Our Health

Archive for మే, 2018|Monthly archive page

నీటి గండం నిజమేనా ?4. నీటిలో ‘కనబడని ‘ ప్రమాదాలు !

In Our Health on మే 27, 2018 at 10:18 ఉద.

నీటి గండం నిజమేనా ?3. 

Related image

నీటిలో ‘కనబడని ‘ ప్రమాదాలు !
నీరు నిండిన కొలను కానీ , తటాకం కానీ, క్వారీ లో నిలువ ఉన్న నీరు కానీ , లేదా సముద్రపు నీరు ( బీచ్ ) కానీ , పైనుంచి చూడడానికి ఆహ్లాదకరం గా , ఆకర్షణీయం గా  కనబడుతుంది  అందరికీ !
చాలా మందికి , ముఖ్యం గా చిన్నారులకు , బడి కి వెళ్లే వయసు పిల్లలకూ , ఆ నీటి లో దిగి ఆడుకోవాలని అనిపిస్తుంది ! అంతేకాకుండా , చాలా మందికి , ఈదడం రాకపోయినా , ఆ నీటిలో దిగి ఈదాలని  కూడా అనిపిస్తుంది !
కానీ , ఆ నీటిలో పొంచి ఉన్న ప్రమాదాలను ఊహించకుండా , ఆ నీటిలో దిగడం , కేవలం ఆత్మ హత్యా ప్రయత్నమే అవుతుంది ! ఎందుకంటే :
1. ఆ నీటిలో అనుక్షణం కలిగే బలమైన ప్రవాహాలు, అలలూ  మన అంచనాకు అందవు ! ఆ ప్రవాహాల ప్రభావం మనకు కనబడక పోవడమే కాకుండా , ఒక సారి నీటి లో దిగాక , అతి బరువైన మనుషులను కూడా , ఒడ్డున ఉన్న వారిని కూడా , లోతైన లోపలి నీటిలోకి  విపరీతమైన శక్తి తో లాగి వేయ గలవు !
2. అతి శీతలమైన నీరు , ఒక్కసారిగా దేహానికి తాకి , మనలను షాక్ కు గురి చేయగలవు. ఆ పరిస్థితి లో మానవులు , ఏ ప్రయత్నమూ చేయలేక ఆ నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉంటుంది !
3. నీటి ఒడ్డు  లోతు లేనట్టు అనిపించినప్పటికీ , ఆ ఒడ్డులో సాధారణంగా పెరిగే నాచు, ఇంకా  అక్కడ ఉండే బురదా , కాలు దించగానే సర్రున జార్చి ,  లోతైన ప్రాంతానికి  అంటే పదీ  , ఇరవై అడుగుల లోతుకు మనలను క్షణాలలో ముంచే ప్రమాదం ఉంది !
4. నిలువ ఉన్న నీటిలో ఎవరు ఎప్పుడు ఏరకమైన చెత్త పోస్తారో మనకు తెలియదు ! అంటే  విరిగిపోయిన గాజు సీసాలు , పెంకులు , వంకరలు తిరిగిన ఇనుప కమ్మీలూ , చెట్ల కొమ్మలూ , ఇవన్నీ కూడా నీటి అడుగున పడి  ఉన్నా , మనకు కనబడక , నీటి ఉపరితలం మాత్రం ప్రశాంతం గా , ఆకర్షణీయం గా కనిపిస్తుంది ! అట్లాటి  నీటిలో పడగానే , కొమ్మల మధ్య , ఇనుప చువ్వల మధ్య ఇరుక్కు పోయి , లేదా నీటి అడుగున ఉన్న ముళ్ళు, గాజు ముక్కలూ గుచ్చుకు పోయి , ఎంతో  బాగా ఈద గలిగిన గజ ఈతగాళ్లు కూడా , ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు !
5. ఈరోజుల్లో యువత  గ్రూపులు గా  నీటి కొలను దగ్గరకు  విహార యాత్రలకని బయలు దేరి , నీటి దగ్గరకు చేరుకోగానే , తమ వద్ద ఉన్న మద్యం సీసాలను తాగి ఖాళీ చేసి మరీ నీటిలో దిగుతున్నారు ! ప్రాణాలు కోల్పోతున్నారు కూడా ! నీటిలో పడితే , మద్యం ప్రభావం లేనప్పుడే , మన మెదడు షాక్ కు గురి అయ్యి , సరిగా పని చేయదు ! ఇక  మద్యం మత్తులో ఏ  మాత్రం పని చేయ గలదు !?
6. అంతే కాకుండా , నీటి తటాకాలలోని నీరు అత్యంత కలుషితమైనది !  ఆ నీటి చుట్టూ తిరిగే మనుషులు అన్ని రకాల మల మూత్ర విసర్జనలూ చేసే ప్రమాదం ఉంటుంది ! ఆ ప్రాంతాలలో తిరిగే ఎలుకలు , పందికొక్కులూ కూడా ! వాటితో కలుషితమైన నీరు నోట్లో పడగానే ,  గ్యాస్ట్రో ఎంటి రైటిస్ , అతి విరేచనాల వ్యాధులే కాకుండా , ప్రమాదకరమైన (Weil’s disease  లాంటి)వ్యాధులు సోకే ప్రమాదం కూడా !
 ఇంకొన్నివచ్చే టపాలో సంగతులు !

