూత్రాలకు విరుద్ధం ! 
మరి  క్రోధాన్నీ , చీకాకునూ , ఏ విధం గా బయటకు  తిట్ల రూపం లో  డ్రెయిన్ చేయాలి ? :
మీరు ఏకాంతం గా ఉన్నప్పుడు , మీరు మీ కారులో ఒక్కరే డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు , లేదా ఇంట్లో మీరు ఏకాంతం గా ఉన్నపుడు మాత్రమే చేయాలి ( అదీ మీకు చేయాలని అనిపిస్తేనే , కానీ పని కట్టుకుని చేయనవసరం లేదు కదా ! ) 
తరచూ తిట్టే వారూ , బూతులు తిట్టే వారు వ్యాధి గ్రస్తులా ?:
సామాన్యం గా తరచూ తిట్టే వారు  కేవలం చీకాకు వల్ల, తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు తట్టుకోలేకనో , లేదా తీవ్రమైన వత్తిడి వల్లనో తిడుతూ ఉంటారు ! వారికి ఎవరినైనా తిడితే ” మనశ్శాంతి ” ఏర్పడుతుంది ! కానీ అరుదుగా ‘ టూరెట్  సిండ్రోం ‘ అనే వ్యాధి ఉన్న వారు, విపరీతం గా బూతులు తిడుతూ ఉంటారు , వారికి వారి నోటి ” దురద ” బూతులు తిడితే కానీ తీరదు ! మీ బాస్ ఎవరైనా బూతులు అదే పనిగా తిడుతూ ఉంటే ,  వారిని  టూరెట్  వ్యాధి గ్రస్తులని అనుమానించాల్సిందే ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం !