
క్రితం టపాలలో ఆల్కహాల్ పాయిజనింగ్ జరిగిన వ్యక్తులలో , పాయిజనింగ్ లక్షణాలు ఏమిటో ,ఆ లక్షణాలు గమనించాక , చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు అలాంటి అత్యవసర పరిస్థితులలో, చేయకూడని పనులేంటో కూడా తెలుసుకుందాం !
1. అతిగా తాగి నిద్ర పోతున్న వారిని నిద్ర పోనీయకూడదు ! అట్లా వారి ఖర్మ కు వారిని వదిలి వేయకూడదు . ఎందుకు ? : అతిగా తాగిన వారిలో మొదట ఆల్కహాల్ వారి కడుపు లో ఉండి నిదానం గా రక్తం లో కలుస్తూ ఉంటుంది ! అంటే , వారు మత్తు గా ఉండి నిద్ర పోతున్న సమయం లో కూడా , వారి రక్తం లో ఆల్కహాల్ శాతం క్రమేణా ఎక్కువ అవుతూ , ప్రమాదకర స్థాయి కి చేరుకుంటుంది . అప్పుడు వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే , వారి ని అత్యవసర చికిత్స ఉన్న ఆస్పత్రి కి చేర్చాలి .
2. వారికి కాఫీ ఇవ్వకూడదు , ఎందుకు ? : కాఫీ తాగడం వల్ల , డీహైడ్రేషన్ అయి, మెదడు కణాలు శాశ్వతం గా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది .
3. వారిని ఎప్పుడూ వాంతి చేసుకోమని ప్రేరేపించ కూడదు . ఎందుకంటే , క్రితం టపాల లో చెప్పుకున్నట్టు , వారిలో మింగడానికి అవసరమయే కండరాలు పని చేయక , వారి వాంతి వారి ఊపిరి తిత్తులలో ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ఆ పరిస్థితిని చోకింగ్ అంటారు (choking ).
4. వారిని ఎప్పుడూ నిలబెట్టి , ఎవరి సహాయం లేకుండా నడప కూడదు. ఎందుకు ?: రక్తం లో ఎక్కువైన ఆల్కహాల్ మెదడులో చేరి , సహజం గా నడక లో ఉండే సమతుల్యం అంటే బాలన్సు ( balance ) జరగక , వారు క్రింద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది .
5. ఎప్పుడూ వారిని చల్ల నీటి క్రింద ఉంచడం కానీ , వారి మీద చల్లటి నీటిని పోయడం లేదా చల్లడం గానీ చేయకూడదు . ఎందుకు ? : ఆల్కహాల్ మితి మీరి తాగడం వల్ల వారి ఉష్ణోగ్రత అప్పటికే తగ్గి పోయి ఉంటుంది . ఆ పైన చన్నీటిలో వారి దేహాన్ని తడిపితే , ఉష్ణోగ్రత ఇంకా తగ్గి , హైపోథర్మియా అనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది !
6. వారికి ఇంకా ఆల్కహాల్ త్రాగడానికి ఇవ్వకూడదు . ఎందుకు ?: అట్లా చేస్తే వారి రక్తం లోని ఆల్కహాల్ ప్రమాదకర శాతానికి చేరుకొని ప్రాణాలు పోవచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు .
మీకున్న ప్రశ్నలూ , సందేహాలూ తెలియచేయండి !