Our Health

Archive for the ‘మానసికం’ Category

పని సూత్రాలు.8. పని లో ఆనందం !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 22, 2013 at 6:54 సా.

పని సూత్రాలు.8. పని లో ఆనందం ! 

వంద శాతం అంకిత భావం తో పని చేయడం వల్ల  ఉండే ఉపయోగాలు క్రితం టపాలో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు పని లో ఆనందం విషయం చూద్దాము ! చాలా మంది, ” ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాము రా బాబూ ( చంద్ర బాబు కాదు ! ) ”  అనుకుంటూ, ఆఫీసుకు కానీ పని చేసే చోటకు కానీ వచ్చిన దగ్గర నుండి , గడియారం లో ముల్లులను ఆత్రుతతో గమనిస్తూ , సరిగా అయిదు అవగానే ( చాలా సమయాలలో ఇంకా ముందు గానే ) ఇంటికి ఉరికే పని లో ఉంటారు.  వారి ఉద్యోగాన్ని వారు ఇష్ట పడరు. ఏదో నిమిత్త మాత్రం గా , యాంత్రికం గా తమ పని చేసి బయట పడతారు ! 
చేస్తున్న పనిని ఇష్ట పడుతూ చేసే వారికి, పని లో కష్టం తెలియదు ! వారి దృష్టి అంతా  మనస్పూర్తి గా ఆ పని చేయడం మీదనే లగ్నమై ఉంటుంది కనుక ,ఆ పని సులువు అవుతుంది. వారికి పని వల్ల  కలిగే వత్తిడి చాలా తగ్గుతుంది. వారు ప్రశాంత చిత్తం తో పని చేస్తూ ఉంటారు కూడా ! వారు చేస్తున్న పని ప్రశాంతం గా పారుతున్న ఏరు లా ఉంటుంది అంటే ఫ్లో అన్న మాట ! పాజిటివ్ సైకాలజీ లో కూడా ఇట్లా పని ని ఇష్ట పడుతూ చేయడం వల్ల  అనేక లాభాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా ! ( బాగు ఆర్చివ్ లలో చూడండి, పాజిటివ్ సైకాలజీ గురించి వివరించడం జరిగింది ! ). 
ప్రతి ఒక్కరి జీవితం లోనూ అనేక కష్టాలు ఉంటాయి , నష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. ఉత్తేజాలు ఉంటాయి ! అత్భుతాలు కూడా ఉంటాయి ! మరి జీవితాన్ని ఇష్టం లేకుండా గడప లేము కదా !  ప్రతికూల క్షణాలు ఎదురవగానే తాత్కాలికం గా ఏర్పడిన అయిష్టతా భావాన్ని , మనం మన జీవితాంతం అన్వయించు కోలేము కదా !  అతి విలువైన జీవితాన్ని , ఆస్వాదిస్తూ , ఇష్టత తో జీవించడం అలవాటు చేసుకుంటాం కదా ! అదే విధం గా మనం చేసే పని ని కూడా ఇష్ట పడుతూ చేస్తూ ఉంటే ,అది మన శారీరిక , మానసిక ఆరోగ్యానికీ , ఆనందానికీ చాలా మంచిది.  ఒక పరిశీలన ప్రకారం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు ఆ తరువాత రెండు సంవత్సరాలకే , కుమిలి పోతూ , అనారోగ్యాన్ని , చాలా తరచుగా తమ ప్రాణాలకూ ముప్పు తెచ్చుకుంటున్నారు అని తెలిసింది. తాము ఎంతో  ఇష్ట పడుతూ చేసే ఉద్యోగం నుంచి రిటైర్ అవడం తో వారికి వచ్చే చిక్కులు అవి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , వారు వారి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వారి ఉద్యోగాలు వారి ( ఆరోగ్యాని ) కి రక్షక కవచాలు గా పనిచేస్తాయన్న మాట ! 
ప్రతికూలత లు లేని జీవితం ఎట్లా చప్పగా ఉంటుందో , సమస్యలు లేని  ఉద్యోగం కూడా అట్లాగే ఉంటుంది. కొంత మేర మీరు చేసే పని లో చాలెంజ్ ఉంటే, అది మీకు స్ఫూర్తి  నిస్తుంది.  ఒక క్రమ పధ్ధతి లో మీరు మీ శక్తి సామర్ధ్యాలతో , పాజిటివ్ దృక్పధం తో ఆ చాలెంజ్ లను అధిగమిస్తే, మీలో పరిపూర్ణతా , పని చక్కగా చేయ గాలుగుతున్నాననే గర్వం  తొ ణికిస  లాడుతూ ఉంటాయి !  అందుకే మీరు చేసే ఏ  ఉద్యోగం అయినా , పని అయినా  ఇష్ట పడుతూ చేయడం అలవాటు చేసుకోండి ! అట్లాగని మీ హృదయం మీద రాసుకోండి. అప్పుడు మీ మనసూ ( అంటే మెదడూ ) , హృదయమూ కూడా ఆరోగ్యం గా ఆనందం గా ఉంటాయి ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు.7. వంద శాతం-అంకిత భావం !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 21, 2013 at 6:54 సా.

పని సూత్రాలు.7. వంద శాతం –  అంకిత భావం ! 

 
పని సూత్రాలలో ఒక ముఖ్యమైన సూత్రం: మీరు చేసే పని లో , అది ఎక్కడైనా , ఎట్లాంటి ఉద్యోగం అయినా , అందులో మీరు వంద శాతం అంకిత భావంతో పని చేయడం నేర్చు కోవాలి ! పని లో అంకిత భావం మీరు మొదటి నుంచీ నేర్చుకుంటే అందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ! మీరు చేసే పనిని సమర్ధ వంతం గా చేయ గలగటమే కాకుండా,  ఆ పనిలో మీరు పడే శ్రమను పని చేసే సమయం లో మరచి పోవడం కూడా జరుగుతుంది. కానీ సత్ఫలితాలు మాత్రం మీవే !  
మీరు పని సూత్రాలను తు. చ. తప్పకుండా పాటించే ట్టయితే, మీకు పని లో అంకిత భావం తప్పని సరిగా ఉండాలి. మీరు మీ దీర్ఘ కాలిక లక్ష్యాల మీద తదేకం గా దృష్టి ఉంచాలి. దీనిని ఒక చిన్న ఉదాహరణ తో చెప్పుకొవచ్చు. మీరు స్కూటర్ మీద కానీ , కారు లో కానీ , లేదా సిటీ బస్సు లో కానీ , లేదా రైలు లో కానీ , ఒక ఇరవై మైళ్ళు ప్రయాణం చేసి, ఇంకో చోటు కు వెళ్ళాలను కోండి. మీ గమ్యం చేరుకోడానికి మీ దారి లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా , మీరు పట్టించుకోరు. ఒక వేళ చాలా కష్టం గా ఉన్నా బస్సులో ఇబ్బంది పడుతూ కూడా, కొన్ని సమయాలలో ప్రయాణ మంతా కూడా నిలుచునే ఉన్నా న్నా పరవాలేదనే మనస్తత్వం తో మీ గమ్యం చేరగానే బాగా రిలీఫ్ ఫీలవుతూ బస్సు బయటకు ఒక్క సారి గా వచ్చి మీ షర్ట్  పై బటన్స్ తీసుకుని ఒక్క సారిగా ఓపెన్ ఎయిర్ లో మీ ఉపిరి తిత్తులను నింపుకుని, మీరు వెళ్ళ  వలసిన చోటుకు చేరుకుంటారు ! అట్లాగే మిగతా వాహనాలలో కూడా వాటి వాటి ప్రతి కూలత లు ఉన్నా కూడా ఏవీ పట్టించుకోరు , గమ్యం వైపు మీ దృష్టి ఎప్పుడూ ఉంటుంది !  
అట్లాగే మీరు పనిని అంకిత భావం తో చేస్తూ, మిగతా వారిని పట్టించుకో కూడదు ! కొందరు ఆఫీసు లో నిద్ర పోతూ ఉంటారు , ఇంకొందరు వారి ఉద్యోగాన్ని కేవలం వారి ఆఫీసు దగ్గర ఉన్న కాఫీ హోటల్ లో చేస్తూ ఉంటారు !  ఇంకొందరు ఆఫీసు కు వచ్చి, అటెండెన్స్  రిజిస్టర్ లో  సంతకాలు చేసి  చెప్పా పెట్టకుండా బయటకు జారుకుంటారు ! వారితో మీరు మిమ్మల్ని ఎప్పుడూ పోల్చుకో కూడదు ! మీరు మీకు ఇచ్చిన పనిని అంకిత భావం తో చేయాలి ! ఎందుకంటే , మీ గమ్యం మీ ఆఫీసు దగ్గర ఉన్న కాఫీ హోటల్ కాదు కదా !   మీ లక్ష్యం  కూడా ఘనమైనది ! అది మీకు మాత్రమే  తెలుసు !  మీకు, మీరు చేసే ఉద్యోగం, కేవలం మీ జీవిత లక్ష్యానికి చేరుకునే ఒక వాహనం మాత్రమే ! అందువల్ల మీరు ఆఫీసులో  మీరు పని చేస్తునంత కాలమూ, ఏ పొర పాటూ చేయకుండా, మీ తరువాతి గమ్యం చేరుకోవడమే !మీ తరువాతి గమ్యం, మీరు పని చేసే  ఆఫీసు లోనే ఉండవచ్చు ( అంటే ప్రమోషన్ ) లేదా ఇంకో చోట , ఇంకో ఉద్యోగం కావచ్చు !  ఎక్కడైనప్పటికీ  మీ గమ్యం కేవలం కాఫీ హోటల్ మాత్రమే  కాదు కదా !  
ఇట్లా వంద శాతం అంకిత భావం తో పని చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ? అని ప్రశ్నించుకుంటే , దానికి సమాధానం తప్పని సరిగా ఉంటుందని చెప్ప  వచ్చు ! మీరు చేసే పని మీకు సులువు అవుతుంది. అంతే  కాక మీరు మీ పని మీరు చేసుకుంటూ, మిగతా వారు పని చేయకుండా, కాల యాపన చేస్తూ ఉండడం పరిశీలించండి !  మీకు అది హాస్యాస్పదం గానూ , వినోదం గా కూడానూ ఉంటుంది ! ఎందుకంటే , మీరు గంభీరం గానూ ఆత్మ  విశ్వాసం తోనూ , హుందా గానూ ,నిశ్శబ్దం గానూ , ముందుకు పోతూ ఉన్నారు ! మిగతా వారిలా కాకుండా !  
కేవలం అంకిత భావమే కాకుండా , మీరు మీ పని లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నపుడు , జాగరూకత తోనూ , అప్రమత్తత తోనూ , ఉత్సాహం తోనూ , సంసిద్ధత తోనూ చేయడం నేర్చుకుంటే , మీరు చేసే ఉద్యోగమే కాకుండా ,  మీ భావి జీవితం లో మీరు చేసే ప్రతి పనీ , మీకు అదే విధం గా చేయడం అలవాటు అవుతుంది ! ఆ గొప్ప అలవాటు తో మీరు మిగతా వారికన్నా , అనేక వందల మైళ్ళ దూరం వెళ్ళ గలరు ! కొన్ని సార్లు వేల  మైళ్ళ దూరం కూడా !  ఈ మాటలను కేవలం మైళ్ళ సంఖ్య తోనే కొలవడానికి ప్రయత్నించ కండి !  ఉద్దేశం,పనిలో మీకున్న అంకిత భావం తో ,   మీరు ఇతరులు అందుకోలేని  ఉన్నత స్థాయి ని చేరుకుంటారని ! 
 
వచ్చే టపా లో ఇంకొక పని సూత్రం ! 

 

పని సూత్రాలు.6. మీదైన ప్రత్యేకతను చూపండి!

In మానసికం, Our minds on ఫిబ్రవరి 20, 2013 at 8:05 సా.

పని సూత్రాలు.6. మీదైన ప్రత్యేకతను చూపండి.

పని సూత్రాలలో ఇంత వరకూ మనం ఒక్కో సూత్రం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ! ఇప్పుడు ఆరో సూత్రం గురించి తెలుసుకుందాం ! 
మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా ,  అక్కడ , కేవలం మీ ఉద్యోగాన్ని సరిగా చేయడమే కాకుండా , ఇతర విషయాలలో కూడా మీరు జిజ్ఞాస పెంపొందించు కుని, ఒకటో రెండో విషయాలలో మంచి పట్టు సాధించ గలిగితే , అది మీ పురోగతి కి బాగా దోహద పడుతుంది. అంతే  కాక మీరు ఇతర విషయాలను మీ ఆప్షనల్స్ గా పరిగణించి, ఉత్సాహం తో ” ఒక పట్టు” పట్టి , వాటిలో మీరు నిపుణత సాధిస్తే , అది మీకు ఆనంద దాయకం గా కూడా ఉంటుంది, మీరు పని చేసే చోట , మీ మేనేజర్ ను కూడా మీరు మీ ప్రత్యేకత తో    మిమ్మల్ని అభినందించే పరిస్థితి కలిగించ వచ్చు. 
ఉదాహరణకు :  ఉదయ్ ఒక  సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తన పని ని తాను అత్యుత్సాహం తో చేస్తాడు. పట్టుదలతో ప్రాజెక్ట్ లు సకాలం లో పూర్తి  చేస్తాడు. సాఫ్ట్ వేర్ రంగం లో వచ్చే తీరు తెన్నులు కూడా  తెలుసుకుంటూ ఉంటాడు ఎప్పటి కప్పుడు.ఏదో సరదాకు ఇంజినీరింగ్ చదివే సమయం లో నే  ఫ్రెంచ్ భాష మీద ఉత్సాహం తెచ్చు కున్నాడు. దానితో పాటుగా  హైదరాబాదు లో ఉద్యోగం చేస్తున్న సమయం లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో సీనియర్ డిప్లొమా పాసయ్యాడు.  తరువాత ఆ సంగతి మర్చి పోయాడు , ఏదో సరదాకు,  అప్పుడప్పుడూ ఫ్రెంచ్ చానెల్స్ చూడడం, కొంత కొంత  ఫ్రెంచ్ ప్రోగ్రాం లు ఫాలో అవడం చేసే వాడు ! తను ప్రస్తుతం ఉద్యోగం చేసే కంపెనీ లో తనలా ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ కనీసం ఒక పాతిక మంది ఉన్నారు. కానీ ఒక్కరికీ ఫ్రెంచ్ రాదు. దానితో ఉదయ్  పరిస్థితి ” రొట్టె విరిగి నేతి  లో పడ్డట్టు గా తయారయింది ”. ప్రాజెక్ట్ ఒకటి ఫ్రాన్స్ నుంచి వస్తే , వాళ్ళ మేనేజర్ యాక్సెప్ట్ చేసి , ఉదయ్  ను  పారిస్ పంపించాడు. అక్కడ కొంత కాలం  ఉండి , ఆ ప్రాజెక్ట్ పూర్తి  చేశాడు ఉదయ్. అంతే  కాక  తన ఫ్రెంచ్ భాష కు ఇంకా పదును పెట్టాడు !  ఇప్పుడు ఉదయ్ తన కంపెనీలో చాలా పాపులర్ ! తన ఉద్యోగం కూడా  ఆ కంపెనీ లో సుస్థిరం అయింది !  మిగతా ఇంజినీర్స్ కొంత మంది ఉదయ్  కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వారికి ఆ అవకాశం రాలేదు ! కేవలం ఉదయ్  ప్రత్యేకత వల్ల ! 
మీరు ప్రత్యేకతలు ఏ  రంగం లోనైనా సాధించ వచ్చు.  కంప్యూటర్స్ లో అంటే సాఫ్ట్ వేర్ ఇంస్ట లేషన్ కానీ , లేదా  హార్డ్ వేర్ విషయాలు కానీ , ఆటల  లో కానీ,  కంపెనీ లా లో కానీ ,యూనియన్  లాస్ లో కానీ , కుకింగ్ లో , బడ్జెట్ లో , ఆడిట్ లో , లేదా ,కార్ మెకానిజం లో ,  సంగీతం లో, ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. 
ప్రవీణ్ ఒక  అకౌంట్స్ క్లార్క్ .  తన కంపెనీ లో ప్రతి ఉద్యోగి కీ రావలసిన జీతం ,  పై అలవెన్సులూ  పైసా పొరపాటు రాకుండా లెక్కలు కడతాడు. ఒక మూడు గ్రూపులు గా తన కొలీగ్స్ తయారయి , అందులో మేనేజ్ మెంటు కు  వ్యతిరేకం గా రెండు గ్రూపుల వాళ్ళు  ప్రవర్తిస్తూ ఉన్నారు !  మేనేజర్ కు ప్రవీణ్ ఒక మాదిరి గా ” గుడ్ బుక్స్ ” లో ఉన్నాడు !  తన పధకాన్ని  వివరించి , మేనేజ్ మెంట్ చేత ఒప్పించి , మూడు గ్రూపుల వాళ్ళనూ , విశాఖ పట్నం పిక్నిక్ కు తీసుకు వెళ్ళాడు !  ప్రయాణం దగ్గర నుంచి, తనే అరేంజ్ చేశాడు ! సెల్ఫ్ కేటరింగ్  తీసుకుని , మిగతా వారితో కలిసి , రుచి కరమైన  ఫుడ్ కూడా వంట చేసి , చేయించి పెట్టాడు. దానితో , ఒక్కొక్కరికీ చాలా చౌక గా , తక్కువ ఖర్చులో , ఎక్కువ ఆనందం కలిగించింది ఆ ట్రిప్పు ! అక్కడకు వెళ్ళిన మూడు రోజుల్లో, ఒక గ్రూపు లో ఉద్యోగులు ఇంకో గ్రూపు వారితో ( ఇట్లా కలిసిన వారిలో వారిలో స్త్రీలూ , పురుషులూ కూడా ఉన్నారు ! ) పాలు నీరు లా కలిసి పోయారు ! వారి లో పరిచయాలు, చనువులూ పెరిగాయి. ప్రతి ఉద్యోగీ , ఆ రోజులను తమ జీవితాలలో ” మరచి పోలేని క్షణాలు ” గా మిగతా అందరికీ చెప్పుకున్నారు.  తిరిగి వెళ్ళాక , అన్ని గ్రూపులూ మాయ మయి , ఒకే గ్రూపు గా తయారయారు వారంతా !  మేనేజరు ప్రవీణ్ ను ” కొత్త అల్లుడి ” లా చూడడం మొదలెట్టాడు , అప్పటి నుంచీ ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 
 
 

పని సూత్రాలు. 5. తక్కువ సమయం లో, ఎక్కువ పని చేయండి.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 18, 2013 at 6:18 సా.

పని సూత్రాలు. 5. తక్కువ  సమయం లో  ఎక్కువ పని చేయండి.

మీ ఆఫీసులో ఒక విషయానికి సంబంధించిన ఫైలు చూడాలంటే లేదా తేల్చాలంటే  , ఒక వారం సరిపోయేట్టు ఉంటే , రెండు వారాల గడువు అడగండి , మీ పై అధికారి నుంచి.అట్లాగే , ఒక  సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం కు ఒక నెల పడితే , రెండు నెలలు సమయం అడగండి. ఈ విధం గా చేయడం మీ బాసును కానీ , పై అధికారిని కానీ మోసగించినట్టు కాదు. ఎందుకంటే , మీరు  అనివార్య కారణాల వల్ల , ఆ పని లో అయ్యే ఆలస్యాలను కూడా దృష్టి లో పెట్టుకుని, అట్లా ఎక్కువ గడువు అడుగుతున్నారని , మీ చర్య ను సమర్ధించు కోవచ్చు. అప్పుడు మీ దూర దృష్టి కి మీ పై అధికారి కూడా  అభినందిస్తాడు మీ పని తనాన్నీ, మీ సామర్ధ్యాన్న్నీ ! మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజ్ మొదలు పెట్టారను కుంటే , మీ కు వచ్చే ఆర్డర్ లకు ఎక్కువ సమయం తీసుకుని,  మీరు చేయ వలసిన పనిని కానీ , లేదా సప్లయి చేయ వలసిన వస్తువులను కానీ ఎక్కువ నాణ్యత గా చేస్తే, వాటి ఫలాలు మీకు చెందుతాయి. అంతే  కాకుండా , మీరు చేయవలసిన పని కూడా ,అడిగిన దానికన్నా  ఎక్కువ గా చేయండి ! ఉదాహరణ కు : మీరు మీ ఆఫీసులో బోర్డ్ మీటింగ్ కోసం ఒక రిపోర్ట్ తయారు చేయాలని ,రెండు వారాల గడువు మీకు ఇస్తే , మీరు ఒక వారం లోనే ఆ రిపోర్ట్  ను పూర్తి  చేయడమే కాకుండా,  అందులో మీరు ఉంచాల్సిన డేటా కన్నా ఎక్కువ గా అంటే భవిష్యత్తు లో మీ కంపెనీ ప్రొజెక్షన్స్ కూడా వివరం గా పొందు పరచడం లాంటి వి చేస్తే , మీ మేనేజర్ మెప్పు పొందగలరు. ఇట్లాంటి విషయాలలో కొంత జాగ్రత్త కూడా మీకు అవసరం ! అంటే మీరు చేస్తున్న ఎక్కువ పని, మీ మేనేజరు కు ” అతి ” గా అని పించకూడదు ! 
కొన్ని సమయాలలో , మిమ్మల్ని చేయమన్న పని  మీకు తెలియదన్నట్టు ” అమాయకత్వం ” ప్రదర్శించితే కూడా , మీ బాసు మెప్పు పొందగలరు ! 
ఉదాహరణ కు:  కిరణ్  ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తాడు. అతని కి జావా ప్రోగ్రాం కొట్టిన పిండి. అంతే  కాకుండా , తన ప్రత్యెక ఉత్సాహం తో , గ్రాఫిక్ డిజైన్ లో కూడా  ప్రావీణ్యత సంపాదించాడు. కానీ తన మేనేజర్ కు ఈ విషయం తెలియదు. అనుకోకుండా , తమ కంపెనీ పాపులారిటీ ద్వారా, గ్రాఫిక్ డిజైన్ కు సంబందించిన ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. మేనేజర్ కిరణ్ ను అడిగాడు. కిరణ్ తెల్ల మొహం వేశాడు, ఎక్కువ గా తెలియదు కానీ ప్రయత్నిస్తానన్నాడు !  సందేహిస్తూ నే మేనేజర్  యాక్సెప్ట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ ( గుడ్ విల్ పోగొట్టుకోవడం ఎందుకు, ఒక వేళ తమ కంపెనీ ఆ ప్రాజెక్ట్ చేయక పోయినా, ఇంకొకరి చేత చేయించి, తాము కొంత కమిషన్ పొందవచ్చనే ఆశతో ) కిరణ్ ఆ ప్రాజెక్ట్ ను తనకున్న అనుభవం తో ( బాస్ కు తెలియదు కదా ! )  అనుకున్న సమయం కన్నా ముందే పూర్తి  చేయడమే కాకుండా  బాగా కూడా చేశాడు ! దానితో , ఆ కంపెనీ కి గ్రాఫిక్ డిజైన్ లో కూడా ఎక్కువ ఆఫర్ లు రావడం మొదలెట్టాయి. దానితో ,  బైక్ మీద ఆఫీసుకు వెళ్ళే కిరణ్ కార్ లో వెళ్ళడం మొదలెట్టాడు ! మేనేజరు  మహా ఆనంద పడిపోతున్నాడు ! 
 
పైన వివరించిన ఈ పని సూత్రాన్ని అండర్ ప్రామిసింగ్ అండ్ ఓవర్ డెలివరింగ్  అని కూడా చెప్పుకోవచ్చు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 

పని సూత్రాలు.4. మీ ఉనికి ని సుస్థిరం చేసుకోండి !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 17, 2013 at 4:45 సా.

పని సూత్రాలు.4. మీ ఉనికి ని సుస్థిరం చేసుకోండి ! 

 
మీరు చేసే ఉద్యోగం లో మీదైన ఒక ప్రత్యేకత ఏర్పరుచుకోవాలి.  అది లేక పొతే , మీరు శాయ శక్తులా కృషి చేయాలి, మీదంటూ ఒక ప్రత్యేకత మీరు పని చేసే ప్రదేశం లో కలిగించడానికి ! 
ఫలానా బట్టల షాపు కు   వెళ్లార నుకోండి !  అక్కడ ఉన్న ఒక  సేల్స్ మాన్ ” రండి పరంధా మ్ గారూ  , చాలా కాలం తరువాత వస్తున్నారు ఇక్కడికి , మీ శ్రీమతి లక్ష్మి గారు బాగున్నారా ? మీ పాప శ్రావ్య బర్త్ డే  కనుకుంటా మీరు ఇక్కడకు వచ్చింది, మీ పాప కే  కాకుండా , మీ ఫ్యామిలీ కంతటికీ న్యూ  ఫ్యాషన్ బట్టలు చాలా కొనుక్కు వెళ్ళారు !   బాగా ఎండలో వచ్చినట్టు ఉన్నారు !  కూల్  డ్రింక్స్ ఎవైనా తీసుకుంటారా?  అని మిమ్మల్ని షాపు లో కి ఆహ్వానిస్తే , మీరు కూల్ డ్రింక్స్ ఏమీ తాగకుండానే ఐ సయి  పోతారు. ” ఎంత బాగా గుర్తుంచుకున్నాడు వీడు, నా వివరాలు !? ” అని ఆశ్చర్య పడుతూ , రుమాలు కొనుక్కోవడానికి వెళ్ళిన వారల్లా ఒక నాలుగు వేల బిల్లు చేసి గానీ ఆ షాపు బయట కు రారు ! మిమ్మల్ని గుర్తు పట్టి , పలకరించిన సేల్స్ మాన్ ను బయటకు ( ఆ ఉద్యోగం వదిలేసి ) వద్దామన్నా , ఆ షాపు ఓనర్ అతడిని బయటకు పంపడు. పని చేసే చోట మీదైన ప్రత్యేకత ఏర్పరుచు కోవడం అంటే అదే ! నిజానికి ఆ షాపు లో, బట్టలు కొనడానికి వచ్చిన వారి తో ఆ విధం గా పలకరించాలనీ, ఆహ్వానించాలనీ, నిబంధన ఏదీ లేదు ! అందుకే మిగతా సేల్స్ మెన్ అంతా ,షాపు లో కి వచ్చిన వారితో , ఇవేమీ మాట్లాడకుండా, వారు వారికి ఇష్టమైనవి కొనుక్కుంటే , చూస్తూ ఉంటారు.  అందుకే , వారికి మొదటి సేల్స్ మాన్ అంత  జీతం లోనూ ప్రమోషన్ ల లోనూ ‘ఎదుగుదల ‘ ఉండదు !  
మీ ఉనికిని సుస్థిరం చేసుకోవడం అంటే , మీ వర్క్ ప్లేస్ లో మిగతా ఉద్యోగులు ఎవ్వరూ చేయని పనులు మీరు సమర్ధ వంతం గా చేసి , మీ బాసు మెప్పు పొందడమే !అంతే కాక, మీరు చేసే ‘ ప్రత్యెక మైన’ పనుల ద్వారా మీరు కేవలం మీ బాసు దృష్టి లోనే కాక , మీ ఇతర ఉద్యోగుల గుర్తింపు కూడా పొందుతారు. ఇట్లా చేయడం అంత  సులభం కూడా కాదు ! మీరు  పని చేసే చోట, పరిస్థితులు చక్కగా పరిశీలించాలి ! అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయో ? అక్కడ లోపాలు ఏమైనా ఉన్నాయో లేదో , ఆ లోపాలను మీరు ఎట్లా సరి దిద్ద గలరో , ఈ విషయాలు క్షుణ్ణం గా  పరిశీలించి , మీరు పరిష్కార మార్గాలు సూచించడమో లేదా చేయడమో చేయాలి. అంతే  కాక , ఆ మార్గాలు సులభమైనవి గానూ , ఆర్ధికం గా మీ సంస్థ కు లాభదాయకం గానూ ఉండాలి ! అప్పుడే , మీరు మీ బాసు మెప్పు పొందగలిగేది !  ప్రమోషన్లు పొంద గలిగేది !  వీటన్నిటికీ , మీ ఏకాగ్రతా , సునిశిత దృష్టీ , దూర దృష్టీ , శ్రమా , అన్నీ కూడా సమ పాళ్ళ  లో ఉంటే ,  మీ పురోభివృద్ధి కి ,అవి ఎంత గానో తోడ్పడతాయి !  మీరు మీ ఉద్యోగ జీవితం ప్రారంభ దశ లో ఉన్నప్పుడే ఈ అలవాట్లు ఏర్పరుచుకుంటే,  మీ జీవితం లో అవి మిమ్మల్ని చాలా , చాలా దూరం తీసుకు వెళతాయి ! 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !  
 

పని సూత్రాలు.3. ఇంకొకరి పని మీరు చేయ వచ్చా ?

In మానసికం, Our minds on ఫిబ్రవరి 16, 2013 at 12:30 సా.

పని సూత్రాలు.3. ఇంకొకరి పని మీరు చేయ వచ్చా ?

 
వర్క్ ప్లేస్ లో సామాన్యం గా ఇతర కొలీగ్స్ లీవ్ మీద ఉన్నప్పుడు కానీ, వారు ఆకస్మికం గా ఇతర కారణాల వల్ల , డ్యూటీ కి రానప్పుడు , అత్యవసర చర్య గా మీరు ,వారి జాబ్ ను కవర్ చేయడం జరుగుతుంది.ఆఫీసులలో, కొంతమంది చాలా ఉదారం గా ఉంటారు. వారు వారి కొలీగ్స్ ఉద్యోగానికి వచ్చినా , వారి పనులు కొన్ని చేసి వారికి ” ఉపకారం ” చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి , ఆఫీసులో యువతులు ఉన్నప్పుడు, పురుషులు చాలా స్నేహ పూర్వకం గా , ఉంటూ , వారి ఉద్యోగం లో సహాయం చేస్తూ ఉంటారు. ఇంకొందరు, ఇంకొంత ముందుకు పోయి , వారు మూడవ తరగతి , నాల్గవ తరగతి కి చెందిన ఉద్యోగాలు చేస్తూ కూడా , ఆ ఆఫీసులో వారికి తెలియనిది ఏదీ లేదన్న ధీమా తో ఉంటారు. ప్రతి ఉద్యోగి విధులలో ” వేలు ” పెడుతూ ఉంటారు. వారి పైన ఉన్న ఉద్యోగులకు కూడా  సలహాలు ఇస్తూ ఉంటారు. అవసరం లేక పోయినా ప్రతి వారికీ సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అత్యుత్సాహం తో అందరికీ , అన్ని విధాలా సహాయం చేసే వారు, చాలా సమయాలలో ఏ  విధమైన గుర్తింపూ లేకుండా , ఎదుగు దల కూడా లేకుండా ఉంటారు. ఒక సారి ఆఫీసు అంతా , వారి పేరు ( అందరికీ సహాయం చేస్తుంటాడని ) తెలిస్తే , వారిని బాగా ‘ ఉపయోగించుకోడానికి ‘ చూస్తూ ఉంటారు. వారి విలువ కూడా కోల్పోతారు ! అందుకనే వీరు, ఇతరుల పని చేసే ముందు ప్రతి సారీ, ఆత్మావలోకనం చేసుకోవాలి. 
1. ఆ పనిని తనను ఎందుకు చేయమంటున్నారు?
2. ఆ పని , ఇతరుల కోసం చేయడం లో తన లాభం ఎంత మాత్రం ఉంది ?
3.ఇతరులకు ఆ పనిని తను చేసి పెట్టడం వల్ల , ఆఫీసు హెడ్ దృష్టి లో తన మీద అభిప్రాయం ఎట్లా ఉంటుంది?
4.తాను ఆ పని చేయక పొతే ఏమవుతుంది ?
5. ఆ పని ని తననే చేయమనడం లో ఉద్దేశం, ఆ పనిని డర్టీ  జాబ్ అని మిగతా అందరూ ముట్టుకోక పోవడం వలననా ?
6. లేదా ఆ పనిని తనను చేయమంటున్న వారు నిజం గానే పని వత్తిడి ఎక్కువ గా ఉండి, తన సహాయం కోసం అర్ధిస్తూ ఉన్నారా?
ఈ ప్రశ్నలన్నిటినీ వేసుకుని , సమంజసమైన సమయాలలోనే , ఇతరులకు సహాయం చేయడానికి పూనుకోవాలి.  ఒక సారి వారికి సహాహాయం చేశాక , వారి ప్రవర్తన తమ తో ఎట్లా ఉంది, వారు మళ్ళీ మళ్ళీ తనను ” వాడుకోవడానికి చూస్తున్నారా ? ” అని కూడా పరిశీలించుకోవాలి ! ఈ రకమైన ఆలోచనా ధోరణి ఏర్పరుచు కోవడం వల్ల ,  వారు ” అడ్డ మైన గాడిద చాకిరీ ” చేసే పరిస్థితిని మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించుకోగలరు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు ! 

పని సూత్రాలు.2. కదలిక కీలకం !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 14, 2013 at 7:36 సా.

పని సూత్రాలు.2. కదలిక కీలకం ! 

చాలా మంది ఉద్యోగం లో చేర గానే , ఉదయమే ఉద్యోగానికి వెళ్ళడం , అక్కడ ఉన్న పని ఏదో అల్లా టప్పా గా చేయడం , నాలుగున్నర అవుతుండ గానీ మళ్ళీ , ఇంటి కి బయలు దేరే ప్రయత్నాలు చేయడం , చేస్తూ ఉంటారు. వారికి , ఉద్యోగం  ఒక గమ్య స్థానం అవుతుంది.
కానీ  జీవిత గమ్యస్థానాలకు , అంటే వారి జీవితాలలో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకావాలనుకునే వారికి , ఉద్యోగం ఒక సాధనం అవుతుంది. వారు , వారి వారి బాధ్యతలను ( వారి ఉద్యోగాలలో ) సరిగా నిర్వర్తించడమే కాకుండా , ఉద్యోగాన్ని , అనుకున్న సమయానికి ముందు గా నే పూర్తి  చేసి , మిగతా సమయాన్ని , ” ముందుకు ” పోయే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అంటే వారి ఉద్యోగం, అంత వరకూ చేసి , పదోన్నతి పొందిన వారి తో పరిచయాలు పెంచుకుంటారు. స్నేహాలు చేస్తారు. వారు ఏ  విధం గా పదోన్నతులు పొందుతున్నారో , ఏ యే  మార్గాలు అనుసరిస్తున్నారో , శ్రద్ధ గా తెలుసుకుంటారు !  ప్రమోషన్ల కిటుకులు తెలుసుకుంటారు !  వారి పని వారు చేస్తూనే , ఒక కన్ను తరువాతి అవకాశాల కోసమూ , ఆ ఉద్యోగం లో  తాము పొందే లాభాల మీదా వేసి ఉంచుతారు ! 
ఉద్యోగం ఒక గమ్య స్థానం అనుకునే వారు, వారి జీవితమే ధన్యమైందని అనుకుంటారు. కొంత వరకూ అది నిజమే కదా , నిరుద్యోగులు గా ఉండడం కంటే ! కానీ వారి అపారమైన శక్తి సామర్ధ్యాలను ఒకే స్థానం లో , ఒకే ఉద్యోగం లో వృధా చేస్తూ ఉంటారు ! వారికి  కదలిక ఉండదు అంటే మూవ్ మెంట్ ఉండదు!  సాహస మనస్తత్వం ఏర్పడదు ! బెరుకు గా పిరికి గా ఉన్న చోటునే ఉండి , పరిస్థితులతో రాజీ  పడడం  అలవాటు చేసుకుంటారు ! 
ఎప్పుడూ పారే ఏరు ప్రశాంతం గా నూ , గంభీరం గానూ , నిశ్శబ్దం గానూ , ఉంటుంది. అందులో నీరు కూడా తాజా గా ఉంటుంది. జీవం ఉంటుంది. నిలకడగా ఉన్న సరసు లో తాజా తనం ఉండదు ! నాచు మొక్కలు పెరుగుతాయి. అందుకే, ప్రతి వ్యక్తి కీ, కదలిక కీలకం ! 
‘దూరపు కొండలు నునుపు’ అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, వచ్చిన  అవకాశాలను వినియోగించుకోక ,  ఆత్మ సంతృప్తి చెంద  లేక , పరిస్థితులతో రాజీ పడ లేక నిరంతరం ఘర్షణ చెందే యువతీ యువకులు కూడా చాలా మంది ఉన్నారు ! వారి ఆ పరిస్థితి కాల క్రమేణా , తీవ్రమైన అసంతృప్తి  గా మారి ,వారి లో ప్రశాంతతను దూరం చేసి, అలజడి రేపుతుంది. అదే సమయం లో వారు రాజకీయ నాయకుల చేతులలో పావులు గా మారుతారు.  తమదైన , సహజమైన , ఇంకా   ప్రభావ శీలమైన వ్యక్తిత్వాలను కోల్పోతారు !  ఆత్మ న్యూనతా భావాలు ఎక్కువ చేసుకుంటారు !   ! అందుకనే , వారు సరి అయిన సమయం లో సరి అయిన నిర్ణయాలు తీసుకొని , పురోగమించడానికి తమ  శక్తి యుక్తులా ప్రయత్నాలు చేయాలి !
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 1. పనితనం నేర్చుకోండి !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 13, 2013 at 9:04 సా.

పని సూత్రాలు . 1. పనితనం నేర్చుకోండి ! 

మీరు ఏ  ఉద్యోగం లో చేరినా , చేయ వలసిన ప్రధమ కర్తవ్యం , పని నేర్చుకోవడం !  మీరు చేస్తున్న పనిలో ఎంత నైపుణ్యం చూపిస్తే, మీరు అంత  అభివృద్ధి పధం లో సాగ గలరు. మీ లక్ష్యం , మీ సహచరులందరి కంటే కూడా , మీరు ఎక్కువ సామర్ధ్యం తో పని చేయడం అలవాటు చేసుకోండి ! దీనికోసం మీరు ఎంత కష్ట పడ  వలసి వచ్చినా , మీరు నిశ్శబ్దం గా  కష్ట పడండి , మీ సహ చరులెవ్వరికీ , మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనే విషయం తెలియ నీయకండి !  మీరు ఈ బ్లాగులో , పని సూత్రాలు చదువుతున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియ నీయకండి.మీరు చేయవలసిందల్లా , మీరు చేస్తున్న ఉద్యోగాన్ని , సమర్ధ వంతం గా బాధ్యతా యుతం గా చేయడమే  !  అన్ని పరిస్థితులూ , మీ నియంత్రణ లోనే ఉన్నాయన్న ధీమా తో మీరు ఉండాలి . అంటే  మీరు కష్ట పడి  మీరు చేస్తున్న పని లో ప్రావీణ్యం సంపాదించడమే !  మీరు చేస్తున్న పనిని , మిగతా అందరూ (  మీ వర్క్ ప్లేస్ లో మీ చుట్టూ ఉన్న వారంతా )  గమనించేట్టు  చూడండి ! ముఖ్యం గా మీ బాసు కళ్ళ లో పడాలంటే ! ,మీరు మీ ఆఫీసులో , మీ ఫైళ్ళ ముందర ఎంత కాలం కూర్చున్నా , మీ చెమటా , కష్టమూ , వృధా అవుతుందే తప్ప , దానికి  తగినంత ఫలితం ఉండదు. మీరు ఎక్కడ పని చేస్తున్నా , మీ పై వాడు మీ పనిని గమనించే పరిస్థితి కలిగించండి.  ఒక సాధనం ఏమిటంటే , మీరు చేస్తున్న పని గురించి ఒక రిపోర్ట్ మీ బాసుకు ఇవ్వండి. అంటే మీరు ఎంత పని పూర్తి  చేసిందీ, ఇంకా ఎంత తక్కువ పని మిగిలి ఉన్నదీ కూడా , ఒక చిన్న రిపోర్ట్ ఇవ్వండి. మీ మిగతా సహచరుల సమక్షం లో ! ఇట్లా చేయడం వల్ల ,మీ పనితనానికి గుర్తింపు వస్తుంది. ప్రత్యేకించి మీ బాసుకు !  మీరు ఈ పని తరచుగా చేయకూడదు ! అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే , మీరు మీ బాసు  గుడ్ బుక్స్ లో ఉంటారన్న మాట !  మీ బాసు కి మీ మీదా మీ పని మీదా మంచి ఇంప్రెషన్ రావాలంటే అత్యుత్తమ సాధనం మీరు చేస్తున్న పనిని సమర్ధ వంతం గానూ, బాధ్యతా యుతం గానూ చేయడమే ! దీనికి సబ్ స్టి ట్యూ ట్  ఏమీ ఉండదు ! అందువల్ల మీరు చేస్తున్న పనిని ఏకాగ్రత తో , తదేకం గా మిగతా ఏ  వ్యాపకాలూ లేకుండా చేయడం అలవాటు చేసుకోండి ! 

ఒక ఉదాహరణ : మీరు బజారులో చాట్ మసాలా వాడి బండి చూసే ఉంటారు !  అట్లాంటి బండి ఎక్కడ ఉన్నా , విపరీతం గా జనాలు !  మరి బండి వాడి పనితనం కనుక గమనిస్తే !  బండి లో ఒక పొయ్యి,  దాని మీద ఒక  పెద్ద పెనం ఉంటుంది. ఒక సగం లో నాన బెట్టిన శనగలు ఉంటాయి, పచ్చగా.  పొయ్యి పక్కగా , చక్కగా చాప్ చేసిన ఉల్లిపాయలు, కొతిమీర, టమాటాలు ఉంటాయి , వాటి పక్క గా చాట్ మసాలా ! ఇంకా వాడేమో చేతుల తో మాయ చేస్తున్నట్టు అవి కొన్నీ , ఇవి కొన్నీ చక చకా కలిపేసి ఒక ప్లేట్ లో అన్నీ పోసి , చక్కటి పెరుగు రెండు చెంచాలు వేసి, ఇస్తూ ఉంటాడు ! ఇంకో చేత్తో  గోల్ గప్పా లు మధ్యలో తుంచి , వాటిలో మసాలా నీరు పోసి ఇస్తూ ఉంటాడు ! కాస్త సమయం దొరికితే , అట్ల  కాడ తో పెనం మీద అవసరం లేక పోయినా కూడా టక టక టక  మనే శబ్దం చేస్తూ ఉంటాడు ! ఇక్కడ గమనించ వలసినది , బండి వాడి హస్త లాఘవం , ఇంకా అందరూ మూగి ఉన్నపుడు , లైటు వెలుతురూ లో వాడు , వాడి బాసులు ( అంటే డబ్భులు ఇచ్చి వాడి చాట్ తినే వారందరూ ! ) వాడి పనితనం గమనించడానికి చేసే ప్రయత్నాలే !  అ సమయం లో ఆ చాట్ బండి చుట్టూ మూగి ఉన్న వారి నోటిలో, గోల్ గప్పా లూ ,చాట్ లో పడుతూ ఉంటే , ” ఎంత బాగా చేస్తున్నాడు !  వాడి దగ్గర ఏదో రహస్యం ఉంది” ! అనుకుంటూ తింటూ ఉంటారు !  పనితనం చూపించడం అట్లా ఉంటుంది ! 

వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !  
  

పని సూత్రాలు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 12, 2013 at 9:06 సా.

పని సూత్రాలు.

 
ఆధునిక మహాభారత ఉద్యోగ పర్వం లో , యువతీ యువకులంతా , అనేక రకాలు గా ఉంటారు. చాలా మంది పట్టే ప్రధాన మైన  బాట, చదువులు పూర్తి అయిన తరువాత , ఉద్యోగం కోసం  వేట !  ఇట్లా ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం మంది , పరీక్షలు పాసయిన వారుంటారు .  కొంత శాతం మంది , పరీక్షలలో సఫలం కాలేక , చదువు కు విరామం ఇచ్చి , ఉద్యోగం వేట లో పడతారు. ఆ అదృష్టానికి కూడా నోచుకోని వారు , చదువులు మానివేసి, అంటే స్కూల్ చదువులు అయ్యాకనే , పై చదువులకు వెళ్ళ కుండా ( లేదా వెళ్ళ లేక ) ఉద్యోగాలు వెతుక్కుంటారు. అనేక సంవత్సరాలు గా వారి జీవితాలలో, అతి ముఖ్యమైన భాగమైన స్టూడెంట్ లైఫ్ ను భాగా అనుభవిస్తారు , చాలా మంది యువతీ యువకులు, అందులో తప్పు ఎంత మాత్రమూ లేదు. కానీ పరీక్షా ఫలితాలు తెలిశాక , వారు ఒక జల్లెడ లోనుంచి వేరు చేయబడతారు వివిధ  గ్రూపు లు గా ! వారికి వచ్చిన మార్కుల ప్రకారం గా వారి ప్రతిభ, కొన్ని తరగతులు గా విభజింప బడుతుంది.  కానీ ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం తరచూ , ప్రతిభకు డిగ్రీలూ , సర్టిఫికెట్  లు మాత్రమే కొలమానాలు కాదని ! ప్రతిభ ను వారే ” సాన ” పెట్టుకుంటే లేదా పదును పెట్టుకుంటే , వారు, వారి వారి జీవితాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించ గలుగుతారు.  కావలసినది కృత నిశ్చయమూ , శ్రమా, ఆశావహ దృక్పధమూ ! వారి, వారి లక్ష్యాలను అధిగమించ డానికి  వారందరికీ కావలసినది ఇంకో ముఖ్యమైన  సాధనం ” పని సూత్రాలు ” అదే, రూల్స్ ఆఫ్ వర్క్ . వారు ఎక్కడ ఏపని చేసినా , వారికి పని సూత్రాలు పూర్తి గా తెలిస్తే , వారు నెగ్గుకు రాగలరు ! 
విచార కరమైన విషయం ఏమిటంటే , ఈ పని సూత్రాలు , చదువు కున్న వారికీ , వారి కాలేజీ లో చెప్పరు , చదువు కోలేక పోయిన వారికీ ,వీటి గురించి అవగాహన ఉండదు. పని చేసే , ప్రతి మానవ జీవితం లో అతి ముఖ్యమైన ఈ పని సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ! మన జీవితాలలో,పని సూత్రాలు పాటించి , అభివృద్ధి పధం లోకి వెళదాం !
 
వచ్చే టపా నుంచి , ఈ పని సూత్రాలు వివరం గా తెలుసుకుందాం ! 

 

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 10, 2013 at 9:57 ఉద.

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు. 

2. సన్నద్ధం అంటే ప్రిపరేషన్ లో నే ఉంది కిటుకు : 

పరీక్షా సమయం లో విద్యార్ధులలో ఏర్పడే భయాందోళన లకు ఇంకో ముఖ్య కారణం , సరిగా సన్నద్ధం అవక పోవడం. ఈ పరిస్థితిని యుద్ధానికి వెళ్ళే సైనికులు ,ఆయుధాలు మర్చి పోయిన  పరిస్థితి తో పోల్చ వచ్చు.  పరీక్షా స్థలం లో జరిగేది కేవలం, అంతకు ముందంతా, విద్యార్ధులు , ఏమి నేర్చుకున్నారో పరీక్ష చేయడమే కదా !  అందువల్ల  ఆ పరీక్ష కు సరిగా ప్రిపేర్ అవ్వడం ఎంతో  ముఖ్యం. ఈ సన్నద్ధం అవడాన్ని ప్రధానం గా రెండు రకాలు గా విభజించు కోవచ్చువిద్యార్ధులు.స్కూలు తెరవ గానే ఆ సంవత్సరం లో చెప్పే పాఠాల  వివరాలు తెలుసుకోవడం.ఈ పని , విద్యార్ధులు చిన్న వయసు లో ఉంటే , వారి తలిదండ్రులు కూడా చేయ వచ్చు.  పాఠాల వివరాల తో పాటుగా , క్లాసు పరీక్షల లోనూ , ఇంకా ఫైనల్ పరీక్షల లోనూ , వచ్చే ప్రశ్నల వివరాలు, అంటే మోడల్ పేపర్స్, లేదా నమూనా ప్రశ్న పత్రాలను కూడా , స్కూల్ ప్రారంభించిన సమయం లోనే సంపాదించి , ఆ యా ప్రశ్నలకు సమాధానాలు వివరం గా రాసే దిశగా , విద్యార్ధిని సన్నద్ధం చేయాలి. ఈ విధం గా చేయడం వల్ల , సంవత్సరం పొడుగునా చదువుతున్నా ,పరీక్షా సమయం లో ఇచ్చే ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా , వాటిని సులభం గా రాసే అలవాటు విద్యార్ధికి ఏర్పడుతుంది. ఇట్లా పరీక్షా ప్రశ్నా పత్రాలు కూడా ,తరచూ  ప్రాక్టిస్ చేయిస్తూ ఉంటే , విద్యార్ధులకు , ఆత్మ స్థైర్యం పెరుగుతూ ఉంటుంది.ఇంతే కాక తలిదండ్రులు పరీక్షా సమయాలలో చేయవలసినది ఇంకో ముఖ్య మైన కార్యం ఉంది. అది అన్ని పరిస్థితులలోనూ , విద్యార్ధిని ఎంకరేజ్ చేస్తూ , అంటే ఉత్సాహ పరుస్తూ , వారిలో  ఆ పరీక్షను  తాము చక్కగా రాయగలమనే ధైర్యాన్నీ , ఆత్మ విశ్వాసాన్నీ  కలిగిస్తూ , లేదా సన్నగిలి పోతున్న వారి ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ  ఎక్కువ చేస్తూ ఉండాలి. అంతే  కానీ , ఆ పరిస్థితులలో వారికి లేని పోనీ భయాలు కలిగిస్తూ ” ఈ పరీక్షలో పాసు కాక పొతే , లేదా మంచి మార్కులు రాక పొతే ఇక చదివించేది లేదు , నీ పని చెబుతా ! ” అంటూ బెదిరిస్తూ ఉంటే , ప్రయోజనం శూన్యం ! 
3.  చిన్న వయసు నుంచే !: 
చాలా మంది విద్యార్ధులు , ప్రత్యేకించి ఒకటో , రెండో తరగతో చదివే చిన్నారులు కూడా ఈ ఆందోళన లకూ భయాలకూ లోనవుతూ ఉంటారని మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు అంటారు . ఆ సమయాలలో తలిదండ్రులు కనక వారి మానసిక  పరిస్థితి ని గమనిస్తూ , వారికి సహాయం చేయక పొతే , వారి భయాందోళన లు, వారితో పాటుగా పెరిగి , వారు ( పెద్ద క్లాసులలో ) పరీక్ష రాసే ప్రతి సారీ వారిని బాధ పెడుతూ , వారి ప్రతిభను మరుగు పరుస్తాయి ! ముఖ్యం గా చిన్న పిల్లలు , అకారణం గా ముభావం గా ఉండడమో ,  కడుపు లో తిప్పు తుందనో , లేదా అతి గా మూత్ర విసర్జన చేయడమో , చేస్తూ ఉంటారు.ఆకస్మికం గా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. పిల్లలలో ఎదురయే ఈ పరిస్థితి , ప్రత్యేకించి , పరీక్షల ముందు , అతి జాగ్రత్త గా వారి తల్లి దండ్రులు గమనించి, వివరం గా వాటి కారణాలు ఆరా తీయాలి. ఇట్లా ఎక్కువ యాంగ్జైటీ కి లోనయే  చిన్నారులకు  బ్రీదింగ్ ఎక్సర్సైజు లు బాగా ఉపయోగ పడతాయని విశదం అయింది. సాధారణం గా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజులు ,లేదా  శ్వాస వ్యాయామాలు ఇంట్లో నైనా వారి స్కూల్ లో నైనా చేయించ వచ్చు. వారిని చాప మీద పడుకుని కళ్ళు మూసుకోవాలని చెప్పాలి. తరువాత వారిని వారి శ్వాస మీద కేంద్రీకరించ మనాలి. తరువాత క్రమేణా , వారిని వారి కాళ్ళనూ చేతులనూ, టెన్స్  గా చేస్తూ , తరువాత రిలాక్స్ చేస్తూ ఉండమని చెప్పాలి. అంటే వారిని వారి చేతి కండరాలనూ , కాళ్ళ కండరాలనూ బిగిస్తూ , విడుదల చేస్తూ ఉండాలి. ఈ విధం గా చేయడం వల్ల, వారి మనసు కేవలం ఎక్సర్సైజు మీదే లగ్నం అయి , వారి ఆందోళనలు తగ్గుతాయి. ఇట్లా చిన్న పిల్లలతో , ప్రత్యేకించి యాంగ్జైటీ ను అనుభవిస్తున్న చిన్నారులలో , ఇట్లా ఎక్సర్సైజులు చేయించడం వల్ల , వారి భయాందోళన లు చాలా వరకు తగ్గి పోయి ,పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారని  కూడా స్పష్టమైంది. ( కొందరు పిల్లలైతే ఆ ఎక్సర్సైజులు చేస్తూ నిద్ర లోకి జారుకున్నారు ట ! )
పరీక్షలు అనేవి, పురోగమించే  ప్రతి మానవ జీవితానికీ అనివార్యం అయ్యాయి. ప్రతి మానవ జీవితం లో భాగం అయ్యాయి. వాటిని సమర్ధ వంతం గా ఎదుర్కోవడమే ఉత్తమ పధ్ధతి.  తలిదండ్రులూ , ఉపాద్యాయులూ కూడా , బాల బాలికలకు ప్రోత్సాహం, సహకారం ఇచ్చి వారిని సదా కర్తవ్యోన్ముఖులను చేస్తూ,చక్కటి ఫలితాలు కూడా పొందే లా చూడాలి. మనమంతా ఒక్కసారి గా పెరిగి, పెద్ద   అయిపోలేదు కదా !  ( టైం  పత్రిక సౌజన్యం తో ).