నీటి గండం నిజమేనా ? 3

In Our Health on మే 20, 2018 at 10:54 ఉద.

నీటి గండం నిజమేనా ? 3.

Related image

మునుపటి టపాలో చిన్న వయసు పిల్లలు  నీటి వల్ల ఎట్లా ప్రమాదాలకు లోనవ గలరో తెలుసుకున్నాం కదా !

ఇప్పుడు కాస్త వయసు వచ్చిన పిల్లలు అప్రమత్తత గా లేకపొతే పొంచి ఉండే ప్రమాదాలు ఏంటో చూద్దాం !
5 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు , స్నేహితుల బృందాలను ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు !
తమ ఆలోచనలతో సరిపోయే మిగతా పిల్లలతో జత కట్టడమే కాకుండా , వారితో  ఆడుకోవడం , వారి ముందు తమ ఆధిక్యం చూపించడం చేస్తూ ఉంటారు !
అంటే , వారు మిగతా వారికన్నా , ధైర్య శాలురనీ , లేదా మిగతా మిత్రులతో బిడియం లేకుండా  వివిధ ఆట పాటలలో పాల్గొనాలనీ , ఉత్సాహ పడుతూ ఉంటారు !
ఉదాహరణకు : మిగతా స్నేహితులు సైకిల్ తొక్కడం నేర్చుకుంటే , తమకు  పడి , దెబ్బలు తగిలినా కూడా , పట్టుదల గా సైకిల్ నేర్చు కుంటారు !
అదేవిధంగా ఈత కూడా ! దగ్గరలో ఏదైనా ఈత కొలను , నాలా , కుంటలు కానీ , నది గానీ ఉంటే , మిగతా వారితో రహస్యం గా , సాధారణం గా ఇంట్లో చెప్పకుండా , వెళ్లి  ఈదడానికి ప్రయత్నిస్తూ ఉంటారు !
కొన్ని సమయాలలో , బడి నుంచి ఇంటికి వచ్చే సమయం లో కానీ , బాగా ఆకతాయి లవుతే , బడి ఎగ్గొట్టి కానీ , ఇట్లాటి ‘రహస్య ‘ కార్యక్రమాలకు వెళుతుంటారు !
కేవలం మిత్రులతో ఉత్సాహ భరితమైన కార్యాలు చేయాలనే తపన మాత్రమే ఉంటుంది కానీ , ఆ వయసు పిల్లలలో , నీటి వల్ల పొంచి ఉండే ప్రమాదాల గురించి ఆలోచించే వివేచన , వారికి ఉండదు , ప్రత్యేకించి ఆ సమయాలలో ! 
ఒక వేళ , ఒక్కరికో , ఇద్దరికో ఆ వివేచన కలిగి వెనకడుగు వేసినా , మిగతా ఎక్కువ మంది మిత్రులందరి ప్రోద్బలం తో , కాదంటే వారి స్నేహానికి దూరమవుతామనే ఆందోళన వల్ల , వారిని అనుసరిస్తారు !  ప్రమాదాలను తెచ్చుకుంటారు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !

నీటి గండం నిజమేనా ?2. 

In Our Health on మే 10, 2018 at 6:33 సా.

నీటి గండం నిజమేనా ?2. 

 

Image result for indian kid in the water
నడక నేర్చిన తరువాత :
చిన్నారులు సహజం గా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని  శోధిస్తూ ఉంటారు ! వారికి తమ కాళ్ళ మీద నిలబడడం రాగానే , నడక కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు . తడబడుతూ నడవడం రాగానే , తమ చుట్టూ ఉన్న ప్రతి వస్తువునూ నోట్లో పెట్టుకొని , వాటి రుచులు ఎట్లా ఉన్నాయో , అవి  తినే యోగ్యమైనవో కావో అనుకుంటూ పరీక్ష చేస్తూ ఉంటారు , రుచి కూడా చూస్తూ ఉంటారు !
అట్లాగే నీటితో  ఆదుకోవడం మొదలెడతారు !  గ్లాసులతోనూ , చెంబులతోనూ నీళ్లు తమ వంటి మీద పోసుకుంటారు ! తమ తల్లి దండ్రులు తమకు స్నానం చేయించే సమయం లో కలిగే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు !
నీటి తొట్టెలలో దిగి ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు ! అట్లాగే చిన్న చిన్న కొలనులు దగ్గరిలో ఉంటే , ఆ చోటుకు నడుచుకుంటూ పోతారు , కేవలం ఆదుకోవడం కోసం.
ఆ వయసులో వారికి  ఆపద లు , ప్రమాదాలూ అనే పదాలు వారి చిట్టి చిట్టి మెదడు లలో ఇంకా ఏర్పడవు !
అంటే రెండు నుంచి ఆరేళ్ళ వయసు వరకూ , చిన్నారులకు నీటితో  పొంచి వుండే ప్రమాదాల మీద అవగాహన ఏర్పడదు !
వారిని ఆ వయసులో నిత్యం కనిపెట్టి చూసుకుంటూ ఉండాలి , వారి తలిదండ్రులు ! ముఖ్యం గా వారి తల్లులు !
ఇంట్లో ఉండే బకెట్లూ , డ్రమ్ములలో కూడా ,నీరు కనపడగానే ,  ఆడుకోవడానికని దిగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నెన్నో !
అందుకే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి , ఆ వయసులో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

నీటి గండం నిజమేనా? 1. 

In Our Health on మే 6, 2018 at 1:02 సా.

నీటి గండం నిజమేనా? 1. 

Image result for dangers of water

మనం దాదాపు ప్రతి రోజూ , లేక కనీసం ప్రతి వారం , చూస్తూ ఉంటాం , లేదా చదువుతూ ఉంటాం , ఈ వార్తలు:
” క్వారీ లో పడి  నలుగురి పిల్లల దుర్మరణం “
“ఈతకు వెళ్లిన ముగ్గురి స్నేహితుల మరణం “
” విహార యాత్ర లో విషాదం , చెరువులో దిగిన విద్యార్థుల మరణం “
” నది లో దిగిన ఆరుగురు గల్లంతు ” !
ఇంకా అనేక రకాలు గా , విషాద కర  వార్తలు తరచూ మనకు  తెలుస్తూ ఉంటాయి !
ఇక  ఆ వార్తల విశ్లేషణ కూడా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం మనం !
ఆ వార్తలు తెలుసుకుని బాధ పడినా కూడా ,
” వారికి ఆ రకం గా నీటి గండం ఉంది ”   అనుకునో , లేదా ” వారికి ఈ భూమి మీద నూకలు చెల్లాయి ” అనో అనుకోవడం చేస్తూ ఉంటాం కూడా !
ఇక నవమాసాలూ  మోసి కన్న తల్లి కీ , తల్లి తో పాటుగా, వారిని  అల్లారు ముద్దుగా పెంచి , ప్రేమ తో చూసుకునే తండ్రి  బాధ వర్ణనాతీతం !
మరి నీటి గండం నిజమేనా ? 
ఎంత మాత్రమూ నిజం కాదు ! 
అది పచ్చి అబద్ధం ! 
‘వారికి నీటి గండం ఉంది , అట్లా ప్రాణాలు పోయాయి ‘ అని అనుకోవడం , కేవలం బ్రతికి ఉన్న ఆ మృతుల బంధువుల ఆత్మ తృప్తి తో , ముందుకు  పోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది ! కానీ యదార్ధం  అది కాదు !
మరి నీటి వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం మనం !
మిగతా విషయాలు వచ్చే టపాలో !
%d bloggers like this: