Our Health

రచయత ఖజానా

విటమిన్ A – అనావృష్టి ( లోపం ). 5.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 10, 2012 at 6:53 సా.

విటమిన్ A – అనావృష్టి ( లోపం ). 5.

క్రితం టపాలో మనం విటమిన్ A ఉన్న వివిధ జంతువుల కాలేయాలు ( అంటే కోడి , మేక , బాతు, లేదా చేపల కాలేయాలు ) వాటితో చేసిన వంటకాలు ,అతిగా తినడం వల్ల , మన దేహం లో విటమిన్ A ఎక్కువ గా నిలువ అయి , దాని వల్ల కలిగే దుష్పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా తెలుసుకున్నాం కదా ! కాక పొతే ఇట్లా అతి విటమిన్ A అంటే హైపర్ విటమినోసిస్ అనే పరిస్థితి సామాన్యం గా జరగదు, ఈ విటమిన్ లోపం తో పోలిస్తే ! అంటే ఈ A విటమిన్ లోపం వల్ల బాధ పడే వాళ్ళే ఎక్కువ గా ఉంటారు.
ఇప్పుడు విటమిన్ A లోపం గురించి తెలుసుకుందాం !

File:Vitamin A deficiency.PNG

( source : World Health Organisation )
ప్రపంచం లో విటమిన్ A లోపం , చాలా ప్రబలం గా ఉంది. ముఖ్యం గా అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ప్రతి ఏటా , ఒక అంచనా ప్రకారం ఆరు లక్షల మంది కి పైగా పిల్లలు ( అయిదేళ్ళ లోపు వయసు వారు ) మరణిస్తున్నారు , ఇంకా మూడున్నర లక్షల మంది కి పైగా చిన్నారులు అంధులు అవుతున్నారు , కేవలం విటమిన్ A లోపం తోనే ! వారి కళ్ళ తో ఈ అందమైన ప్రపంచాన్ని చూడ లేక పోతున్నారు ! కేవలం సంవత్సరం లో రెండు మార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి విటమిన్ A గుళిక ను అంటే కాప్స్యుల్ ను చిన్న పిల్లలకు ఇవ్వడం ద్వారా , వారి అంధత్వం నివారించవచ్చు. వారి మరణాలను కూడా నివారించ వచ్చు.
చికిత్స :
విటమిన్ A లోపం నివారణ చేస్తే , అంధత్వం తో పాటుగా , చిన్న పిల్లల మరణాలను కూడా తగ్గించ వచ్చని తెలిసింది అనేక పరిశీలనల వల్ల . చికిత్స ముఖ్యం గా మూడు రకాలు గా ఉంటుంది.
ఒకటి: విటమిన్ A గుళికలను అంటే క్యాప్సుల్స్ ను మూడు నాలుగు నెలలకు ఒకసారి చిన్న పిల్లలకు వేస్తె వారి లో ఈ విటమిన్ లోపం మాయ మవుతుంది. అంటే వారి చూపు చక్కగా ఉంటుంది, రేచీకట్లు మానిపోతాయి. వారికి ప్రపంచం అంతా మళ్ళీ అందం గా కనిపిస్తుంది ! ఈ రకమైన చికిత్స పిల్లలకు ఆ వయసు లో వచ్చే అతి సార వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అంతే కాక , వారికి మీజుల్స్ ( measles ) అనే వైరస్ వల్ల వచ్చే జబ్బు కూడా చాలా తక్కువ గా వస్తుందని తెలిసింది.
రెండు: విటమిన్ A లోపం విస్తృతం గా ఉన్న దేశాలలో , అక్కడి ప్రజలు తినే ఆహారం లో అంటే , ఉదాహరణకు , వెన్న , వంట నూనెలు , చపాతీలకు ఉపయోగించే గోధుమ పిండిలోనూ , ఈ విటమిన్ A ను కలిపి , ఆ యా పదార్ధాలను ప్రజలు తినడం ద్వారా కూడా ఈ విటమిన్ లోపం నివారిస్తున్నారు.
మూడు : ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చి : గమనించ వలసిన విషయం ఏమిటంటే , మనకు అవసరమయే విటమిన్ A , సహజ సిద్ధమైన ఆకు కూరలలోనూ, దుంప కూరలలోనూ , ముఖ్యం గా క్యారట్, చిలగడ దుంప లలో కావలసినంత లభ్యం అవుతుంది.
మనం కానీ , ఎవరైనా కానీ చేయవలసిందల్లా , వారి ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుని , ఈ సహజ సిద్ధమైన వాటిని తరచూ వారి వారి ఆహారం లో తింటూ , అంధత్వాన్ని నివారించడమే కాకుండా , ఆరోగ్యం గా కూడా ఉండ వచ్చు !

ఆల్కహాలు అతి గా సేవించే వారికీ విటమిన్ A లోపానికీ సంబంధం ఉందా ?:

కొన్ని సంక్లిష్టమైన జీవ రసాయన చర్యలలో ( అతి గా, చాలా కాలం గా సేవించే ) మద్యం ” ప్రముఖ పాత్ర ” వహించి అనేక B విటమిన్ల తో పాటుగా ( వీటి గురించి ముందు తెలుసుకుందాం ) A విటమిన్ లోపానికి కూడా కారణ ‘భూతం” అవుతుంది !

మరి చిన్న పిల్లలలో అంధత్వ నివారణకు మనం ఏమైనా చేయ గలమా ?:

ఉత్సాహం ఉన్న వారు వారి వారి దేశాలలో జరుగుతున్న అంధత్వ నివారణ సేవా కార్యక్రమాలలో తమ వంతు ఎంతో కొంత చేయ వచ్చు ! 

హెలెన్ కెల్లర్ అనే అమెరికన్ స్త్రీ , ( చిన్నతనం లో ఒక వైరస్ వ్యాధి సోకి , తన చూపు , వినికిడీ కోల్పోయినా ) , పట్టుదలతో చదువుకుని , తన పేరున ఒక సేవా సంస్థ ను షుమారు వందేళ్ళ క్రితమే స్థాపించి , తన సేవా కార్యక్రమాల ద్వారా , ప్రపంచం లోని అనేక లక్షల మందికి చూపు ప్రసాదించింది ! మీలో ఎవరికైనా కొంత డొనేట్ చేయాలనే ఉద్దేశం ఉంటే హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్ డాట్ ఆర్గ్ ( http://www.hki.org ) చూడండి !

( The leading cause of childhood blindness is vitamin A deficiency. Every year, it is estimated that 670,000 children will die of vitamin A deficiency, and 350,000 children will go blind. Vitamin A supplementation is considered to be the most cost effective, high-priority public health treatment in the world, costing just $1.00 per child per year.Twice-yearly treatments of vitamin A can prevent blindness in children and save their lives; last year, HKI delivered over 85 million vitamin A capsules to children. )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

In ప్ర.జ.లు., మానసికం, Our mind, Our minds on డిసెంబర్ 9, 2012 at 2:23 సా.

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

క్రితం టపాలలో మనం మన నిత్య జీవితం లో మన కళ్ళ ఆరోగ్యానికీ , మన శరీర చర్మ ఆరోగ్యానికీ, విటమిన్ A  ఎంత ముఖ్యమైన విటమినో తెలుసుకున్నాం కదా ! అసలు విటమిన్లన్నీ మన దేహానికి చాలా తక్కువ పాళ్ళ లో క్రమం తప్పకుండా అందుతూ ఉండాలి ! ఒకవేళ మనకు అన్నీ ఉండి అంటే , మనం ఒక మాదిరిగా ధనవంతులమై ఉండి, రోజూ లక్షణం గా ” షడ్ర సోపేతం గా ” అన్నీ వేసుకుని తినడం చేస్తూ ఉన్నప్పుడు , మనకు కావలసినంత కన్నా ఎక్కువ విటమిన్లు మనకు అందవచ్చు ! ఆ పరిస్థితిలో అట్లా ఎక్కువ గా లభించిన విటమిన్లు ముఖ్యం గా విటమిన్ A మన శరీరం లో లివర్ దానినే కాలేయం అంటారు కదా తెలుగులో , అందులో నిలువ చేయ బడతాయి. కానీ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే , విటమిన్ A , ఇంకా విటమిన్ E, D, K ( ముందు ముందు తెలుసుకుందాం ) మన దేహం లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ గా ఉంటే , ఆ పరిణామాలు కూడా విపరీతం గా ఉంటాయి. అంటే అప్పుడు వచ్చే లక్షణాలు చెడు గా ఉంటాయి.

ఇట్లా అతి వృష్టి ( విటమిన్ A ) ఏ ఏ పరిస్థితులలో జరుగుతుంది ?: 

సామాన్యం గా షాపులలో దొరికే విటమిన్ మాత్రలు లేదా మల్టీ విటమిన్ మాత్రలు, విటమిన్ లోపం ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళన, కంగారులో , అతిగా వేసుకోవడం వల్ల ,( అంటే డాక్టర్ సలహా ప్రకారం కాకుండా ఆరోగ్యం మీద అత్యాశ కు పోయి ) జరగ వచ్చు.
అలాగే ముఖ్యం గా ( ముఖ్యం గా మాంసాహారుల ) తల్లి దండ్రులు తమ పిల్లలు తెలివిగానూ , ఆరోగ్యం గానూ , త్వరగానూ ( ! ) పెరగాలని , తరచూ కాలేయం , లేదా లివర్ తో చేసిన వంటలను , తినిపిస్తున్నప్పుడు కూడా ఈ విటమిన్ A కాస్తా ” అతి విటమిన్ A ” అవవచ్చు.
ఈ పరిస్థితిని ” హైపర్ విటమినోసిస్ ” అని అంటారు. గమనించ వలసిన విషయం ఏమిటంటే , శాకాహారుల ఆహారం లో ఇట్లాంటి పరిస్థితి చాలా అరుదు గా వస్తుంది. ఎందుకంటే జంతువుల కాలేయం లేదా లివర్ లోనే విటమిన్ A అధిక శాతం లో ఉంటుంది. క్యా రెట్ లలో కూడా ఉంటుంది కానీ రోజూ ఎక్కువ క్యారట్ లు తిన్న వారికి   ( అట్లా నెలల తరబడి తింటూ ఉంటే నే ) కూడా ఈ అతి విటమిన్ A లక్షణాలు రావడానికి అవకాశం ఉంది .
మరి ఈ హైపర్ విటమినోసిస్ A లక్షణాలు ఎట్లా ఉంటాయి ?:

శాక హారులైనా , లేదా మాంస హారులైనా ఈ విటమిన్ A కావలసిన దానికన్నా ఎక్కువ గా మన శరీరం లో నిలువ ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
1. చర్మం గరుకు గా అయి పొలుసులు పొలుసులు గా ఊడిపోవడం ( దీనిని ఇంగ్లీషు లో desquamation డి స్క్వామేషన్ అంటారు ).
2. మన ఎముకలు పెళుసు గా తయారై నొప్పులు రావడం
3. లివర్ లేదా కాలేయం సరిగా పని చేయక
4. పచ్చ కామెర్ల లాగా చర్మం రంగు మారడం
5. వెంట్రుకలు ఎక్కువ గా ఊడిపోవడం

ఇంకా వికారం గా కళ్ళు తిరగడం , బీ పీ పెరగడం , ఏకాగ్రత లేక పోవడం కూడా జరుగుతుంటాయి.
మరి చికిత్స ఏమిటి ?: చికిత్స ఈ విటమిన్ A శరీరం లో ఎంత ఎక్కువ గా నిలువ ఉన్నదీ అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. ఈ అనుమానం ఉన్నపుడు , వెంటనే స్పెషలిస్టు డాక్టరు ను సంప్రదించాలి.
వచ్చే టపాలో విటమిన్ A ( లోపం ) అనావృష్టి ని ఎట్లా చికిత్స తో నివారించ వచ్చు వాటి వివరాలు తెలుసుకుందాం !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2012 at 7:16 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.


విటమిన్ A : విటమిన్ A మన శరీరానికి అవసరమయే అతి ముఖ్య విటమిన్. ” సర్వేంద్రియానాం నయనం ప్రధానం ” అంటారు. అట్లాంటి కంటిలో ఇంకో అతి ముఖ్య మైన భాగం రెటినా . ఈ రెటినా సరిగా పనిచేయక పొతే , మనం చూస్తున్నవి సరిగా కనిపించవు. రెటినా లో మనం కళ్ళు తెరిచి చూసే కాంతి ని గ్రహించే శక్తి కేవలం మనం క్రమం గా మన ఆహారం లో తీసుకునే విటమిన్ A వల్లనే వస్తుంది !
విటమిన్ A లోపం తో మన చర్మం లో ఉండే ఎపితీలియల్ కణాలూ , ఇంకా ఇతర కణాల పెరుగుదలకు ఒక గ్రోత్ హార్మోన్ లా పనిచేసి , వాటి ని ఆరోగ్యం గా అంటే చర్మాన్ని , ఆరోగ్యం గా ఉంచుతుంది. అంతే కాక మన కణాలలో జరిగే అనేక జన్యు పరమైన చర్యలకు కూడా విటమిన్ A అతి ముఖ్యమైనది.
మరి మనకు రోజూ ఎంత అవసరం ఈ విటమిన్ A ?
పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రోజుకు కావలసిన విటమిన్ A కేవలం ఆరు వందలనుంచి , మూడు వేల మైక్రో గ్రాములు మాత్రమె .గుర్తు ఉంచుకోండి ,మైక్రోగ్రామ్ అంటే మిల్లీ గ్రాము లో వెయ్యో వంతు , లేదా గ్రాములో లక్షో వంతు మాత్రమె ! కానీ ఈ కాస్త కూడా మన శరీరానికి రోజూ లభ్యం కాక పొతే పరిణామాలు ( పైన చెప్పిన విధం గా ) తీవ్రం గా ఉంటాయి !
మరి ఈ విటమిన్ పుష్కలం గా వేటిలో ఉంటుంది ? :

శాక హారులైతే : పాలకూర , బచ్చలి కూర, చుక్క కూర , తోట కూర , లాంటి ఆకు కూరల్లో నూ , కారట్ , బ్రాకోలీ , చిలగడ దుంప లలోనూ , పచ్చి బటానీ లోనూ ,కొంత వరకూ గేదె పాలల్లోనూ ఉంటుంది !
మాంస హారులైతే : కోడి, మేక , చేప , ఈ జంతువుల కాలేయం అంటే లివర్ లో ఎక్కువ శాతం విటమిన్ A ఉంటుంది. కోడి గుడ్డు లో కొంత శాతం ఉంటుంది.
మంచి వెన్న లో నూ జున్నులో కూడా సరిపడినంత విటమిన్ A లభిస్తుంది !

మరి ఈ ఆకు కూరలనూ , కూర గాయలనూ ఎట్లా తింటే , వాటిలోనుంచి , మన శరీరానికి , వీలైనంత విటమిన్ A అందుతుంది ?

సామాన్యం గా విటమిన్ A కొవ్వులో కరుగుతుంది అంటే నూనె పదార్ధాలలో , అందువల్ల కొద్దిగా నూనెలో కానీ, వెన్న , లేదా నెయ్యి తో తాలింపు వేస్తూ ఉంటారు ,మన తల్లులూ , అమ్మమ్మలూ ( భార్యలు కూడా ఇట్లా చేయక పొతే , ఇక ముందు నుంచీ చేయడం మంచిది ! ) ఇట్లా చేయడం వల్ల కేవలం ఆ ఆకు కూరలు, కూర గాయాలతో చేసిన వంటలు , రుచి గా ఉండడమే కాకుండా , వాటిలో ఉన్న విటమిన్లు ముఖ్యం గా నూనె లో కరిగే విటమిన్ A ఎక్కువ శాతం శరీరానికి లభ్యం అవుతుంది ! చూశారా , తల్లులు సదా తమ సంతానం యొక్క ఆరోగ్యం కోరుకునే ఎంత దూర దృష్టి కలవారో !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.2 .

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 7, 2012 at 7:28 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.2 .

జవాబు : క్రితం టపాలో ప్రశ్న వివరం గా చదివారు కదా ! కానీ ఆశ్చర్యమేమిటంటే , వందల మంది ఈ టపాను చూసినా ఒక్కరు కూడా తమ సమాధానం పోస్ట్ చేయలేదు ! కారణాలు తెలియదు !
ఈ టపాను కేవలం ఇంట రాక్టివ్ గా చేసి వీలైనంత ఎక్కువ మంది కి ఉపయోగ కరం గా ఉండాలనే ఉద్దేశం తోనే ఈ ప్రశ్న ను అడగడం జరిగింది.
పరవాలేదు , ఇక సమాధానం చూడండి :
లత చిన్నప్పటినుంచీ ఆహారం విషయం లో తన ఇష్టా ఇష్టాలతో , కొన్ని ప్రత్యేకమైన ఆహారాలే తిన్నది. లత తల్లి దండ్రులు కూడా , ఆమె ఇష్టా ఇష్టాలకే తల ఒగ్గి , కనీసం ఎదో కొంత తింటుందని , సంతృప్తి చెందారు ! ఒక్క గానొక్క కూతురు లత మీద వారికి ఉన్న ప్రేమ , లత ఆహారం విషయం లో, తల్లిదండ్రులు గా వారి బాధ్యతను విస్మరింప చేసింది !
గమనించ వలసినదేమిటంటే , లత సహజ పోషకాలున్న ఆకు కూరలు , కూరగాయలు తినడం దాదాపు మానేసింది ! కేవలం బంగాళా దుంపల్లో , చక్కగా పెరుగుతున్న లతకు కావలసిన పోషకాలన్నీ లభ్యం అవడం లేదు !
ముఖ్యం గా రక్త వృద్ధి కి కావలసిన ఇనుము , అంటే ఐరన్ , లత శరీరానికి అందట్లేదు ! ఇక విటమిన్లు కూడా శరీరం లో తగిన పరిమాణం లో లేవు ! ముఖ్యమైన విటమిన్ A లోపం కూడా క్రమేణా లోపిస్తూ ఉంది లత శరీరం లో !
శాకాహారి అయిన లతకు ఆహారం లో విటమిన్లూ , ఇనుమూ పుష్కలం గా ఉండే ఆకు కూరలు , కూరగాయలు కూడా తినక పోవడం తో వాటి లోపం లక్షణాలు, కాలక్రమాన కనిపించాయి లతలో ! దానితో కొంతవరకూ లాభం ఉండే కోడి గుడ్డు కూడా తినలేక పోయే సరికి , లత ఇంకా బలహీన మైంది !
గమనించ వలసిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే , రజస్వల అయినప్పటి నుంచీ , స్త్రీలలో ఋతు స్రావం జరిగి , రక్త హీనత అంటే రక్తం లో హీమోగ్లోబిన్ తక్కువ అయి , రక్తం పలుచ బడుతుంది ! రక్తం పలచ బడితే ( అంటే రక్తం లో ఉండే హీమోగ్లోబిన్ అనే పదార్ధం ఇనుము లోపం వల్ల అవసరమైనంత తయారవదు ) , మన శరీరం లో వివిధ భాగాలకు , ముఖ్యం గా మెదడుకు , ప్రాణ వాయువు అంద వలసినంత అందక , విపరీతమైన అలసటా , ఏకాగ్రత కోల్పోవడం కూడా జరుగుతుంది ! కళ్ళు తిరిగినట్టు అనిపించడం , చాలా సేపు నిలబడ లేక పోవడం కూడా జరుగుతుంది ! రక్త హీనత వల్ల కూడా మన చర్మం పాలిపోయి తెలుపు రంగుకు వస్తుంది. కానీ ఈ తెలుపు ఆరోగ్య కరమైన తెలుపు కాదు ! మన ఆహారం లో ఇనుము అంటే ఐరన్ లోపించడం వల్ల  హీమోగ్లోబిన్ మనకు సరిపడినంత తయారు అవదు.  ఆ కారణం గా మనలో కనిపించే లక్షణాలు అనీమియా ( anaemia ) లేదా రక్త హీనత వ్యాధి  లక్షణాలే ! 
ఇక విటమిన్ A లోపం వల్ల చర్మం లో కణాలు సరిగా పెరగక , పగుళ్ళు రావడం , గరుకు గా అనిపించడం కూడా జరుగుతుంది ! ఈ పరిస్తితులలో ముఖం మీద పూసుకునే క్రీములూ , ఫేస్ లూ చేసే లాభం శూన్యం ! ఎందుకంటే అవి కేవలం, పగుళ్ళను కనపడకుండా కవర్ చేస్తాయి కానీ , కారణాన్ని పరిష్కారం చేయవు ! ముఖ్యం గా రాత్రి సమయాలలో చూపు మందగించడం ( దీనినే ” రే చీకట్లు ” అంటారు ) సున్నితమైన కంటి పొరల మీద చిన్న చిన్న పొక్కులు గా రావడం కూడా జరుగుతుంది ! ఇంకా అశ్రద్ధ చేస్తే దృష్టి లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంది ! 

వచ్చే టపాలో చికిత్సా వివరాలు తెలుసు కుందాం !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.1.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 6, 2012 at 8:10 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.1.

ప్రశ్న: లత పందొమ్మిది ఏళ్ల వయసున్న అమ్మాయి. ఒక్క గానొక్క కూతురవడం తో , గారాల పట్టి లా , పెరిగింది. చామన ఛాయ తో ,చాక్లెట్ లా ఉండేది ! చిన్నప్పటినుంచీ , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టా ఇష్టాలు ఉండేవి , మిగతా తన వయసు పిల్లల లాగానే ! ఒక్కతే కూతురవడం చేత లత కు ఇంకా ఎక్కువ గా ఉండేవి ఈ ఇష్టా ఇష్టాలు !
చిన్నప్పటినుంచీ , క్రమం గా ఇంటి తిండి ఎక్కువ రుచించ కుండా పోయింది. అమ్మ ఎంత కమ్మగా వండినా , ఎక్కువ గా తినేది కాదు. ప్రత్యేకించి , ఆకు కూరలు , కూరగాయల తో చేసిన వంటకాలు అసలు తినేది కాదు ! ఎప్పుడు తిన్నా , పెరుగన్నం , కొద్ది గా బంగాళా దుంపల కూర తినేది ! తల్లి కనీసం అవైనా తింటుందని ప్రేమ తో చాలా తరచుగా , బంగాళా దుంపల తో వివిధ వంటకాలు చేసి పెడుతూ ఉండేది లతకు ! స్వతహా గా కుటుంబమంతా శాక హారులు కూడా ! కొంత కాలం , కోడి గుడ్డు అలవాటు చేద్దామనుకుని ప్రయత్నించారు ఇంట్లో ! కోడి గుడ్డు అలవాటు సంగతి అటుంచి , వాంతులూ వికారాలతో లత పరిస్థితి అధ్వాన్నం గా తయారయింది ! ఇంట్లో తిండి సరిగా తినడం లేదని , నాన్న గారు హోటల్ కు తీసుకు వెళ్లి , పల హారాలు తినిపించేవారు ! అట్లాగైనా కాస్త బలం గా ఉంటుందని ! క్రమేణా కాస్త బరువు పెరిగి చూడడానికి , నిజం గానే లతలా చక్కగా ఉండేది లత !
పద్నాలుగేళ్ళ వయసు లో లత , రజస్వల , అదే ” పెద్ద మనిషి ” అయింది. చక్కగా పొడుగు పెరుగుతూంది పేరు కు తగ్గట్టు లతలా సుకుమారం గా అనేక అందాలు సంతరించుకుంటుంది లత ! వక్షోజాలు పెరుగుతూ , లతలో సహజం గా ఆడ పిల్లలకు ఉండే సిగ్గు ఇంకాస్త ఎక్కువ చేశాయి ! రెప రెపలాడే ఓణీ కూడా లత అందాలను తన చాటున దాచుకోడానికి చేసే ప్రయత్నాలు తరచుగా విఫల మయ్యేవి ! కూడా లత పరువాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలలో పరికిణీలు కూడా ఒడి పొయేవి ! ఎందుకంటే , పరికిణీ లలో లత బాపు బొమ్మ లా ఇంకా అందం గా కనిపించేది ! తన సహజమైన చాక్లెట్ రంగు క్రమేణా మారి పోయి , లత తెల్ల బడడం మొదలైంది ! తల్లి దండ్రులిద్దరూ చామన ఛాయ తో ఉన్నా , లత రంగు చూసి ఆనంద పడేవారు , పెద్దమనిషి అయింది కదా , అట్లాంటి మార్పులు సహజమే నేమో అనుకున్నారు. లత చదువులో కూడా బాగా రాణించేది ! బాగా కష్టపడి చదివేది కూడా ! , అవసరమైతే రాత్రులూ , పగలూ కూడా ! క్రమేణా లతకు అలసట ఎక్కువయింది ! చీటికీ మాటికీ కళ్ళు తిరగడం , బస్ స్టాప్ లో ఎక్కువ సేపు నిలబడ లేక పోవడం , పడిపోతానేమో నన్న భయం తో వెంటనే కూర్చోవడం కూడా చేస్తుంది ! ఇదివరకటి లా ఎక్కువ సమయం చదవ లేక పోతుంది, ఏకాగ్రత ఉండట్లేదు ఇది వరకు లా ! రాత్రులలో చూపు కూడా కొద్దిగా మందగిస్తూ ఉంది !
తన లేత చర్మం కాస్తా చీటికీ మాటికీ చిన్న చిన్న పగుళ్ళు వచ్చి మంటలు పుడుతున్నాయి అప్పుడప్పుడూ ! వెంటనే తల్లి దండ్రులు , పెళ్లి వయసు లో ఉన్న అమ్మాయి , చర్మ సౌందర్యం బాగో లేక పొతే , ఇంకేమన్నా ఉందా అని కంగారు పడుతూ , అత్యవసరం గా మార్కెట్ లో ఉన్న ఓ డజను క్రీములూ, ఫేస్ ప్యాక్   లూ
కొని వాడించారు లత చేత ! ఏమాత్రం ఇంప్రూవ్ మెంటు లేక పోగా , లత మానసికం గా పోవడం మొదలు పెట్టింది , తల్లి దండ్రుల పరిస్థితి సరే సరి !

లత లో వచ్చిన ఈ మార్పులకు కారణం, లేదా కారణాలు ఏమిటి ? మీరు లతకూ , ఆమె తల్లి తండ్రులకూ ఏమి సలహా ఇస్తారు ? ప్రత్యేకించి ఏ జాగ్రత్తలు సూచిస్తారు ?

వచ్చే టపాలో వివరాలు తెలుసుకుందాం !

విటమిన్లూ ( ఖ ) నిజాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 5, 2012 at 8:10 సా.

విటమిన్లూ ( ఖ ) నిజాలూ ! :


విటమిన్లు, ఖనిజాలూ, మన దేహం లో ఉండవలసిన అతి ముఖ్యమైన పదార్ధాలు ! అవి మనం రోజూ తినే ఆహారం ద్వారా మన శరీరం లో ప్రవేశిస్తాయి. అన్నం, పప్పు, కూరలు ,లాగా మనకు కనిపించే పరిమాణం లో కాక చాలా సూక్ష్మ పరిమాణం లో మన శరీరానికి అందాలి విటమిన్లూ , ఖనిజాలూ ! అంటే మిల్లీ గ్రాములూ , మైక్రో గ్రాముల పరిమాణం లో ఇవి మనకు కావాలి ! కానీ ఈ సూక్ష్మ పరిమాణం లో కూడా మనకు రోజూ అంద వలసిన విటమిన్లూ , ఖనిజాలూ మనకు ఏ కారణం చేతనైనా అందక పొతే , వాటి పరిణామాలు విపరీతం గా ఉంటాయి ! అంతేకాదు , మన ప్రాణాలకే ముప్పు కావచ్చు , ఈ విటమిన్లూ , ఖనిజాలూ మన దేహం లో ఉండ వలసిన పరిమాణం కన్నా తక్కువ గా ఉంటే !
మనం కొంత కాలం ఆహారం లేక పోయినా , బలహీన పడతాము కానీ పరిస్థితులు చాలా రోజుల వరకూ విషమించవు , కానీ విటమిన్లూ ఖనిజాలూ – వీటి లోపం తీవ్రం గా ఉంటే , చాలా తక్కువ సమయం లోనే తీవ్ర పరిణామాలను మన దేహం ఎదుర్కోవలసి వస్తుంది !
ఇంకో ముఖ్య విషయం : విటమిన్లూ , ఖనిజాలూ కేవలం వయసు మీరిన వారికే కాక , అన్ని వయసుల వారి ఆరోగ్యానికీ అత్యవసరం ! అందు వల్ల అందరూ ఈ విటమిన్లూ , ( ఖ ) నిజాలూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది !

వచ్చే టపా నుంచి ఈ విషయాలు తెలుసుకుందాం ! మన ఆరోగ్యం కోసం ! మన బాగు కోసం !

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 2, 2012 at 5:32 సా.

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

పక్షులు కలలో కనిపిస్తే: ఈ రకమైన కలలు అనేక విధాలు గా అర్ధం చెపుతాయి. సామాన్యం గా ఒక పక్షుల గుంపు కనక కలలో కనిపిస్తే , అది మీరు కోరుకునే స్వేచ్చ , స్వాతంత్ర్యానికి ప్రతీక ! మీకు ( కలలో ) కనిపించే పక్షులు కనుక తెలుపు రంగులో ఉంటే అది మీ ప్రేమ, దయా గుణాలను సూచిస్తుంది. పక్షులు నల్ల రంగులో ఉంటే మీరు మంచి వార్తలను , చెడు వార్తలను కూడా త్వరలో విన బోతున్నారని సంకేతం ! ఎర్ర రంకులో కనుక ఆ పక్షులు వుంటే అది మీ హృదయాన్ని తెలుపుతుంది , మీ హృదయం విశాలమైనదని కూడా తెలుపుతుంది. నీలం రంగు పక్షులను కలలో చూస్తే , అది మీ భవిష్యత్తు దిశా నిర్దేశనం చేస్తున్నట్టు ! పసుపు పచ్చని పక్షులు కలలో వస్తే , అది ఆనందాన్నే కాకుండా , కొంత పిరికి తనాన్ని కూడా తెలుపుతుంది , సందర్భాన్ని బట్టి ! పక్షుల గుడ్లు కనుక కలలో కనిపిస్తే మీకు త్వరలో ధన యోగం ఉందని అర్ధం. అంటే మీకు ధనం చేకూరుతుంది త్వరలో !
పడక గది : పడక గది మీకు కలలో కనిపిస్తే , అది మీలో ఉన్న , నిగూఢ మైన , రహస్యమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంతే కాక అది మీ లో ఉన్న సృజనాత్మక శక్తి ని కూడా తెలుపుతుంది. పడక గది లో ఇంకో వ్యక్తి తో కనుక ప్రణయం , రతి క్రియలో పాల్గొన్నట్టు కల వస్తే , మీకు ఆ వ్యక్తి తో ఉన్న గాఢ సంబంధాన్ని సూచిస్తుంది. మీ సృజనాత్మక శక్తి ని కూడా ప్రతి బింబిస్తుంది. అదే మీరు మీ పడక మీద నిద్ర సరిగా పోక , పీడ కలలు వస్తూ ఉంటే , మీ ఇరువురి మధ్య , ఉన్న కలతలను , సమస్యలను సూచిస్తుంది.

పడవ : మీ కలలో మీరు పడవ మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తే , మీ హృదయాంత రాళాల ను , మీరు తరచి చూసుకుంటున్నారని అర్ధం ! అంటే మీ మనసు మూలల్లో ఉన్న అనేక అనుభూతుల పరంపరను మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేయడానికి పూనుకుంటున్నట్టు ! మీరు ఆ పడవ తో పాటుగా నీటి లోతుల్లోకి పోతూ ఉంటే , మీ ఎమోషన్స్ ను సరిగా విశ్లేషించు తున్నట్టు , అదే మీరు , అలల తాకిడి కి తట్టుకుని , ఆ పడవలో తీరాలకు పోతూ ఉంటే , మీ లో ఉన్న వివిధ అనుభూతులను, భావోద్రేకాలనూ, అధిగమించి , తీరాన్ని చేరుకున్తున్నట్టు సూచన ! అదే పడవ ఆటు పోట్లకు తట్టుకో లేక ముక్కలయినట్టు కల వస్తే , మీరు, మీ ప్రణయ సంబంధాలలో , తొందర పడుతున్నారనడానికి సూచన. అప్పుడు , మీరు , ఆచి , తూచి, అడుగులు వేయాలి , నిర్ణయాలు తొందర పడకుండా, తీసుకోవాలి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలలూ – అంతరార్ధాలూ.7.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 1, 2012 at 7:12 సా.

కలలూ – అంతరార్ధాలూ.7.


ఉచ్చారణ :
కలలో మీకు వివిధ యాక్సెంట్ లతో అంటే వేరు వేరు ఉచ్చారణ లతో మాట్లాడుతున్న వారు కనిపించడం జరిగితే , అది మీకు అర్ధం కాక పోతూ ఉంటె , మీరు మీ భావాన్ని, మీ అనుభూతులనూ , సరిగా ఇతరులకు , తెలియ చేయ లేక పోతున్నట్టు అనుకోవచ్చు. అంతే కాక , మీరు మీ జీవితం లో ఎదుర్కునే అనేక పరిస్థితులలో , మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేక , తడ బడుతున్నారనుకోవచ్చు.
ప్రమాదం జరిగినట్టు కల వస్తే : ఈ విధం గా కల రావడం సామాన్యం గా జరుగుతూ ఉంటుంది. ఈ కల ముఖ్యమైనది కూడానూ ! అందువల్ల మీకు వీలైనంత గా ఈ కల గురించి నోట్ చేసుకోవాలి ! ఏ ప్రమాదమైనా జరిగినట్టు కల కనుక వస్తే , అది , మీలో పేరుకు పోయిన లేదా నిగూ ఢ మై ఉన్న అనేక మానసిక సంఘర్షణలు , ఉద్రిక్త హావ భావాలూ , కోపోద్రేకాలకూ సంకేతం ! అంటే ఈ రకమైన ఎమోషన్స్ ఎదో విధం గా బయట పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ అపరిష్కృతం గా ఉన్న ఎమోషన్స్ మీద మీ దృష్టి కేంద్రీకరించి , వాటి పరిష్కార మార్గాలు వెతకాలి ! వివిధ వాహనాలలో ప్రయాణం , ప్రమాదానికి లోనవుతే , వివిధ అర్ధాలు ఉంటాయి.
విమానాలు: చాలా మంది కి విమానాలు కలలో వస్తూ ఉంటాయి. ఈ కలల అర్ధాలు పరిశీలిద్దాము.
విమానాశ్రయం : మీరు కేవలం విమానాశ్రయం కలలో చూస్తే మీ జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం జరగ పోతున్నట్టు , అంటే ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అన్న మాట. మీరు ఆ పరిస్థితి లో ఏ నిర్ణయం సమంజసమైనదో తెలియక సందిగ్ధం లో ఉంటారు. అంతేకాక విమానాశ్రయం మీకు ఒక హాలిడే ఆవశ్యకతను కూడా సూచిస్తుంది.
విమానం లో ఎగురుతూ ఉంటే : విమానాన్ని మీరే నడిపిస్తూ ఎగురుతూ ఉంటే , మీ జీవిత గమనం లో మీరు పూర్తి కంట్రోలు తో అంటే నియంత్రణ తో ముందుకు సాగి పోతున్నట్టు. అదే ఇంకెవరైనా విమానాన్ని నడుపుతూ , మీరు కేవలం వారితో ప్రయాణం చేస్తూ ఉంటె , మీ జీవితాన్ని ఇంకెవరో నియంత్రించు తున్నట్టు , అందులో మీ ప్రమేయం తక్కువ గా ఉన్నట్టు అనుకోవాలి.
మీ ఎదురుగా విమానం ఎగురుతూ ఉంటే : మీరు నుంచుని చూస్తూ ఉన్నప్పుడు, మీ ఎదురుగా విమానం గాలిలో ఎగురుతున్నట్టు కల వస్తే, మీరు మీ ఆశయాలనూ, గమ్యాలనూ సరిగా, ఉన్నతం గా నిర్దేశించు కున్నారనీ , ఆ గమ్యాలు మీరు అందుకో గలవేననీ కూడా అనుకోవచ్చు.కానీ మీ ఎదురుగా విమానం కూలి పోయినట్టు కల వస్తే, మీ పధకాలు సఫలీకృతం కాలేక పోతాయి అని సూచిస్తుంది. అప్పుడు మీ పధకాలను రివ్యూ అంటే పునశ్చరణం చేసుకుని, లోపాలను సరి దిద్దుకోవాలి !
మీరు విమానం, అంటే  ఫ్లయిట్  మిస్ అయినట్టు కల వస్తే : ఈ కల మీ లో ఉన్న ప్రయత్న లోపాన్ని తెలియ చేస్తుంది. అంటే మీరు తీసుకో బోయే కీలకమైన నిర్ణయాలలో , ఎదో లోపం ఉందని . అప్పుడు మీరు మీ నిర్ణయాలనూ , లక్ష్యాలనూ మళ్ళీ పరీక్షించుకుని , తదనుగుణం గా మార్పులు చేసుకోవాలి విజయ పధం వైపు దూసుకు పోయే విధం గా !

వచ్చే టపాలో ఇంకొన్ని కలలూ , వాటి అంతరార్ధాలూ !

కలలూ , అంతరార్ధాలూ . 6.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on నవంబర్ 30, 2012 at 7:57 సా.

కలలూ , అంతరార్ధాలూ . 6.

https://i0.wp.com/www.buzzle.com/img/articleImages/401219-109-8.jpg

1. వదిలి వేయడం  :
నిద్రలో మిమ్మల్ని మీ తల్లి దండ్రులు గానీ , స్నేహితులు గానీ , లేదా భార్య , లేదా ప్రియురాలు , లేదా ప్రియుడు ఏ ప్రదేశం లో నైనా వదిలి వెళ్లి పోతున్నట్టు మీకు కల వస్తే , అది మీలోని అభద్రతా భావాన్ని తెలియ చేస్తుంది.
మీకు సహకారమూ , సహాయమూ అవసరమని కూడా సూచన ఇస్తుంది. ఈ సహాయ సహకారాలు మీరు చేస్తున్న లేదా చేయబోయే కార్యాల లో కావచ్చు , లేదా మీ జీవిత గమనం లో కావచ్చు. లేదా నిజ జీవితం లో మీరు నిజం గా మీరు కోల్పోయిన అత్యంత విలువైన వ్యక్తులను  స్పురణ కు తెస్తూ వచ్చే కల కావచ్చు ! ఇట్లా కల రావడం మీ లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవలసిన అవసరాన్ని తెలియ చేసే సూచన కావచ్చు !
ఇట్లాంటి కల కనుక మీకు తరచూ వస్తూంటే , మీ బాల్యం నుంచీ మనసు మూలల్లో దాగున్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నట్టు భావించ వచ్చు ! ఆ సందర్భం లో మీరు ఆ కారణాలను విశ్లేషించుకుని , సరి చేసుకుంటే , అట్లా కలలు రావడం తగ్గుతుంది. అదే, మీ అంతట మీరు ఎవరి ప్రమేయమూ లేకుండా మీరు ఉన్న చోటిని కానీ , చేస్తున్న పనిని కానీ అసంపూర్ణం గా వదిలి వేసి వెళ్లి పోతున్నట్టు కల కనుక వస్తే , అది మీ బాధ్యతా రాహిత్యాన్ని చెపుతుంది ! అంటే మీరు చేస్తున్న పనిని శ్రద్ధ తో చేయకుండా ” ఆ పనిని దాటవేయ డానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితం లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకోవడం లో మీరు సందిగ్ధం లో పడతారని కూడా ఇట్లాంటి కలలు తెలియ చేస్తాయి. అప్పుడు మీరు తక్షణ కర్తవ్యం గా ఆ పనిని బాధ్యతా యుతం గా చేయడానికి పూనుకోవాలి ! 

2. ఎత్తుకు పోవడం , అమాంతం గా తీసుకు పోవడం :
మీకు కలలో మిమ్మల్ని అమాంతం గా , అంటే ఒక్క సారిగా , లేదా బలవంతం గా మీరు ఉన్న చోటి నుంచి కానీ , మీరు నిద్రలో ఉన్నప్పుడు తట్టి లేపి కానీ, మీకు తెలియని చోటికి కనుక తీసుకు వెళుతున్నట్టు కల వస్తే , వెంటనే మీకు మెలకువ కూడా వచ్చి చాలా ఆందోళన పడడం కూడా జరుగుతుంది. ఈ రకమైన కల సామాన్యం గా మీకు బాగా సన్నిహితం గా ఉన్న వ్యక్తులు , మీ ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మీ జీవితాన్ని నియంత్రించు తున్నట్టు , లేదా తమ గుప్పెట లో పెట్టుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చు. ఆ పరిస్థితులలో మీరు , మీ జీవిత నావ చుక్కాని ని మీరే తీసుకుని అలలు , ఆటు పొట్ల దిశ గా కాకుండా , ఆనంద తీరాల వైపు మరల్చు కోవాలి ! అంటే , ఇతరుల ” మాయ ” మాటలకు తల ఊపకుండా , మీ సహజ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒకరు ఇంకొకరిని బలవంతం గా తీసుకు పోతుంటే , మీరు కేవలం మూడో వ్యక్తిగా ఆ ప్రదేశం లో ఏమీ చేయకుండా నుంచున్నట్టు కనుక కల వస్తే , అది మీ జీవితం లో మీరు తీసుకునే నిర్ణయాల లో మీ నిస్సహాయ స్థితిని సూచిస్తుంది.

వచ్చే టపాలో ఇంకొన్ని కలల అర్థాలు తెలుసుకుందాం !

కలలు మనకు చెప్పేదేమిటి ? 5.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 25, 2012 at 8:51 ఉద.

కలలు  మనకు చెప్పేదేమిటి ? 5. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఇప్పటి వరకూ , మన జీవితాలలో మనం కనే కలల ప్రాముఖ్యత ఇదీ అని ఖచ్చితం గా మనకు, అంటే శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు. కాక పొతే సైకాలజిస్టులు ( మానసిక శాస్త్రజ్ఞులు ) ఈ కలల విశ్లేషణను ,  జీవిత మార్గ నిర్దేశనం చేయడానికీ ,వాళ్ళు తమ దోవలు అవసరమైతే మార్చుకుని , ఆనంద మార్గాలలో పయనించడానికి కూడా ఉపయోగిస్తారు ! అంటే ఈ రోజు మనం కనే కలలు , సరి అయిన విశ్లేషణ చేసుకుంటే , రేపు మన భవిష్య నిర్దేశన చేయ గలవు ! ఒక విధం గా కలలను , మన ప్రవర్తన , వ్యక్తిత్వం , మనలో నిక్షిప్తమై , నిశ్శబ్దం గా ఉన్న మన అనుభూతులూ , సూచనలు గా చెప్పుకోవచ్చు. ఈ కలల నిజా నిజాల మీద మనలో అనేక మంది కి అనేక స్వతంత్ర అభిప్రాయాలు సహజం గానే ఉంటాయి. కానీ వీటన్నిటినీ తాత్కాలికం గా పక్కన పెట్టి , మనం కనే ఈ కలల విశ్లేషణ చేసుకుని , వాటి పరిణామాలను పరిశీలించుకుని అవలోకనం చేసుకోవడం , ఆసక్తి దాయకం గానూ , సరదాగానూ ఉంటుంది.
మనం, కలలను ఎట్లా గుర్తుంచు కోవచ్చు ?

1. డ్రీమ్ డైరీ మొదలు పెట్టడం: ఈ పధ్ధతి చాలా మంది చేస్తూ ఉంటారు. ఒక వేళ చేయకపోతే , ఇది ఒక మంచి సూచన ! డైరీ లో ప్రతి రోజూ , లేదా కల వచ్చినప్పుడల్లా , ఆ కల వివరాలు ఒక నోట్ బుక్ లో రోజు వారీ గా రాసుకుంటే ఉపయోగ కరం గా ఉంటుంది. ఇట్లా తమ కలలను జాగ్రత్త గా పుస్తకాలలో రాసుకునే వారిలో వారి జ్ఞాపక శక్తి ఎక్కువ అవడమే కాకుండా , వారికి ప్రీకాగ్నిషన్ అంటే వారి భవిష్యత్తులో వారికి జరాగాబోయే సంఘటనల మీద కూడా సూచనాశక్తి అధికం అవుతుందని తెలిసింది.
2. కలం, కాగితం: కంప్యుటర్ కన్నా కలం తో కాగితం మీద కలలను రాసుకోవడం మంచి పధ్ధతి. మనకు వచ్చే కలలను తొంభై శాతం వరకూ మనం మరచి పోతూ ఉంటాం ! అందు వల్ల కలం కాగితం బెడ్ ప్రక్కనే పెట్టుకుంటే , వెంటనే రాసుకోవడానికి వీలు గా ఉంటుంది.
3.ఏమి రాయాలి ? ఇందులో ప్రత్యేకం గా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే , కలలో కనిపించిన ప్రతి దృశ్యాన్నీ వివరం గా రాసుకోవడమే ముఖ్యం. అంటే కల జరిగిన ప్రదేశాన్నీ , ఉన్న మనుషులనూ , లేదా జంతువులనూ , కనిపించిన రంగులనూ , ఏమైనా సింబల్స్ అంటే గుర్తులు కనిపిస్తే వాటిని కూడా రాసుకోవడం మంచిది. ఆ కలను ఎంత సంపూర్ణం గా రాసుకుంటే అంత మంచిది.
4.ఎక్కువ నిద్ర , ఎక్కువ కలలు : సాధారణం గా కలలను గుర్తు తెచ్చుకోలేక పోవడానికి ఒక ముఖ్య కారణం , నిద్ర సరి అయిన సమయానికి పోకుండా , ఎక్కువ సమయం మేలుకుని ఉండడమూ , లేదా త్వరగా నిద్ర లేవడం కూడా ! మనకు రోజు కావలసిన నిద్ర అంటే రమారమి 7 నుంచి 8 గంటలు నిద్ర పోయినప్పుడు మనకు వచ్చే కలలను గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ గా ఉంటుంది.
5.నిద్ర లేచినప్పుడు : అంటే కలలు వచ్చినప్పుడు వెంటనే బెడ్ మీద నుంచి లేచి, ఆ కలలను నోట్ చేసుకోవడం అన్న మాట. మొదటిలో కష్టం గా అనిపించినా , ఈ పధ్ధతి అలవాటు అవుతే , కల రాగానే అప్రయత్నం గా పూర్తిగా మెలకువ వచ్చి , ఆ కలను చాలా వరకు గుర్తు కు తెచ్చుకో గలుగుతారు.
6.రి వైండ్ చేయడం : ఒక వేళ ఇట్లా వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుటే , మనం వీడియో టేపు ను కానీ సీడీ ని కానీ రీ వైండ్ చేసినట్టు చేసుకుని మొదటి నుంచీ గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పద్ధతిలో కల పదిలం గా గుర్తుకు వచ్చే అవకాశాలు హెచ్చుతాయి.
7.స్లో డౌన్ అండ్ రిలాక్స్ : మనలో చాలా మందికి , మెలకువ రాగానే , బెడ్ మీద నుంచి లేచి పరిగెత్తడమే పని. తయారై బ్రేక్ ఫాస్ట్ చేసి , కాలేజీ కో , ఆఫీసు కో వెళ్ళే తొందర ! కానీ కలలను గుర్తుకు తెచ్చుకోవాలంటే ఈ పధ్ధతి పనికి రాదు. మెలకువ రాగానే , మిగతా విషయాలు ఏవీ వెంటనే ఆలోచించ కుండా , కేవలం మీకు వచ్చిన కల మీదనే మీ దృష్టి అంతా కేంద్రీకరించండి ! అప్పుడు మీకు వచ్చిన కల చాలా వరకూ మీ కు గుర్తు కు వస్తుంది.

అంతర్జాలం లో ఈ కలల గురించి బోలెడన్ని సైట్లు ఇప్పటికే ఉన్నాయి , కానీ అవన్న్నీ ఆంగ్లం లో నే ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని కలల విశ్లేషణలను మీ ముందు ఉంచ దలచాను , మన తెలుగులో ! మీకు నచ్చితే , మీ కలలు కూడా తెలియ చేయండి , చూద్దాం విశ్లేషణ ఎట్లా చేయ వచ్చో ! వచ్చే టపా నుంచి మనకు వచ్చే సామాన్య మైన కలల అంతరార్ధాలు తెలుసుకుందాం !