నీటి గండం నిజమేనా ?3.
నీటిలో ‘కనబడని ‘ ప్రమాదాలు !
నీరు నిండిన కొలను కానీ , తటాకం కానీ, క్వారీ లో నిలువ ఉన్న నీరు కానీ , లేదా సముద్రపు నీరు ( బీచ్ ) కానీ , పైనుంచి చూడడానికి ఆహ్లాదకరం గా , ఆకర్షణీయం గా కనబడుతుంది అందరికీ !
చాలా మందికి , ముఖ్యం గా చిన్నారులకు , బడి కి వెళ్లే వయసు పిల్లలకూ , ఆ నీటి లో దిగి ఆడుకోవాలని అనిపిస్తుంది ! అంతేకాకుండా , చాలా మందికి , ఈదడం రాకపోయినా , ఆ నీటిలో దిగి ఈదాలని కూడా అనిపిస్తుంది !
కానీ , ఆ నీటిలో పొంచి ఉన్న ప్రమాదాలను ఊహించకుండా , ఆ నీటిలో దిగడం , కేవలం ఆత్మ హత్యా ప్రయత్నమే అవుతుంది ! ఎందుకంటే :
1. ఆ నీటిలో అనుక్షణం కలిగే బలమైన ప్రవాహాలు, అలలూ మన అంచనాకు అందవు ! ఆ ప్రవాహాల ప్రభావం మనకు కనబడక పోవడమే కాకుండా , ఒక సారి నీటి లో దిగాక , అతి బరువైన మనుషులను కూడా , ఒడ్డున ఉన్న వారిని కూడా , లోతైన లోపలి నీటిలోకి విపరీతమైన శక్తి తో లాగి వేయ గలవు !
2. అతి శీతలమైన నీరు , ఒక్కసారిగా దేహానికి తాకి , మనలను షాక్ కు గురి చేయగలవు. ఆ పరిస్థితి లో మానవులు , ఏ ప్రయత్నమూ చేయలేక ఆ నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉంటుంది !
3. నీటి ఒడ్డు లోతు లేనట్టు అనిపించినప్పటికీ , ఆ ఒడ్డులో సాధారణంగా పెరిగే నాచు, ఇంకా అక్కడ ఉండే బురదా , కాలు దించగానే సర్రున జార్చి , లోతైన ప్రాంతానికి అంటే పదీ , ఇరవై అడుగుల లోతుకు మనలను క్షణాలలో ముంచే ప్రమాదం ఉంది !
4. నిలువ ఉన్న నీటిలో ఎవరు ఎప్పుడు ఏరకమైన చెత్త పోస్తారో మనకు తెలియదు ! అంటే విరిగిపోయిన గాజు సీసాలు , పెంకులు , వంకరలు తిరిగిన ఇనుప కమ్మీలూ , చెట్ల కొమ్మలూ , ఇవన్నీ కూడా నీటి అడుగున పడి ఉన్నా , మనకు కనబడక , నీటి ఉపరితలం మాత్రం ప్రశాంతం గా , ఆకర్షణీయం గా కనిపిస్తుంది ! అట్లాటి నీటిలో పడగానే , కొమ్మల మధ్య , ఇనుప చువ్వల మధ్య ఇరుక్కు పోయి , లేదా నీటి అడుగున ఉన్న ముళ్ళు, గాజు ముక్కలూ గుచ్చుకు పోయి , ఎంతో బాగా ఈద గలిగిన గజ ఈతగాళ్లు కూడా , ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు !
5. ఈరోజుల్లో యువత గ్రూపులు గా నీటి కొలను దగ్గరకు విహార యాత్రలకని బయలు దేరి , నీటి దగ్గరకు చేరుకోగానే , తమ వద్ద ఉన్న మద్యం సీసాలను తాగి ఖాళీ చేసి మరీ నీటిలో దిగుతున్నారు ! ప్రాణాలు కోల్పోతున్నారు కూడా ! నీటిలో పడితే , మద్యం ప్రభావం లేనప్పుడే , మన మెదడు షాక్ కు గురి అయ్యి , సరిగా పని చేయదు ! ఇక మద్యం మత్తులో ఏ మాత్రం పని చేయ గలదు !?
6. అంతే కాకుండా , నీటి తటాకాలలోని నీరు అత్యంత కలుషితమైనది ! ఆ నీటి చుట్టూ తిరిగే మనుషులు అన్ని రకాల మల మూత్ర విసర్జనలూ చేసే ప్రమాదం ఉంటుంది ! ఆ ప్రాంతాలలో తిరిగే ఎలుకలు , పందికొక్కులూ కూడా ! వాటితో కలుషితమైన నీరు నోట్లో పడగానే , గ్యాస్ట్రో ఎంటి రైటిస్ , అతి విరేచనాల వ్యాధులే కాకుండా , ప్రమాదకరమైన (Weil’s disease లాంటి)వ్యాధులు సోకే ప్రమాదం కూడా !
ఇంకొన్నివచ్చే టపాలో సంగతులు !