8. ఆస్త్మా నివారణ చర్యలు ఏమిటి ?
ఆస్త్మా ఎటాక్ లను నివారించడానికి , తల్లి దండ్రులు కానీ , లేదా ఆస్త్మా ను అనుభవిస్తున్న వారు కానీ చేయవలసినది చాలా ఉంది ! ఆ పని కష్టమైనది కాక పోయినప్పటికీ , శ్రద్ధ గా ఆ జాగ్రత్తలను తీసుకుంటే , ఆస్త్మా ఎటాక్ లు చాలా వరకూ నివారించు కోవచ్చు ! దానితో జీవితం లో క్వాలిటీని అనుభవించ వచ్చు , రోగ గ్రస్తులు గా విచారం గా జీవితం సాగదీయడం కన్నా ! మరి ఆ జాగ్రత్తలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం !
1. ఆస్త్మా ట్రిగ్గర్ లను నివారించుకోవడమూ , లేదా సాధ్యమైనంత వరకూ తగ్గించుకో వడమూ చేయాలి.
a . పరిసరాల లో ఉండే గాలి స్వచ్చం గా ఉంచుకోవడం : మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎంతగా నియంత్రించు కుంటే అంత ఆస్త్మా ను నివారించుకోవచ్చు !మరి ఏవి పడుతున్నాయో , ఏవి పడడం లేదో ఎట్లా తెలుసుకోవడం ? : ఆస్త్మా డైరీ ని ఏర్పరుచుకోవడం : అంటే, కనీసం ఆరు నెలలు కానీ, ఒక సంవత్సరం కానీ ఆస్త్మా వస్తున్న వారు, వారి రోజువారీ దిన చర్య ను ఒక నోటు పుస్తకం లో రాసుకుంటూ ఉండాలి ! అంటే వారు ఆస్త్మా తో ఎట్లా యాతన పడుతున్నదీ రాసుకో మని కాదు కదా ! కానీ ఆస్తమా వస్తున్న రోజులలో ఎటాక్ తీవ్రత ఎంత ఉందీ , అట్లా ఎటాక్ రావడానికి , వాతావరణం లో కానీ , వారు నివసించే ప్రదేశం లో కానీ , వారి బట్టలలో ,లేదా వారి ఆహార పానీయాలలో కానీ ఏవిధమైన మార్పులు కలిగాయో , వివరం గా రాసుకుంటే , ముందు ముందు , ఆ యా ట్రిగ్గర్ లను నివారించుకో డానికి ఆ డైరీ ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది !
b . ఎలర్జీ లను నివారించుకోవడం : పైన చెప్పిన విధం గా ఆస్త్మా డైరీ ను కనుక రాసుకుంటే , ఆ యా ఎలర్జీ కలిగించే పదార్ధాలను కానీ , వాతావరణాన్ని కానీ నివారించుకోవచ్చు.
c . చల్లటి గాలి : కొందరికి బయట కానీ , ఇంట్లో కానీ , చల్లటి గాలి తగిలినా , ఆస్త్మా ఎటాక్ వస్తుంది. అది తెలుసుకున్న వారు చల్లటి గాలి వస్తున్న రెస్టారెంట్ లలో కానీ సినిమా హాల్స్ లో కానీ ప్రవేశించక పోవడం మంచిది !అదే విధం గా సరి అయిన గాలీ వెలుతురూ లేని ప్రదేశాలలో , ముఖ్యం గా సూర్య రశ్మి సోకని ప్రదేశాలూ , ఇళ్ళ లో , ఆస్త్మా కారకమైన క్రిములే కాకుండా , విష పూరితమైన ఫంగస్ లు కూడా పెరిగి వాటి స్పోరులు అంటే పుప్పొడి , ( మన కళ్ళకు సామాన్యం గా కనిపించని పుప్పొడి రేణువులు ) కూడా ఆస్త్మా కలిగించే ఎలర్జన్ అయి , తరచూ ఆస్త్మా ఎటాక్ కలిగిస్తుంది ! అందువల్ల అట్లాంటి ప్రదేశాలలో కూడా సమయం గడపడం మంచిది కాదు ఆస్త్మా ఉన్న వారికి , ప్రత్యేకం గా ! కుక్కలూ , పిల్లులూ , పావురాలూ ఇతర పక్షులూ పెంచుకునే వారి ఇళ్ళ లో ప్రవేశించడం కూడా , ఆస్త్మా ఎటాక్ కోరి తెచ్చుకోవడమే !
d . ఫ్లూ వైరస్ నుంచి దూరం గా ఉండడం !: ఫ్లూ , ఇంకా ఇతర వైరస్ ల ఇన్ఫెక్షన్ లు కనుక సోకితే , ఊపిరితిత్తులు బలహీన పడడం జరుగుతుంది ! చిన్నారులలో ముఖ్యం గా ఈ రకమైన ఇన్ఫెక్షన్ లు చాలా ఇబ్బంది పెట్టి , వారి పెరుగుదల కు కూడా అవరోధం గా మారుతాయి ! టీకా లు వేయించుకునే అవకాశం ఉన్న చోట , క్రమం తప్పకుండా , ఆ టీకాలు వేయించాలి , ప్రత్యేకించి చిన్న పిల్లలకు వేయించాలి తలిదండ్రులు !
e . సైనుసైటిస్ : ముఖం లో ఉన్న ఎముకల లోపల ఉన్న గాలి అరల లో కనుక ఇన్ఫెక్షన్ సోకితే , దానిని అశ్రద్ధ చేయక , తగిన యాంటీ బయాటిక్స్ తో చికిత్స చేయించుకోవాలి లేక పొతే , తరచూ ఆ ప్రదేశాలలో ఉన్నవ్యాధి కారక క్రిములు , ( అవి సామాన్యం గా బ్యాక్టీరియా లు ) ఊపిరితిత్తులలో చేరి ఆస్త్మా కారకం అవుతాయి !
f . పొగ : వివిధ రకాలైన పొగలు ఊపిరితిత్తులను ఇరిటేట్ చేసి ఆస్త్మా కారకం అవుతాయి ! పొగ లలో ముఖ్యం గా పొగాకు తాగడం వల్ల వచ్చే పొగ, వాహన కాలుష్యం వల్ల వచ్చే పొగలు , ఇంకా ఇంట్లో వంట సమయాలలో వచ్చే పొగలు ( కట్టెల పొయ్యి మీద వంట చేసే సమయం లో వచ్చే పొగ లాంటి పొగలు ) వీటిని చెప్పుకోవచ్చు !
g . పరిమళాలు కూడా ! మనసు ను పరిమళింప చేసే , వివిధ సహజ సిద్ధమైన పుష్పాల పరిమళాలే కాక , కృత్రిమం గా వచ్చే సెంటు , పర్ఫ్యూమ్ పరిమళాలు కూడా పడకపోతే , ఆస్త్మా కు కారణమవుతాయి ! మనసును ఆనందం గా వికసింప చేసే పరిమళాలు కూడా , పడక పొతే , ఊపిరి గొట్టాల ను కుంచింప చేస్తాయి ! అంటే , ఆ సున్నితమైన నిర్మాణాలు కుంచించుకు పోయి ఆస్తమా కు కారణమవుతాయి ! ( గమనించ వలసినది , పరిమళాలు పడని వారిలోనే ఆస్త్మా కు కారణమవుతాయి )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !