Our Health

రచయత ఖజానా

పని సూత్రాలు. 24. మరి మీ తాత్కాలిక లక్ష్యాలు ఏమిటి ?:

In మానసికం, Our minds on మార్చి 16, 2013 at 9:36 ఉద.

పని సూత్రాలు. 24. మరి మీ తాత్కాలిక లక్ష్యాలు ఏమిటి ?:

 
క్రితం టపాలో మనం తెలుసుకున్నాం కదా ,జీవితం లో దీర్ఘ కాలిక లక్ష్యాలు పెట్టుకుంటే ఉండే ప్రయోజనాలు. మరి కేవలం వాటితోనే ముందుకు పోవడం కంటే ,వర్తమానం అంటే ప్రస్తుతం , మనం చేయ వలసిన కార్యక్రమాలు కూడా మనకు తెలిసి ఉంటే  ఎక్కువ ప్రయోజనం. అంటే తాత్కాలిక లక్ష్యాలు. ఈ దీర్ఘ కాలిక , తాత్కాలిక లక్ష్యాలను , మనం గమ్యం లేదా మన లక్ష్యాలను చేరుకోడానికి ఉపయోగ పడే  మార్గాలు లేదా రోడ్డులు ( roads ). మనం ప్రధాన రహదారి ను చేరుకోడానికి , చిన్న చిన్న సందులలో కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది కదా ! మరి ఎట్లాగూ ప్రధాన రహదారి , అదే మెయిన్ రోడ్డు లో ప్రయాణం చేయ బోతున్నామని , చిన్న, చిన్న సందులలో మన ప్రయాణాన్ని అశ్రద్ధ చేయ లేము కదా ! ఆ సందులలో కూడా మన ప్రయాణానికి అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోతేనే , పెద్ద రోడ్డు ను చేరుకొనేది !  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , తాత్కాలిక లక్ష్యాలు అన్నీ కలిసే దీర్ఘ కాలిక లక్ష్యాలకు పునాది గా ఏర్పడతాయి. 
ఉదాహరణకు వచ్చే నెలలో మీ కార్యక్రమాలు ఏమిటి ? మీ ఉద్యోగం  గురించి మీరు చేయవలసినవి ఏమిటి ? మీ ప్రాజెక్ట్ లు ఏమిటి ? వాటి గురించి మీరు చేయవలసిన హోమ్ వర్క్ ఏమిటి ?  మీరు కలవ వలసిన వారు ఎవరు ? ఎప్పుడు వారితో మీట్ అవాలి ? మీ వర్క్ కాకుండా , మీ కుటుంబ కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయా మీకు ? వాటిని ఏ విధం గా మీరు ( మీ ఉద్యోగం చేస్తూ )  నిర్వర్తించ గలరు ? మీ ఫ్రీ టైం  అంటే మీ విరామ సమయాన్ని మీరు ఏ విధం గా వినియోగించ దలచారు ? మీ స్నేహితులతో కానీ , మీ ప్రేయసి తో కానీ , లేదా ప్రియుని తో కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ , కలిసి వెళ్ళ వలసిన ప్రదేశాలు ఉన్నాయా ? ఇవన్నీ కూడా మీ తాత్కాలిక లక్ష్యాలు అవుతాయి. అట్లాగే మీరు ప్రస్తుత సంవత్సరం , లేదా వచ్చే రెండేళ్ళు , మూడేళ్ళు , లేదా నాలుగేళ్ళు కూడా తాత్కాలిక లక్ష్యాలు ఏర్పరుచుకోవచ్చు !  
మీరు ఈ ఈ లక్ష్యాలు ఏర్పరుచుకున్నప్పుడు, వాటిని చేరుకోవలసిన మార్గాలు కూడా నోట్ చేసుకోవడం మంచిది. అంటే మూడు నెలలో ఇంకో సిటీ వెళ్ళే యోచన ఉంటే , ఆ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు , రైలు, లేదా విమాన టికెట్ బుకింగ్ , మీ వసతి ఏర్పాట్లు , మీ బట్టలు , ఇట్లాంటి విషయాలు కూడా ఒక రమారమి తేదీల వారీ గా కార్యక్రమం మీరు ముందే నోట్  చేసుకుంటే , మీ కార్య క్రమాలు సులువు అవుతాయి ! ముఖ్యం గా మీరు వీటి తో పాటుగా , ఒక వేళ , మీరు ముందు గా అనుకున్నట్టు , ఏ కారణం వల్ల నైనా జరగక పొతే ( ఉదా రైలు క్యాన్సిల్ అవడమో , లేదా వాతావరణం బాగోలేక పోవడమో, లేదా ఆరోగ్యం అనుకూలించక పోవడమో  జరిగితే ) ఆసమయం లో మీరు తీసుకోవలసిన చర్యల గురించి కూడా మీకు ఒక  యోచన లేదా ఐడియా ముందుగానే ఉంటే ,  అట్లాంటి సంఘటనలు నిజం గా జరిగినప్పుడు కంగారు పడకుండా , సరి అయిన నిర్ణయాలు తీసుకో గలరు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 23. మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏమిటి ?:

In మానసికం, Our minds on మార్చి 13, 2013 at 7:48 సా.

పని సూత్రాలు. 23. మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏమిటి ?:

 
పని సూత్రాలలో ఇంత వరకూ మనం మన ఉద్యోగాలలో ముందుకు పోవాలంటే  మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో క్రితం టపాల లో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి ! ఈ లక్ష్యాలు ఎవరో మీకు తెలియ చేయ నవసరం లేదు ! ఎందుకంటే అవి ప్రత్యేకించి మీ వే కదా ! అంటే , లక్ష్యాలు ప్రతి మానవుడికీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ! మీరు ఇతర వ్యక్తులతో కొంత వరకూ తెలుసు కోగలిగినా కూడా , చివరకు మీ జీవితం లో మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు మీరే నిర్ణయించుకోవాలి ! ఎందుకంటే మీ జీవితం ఇంకొకరిది కాదు కదా ! మీరు మాత్రమే జీవించే జీవితం ! అది పూర్తి గా మీ సొంతం ! 
ప్రస్తుతం, మనం కేవలం మీరు ఒక ఉద్యోగం లో చేరిన తరువాత కానీ , చేర బోయే ముందు కానీ , మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు అంటే కనీసం అయిదు పది సంవత్సరాల తరువాత కానీ లేదా ఆ తరువాత కానీ , మీరు మీ ( ఉద్యోగ ) జీవితం లో ఏమి అవుదామని మీ ఉద్దేశం లేదా మీ లక్ష్యం ఏమిటి ? అనే విషయం తెలుసు కుంటున్నాం ! అంటే మీరు  ఏ  ఏ చదువులు చదవాలి అనే విషయాలు కాదని గుర్తు ఉంచుకోండి ! ప్రతి ఉద్యోగం లో కనీసం నాలుగు దశలు ఉంటాయి.  ఒకటి జూనియర్ గా చేరాక , రెండో దశ మధ్య దశ లేదా మిడిల్ లెవల్  ఉద్యోగి గానూ లేదా మూడో దశ లో సీనియర్ గానూ ఆ దశ కూడా దాటిన తరువాత , ఎగ్జిక్యుటివ్ గానూ అంటే మీరు పని చేసే కంపెనీ లో చివరి లేదా అత్యున్నత దశ ! ను చేరుకోవడమనే  లక్ష్యం ! మీరు ఈ నాలుగు దశలలో అనుభవం గడిస్తే , అదే కంపెనీలోనే ఉండనవసరం కూడా లేదు కదా , మీరు సాహస  ప్రవ్రుత్తి కలవారు అయితే , మీరు పొందిన అనుభవం తో మీ స్వంత కంపెనీ కూడా పెట్టుకోవచ్చు ! అందుకే మీకు మీరు ప్రవేశించిన ఉద్యోగం లో మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏమిటో ముందే మీరు నిర్ణయించుకోవాలి ! 
భారత దేశం లాంటి దేశాలలో , నిత్యం అనేక పరిస్థితులు అనేక విధాలు గా మారుతూ ఉంటాయి ! రేపు ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు ! ఇంకా దీర్ఘ కాలిక లక్ష్యాలు మాట్లాడుకోవడం ఏమిటి ? అని వీటిని తేలిక గా తీసి పారేసే వారు అనేక మంది ఉన్నారు ! అది నిజమే ! కానీ గుర్తు ఉంచుకోండి ! పని సూత్రాలు కేవలం జీవితం లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే కృత నిశ్చయం ఉన్న వారికే ! వారంతా గుర్తు ఉంచుకోవలసిన విషయం ఇంకోటి కూడా ఉంది !  అదే సమస్యల భారత దేశం లో అత్యున్నత విద్య చదివి , తాము ఎన్నుకున్న ప్రత్యేకమైన శాఖ లో లేదా ఫీల్డ్ లో అత్యున్నత స్థాయి కి చేరుకున్న ప్రతి వారూ  వారి వారి జీవిత మొదటి దశల లో దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటి కోసం ఒక క్రమ పధ్ధతి లో శ్రమ పడి , ఆ యా లక్ష్యాలను చేరుకున్న వారే ! 
ఇంకో ఉదాహరణ ! అమెరికా ప్రస్తుత అద్యక్షుడైన ఒబామా తాను స్కూల్ లో చదువు కునే సమయం లోనే , ఎవరైనా ” నీవు పెరిగి పెద్ద వాడివి అయ్యాక ఏమవుతావు ? అని అడిగితే , వారికి ఏమాత్రం తడుము కోకుండా ” నేను అమెరికా కు ప్రెసిడెంట్ నవుతా ! ” అని ఎంతో  ధైర్యం గా, ఆత్మ విశ్వాసం తో చెప్పే వాడుట ! ”అప్పుడు ఆ సమాధానం విని అందరూ నవ్వుకునే వారుట ! కానీ ఆ దీర్ఘ కాలిక లక్ష్యం తోనే,  ఒబామా రెండు సార్లు ( ఇప్పటి వరకూ ) అమెరికా దేశానికి అద్యక్షుడి గా ఎన్నిక అయ్యాడు ! దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏర్పరుచు కోవడం లోని శక్తి అది ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 22. చక్కగా రాయండి !

In మానసికం, Our minds on మార్చి 12, 2013 at 9:39 సా.

పని సూత్రాలు . 22.  చక్కగా రాయండి ! 

పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం , చక్కని దస్తూరీ !  అంటే చేతి వ్రాత !  మామూలు గా మనం   పని చేసే చోట చాలా ఫైళ్ళ మీదా , లేదా చాలా రికార్డు లలో నూ మన చేతి వ్రాత తో వివరాలు రాయడమూ , నిక్షిప్తం చేయడమూ చేస్తూ ఉంటాము ! చేతి వ్రాతను చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు !  దీనికి కారణాలు అనేకం ,  ఆంగ్ల భాష లో రాయ వలసి వచ్చినపుడు , అది మన భాష కాదు కదా అందువల్ల , మొదటి నుండీ అశ్రద్ధ చేయడం జరుగుతుంది , రాత ఎట్లా  ఏమౌతుంది కనుక అనే నిర్లిప్తత ఏర్పడుతుంది ఆది లోనే ! గురువులు చక్కగా నేర్పించక పోయినా కూడా చేతి రాత ను  అశ్రద్ధ చేయడం జరుగుతుంది ! తెలుగు వ్రాతను కూడా అనేక కారణాల వల్ల  అనేక మంది అశ్రద్ధ చేయడం జరుగుతుంది ! ఈ చేతి వ్రాత తో మీరు మీకోసం రాసుకునేట్టయితే , మీరు ఎట్లా రాసుకున్నా పరవాలేదు ! కానీ మీరు ఇతరుల కోసం కానీ  మీ అవసరాలకు కాకుండా కానీ వ్రాయ వలసి వచ్చినపుడు , ప్రత్యేకించి , మీరు చేసే ఉద్యోగం లో , మీ వ్రాత సులభం గా చదివినపుడు అర్ధమయే  లా ఉంటే , చాలా ఉత్తమం ! లేకపోతే  కేవలం మీ చేతి వ్రాత మీ రాతనే మార్చివేయగల ప్రమాదం ఉంది !  మీ ఉద్యోగం లో మీరు ఎక్కడైనా వ్రాసే సమయం లో గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవి:
1. మీరు ఏమి రాస్తున్నారు ? 2. మీ చేతి వ్రాత ఎట్లా ఉంది? , అనే విషయాల మీదే పని లేదా ఉద్యోగం లో మీ పురోగతి అవకాశాలు ఆధార  పడి  ఉంటాయి . ఎందుకంటే ,మీరు ఏమి రాస్తున్నారు అనే విషయం మీద మీ ఆలోచనా ధోరణి ఏమిటి , సమస్యా పరిష్కారాలలో  మీ పాత్ర ఏమిటి అనేది నిర్ణయించ బడుతుంది ! అట్లాగే  మీ వ్రాత ఎట్లా కనిపిస్తుందో కూడా ముఖ్యమే ! 
మరి మీరు ఏ  జాగ్రత్తలు తీసుకోవాలి ?
1. అర్ధమయే చేతి వ్రాత :  మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి వారితో మీ మాత్రు భాష లో మాట్లాడండి. ఉదాహరణకు తెలుగు అనుకుంటే , మీ ఎదుటి వ్యక్తి కూడా తెలుగువాడై   ఉన్నా , ఆయన మాట్లాడేది తెలుగు భాష అయినా ,  వారు మాట్లాడేది ఏదీ మీకు అర్ధం కాలేదనుకోండి ! అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో , మీ చేతి వ్రాత కూడా ఇతరులకు అర్ధం కాక పొతే అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ! అందు వల్ల  మీ చేతి వ్రాత ఎప్పుడూ మీకు మాత్రమె కాక , ఎవరికోసం అయితే వ్రాస్తున్నారో వారికి అర్ధం కావాలి , లేక పొతే అది వ్రాత అనిపించుకోదు కదా ! 
2. శుభ్రమైన వ్రాత :  మీరు వ్రాసే రాత ఎక్కడ రాసినా , తప్పులు లేకుండా , కనీసం ఎక్కువ తప్పులు లేకుండా , కొట్టి  వేతలూ , అవీ లేకుండా శుభ్రం గా ఉంటే ,చదివే వారికి అనుకూలం గా ఉండడం మాత్రమె కాకుండా , మీ పని శుభ్రత కూడా వారికి కనిపిస్తుంది !  
3. మీ ప్రత్యేకమైన దస్తూరీ అయి ఉండాలి : అంటే మీ చేతి వ్రాత మీదైన శైలి తో స్టైలిష్ గా ఉండాలి ! 
4. పరిణితి చెంది ఉండాలి మీ చేతి వ్రాత ! అంటే మీ రాత చిన్న పిల్లల చేతి వ్రాత లా ఉండ కూడదు అట్లా ఉంటే, మీరు సరిగా రాయడం నేర్చుకోనట్టే కదా ! 
5. వ్రాత స్థిరత ఉండాలి : అంటే మీరు రాసే రాత పేజీ మొదటి లైను లో ఎట్లా ఉందో , ఆ పేజీ లో ఆఖరి లైను లో కూడా అట్లాగే ఉండాలి, మారి పోతూ ఉండకుండా ! చక్కగా వ్రాయడం నేర్చుకుంటే , మీరు టైపు చేసే సమయం లో కూడా అదే అలవాటు కొనసాగుతుంది ! 
ఒక సంఘటన : మరణ శిక్ష వేయబడిన ఒక ఖైదీ కి ఆఖరి నిమిషం లో క్షమా భిక్ష ప్రసాదించ బడింది. అప్పుడు మరణ శిక్ష అమలు చేసే పోలీసు కు ఒక టెలిగ్రాం వచ్చింది ,  ఆ టెలిగ్రామ్ లో  ” Hang him,not stop ” అని ఉంటే , ఆ మరణ శిక్ష అమలు చేయ బడింది. కానీ తరువాత తెలిసింది , ఆ టెలిగ్రాం తప్పుగా టైపు చేయబడిందని , అసలు టైపు చేయ వలసినది ”  Hang him not. stop ”  అని ! కానీ  ఆ తప్పు గమనించే లోగా ఒక ప్రాణం అనంత వాయువులలో కలిసిపోయింది !  
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 21. మీ మాటే మంత్రమూ !

In మానసికం, Our Health, Our minds on మార్చి 10, 2013 at 1:16 సా.

పని సూత్రాలు. 21. మీ మాటే మంత్రమూ !

పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం –  మీ సంభాషణ ! అవును ! చక్కటి భాష  ప్రతి మానవుడికీ , ఇతర మానవులతో సంబంధాలు  పెట్టుకో డానికీ , వాటిని చక్కగా కొనసాగించ  డానికీ కూడా  అతి ముఖ్యమైన సాధనం ! సాంకేతికం గా మానవులు ఎంత పురోగమిస్తూ ఉన్నా , అనేక రకాలైన గాడ్జెట్ లు ప్రతి రోజూ మార్కెట్ లోకి వస్తున్నా కూడా , వాటితో మాట్లాడడం మానవులే కదా చేయాల్సింది ! అంతే కాకుండా ,  వారు చేస్తున్న ఉద్యోగాలలో , లేదా ఏ  రకమైన వర్క్ ప్లేస్ లోనైనా ఇతర ఉద్యోగులతోనూ , లేదా వారి పై అధికారి తోనూ , లేదా వారి క్రింద పని చేస్తున్న వారితోనూ , సవ్యమైన సంబంధాలు కలిగి ఉండడానికి వారి సంభాషణ ఎంతో  ఉపయోగ పడుతుంది ! 
మనం చూస్తూ ఉంటాం ! చదువుకునే కాలేజీలలో కానీ స్కూళ్ళ లో కానీ , ప్రత్యేకించి భారత దేశ  విద్యాలయాల లో , వైవా లేదా  సబ్జెక్ట్ విషయాలు మీరు మాట్లాడుతూ సమాధానం చెప్పే విధానం – దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వ బడుతుంది ! దానికి తగ్గట్టు గానే , చాలా మంది విద్యార్ధులు కూడా , చాలా నిశ్శబ్దం గా , వారికి గొంతు ఉందా లేదా అన్నంత అనుమానం కలిగించే లా ఎప్పుడూ వారి మాట వినపడక పోయినా కూడా , లిఖిత పరీక్షల లో చాలా బాగా పర్ఫాం చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారు ! కానీ వారు వారి చదువులు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు , వారి లోపాలు వారికి తెలుస్తాయి. వారి లోపాలు అనడం కన్నా , విద్యా విధానం లో లోపాలు అనవచ్చు నెమో ! ఎందుకంటే , నిత్య జీవితం లో ప్రతి మానవులూ , ఇతరుల తో సంబంధాలు కేవలం లిఖిత పూర్వకం గా ఎప్పుడూ కోన సాగించ లేరు కదా ! 
మరి చక్కగా మాట్లాడడం ఆంటే ఏంచేయాలి ?:
1. ఇతరుల తో మాట్లాడుతున్న సమయం లో మనం మంబ్లింగ్ , అంటే గొణగడం , లేదా గుస గుసలాడం చేయకూడదు ! ఎందుకంటే , ఇతరులకు మనం మాట్లాడేది ఏమిటో సరిగా వినబడదు , వినపడ్డా , దానిలో స్పష్టత లోపిస్తుంది. అంతే  కాక ముఖ్యంగా , గొణిగే  వారిని ఆత్మ విశ్వాసం తక్కువ గా ఉన్నవారిలా అనుకునే ప్రమాదం ఉంది ! 
2. అతి నిదానం గా అతి మృదువు  గా కూడా మాట్లాడ కూడదు ! ప్రత్యేకించి మీరు పని చేసే స్థానాల్లో ! మీ భాగ స్వామి తో కానీ , మీరు ప్రేమలో పడ్డప్పుడు కానీ అట్లా మాట్లాడడం మీరు ఏ  ప్రయత్నమూ చేయకుండా నే మీకు వస్తుంది, మీ హృదయం లో  ప్రేమ తరంగాలు ఎగిసి పడుతున్నప్పుడు , మీ మనసు తేలిక అవుతుంది , మీ మాట బరువు అవుతుంది , దానితో  అతి మృదువు గా మారి , వినే వారి చెవులకు ప్రేమ గంధం పూయ బడుతున్న భావన కలుగుతుంది ! మరి ఇంత ప్రత్యేకత ఉన్న మృదు భాష ను మీరు పని చేసే చోట ఉపయోగించడం ? కేవలం మీరు అక్కడ కూడా ఎవరితో నైనా ప్రేమాయణం సాగిస్తేనే  చేయాలి !!!
3. కలగా పులగం గా మాట్లాడకూడదు !:  అంటే మీరు పని చేసే ప్రదేశం ,ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ అవుతే , అక్కడ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సాంకేతిక పదాలు వాటికి సంబంధించిన మాటలే మాట్లాడాలి కానీ , మీరు తెలుగు కవిత్వం లో మీ పాండిత్యం అక్కడ చూపించ కూడదు ! అది పూర్తి గా అసందర్భం అవుతుంది ! 
4. భాష  దేశ కాల పరిస్థితుల బట్టి , మన చుట్టూ ఉండే మనుషుల భాష ను బట్టీ కూడా మారుతూ ఉంటుంది ! ఒక్కో ప్రాంతం లో ఒక్కో యాస కూడా ఉంటుంది ! వీలైంత వరకూ మనం పని చేసే చోట , మన యాసలూ  అంటే యాక్సెంట్ లు అతి తక్కువ గా ఉపయోగిస్తూ మాట్లాడితే లాభ కారి గా ఉంటుంది ! 
5. ఇంగ్లీషు మన భాష కాదు !  ఒక ఉదాహరణ : ఆంధ్ర దేశం నుంచి కొంత కాలం క్రితం, ఒక తెలుగు డాక్టర్ ఇంగ్లండు వెళ్ళాడు. అక్కడ ఆయన గారు , తన కొలీగ్స్ ( తెల్ల వారు ) తో ఒక డిన్నర్ కు వెళ్ళాడు.  టేబుల్ దగ్గర ఆయన తన పక్కన ఉన్న ( తెల్ల ) వ్యక్తి తో  అతని పక్కన ఉన్న  నీటి జగ్గు అందివ్వమని  ” ప్లీజ్ పాస్ వాటర్ ” అన్నాడు. అప్పుడు ఆ ( తెల్ల ) వ్యక్తి  పగల బడి నవ్వాడు ట ! ఎందుకంటే  లోకల్ గా  ” పాస్ వాటర్ అంటే ” మూత్రం చేయమని కూడా అర్ధం వస్తుంది ! ( ఆ డాక్టర్ ప్లీజ్ పాస్ ది జగ్  అని ఉండాల్సింది ! ) అందువల్ల , భాష లో బాగా పట్టు ఉంటే తప్ప ఇతర భాషలలో మనం, ప్రత్యేకించి  ఉద్యోగాలలో ఏ  ప్రయోగాలూ చేయ కూడదు ! ( ఆ విషయం లో మనం ఎంతో మేలు ! ఎందుకంటే , భారత దేశం లో చాలా మందికి కనీసం మూడు భాషలు వస్తాయి ! కానీ పాశ్చాత్య దేశాలలో వారి మాత్రు భాష తప్ప ఇతర భాషలు తెలియవు ఉదాహరణకు  ఇంగ్లండు పొరుగు దేశం అయిన ఫ్రెంచి వారికి ఇంగ్లీషు రాదు ! అట్లాగే ఇంగ్లండు లో ఇంగ్లీషు మాట్లాడే వారికి ఫ్రెంచ్ భాష తెలియదు !  
మనం ఎట్లా మాట్లాడ కూడదో తెలుసుకున్నాం కదా మరి ఎట్లా మాట్లాడాలి ?:
మనం మాట్లాడే భాష స్పష్టం గా , ఇతరులకు అర్ధమయే రీతి లో , చిన్న చిన్న పదాలలో క్లుప్తం గా నూ , ఆహ్లాద కరం గానూ  ఉండాలి ! అప్పుడు మీ మాట ఇతరులకు మంత్రం లా పని చేసి , మీతో సత్సంబంధాలు ఏర్పరిచే వారధి అవుతుంది ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు. 20. ” కూల్ ” గా ఉండడం అంటే ఏమిటి ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on మార్చి 9, 2013 at 1:30 సా.

పని  సూత్రాలు. 20. ” కూల్ ” గా ఉండడం  అంటే ఏమిటి ? 

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం  ” టు బి  కూల్  ఎట్  ఆల్ టైమ్స్ !” . అంటే దీనిని తెలుగులో అనువాదం చేస్తే , ఎప్పుడూ చల్ల గా ఉండమని అర్ధం వస్తుంది ,కానీ అది నిజం కాదు. అందు వల్లనే  కూల్  అనే ఆంగ్ల పదాన్నే వాడడం జరిగింది ! నవీన  ప్రపంచం లో కూల్  గా ఉండడం అంటే , ప్రశాంత చిత్తం తో , ఆత్మ విశ్వాసం తో  ఆదుర్దా ఏమీ లేకుండా అనేక నిత్య జీవిత సందర్భాలలో ప్రవర్తించడం ప్రత్యేకించి ,స్కూల్ లోనూ, కాలేజీ లోనూ , లేదా పని చేసే చోటా కూడా !  ఈ ఈ సందర్భాలలో , లేదా స్థలాల లో , ఆందోళన పడకుండా  ఇతరులలో కలిసి పోతూ కూడా తమ పని తాము సక్రమం గా చేయ గలగడం ! అంతే కాక, తమ పరిస్థితుల మీద తాము నియంత్రణ కలిగి ఉండడం !
మరి కూల్ గా ఉండాలంటే, ఏ లక్షణాలు అలవాటు చేసుకోవాలి ?: 
1. మీ  పరిసరాలను సదా గమనించండి ! :
అంటే కేవలం మీ చుట్టూ ఉండే స్థలాలనూ , చెట్లనూ , చేమలనూ , కట్టడాలనూ , అంటే బిల్డింగు లనూ , ఫర్నిచర్ నూ అనుకుంటే అది పొరపాటు ! మానవ సంబంధాలు కేవలం వాటితో కాదు కదా ! ముఖ్యం గా మీరు మీ చుట్టూ ఉన్న మనుషుల ను పరిశీలిస్తూ ఉండాలి ! అంటే వారి దృష్టి లో మీ మీద వారి  అభిప్రాయం ఎట్లా ఉంటుందో గమనించడం !  ఈ విషయం లో మీకు ఉపయోగ పడే ” సాధనాలు ” మీ వేషం , మీ భాషా ఇంకా మీ ప్రవర్తనా !  అవే వారికి మీ మీద  ఒక మంచి అభిప్రాయం కలిగిస్తాయి !  ఈ విషయం లో ” వారితో నాకేం పని ? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ” అనుకునే వారు చాలా మంది ఉంటారు !  అది నిజమే ! కానీ పని సూత్రాలలో ముఖ్య సూత్రం మీ పురోగతి అంటే మీ ప్రోగ్రెస్ !  దానికోసం మీరు మీ వర్క్ ప్లేస్ లో ఇతరులతో చక్కటి సంబంధాలు కలిగి ఉండడం అతి ముఖ్యం ! కేవలం మీరు ఒక ప్రతిభావంతులైన శాస్త్రగ్నులైతే తప్ప ! ( మీ అంత  మీరు,  ఒక ప్రయోగ శాల లో ప్రయోగాలు చేస్తూ ఉండవచ్చు ! ) 
2. స్వతంత్రత అలవాటు చేసుకోండి ! :  కూల్  గా ఉండే వారు ఇతరులతో బాగా మెసల గలిగినా , వారు ఇతరుల మీద ఆధార పడకుండా , సాధ్యమైనంత వరకూ , వారి పనులు వారే స్వతంత్రం గా చేసుకుంటూ ఉంటారు ! 
3. మీ ప్రత్యేకత కోల్పోవద్దు ! : బురద లో పెరిగినా తామర పూవు అందం గా ఉంటుంది , తన ప్రత్యేకత ఎప్పుడూ కోల్పోదు ! అది ” బురద పూవు ” అనిపించుకోదు కదా !  కూల్ గా ఉండడం అంటే ఇతరులతో కలిసిపోవడం నిజమే ! కానీ ఈ ప్రయత్నం లో మీరు  మీ ప్రత్యేకతలను కోల్పోకూడదు ! అంటే మీ సహచరులు  సిగరెట్ తాగుతూ ఉంటే  మీరు స్మోకింగ్ అంత వరకూ చేయక పొతే , ఆ అలవాటు చేసుకో నవసరం లేదు !  అట్లాగే మీరు శాక హారులైతే , మీ చుట్టూ ఉన్న వారు మాంసం తింటూ ఉంటే , మీరు కూడా ఆ పని చేయ నవసరం లేదు ! అట్లా వారిని అనుకరించడం ” కూల్ ” గా ఉండడం అనిపించుకోదు ! అదే విధం గా మద్యానికి అలవాటు పడడం , ఇంకా ఇతర వ్యసనాలు కూడా !
4. మీ హృదయం విప్పండి ! : అంటే మీ హృదయాన్ని హనుమంతుడి లా చీల్చుకోమని అర్ధం చేసుకోకండి !  మీ సహచరుల దగ్గర మీరు  ఏ  అరమరికలు లేకుండా ,మీ వ్యక్తిగత విషయాలు  చెప్పుకోండి !  సమస్యలూ, కష్టాలూ లేని మానవులు లేరు కదా !  మీరు వాటిని మీ హృదయం లో ” తొక్కి పట్టి ఉంచితే ” అది మీ హృదయానికి మంచిది కాదు ! 
5. సమ దృష్టి కలిగి ఉండండి ! : మీరు ఇతర మానవులతో సంబంధాలు ఏర్పరుచుకునే సమయం లోనూ లేదా వారితో ఆ సంభంధాలు కొనసాగించే సమయం లోనూ ,వారి మీద సమ దృష్టి కలిగి ఉండండి ! అంటే వారు మీకన్నా ఎక్కువా కాదూ , తక్కువా కాదు !  వారు మీలానే మానవులు ! వారికి మీరు ఇచ్చే గౌరవం ఇస్తూ ఉన్నా ,వారిపైన సమ దృష్టి కలిగి ఉంటే , మీలో ఆత్మ న్యూనతా భావాలు కానీ , అహం భావం కానీ ఏర్పడవు ! ఆ గుణాలు,  మీ మానసిక ఆరోగ్యాన్ని  ప్రభావితం చేసే మలినాలు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 19. ఆకర్షణీయం గా ఉండండి !

In మానసికం, Our minds on మార్చి 8, 2013 at 8:30 సా.

పని సూత్రాలు. 19. ఆకర్షణీయం  గా  ఉండండి ! 

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం ఎప్పుడూ మీరు ఆకర్ష ణీయం  గా కనబడడం !  మనం చూస్తూ ఉంటాం , ఆజాను భాహువులైన పురుషులు సమాజం లో ఎంతో  ముందుకు చక చకా పోతూ ఉంటారు , వారు ఆర్ధికం గా ఏ తరగతి కి చెందినప్పటికీ , అట్లాగే అందమైన , ఆకర్షణీయమైన యువతులు కూడా  పలు రంగాలలో వారు ఎంచుకున్న లక్ష్యాలను త్వరగా అధిగమిస్తూ ఉంటారు ! ఇక సహజం గా పుట్టుకతో , శారీరికం గా  దృ డం గా లేని పురుషులు , లేదా అంతగా అందం గా అనిపించని స్త్రీలూ  కూడా సమాజం లో ఎంతో  పురోగమిస్తూ ఉంటారు.గమనించ వలసిన విషయం ఏమిటంటే , మనం మన లక్ష్యాలను చేరుకోడానికి  పుట్టుకతో మనకు సంక్రమించిన శారీరిక లక్షణాలు కొంత వరకూ దోహద పడుతున్నా కూడా , మన మానసిక లక్షణాలు , తదనుగుణం గా ఇతరులతో ప్రత్యేకించి , మన చుట్టూ ఉన్న సమాజం లోనూ , ఇంకా మనం చేసే ఉద్యోగాలలో మన కొలీగ్స్ తోనూ ,మనం ప్రవర్తించే తీరు కూడా మన పురోగతి కి ఎంతాగానో తోడ్పడతాయి ! 
నిత్య జీవితం లో మనం ఇతరులకు  ఆకర్షణీయం  గా కనబడడానికి మనం ఏం  చేయాలి ?:
1.  శరీరాన్ని శుభ్రం గా ఉంచుకోవడం 
2.  ఎప్పుడూ తాజా బట్టలు వేసుకోవడం 
3.  ఆకర్షణీయమైన హేర్  స్టైల్ తో కనిపించడం 
4.  నిరంతరం చిరునవ్వుతో ఇతరులను పలకరించడం లేదా ఇతరులతో సంభాషించడం 
5. హృదయ పూర్వకం గా   అరమరికలు లేకుండా ఇతరులతో  మెసలడం 
6. ఇతరుల అవసరాలను కూడా సానుభూతి తో  పరిశీలన చేయడం 
7. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఇతరులతో ప్రవర్తించడం ,
8. కేరింగ్ మనస్తత్వం తో ఉండడం . 
కేవలం  పైన చెప్పిన లక్షణాలే కాకుండా , మీరు నుంచునే లేదా కూర్చునే తీరు కూడా ఇతరులను మీ వైపు ఆకర్షింప చేస్తుంది ! మీ ఎత్తు బరువు ఎట్లా ఉన్నా కూడా , మీరు మీ సీటు లో ఒక మూలకు నక్కి నట్టు కూర్చుని  ఒక పక్కకు వాలిపోయి ఉంటే   మీరు ఇతరులతో సంభాషణకు విముఖం గా ఉన్నట్టు అభిప్రాయం కలిగిస్తారు !  అట్లా కాకుండా మీరు కూర్చున్న సీటు లో నిటారుగా మీ వీపు ఉంచి వాలిపోకుండా ఉంటే  మీరు ఎలర్ట్ గా ఉండి ,ఇతరులకు మీతో మాట్లాడాలనే ఉత్సాహం కలిగిస్తారు ! ఇతరులకు మీలో   మీ చిరునవ్వు , కపటం లేని , మీ స్వభావం , మీ శుభ్రతా ,  భేషజాలు ఏవీ  లేని మీ సంభాషణా , జీవితమంటే మీకున్న ఆశావాద దృక్పధం – ఈ లక్షణాలు  ఎక్కువ  ఆకర్షణీయం  గా కనబడతాయి ! 
 
వచ్చే టపాలో ఇంకో  పని సూత్రం ! 

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ మీ ఇంటర్వ్యూ రోజు అనుకోండి !

In మానసికం, Our minds on మార్చి 7, 2013 at 11:20 సా.

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ  మీ ఇంటర్వ్యూ  రోజు అనుకోండి ! 

 క్రితం టపాలో పని సూత్రాలలో వస్త్ర ధారణా , ఆభరణాలూ , పాద రక్షలూ మొదలైన విషయాలలో మీరు తీసుకో వలసిన జాగ్రత్తలూ, శ్రద్ధా  ఎట్లా ఉండాలో చూశాము కదా ! ఇప్పుడు ఇంకొన్ని వ్యక్తి గతమైన శ్రద్ధ ఏ  రకం గా మీ ఉద్యోగం లో మీ అభి వృద్ధి కి దోహద పడతాయో తెలుసుకుందాం ! 
1. మీరు ధరించే బట్టలు , ఎప్పుడూ ,  ఉతికి ఇస్త్రీ చేసినవీ , తాజాగా మడతలు లేకుండా ఉన్నవీ ధరించండి ! అంతే కాకుండా , గుండీలు అంటే బటన్స్ లేదా బొత్తాములు కొన్ని ఊడి పోయినవీ , లేదా కొన్ని చివర్లలో కుట్లు ఊడి పోయినవీ, లేదా చిన్న వైనా  మచ్చలు ఉన్న వస్త్రాలు ధరించి ఆఫీసుకు గానీ మీరు పని చేసే స్థానానికి గానీ వెళ్ళడం శ్రేయస్కరం కాదు ! 
2. రోజూ తాజాగా , స్నానం చేసి , డి  ఓడరెంట్  స్ప్రే చేసుకుని ఆఫీసు కు వెళితే  మీ శరీరం తో పాటుగా , మీ మనసు కూడా ఉల్లాసం గా ఉండి , మీరు బాగా పని చేయగలగడమే కాకుండా , మీ బాసు మెప్పు కూడా పొంద గలరు ! 
3. మీ కేశాలంకరణ కూడా తాజాగా చేసుకుని వెళ్ళడం మంచిది. ట్రిమ్ చేసిన హేర్ కట్ చేసిన తలలు కూడా  కార్పోరేట్ కల్చర్ కు అనుగుణం గా ఉంటాయి ! ఉష్ణ దేశాలలో , మీ తల మీద హేర్  ట్రిమ్ చేసి ఉంటే హాయి గా కూడా ఉంటుంది ! 
4. పురుషులు రోజూ షేవ్ చేసుకుని ఆఫీసు కు వెళితే వారు వారి బాసు మీద మంచి ఇంప్రెషన్ ఏర్పరచడమే కాకుండా , వారి సహచర యువతుల్లో ప్రేమ భావనలు, అవి లేక పొతే కనీసం స్నేహ భావనలైనా కలిగించ గలరు ! ఎందుకంటే చాలా మంది యువతులు, పురుషులు ఫ్రెష్ గా షేవ్ చేసుకుంటే నే ఇష్ట పడతారు ! 
5. చేతులు ఎప్పుడూ శుభ్రం గా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి !  కారు డ్రైవ్ చేసీ, లేదా  బైక్ కానీ సైకిల్ కానీ నడిపి , మాసి పోయీ , నల్లని గ్రీజ్ మరకలు, మసీ అంటి ఉన్న చేతులతో ఆఫీసులో ఎవరికీ కనపడడం మంచిది కాదు !  మీ పని రీత్యా,  కొంత సమయం మీ చేతికి మలినాలు అంటినా కూడా ! ఎందుకంటే , అపరి శుభ్రం గా ఉన్న చేతులు ముఖ్యం గా అనారోగ్య కరం !  మానవుల కు వచ్చే అనేక రకాలైన ఇన్ఫెక్షన్ లు కేవలం చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. మీ ఆఫీసు లో ఇతర ఉద్యోగులు కానీ  లేదా మీ కస్టమర్స్ కానీ మీతో హ్యాండ్ షేక్ లేదా కరచాలనం చేయడానికి ఇష్ట పడరు , మీ చేతులు మలినం గా ఉంటే ! ఇంకో ముఖ్య విషయం , ఆఫీసులలో కానీ , మీరు పని చేసే స్థానం లో కానీ , ప్రేమాయణాలు కనుక జరిపే వారి కి  మలినమైన చేతులు చాలా నష్ట దాయకం  ! 
6. చేతి వేళ్ళ గోళ్ళు , అమ్మాయిలకు అందం గానే ఉంటాయి , క్రమం గా మ్యానిక్యూర్ చేయించు కుంటూ ఉంటే , కానీ పెరిగి ఉన్న గోళ్ళు , లేదా గోళ్ళ క్రింద మలినాలతో నల్ల గా మారి ఉన్న గోళ్ళూ, పురుషులకు ఉంటే ఆ పురుషులు అపరిశుభ్రం గా ఉన్నట్టు కనిపిస్తారు !
7. చాలా మంది  ఆఫీసుకు వెళ్ళే తొందరలో ఫలహారం అంటే టిఫిన్ చేసీ , లేదా అన్నం తినీ , వెంటనే తమ వాహనాల మీద ఆఫీసులకు ప్రయాణం అవుతూ ఉంటారు ! దానితో , పళ్ళ మధ్య చేరిన ఆహార పదార్ధాలు ఇరుక్కుని, తరువాత కొన్ని గంటలకు, వారు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు , దుర్వాసన వస్తూ ఉంటుంది ! అందువల్ల క్రమం గా బ్రష్ చేసుకోవడమూ ( ప్రత్యేకించి ఏమైనా ఆహారం తిన్న తరువాత ), లేదా ఆ అవకాశం లేని స్థలాల్లో  నోటిని తాజాగా ఉంచే చూయింగ్ గం ను నమలడమో  చేయాలి ! కానీ ఆఫీసులో కాదు ! 
8. ఆల్కహాలు , టీలు , కాఫీలు అలవాటు ఉన్న వారు కూడా వారి నోటి పరిశుభ్రత విషయం లో శ్రద్ధ తీసుకోవాలి ! ప్రత్యేకించి ఆల్కహాలు తాగే అలవాటు ఉన్న వారి దగ్గర రెండు రకాలు గా వాసన రావడానికి అవకాశం ఉంది ! ఒకటి  వారు క్రితం రాత్రి ఎక్కువ  మోతాదు లో తాగితే , వారు ఊపిరి వదులు తున్నప్పుడు , ఒక రకమైన ఆల్కహాలు వాసన వస్తుంటుంది ! వారి శరీరం ఎక్కువ గా చెమట పట్టి కూడా వాసన వస్తుంది ! అంతే కాక , వారి నోటిలో ఆల్కహాలు నోటి చర్మం లో కలిగించే మార్పుల వల్ల కూడా వాసన వస్తుంది !   పని సూత్రాలలో ముఖ్య సూత్రం: సిగరెట్లూ ,  మద్యమూ , మాదక ద్రవ్యాలూ ముట్టుకోక పోవడం ! ఎందుకంటే అవి  పని సూత్రాలు పాటించే వారి  దీర్ఘ కాలిక లక్ష్యాలను  ఒక్క సారి గా అగాధం లో పడవేస్తాయి !  ఎందుకంటే ఆ లక్షాలు వారు చేరుకునే లోగానే , వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఇట్లాంటి అలవాటు ఉన్న వారు పని సూత్రాలు పాటించినా , వాటి ప్రయోజనాలు అనుభవించకుండానే అనారోగ్య బారిన పడతారు ! వారికి పని సూత్రాలు  నిరుపయోగం ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు . 17. మీ స్టైల్ ఎట్లా కనిపించాలి ?:

In మానసికం, Our minds on మార్చి 6, 2013 at 9:09 సా.

పని సూత్రాలు . 17.  మీ స్టైల్ ఎట్లా కనిపించాలి ?:

 

1. మీ ప్రత్యేకమైన స్టైల్ ఇతరులకు కనిపించాలంటే , మీ ట్రేడు మార్కు బట్టలనే ఎప్పుడూ ధరించండి ! 
2. బట్టలను ఎప్పుడూ చాలా బిగుతు గా అంటే టైట్ గా ఉన్నవి ధరించకండి ! ఎందుకంటే , బిగుతు గా ఉన్న బట్టలు , మీరు ఏ  కారణం చేత వేసుకుంటున్నా , మీరు చాలా పీనాసి గా కనిపించడం జరుగుతుంది ! అంటే మీరు మీ కోసం మంచి బట్టలు కూడా కొనరన్నతేలిక  అభిప్రాయం ఏర్పడుతుంది చూసే వారికి .  కొద్దిగా వదులు గా ఉన్న బట్టలు వేసుకుంటే , మీలో ఎంతో  ” నాణ్యత ” అంటే క్వాలిటీ ,  ఎంతో  హుందాతనం కనిపిస్తుంది మీలో , ఇతరులకు ! 
3. మీరు వేసుకునే బట్టలు కొంత  ఆలస్యం గా కొంటున్నా , మంచి నాణ్యత గల బట్టలు కొనండి ! అంటే మీరు ఆరు నెలలకు ఒక సారి చవక బట్టలు కొనే కంటే, తొమ్మిది నెలలకు ఒకసారి , మంచి నాణ్యత గల బట్టలు కొనుక్కుని వేసుకుంటూ ఉండండి ! 
4. ఆభరణాలను మీ ఆఫీసులో తక్కువగా ధరించండి ! కానీ పెట్టుకునేవి చాలా నాణ్యత గల , ఖరీదు గల వాటినే పెట్టుకోండి !  విచ్చల విడి గా ఖర్చు చేసి ఆభరణాల ఎగ్జిబిషన్  కోసమా అన్నట్టు ఆఫీసు కు పెట్టుకోవడం  మీ  అలంకరణ పట్ల మీకున్న రుచి అంటే టేస్ట్  మీద ఇతరులకు అనుమానాలు రేకెత్తిస్తుంది !  అంతే  కాక విపరీతం గా ఖర్చు చేస్తుంటే , మిమ్మల్ని మీ ఇతర కొలీగ్స్  ” వేరు చేసి చూసే ‘ ప్రమాదం ఉంటుంది ! అంటే మీరు వారి ”గ్రూపు ” కు చెందిన వారిగా వారు భావించరు ! 
5. మీరు యువతులయితే , మీరు ఏ  మేకప్ వేసుకుంటే ఎక్కువ అందం గా కనబడతారో , అదే మేకప్ రోజూ వేసుకుంటూ ఉండండి !  ఎండా కాలానికీ, వానా కాలానికీ , లేదా చలికాలానికీ , ఇట్లా ఒక్కో ఋతువు కు ఒక్కో మేకప్ వేసుకోవడం పని సూత్రాలకు విరుద్ధం !  మిమ్మల్ని అందం గా గుర్తు ఉంచుకునే మేకప్ నే ఎప్పుడూ వేసుకుంటూ ఉండండి ! 
6. చాలా నిరాడంబరం గా  వస్త్ర ధారణ చేసుకోవడం కన్నా , కాస్త డాబు దర్పం గా నే ఉండేట్టు మీ బట్టలు వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం అలవాటు చేసుకోండి ! 
7. మీరు మీ శరీరం మీద బట్టలైనా , పాదరక్షలైనా , లేదా ఆభరణాలు అయినా ధరించేప్పుడు మీరు ప్రత్యేకం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం ! 
అవి ఎప్పుడూ , నాణ్యత ఉన్నవీ , ప్రియమైనవీ , స్టైలిష్ గా ఉన్నవీ , అవి ధరించిన మిమ్మల్ని గుర్తు పట్టేవీ అయి ఉండాలి . అంతే కాక అవి మీ అందాన్నీ , హుందా తనాన్నీ  ఇనుమడింప చేసేవి గా ఉండాలి ! 
పని సూత్రాలలో మీ వస్త్ర ధారణా , మీరు ధరించే ఆభరణాలూ , పాదరక్షలూ , మీ మేకప్ , ఇవన్నీ ,  మీలో ఉన్న కళా దృష్టి ని   ప్రతిబింబించడమే కాకుండా , స్టైలిష్ గా కూడా  కనిపించాలి !   ఉద్యోగం లో మీ పురోగతి కి ఇవి ఎంత గానో సహకరిస్తాయి ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !  
 

పని సూత్రాలు . 16. మీ స్టైల్ చూపించండి !

In మానసికం, Our minds on మార్చి 5, 2013 at 10:55 సా.

పని సూత్రాలు . 16. మీ స్టైల్ చూపించండి ! 

 
పని లో లేదా మీరు పని చేసే స్థానం లో మీ దైన  శైలి చూపించడం, కేవలం మీ ప్రత్యేకత ను  ఇతరులకు తెలపడమే ! 
కార్పోరేట్ సంస్థ లో పని చేసే మాధవి  కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుఎట్.  ఆఫీస్ లో తను ఎప్పుడూ ప్రత్యేకం గా కనబడుతుంది. ఫార్మల్ గా ఎక్కువగా తయారవనట్టు కనిపిస్తుంది !  ఎడమ చేతి మణికట్టు కు ఒక టైమెక్స్ వాచ్ గోల్డ్ స్ట్రాప్ ది  పెట్టుకుంటుంది. కుడి చేతికి ఒకటే సన్నని బంగారు గాజు ! దానితో చేతులు  బోసి గా ఉన్నా , మాధవి సన్నగా ఉండడం తో ,  ఆ చేతులు తామర కాడల్లా  సున్నితం గా కనబడుతూ ఉంటాయి ! కాస్త చామన ఛాయ గా ఉన్నా లేత పసుపు రంగు, లేత ఆకుపచ్చ రంగు లేదా పింక్ రోజా రంగు  ఫైన్ కాటన్ చీరలే కట్టుకుంటుంది !  చీర పమిట ను అలవోకగా, యదా లాపం గా వదిలేసినట్టు  కట్టుకుంటుంది !  ఆ పమిట ఎప్పుడూ, మాధవి అందాలను కప్పి ఉంచడానికి ఏదో గిల్టీ గా ఫీలై పోయి , జారి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ! మాధవి పని చేస్తున్న సమయం లో  పదే  పదే  జారి పోతున్న తన  పమిట ను  అప్రయత్నంగానే మళ్ళీ  మళ్ళీ తన వక్షోజాల పైకి సరి చేసుకుంటుంది. కొన్ని సార్లు  ఆ సరి చేసుకున్న పమిట మళ్ళీ ” తన బుద్ధి ” పొనిచ్చు కోక, జారడం మొదలెడుతూ ఉంటే , ఈ సారి తన పెదిమలు బిగబెట్టి ఆ పమిటను , తన వక్షోజాల మీదగా పోనిచ్చి ,  అంచును కసిగా తన నడుము లోకి బిగుతుగా పోనిస్తుంది !  ఆ ప్రయత్నం లో ఆమె సఫలం అయినా , ఇంక జారిపోలేని  పమిట మాటున ఒదిగిన తన అందాలను చూసుకుని తనలో  తనే ఒక మందహాసం చేసుకుంటుంది !  కాస్త ఓపిక పట్ట మన్నట్టు గా ! మాధవి తన ముఖం అలంకరణ విషయం లో ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకుంటుంది ! తన చెవులకు ఉండీ ఉండనట్టు ఉన్న రాళ్ళ స్టడ్స్ పెట్టుకుంటుంది ! వాటి వెలుగు కొంచమే  అయినా , ఎప్పుడూ చిరు నవ్వు తో ఉండే , మాధవి ముఖం వెలుగుకు ఇంకా కాంతి వంతం గా మెరుస్తూ ఉంటాయి ! తన పెదవులకు , లిప్ స్టిక్ ఎప్పుడూ తన పెదిమల రంగువే వేసుకుంటుంది ! దానితో  దేవుడి కి కూడా తెలియదు మాధవి లిప్ స్టిక్ పెట్టుకుందని ! తన హాండ్ బ్యాగ్ , ఫైన్ లెదర్ తో తయారు చేసినదే తెస్తుంది ఆఫీసుకు ! కాళ్ళకు చెప్పులు కూడా ఫైన్ లెదర్ చెప్పులు ,హై  హీల్స్ వేసుకుంటుంది ! తన బాసు మీద ఒక అంగుళం పొడవు గా ఉన్నట్టు కనిపిస్తుంది ! ఎలిగెంట్  గా ! 
అది మాధవి స్టైల్ !  ఒక ప్రత్యేకమైన శైలి ! ఇంక తన ఆఫీసులో ఎవ్వరికీ లేని స్టైల్ ! ఆమె నడుస్తున్నా , పని చేస్తున్నా, కూర్చున్నా , టేబుల్ మీద, పేపర్ మీద రాస్తున్నా , కంప్యుటర్ మీద  వర్క్ చేస్తున్నా, ఒక ప్రత్యేకమైన స్టైల్ !  ఆమెకు తను చేసే పని మీద కూడా చాలా శ్రద్ధ !  చాలా ఎఫిషియెంట్ !  ఆమె తన ఉద్యోగాన్ని ఎంత బాగా చేస్తుందో , అంతే  బాగా తన అప్పియరెన్స్ ను కూడా చూసుకుంటుంది ! దానితో ఆమె తన పనిని కూడా చాలా ఉత్సాహం గా , సంతోషం గా చేయ గలుగుతుంది !  అది మాధవి స్టైల్ !  
 
వచ్చే టపాలో మీ ప్రత్యేకమైన శైలి కి మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం ! 

 

పని సూత్రాలు. 15. మీ ప్రత్యేకమైన స్టైల్ ( శైలి ) కనబరచండి !

In మానసికం, Our minds on మార్చి 3, 2013 at 5:24 సా.

పని సూత్రాలు. 15.  మీ ప్రత్యేకమైన స్టైల్ ( శైలి )  కనబరచండి ! 

క్రితం టపాల  లో  ఉద్యోగం లో మీరు పాటించ వలసిన సూత్రాలు !  ఈ పని సూత్రాలు  ఎక్కడా రాసి ఉండవు !  ఏ  ఉద్యోగం చేరే సమయం లోనూ మీకు చెప్పరు  కూడా ! ఎందుకంటే , మీరు చేరిన ఉద్యోగాన్నే మీరు అతుక్కుని , చాలా ఏళ్ల  వరకూ అదే పొజిషన్ లో ఉంటే  నే  మేనేజర్లకూ , యజమానులకూ అనుకూలమైన పరిస్థితి ! కానీ మీరు సదా మీ పురోగతి గురించి మీ  ఆలోచిస్తూ ఉండాలి !  ఎందుకంటే , మీలో చాలా మంది కి ఆ శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి , మీరు ముందుకు పోగలరు ! 
ఇప్పుడు మీదైన స్టైల్ అంటే ఏమిటో చూద్దాము !  మానవులందరూ ఒకటే అయినా ,  ఏ  ఒక్క మానవుడూ మిగతా వారి లా ఉండడు  కదా !  అంటే భౌతిక లక్షణాలలో , అందరికీ అన్ని అవయవాలూ ఉన్నా  ప్రతి వారూ ఇంకో వారి ని పోలి ఉండరు కదా !  ఇక మానసిక పరిస్థితి , క్యారెక్టర్ విషయాలు చూసినా , ప్రతి ఒక్కరిదీ ఒక్కో తీరు కదా !  అంటే  ప్రతి వారూ పెరుగుతూ ఉన్నప్పుడు , శారీరిక మార్పుల తో పాటుగా , మానసిక మార్పులూ , ఇంకా వారి ప్రవర్తన లో మార్పులు కూడా వారిదైన ప్రత్యేకతను సంతరించు కుంటారు ! ఈ మార్పులే వారి వారి స్టైల్ గా చెప్పుకోవచ్చు ! 
ఇట్లా ప్రతి ఒక్కరి స్టైల్ ను వారు  భౌతికం గా కనిపించేట్టు బహిరంగ పరచేందుకు ఉపయోగ పడే సాధనమే స్టైల్ ! లేదా శైలి ! 
ఆధునిక మానవ జీవితం లో ఈ స్టైల్ చాలా ప్రాముఖ్యత సంతరించు కుంది !  ముఖ్యం గా వారి దుస్తులూ , ఆభరణాల విషయం లో ! ఈ స్టైల్ ను ఒక రకం గా పెట్టుబడి దారీ వ్యవస్థ ను విపరీతం గా ప్రోత్సహించే రీతి గా ఉంటుంది ! ఎందుకంటే , కాల క్రమేణా ,  వివిధ మీడియా లలో వచ్చే వివిధ ప్రకటనల రూపం లోనూ,సామాన్య మానవులకు అందుబాటు లో ఉండే  వినోదం , సినిమా ద్వారానూ , రాత్రనక , పగలనక , అదే పని గా , వస్తూ , సామాన్య మానవుల ఆలోచనా ధోరణి లో కూడా సమూలమైన మార్పులు తెచ్చి , ఈ స్టైల్ కు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితి కల్పించాయి ! 
కారణాలు ఏమైనప్పటికీ , ప్రతి వారూ , తమదైన శైలి కోసం ఆత్రుత పడుతూ ఉంటారు, నిరంతరం ! మీరు చేసే ఉద్యోగం విషయం మనం ప్రస్తుతం మాట్లాడు కుంటున్నాం కాబట్టీ ,  మీరు మీ మీ ఉద్యోగాలలో మంచి పేరు తెచ్చు కోవడానికీ , లేదా మీరు ఇంకా పురోగ మించ డానికీ , మీ స్టైల్ మీకు ఎంతో  ఉపయోగకరం గా ఉంటుంది ! ఫలానా వ్యక్తి , ఫలానా ఆఫీసు లో పని చేస్తాడు ! అతను   ఎప్పుడూ  మల్లె పూవులాంటి తెల్ల బట్టలే కట్టుకుంటాడు !  అతనితో ఏ  సమస్యా ఉండదు ! పని జాగ్రత్త ఎక్కువ , ఏ  ఫైలూ పెండింగ్ లో ఉంచడు ! అనో ,లేదా  ‘ఆమె పని చేసే ఆఫీసులో  చాలా పాపులర్ బాంబే డయింగ్ ప్రింట్స్ సారీ కట్టుకుని చాలా ఆకర్షనీయం గా ఉంటుంది ! ఎవరు ఏ  ప్రాబ్లమ్  తో అప్రోచ్ అయినా నవ్వుతూ మాట్లాడించి వారి సమస్యను సాల్వ్ చేస్తుంది ! మిగతా వాళ్ళ లా కాదు ! ‘ అనో వారి వారి స్టైల్ గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు సామాన్యం గా ! 
మరి ఈ స్టైల్ ను  స్త్రీలూ  పురుషులూ  ఏ విధం గా మెయిన్ టెయిన్  చేయాలో వచ్చే టపాలో చూద్దాం !