చర్మ మర్మాలు . 5. మొటిమలు పోవాలంటే,
క్రితం టపాలలో మొటిమలు రావడానికి కారణాలు తెలుసుకున్నాం కదా ! మరి మొటిమలు పోవాలంటే ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం !
1. రెండు మూడు సార్లకన్నా ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోవడం వల్ల ఉపయోగం ఉండదు ! సబ్బు కానీ, లోషన్ కానీ ముఖం కడుక్కోవడానికి ఉపయోగిస్తే , అందుకోసం మైల్డ్ సోప్ ను వాడాలి ! అంటే, పొటాషియం కాస్త ఎక్కువ గా ఉండే సబ్బు , మార్కెట్ లో సాఫ్ట్ సోప్ లు చాలా రకాలైనవి లభిస్తాయి ! ఆందోళనతో ముఖాన్ని ఎక్కువ సార్లు కడుక్కుంటే , మొటిమలు తగ్గక పోగా , చర్మానికి రాపిడి ఎక్కువ అయి , మొటిమలు ఎక్కువ అయే రిస్కు ఉంటుంది !
2. నీళ్ళతో ముఖాన్ని కడిగే సమయం లో , అతి శీతలమైన నీటితోనూ , లేదా అతి వెచ్చని నీటితోనూ కడగ కూడదు ! గోరు వెచ్చని నీటితో కడుక్కోవడం మంచిది .
3. ఏ రకమైన మొటిమలనైనా కూడా , చిదపడం, నొక్కెయ్యడం లాంటి పనులు చేయకూడదు ! అట్లా చేస్తే , మొటిమలు మచ్చలు గా మారతాయి ! ఒక పట్టాన ఆ మచ్చలు మానవు కూడా !
4. మేకప్ కు వాడే క్రీములలో నీటి శాతం ఎక్కువ ఉండే క్రీములను వాడడం అలవాటు చేసుకోవాలి ! ఎందుకంటే, అట్లాంటి క్రీములు హేర్ ఫాలికిల్స్ ను మూసి వేయవు ! అంటే , మొటిమలు ఏర్పడడానికి అనువైన వాతావరణాన్ని కలిగించవు , చర్మం మీద !
5. ఏ రకమైన క్రీములు పెట్టుకున్నా కూడా రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఆ మేకప్ ను గోరు వెచ్చటి నీటితో శుభ్రం గా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి ! ఎందుకంటే చర్మం మీద కణాలు ‘ ఊపిరి తీసుకోవాలి ‘ కదా !
6. మీ ముఖ చర్మం వాడి పోయినట్టు, డ్రై గా ఉంటే , నీటి శాతం అధికం గా ఉండే క్రీము ను పూసుకోవచ్చు !
7. క్రమం గా వ్యాయామం చేయడం నేరుగా మొటిమలను తగ్గించక పోయినా కూడా మానసికం గా ఉత్తేజం కలిగి , ఆరోగ్యం గా ఉండడానికీ , ఆశావహ దృక్పధం తో జీవితం సాగించ డానికీ ఎంతో ఉపయోగకరం ! వ్యాయామం చేయగానే , షవర్ తీసుకోవడం అంటే, తల మీదనుంచి స్నానం చేయడం వల్ల , స్వేదం లో ఉండే లవణాలు , మొటిమలను ఇరిటేట్ చేయకుండా , అంటే మంట పుట్టించ కుండా నివారించు కోవచ్చు !
వచ్చే టపాలో మొటిమలకు తీసుకోవలసిన మందుల గురించి తెలుసుకుందాం !