Our Health

రచయత ఖజానా

విటమిన్ B12 లోపానికీ, అనీమియా ( రక్త హీనత ) కీ సంబంధం ఉందా?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 28, 2012 at 11:11 సా.

B12 లోపానికీ అనీమియా ( రక్త హీనత ) కీ సంబంధం ఉందా?

క్రితం టపాలో మనం తెలుసుకున్నాం కదా కడుపులో మంట కు మనం వాడే మందులు దీర్ఘకాలం గా వాడడం జరిగితే , అది B 12 విటమిన్ లోపానికి కారణభూతం ఎట్లా అవుతుందో !
ఇప్పుడు అదే విటమిన్ B 12 విటమిన్ లోపం రక్త హీనత లేదా అనీమియా కు ఎట్లా కారణ భూతం అవుతుందో తెలుసుకుందాం !
రక్త హీనత అంటే రక్తం పలచ బడడం ! అంటే మనకు సామాన్యం గా ఉండే రమారమి అయిదు లీటర్ల రక్తం అట్లాగే ఉంటుంది అంటే పరిమాణం అంతే ఉంటుంది కానీ, చిక్కగా ఉండక , పలచ బడుతుంది. అంటే రక్తం లో ఉండే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది దానితో రక్తం ఎరుపు చిక్కటి ఎరుపు కాక, పాలి పోయిన , పలచని ఎరుపు గా అవుతుంది. రక్తం రంగుతో మనకు సంబంధం ఏమిటి ఎర్రగానే ఉంటుంది కదా , చిక్కగా ఉన్నా , పలుచగా ఉన్నా అని మీరు అనుకోవచ్చు. కానీ పలుచగా ఉన్నప్పుడు , రక్తం లో ఉండే ఎర్ర కణాలు , అవే ఎర్ర రక్త కణాలు ( R B C లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు ) మన దేహం లో ప్రతి కణానికీ ప్రాణ వాయువు సరిపడినంత సరఫరా చేయలేవు. దానితో రక్త హీనత ఉన్న వారు , ఉసూరు మంటూ , బలహీనం గా ఉంటారు , ఏ పనీ చురుకు గా చేయలేరు. కొద్ది సేపటిలోనే అలసట వస్తుంది. ఆయాసం వస్తుంది, అట్లాగే ఎక్కువ సమయం పని చేయడం కానీ , మెట్లు ఎక్కడం గానీ , నడవడం కానీ చేసినప్పుడు !
ఈ కధంతా ఎందుకంటే , రక్త కణాల తయారీ కీ ఇనుము ( ఖనిజం ) తో పాటుగా B 12 విటమిన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ విటమిన్ మనకు తప్పని సరిగా కావాలి , వీటి లో ఏవి లోపించినా , మనకు రక్త హీనత లేదా అనీమియా కలుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా B 12 లోపానికీ , రక్త హీనత కూ సంబంధం ఎట్లా ఉందో ! 

( పైన ఉన్న చిత్రం లో మీకు ఎడమ వైపు ఉన్నది మామూలు రక్త కణాలు ( మైక్రోస్కోప్ లో ఇట్లా కనిపిస్తాయి ) కుడి వైపున B 12 లోపం ఉన్నప్పుడు పెద్దగా  పలుచ గా కనిపిస్తాయి.) 

కడుపులో మంటకు వేసుకునే మందుల తో పాటుగా ఈ క్రింద చెప్పిన మిగతా మందులు కూడా మన జీర్ణ కోశం లో నుంచి B 12 విటమిన్, మన రక్తం లో కలవకుండా నివారించి , తద్వారా , B 12 విటమిన్ లోపమూ , రక్త హీనతా కలిగిస్తాయి !
1. మద్యం లేదా ఆల్కహాలు : ఎక్కువ మోతాదు లో మద్యం మన జీర్ణ కోశం లో ఎక్కువ సమయం కనక ఉంటే , ఆ పరిస్థితి , ఆహారం ద్వారా మనం తినే B 12 విటమిన్ ను కడుపు లో నుంచి రక్తం లోకి ప్రవేశించడం చాలా వరకు తగ్గి పోయి , B 12 విటమిన్ లోపం కలుగుతుంది.
2. నికోటిన్ : ఈ నికోటిన్ ఏ రూపం లో ఉన్నా అంటే పొగాకు రూపం లో గానీ , పాన్ సుపారీ లరూపం లో ( అంటే జర్దా గా ) కానీ ఉండ వచ్చు. చేసే ” ఘన కార్యం ” మాత్రం ఒకటే ! శరీరాన్ని అనారోగ్యం పాలు చేయడం !
3. మెట్ ఫార్మిన్ : ఈ టాబ్లెట్ ను మధుమేహం ఉన్న వారు చాలా క్రమం గా తీసుకుంటూ ఉంటారు. ఈ టాబ్లెట్ కూడా B 12 లోపం కలిగిస్తుంది.
4. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ కూడా ఈ B 12 విటమిన్ లోపం కలిగిస్తాయి.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

కడుపు మంటకు వాడే మందులు B12 విటమిన్ లోపానికి కారణమా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 27, 2012 at 7:55 సా.

కడుపు మంటకు వాడే మందులు B12 విటమిన్ లోపానికి కారణమా ?: 

కడుపు మంటకు వాడే మందులు B12 విటమిన్ లోపానికి కారణమా ?

B 12  విటమిన్ కూడా ఇంకో B విటమిన్ల కుటుంబానికి చెందిన విటమినే ! దీనిని కోబాలమిన్ అని కూడా అంటారు.

ఈ విటమిన్ లేక పొతే ఏమవుతుంది ?:
మిగతా B విటమిన్ల మాదిరి గానే ఈ కోబాలమిన్ లేదా B 12 విటమిన్ కూడా మన శరీరం లో ప్రతి కణం జీవ క్రియల లోనూ అతి ముఖ్యమైనది. ముఖ్యం గా మన రక్తం నిర్మాణానికీ , మన మెదడు , ఇంకా మిగతా నాడీ మండలం నిర్మాణానికీ , ఇంకా సరిగా పని చేయడానికీ కూడా ఈ కోబాలమిన్ విటమిన్ అతి ముఖ్యమైనది.
ఈ విటమిన్ ఏ ఆహార పదార్ధాలలో ఎక్కువ గా ఉంటుంది ? :
కానీ మిగతా B విటమిన్ల లాగా కాక ఈ విటమిన్ కాయ గూరలలోనూ , శిలీంధ్రాల లోనూ ( అంటే పుట్ట గొడుగుల లోనూ ) ఉండదు. మిగతా జంతువులూ ఈ విటమిన్ ను స్వతహాగా తయారు చేసుకో లేవు. మరి ఈ విటమిన్ ఎట్లా మనకు లభ్యం అవుతుంది? అని ప్రశ్నించు కుంటే , సమాధానం : బ్యాక్టీరియా లు అని చెప్పుకోవాలి. ఈ విటమిన్ తయారు చేసుకోవడానికి అవసరమైన ఎంజైమ్ కేవలం బ్యాక్టీరియా లలోనే ఉంది.
పాలు, జున్ను , కోడి గ్రుడ్డు , కోడి లేదా మేక కాలేయము ( లివర్ ) వీటిలో B 12 విటమిన్ సమృద్ధి గా ఉంటుంది.
మరి కడుపు మంటకు వాడే మందులు B 12 విటమిన్ లోపం ఎట్లా కలిగిస్తాయి ? :
సామాన్యం గా నవీన మానవ ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటున్నాయంటే, నూనె లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు , అంటే ఫ్రైడ్ ఫుడ్స్ , లేదా బాగా మసాలాలు దట్టించిన కూరలూ , బిర్యానీ లూ చాలా అందుబాటులో ఉంటున్నాయి. మీ సెల్ ఫోను లోంచి ఒక్క కాల్ చేస్తే సరి ! ఇంట్లోకి ” రెక్కలు కట్టుకున్నట్టు ” వాలుతాయి ఆహారం ప్యాకెట్ లు , నిముషాలలో ! వీటితో బాటుగా , ఇంట్లో ఉన్న ఆవకాయలో , మాగాయలో , లేదా మన ఆంధ్రా గోంగూరలో కలుపు కొని మనం అసలే స్పైసీ గా ఉన్న ఫుడ్ ను ఇంకా స్పైసీ గా చేసి తింటాము. వీటికి తోడు , ” మందు ” కూడా ఒక మోతాదు లో కలిస్తే ! ఇక ఊహించుకోండి ఏంజరుగుతుందో ! మొదట నోట్లో పడగానే ఎవరి రుచుల ఇష్టాల బట్టి వారికి చాలా రుచికరం గా , ఆనంద కరం గా ఉంటుంది , తింటున్నంత సేపూ , ఇక రెండవ దశలో అంటే మనం తిన్న ఆహారం అంతా మన జీర్ణాశయం లోకి పోగానే , మన జీర్ణ రసం కూడా కలుస్తుంది. మన జీర్ణ రసం ముఖ్యం గా హైడ్రో క్లోరిక్ యాసిడ్. మనం చదివే ఉంటాము చిన్నప్పుడు, దానిని తెలుగులో ఉదజ హరిత ఆమ్లము అని అంటారు. ఈ ఆమ్లం కూడా ఆహారం తో ( అప్పటికే స్పైసీ గా ఉన్న ఆహారం లో ) కలిసి జీర్ణాశయం గోడల లో ఉన్న అతి సున్నితమైన కణాల భరతం పడతాయి ! దానితో ఆ కణాలు తట్టుకోలేక , పోట్టంతా పుండు లా తయారవుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగు , ఆ వెంటనే మందుల షాపు కు ! అట్లా మొదలవుతుంది కడుపు మంట కు వాడే మందుల ఇనాగురేషన్  అంటే నాంది ! ఈ మందులు వెంటనే అత్యవసర చర్య గా కడుపులో సహజం గా వస్తున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ ను తగ్గించేస్తాయి ! ఇట్లా చేయడం తో కడుపు లో కి ( మనం తింటున్న వివిధ ఆహార పదార్ధాల లో ఉన్న ) B 12 విటమిన్ ” జీర్ణం అవక ” అంటే కడుపు గోడల నుంచి, మన రక్తం లో కలవక , మనకు B 12 లేదా కోబాలమిన్ లోపం వస్తుంది !
మిగతా కారణాలు వచ్చే టపాలో తెలుసుకుందాం !

తస్మాత్ ! , జాగ్రత్త !

In మానసికం, Our minds on డిసెంబర్ 25, 2012 at 5:21 సా.


                                                                                                 

                                                             తస్మాత్ ! , జాగ్రత్త !

                                                                  కుగ్రామం, 
                                                                మహానగరం, 
                                                                    ప్రాచ్యం, 
                                                                 పాశ్చాత్యం, 
                                                                 ఎక్కడైనా,
                                                                  ఉదయం, 
                                                               మధ్యాహ్నం, 
                                                                సాయింత్రం,
                                                                 నిశా రాత్రి ,

                                                               ఎప్పుడైనా,

                                                                 బాల్యం,

                                                               యవ్వనం, 
                                                                 వార్ధక్యం, 
                                                          వయసు  తేడా లేదు ! 
                                                           నీవు స్త్రీ వైతే చాలు ! 
                                                             బీదవైతే మేలు ! 
                                                          ‘కుల హీనం’ ఐతే, నీవు 
                                                              అతి బలహీనం !                                                            
                                                                 నీ శీలాన్ని, 
                                                        రాహువై కబళించడానికి,
                                                                 వీలుంటే ,
                                                     సామూహికం గా చెరచడానికి,
                                                                    ఆపై 
                                                         నీ గర్భం లో స్త్రీ శిశువును , 
                                                             హతమార్చడానికి, 
                                                        నీ ఆస్తిత్వం పై ,కర్కశం గా ,
                                                        కరాళ నృత్యం చేయడానికి ,
                                                      నీ స్వేఛ్చ కు సదా సంకెళ్ళు గా,
                                                    నిను వేశ్యను చేసే కామాంధులు గా,
                                                     నీ శ్రమ రక్తం పీల్చే రాబందులు గా, 
                                                       అబల వైన నీపై గెలుపు కోసం, 
                                                        ఆక్రోశించే పిరికి పందలు గా ,
                                                      దోషం అంతా స్వయం కృతమని ,
                                                       వికృతం గా నిను హేళన చేస్తూ, 
                                                         పరిణామం చెందుతూంది,
                                                         మగతనం, మృగ తనం గా !
                                                          నీతి తప్పిన మృగ జాతిగా !
                                                       విజ్రుంభిస్తూంది , విశృంఖలంగా !
                                                     అవుతున్నాయి మద్యం, మాదకం, 
                                                       ఈ మగతనం కామాగ్నికి ఆజ్యం,
                                                      నీ శీలాంత్యక్రియలకు ,గంగోదకం ! 
                                          మానవ  సృష్టికే జననివి నీవు కాదనుకునే ఉన్మాదం ! 
                                                            జాతి ఉనికికే ప్రమాదం ! 
                                                               తస్మాత్ !, జాగ్రత్త !

                                   ( ఇటీవల ఢిల్లీ లో జరిగిన యువతి సామూహిక మాన భంగాన్ని నిరశిస్తూ రాసినది ! )

ఫోలిక్ యాసిడ్ కేవలం గర్భ వతులకే ముఖ్యమా?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 22, 2012 at 6:39 సా.

 

ఫోలిక్ యాసిడ్ కేవలం గర్భ వతులకే ముఖ్యమా?

క్రితం టపాలో చూశాము కదా గర్భ వతులకు ఫోలిక్ యాసిడ్ విటమిన్లు ఎంత ముఖ్యమో !
మరి మిగతా వాళ్లకు ఈ విటమిన్ అవసరం ఉండదా? :
ఇటీవలి పరిశోధనల ద్వారా ఫోలిక్ యాసిడ్ , అదే B 9 విటమిన్ అన్ని వయసుల వాళ్ళకూ అతి ముఖ్యమైన విటమిన్ అని తెలిసింది.
వీర్య వృద్ధి : మగ వారిలో వీర్య కణాలను ఎక్కువ శక్తి వంతం గా చేయడం లో ఫోలిక్ యాసిడ్ ఉపయోగ పడ వచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. రోజూ 700 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను తీసుకుంటే , వీర్య వృద్ధి ఫలితాలు గణ నీయం గా ఉంటాయని తెలిసింది. గుర్తుంచు కొండి , 700 మైక్రో గ్రాములు మాత్రమె ( మైక్రో గ్రాము అంటే గ్రాములో వెయ్యో వంతు మాత్రమె )
పక్షవాతం నివారణ : ఫోలిక్ యాసిడ్ విటమిన్ కొంత వరకూ , పక్షవాతం నివారణలో మనకు తోడ్పడుతుందని తెలిసింది.

క్యాన్సర్ నివారణ: పురుషులలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ , ఇంకా పెద్ద ప్రేగు క్యాన్సర్ ల నివారణ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉపయోగ పడుతుందని కొన్ని పరిశోధన ఫలితాలు నిరూపించాయి.

ఇటీవలి పరిశోధనలో ఫోలిక్ యాసిడ్ డిప్రెషన్ , ఊబ కాయం నివారణలో ఇంకా మన శరీరం నిరోధక శక్తి ని బలోపేతం చేయడం లో కూడా ఎంతో ఉపయోగ పడుతుందని తెలిసింది.

మరి మనకు ఇంతగా ఉపయోగ పడే ఈ ఫోలిక్ యాసిడ్ మనం తినే ఏ ఏ ఆహార పదార్ధాలలో ఉంటుందో చెప్పా గలరా ?! ప్రయత్నించండి !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !

( పైన ఉన్న చిత్రం ఇటీవలే ప్రపంచ సుందరి కిరీటం గెలుచు కున్న ఒలీవియా కల్పో అనే సుందరిది ! )

గర్భవతులలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( B 9 ) లోపం ఉంటే ఏమవుతుంది ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 20, 2012 at 5:29 సా.

గర్భవతులలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( B 9 ) లోపం ఉంటే ఏమవుతుంది ?:

ఫోలిక్ యాసిడ్ విటమిన్ కూడా B కాంప్లెక్స్ ” కుటుంబానికి ” చెందిన విటమినే . దీనిని B9 విటమిన్ అనికూడా అంటారు.మన దేహం లో ఫోలిక్ యాసిడ్ ఏ ఏ పనులు చేస్తుందో తెలుసుకుందాం !
1. DNA నిర్మాణానికి: మన దేహం లో ప్రతి కణం లోనూ జన్యు పదార్ధం ఉంటుంది. దీనినే డీ ఎన్ ఏ అని అంటారు. ఈ జన్యు పదార్ధం ప్రతి కణం నిర్మించినప్పుడు అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యు పదార్ధం నిర్మాణం లో అనేక మైన జీవ రసాయన చర్యలు జరిగుతున్నప్పుడు , వివిధ దశలలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ అవసరం అనివార్య మవుతుంది.
2. DNA రిపేరు కు : అట్లాగే DNA కొంత పాత బడుతున్నప్పుడు , దానిని కొన్ని జీవ రసాయన చర్యల ద్వారా పునరుజ్జీవింప చేయడం కూడా ఫోలిక్ యాసిడ్ చేస్తుంది.
3. కణ విభజనకు : మన దేహం లో ప్రతి కణమూ కొత్త కణాలను ” కణ విభజన ” అనే చర్య ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఈ పని కి కూడా ఫోలిక్ యాసిడ్ అనివార్యం.
4. వివిధ కణాల పెరుగుదలకు:  కణాలు ఒక సారి ఏర్పడిన తరువాత వాటి పెరుగుదలకు కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం తప్పనిసరి.

గర్భ వతులలో మరి ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ గా అవసరం అవుతుంది?:
వీరిలో గమనించ వలసినది ఏమిటంటే , తమకే కాకుండా తమ గర్భం లో పెరుగుతున్న పిండానికీ , వివిధ దశలలో పిండం నుంచి మారిన శిశువు కు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అవసరం అనివార్యం. అందువల్ల వీరు మామూలు గా అవసరానికంటే ఎక్కువ గా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి !
గర్భ వతులలో ఫోలిక్ యాసిడ్ తగినంత తీసుకోక పొతే ఆ లోపం ఏవిదం గా కనిపిస్తుంది ? :
ఫోలిక్ యాసిడ్ లోపం తీవ్రం గా ఉంటే వారికి సంతానం కలగడం కూడా ఆలస్యం అవుతుందని పరిశోధనల వల్ల తెలిసింది. దీనికి కారణం ఫోలిక్ యాసిడ్ లోపించి నప్పుడు స్త్రీలలో అండం సరిగా పెరగదు. ఇక గర్భం ధరించిన వారిలో రక్త హీనత కలుగుతుంది. ( మాక్రో సైటిక్ అనీమియా ) అంటే రక్తము పలచ పడుతుంది. అంటే చిక్క గా ఉండదు ! మరి ఈ చిక్క గా ఉండడం ఏమిటి , పలుచ గా ఉండడం ఏమిటి , చిక్కటి కాఫీ , నీళ్ళ కాఫీ లాగా ? అని మీరు సందేహ పడవచ్చు. నీళ్ళ కాఫీ తాగొచ్చేమో కానీ , మన రక్తం పలుచ బడితే అనారోగ్యం ఖాయం ! ఎందుకో చూడండి: రక్తం లో తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉంటే నే రక్తం చిక్కగా ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలు మన దేహం లో ప్రతి భాగానికీ , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే ప్రతి కణానికీ ప్రాణ వాయువును సరఫరా చేస్తాయి, మన జీవితాంతం. మనలో, ముఖ్యం గా గర్భ వతులలో రక్తం ఏ కారణం చేతనైనా పలుచ బడినప్పుడు , వారికి తగినంత ప్రాణ వాయువు అందక , అలసట , బలహీనం , ఆయాసం , మొదలైన లక్షణాలు కలుగుతాయి. అంతే కాక వారి కాళ్ళు తిమ్మిరులు కలగడం , మొద్దు బారినట్టు అవడం కూడా అవుతుంటుంది. శిశువు పెరుగుదల సరిగా ఉండక పోవడం కూడా జరుగుతుంది.ఇక నెలలు నిండిన కొద్దీ , గర్భాశయం లో మావి ( ప్లాసేంటా అంటారు ) సరిగా అమరక పోవడం లేదా త్వరగా శిశువు నుంచి విడిపోవడం కూడా జరగ వచ్చు.
ముఖ్యం గా గర్భం లో పెరిగే పిండం లోనూ , పెరిగే శిశువు లోనూ ఫోలిక్ యాసిడ్ లోపం ఎట్లా కనిపిస్తుంది ?:
అవయవ లోపాలతో పుట్టడం , ముఖ్యం గా న్యూ రల్ ట్యూబ్ డిఫెక్త్స్ అంటే నాడీ వ్యవస్థ లో లోపాల తో పుట్టడం జరుగుతుంది.( Neural tube defects ( న్యూరల్  ట్యూబ్  డిఫెక్ట్ లు ) ( పైన ఉన్న చిత్రం చూడండి ):  గర్భం లో ఒక సారి  స్త్రీ నుంచి విడుదలైన అండం  పురుషుడి  వీర్యం లోని వీర్య కణం తో కలిసినపుడు  పిండం ఏర్పడుతుందని మనకందరికీ తెలుసు కదా ! పిండం  అభివృద్ధి చెందుతున్న తొలి  దశలలో  ( అంటే ముఖ్యం గా మొదటి మూడు నాలుగు నెలల గర్భం లో ) భవిష్యత్తులో  శిశువులో  రూపం దాల్చనున్న వివిధ అవయవాలు  పిండం మీద మొగ్గల లాగా ఏర్పడతాయి. అట్లా ఏర్పడేదే  న్యూరల్  ట్యూబ్  అంటే  నాడీ  గొట్టం అన  వచ్చు నేమో ! ఈ నాడీ  గొట్టమే  భవిష్యత్తులో  ఒక చివర  మన మెదడు గానూ ఇంకో చివర మన వెన్ను పూసా ( స్పైనల్ కార్డ్ )  ఇంకా మిగతా నాడులు  నిర్మాణం అవుతాయి.  మనం తెలుసుకున్నాం కదా , ఫోలిక్ యాసిడ్ ముఖ్యం గా కణాలు విభజన చెంది, కొత్త కణాలు ఏర్పడే దశ లో  అత్యవసరం అని !  అందు వల్ల  ఈ దశలో కనుక ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటె ( అంటే గర్భం దాల్చిన తోలి దశలలో , అంటే మొదటి మూడు నాలుగు నెలల గర్భం లో ) నాడీ  మండల లోపాలు , ఇంకా మిగతా అవయవ లోపాలు కలుగుతాయి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ప్రాముఖ్యత !  ) 

గుండె కవాటాలలో అవక తవకలు కలగడం కూడా జరుగుతుంది.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

Vitamin B3 లేదా నియాసిన్ :

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 18, 2012 at 10:50 సా.

Vitamin B3 లేదా నియాసిన్ :

నియాసిన్ విటమిన్ కూడా B విటమిన్ లకు చెందిన విటమినే ! దీనిని B 3 విటమిన్ అని కూడా అంటారు.

నియాసిన్ లేకపోతే మనకు అనారోగ్యమా?:
నియాసిన్ కూడా మిగతా విటమిన్లలాగానే మన శరీరం లో లోపిస్తే , అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు అన్నీ , నియాసిన్ విటమిన్ లోపం ఎక్కువ అవుతున్న కొద్దీ , మనలో కనిపించడం మొదలవుతుంది. గమనించ వలసినదేమిటంటే , ఏ విటమిన్ లోపించినా , ఆ లోప లక్షణాలు వెంటనే కనిపించవు మనకు. దీనికి కారణం ఏమిటంటే , మన దేహం లో లివర్ ( కాలేయం ) , కిడ్నీస్ ( మూత్ర పిండాలు ) వీటిలో మనం పూర్వం తిన్న ఆహారం లో ఎక్కువ గా ఉన్న విటమిన్లు నిలువ అవుతాయి. మన ఆహారం లో తరువాత ఈ విటమిన్లు లోపించినప్పుడు , లివర్ , కిడ్నీస్ లో ఉన్న విటమిన్లు మనకు ఉపయోగ పడతాయి. కానీ కొన్ని రోజుల తర్వువాత , ఈ నిలువ ఉన్న విటమిన్లు కూడా అయి పోయి , మనలో ఆ యా విటమిన్ల లోపం కనిపిస్తుంది , వివిధ ( వ్యాధి ) లక్షణాలు గా !
మరి మన శరీరం లో ఉన్నప్పుడు నియాసిన్ ఏ ఏ పనులు చేస్తుంది? :
NAD + NADH , NADP + NADPH అనే జీవ రసాయనాలు మన దేహం లో నిర్మాణం అవడానికి నియాసిన్ కావాలి. ఈ నిర్మాణాలు , మన శరీరం లో అనేక కణాలలో అను నిత్యం , అనేక జీవ రసాయన క్రియలను నిర్వర్తించుతూ ఉంటాయి. నియాసిన్ లోపం కనుక ఉంటే , ఈ అతి ముఖ్యమైన జీవ రసాయన క్రియలు కుంటు పడడమూ , లేదా ఆగిపోవడమూ జరిగి , మనలో వ్యాధి లక్షణాలు గా కనిపిస్తుంది.జన్యు పదార్ధం అంటే డీ ఎన్ ఏ లో అవసరమయిన రిపేరు అంటే జన్యు నిర్మాణం లో జరిగే అవక తవకలు సరిచేయడం లో కూడా ఈ నియాసిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. హార్మోనుల తయారీ: నియాసిన్ మన దేహం లో మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్ గ్రంధులలో మనకు అవసరమైన స్టీరాయిడ్ హార్మోనులను తయారు చేయడానికి , చాలా ముఖ్యం.

మరి ఈ నియాసిన్ లోప లక్షాలు ఏమిటి ?: మనలో నియాసిన్ లోపం ఎక్కువ గా ఉంటే పెల్లాగ్రా అనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
పెలాగ్రా లో ముఖ్యం గా విరేచనాలు తరచుగా అవుతుండ డమూ , చర్మం పగుళ్ళు వచ్చి దురదలు పెట్టడమూ , చర్మం మొద్దు బారడమూ ,మంచి రంగులో మెరిసి పోయేట్టు ఉన్న చర్మం కాస్తా కాంతి విహీనమూ, ముదురు రంగులోకి మారడమూ , మతి మరుపు ఎక్కువ గా అయి డిమెంషియా అనే మతి మరుపు వ్యాధి రావడమూ , ఇంకా అశ్రద్ధ చేస్తే , మరణం కూడా సంభవించడం కూడా జరుగుతుంది.
నియాసిన్ ఏ ఆహార పదార్ధాలలో ఎక్కువ గా ఉంటుంది?:  ( పైన ఉన్న చిత్రం చూడండి  )
శాక హారులు నియాసిన్ పుష్కలం గా ఉన్న బ్రాకోలీ ( కాలీ ఫ్లవర్ లా గానే ఉంటుంది కానీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది ) , కారట్ , ఆకు పచ్చని ఆకు కూరలు , చిలగడ దుంపలు , ఆస్పరాగస్ , టమాటాలు , ఖర్జూరాలు , పప్పు ధాన్యాలు , పుట్ట గొడుగులు తినవచ్చు.
మాంసాహారులు: చికెన్ , చేపలు , మొదలైన మాంస పదార్ధాలలో నియాసిన్ పొందవచ్చు . కోడి గ్రుడ్డు కూడా నియాసిన్ ఉన్న ఆహార పదార్దమే ! మిగతా విటమిన్లలాగానే నియాసిన్ కూడా మనకు చాలా స్వల్ప పరిమాణం లో నే రోజూ అవసరం ఉంటుంది ! అంటే 14 నుంచి 16 మిల్లీ గ్రాములు మాత్రమె మనకు రోజూ అవసరం ! నియాసిన్ ఎక్కువ గా తింటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ! అంటే ” అతి విటమిన్ అనారోగ్య లక్షణం ” !

వచ్చే టపాలో ఇంకో విటమిన్ గురించి !

Vitamin B2 or రైబో ఫ్లావిన్ :

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 17, 2012 at 9:44 సా.

Vitamin B2 or రైబో ఫ్లావిన్ :

రైబో ఫ్లావిన్ B విటమిన్లకు చెందుతుంది. ఇది ఈ విటమిన్ల వరస లో రెండవది. ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ కూడా నీటిలో కరిగే విటమిన్ ( B కాంప్లెక్స్ విటమిన్లన్నీ నీటిలో కరిగే విటమిన్లే ! ).
ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ మన శరీరానికి అందక పొతే ఏమవుతుంది?:
FAD , FMN అనే రెండు కో ఫ్యాక్టర్ లు రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి వీటి మూలాలకు వెళ్ళకుండా , ఇవి రెండు జీవ రసాయన పదార్ధాలు అని తెలుసుకుంటే చాలు. ఈ కో ఫ్యాక్టర్స్ మన శరీరం లో ప్రోటీన్లు , అంటే మాంస క్రుత్తులు , పిండి పదార్ధాలు , అంటే కార్బో హైడ్రేట్ లూ , ఇంకా కొవ్వు పదార్ధాలూ అంటే ఫాట్స్ , ఇవన్నీ మన దేహం లో వివిధ రసాయన చర్యలు చెంది , ఎనర్జీ గా అంటే శక్తి గా మారడానికి , ఈ రెండు కోఫాక్టర్స్ అనివార్యం. ఈ రెండు కో ఫాక్టర్స్ తయారీ కీ రైబో ఫ్లావిన్ ముఖ్యమైన ముడి పదార్ధం. అంటే ఈ రెండు కో ఫాక్టర్స్ నిర్మాణానికీ రైబో ఫ్లావిన్ విటమిన్ తప్పని సరిగా మన శరీరానికి అందాలి !

మరి రైబో ఫ్లావిన్ లోపం మనలో ఎట్లా కనిపిస్తుంది? : ( పైన ఉన్నచిత్రమూ , ఫోటోలూ గమనించండి  ) 
పెదవులు పగలడం: మన పెదవులు చిట్లి పోయి , మధ్య లోనూ , చివరలలోనూ ” పగిలి పోతాయి మన పెదవులు ”. ( angular cheilitis )
నోటిలో పూత రావడం : మన నోరు ” పూత పోసి ” కారం నోటిలో ఉన్నప్పుడు మనకు ఎట్లా అనుభూతి ఆవుతుందో , ఆ విధం గా నోరు ” పుండు ” లా తయారవుతుంది.నాలుక కూడా ఎరుపు గా మారి ” పుండు ” లా తయారవుతుంది. అప్పుడు అతి చల్ల ని పదార్ధాలు కానీ , అతి వేడి పదార్ధాలు కానీ నోటి లో ఉన్నప్పుడు , బాధ కలుగుతుంది ( ఇట్లాంటి పరిస్థితులలో సామాన్యం గా మన ఇళ్ళలో నేయి పూసుకుంటే ఆ లక్షణాలు తగ్గుతాయి అని ” చిట్కా వైద్యాలు ” చెపుతూ ఉంటారు మన పెద్ద వాళ్ళు నిజమే, నేయి కానీ వెన్న కానీ పూసుకుంటే అది ఆయింట్ మెంట్ లా పని చేసి కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆ లక్షణాలకు నివారణ నెయ్యీ , వెన్నా కాదు కదా , ( రైబో ఫ్లావిన్ కావాలి ! ) .

చర్మం లో మార్పులు : మన చర్మం పొలుసులు గా ఊడిపోవడం , చిట్లి పోవడం , కూడా జరుగుతుంది.

కళ్ళలో మార్పులు : మన కళ్ళు కూడా రైబో ఫ్లావిన్ విటమిన్ లోపించినప్పుడు , ఎప్పుడూ ఎర్రగా వాచి ఉంటాయి. కాంతి ని చూడడం కష్టమవడం జరుగుతుంది. దీనిని ఫోటో ఫోబియా అంటారు. ఇంతే కాక రక్త హీనత అంటే అనీమియా కూడా రైబో ఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.గమనించ వలసిన విషయం ఏమిటంటే రైబో ఫ్లావిన్ విటమిన్ లోపం ఉన్న సమయం లో అనివార్యం గా మిగతా విటమిన్ల లోపం కూడా ఉంటుంది.

ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ ఏ ఏ పదార్ధాలలో ఉంటుంది? :
పాలు , జున్ను , ఆకు పచ్చని ఆకు కూరలు , ఈస్ట్ , తినగలిగే పుట్ట గొడుగులు ( వీటినే మష్ రూమ్స్ అంటారు ) పప్పు దినుసులు ( వీటినే లెగూమ్స్ అంటారు ) ఇంకా ఆల్మండ్స్ అనే పప్పులు కూడా రైబో ఫ్లావిన్ ఎక్కువ గా ఉండే ఆహార పదార్ధాలు. ఇక మాంస హారులకు కాలేయం , మూత్ర పిండాలు అంటే లివర్ అండ్ కిడ్నీ లు కూడా ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ ఎక్కువ గా ఉండే అవయవాలు.
( ఫ్లావిన్ అంటే పసుపు పచ్చని పదార్ధము అని అర్ధం. మీరు గమనించారో లేదో , B కాంప్లెక్స్ విటమిన్ వేసుకున్నప్పుడు , మన మూత్రం పసుపు పచ్చ గా వస్తుంది దానికి కారణం ఈ రైబో ఫ్లావిన్ లేదా B 2 విటమిన్ వల్లనే ! )

వచ్చే టపాలో ఇంకో విటమిన్ !

B 1, థయమిన్ లోపానికి కారణాలు ఏమిటి ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 16, 2012 at 11:33 ఉద.

B 1 థయమిన్ లోపానికి కారణాలు ఏమిటి ?:

పైన ఉన్న చిత్రం ఒక స్పార్క్ ప్లగ్ ది. థయమిన్ విటమిన్ కూ , మన ఆరోగ్యానికీ , వాహనాలలో ఉండే ఈ స్పార్క్ ప్లగ్ కూ ఉన్న సంబంధం ఏమిటి అనుకుంటున్నారు కదూ ! ఏ వాహనం నడవాలన్నా , పరిగేట్టాలన్నా , స్పార్క్ ప్లగ్ లో నిప్పు రవ్వ రానిదే , సాధ్య మవ్వదు. అంటే ప్రతి వాహనానికీ , ఈ స్పార్క్ ప్లగ్ అత్యంత ముఖ్యమైన భాగం. అదే విధం గా థయమిన్ విటమిన్ కూడా మన శరీరం లో జరిగే కీలక జీవ రసాయన చర్యలకు స్పార్క్ ప్లగ్ లా పని చేస్తుందని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. మన జీవిత ” వాహనం ” కూడా ఆరోగ్యం గా, సవ్యం గా సాగాలంటే , ఈ థయమిన్ విటమిన్  స్పార్క్ ప్లగ్ లాగా పని చేస్తుంది  ! దీనితో మనకు ఈ థయమిన్ విటమిన్ ప్రాముఖ్యత అర్ధం అయింది కదా !

మనం మన ఆహారం సంపూర్ణం గా అంటే అన్ని పప్పులూ , ఆకు కూరలూ , కూరగాయలూ తింటున్నా కూడా , మనం ఆ ఆహారాలనూ , వంటలనూ , తయారు చేసుకోవడం లోనూ , లేదా ఇతర పదార్ధాలతో తినడడం వల్ల నో , మన శరీరం లో థయమిన్ ప్రవేశించినా , మన శరీర కణాలకు చేరుకోక , వ్యర్ధం అవుతుంది. ఆ కారణం గా మనలో థయమిన్ లోపం , ఆ లోప లక్షణాలు కూడా కనిపించ వచ్చు. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము :

వంటలో లోపాలు : ధాన్యాలు అంటే , గోధుమ , వరి , జొన్నలు , మినుములు , కంది పప్పు , పెసర పప్పు, ఇట్లాంటి పప్పు దినుసులు , వాటి పోట్టులోనే ఈ B విటమిన్ అత్యధికం గా ఉంటుంది. కానీ సామాన్యం గా ఆకర్షణీయం గా ఉండడం కోసం చాలా దుకాణాలలో ఈ ధాన్యాలను పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాక వాటిని కొన్న తరువాత వంట గదిలో అనేక సార్లు కడిగి ఉడికిన తరువాత తెల్లగా కనపడ డానికీ , పొట్టు వాసన రాకుండా ఉండడానికీ అనేక ప్రయత్నాలు చేసి , ఆ ధాన్యాలలో ఉన్న పోషక విలువలు, విటమిన్లు , వృధా చేస్తుంటాము.
అంతే కాక , అత్యధిక వేడి లో , ఎక్కువ సమయం ఉడికిస్తే కూడా పోషక విలువలు తగ్గి పోతాయి. ముఖ్యం గా ఆకు కూరలూ , కూర గాయలూ ఇట్లా ఎక్కువ సమయం , అధిక వేడి లో వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు కోల్పోతాయి.
కాఫీలూ , టీలూ , వక్క పొడి : టీలూ కాఫీలూ ఎక్కువ గా తాగితే , జర్దా, వక్కపొడి ఎల్లకాలం నములుతూ ఉంటే కూడా మనం తీసుకునే ఆహారం లో ఉన్న థయమిన్ విటమిన్ మనకు అంటే మన శరీరం లోని కణాలకు అందదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది.టీ లోనూ , కాఫీ లోనూ , ఇంకా వక్క పొడి , జర్దా లలో ఉండే కొన్ని రసాయన పదార్ధాలు , థయమిన్ విటమిన్ ను విరిచేస్తాయి అంటే దానిని పనికి రాకుండా చేస్తాయి ( అప్పుడు పాలు విరిగితే మనకు ఆ విరిగిన పాలు ఎట్లా ఉపయోగ పడవో , అట్లా అవుతుంది థయమిన్ విటమిన్ ! )

సరిగా వండని చేపలు : కొన్ని రకాల చేపలలో ( ప్రత్యేకించి చెరువు చేపలలో ) థయమిన్ విటమిన్ ను విరిచేసే తయమినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివల్ల థయమిన్ విటమిన్ అంతా విరిచి వేయబడి మనకు ఏ విధం గానూ పనికి రాకుండా పోతుంది.

మరి ఆల్కహాలికులలో ( అంటే అతిగా మద్యం సేవించే వారిలో ) థయమిన్ లోపం ఎందుకు ఉంటుంది?:దీనికి చాలా కారణాలు ఉన్నాయి :

1. సాధారణం గా అతిగా మద్యం సేవించే వారు , వారి కడుపులో పోషక విలువలున్న ఆహారాన్ని కాక , ప్రధానం గా మద్యం తో నింపు తారు.
2. దానితో మన జీర్ణ కోశం లో ఉండే కణాలు మద్యం లో మునిగి పోయి , ఆహారం లో ఉండే థయమిన్ ను ” పీల్చుకో ” లేవు.
3. అతిగా సేవించే మద్యం కాలేయం అంటే లివర్ లోని కణాలను కూడా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం లో ప్రవేశించే థయమిన్ నిలువ అవ్వడానికి వీలు పడదు ( సామాన్యం గా మనం మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ థయమిన్ ఆహారం లో తీసుకుంటే , అది మన కాలేయం అంటే లివర్ లో నిలువ చేయబడుతుంది )
4.అంతే కాక మద్యం థయమిన్ ను మన శరీర కణాలకు చేర నీయదు.

గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ మార్పులు , చాలాకాలం , ఎక్కువ గా మద్య పానం చేసే వారిలో వస్తాయి. ఒక సారి ఈ మార్పులు వచ్చాక వారు మతి మరుపు తెచ్చుకుంటారు , కంఫ్యుస్ అవుతూ ఉంటారు. తికమక పడుతూ ఉంటారు.ఏకాగ్రత కోల్పోతారు. చీటికీ మాటికీ విసుక్కుంటూ ఉంటారు , చుట్టూ ఉన్న వారి బుర్ర తినేస్తూ ఉంటారు , ఎందుకంటే , వారి బుర్ర , నిరంతరం మద్యం లో ” మునిగి ” విటమిన్లు లోపించి సరిగా పని చేయదు కనుక ! కానీ వారు ఈ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి లో ఉండరు. మీరు గమనించారో లేదో , అతి గా తాగే వారు , వారి పరిస్థితిని అంత తేలిక గా ఒప్పుకోరు. వారి నిస్సహాయ స్థితిని వారి కోప తాపాలనూ , వారి కుటుంబ సభ్యుల మీదా , ( తల్లి తండ్రులూ , భార్య ల మీదా ) అమాయకులైన తమ సంతానం మీదా అంటే చిన్నారుల మీదా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా విచార కర పరిస్థితి.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

( విటమిన్ B 1 ) థయమిన్ మనలో తక్కువవుతే పరవాలేదా ? !!!

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 15, 2012 at 11:35 ఉద.

( విటమిన్ B 1 ) థయమిన్ మనలో తక్కువవుతే పరవాలేదా ? !!!

( విటమిన్ B 1 ) విటమిన్ ను ‘ థయమిన్ ‘ అని కూడా అంటారు. ఈ థయమిన్ B విటమిన్ లలో మొదటిది. ‘థయ’ అంటే గంధకం. ఈ గంధకపు అణువు కలిగి ఉన్న విటమిన్ కాబట్టి దీనికి థయమిన్ అని పేరు వచ్చింది. ఈ థయమిన్ లేదా B1 విటమిన్ కేవలం బాక్టీరియా లూ , ఫంగస్ లూ ( శిలీంధ్రాలు అని కూడా అంటారు అంటే పుట్టగొడుగుల జాతి కి చెందినవి ) ఇంకా మొక్కలు మాత్రమే ఈ థయమిన్ విటమిన్ ను తయారు చేయ గలవు. కానీ మానవులకు ( జంతువులకు కూడా ) ఈ B 1 విటమిన్ లేదా థయమిన్ చాలా ముఖ్యం.
ఈ థయమిన్ లోపం మనలో ఎట్లా కనిపించ వచ్చు ?:
మనం తీసుకునే ఆహారం లో థయమిన్ లోపం ఏదో రూపం లో ఉంటే ఆ లోప లక్షణాలు మనలో కనిపిస్తాయి.
మన దేహం లో అనేక అవయవాలు సరిగా పనిచేయడానికి ఈ థయమిన్ చాలా కీలకమైనది. కానీ మన నాడీ వ్యవస్థ లో ఈ విటమిన్ లోపం చాలా త్వరగానూ , ప్రస్ఫుటం గానూ కనిపిస్తుంది. ఎందుచేతనంటే , మన నాడీ మండలం లో అంటే ప్రతి నాడీ కణం లోనూ అనునిత్యం అంటే మన జీవితాంతం నిరంతరం గా జరిగే జీవ రసాయన చర్యలకు , ఈ థయమిన్ అవసరం తప్పని సరిగా ఉంటుంది.మిగతా అన్ని విటమిన్ల లానే కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే ఈ విటమిన్ కూడా మనకు అవసరం అవుతుంది రోజూ ! కానీ ఆ కొన్ని మిల్లీ గ్రాములు కూడా లోపిస్తే , అదే మన ప్రాణాల మీదకు తెస్తుంది.
మన నాడీ మండలం లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపిస్తుంది ?:
కళ్ళు: ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మడం , రంగులు సరిగా గుర్తించ లేక పోవడం , మొదటి దశలలో జరుగుతాయి. తరువాత , తరువాత , థయమిన్ లోపం సరిచేయక పొతే , రెండు కళ్ళ చూపూ మందగించి , విటమిన్ లోపం తీవ్రం గా ఉంటే అంధత్వం కూడా రావచ్చు. ఇట్లా అంధత్వం రావడం ‘ ఆప్టిక్ అట్రోఫీ ‘ అనబడుతుంది. అంటే కంటి లోపలి సున్నితమైన పొరలు పాడవుతాయి.
పెరిఫెరల్ న్యూ రోపతీ అంటే ఏమిటి ?: మన దేహం లో మెదడులో కాక , అవయవాల చివరల గా ఉన్న నాడులలో తిమ్మిరులూ , మంటలూ పుట్టిస్తుంది ఈ విటమిన్ లోపం. ఎందుకంటే ఈ విటమిన్ లోపం వల్ల ఆయా నాడులు సరిగా పని చేయక మంటలు పుట్టడం , తిమ్మిరులు కలగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం గా శాక హారులలో , వయో వృద్ధులలో , ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో , మన పెద్ద వాళ్ళు , కాళ్ళు మంటలు పుడుతున్నాయని వారికి నచ్చిన నువ్వులనూనో , కొబ్బరి నూనో బాగా కాళ్ళకు పట్టించి మర్దనా అంటే మాసాజ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం వృధా ప్రయాసే ! ఎందుకంటే వారి లక్షణాలకు కారణం విటమిన్ లోపం కదా !
మన గుండె లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపుతుంది?:
ఈ విటమిన్ లోపం అధికం గా ఉంటె, వారి గుండె కూడా ” వాచి ” పోతుంది. అంటే గుండె సామాన్యం గా ఉండే సైజు కన్నా పెద్దగా అవుతుంది. కానీ ఇట్లా పెద్దగా అవడం, ఆరోగ్య కరం గా కాక విటమిన్ B 1 లేక థయమిన్ లోపం వల్ల కలిగే ” అనారోగ్య వాపు ‘ దీనినే ” కార్డియో మెగాలీ ”  అంటారు. అంతే కాక గుండె నీరసం గా కొట్టుకుని , కాళ్ళ వాపు రావడం జరుగుతుంది. అంటే కాళ్ళలో నీరు చేరుతుంది.

వచ్చే టపాలో మరి మనం రోజూ బాగానే తింటున్నా కూడా కొన్ని పరిస్థితులలో విటమిన్ B 1 లోపం ఎందుకు , ఏ యే పరిస్థితులలో జరుగుతుందో కూడా తెలుసుకుందాం !

B కాంప్లెక్స్ విటమిన్లు చాలా కాంప్లి కే టెడా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 14, 2012 at 10:50 సా.

B కాంప్లెక్స్ విటమిన్లు చాలా కాంప్లి కే టెడా ?:

B కాంప్లెక్స్ విటమిన్లు : ఈ రకమైన విటమిన్లు ముఖ్యం గా ఎనిమిది రకాలు.

1. విటమిన్ B 1 లేదా థియమిన్ విటమిన్ Vitamin B1 (thiamine) :
2. విటమిన్ B 2 లేదా రిబోఫ్లావిన్ Vitamin B2 (riboflavin)
3. విటమిన్ B 3 లేదా నియాసిన్ లేక నియాసినమైడ్ విటమిన్ ( Vitamin B3 – niacin or niacinamide)
4. విటమిన్ B 5 లేదా పాంటో తేనిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B5 (pantothenic acid)
5.విటమిన్ B 6 లేదా పైరిడాక్సిన్ విటమిన్ ( Vitamin B6 -pyridoxine, pyridoxal, or pyridoxamine, or pyridoxine hydrochloride)
6. విటమిన్ B 7 లేదా బయోటిన్ విటమిన్ ( Vitamin B7 – biotin)
7.విటమిన్ B 9 లేదా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B9 – folic acid)
8. విటమిన్ B 12 లేదా కోబాలమిన్ విటమిన్లు ( Vitamin B12 – various cobalamins; commonly cyanocobalamin in vitamin supplements)

మరి B కాంప్లెక్స్ విటమిన్లు అన్ని ఎందుకు ఉన్నాయి ?:
మొదట్లో B విటమిన్లన్నీ ఒకే రసాయన నిర్మాణం ఉన్నవి గా అనుకున్నారు శాస్త్రజ్ఞులు. కాల క్రమేణా వీటి రసాయన నిర్మాణం లో స్పష్టమైన తేడాలు గమనించారు. అంతే కాక వివిధ రకాలకు చెందిన B విటమిన్లు మన దేహం లో వివిధ కీలక జీవ రసాయన చర్యలలో ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలుసుకున్నారు. ఇట్లా తెలుసుకోవడం శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది , రసాయన నిర్మాణాలను విశ్లేషించే అవకాశం కలిగినందుకు. ఒక్కో రసాయన నిర్మాణం కనుక్కున్నప్పుడల్లా  ఆ  B  విటమిన్ కు తోకలు తగిలించడం మొదలెట్టారు 1,2,3,5, 6,7,9 అని. అందు వల్ల  ఇన్ని B  విటమిన్లు  ఊడి  పడ్డాయి, మన తల తినెయ్య డానికి అని అనుకోకండి , నిజానికి ఈ B  విటమిన్లు మన బుర్రలు సరిగా పని చేయడానికి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ B  విటమిన్లు ( ఏ  కారణం చేతనైనా ) తక్కువ అయిన వాళ్ళు , వారి చుట్టూ ఉన్న వారి ” బుర్ర ” తినేస్తారు ! ఇది ఎట్లా జరుగుతుందో కూడా మనం వివరం గా తెలుసుకుందాం ! 
నవీన మానవ జీవితం లో ఈ విటమిన్ల అంటే ప్రత్యేకించి B విటమిన్ల పాత్ర చాలా ముఖ్యమైనది. కేవలం మనం B విటమిన్లు మన శరీరానికి అవసరమనే కాకుండా ఎందుకు అవసరమో వివరం గా తెలుసుకుంటే , మనకు , మన ఆరోగ్యానికీ ఈ విషయం చాలా ఉపయోగ పడుతుంది. కేవలం మనకు ఈ విటమిన్లు అవసరమైనంత మాత్రాన వెంటనే మందుల షాపు కు వెళ్లి కొనుక్కువడం చేయకుండా , సహజ సిద్ధమైన ఆహారం లో ఈ విటమిన్లు మనకు ఎట్లా ఉపయోగ పడతాయో కూడా మనం గ్రహించాలి. అంతే కాక మద్యం , పొగాకు , మన దేహం లో ఈ విటమిన్లను ఎట్లా హరింప చేస్తాయో కూడా మనం వివరం గా తెలుసుకుంటే , అప్పుడు మనం మద్యం తీసుకోవడం , అదే మందు పుచ్చుకోవడం , లేదా పొగాకు పీల్చడం కూడా అసలు చేయవచ్చో లేదో కూడా గ్రహించ డానికి , మనకు ఒక రకం గా ” జ్ఞానోదయం ” అవుతుంది.

మరి వచ్చే టపా నుంచి ఈ B కాంప్లెక్స్ విటమిన్లు ఒకదాని తరువాత ఒకటి గా తెలుసుకుందాం !