Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

7. గురక కు చికిత్స ఉందా?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 28, 2013 at 10:23 ఉద.

7. గురక కు చికిత్స ఉందా?

క్రితం టపాలలో గురకకు కారణాలు ఏమిటి , గురకను కనుక్కోవడం ఎట్లా , గురక తీవ్రత ను తెలుసుకోవడం ఎట్లా , అనే విషయాలు తెలుసుకున్నాం కదా ,మరి గురక కు చికిత్స ఉందా ? అంటే  ఉన్నది. 
మందుల అవసరం లేకుండానే గురకను నివారించుకోవచ్చు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే :
a. బరువు తగ్గించుకోవడం : మీ వయసుకీ , మీ ఎత్తుకీ ఉండవలసిన బరువు కన్నా కేవలం కొన్ని కిలోలు ఎక్కువ ఉన్నా కూడా గురక వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది. అందువలన గురక నివారణ లో మొదటి చర్య గా బరువు తగ్గించుకోవాలి !  ఇది అనేక రకాలు గా త్వరితం చేసుకోవచ్చు . పథ్యం తోనూ , వ్యాయామం తోనూ ! బరువు ఎక్కువ అవుతున్న కొద్దీ , మెడ లోపల ఉన్న కండరాల చుట్టూ కొవ్వు పేరుకుని  శ్వాస నాళాల  వ్యాసాన్ని తక్కువ చేస్తుంది అనే విషయం ముఖ్యం గా గుర్తు ఉంచుకోవాలి !
b . వెల్లికిలా కాకుండా పక్కకు ఒరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి : దీనివలన గొంతులో శ్వాస సమయం లో నాలుకా, ఇతర కండరాలూ వెనక్కి వెళ్లి శ్వాస తీసుకోవడం కష్టమయే పరిస్థితి ఏర్పడదు. 
c. మద్యం తాగడం మానుకోవాలి:  ప్రత్యేకించి మద్యం తాగి పడుకోవడం మానుకోవాలి : ఎందుకంటే మద్యం మన కండరాలనన్నిటినీ వ్యాకోచ పరుస్తుంది అంటే రిలాక్స్ చేస్తుంది  దానితో గొంతులో ఉన్న నాలుకా , ఇతర కండరాలు కూడా రిలాక్స్ అయి , అవి శ్వాస ద్వారాన్ని  చిన్నది గా చేస్తాయి ! దానితో శ్వాస తీసుకోవడం కష్టమయి గురక వస్తుంది. 
d . స్మోకింగ్ మానుకోవాలి : స్మోకింగ్ గొంతు లోపలి భాగాలలో వాపు కు కారణమయి  శ్వాస తీసుకోవడం ఎట్లా క్లిష్ట తరం చేస్తుందో , క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా !  స్మోకింగ్ మానుకుంటే ఆ మార్పులు నివారించ బడి శ్వాస సునాయాసం అవుతుంది !
e.  CPAP  యంత్రాలు : 
CPAP అంటే కంటిన్యు అస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ డివైస్ అని : ఈ పరికరం లేదా మెషీన్ ను OSA  ఉన్న వారు అంటే , గురక తీవ్రత ఎక్కువ అయి , అది శ్వాస తీసుకోవడం కష్టం చేస్తున్న దశ లో వాడవలసిన పరికరం. ఈ పరికరం శ్వాస పీడనాల తేడాను కనిపెట్టి  తదనుగుణం గా మార్పులు తెస్తుంది. దానితో శ్వాస మామూలు గా తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పరికరాన్ని రోజూ వాడాలి.  స్పెషలిస్టు సలహా తోనే  పై చర్యలు పాటించడం ఉత్తమం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

6. హానికరమైన గురకను ఎట్లా కనుక్కోవడం?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 27, 2013 at 9:23 ఉద.

6. హానికరమైన గురకను ఎట్లా కనుక్కోవడం?

నిద్రలో పెట్టే ప్రతి గురకా హానికరం కాక పోవచ్చు ! కానీ నిద్ర లో గురక పెట్టే ప్రతి వారూ వారు పెట్టే గురక తీవ్రతను తెలుసుకోవడం ముఖ్యం !
ఈ క్రింది విధాలు గా గురక తీవ్రతను తెలుసుకోవచ్చు ! 
1. మీరు కనుక  పగటి పూట ఎక్కువ అలసట గా , ఏకాగ్రత కోల్పోతూ, పగలు కూడా నిద్ర పోతూ , లేదా పగలు వీలైనప్పుడల్లా కునుకు తీస్తూ ఉంటే,రాత్రి సమయాలలో మీ నిద్రను పరిశీలించ మని మీ కుటుంబ సభ్యులను కానీ , మీ భార్య  ను కానీ , భర్తను కానీ అడగవచ్చు ! ఎందుకంటే , మీ నిద్రను మీరు పరిశీలించుకోలేరు కనుక !ఆ పరిశీలన లో కనుక మీరు మీ నిద్రలో ఎక్కువ సార్లు గురక పెడుతూ ఉన్నట్టైతే , స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లడం శ్రేయస్కరం !
2. స్పెషలిస్ట్ చేసే పరీక్షలు ఏమిటి ?:
a. మీ వయసుకూ , మీ ఎత్తుకూ తగినట్టు మీ బరువు ఉందా లేదా అని. 
b . మీ రక్త పరీక్షలు 
c . వివిధ రకాల నిద్ర పరీక్షలు : 
ఈ నిద్ర పరీక్షలు చాలా ముఖ్యమైనవి.  ఇవి మీ మెదడు లో నూ , మీ కండరాలలోనూ , మీ హృదయం లోనూ , సహజం గా నే రికార్డు అయే తరంగాలు నిద్రలో ఎట్లా మార్పులు చెందుతాయో తెలుసుకోవడం జరుగుతుంది ! ఎందుకంటే , మీ గురక కనుక మీకు హానికరం గా మారుతుంటే , తదనుగుణం గా , ఆ తరంగాలు రికార్డు అయి , ఆ హానిని తెలియ చేస్తాయి. అప్పుడు నివారణ చర్యలు తీసుకోడానికి పునాది ఏర్పడుతుంది, మామూలు గా అందరూ పెట్టే గురకే కదా అని అశ్రద్ధ చేయకుండా ! ముఖ్యం గా నిద్రలో గురక  పెట్టే సమయం ఎంత ఉన్నది ?  ఆ సమయం లో శ్వాస పీల్చుకోవడం కష్టం గా ఉందా లేదా అనే విషయం కూడా నిర్ధారణ అవుతుంది ! హాని కరమైన గురక కనుక పెడుతూ ఉంటే , శ్వాస లో అప సవ్య మైన మార్పులు కలిగి , తరచుగా , ( నిద్ర పోతున్న సమయం లోనే )  ప్రాణ వాయువు సరఫరా లో అంతరాయం కలుగుతుంది , ప్రత్యేకించి మెదడు కు సరఫరా అయే ప్రాణ వాయువు లో హెచ్చు తగ్గులు కలిగి అనేక రుగ్మతలకు దారి తీయ వచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

5. గురకకూ, ఒసా ( OSA ) కూ ఉన్న సంబంధం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 25, 2013 at 10:44 ఉద.

5. గురకకూ ఒసా  ( OSA ) కూ ఉన్న సంబంధం ఏమిటి ?

 
మునుపటి టపాలలో, గురక గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ! మరి గురకకూ అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా కూ ఉన్న సంబంధం ఏమిటో కూడా మనం తెలుసుకుందాం !  ఓసా ( OSA ) పేరు లోనే మనకు ఆ పరిస్థితి గురించి చాలా వరకు అర్ధం అవుతున్నది కదా !  మన నిద్రను భంగం చేసే అవరోధ కర పరిస్థితి అన్న మాట ! ఈ ఓసా  గురించి వివరాలు తెలుసుకునే ముందు , ఈ పరిస్థితిని అశ్రద్ధ చేస్తే కలిగే ఆరోగ్య ప్రమాదాలు తెలుసుకుంటే , ఈ పరిస్థితి ప్రాముఖ్యత విశదం అవుతుంది. 
 
అశ్రద్ధ చేయబడిన ఓసా ఈ క్రింది పరిణామాలకు దారి తీయవచ్చు 
1. అధిక రక్త పీడనం ( హైపర్ టెన్షన్ )
2. పక్షవాతం ( స్ట్రోకు )
3. గుండె పోటు. 
4. ఊబకాయం ( ఒబీసిటీ )
5. మధుమేహం ( డయాబెటిస్ టైప్ టూ )
 
ఈ ఓసా  లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ?
1. పగలు విపరీతం గా నిద్ర ముంచుకు రావడం ( అంటే రాత్రులు ఓసా వల్ల తెలియకుండానే నిద్ర భంగం అవడం వల్ల )
2. గొంతు నొప్పి తోనూ గొంతులో మంటల తోనూ ఉదయం  లేవడం 
3. మతి మరుపు గా ఉండడం , ఏకాగ్రత కోల్పోవడం 
4. చీటికీ మాటికీ చీకాకు పడుతూ ఉండడం , ఇతరులను విసుక్కోవడం ! 
5. తలనోప్పీ , డిప్రెషన్ , ఇంకా యాంగ్జైటీ లాంటి లక్షణాలు కలగడం 
6. సెక్స్ లో ఉత్సాహం కోల్పోవడం 
7. ఇంకా తీవ్రం గా లక్షణాలు ఉంటే , పురుషులలో అంగ స్థంభన సమస్యలు కూడా ఉత్పన్నం అవవచ్చు . 
8. ఎకాగ్రత , లోపించి , పగటి పూట కూడా నిద్ర మత్తు ఎక్కువ గా ఉన్న వారు కారు , మోటార్ సైకిల్ , లాంటి వాహనాలు నడిపే సమయం లో  ప్రమాదాలకు 
గురి అయ్యే రిస్కు ఎక్కువ అవుతుంది.
 
గురకకూ , ఓసా కూ ఉన్న సంబంధం శులభం గా గుర్తు ఉంచుకోవాలంటే ,”   ఒసా లో గురక సామాన్యం గా ఉంటుంది కానీ అన్ని గురకలూ ఓసా కు దారితీయక పోవచ్చు ! ” 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
 

4. గురక లో గ్రేడ్ లు ఉంటాయా?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 23, 2013 at 8:54 సా.

4. గురక  లో గ్రేడ్ లు ఉంటాయా?

క్రితం టపాలలో , గురక అంటే ఏమిటి , గురక ఎట్లా వస్తుంది , గురకకు కారణాలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా !మరి గురక అందరిలోనూ ఒకే లా ఉంటుందా , లేదా గురక తీవ్రత గు గ్రేడ్ లు ఉన్నాయా అంటే , ఉన్నాయనే సమాధానం చెప్పుకోవాలి !
1. గ్రేడ్ వన్ గురక !: 
దీనినే సామాన్యమైన గురక అని చెప్పుకోవచ్చు ! ఇట్లా గ్రేడ్ వన్ గురక రాయుళ్ళు  ఒక క్రమ పధ్ధతి లో రెగ్యులర్ గా కాకుండా , కేవలం అప్పుడప్పుడూ లేదా ,వారం లో కొన్ని రోజులు ,మాత్రమే గురక పెడుతూ ఉంటారు ! అంతే కాకుండా , ఈ గురక రాయుళ్ళ గురక పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా , కాస్త నెమ్మది గా ఉంటుంది !ఉండీ లేనట్టు !ముఖ్యంగా , గ్రేడ్ వన్ గురక పెట్టే వారిలో, వారి శ్వాస గురక వల్ల ప్రభావితం అవ్వదు ! అంతే కాకుండా , వారి ఆరోగ్యానికి కూడా ఇతర విధాలుగా ఈ గ్రేడ్ వన్ గురక హాని చేయదు ! మహా అవుతే , వారి భార్యలకూ , లేదా స్నేహితురాళ్ళకూ , వారి గురక విసుగు తెప్పించడమే కాకుండా, వారి నిద్ర కూడా పోగొట్టి , సంబంధాలు తెగతెంపులు చేసుకునే పరిస్థితి కల్పించ గలదు ఈ గ్రేడ్ వన్ గురక ! అందువల్ల కాస్త అప్రమత్తత అవసరం !
2. గ్రేడ్ టూ గురక :
ఈ గురక రాయుళ్ళు, కాస్త ముందుకు పోయి , ఒక క్రమ పధ్ధతి లో కనీసం వారం లో మూడు రోజులైనా తప్పని సరిగా గురక పెడుతూ ఉంటారు ! వీరి శ్వాస కూడా కొంత వరకూ , వీరి గురక చేత  ఇబ్బంది అవ వచ్చు ! దానితో వీరు నిద్ర సరిగా పోలేక , పగలు చాలా అలసినట్టు పగలు కూడా నిద్ర లేమి తో కనబడుతుంటారు !
3. గ్రేడ్ త్రీ గురక : ఈ గురక పెట్టే వారు, ఇంకాస్త ముందుకు పోయి ,రోజూ ,  పెద్ద గా గురక పెడుతుండడం చేత , వీరి గురక వారు పడుకున్న గది బయట కు కూడా వినిపిస్తూ ఉంటుంది ! ( ప్రత్యేకించి దొంగలకు ! )  వీరికి గురక తీవ్రత వల్ల  OSA అనే పరిస్థితి కూడా వస్తుంది OSA అంటే ఓ ఎస్ ఏ. అంటే అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా సిండ్రోం. వీరిలో శ్వాస కూడా ఒక పది సెకన్ ల పాటు ఆగిపోతూ ఉంటుంది ! వీరు గురక పెట్టినపుడల్లా ఈ పరిస్థితి కలిగి, నిద్రలో తరచూ శ్వాస తీసుకోవడం కష్టం పరిణ మించడం వల్ల , సరిగా రాత్రులు నిద్ర పోలేక పోతారు !  వారి సతీ పతుల సంగతి సరే సరి !  దానితో వారు పగలు చాలా అలసిపోయి వారి దైనందిన కార్యక్రమాలు సరిగా చేసుకోలేక పగలు నిద్రతో తూలుతూ ఉంటారు ! వారు డ్రైవింగ్ చేస్తున్నా , లేదా పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేస్తున్నా కూడా , వారికి ఈ పగటి నిద్ర తో తూలే పరిస్థితి , ప్రమాద కరం గా పరిణమించ వచ్చు ! 
 
మరి మీరు ( ఒక వేళ గురక పెడుతూ ఉంటే  ) ఏ గ్రేడ్ కు చెందుతారు ? 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
 

3. గురక కు కారణాలు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 21, 2013 at 7:39 సా.

3. గురక కు కారణాలు ఏమిటి ? 

క్రితం టపాలో మనం మన గొంతులో ఏ మార్పులు గురక కు కారణ మవుతాయో తెలుసుకున్నాం కదా !  మరి ఆ మార్పులు, ఎందుకు కలుగుతాయో తెలుసుకోవాలని  అనిపిస్తుంది కదా ! గురకకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే , గురక ను అశ్రద్ధ చేస్తే ,  వివిధ రకాల అనారోగ్యాలకు అది దారి తీయవచ్చు !
మరి గురకకు కారణాలు ఏమిటి ?
1.  వివిధ రకాల ఎలర్జీ ల వల్ల : వాతావరణం క్రమేణా ఎక్కువ గా కలుషితం అవుతూ ఉండడం తో  వివిధ రకాల ఎలర్జన్ లు గాలి లో ఉండి , అవి నాసికా రంధ్రాల ద్వారా లోపలి వెళతాయి ! ఈ రకం గా ఎలర్జన్ లు , చాలా కాలం కనుక ముక్కులో ప్రవేశిస్తూ ఉంటే , మన దేహం లో సహజం గా నే ఉండే రక్షణ చర్యలలో భాగం గా ముక్కు లోపలి భాగాలు , అంటే గొంతు మొదటి భాగాలు , వాయడం జరుగుతుంది. ఆ వాపు ట్రాకియా  ద్వారాన్ని చిన్నది గా చేసి గురక కు కారణమవుతుంది. 
2. ఊబకాయం వల్ల అంటే ఒబీసిటీ వల్ల : మన దేహం లో చాలా అనర్ధాలకు కారణ మయే  ఊబకాయం,  గురక కు కూడా కారణ మవుతుంది. సహజం గానే ఊబకాయం ఉన్న వారి దేహం లో చాలా భాగాలలో కొవ్వు పెరుకున్నట్టే , నాలుక చివరా , అంగిటి చివరా ఉన్న కండరాల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువ గా పేరుకుంటుంది. దానితో ట్రాకియా ద్వారం చిన్నది గా అయి గురక కు కారణమవుతుంది !
3. స్మోకింగ్ చేస్తుండడం వల్ల : స్మోకింగ్ గురించీ , టొబాకో చేసే హాని గురించీ మనం ఒక డజను టపాలలో వివరం గా తెలుసుకున్నాం కదా ! ( ఓపిక చేసుకుని బాగు ఆర్కైవ్ లలో చూడండి )  మరి స్మోకింగ్  గురకకు కారణం ఎట్లా అవుతుంది అని మీకు అనుమానం వస్తే , గమనించ వలసినది, టొబాకో పొగలో ఉండే అనేక వందల విష  పదార్ధాలూ , మాలిన్యాలూ , ఎలర్జన్ ల లా మన దేహం లో పనిచేస్తాయి (  అసలు ఎలర్జీ అంటేనే , మన దేహం లోని కణాలు చూపించే రక్షణ చర్యలే ! ) అందువల్ల కూడా  గొంతు లోపలి భాగాలు వాచిపోతాయి ! ఆ వాపు బయటకు కనబడనవసరం లేదు ! ఎందుకంటే టొబాకో పొగ ముక్కుతోటీ , నోటితోటీ కదా పీల్చ బడేది ! అందువల్ల , ఆ పొగ లో ఉండే విష వాయువులు  గొంతులోనూ అక్కడి కణాల లోనూ మార్పులు కలిగించి వాపు దీనినే ఇన్ఫ్లమేషన్ అంటారు, ఏర్పడి  తద్వారా ట్రాకియా  ద్వారం వ్యాసం చిన్నదయి గురకకు కారణం అవుతుంది !
4. మద్యపానం చేయడం వల్ల : మద్య పానం , గొంతులో ఉండే అతి సున్నితమైన కండరాలను అతిగా వ్యాకోచింప చేస్తుంది ! దానితో క్రితం టపాలో ఉన్న చిత్రం లోని రెండవ చిత్రం లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది , అంటే , నాలుక చివరి కండరాలూ , అంగిటి  చివరి కండరాలూ వ్యాకోచించుకుని , ట్రాకియా ద్వారం చిన్నది అయిపోయి గురక వస్తుంది. 
5. వివిధ రకాలైన మత్తు కలిగించే మందులు అంటే సెడేటివ్ మందులు. : ఈ మందులన్నీ కూడా గొంతు లో కండరాలను వ్యాకోచింప చేసి, గురకకు కారణ మవుతాయి ! ఈ పరిస్థితి , రోజూ నిద్ర మాత్రలూ, గొంతు నొప్పికీ , దగ్గుకూ , రోజూ మందులు వేసుకునే వారిలో ఎక్కువ గా కనిపిస్తుంది, కేవలం కొన్ని రోజులో , ఒక వారమో ఆ మందులు వేసుకునే వారి కంటే ! ( అంటే కేవలం అవసరం ఉండి కొన్ని రోజులే వాడే వారికన్నా , అది అలవాటు గా చేసుకుని నెలలూ , సంవత్సరాల తరబడి అట్లాంటి మత్తు కలిగించే మందులు వేసుకునే వారిలో ఈ పరిస్థితి తరచు గా కనిపిస్తుంది ! ) 
Obstructive sleep apnea
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

2. గురక ( snoring ) లో ఏమి జరుగుతుంది ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 20, 2013 at 6:37 సా.
2. గురక లో ఏమి జరుగుతుంది ?
చాలా మందికి గురక ఏమిటో తెలియంది కాదు. గురక ఎంత సాధారణం అంటే , గురక పెడుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు , లేదా స్నేహితులు ఎవరైనా ఉంటే ,కేవలం ” వారు గురక పెడతారు నిద్రలో ! వారికి గురక పెడుతూ నిద్ర పోవడం అలవాటు ! ” అని, నవ్వుకుంటూ చెప్పుకుంటారు ! 
మనం గురక ఎందుకు వస్తుందో , కారణాలు తెలుసుకునే ముందు , గురక లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం !  క్రితం టపాలో మనం చదివిన ప్రణవ్ గురకకు కారణం కూడా ఇదే ! 
 
పైన ఉన్న చిత్రం శ్రద్ధ తో చూస్తే , మూడు పరిస్తితులు వివరించ బడినట్టు తెలుస్తుంది కదా !
అందులో నార్మల్, అంటే సామాన్యం గా నిద్ర పోయే సమయం లో ఏమి జరుగుతుందో చిత్రం ద్వారా చూపించ బడింది !  ఇక్కడ మన నాలుకను అంగిటిని  నియంత్రించే కండరాలు  మన ఊపిరి తిత్తుల మొదటి భాగం దీనినే ట్రాకియా  అంటారు ( ట్రాకియా లేదా  గాలి గొట్టం , పైన ముక్కు తోటీ , నాసికా రంద్రాలతోటీ , కలిసి ఉంటుంది , క్రిందగా , ఈ గొట్టం , రెండు చిన్న గోట్టాలుగా విభజింప బడి ,  రెండు ఊపిరి తిత్తులలోకీ  అనుసంధానం అయి ఉంటుంది ! మనం నిద్రలో సహజం గా  శ్వాస తీసుకుంటూ ఉంటే , నాలుక చివరా , అంగిటి చివరా ఉన్న కండరాలు ట్రాకియాను తెరిచి ఉంచి అందులోకి ( తద్వారా ఊపిరి తిత్తులలోకి ) పీల్చే గాలి నిరంతరాయం గా అందేట్టు చూస్తాయి ! ఇక రెండో చిత్రం పరిశీలించండి :   ఈ నాలుక చివర, అంగిటి చివరా ఉన్న కండరాలు కనుక రిలాక్స్ అవుతే, అంటే వ్యాకోచించితే , ట్రాకియా , అంటే గాలి గొట్టం , కూడా  ఫ్ల్యాట్ గా అయి , అందులోంచి గాలి పోవడం కష్టమవుతుంది ! ఈ పరిస్థితిని  గాలి తీసివేయ బడ్డ సైకిల్ చక్రం లోపలి ట్యూబు తో పోల్చ వచ్చు కదా ! ఈ రెండవ పరిస్థితి నే గురక లేదా స్నోరింగ్ అంటారు !  గమనించ వలసినది , గురక పెట్టే వారు పీల్చే గాలి కొంతవరకు మాత్రమే ఊపిరి తిత్తులలోకి వెళుతుందని ! పీల్చే గాలి ( కండరాలు వ్యాకోచం చెందడం వలన )  దగ్గర గా వచ్చిన ట్రాకియా లో నుంచి ఊపిరి తిత్తుల లోపలికి వెళ్లి , మళ్ళీ , కార్బండయాక్సైడ్ ఎక్కువ గా ఉన్న గాలి అదే ట్రాకియా నుంచి బయటకు వస్తుండడం వలన ” గురక ” ” ఉత్పన్నం ” అవుతుంది ! అదే , నార్మల్ గా నాలుక చివరి కండరాలూ , అంగిటి చివరి కండరాలూ , సంకోచ స్థితిలో ఉంటే , ట్రాకియా విశాలం గా ఉండి  గాలి సరఫరా సాఫీ గా జరిగి , కేవలం ఊపిరి శబ్దమే వస్తుంది కదా ! 
కానీ మూడో పరిస్థితి లో ( దానిని ఓ ఎస్ ఎ  లేదా అబ్ స్ట్ర క్టివ్  స్లీప్ అప్నియా అంటారు )  కండరాలు విపరీతం గా రిలాక్స్ అవడం చేత , ట్రాకియా  కొంత సమయం పాటు పూర్తి గా మూసుకు పోయి , ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతుంది ! ఊపిరి అందని పరిస్తితి ఏర్పడితే ఏమి జరుగుతుందో మనకందరికీ తెలుసు కదా !  ప్రాణాలు కూడా అందని లోకాలకు వెళ్ళే ప్రమాదం ఉంది కదా !  ఆ కారణం వల్లనే , మనం ఈ గురక  సంగతులు పూర్తి గా తెలుసుకోవాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

1. ఊరక రాదు గురక !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 19, 2013 at 1:42 సా.

1. ఊరక రాదు గురక ! 

 
మధుమతి జీవితం లో మధురాతి మధురమైన  రోజు అది !  వారం రోజుల క్రితం వరకూ , ఇండియా లో,  విపరీతంగా, బంధువులు, స్నేహితులతో సరదాగా  గడిపి , తీరిక లేకుండా ఉంది !  మనసు ఉల్లాసం గా ఉంది, శరీరం బడలిక గా ఉన్నా కూడా !  తను కోరుకున్న ప్రణవ్ తో  పెళ్లి జరిగింది ! శెలవు చాలా వరకు అయిపోయి , మళ్ళీ ఉద్యోగం లో చేరడానికి సమయం అవడం తో  తిరిగి వెళ్ళాల్సి వచ్చింది , తను అమెరికా కు , ప్రణవ్ తోడు గా ! పుట్టి పెరిగినది భారత దేశం అయినా ఎందుకో  కొంత కాలం పై చదువూ , ఉద్యోగం కూడా చేయడం తో  కాలిఫోర్నియా తనకు ఎంతో నచ్చింది ! తన ఆఫీస్ కు దగ్గర గానే ఉంటుందని ,  అపార్ట్ మెంట్ తీసుకున్నారు ఇద్దరూ ! తనకు నచ్చిన సిటీ లో , అన్ని వసతులూ కల అపార్ట్ మెంట్ లో , తను ప్రణవ్ తో  తొలి రాత్రి గడప బోతున్నది !  ఆ సంగతి గుర్తు కు వచ్చినప్పుడల్లా , తడ బడుతుంది తను , కుచద్వయం నిక్క బొడుచు కుంటుంది ! ఆరో అంతస్తు లో ఉన్న తను తరచూ తొమ్మిదో మేఘం మీద తేలి పోతుంది ! తననూ ,  తన  అందాన్నీ ఎంత గానో  ఆరాధించే ప్రణవ్, ఆ రాత్రి   మధుమతి జీవితం లో మధువులు చిలికించే రేయి అది ! ఎంతో ఎదురు చూస్తున్న రోజు కావడం చేత, మునుపటి రాత్రి బాగా నిద్ర పోయి , ఉదయం కూడా ఆలస్యం గా లేచి ” బ్రంచ్ ” అయ్యిందని పించింది ! 
పాల గ్లాసు , మల్లె పూల జడ, పట్టు చీర , అమ్మా నాన్నా , అత్తగారు , చేయించిన నగలు, కాటుక కళ్ళు , ఇట్లా ఫార్ములా మొదటి రాత్రి లా తయారవలేదు, మధుమతి !  పాశ్చాత్య  పోకడలు అంటీ అంటనట్టు వంట పడుతున్నాయి తనకు ! లాంజ్ కు సమీపం లోనే ,మినీ బార్ స్టూల్ మీద , దీపాల వెలుతురు లో బంగారం లా మెరిసిపోతుంది మధుమతి , బంగారం నగలు ఏవీ వంటి మీద లేకుండానే , రతి రాత్రి ని తలుచుకుంటూ ఉంటే, శ్వాస తీవ్రమవుతుంటే , స్వేదం ఆమె   శరీరాన్ని కూడా సువర్ణ మయం చేస్తుంది !  గోధుమ రంగు లో ఉండే మధుమతి మినీ స్కర్ట్ వేసుకోవడం వల్ల కాళ్ళూ , స్లీవ్ లెస్ అవడం వల్ల చేతులూ, తొంగి చూస్తూ,బయటకు  దొర్లి పోతా యేమో అన్నట్టు గా ఉన్న వక్షోజాల పొంగులూ,  ఆమె ముఖ వర్చస్సు తో పోటీ పడుతున్నాయి, మెరిసి పోతూ ! ప్రణవ్ తన అదృష్టాన్ని నమ్మ లేక పోతున్నాడు ! మధుమతి మకరందాన్ని , అతి సున్నితం గా, అతి జాగ్రత్తగా ,” పీల్చడం ” ఎట్లాగా అని ఆమె అవయవాలను తదేకం గా గమనిస్తూ ఉన్నాడు , ఆమె కళ్ళు లేడి కళ్ళ లా అతని కళ్ళ ను గమనిస్తున్నాయి !  ప్రణవ్ ఫైన్ ఫ్రెంచ్ వైన్ను గ్లాసులో పోసి ఇచ్చాడు ! మధుమతి , తన జీవితం లో కొన్ని ప్రత్యేక  సందర్భాలలోమాత్రమే వైన్ తాగాలని ( కొన్ని సంవత్సరాల) ముందే  నిర్ణయించుకుంది ! వాటిలో ఆ రేయి ఒకటి ! ఎంత ……… అందం గా ఉన్నావు మధూ ! అని ప్రణవ్ అనురాగం తో మృదువు గా అంటూంటే , ” నిజం గానా !?  ”అని అతని కళ్ళ లోకి చూస్తూ అంది , కానీ ఆ కళ్ళు , అతని కౌగిలి లో వాలిపోయే తన అందాలతో పాటుగా , మద్యం మత్తు లో బరువు గా వాలి పోతున్నాయి ! భుజం మీద వాలిన మధుమతి పెదవులను తనపెదవులతో ” ఒడిసి ” ” పట్టుకుని ” ప్రణవ్  శయన మందిరానికి తీసుకు వెళ్ళాడు ! ఆమె బరువంతా కేవలం ఆ అధరాల  కలయిక  ఒక  కీలకమైన, విడ దీయ రాని బంధం అయినట్టు మధు అనుభూతి చెందుతుంది !  మనసులు కలిసిన మధు, ప్రణవ్ ల కోరికలు , మధువు సహాయం తో  ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలల లా చెలరేగుతున్నాయి ! ఒకరి కొకరు పోటీగా రతి  రహస్యాలు ఛేదించారు !  ప్రేమోద్రేకం తో ప్రణ యోద్వేగం కూడా కలిసి, ఆ రాత్రి మొదటి ఝాము ఎంతో రస రమ్యమైంది ! ఉచ్ఛ దశకు చేరుకున్న వారిద్దరూ సొమ్మసిలి పోయారు !  మధుమతి కి మత్తు గా ఉండి, ఇంకో గ్లాసు వైన్ తీసుకుంది ! మినీ బార్ నుంచి ! మళ్ళీ పది నిమిషాలలో తిరిగి వచ్చింది  కామాతురత తో !  ప్రణవ్ అప్పటికే నిద్ర పోతున్నాడు !  నిశ్శబ్దం గా కాదు ! భయంకరమైన గురక తో ! మధుకు అంత వరకూ తెలియదు , ప్రణవ్ నిద్ర లో గురక పెడతాడని ! తనకు చిన్న తనం నుంచీ ,ప్రశాంతం గా ఉన్న పడక గదిలో నిద్ర పోవడం అలవాటు!  పడక మీద వాలి పోయింది ! ”  ప్రణవ్  ” అని పిలిచింది చాలా సార్లు ! ఉలుకూ పలుకూ లేదు , ప్రణవ్ గురకే తనకు  సమాధానం గా వినిపించింది !   మద్యం మత్తులో తేలిపోతున్న మనసు లోనుంచి , కోరికల దావాగ్ని ఎగిసి పడుతున్నా , ప్రణవ్ గురక , ఆ మంటలను అదిమి పట్టి , నివురు గప్పిన నిప్పులా చేస్తుంది !  మధుమతి కి ఎప్పుడో విన్న భానుమతి పాట , తన మనసులో ఇంకోలా వినిపిస్తుంది ! ”ఔనా కలయేనా , నాటి  కధలు వ్యధలేనా , నీటి పైని అలలేనా ?!  ప్రణవ్ నాకు కరువేనా , బ్రతుకు ఇంక గురకేనా? !  అని ! ” అర్ధాకలి ” తో ఒక్క ఝాము తోనే , ఆ తొలి రాత్రి ని  సరిపెట్టుకుని, భారం గా, ఇంకో బెడ్ రూం లోకి వెళ్లి ,మత్తుగా నిద్ర లోకి జారుకుంది మధుమతి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

ఊరక రాదు, గురక !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 18, 2013 at 11:41 ఉద.

ఊరక రాదు గురక ! 

 
గురక !  దానినే స్నోరింగ్ అంటారు  ఆంగ్లం లో !  చాలా తరచుగా మానవులలో కనిపించే లక్షణం ! 
అన్యోన్య దాంపత్య జీవితాలలో  చీకాకులు చిందించే గురక !
అమూల్యమైన నిద్రను భంగం చేసే గురక !
సతినీ, పతి నీ కూడా  సతమతం చేసే గురక !
సెక్స్ జీవితాన్ని దొంగిలించే గురక !
సజావు గా సాగుతున్న జీవిత నావ లో, 
తుఫాను లు శ్రుష్టించే  గురక !
ఏ వాహనం నడుపుతున్నా ,
ఏ పని చేస్తున్నా ,
ఏకాగ్రత పాడుచేసే గురక !
ప్రమాదాలకు కారణ మయే గురక !
మరి ఈ గురక సంగతి మనకు ఎంత ఎరుక ?
 
వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 
 
 

26. ప్రత్యేక సందర్భాలలో , డయాబెటిస్ ఉన్న వారు, పథ్యం లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 17, 2013 at 6:41 సా.

26. ప్రత్యేక సందర్భాలలో , డయాబెటిస్ ఉన్న వారు, పథ్యం లో  ఏ  జాగ్రత్తలు తీసుకోవాలి ?

 
క్రితం టపాలలో డయాబెటిస్ నివారణకూ , నియంత్రణ  కూ  కూడా , పథ్యం పాటిస్తే ఉండే ప్రయోజనాల గురించి శాస్త్రీయం గా తెలుసుకున్నాం కదా ! మరి ప్రత్యేక పరిస్థితులలో డయాబెటిస్ ఉన్న వారు పథ్యం ఎట్లా పాటించాలి ?ప్రతి వారి జీవితాలలోనూ , తరచూ అనేక , సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి !  అవి కుటుంబ పరం గా   గా నూ , సామాజికం గానూ ఉండవచ్చు ! కుటుంబం లో జరిగే వి సామాన్యం గా,  పుట్టిన రోజులు ,  నామకరణాలు, పెళ్ళిళ్ళు , హాలిడేలు , వ్రతాలూ , పూజలూ , పండగలూ  లాంటివన్నీ ! సాంఘికం గా , మీటింగులు , పార్టీలు , పిక్నిక్ లు , మొదలైనవన్నీ ! ఈ రోజుల్లో ప్రతి సందర్భాన్నీ ఒక విందు గా మార్చుకోవడం కూడా ఆనవాయితీ అవుతుంది కదా ! అది ఒకందుకు మంచిదే కదా , అందరూ కలిసి ఆనందం గా సమయం గడప డానికి !  ఆ యా సందర్భాలలో మరి డయాబెటిస్ ఉన్న వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? 
1. విందులలో ఆహారం , రుచికరం గా ఉండడమే కాకుండా , ఎక్కువ ఐటమ్స్ కూడా చేయడం వల్ల, ఎక్కువ వెరైటీ కూడా ఉంటుంది ! 
2. కానీ,  విందులలో వండే వంటలు, కేవలం మానవుల నాలుకను దృష్టి లో పెట్టుకుని మాత్రమే  వండ బడతాయి కానీ , ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు కదా ! అందువల్ల , విందులలో అతిగా తినడం ,కేవలం డయాబెటిస్ ఉన్న వారికే కాకుండా, ఎవరికీ మంచిది కాదు.  
3. కుటుంబం లో జరిగే శుభకార్యాల లో మీకు నచ్చిన విధం గా, ముందే చెప్పి , మీ కోసం వంటలు చేయించుకోవచ్చు ! 
4. అందరితో పాటుగా తిందామని అనుకుంటే , లౌక్యం ప్రదర్శించుతూ ” నాకు కడుపు నిండిపోయింది,  ఇక చాలు” అని, ఎక్కువ గా తిన కుండా తప్పుకోవచ్చు !
5. మీకు విందులలో ఆతిధ్యం ఇచ్చే వారితో ఉన్న పరిచయాలను బట్టి , కొంత క్యాలరీలు కాల్చే పనులు  మీరు చేయవచ్చు, ఆ ప్రదేశాలలో !  ఎందుకంటే,ఇంట్లో కన్నా ఎక్కువే తినడం జరుగుతుంది కనుక , కాస్త ఎక్కువ పని కూడా చేస్తే ,  క్యాలరీలు బర్న్ అవుతాయి, వెంటనే !
6. అప్పటికే మీరు ( షుగరు కంట్రోలు కు )  ఏమైనా టాబ్లెట్స్ కనుక తీసుకుంటూ ఉంటుంటే , అవి ఈ  ప్రత్యేక సందర్భాలలో , అసలే మర్చి పోకూడదు ! ఎందుకంటే , ఎప్పటి కన్నా , ఎక్కువ బ్లడ్ షుగర్ ఉండే రిస్కు ఉంది కనుక ( విందులలో ఎక్కువ గా తినడం వల్ల  ) 
7. ప్రతి విందులో కూడా , డయాబెటిస్ ఉన్న వారు, క్రితం టపా లో సూచించిన విధం గా, వారి  భోజన ప్లేటు లేదా పళ్లాన్ని ఆహార పదార్ధాలతో అమర్చుకోవాలి ! కనీసం ఆ ప్రయత్నం చేయాలి !
8. అట్లా ప్రత్యేక సందర్భాలలో సంభవం కాని పక్షం లో , అక్కడ ఉన్న వంటకాలే మితం గా తినడం , ఎక్కువ గా ఆహూతులతో మాట్లాడుతుండడం చేయాలి ! అప్పుడు నోరు ( తినడం లో కాక !  ) మాట్లాడడం లో బిజీ అయిపోతుంది , అట్లా, తక్కువ తినడం జరుగుతుంది !  సోషల్ మీటింగ్ ను ” సోషల్ ఈటింగ్ పోటీ ”  అని భావించ కూడదు, డయాబెటిస్ ఉన్న వారు ! 
9. డయాబెటిస్ ఉంటే , తక్కువ పరిమాణం లో ఆహారం తరచూ తినడం చేయాలి ,  కడుపు నిండా షుష్టు గా , ఒక్కసారిగా కాక !  
10. మన నాలుకకు రుచే తెలుసు కానీ , ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తక్కువ గా ఉత్పత్తి అయి ,రక్తం లో చెక్కెర ను కంట్రోలు చేయలేకపోతుందని తెలిసేది మెదడు కే  కదా , ఆ  మెదడు   తో నాలుకను ” కంట్రోలు ” చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ! అట్లా కాక, నాలుకనే  నమ్ముకుంటే , డయాబెటిస్ ఉన్న వారి పరిస్థితి ,” కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన ”  విధం గా ఉంటుంది ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

 

25.డయాబెటిస్ లో, భోజన పళ్ళెం ఎట్లా ఉండాలి ? ( Plate method )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 16, 2013 at 12:24 సా.

25.డయాబెటిస్ లో భోజన పళ్ళెం ఎట్లా ఉండాలి ? ( Plate method )

క్రితం టపాల లో డయాబెటిస్ లో పథ్యం లో తీసుకోవలసిన ముఖ్య మైన జాగ్రత్తల లో భాగం గా, ‘ లో జీ ఐ ‘ ఆహారం ఏమిటి , కీలక పోషక పదార్ధాలు ఏమిటి ? అనే సంగతుల గురించి తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు   ప్రతి సారీ డయాబెటిస్ ఉన్న వారు , లేదా ‘ డయాబెటిస్ రాకూడదు’  అనుకునే వారు , వారి భోజన విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎట్లా ఉండాలో తెలుసుకుందాం !  అంతే కాకుండా , ఆ జాగ్రత్తలు శాస్త్రీయం గా, ఎంత వరకూ సమంజసమో కూడా తెలుసుకుందాం ! సాధారణం గా ప్రతి వారి ఆహార వ్యవహారాలు , అనేక మైన పరిస్థితుల మీద ఆధార పడి ఉంటాయి ! వయసు, వారు శాక హారులా లేదా మాంస హారులా ?, వారు నివసించే ప్రదేశం , వారి కులగోత్రాలూ , వారి ఆర్ధిక పరిస్థితులూ , ఇంకా ముఖ్యంగా వారికి వివిధ ఆహార పదార్ధాల మీద ఉండే ప్రీతి , ( దానినే జిహ్వ చాంచల్యం అని కూడా అనవచ్చేమో ! ) , వారు పడే శ్రమా , ఇట్లా అనేక పరిస్థితులు వారి  ఆహార నియమాలను ప్రభావితం చేస్తాయి కదా ! ఇంత వరకూ బానే ఉంది ! కానీ ఒక్క సారిగా డయాబెటిస్ రావడం జరిగితే , ఆ డయాబెటిస్ కు ఈ పరిస్థితుల గురించి ఏమాత్రమూ  పట్టదు ! అంటే, రక్తం లో ఎక్కువ అవుతున్న చెక్కెర !  పై కారణాలు చెప్పి ఎవరూ అనారోగ్యం పాలు అవుదామనుకోరు కదా ! అందువల్ల , డయాబెటిస్ లో ప్రతి సారీ భోజనం చేసే సమయం లో భోజన పళ్ళెం ఈ క్రింది విధం గా అమర్చుకోవాలి ! 
1. మీరు రోజూ భోజనం ఏ పళ్ళెం లో అయితే చేస్తారో , ఆ ప్లేటు ను లేదా పళ్లాన్ని , రెండు సగాలు గా అనుకుని రెండో సగాన్ని మళ్ళీ రెండు సగాలు గా అనుకోండి ! అంటే మీరు కేవలం మీ ఊహ తోటే , మీ ప్లేటు ను మూడు భాగాలు గా విభజించు కుంటున్నారన్న మాట !
2. అందులో మొదటి భాగం అంటే  పళ్ళెం లో అర్ధ భాగం లో ,పిండి పదార్ధాలు ( అంటే ఆలుగడ్డలు , చిలగడ దుంపలు చేమ దుంపలు లాంటి దుంప కూరలు ) కాని ఆకుకూరలనూ , కూరగాయలనూ నింపండి ! ఇవి మీ ఇష్టమైనవి ఏవైనా కావచ్చు ! అంటే  మీ ఇష్టమైన ఆకు కూరలు, కూరగాయలు, చక్కగా ఉడికించినవి ! గమనించ వలసినది,   మీ ఇష్టమైన కూరలు ,దిట్టం గా నూనె వేసి , బాగా మసాలాలు వేసి చేసిన వేపుడు కూరలు , కాకూడదు ! అప్పుడు అవి మీ ఆరోగ్యానికి అనేక రకాలు గా హాని చేస్తాయి ! ( నూనెలు ఎక్కువ గా వాడడం వల్ల కొలెస్టరాలు పెంచే విధం గానూ , మసాలాలు వేయడం వల్ల , కడుపు లో మంటలూ , మసాలాలకు సమానం గా ఉప్పు వేసుకోవడం వల్ల , అధిక రక్త పీడనమూ ! )
బీన్సు , టమాటా , బ్రాకోలీ , బచ్చలి , కాకర కాయ , కాలీ ఫ్లవర్ , ఉల్లి గడ్డలు , కుక్క గొడుగులు , బీర కాయ , పొట్ల కాయ , సొర కాయ , లాంటి ఆకుకూరలూ , కూరగాయలూ ! ఇట్లా సగం ప్లేటు వీటితో నింపి తినడం వల్ల , శరీరానికి రోజూ కావలసిన విటమిన్లూ , ఖనిజాలూ మాత్రమే కాక , పీచు పదార్ధం కూడా పుష్కలం గా లభిస్తుంది దానితో పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా నివారింప బడుతుంది ! సగం ప్లేటు ఇట్లా తిన్నా కూడా , క్యాలరీలు మాత్రం తక్కువ గా ఉండి , చెక్కెర చక్కగా కంట్రోలు లో ఉంటుంది ! మరి డయాబెటిస్ కంట్రోలు కు కావలసినది అదే కదా ! 
మిగతా రెండు భాగాలలో ( అంటే ఈ రెండు భాగాలూ ప్లేటు కు ఇంకో సగం అవుతాయి ! ) ఒక భాగం లో ఉడికించిన ధాన్యాలు అంటే వరి , గోధుమ , రాగులు ,జొన్నలు లాంటి ధాన్యాల అన్నం కానీ , చిరుధాన్యాలు కానీ , లేదా పప్పుదినుసుల తో చేసిన పప్పు కానీ పప్పు చారు కానీ తీసుకోవచ్చు ! ఈ పిండి పదార్ధాలు , అసలు మానేస్తే రోజూ అవసరమయే  క్యాలరీలు ఎట్లా సమకూరుతాయి ? అందువల్ల  వాటిని మానేయకూడదు ! 
ఇక మూడో భాగం లో , మాంస కృత్తులు , వాటితో చేసిన వంటకాలనూ, ఇంకా పాలు , పెరుగునూ ( అన్నీ కాదు ! ) ఉంచుకుని తినడమూ , తాగడమూ చేయాలి ! 
పాలైతే, కొవ్వు తీసేసిన పాలు , లేదా పెరుగు అవుతే రెండు మూడు పెద్ద చెంచాల పెరుగు తీసుకోవచ్చు !
చివరగా , ఒక అరగ్లాసు పళ్ళ రసమో, లేదా మీకు నచ్చిన ఒక పండు ముక్క నో తినవచ్చు ! 
పైన వివరించిన ప్లేటు లో గమనించవలసినది , మనం సాధారణం గా పచ్చడి లోకి ఒక కప్పు అన్నమూ , కూరలోకి ఇంకో కప్పు , పప్పు లోకి ఇంకో కప్పు అట్లా ముద్ద ముద్ద కూ అన్నమూ , నెయ్యీ వేసుకుని తినడం కాకుండా , అన్నం లేదా ధాన్యాలతో చేసిన వంటలు పరిమితం గా ఒక చిన్న భాగం లోనే ఉన్నాయి ప్లేటు లో !  డయాబెటిస్ లో,  అపరిమితమైన అన్నం , అపరిమితమైన సమస్యలు తెస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !