క్రితం టపాలో కరోనా సమయంలో, మన శరీర ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మనం మానసిక ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుందాం!
ఏదైనా తీవ్రమైన విపత్తు సంభవించినప్పుడు మానవుల ఆలోచన ఆలోచనా ధోరణులు , బాల బాలికలలో ఒక రీతిగా నూ , యుక్త వయస్కులలో ఇంకో రీతిగా నూ , ఇంకా వయోవృద్ధులలో ఇంకో రకంగాను ఉంటాయి. ఏ వయస్సుకు చెందిన వారైనప్పటికీ ,మన పరిసరాలలో జరుగుతున్న మార్పులు తీవ్రంగా ఉన్నప్పుడు అవి అందరినీ ఆందోళనకు గురిచేస్తాయి. ప్రత్యేకించి, కరోనా అంటువ్యాధి, దాని పరిణామాలు స్పష్టంగా తెలియకపోవటం , వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతూ ఉండడం , ఇంకా మరణాల రేటు పెరుగుతూ ఉండటం కూడా ఆందోళన కలిగించడం సహజమే !
ఈ ఆందోళనలు అనేక రకాలుగా బయటపడవచ్చు . యధాలాపంగా ఉండటమూ , ఆహారం సరిగ్గా తినకపోవడం, తగినంత నిద్ర పో లేకపోవటం , ఇంకా భయంకరమైన , ఆందోళన కలిగించే కలలు నిద్రాభంగం చేయడమో , అదేపనిగా తమ గురించి తమ బంధు మిత్రుల గురించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించి తీవ్రమైన మానసిక వత్తిడి కి గురౌతూ ఉండడం కూడా జరుగుతుంది. చీటికీ మాటికీ అంటే స్వల్ప విషయాలకే , చీకాకు పడుతూ ఉండడం , ఉద్రేకం చెందడం , నిరాశా నిస్పృహ లకు లోనవడం లాంటి లక్షణాలు కూడా గమనించ వచ్చు.
ఈ లక్షణాలు మూడు వారాల కన్నా ఎక్కువ గా కనుక ఉంటే అది కుంగుబాటు గా మారవచ్చు . అంటే క్లినికల్ డిప్రెషన్. ఈ క్లినికల్ డిప్రెషన్ ను కనుక మొగ్గలోనే తుంచి వేయక పోతే , ఆ లక్షణాలు ఉన్నవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు. అంటే, విపరీతంగా బరువు తగ్గిపోవడం తాము చదువుతున్న విద్యలో ఏకాగ్రత కోల్పోవడం జరగవచ్చు, లేదా ఉద్యోగస్తులు , తాము చేస్తున్న ఉద్యోగంలో తగినంత శ్రద్ధ చూపకుండా పై అధికారుల విమర్శలకు, నిందలకు లక్ష్యం అవ్వచ్చు. ఇవన్నీ ఒక రకం అవుతే, కరోనా లక్షణాల మీద సరియైన అవగాహన లోపించి చిన్నపాటి జలుబు, జ్వరం రాగానే విపరీతంగా ఆందోళన చెంది బాధపడటం కూడా ఇంకొందరిలో కనబడుతుంది.
చిన్నపిల్లల్లో కనపడుతున్న ఆందోళనలను తల్లిదండ్రులు ముందే గమనించి , వారికి తగిన విధంగా సమాధానాలు చెబుతూ ఉండాలి. వారు తీసుకోవలసిన జాగ్రత్తల మీద ఎక్కువ దృష్టి పెడుతూ కరోనా వైరస్ మీద అవగాహన పెంచాలి. ముఖ్యంగా తరచూ చేతులు కడుక్కోవడం, ముఖం మీద అశుభ్రమైన చేతులు పెట్టకొకపోవడం, ఇంకా గుంపుల లోనూ సమూహాల లోను ఎక్కువగా తిరగకపోవడం లేదా ఆడకపోవటం లాంటి జాగ్రత్తలను తల్లిదండ్రులు వారికి విడమరచి చెప్పాలి. అంతేకాకుండా వారితో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయాలి. ఇక యవ్వనులు కూడా లాక్ డౌన్ విధించటం మూలంగా వారి వివిధ కార్యక్రమాలు కేవలం ఇంటికే పరిమితమవ్వడం వలన ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్లో ఉపయోగించడము లేదా అతిగా తినడం నిద్రపోకుండా కంప్యూటర్ గేమ్స్ ఆడటం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో గేమ్స్ ఆడటం ఇంకా జూదం లేదా ఆన్లైన్ బెట్టింగ్ చేయటము కూడా యవ్వన వయస్కులలో అనేక రెట్లు ఎక్కువ అయినట్టు పరిశీలనలు తెలుపుతున్నాయి.
అంతే కాకుండా , కరోనా అంటువ్యాధి సమయానికి ముందే మానసిక సమస్యలతో , లేక మానసిక వ్యాధులతో ( అంటే కుంగుబాటు లేదా డిప్రెషన్ , ఇంకా స్కిజోఫ్రీనియా , మ్యానియా అంటే పిచ్చి లాంటివి ) సతమవుతున్న వారి వ్యాధులు ఇంకా ఉధృతం అయే ప్రమాదం కూడా ఉంటుంది , ఈ కరోనా కాలం లో . వారికి కరోనా వ్యాధి అంటక పోయినా కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !