చర్మ మర్మాలు .6. మొటిమలకు, ఏ మందులు, ఎందుకు మంచివి ?
మొటిమలకు మందుల గురించి నిర్ణయించుకునే ముందు , చికిత్స, కనీసం మూడు నెలలు పట్ట వచ్చనే వాస్తవం గుర్తు ఉంచుకోవాలి ! అతి త్వరగా మొటిమలు తగ్గాలనే ఆతృత తో , కనబడిన క్రీము లన్నీ పూసుకుంటూ ఉంటే , మొటిమలు నయమవడం ఆలస్యం చేసుకోవడమే !
మొటిమలు ఉన్న వారు మానసికం గా కూడా కృంగి పోకూడదు ! మొటిమల తీవ్రత ను బట్టి , చికిత్స తీసుకోవాలి ! ఎక్కువ గా ఏర్పడి , చీము కూడా వస్తూ , బాధ కలిగిస్తూ ఉంటే , స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం అవసరం.
చికిత్స ముఖ్యం గా మూడు రకాలు గా ఉంటుంది !
1. మందులు, కేవలం మొటిమలు ఉన్న చోట పూసుకోవడం.
2. నోటిలో ( మింగి ) వేసుకునే మందులు .
3. ప్రత్యేక పరికరాలతో మొటిమల ను తీసి వేయడం !
1. మందుల క్రీములు, లోషన్ లు, జెల్ లు .
వీటిలో, బెంజోయిల్ పెరాక్సైడ్ అనే మందు ఉండే క్రీములు ఉత్తమం ! అంటే , ఏ డాక్టరు దగ్గర కు వెళ్ళినా , మందు క్రీము కొనుక్కునే సమయం లో బెంజోయిల్ పెరాక్సైడ్ ఉందో , లేదో చూసుకోవాలి.
బెంజోయిల్ పెరాక్సైడ్ రెండు రకాలు గా మొటిమలను తగ్గిస్తుంది
a . చర్మం లో ఏర్పడే మృత కణాలు పోగు అయి, హేర్ ఫాలికిల్ ను మూసి వేయకుండా నిరోధిస్తుంది
b . చర్మం లో ఉండే బ్యాక్టీరియా లను నాశనం చేసి , మొటిమలు ఇన్ఫెక్ట్ కాకుండా నివారిస్తుంది !
ప్రశ్న : మరి బెంజోయిల్ పెరాక్సైడ్ ఉన్న క్రీము ను ఎన్ని సార్లు పూసుకోవాలి ?
జవాబు : ఈ మందు ను రోజు లో రెండు సార్లు పూసుకోవాలి. అంటే పగలు , రాత్రి పూసుకోవచ్చు.
ఈ మందు పూసుకునే ముందు , ముఖాన్ని కడుక్కోవడం మంచిది.
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్ ను ఎక్కువ సార్లు పూసుకుంటే ఏమవుతుంది ? మొటిమలు త్వరగా తగ్గుతాయి కదా ?
జవాబు: బెంజోయిల్ పెరాక్సైడ్ క్రీము ను చాలా పలుచని పొర లాగానే, మొటిమలు ఉన్న చోట పూసుకోవాలి ! ఎక్కువ సార్లు పూసుకుంటే , లేదా , త్వరగా తగ్గాలనే తాపత్రయం తో , మందమైన పొర లాగానో పూసుకుంటే , ఈ క్రీము చర్మానికి ( పోసిన చోట ) మంట కలిగిస్తుంది !
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్ పూసు కున్న తరువాత ఎండలో తిరగ వచ్చా ?
జవాబు: బెంజోయిల్ పెరాక్సైడ్ పూసుకున్నాక , పూసుకున్న ఏరియా , సూర్యుడి లోని UV కిరణాలకు ( అంటే అల్ట్రా వయొలెట్ కిరణాలకు ) ఎక్కువ గా ప్రభావితం అవుతుంది . UV కిరణాలు చర్మ కణాలకు హాని చేస్తాయి !
ప్రశ్న : మరి ఈ క్రీము ను ఎంతకాలం వాడాలి ?
జవాబు: చాలా మంది , సాధారణం గా కనీసం ఆరు వారాలు , ఈ క్రీము పూసుకోవాలి , మొటిమలు పూర్తి గా నయమవ్వాలంటే !
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్ క్రీము తో ఇతర సైడ్ ఎఫెక్ట్ లు ఏమైనా ఉంటాయా ?
జవాబు: పూసుకున్న చోట కొంత మంట తో పాటుగా , ఆ ప్రాంత చర్మాన్ని ఎండి పోయినట్టు డ్రై గా కూడా చేయవచ్చు ఈ క్రీము.అట్లాగే , క్రీము పూసిన చర్మం కాస్త ఎరుపెక్క వచ్చు ! కానీ ఈ చెప్పిన సైడ్ ఎఫెక్ట్ లు. మందు ( చికిత్స తరువాత ) వాడకం ఆపిన తరువాత తగ్గిపోతాయి !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !