Our Health

రచయత ఖజానా

15. డయాబెటీసూ, కిడ్నీసూ, కాంప్లికేషన్సూ !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 3, 2013 at 10:29 సా.

15. డయాబె టీసూ,   కిడ్నీసూ, కాంప్లికేషన్సూ ! 

పైన ఉన్న చిత్రం , మన మూత్ర పిండాలలో ఉండే  అనేక లక్షల అతి సూక్ష్మ ” జల్లెడ ” లలో ఒకటి.  దీనిని శాస్త్రీయం గా  ”నెఫ్రాను ”  అని  పిలుస్తారు. ( ఒక్కో కిడ్నీ లో ఈ నెఫ్రాను లు , లేదా ” జల్లెడలు ” ఎనిమిది నుంచి పదిహేను లక్షల సంఖ్య లో ఉంటాయి !  ).

 
డయాబెటిస్ ,అంటే  మధుమేహం లో కిడ్నీస్ లో వచ్చే కాంప్లికేషన్ లు ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ! 
కంట్రోలు లో లేని డయాబెటిస్, దేహం లో అన్ని భాగాలకూ హాని చేస్తుంది, క్రమేణా ! మరి మూత్రపిండాలకు ఎందుకు కన్సెషన్ ఇస్తుంది , ఆ ఎక్కువైన షుగరు ?!!!కిడ్నీ పరీక్షలు, ఒక క్రమ పధ్ధతి లో చేయించుకుంటూ ఉండడం అందువల్ల నే ఉత్తమం !
ముఖ్యం గా డయాబెటిస్ ఉన్న వారూ , కొత్తగా గుర్తించ బడిన వారూ  గుర్తు ఉంచుకోవలసినది:  మూత్ర పిండాలు , అంటే కిడ్నీలు తొలిదశలో డయాబెటిస్ వల్ల చూపించే మార్పులు ,  సరిఅయిన సమయం లో కనుక గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకునేట్టయితే ,  ఆ మార్పులు  అక్కడే ఆగి , కిడ్నీ ఫెయిల్యూర్  నివారింప బడుతుంది ! తొలిదశలో ఏకారణం చేతనైనా ఆ మార్పులను గుర్తించక పొతే, లేదా గుర్తించిన మార్పులను అశ్రద్ధ చేస్తే , కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది ! కిడ్నీ ఫెయిల్యూర్ అంటే , కిడ్నీస్,  ” ఇక మావల్ల కాదు మానవా  ” అని  ” చేతులెత్తేయడమే” !
డయాబెటిస్ లో కిడ్నీ చెడి పోయే రిస్కు ఎట్లా ఎక్కువ అవుతుంది ? :
మనకందరికీ తెలుసు కిడ్నీసు  మన రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఎట్లాగంటే , మూత్రపిండాలలో ఉండే నిర్మాణాలు మన దేహం లో ఉండే అతి సున్నితమైనా , అతి సూక్ష్మ మైనా జల్లెడ ల లాగా పని చేసి , రక్తంలో , మన దేహానికి అవసరమయే పదార్ధాలను రక్తం లోనే ఉంచి , అనవసరమైనా లేదా హానికరమైన పదార్ధాలను మూత్రం ద్వారా బయటికి పంపుతాయి ! దీనినే మూత్ర విసర్జన అని అంటాము. మన రక్తం లో షుగరు ఎక్కువ అయినప్పుడు , మన కిడ్నీస్ ఎక్కువ గా అంటే కష్టపడి పనిచేసి ,రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ! విపరీతం గా ఈ క్రియలో కష్ట పడుతున్నమూత్రపిండాల లోని జల్లెడలు కొన్ని చోట్ల ” చిన్న చిన్న చిల్లులు ” పడిన విధం గా తయారవుతాయి !  దానితో , మన దేహానికి ఉపయోగకరమైన పదార్ధాలు కూడా దేహం లోకి పోకుండా , ఈ ” చిల్లులు పడ్డ జల్లెడల ” ద్వారా మూత్రం లో బయటకు వస్తాయి ! కిడ్నీస్ లో ఈ చిల్లులు పెద్దవీ , ఎక్కువ సంఖ్య లో ఏర్పడుతున్న కొద్దీ , ఎక్కువ ఉపయోగ కర పదార్ధాలు బయటకు విసర్జింప బడడం జరుగుతూ ఉంటుంది !దానితో మూత్రపిండాలు చెడి పోవడమే కాకుండా , మనిషి కూడా బలహీన పడడం జరుగుతుంది ! 
అంతే కాకుండా , కాల క్రమేణా , ఈ జల్లెడలు సరిగా పని చేయక పోవడం ఎక్కువ అవుతూ , దేహానికి ఉపయోగం లేని , హాని కర పదార్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్ళ కుండా , దేహం లోనే ఉండడం వల్ల , అంటే మన రక్తం లోనే ఉండి పోతూ ఉండడం వల్ల , ఆ విష పూరిత పదార్ధాలు చేసే హాని మన శరీరం లోనూ కనిపిస్తూ ఉంటుంది ! ఉదాహరణ కు : యూరియా , క్రియాటినిన్ , లాంటి పదార్ధాలు ! ఇవి రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే  అంత రక్తాన్ని కలుషితం చేస్తాయి !  రక్తం మన దేహం లో ప్రవహించని ప్రదేశం ఏదీ లేదు కదా ! దాని వల్ల మన మెదడు కూడా సరిగా పని చేయలేక పోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

14. డయాబెటిస్ లో, స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మే 2, 2013 at 7:28 సా.

