Our Health

రచయత ఖజానా

శాస్త్రీయం గా కలలు ఏమిటి ?.4.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 23, 2012 at 5:42 సా.

శాస్త్రీయం గా కలలు ఏమిటి ?.4.

ఇప్పటి వరకూ జరిపిన అనేక పరిశోధనల మూలం గా కలలు మన నిద్ర లోని ఒక దశ అయిన REM or Rapid Eye Movement Sleep , రెమ్ స్లీప్ లో వస్తాయి. మరి ఈ రెమ్ స్లీప్ అంటే ఏమిటి ?:
రెమ్ స్లీప్ కూ NREM or Non Rapid Eye Movement sleep , ఎన్ రెమ్ కూ తేడా కేవలం కనులు వేగం గా నూ , నిదానం గానూ కదలడమే కాకుండా , రెమ్ స్లీప్ లో మనం నిద్ర పోతున్నప్పటికీ , మనసు మాత్రం , అంటే మెదడు మాత్రం పూర్తిగా నిద్రావస్థ లో కాకుండా ,అప్రమత్తత గా ఉంటుంది. అందువల్ల ఈ దశలో వచ్చిన కలలను మనం తేలిక గా గుర్తు ఉంచుకో గలమన్న మాట !
చాలా కలలు కేవలం అయిదు నుంచి ఇరవై నిమిషాలు ఉంటాయి. మన జీవిత కాలం లో మనం సరాసరి ఆరు సంవత్సరాల కాలం కలలు కంటాం ! అంటే ప్రతి నిద్రలోనూ షుమారు రెండు గంటలు ! రెమ్ స్లీప్ లో మిగతా దశల కంటే మెదడు లో నిరంతరం ఉత్పత్తి అయే నార్ ఎపినెఫ్రిన్ , సీరోటోనిన్ , ఇంకా హిస్టమిన్ అనే జీవ రసాయనాలు సప్రెస్ అవుతాయి అంటే రెమ్ స్లీప్ లో ఈ రసాయనాలు విడుదల అవ్వవు.
ఇంకో ఆశ్చర్య కర విషయం ఏమిటంటే , మనకు వచ్చే కలలు, ఎంత సేపు వస్తాయో అంత సేపూ ఆ కలలు , అనుభూతులు ఉంటాయి. అంటే నిద్రలో ఒక పది నిమిషాలు కనుక కల వస్తే, ఆ పది నిమిషాల సమయం నిజ జీవితం లో కూడా పది నిమిషాల సమయమే ! అంతే కాక మనం నిద్ర పోయినప్పుడు , మొదటి దశలో పది నిమిషాలు కనుక కల వస్తే క్రమేణా ఆ సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే , నిద్ర చివరి దశలలో కలలు ఎక్కువ సమయం అంటే ఒక అర గంట వరకూ కూడా వస్తూ ఉంటాయి. ఈ నిద్ర చివరి దశలలో వచ్చే కలలు , ఆ సమయం లో కనుక నిద్ర లేచినప్పుడు కానీ, అంటే మనంతట మనకు మెళకువ వచ్చినప్పుడు కానీ , లేదా ఎవరైనా మనలను నిద్ర నుంచి లేపినప్పుడు కానీ , షుమారు తొంభై తొమ్మిది శాతం మనకు గుర్తుకు వస్తాయని పరిశోధనల వల్ల నిర్ధారణ అయింది. అంటే మనకు వచ్చే కలలను మనం గుర్తు కు తెచ్చుకోవడం అనేది , ఆ కలలు మన నిద్రలో ఏ దశలో వస్తాయీ అన్న విషయం మీద ఆధార పడి ఉంటుందన్న మాట ! అందువల్లనే మనం కనే అన్ని కలలనూ మనం స్పష్టం గా గుర్తు తెచ్చుకోలేక తికమక పడుతూ ఉంటాం! ప్రత్యేకించి, అందమైన యువతులతోనో, లేదా యువకులతోనో , సుందరమైన ప్రదేశాలలో విహరిస్తూ ఉన్నట్టు కానీ , సమయం ఆనంద కరం గా గడుపుతున్నప్పుడు కానీ , ఆ సంఘటనలు కొన్ని సమయాలలో కేవలం ఫ్లాష్ లాగానే మనకు జ్ఞాపకం వస్తాయి తప్ప వివరాలు మనం ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావు !
అందుకే ఒక కవి ( కీర్తి శేషులు సముద్రాల రాఘవాచార్య ) శాస్త్రజ్ఞులు వివరించిన ఈ పరిస్థితిని అనేక దశాబ్దాల క్రితమే ( ఏ పరిశోధనలూ అవసరం లేకుండానే ! ) అమోఘం గా వివరించాడు , ఒక ( సినిమా ) పాట లో !
నీవేనా నను తలచినది , నీవేనా నను పిలచినది, నీవేనా?
నీవేనా నా మది లో నిలిచి హృదయము కలవర పరచినది !
నీవేలే నను తలచినది , నీవేలే నను పిలచినది ,
నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవర పరచినది , నీవేలే , నీవేలే !
కలలోనే ఒక మెలకువగా , ఆ మెలకువ లోనే ఒక కలగా !
కలయో నిజమో వైష్ణవ మాయో , తెలిసీ తెలియని అయోమయం లో !
కన్నుల వెన్నల కావించి , నా మనసున మల్లెలు పూయించి ,
కనులను మనసును కరగించి ,
మైమరపించీ , నన్నలరించి ,
నీవేలే , నీవేలే !

యూ ట్యూబ్ లో  ఈ పాట వింటే , చూస్తే , మీకు ఇంకా నచ్చుతుంది !

 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

కలల గురించి ఫ్రాయిడ్ ఏమన్నాడు ?3.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2012 at 7:06 సా.

 కలల గురించి ఫ్రాయిడ్ ఏమన్నాడు ?3.

సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మానసిక విశ్లేషకుడు , సైకో తెరపిస్ట్. మానసిక రుగ్మతల మీదా , కలల మీదా ఆయన చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ ( ఒక వంద సంవత్సరాల తరువాత కూడా ) ప్రముఖమైనవి గా భావించ బడుతున్నాయి.
ఆయన ప్రతి పాదన ప్రకారం , కలలు మానవుల లో నిగూఢమైన తీరని కోరికలు, వారికి వచ్చే కలలకు ” మేత ” అంటే కలలకు ప్రాణం ” అని. అంతే కాక కలలు మానవుల మనో భావాలకు ( అన్ కాన్షస్ ) కు రాజ మార్గాలు ” అని
ఆయన ఉద్దేశం లో కలలు రెండు రకాలు ! ఒకటి : నిగూఢమైన కలలు, రెండు: బహిరంగమైన కలలు. నిగూఢమైన కలలు సామాన్యం గా మనసు లోతులలో మనలో దాగి ఉన్న కోరికల ఊటలు ! ఇవి కామ పరమైనవి గా ఉంటాయి. అంటే యువకుడి లో వచ్చే కలలు తనకు అత్యంత ప్రియమైన యువతి తో సరస సల్లాపాలు ఆడుతున్నట్టు కానీ , లేదా కామోత్తేజం చెంది ఆ యువతి తో కామ క్రీడలలో పాల్గొన్నట్టు కానీ అయి ఉంటాయి ! అదే విధం గా యువతిలో వచ్చే కలలు కూడా తనను ప్రేమిస్తూ , తన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ , తన కామ వాంఛ లను తీరుస్తూ , తనూ ఆనందం పొందుతున్న యువకుడి కలలు కంటుంది.ఒక విధం గా చెప్పాలంటే , మనలో దాగి ఉన్న , ముఖ్యం గా తీరని , తీవ్రమైన కామ వాంఛ లు , కోరికలూ , ఈ నిగూఢమైన కలల రూపం లో బయట పడుతూ ఉంటాయి ! ఇక బహిరంగం గా వచ్చే కలలు పెద్దగా చెప్పుకోవలసిన విషయాలు ఏవీ ఉండక అంటే ప్రాముఖ్యత ఏమీ లేనివి గా ఉంటాయి ! ఈ బహిరణమైన కలల ప్రాముఖ్యత ఏమైనా ఉందంటే , అది నిగూఢమైన కలలను తరచూ కప్పి వేయడం ! అంటే నిగూఢమైన కలలు ఈ కలల అడుగున దాగి ఉంటాయి !
ఇక ఫ్రాయిడ్ శిష్యుడు అయిన  కార్ల్ జంగ్ కూడా కలల గురించి ఏమన్నాడో తెలుసుకుందాం !
షుమారు గా గురువు గారు చెప్పిందే ఈయన ఇంకో రకం గా , తనదైన రీతి లో చెప్పాడు ! జంగ్ గారి ఆలోచన ప్రకారం కలలు, మానవుల లో నిక్షిప్తమైన కోరికలు అని ! అంతే కాక కలలు , వారికి వచ్చే సందేశాలని ! అంటే మేస్సేజెస్ ! అంటే కలలు మానవుడికి తన ఆత్మ పంపించే ఈ మెయిల్స్ అనుకోవచ్చు ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే వీడియో మెయిల్స్ ! జంగ్ గారి ప్రకారం ఈ వీడియో మెయిల్స్ ను ప్రతి మానవుడూ విశ్లేషించి , వాటిని పరిష్కరించుకోవాలని అన్నాడు ! ఈ విధం గా తమంత తాము కానీ లేదా ఎవరి సహాయం తో నైనా కానీ పరిష్కరించుకోక పొతే , కాల కాల క్రమేణా వారిలో వచ్చే అనేక రకమైన రుగ్మతలకూ , భయాలకూ ఈ కలలు కారణ భూతమవుతాయని కూడా జంగ్ అభిప్రాయ పడ్డాడు ! అంతే కాక ఇంకా ముఖ్యం గా మనకు వచ్చే కలలను కేవలం ఏవో నిద్ర సరిగా లేకనో లేదా , మనసు ఆందోళన గా ఉండడం వల్ల వచ్చి ఉంటాయని అనుకోకూడదు. కలలు ఒక దానితో ఇంకొకటి ముడి పడి , మానవులలో ఉన్న అనేక మానసిక ప్రవృత్తులను ఒక వెబ్ లాగా  ,అంటే ఒక సాలె గూడు లా ఉంటాయి అని కూడా జంగ్ అన్నాడు.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలల గురించి ఏమనుకునే వాళ్ళు ?.2.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 18, 2012 at 3:37 సా.

కలల గురించి ఏమనుకునే వాళ్ళు ?.2.


అనాది గా మానవులకు కలల అనుభవం చిత్రం గానూ వింత గానూ ఉండేది ! అందుకే వివిధ నాగరికతలలో మానవులు అనేక విధాలు గా వివరణ ఇచ్చే వారు , నమ్మే వారు ఈ కలల అనుభవాలను !
సుమేరియన్లు క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల కాలం లోనే , కలలు మన ఆత్మ పూర్తిగా కానీ, కొంత భాగం గానీ , మనం నిద్ర పోయినప్పుడు మన శరీరం లోనుంచి ” ఎగిరి పోయి ” , మనం కలలో ” విహరించిన ” ప్రదేశాలను సందర్శించి , తిరిగి మనకు మెలకువ వచ్చే సమయం లో తిరిగి మన శరీరం లో ప్రవేశిస్తుందని నమ్మే వారు !
బాబిలోనియన్లు మనకు వచ్చే మంచి కలలను దేవతలు పంపేవి గానూ , పీడ కలలు దయ్యాలు పంపేవి గానూ అనుకునే వారు !
ఈజిప్షియన్లు కూడా ( క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ల క్రితం ) మనకు వచ్చే కలలు దేవుడి సందేశాలు గా భావించే వారు ! అంతే కాక వారు, కలలు కనడం కోసం ప్రత్యేకమైన ప్రదేశాలలో , ప్రత్యెక మైన మందిరాలలో ,కలల పానుపు ల మీద శయనించి ( అంటే డ్రీమ్ బెడ్స్ ) , కలలు కనే వారు , మనసారా, తనివి తీరా !
సుమారు వేయి సంవత్సరాల కు పూర్వం రాసిన ఉపనిషత్తులు కూడా మనం కనే కలలకు కారణం , మనలో నిక్షిప్తమైన , నిగూఢమైన కోరికలను ప్రతి బింబిస్తాయనీ , మన ఆత్మ , నిద్రలో మననుండి దూరం గా విహరించి తిరిగి వస్తూందనీ వ్యాఖ్యానించారు !
గ్రీకు తత్వవేత్త హిపోక్రేట్స్ , మనకు వచ్చే కలలు పగలు నిర్మాణం అయి , రాత్రి నిద్రలో ఆ నిర్మాణం అయిన కలల చిత్రాలు మనకు కనిపిస్తాయి అని ప్రతిపాదించాడు. ఆ తరువాత కాలం లో ఇంకో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కూడా , మన కలలు మన రోజువారీ కార్యక్రమాల మీద ఆధార పడతాయనీ , మన కు వచ్చే జబ్బులను కూడా , మనం కనే కలల ద్వారా కనుక్కోవచ్చనీ బోధించాడు !
హిబ్రూ లు , క్రిస్తియన్లు కూడా కలలు , దేవుడి సందేశాలని నమ్మే వారు , ఎందుకంటే వారి మత గ్రంధాలలో అనేకమైన కధలు , కలలకు సంబంధించినవి ఉన్నాయి !
ఇక అమెరికన్లూ , మేక్సికనులూ కూడా , మన పూర్వీకులను కలల ద్వారా సందర్శించు కోవచ్చని నమ్ముతారు !
మనం భూగోళం అంతా తిరిగాము కదా అందరూ కలల గురించి ఏమనుకునే వారో, ఏమనుకుంటారో !

వచ్చే టపాలో మానసిక శాస్త్రజ్ఞుల వివరణ తెలుసుకుందాం !

 

 

కలలు నిజమేనా?1.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 17, 2012 at 9:29 ఉద.

 కలలు నిజమేనా?.1.

కలలు నిజమో కాదో తెలుసుకునే ముందు మనం అసలు కలలు ఏమిటో చూద్దాం!
కలలు శాస్త్రీయం గా, మన అనుభూతులు, ఆలోచనలల ప్రవాహాలు. ఈ ప్రవాహాలలో అత్భుత చిత్రాలు అంటే ఇమేజెస్ ఉండవచ్చు , లేదా మనసుకు నచ్చే ( లేదా భరించ లేని ) శబ్దాలు కానీ సంగీతం గానీ ఉండవచ్చు!
ఈ వివిధ భావోద్వేగాల ప్రవాహాలు అప్రయత్నం గా అంటే మన ప్రమేయం లేకుండా నే నిద్రలో నిద్రలో ఉన్నప్పుడు వస్తుంటాయి. వీటినే మనం కలలు అంటాము !
ఈ  అనుభూతులు, అనుభవాలు కలలో ఎందుకు వస్తాయీ అన్న ప్రశ్నకు ఇంత వరకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు !
మన నిద్ర సహజం గా కొన్ని దశలలో ఉంటుంది , ఒక కారు కనక వివిధ వేగాలతో రోడ్డు మీద ప్రయాణం చేసినట్టు ! ఆ వివిధ దశలలో మన మెదడు లో కూడా తదనుగుణం గా మార్పులు వస్తూ ఉంటాయి. నిద్రలో ఒక దశను రెమ్ స్లీప్ అంటారు అంటే REM sleep or Rapid Eye Movement sleep అని. ఈ దశ మనకు ఎందుకు ముఖ్యం అంటే కలలు సామాన్యం గా ఈ దశలో నే వస్తూ ఉంటాయి. ఈ దశలో మన కళ్ళు తదేకం గా కదులుతూ ఉంటాయి మనకు తెలియ కుండానే ! నిద్రలో మిగతా దశలలో కూడా కలలు వచ్చినా అవి అస్పష్టం గా ఉండి మనం తేలిక గా మర్చిపోయే లా ఉంటాయి. అంటే ఆ కలలను మనం అంత సులువు గా స్పష్టం గా గుర్తు కు తెచ్చుకోలేము !
మరి మన కలలు ఎంత సేపు వస్తాయి ?: సామాన్యం గా కొన్ని క్షణాలు మాత్రమె ఉంటాయి ఈ స్వప్నాలు. కానీ అధికం గా ఇరవై నిమిషాల వరకూ ఉండవచ్చు కొన్ని సమయాలలో !
మనకు వచ్చే ఈ కలలు రెమ్ స్లీప్ లో కనక మనం ఆ నిద్ర నుంచి లేస్తే కానీ లేదా ఎవరైనా మనలను నిద్ర నుంచి లేపితే కానీ , ఆ సమయం లో వచ్చిన కలను మనం చాలా వరకు గుర్తు కు తెచ్చుకో గలము !
ఒక నిద్రలో ఎన్ని కలలు వస్తాయి ?: సామాన్యం గా మనం మూడు నుంచి అయిదు కలలు కంటాము ఒక నిద్ర లో కానీ కొందరు డ్రీ మర్స్ ఏడు కలలు కూడా కనగలరు !
మనం రమారమి ఎనిమిది గంటలు కనక నిద్ర పొతే , ఆ నిద్రలో కనీసం రెండు గంటలు కలల ప్రపంచం లో విహరిస్తూ ఉంటాం!

కలలు మన నిజ జీవితానికీ , మన అంతర్ముఖానికీ అంటే మన మనసులలో ( అంటే మస్తిష్కాలలో ) దాగిన అనుభూతుల, లేదా ఆలోచనల పరంపర లకు ఒక వారధి గా భావించ బడుతుంది. ఈ కలలు అనేక విధాలు గా ఉండవచ్చు. ఏవిధం గా ఉన్నా మన కలలను మనం నియంత్రించ లేము ! అంటే ఆ కలలు మన స్వాధీనం లో ఉండవు ! కేవలం ఆ కలల అనుభూతులు మాత్రమె మనకు మిగులుతాయి !
కొన్ని సమయాలలో ఆనూహ్యం గా మన కలలు, మన జీవితాలలో స్ఫూర్తి ని కలిగించి మనకు ఒక మంచి ఆలోచనను కలిగించడమో లేదా ఒక ఉన్నత భవిష్య మార్గ నిర్దేశనం చేయడమో చేస్తాయి !
ఉదా : కేకులె అనే ఒక జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు బెంజీన్ అనే ఒక రసాయన నిర్మాణం తనకు కలలో కనిపించిన్దన్నాడు. ఆ నిర్మాణం శాస్త్రీయం గా రుజువు అవడమే కాకుండా , ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా సేంద్రియ రసాయన శాస్త్రం లో జరిగిన అత్యత్భుత ఆవిష్కారం గా ఇప్పటికీ పరిగణింప బడుతుంది !

మరి ఈ కలల శాస్త్రాన్ని ఏమంటారో చెప్పలేదు కదూ , దానిని ఒనీరాలజీ అంటారు( Oneirology ) ( కంగారు పడకండి పదం చూసి , గ్రీకు బాష లో ఒనీరోస్ అంటే నిద్ర , లజీ అంటే శాస్త్రం )

 

ఇంకొన్ని వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం !

 

 

కలలు నిజమేనా ?

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 16, 2012 at 8:42 సా.

కలలు నిజమేనా ?

 

కలలు ! మానవ జీవితాలలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తాయి. కలలు కనని మానవులు ఉండరు కదా! ఆనంద స్వప్నాలు , సుందర స్వప్నాలు , మధుర స్వప్నాలు , మరచి పోలేని కలలు, మై మరపించే కలలు , చెడ్డ కలలు , పీడ కలలు , సాహస కలలు , భయానక కలలు, ఇట్లా మనకు అనేక రకాలైన కలలు మన జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అవుతూనే ఉంటాయి !
మరి ఈ కలలు నిజమేనా ! మనం కన్న కలలు నిజమవుతాయా ?! అన్ని కలలూ నిజమవుతాయా లేక కేవలం ఆనందమయ మైన కలలే యదార్దాలవుతాయా ? మరి మన పూర్వ భారత అద్యక్షులు సలహా ఇచ్చినట్టు మనం కలలు కంటూ ఉంటే మంచిదేనా?!

ఈ కలలకు ఏమైనా అర్ధం ఉందా ? కలను బట్టి మన అంతరంగాన్ని విశ్లేషించ వచ్చా? కలలు కనడం మన మానసిక , భౌతిక ఆరోగ్యానికి మంచిదేనా ? ! 

మనం ఈ ప్రశ్నలకన్నిటికీ వీలైనంత శాస్త్రీయం గా విశ్లేషణ తో వివరం గా తెలుసుకుందాం , వచ్చే టపా నుంచి !

” బాగు” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 12, 2012 at 10:05 సా.

” బాగు ” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

Wish you a happy Diwali ! 

నిజమైన ప్రేమ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 11, 2012 at 9:21 సా.

నిజమైన ప్రేమ.3.

ఎటాచ్ మెంట్ : నిజమైన ప్రేమ ఆప్యాయత తో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక మాత్రు మూర్తి శిశువు తన గర్భం లో ప్రవేశించిన సమయం నుంచీ , తాను తుది శ్వాస తీసుకునే వరకూ , తన సంతానం మీద ఒకే రకమైన అవ్యాజమైన అనురాగం , ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. ఆ ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ఆ రకం గా వర్ధిల్లుతూ ఉంటుంది.
అదే రకం గా నిజమైన ప్రేమికుల ప్రేమ కూడా ఆప్యాయత , ఆపేక్ష తోలి చూపు నుంచి చిగురించి , దిన దిన ప్రవర్ధ మానమవుతుంది ! ఆ ఎటాచ్ మెంట్ అట్లా ప్రేమికులిరువురి లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక విధం గా చెప్పుకోవాలంటే దీర్ఘ కాలిక ప్రేమే ఎటాచ్ మెంట్ ! ప్రేమ పెరుగుతూ ఉంటే , దానితో పాటుగా ఎటాచ్ మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది !

కమిట్ మెంట్ : ప్రేమ పురోగమిస్తూ ఉన్న కొద్దీ ప్రేమికులు ఇరువురూ పరస్పరం కమిట్ మెంటు తో ( ప్రేమ ) జీవితం సాగిస్తూ ఉంటారు. ప్రేమ సాగర మధనం చేస్తూ ఉంటారు! ఎవరైనా ప్రియుడి ప్రవర్తన కామెంట్ చేసి ” అతడు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు ” అని ఎవరైనా అంటే మీరు వెంటనే ” ఔను. అతను చాలా గంభీరం గా , ధైర్యం గా, ధీమా గా ఉంటారు ” అని అతని లోని పాజిటివ్ లక్షణాలను  తెలియ చేస్తారు, మీ ఇరువురి మధ్య ప్రేమ ఘాటు గా ఉంటే ! అంటే కమిట్ మెంటు తో ఉంటే ! అదే కమిట్ మెంటు కనుక లోపిస్తే ” అతను నాతోటీ అంతే ! ఒక పట్టాన మాట్లాడడం అతి కష్టం ! మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమిటో !? అని అతని నెగెటివ్ లక్షణాలను అంటే లోపాలను వల్లె వేస్తూ ఉంటారు !
ఇంటిమసీ : నిజమైన ప్రేమ అంటే సన్నిహితం కూడా ! మనసులు కలిసినప్పుడు , పరస్పరం ఇరువురూ ఎప్పుడూ సన్నిహితం కోరుకుంటూ ఉంటారు! క్రమేణా , అతని లోని ప్రతి అణువూ ఆమెకు పిండి కొట్టినట్టు , ఆమెలోని ప్రతి అణువూ అతనికి కూడా అట్లాగే సంపూర్ణం గా అవగాహన అవుతుంది. గౌరీ శంకరులలాగా లో ఒకరు మమైకం అవుతారు. సన్నిహితం , స్నేహం గా మారి ఒకరి ఊపిరి లో ఇంకొకరి ఊపిరి గా ప్రేమ ప్రాణ వాయువు అవుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !

నిజమైన ప్రేమ ఏంటి ?.2.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 9, 2012 at 9:11 సా.

 నిజమైన ప్రేమ ఏంటి ?.2.

మరి అసలైన ప్రేమ ఎట్లా ఉంటుంది?:

నిజమైన ప్రేమ అంటే కేరింగ్ ( caring ) : గ్రీకులు ప్రేమను పలు విధాలు గా నిర్వచించారు. ఆపేక్ష , వాత్సల్యం, ఆప్యాయతా , అనురక్తి – ఇట్లా అనేక రకాలు గా ప్రేమ లక్షణాలను నిర్వచించారు. ఏ లక్షణాలతో నిర్వచించి నా , ప్రేమలో అతి ముఖ్యం గా కనిపించే ప్రధాన లక్షణం ,ప్రేమించిన వారు ప్రేమించ బడుతున్న వారిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. ఈ కేరింగ్ అనే ఆంగ్ల పదాన్ని సరిగ్గా తెనిగీకరించాలంటే ‘ అనురాగం ‘ అనే పదం వాడ వచ్చు నెమో ! ఈ అనురాగం నిరంతరం ఉంటుంది ప్రేమిస్తున్న వారిలో. ప్రేమించ బడుతున్న వారి మీద.
ఈ ప్రేమికులు , ప్రేమ పాత్రులు ఏ విధమైన శారీరిక లేక మానసిక బాధ కు లోనైనా తట్టుకోలేరు ‘ ప్రియా నీ వేలికి  గాయమయింది, నేను కట్టు కడతాను, ఆ వేలు నీ కుడి చేతి వేలు కూడా అయింది కదా ! నీవు ఆందోళన పడకు , ఆ గాయం మానే వరకూ నేను నీకు భోజనం స్పూన్ తో నీకు తినిపిస్తాను. సరేనా ” అంటారు. ” నీ ఒళ్ళు చూడు ఎంతగా మసిలి పోతుందో , తీవ్రం గా జ్వరం వచ్చినట్టు ఉంది, షాల్ కప్పుతాను నీ మీద , వెళ్లి పారాసేటమాల్ త్యాబ్లేట్స్ తెస్తాను వేసుకుని ఏ పనీ చేయకుండా రెస్ట్ తీసుకో బెడ్ లో అని చేతి లో చేయి వేసి తన పెదవులు ఆమె బుగ్గల మీద ఆనించి ధైర్యం చెప్పి స్వాంతన చేకూరుస్తారు ! చిన్న బాబో , పాపో పుడితే , అతి జాగ్రత్తగా వారిని తమ ఒడి లో కి తీసుకుని ముద్దాడతారు , వారి ఒడి లో ఒక అతి అందమైన ఆకర్షక పత్రాలున్న పుష్పం ఉన్నట్టు అనుభూతి చెందుతూ , ఆ ” పుష్పాన్ని ” ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ” అలాగే ప్రేమించే వారు , తమ తల్లి తండ్రులు కానీ , బంధువులు కానీ, వృద్ధులు గా ఉంటే వారిని అతి జాగ్రత్తగా నడిపించడమూ , లేదా వారికి కావలసిన పనులు శ్రద్ధ తో చేయడమూ కూడా చేస్తుంటారు. ఈ చర్యలు అన్నింటి లోనూ కేరింగ్ , లేదా అనురాగం ప్రేమించే వారిలో కలగలిసి ఉంటుంది. ఈ అనురాగం , రాగ ద్వేషాలకు అతీతం గా ఉంటుంది. సమయానుకూలం గా మారక ప్రేమించే వ్యక్తి జీవితాంతం ఉంటుంది. అది ప్రేమ లక్షణం !
నిజమైన ప్రేమ లో ఆకర్షణ ఉంటుంది ( attraction ) :
ఆకర్షణ ! ఎంతో అత్భుతమైన పదం ! సృష్టి లో ఆకర్షణ లేని జీవం , జీవితం లేదంటే అతిశయోక్తి కాదు ! ఉప్పొంగి లేచే కెరటాలు తీరం తాకడానికి ఉబలాట పడతాయి. అంటే కెరటాలు తీరం చేత ఆకర్షించ బడతాయి.
తుమ్మెద ఆకర్షణీయ మైన పుష్పం లోని మకరందం చేత ఆకర్షింప బడుతుంది. చిగురించే ప్రతి మొక్కా , ప్రతి ఆకూ , తమలో ఉత్తేజం కలిగించే , స్ఫూర్తి కలిగించే సూర్యుడి కాంతి వైపు ఆకర్షించ బడతాయి.
అంత సహజం గానే మనసు ప్రేమ మయం అయినప్పుడు , ఆకర్షణ ఆ ప్రేమలో నిక్షిప్తమై ఉంటుంది ఆమెలో ప్రతి ఆణువూ ఆకర్ష ణీయం అవుతుంది అతనికి ! ఆమె కాంతికి అతని ముఖం వికసిస్తుంది. అతని కాంతికి ఆమె హృదయం పులకరిస్తుంది. ఆమె వలపు తోట లో తీపి తలపుల పూలు విర బూస్తాయి ! నిజమైన ప్రేమలో ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య కోటి అయస్కాంతాల ఆకర్షణ పుడుతుంది. నిజమైన ప్రేమ లో వికర్షణ కు తావు ఉండదు, ఉంటే నిజమైన ప్రేమ అనిపించుకోదు !

వచ్చే టపాలో ఇంకొన్ని నిజమైన ప్రేమ లక్షణాలు తెలుసుకుందాం !

ప్రేమంటే ఏమిటి?.1.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 6, 2012 at 11:14 ఉద.

ప్రేమంటే ఏమిటి?.1.

 
నిజమైన ప్రేమంటే ఏమిటో తెలుసుకునే ముందు మనం ఏది ప్రేమ అనిపించుకోదో చూద్దాము.
1. మ్యానిప్యులేషన్ : ” ప్రియా , నీవు నన్ను నిజం గా ప్రేమిస్తే , నాతో వెంటనే వచ్చేయి , మీ అమ్మకూ నాన్నకూ ఇప్పుడే ఏమీ తెలియ నవసరం లేదు మన గురించి ! మనం ఎవ్వరికీ కనపడని దూర తీరాలకు వెళదాం , ఆనందం గా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ను.”
ఈ ధోరణిలో ఉంటుంది , ప్రేమ పేరుతొ ఇతరులను మ్యానిపులేట్ చేసే వాళ్ళ ప్రవర్తన.
2. కామ వాంఛ : ( లస్ట్ ): నా జీవితం అంతా నీ ఒడి లోనే గడపాలని ఉంది , నీ వెచ్చటి కౌగిటిలో నా ఆనందం నీతో పంచుకోవాలని ఉంది. నీతో పగలు కూడా శృంగార రాత్రులు గా మార్చి ఆనందం అనుభవించాలని ఉంది ” ఇట్లా ప్రవర్తించే వారు ప్రేమ కు దూరమై ‘ కామ దాసు లవుతారు ” . వీరి ప్రవర్తన కేవలం తనను ‘ వలచిన ‘ యువతి తో ప్రేమను పంచు కోవడం కాక నిరంతరం కామ వాంఛ లతో సతమతం చేసి అవాస్తవిక జీవితాలు గడుపుదామని ప్రయత్నాలు చేస్తుంటారు. అంతే కాక వారు గాఢమైన ప్రేమ లో ఉన్న నమ్మకం తో ఉంటారు. ఇక్కడ కేవలం శారీరిక తృప్తి మాత్రమె ముఖ్యమైన జీవితావసరం లా అనిపిస్తుంది.
3.నియంత్రణ ( కంట్రోలు ) : ఇంకో రకానికి చెందిన వారు తమ ప్రియులను , లేదా ఎక్కువగా తమ ప్రియు రాళ్ళను ఇరవై నాలుగు గంటలూ తమ సంపూర్ణమైన కంట్రోలు లో ఉంచు కుందామనే కృత నిశ్చయం తో ఉంటారు. ఆఫీసు నుంచి కానీ కాలేజీ నుంచి కానీ ఎక్కడికీ వెళ్ళకుండా నేరుగా ఇంటికే రావాలనీ , స్నేహితులకు ఎవరికీ ఫోను చేయడం కానీ , లేదా ఏవిధమైన సంబంధాలు పెట్టుకోవడం కానీ చేయకూడదనీ , తాము చెప్పిన బట్టలే వేసుకోవాలనీ, ఇట్లా విపరీతమైన ఆంక్షలు పెట్టి , తమను ‘ ప్రేమించిన ‘ వారి వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ , వారు ఆత్మ న్యూనతా భావం తో నూ , తమ కంటూ ఉన్న ఒక వ్యక్తిత్వాన్న్ని కోల్పోయే పరిస్థితులు కల్పిస్తారు. మిగతా సమయాలలో ‘ వారిని ఎంతో ప్రేమిస్తున్నారనే ‘ మాయ మాటలు చెపుతూ ! ఈ పరిస్థితులలో ఉన్న వారు తమ సహజ వ్యక్తిత్వాన్ని కోల్పోయి , తమ ప్రియుడు , లేదా ప్రియురాలు చెప్పినట్టు ( తమకు ఇష్టం లేక పోయిన పనులు ) చేస్తూ తమ జీవితాలతో రాజీ పడుతుంటారు. ఈ విధం గా విపరీతమైన నిరంకుశ మైన నియంత్రణ ప్రేమ అనిపించుకోదు.
4. హింస : ఈ హింస మానసికం గానూ , శారీరికం గానూ ఉండవచ్చు. సామాన్యం గా తమ ప్రియురాలిని కానీ భార్య ను కానీ , లేదా స్నేహితురాలిని కానీ తీవ్రమైన , పరుషమైన పద జాలం తో మానసికం గా హింసించ దమూ , లేదా శారీరికం గా హింసించడం కూడా జరుగుతుంటాయి.ఈ శారీరిక హింస కేవలం కొట్టడమూ , తీవ్రం గా ఊపడమూ , జుట్టు గట్టిగా లాగడమూ మాత్రమె కాకుండా , తమ ప్రియురాలికీ , భార్యకూ ఎంత మాత్రం ఇష్టం లేని సమయాలలో వారిని కామ పరం గా బలవంతం గా అనుభవించడం , రతి క్రియలో పాల్గొనడం కూడా.

ఈ సంఘటనలలో ప్రేమ అనే మాట పరాజయం పొంది ఆ హింసను అనుభవిస్తున్న స్త్రీ నిఘంటువు నుంచి సంపూర్ణం గా చెరిపి వేయ బడుతుంది ! ఇది సహజమే కదా !

( Domestic violence in India is endemic and widespread predominantly against women.[1] Around 70% of women in India are victims to domestic violence according to Renuka Chowdhury junior minister for women and child development. National Crime Records Bureau reveal that a crime against a women is committed every three minutes, a women is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes and one case of cruelty committed by either the husband or relative of the victim.[2] )

పైన ఉదాహరించిన కారణాలన్నీ నిజమైన ప్రేమ ను ప్రతి బింబించక పోవడమే కాకుండా , నిజమైన ప్రేమను అవహేళన చేస్తాయి.

మరి నిజమైన ప్రేమ ఏంటో వచ్చే టపాలో తెలుసుకుందాం !

ప్రేమంటే ఏమిటి?

In మానసికం, Our minds on నవంబర్ 4, 2012 at 5:45 సా.

ప్రేమంటే ఏమిటి?

ప్రేమ : మానవ జీవితం లో అతి విలువైన పదం. జీవితం లో వివిధ దశలలో వివిధ రకాలు గా ఈ ప్రేమ మానవులకు పరిచితం.
మానవుడి ప్రత్యెక అనుభూతులు , ఎమోషన్స్ లో అతి ముఖ్యమైనది ప్రేమ. దీనికి చదువు తో సంబంధం లేదు , ధనం తో సంబంధం లేదు. రంగు రూపాలతో పని లేదు.
కుల మతాలతో పని లేదు. దేశ జాతులతో ప్రమేయం లేదు. ప్రాణం ఉన్న ప్రతి మానవుడి జీవితం లో అనివార్యమై ఉంటుంది ప్రేమ. మానవ జీవితం లో ఇంత లోతు గా పెన వేసుకు పోయిన ఈ ప్రేమ అంటే ఏమిటి ? దేనిని మనం ప్రేమ అంటాము ? ఏది ప్రేమ కాదు ? ఇష్టమైన ప్రతి వారినీ ‘ ఐ లవ్ యు  ‘అంటే వారిని ప్రేమిస్తున్నట్టేనా ? అది ప్రేమ అవుతుందా ? ఈ ప్రేమ కు ఏమైనా ప్రత్యెక లక్షణాలు ఉంటాయా ?  కేవలం ఇవ్వడమేనా ? పుచ్చుకోవడం ఏమీ ఉండదా ? అట్లాగే , కేవలం  పుచ్చుకొవడమే నా  ఇచ్చే అవసరం ఏమీ  ఉండదా ? అసలు  ఈ  ప్రేమ వ్యవహారం చాలా సులభమే నా?  లేదా జటిలమా ? 
అమూల్యమైన ఈ ప్రేమ అనే ఎమోషన్ ఉచితం అయినప్పటికీ , మానవులు   మరి ఎందుకు ఆ పని చేయలేక పోతున్నారు  ? ఆధునిక ప్రపంచం లో ప్రేమను తిరిగి పొందలేక పోతున్నా రా 

ఈ విషయాల గురించి వచ్చే టపా నుంచి తెలుసుకోవడం మొదలెడదాం !

మీ అనుభవం లో మీకు ప్రేమ మీద ఉన్న అభిప్రాయాలు తెలపండి !