14. డయాబెటిస్ లో స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

 
డయాబెటిస్ వ్యాధి లో వ్యాధి తీవ్రం గా ఉంటే , అంటే ,  చాలా సంవత్సరాలు గా ఉండి , మందులకు లొంగకుండా మొండికేసిన డయాబెటిస్ లో  పక్ష వాతం లేదా స్ట్రోకు వచ్చే అవకాశాలు , డయాబెటిస్ లేని వారి లో స్ట్రోకు , పక్ష వాతం వచ్చే అవకాశాల కంటే ఎక్కువ గా ఉంటాయి ! ఈ అవకాశాలు కనీసం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ గా ఉంటాయి , డయాబెటిస్ ఉన్న వారిలో !  కానీ తగు జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే , డయాబెటిస్ ఉన్నా కూడా , ఈ అవకాశాలను తగ్గించు కోవచ్చు ! అందుకే కదా !  ఈ వివరాలన్నీ తెలియచేసేది 
మరి మీలో పక్ష వాతం , లేదా స్ట్రోకు వచ్చే రిస్కు ఎక్కువ ఉందో లేదో ఎట్లా తెలుసుకోగలరు ?
1. మీ వయసు యాభై అయిదు దాటితే 
2. మీరు ఊబకాయం కలిగి ఉంటే అంటే ఒబీసిటీ,
3. మీ కుటుంబం లో ఎవరికైనా పక్ష వాతం వచ్చి ఉంటే, 
4. మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే,  
5. మీకు హై బీపీ , అధిక రక్త పీడనం ఉంటే 
6. మీకు ఇంతకు ముందే మినీస్ట్రోకు లేదా TIA లేదా తాత్కాలిక పక్ష వాతం కనుక వచ్చి ఉన్నట్టయితే, 
7. మీకు గుండె జబ్బులు వచ్చి ఉన్నట్టయితే ,
8. మీ కొలెస్ట రాల్ అతలా కుతలం అయి ఉంటే , అంటే HDL తక్కువ గానూ , LDL ఎక్కువ గానూ ఉన్నట్టయితే !, 
గమనించండి పైన ఉన్న రిస్కులలో చాలా వరకూ మీ చేతులలో ఉన్నవే అంటే స్వయం కృతా లే ! అంటే వాటి  జననం , వాటి కంట్రోలూ  పూర్తి గా మీ ఆధీనం లోనే ఉంటాయి ! 
మరి పక్ష వాత సూచనలు ఏమిటి ?
1. శరీరం లో ఒక పక్క భాగాలన్నీ ఒక్క సారిగా బలహీనం అయి పోతూ ఉండడం లేదా ఉపయోగించ లేక పోవడం ! 
2. ఆకస్మికం గా మాట్లాడలేక పోవడం లేదా , మాట్లాడ డానికి ప్రయత్నిస్తే తడబడడం !
3. ఆకస్మికం గా  కన్ఫ్యూజ్ అవడం , లేదా ఎదుటి వారు చెప్పేవి ఏవీ అర్ధం కాక పోవడం ! 
4. అకస్మాత్తుగా కళ్ళు తిరగడం , కాళ్ళ మీద స్థిమితం గా నిలవ లేక పోవడం లేదా నడక లో పట్టు కోల్పోవడం !
5. ఒక కంటిలో కానీ రెండు కళ్ళతో కానీ ఆకస్మికం గా చూపు బాగా తగ్గి పోవడం లేదా కోల్పోవడం 
6. తీవ్రమైన తలనొప్పి రావడం, 
7. ఒక వస్తువు కానీ , వ్యక్తి కానీ రెండు గా కనిపించడం ! 
 
పై సూచనలన్నీ ఒక వ్యక్తి లోనే రావు. కొన్ని సూచనలు కొందరి లో రావడం జరుగుతూ ఉంటుంది. కానీ  ఈ సూచనలు అందరూ తెలుసుకోవడం ఎందుకు మంచిదంటే ,శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కదా ! అందుకు ! అంటే ఇప్పుడు పై సూచనలు ఎవరిలోనైనా గమనించిన వెంటనే కనుక నిపుణు లతో అంటే స్పెషలిస్టు లతో చికిత్స చేయించు కుంటే , పక్ష వాతాన్ని కూడా చాలా వరకూ నివారించి , చేతులూ కాళ్ళూ పడి పోకుండా నివారించవచ్చు ! అదే ఆధునిక వైద్య విజ్ఞాన మహిమ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

13. డయాబెటిస్ ఉన్న వారు ABC లతో, వారి గుండె ను ఎట్లా జాగ్రత్త గా చూసుకోవచ్చు ?

In మన ఆరోగ్యం., Our Health on మే 1, 2013 at 11:30 సా.
13. డయాబెటిస్ ఉన్న వారు ABC లతో వారి గుండె ను ఎట్లా జాగ్రత్త గా చూసుకోవచ్చు ? 
కొత్త గా డయాబెటిస్ వచ్చిన వారు కానీ , కొంత కాలం డయాబెటిస్ ఉన్న వారు కానీ, వారి గుండె జాగ్రత్త లో ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది కేవలం మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు !  వాటి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ! 
1. A  అంటే Hb A 1C  లో A:   అంటే  మనం ఈ పరీక్ష గురించి క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఈ పరీక్ష , రక్తం లో చెక్కర లేదా షుగర్ శాతాన్ని తెలియచేస్తుంది కనీసం పరీక్ష కు ముందు  షుమారు మూడు నెలల క్రితం వరకూ ఆ చెక్కెర శాతం ఎంత ఉందో ! అంటే ఈ పరీక్ష రక్తం లో చెక్కెర ఏ మాత్రం కంట్రోలు లో ఉందో తెలియ చేస్తుంది ! కేవలం అది తెలుసుకోవడం తోనే జాగ్రత్త తీసుకున్నట్టు కాదు కదా !  ఆ శాతం ఎప్పుడూ 6. 5 కూ , 7 కూ మధ్య ఉండేట్టు ప్రయత్నించాలి !అంటే, తదనుగుణం గా ఆహారం విషయం లోనూ పథ్యం విషయం లోనూ అన్ని జాగ్రత్తలూ , అన్ని వేళలా తీసుకోవాలి (  ఆహారం విషయం వివరం గా ముందు ముందు తెలుసుకుందాం ! ) అప్పుడే  మీరు A  ను అశ్రద్ధ చేయట్లేదని తెలిసేది !
2. B  : ఈ రెండో అక్షరం B  అంటే బ్లడ్ ప్రెషర్ అదే రక్త పీడనం ! డయాబెటిస్ ఉన్న ప్రతి వారూ కూడా వారి బీ పీ ఎప్పుడూ తగిన కంట్రోలు లో ఉండడానికి లక్ష్యం పెట్టుకోవాలి ! క్రమం గా బీ పీ పరీక్ష చేయించుకుంటూ ఆ బీ పీ 130/80 ఉండేట్టు చూసుకోవాలి ! 
3. C : ఇక మూడో అక్షరం C  అంటే , కొలెస్టరాల్ !  ఈ కొలెస్టరాల్ నిష్పత్తి కనుక మారి చెడు కొలెస్టరాల్ అదే LDL కొలెస్టరాల్ రక్తం లో ఎక్కువ అయి , HDL అదే మంచి కొలెస్టరాల్ అంటే మన దేహానికి ఉపయోగ పడే కొలెస్టరాల్ కనుక తక్కువ అవుతే వాటి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి కదా ! 
ఈ LDL  కొలెస్టరాల్ మన దేహం లో ఏ విధం గా చెడు పరిణామాలకు కారణం అవుతుందో , కొన్ని నెలల క్రితం టపాలలో మంచి చిత్రాలతో వివరం గా తెలియచేయడం జరిగింది. మీకు జ్ఞాపకం ఉంటే , తెలియ చేయండి , లేదా ఆ టపాలు చూడండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

12. డయాబెటిస్ లో, కళ్ళ జాగ్రత్తలు మరి ఎట్లా తీసుకోవాలి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 30, 2013 at 10:37 సా.

12. డయాబెటిస్ లో, కళ్ళ జాగ్రత్తలు మరి ఎట్లా తీసుకోవాలి ?:

 
క్రితం టపాలలో మనం, ప్రత్యేకించి డయాబెటిస్ వ్యాధి కంట్రోలు లో లేక పొతే దాని పరిణామాలు కళ్ళ లో ఏ విధం గా కాంప్లికేషన్ లు గా కనిపిస్తాయో వివరం గా తెలుసుకున్నాం కదా !  మరి డయాబెటిస్ ఉన్న వారు కళ్ళ గురించిన ఏ  ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?:
 
1. చెక్కెర కంట్రోలు లేదా షుగరు కంట్రోలు : డయాబెటిస్ లో  అనర్థాల కన్నిటికీ ప్రధాన కారణం, రక్తం లో చెక్కెర ఎక్కువ అయిన ఫలితం గా ఏర్పడే పరిణామాలే కదా ! ఆ అనర్ధాలలో కళ్ళు  కూడా  ” శిక్షింప బడతాయి ”  అందువల్ల కళ్ళ  జాగ్రత్తలో ప్రధానం గా  రక్తం లో ఎప్పుడూ చెక్కెర , అదే షుగరు పరిమాణం అంటే షుగర్ లెవల్  సరి అయిన పాళ్ళ లోనే ఉండే  ‘కృషి ‘  చేయాలి. ఇక్కడ ” కృషి ” అనే పదం వాడ బడింది ఎందుకంటే , రక్తం లో షుగర్ కంట్రోలు దానంతట అదే సునాయాసం గా అవ్వదు , డయాబెటిస్ ఉన్న ప్రతి వారూ , ఏ ఏ  పరిస్థితులలో వారి రక్తం లో,షుగరు ఎక్కువ అవుతుందో , ఆ యా  పరిస్థితుల నన్నిటినీ తెలుసుకోవడమే కాకుండా ,ఆ పరిస్థితులను  అన్ని వేళలా ” నివారించు కోవాలి ! ” ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ప్రతి ఒక్కరి రక్తం లో,చెక్కర పరిమాణానికీ , వారే బాధ్యులు ! చాలా చిన్న పిల్లలలో కనుక డయాబెటిస్ వస్తే , అప్పుడు మనం చిన్నారి పిల్లలను నిందించ లేము కదా ! మనం ఇక్కడ టైప్ టూ  డయాబెటిస్ , అదే ఒక వయసు వచ్చాక , వచ్చే డయాబెటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి , రక్తం లో చెక్కెర నియంత్రించుకునే బాధ్యత పూర్తి గా వారి మీదే ఉంటుంది ! చెక్కెర కంట్రోలు అన్ని విధాలా నివారించుకోవడానికి , వారికి , ఏ ఏ  పదార్ధాలు  రక్తం లో చెక్కెర ను ఎక్కువ చేస్తాయో , సరి అయిన అవగాహన ఏర్పరుచుకోవాలి ముందే ! ఉదాహరణ కు ” నేను  చెక్కెర అసలు ముట్టుకోను , కూరగాయలే తింటాను అదీ ఆలుగడ్డల కూర ఎక్కువ గా తింటాను కానీ నా బ్లడ్ షుగర్ కంట్రోలు లో ఉండట్లేదు , డాక్టర్ కూడా కారణం చెప్పలేక పోతున్నాడు ” అనే వారు చాలా మంది ఉంటారు. ఇక్కడ అట్లాంటి వారు మరచి పోయేది ఏమిటంటే ,’ ఆలుగడ్డలు కూడా తీయగా లేక పోయినా , అందులో చెక్కెర లేక పోయినా కూడా, బ్లడ్ షుగర్ ను ఎక్కువ చేస్తాయి ‘ అనే విషయం !  
2.  ఇక కంటి జాగ్రత్తలు ప్రత్యేకం గా చెప్పుకోవాలంటే , కళ్ళ లో పొరపాటున కూడా చేతి  వేళ్ళు పెట్టుకోవడం చేయకూడదు !
3. కంటి చూపు, ఏ కారణం చేత మందగించినా కూడా, ఆలస్యం చేయకుండా , కంటి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి !
4. కంటి లో నీరు కారడం , చీటికీ మాటికీ కళ్ళు ఎర్ర బడడం , ఒక కన్నులో నొప్పి ఉండడం, లాంటి లక్షణాలను డయాబెటిస్ లేని వారు తరచూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు ,ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్న వారు ఈ లక్షణాలు గమనిస్తే , అశ్రద్ధ చేయకూడదు !
5. కంటి చూపు  లో కొంత భాగమే కనిపించడం , కళ్ళ  ముందు తెరలు ఏర్పడడం , కాంతి లో చూడలేక పోవడం ,  ఒక వస్తువు రెండు వస్తువులు గా కనబడడం లాంటి లక్షణాలు కూడా అశ్రద్ధ చేయకూడదు ! 
6. కనీసం ప్రతి ఏడూ  a . కంటి చూపు ( శుక్లాలు పెరుగుతున్నాయో లేదో, చత్వారం , లేదా చూపు మంద గిస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ) , b . కంటిలో పీడనం ( గ్లాకోమా మొదలవుతుందో లేదో తెలుసుకోవడం కోసం  ) , c . రెటీనా ఫోటో (రెటీనా లో ఏర్పడే మార్పులు తోలి దశ లోనే గుర్తించడం కోసం )  ఈ మూడు పరీక్ష లూ తప్పని సరిగా చేయించుకోవాలి డయాబెటిస్ ఉన్న వారు !  గమనించండి , ఈ మూడింటి లో దేనిని అశ్రద్ధ చేసినా కూడా  చూపు కోల్పోయే ప్రమాదం ఉంది కదా ! 
7. మిగతా అన్ని వ్యాధులలొనూ  ” నివారణ   చికిత్స కన్నామేలు  ” అనే నానుడి వర్తిస్తుంది ! కానీ  డయాబెటిస్ లో కళ్ళ  జాగ్రత్త విషయం లో , ” నివారణ కన్నా నియంత్రణ మేలు ” అనే నానుడి ని మనం గుర్తించుకోవాలి !  అంటే డయాబెటిస్ లో కళ్ళ లో వచ్చే కాంప్లికేషన్ లు తగు జాగ్రత్తలతో , చాలా కాలం వరకూ వాయిదా వేయ వచ్చు !  కొన్ని కాంప్లికేషన్ లు తప్పని సరి అయినప్పుడు వాటిని అత్యంత తొలిదశల లోనే  కనుక్కుంటే , వాటిని చాలా వరకు నియంత్రించుకోవచ్చు , ఆధునిక పద్ధతుల సహాయం తో !  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

11. డయాబెటిస్ లో, రెటినోపతీ గురించి !

In మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 29, 2013 at 7:45 సా.

11. డయాబెటిస్ లో రెటినోపతీ గురించి ! 

క్రితం టపాలో కంట్రోలు లో లేని డయాబెటిస్ కాంప్లికేషన్ లలో భాగం గా , కళ్ళ లో వచ్చే మార్పుల గురించి కొంత తెలుసుకున్నాము కదా ! ఈ టపాలో కేవలం  డయాబెటిక్ రెటినోపతీ  గురించి న వివరాలు , ఈ క్రింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసి తెలుసుకోండి ! ఈ యూ ట్యూబు వీడియో ,రెటినోపతీ  గురించిన వివరాలన్నీ సంగ్రహం గా వివరిస్తుంది ( కాక పొతే ఈ వీడియో ఇంగ్లీషు లో ఉంది ! ) 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

10. డయాబెటిస్ లో, కళ్ళ కాంప్లికేషన్ లు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 28, 2013 at 9:45 ఉద.

10. డయాబెటిస్ లో కళ్ళ  కాంప్లికేషన్ లు. 

క్రితం టపాలో , కంట్రోలు లేని డయాబెటిస్ కంటి రెటినా పొర ను ఎట్లా ” ముట్టడి ” చేస్తుందో చూశాము కదా !  ఈ రెటినా పొరలో మార్పులు రావడాన్ని రెటినోపతీ అంటారు.  ఇప్పుడు కంటిలో, డయాబెటిస్ వల్ల వచ్చే మిగతా మార్పులు లేదా కాంప్లికేషన్ ల గురించి తెలుసుకుందాం !
గ్లకోమా :
కేవలం రెటీనా లో మార్పులే కాకుండా , కంటి లో ఉండే పీడనాన్ని ఎక్కువ కూడా చేస్తుంది డయాబెటిస్.  పై చిత్రం లో చూడండి ! కంటి లో పీడనం ఏమిటి ? అని ఆశ్చర్య పోతున్నారా? ఒక ఉదా హరణ:  నోటితో ఊదే బూర ఒకటి మీరు చూశే ఉంటారు. ఆ బూరలో , గాలిని ఊదినపుడు కానీ , లేదా నీతితో నింపినపుడు కానీ, ఆ బూర ఉబ్బిపోయి, నిండు గా కనబడుతుంది ! అంటే ఆ బూరలో వత్తిడి, లేదా పీడనం పెరిగుతుంది , గాలిని కానీ, నీటిని కానీ  నింపినపుడు. కానీ ఆ గాలిని కానీ , నీటిని కానీ తీసి వేస్తే ,ఆ బూర ముడుచుకు పోయి కనిపిస్తుంది కదా ! అదే విధం గా, మన కనుగుడ్డు లో వివిధ ద్రవాలు నింపబడి , కను గుడ్డు ముడుచుకు పోకుండా, పీడనం నిరంతరం కాపాడుతుంది.  ఈ పీడనాన్ని నియంత్రించే ద్రవాలు నిరంతరం మారుతూ , పాత ద్రవాలు పోతూ, కొత్త ద్రవాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కంట్రోలు లో లేని డయాబెటిస్ తో పాత ద్రవాలు విసర్జింప బడే నాళికలు కుంచించుకు పోవడమూ , లేదా మూసుకు పోవడమూ జరుగుతుంది. దానితో కనుగుడ్డు లో పీడనం లేదా వత్తిడి పెరుగుతుంది. ఆ పీడనం వల్ల రెటినా పొర కూడా ప్రభావితమవుతుంది !  ఈ పరిస్థితిని గ్లకోమా అంటారు ! ఆరోగ్యవంతుల కంటే , డయాబెటిస్ ఉన్న వారికి నలభై శాతం ఎక్కువ గా ఈ గ్లకోమా వస్తుందని పరిశీలనల వల్ల తెలిసింది. 
శుక్లాలు ( కాటరాక్ట్ ) :
మీరు మునుపటి టపాలో కంటిలోని భాగాల గురించి చూసి ఉంటారు !  పై చిత్రం లో చూడండి ! కంటిలో ఉండే ఇంకో ముఖ్య భాగం , కంటి కటకం అదే లెన్స్ . మానవులందరి కళ్ళ లోనూ సహజం గా పుట్టుకతోనే , ఒక కటకం కూడా నిర్మితమై ఉంటుంది. ఈ కటకం మనం కన్ను తెరిచినపుడు , బయట ఉన్న వెలుతురు ను రెటినా మీద పడేట్టు చేస్తుంది.అంతే కాక , మనం చదివే అక్షరాలూ మనకు కనబడుతున్నాయంటే , ఈ కంటి కటకం పారదర్శకంగా  ఉండడం వలనే !  డయాబెటిస్ లో ఈ కంటి కటకం యొక్క పారదర్శకత తగ్గిపోయి, మసక బారుతుంది. దానితో చూపు మందగిస్తుంది. గమనించవలసినది, ఆరోగ్యవంతుల కళ్ళ లో కూడా కంటి కటకం యొక్క పారదర్శకత తగ్గుతూ ఉంటుంది. కానీ శుక్లాలు అంటే క్యాట రాక్ట్ లు ఏర్పడడం,  ఏ  ఏడో దశకం లోనో వస్తుంది కానీ డయాబెటిస్ ఉంటే యాభై అరవై ఏళ్లకే శుక్లాలు వస్తాయి !  
రేటినోపతీ : 
పైన చెప్పుకున్నట్టు గా రెటినా పోర లోని అనేక సూక్ష్మ రక్త నాళాలలో , కొన్ని దశలు  గా డయాబెటిస్ వల్ల మార్పులు వస్తాయి ! ఆ మార్పులు రెటినా పొర ను క్రమేణా పని చేయకుండా చేస్తుంది ! పై చిత్రం లో చూడండి ! పైన చెప్పుకున్న పరిస్థితులన్నీ కూడా కంటి చూపును మందగింప చేయడమే కాకుండా , కన్ను నొప్పి కూడా కలిగిస్తాయి ( గ్లకోమా లో )అంతే కాక ఈ పరిస్థితులలో వేటినీ అశ్రద్ధ చేయకూడదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

9. మధుమేహం ( డయాబెటిస్ ) లో, కళ్ళ జాగ్రత్త ఎందుకు అవసరం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 27, 2013 at 10:09 ఉద.

9. మధుమేహం ( డయాబెటిస్ ) లో, కళ్ళ జాగ్రత్త ఎందుకు అవసరం ?

 
డయాబెటిస్ గుర్తించిన ప్రతి వారిలోనూ ఆరోగ్యవంతులైన వారి కన్నా ముందుగా వివిధ అవయవాలలో , కొన్ని హానికరమైన , అంటే మనకు ఉపయోగం లేని మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిలో  కళ్ళ లో వచ్చే మార్పులు ముఖ్యమైనవి. అంటే , ” సరిగా కంట్రోలు లో లేని డయాబెటిస్  వల్ల ”  అని వేరుగా చెప్పనవసరం లేదు కదా !
మరి  డయాబెటిస్ వల్ల కళ్ళ లో ఏ ఏ  మార్పులు జరుగుతాయి ?
ఈ విషయం తెలుసుకునే ముందు , కళ్ళు అంటే కేవలం కను రెప్పలు, కను గుడ్డు , కంటి పాప , కంటి కటకం అనే మాటలే సామాన్య జనానీకానికి తెలుసు కానీ ,మిగతా భాగాలు కూడా మనం పునశ్చరణం చేసుకోవడం ముఖ్యం. అప్పుడే  ఆయా కంటి భాగాలలో ఎమార్పులు జరుగుతాయో తెలుసుకోవడం శులభం అవుతుంది ! 
పైన ఉన్న చిత్రం లో మొదటి చిత్రం: కన్ను దాని భాగాలు. రెండవ చిత్రం కూడా కంటి భాగాలే కానీ , మనకందరికీ అర్ధం అయేందుకు , కను గుడ్డును , నిలువుగా కోసి, అందులోని భాగాలను చూపడం జరిగింది !  ఇక్కడ గమనించ వలసినది, ముఖ్యం గా కనుగుడ్డు వెనక భాగాన ఉన్న రెటినా అనే పొర. ఈ రెటినా పొర, ఉల్లిపాయ పొరలు గా ,కనీసం మూడు ముఖ్యమైన పొరల తో నిర్మితమై ఉంటుంది. వాటిలో పై పొర ను స్క్లీరా అనీ , మధ్య పొరను కోరాయిడ్ అనీ , లోపలి పొర ను రెటినా అనీ పిలుస్తారు. రెటీనా పొరను కెమెరాలో వెనుక భాగం లో ఉండే తెర లాగా భావించ వచ్చు ! ఎందుకంటే , మనం కంటిద్వారా చూసే ప్రతి వస్తువూ , ఈ రెటీనా పొర  మీద పడాల్సిందే ! అట్లా పడితే కానీ , అక్కడి నుంచి ” ఆప్టిక్ నెర్వ్ ” (   దృశ్య నాడి ) మన మెదడుకు ఆ వస్తువుకు సంబంధిన జ్ఞానాన్ని తీసుకు వెళ్ళ లేదు ! అప్పుడే మనం మన కళ్ళ ఎదురుగా ఉన్న వస్తువును ” చూడ ” గలుగుతాము ! అంటే, గుర్తించ గలుగుతాము !  అంటే మన దృశ్య జ్ఞానానికి ఈ రెటీనా పొర ఎంతో ముఖ్యమని ఇప్పుడు తెలిసింది కదా ! ఈ రెటినా పొర అనేక వేల సూక్ష్మ రక్త నాళాల చేత నిర్మితమై ఉంటుంది ! అందువల్ల నే ఈ రెటీనా పొర  సజీవం గా ఉంటుంది ! కంట్రోలు లో లేని డయాబెటిస్ వల్ల వచ్చే మార్పులు , ఈ అతి సూక్ష్మమైన రక్త నాళాలను  హరిస్తాయి ! దానితో రెటీనా పొర దెబ్బ తింటుంది, దానితో చూపు మందగిస్తుంది ! తీవ్రం గా డయాబెటిస్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే , చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది !  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

8. మధుమేహం ( డయాబెటిస్ ) కాంప్లి కేషన్లు ఏమిటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 26, 2013 at 7:13 సా.

8. మధుమేహం ( డయాబెటిస్ ) కాంప్లి కేషన్లు  ఏమిటి ?: 

Eye Complications Foot ComplicationsSkin ComplicationsHeart DiseaseHigh Blood Pressure Mental Health Hearing Loss 72x72

 
డయాబెటిస్ నివారణకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ,  ప్రీ డయాబెటిస్ ను ఎట్లా కనుక్కోవాలో క్రితం టపాలలో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి ఈ డయాబెటిస్  ఒక సారి వచ్చాక , ” ఏమవుతుంది ?  ఈ డయాబెటిస్ ను పథ్యం ఏమీ చేయకుండా అశ్రద్ధ చేస్తే ఏం పోతుంది ? ” అని అనుకుని ,పాటించ వలసిన ఆహార నియామాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు, చాలా మంది ! దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు ! అంతకు ముందు అన్ని ఆహార పదార్ధాలూ, ఏ పథ్య మూ  లేకుండా, తమ ఇష్టానుసారం గా తిని, ఒక్క సారిగా , కేవలం చెక్కెర ఉన్న తీపి పదార్దాలే కాకుండా , అసలు తినే ప్రతి పదార్ధం విషయం లోనూ అతి జాగ్రత్త పాటిస్తూ , ముళ్ళ దారిలో , పాద రక్షలు ఏమీ లేకుండా , నడిచిన విధం గా అనుభూతి చెందుతూ , జీవితం సాగించడం అతి కష్టం గా అనిపిస్తూంది చాలా మందికి ! అందు వల్ల విరక్తి తో కొంత కాలం పథ్యం  పాటించి , కొన్ని రోజులు వారి ఆహార పానీయ నియమాలను ఒక్క సారిగా సడలిస్తూ ఉంటారు చాలా మంది ! వారందరికీ ఒకటే సూచన ! 
ప్రపంచం లో కొన్ని రకాల ఆహారం తింటే విపరీతమైన ఎలర్జీ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ! సీరియస్ గా ఎలర్జీ ఒక సారి వచ్చి ,మళ్ళీ ఎప్పుడూ , ఆ పడని ఆహారాన్నీ , ఆహార పదార్దాలనూ , మళ్ళీ జీవితం లో ముట్టుకొని వారు చాలా మంది ఉన్నారు ! డయాబెటిస్ కూడా ఇట్లాంటి పరిస్థితే, కాక పొతే , ఈ పరిస్థితిలో వచ్చే మార్పులు, ఒక్క సారిగా కాక , క్రమేణా , కాంప్లికేషన్ ల గా మారి , వివిధ అవయవాలకూ , ఇంకా తీవ్రం గా ఉంటే , ప్రాణాలకూ ముప్పు తెస్తుంది ! డయాబెటిస్ , ఒక రకం గా, మన దేహం  ఎక్కువ చెక్కర కు సరిగా స్పందించ లేక ఏర్పడే పరిస్థితి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, కేవలం మన పాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ అనే హార్మోనే కాక , మన దేహం లో అన్ని చోట్లా ఉన్న కండరాలు కూడా సరిగా స్పందించలేక పోవడం అని ! అంటే , పాంక్రియాస్ లో నుండి ఉత్పత్తి అయే  ఇన్సులిన్ అనే హార్మోను , నిత్య జీవితం లో, మనం తినే ఆహారం లో ఉండే చెక్కెర ను, మన శరీరం లోని వివిధ కణాలలోకి   ప్రవేశించే ట్టు  చేస్తుంది. కానీ మన ఆహారం లో , రోజు రోజు కూ  చెక్కర ఎక్కువ అవుతూ ఉంటే , ఇన్సులిన్ ఇక సరిపడినంత ఉత్పత్తి అవక, పాంక్రియాస్ కణాలు ” చేతులెత్తేస్తాయి ” ! ఇంకా , మనం ప్రతి రోజూ వ్యాయామం చేయక పోవడం వల్ల , మన కండరాలు కూడా ” మొండి కెత్తుతాయి  ”  ! దానితో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాక పోవడం తో పాటుగా,కండరాలు సక్రమం గా చెక్కర ను అంటే గ్లూకోజు ను ” పీల్చ ” లేక పోవడం తోడై , డయాబెటిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది ! మరి ఈ పరిస్థితి ఎక్కువ సమయం శరీరం లో ఉంటున్న కొద్దీ , ఎక్కువ గా ఉన్న చెక్కర , అదే గ్లూకోజు , రక్త నాళాల మీదా , వివిధ అవయవాలలోనూ, అనేక మార్పులు తీసుకు వస్తుంది ! వాటినే కాంప్లికేషన్ లు అంటారు ! 
పైన కొన్ని ఫోటోలు వరస గా ఉన్నాయి !వాటిలో ఏ విధం గా డయాబెటిస్ వల్ల  కాంప్లికేషన్ లు వస్తాయో , చెప్ప గలరా ? !!! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు ! 

7. ప్రీ డయాబెటిస్ కనుక్కోడానికి త్రీ బ్లడ్ టెస్టులు :

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 25, 2013 at 6:23 సా.

7. ప్రీ డయాబెటిస్ కనుక్కోడానికి త్రీ  బ్లడ్ టెస్టులు : 

Blood Glucose Tests

 
ప్రీ డయాబెటిస్ యొక్క ప్రాముఖ్యత, క్రితం టపాలో తెలుసుకున్నాం కదా !   ఈ దశ ను కనుక సరైన సమయం లో గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకుంటే వందలో అరవై మంది వరకూ , డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు !  మరి  ఈ అరవై శాతం మంది లో అందరూ ఉండాలని అనుకుంటే , ఈ ప్రీ డయాబెటిస్ లక్షణాలను తెలుసుకోవడమే కాకుండా , ( ఈ లక్షణాలను క్రితం టపాలో వివరించడం జరిగింది కదా ! ) , అవసరమైన మూడు రక్త పరీక్షల గురించి కూడా తెలుసుకోవాలి ! 
1. మొదట గా  Hb A 1 C  పరీక్ష :
ఈ పరీక్ష  రక్త పరీక్ష.  దీనివల్ల మన రక్తం లో చెక్కెర ఏమాత్రం  ఉందో సూచిస్తుంది !  కేవలం ఏమాత్రం చెక్కెర ఉందో సూచించడమే కాకుండా , ముఖ్యం గా ఆ చెక్కెర శాతం , పరీక్షకు ముందు కనీసం ఆరు వారాల సమయం లో మన రక్తం లో చెక్కెర ఏమాత్రం ఉందో తెలియ చేస్తుంది ! 
ఉదాహరణ కు : 
పైన ఉన చిత్రం లో A 1C  మీద ఉన్న చిత్రం చూడండి    నార్మల్ అంటే ఆరోగ్య వంతుల రక్తం లో  5. 7 శాతం కన్నా తక్కువగా  A 1c  ఉంటుంది. అంటే పరీక్షకు ముందు ఆరు వారాల లో ఆ వ్యక్తి రక్తం లో ,  చెక్కెర శాతం నార్మల్ గానే ఉంది అని చెబుతుంది ఆ పరీక్ష. కానీ ప్రీ డయాబెటిస్ లో  ఇదే పరీక్ష ఫలితం వేరుగా ఉండి , ( కాస్త ఎక్కువగా ఉండి ) 5.7 కీ 6. 5కీ మధ్య లో ఉంటుంది .  ఇక  డయాబెటిస్ పరిస్థితి ఉన్నపుడు ,ఈ చెక్కెర శాతం  6. 5 శాతం కానీ , అంత  కన్నా ఎక్కువ గా కానీ ఉంటుంది.  
2. రెండో పరీక్ష F P G :  అంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష : ఈ పరీక్ష చేయించుకునే వ్యక్తి  పరీక్ష క్రితం రాత్రి నుంచి , అంటే పరీక్షకు ముందు కనీసం ఎనిమిది గంటలు , ఏమీ ఆహారం తినకూడదు , అట్లాగే పానీయాలు కూడా తీసుకోకూడదు , కేవలం దాహం అయినప్పుడు , మంచి నీరు తప్ప! ఈ పరీక్ష ఫలితాలు నార్మల్ వ్యక్తి లో వంద మిల్లీ గ్రాములు ఉంటుంది ప్రతి వంద   మిల్లీ లీటర్ల ప్లాస్మాకూ , ( వంద మిల్లీ లీటర్లు అంటే ఒక లీటర్ లో పదో వంతు కదా ! ) అదే ప్రీ డయాబెటిస్ పరిస్థితిలో  వంద – నూట ఇరవై ఆరు మిల్లీ గ్రాముల మధ్య ఉంటుంది.  ఆ నూట ఇరవై ఆరు మిల్లీ గ్రాములు దాటిన పరిస్థితి డయాబెటిస్ అనబడుతుంది. 
3. మూడో పరీక్ష : O G T T : సామాన్యం గా ఈ పరీక్షను   F P G  పరీక్ష తో కలుపుతారు . అంటే పరీక్ష చేయించుకునే వారు క్రితం రాత్రి లంఖణం తో ( అంటే ఏమీ తినకుండా , పానీయాలు తాగకుండా )  
ఉదయం    F P G  పరీక్ష చేయించుకుని , ఆ తరువాత  ఒక  డెబ్బై అయిదు గ్రాముల చెక్కెర ఉన్న ద్రావణాన్ని తాగిన ముప్పై నిమిషాలు, అరవై నిమిషాల తరువాత రెండు సార్లు రక్త పరీక్ష చేయడం  జరుగుతుంది. 
ఈ పరీక్షలో ఫలితాలను ఎట్లా విశ్లేషించాలి ?
ఈ O G T T పరీక్షలో  నార్మల్ వ్యక్తులకు రక్తం లో చెక్కెర నూట నలభై మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉంటుంది. నూట నలభై నుంచి రెండు వందల మిల్లీ గ్రాముల మధ్య కనుక ఉంటే , ఆ పరిస్థితిని ప్రీ డయాబెటిస్ అని అంటారు. రెండు వందల మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ గా డయాబెటిస్ ఉన్నప్పుడు ఉంటుంది !  
ఫాస్టింగ్ రక్త పరీక్షలో లంఖణం చేయకుండా  చిరుతిండి ఏదైనా తిన్నాక పరీక్ష చేయించుకుంటే ఏమవుతుంది ? 
ఏమీ కాదు కానీ ఆ పరీక్ష పేరును మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే  అది ఫాస్టింగ్  పరీక్ష అనబడదు కదా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

6. ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 24, 2013 at 8:56 సా.

6. ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి ?

 
ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ వ్యాధి నిర్ణయం  అవ్వక ముందు ఉండే పరిస్థితి.
ప్రీ డయాబెటిస్ ను ఎట్లా కనుక్కోవచ్చు ?:
ప్రీ డయాబెటిస్ ను మూడు రకాలైన రక్త పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు ! ప్రీ డయాబెటిస్ పరిస్థితిలో రక్త పరీక్షలు  అబ్ నార్మల్ గా ఉంటాయి. కానీ ఈ అబ్ నార్మల్ పరీక్షలు ఖచ్చితం గా డయాబెటిస్ ఉన్నప్పుడు లాగా ఉండవు అందు వల్ల నే ఈ పరిస్థితిని ప్రీ డయాబెటిస్ అని అంటారు ! ఇక వ్యాధి లక్షణాల మాటకొస్తే , ప్రీ డయాబెటిస్ పరిస్థితి ఉన్నవారు  కొన్ని డయాబెటిస్ లక్షణాలు మాత్రమే చూపిస్తారు ! ఈ ప్రీ డయాబెటిస్ పరిస్థితిని కనుక కనుక్కుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనీసం అరవై శాతం మంది లో అంటే ఒక వంద మంది ప్రీ డయాబెటిస్ ఉన్న వారిలో అరవై మంది లో వారు డయాబెటిస్ వ్యాధి బారిని పడకుండా నివారించుకోవచ్చు అని పరిశోధనల వల్ల స్పష్టమైంది ! అందుకే  ఈ ప్రీ డయాబెటిస్ ప్రాముఖ్యత అందరూ  తెలుసుకోవడం ఉత్తమం ! 
 
ఈ ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి ? :
1. అసాధారణం గా దాహం వేయడం 
2. ఎక్కువ గా మూత్ర విసర్జన చేయడం 
3. తీవ్రమైన అలసట కలగడం !
4. కళ్ళు  బైర్లు కమ్మినట్టు ఉండడం అంటే మసక మసక గా కనిపించడం 
5. తరచూ ఇన్ఫెక్షన్లు కలగడం 
6. చిన్న చిన్న గాయాలు తగిలినా కూడా ఆ గాయాలు మానక , చీము పట్టడం 
7. చేతులు , కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువ గా అనిపించడం 
8. మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ లు తరచూ రావడం , ప్రత్యేకించి స్త్రీలలో . 
 
ఈ ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువ గా ఉంటుంది ?:
1. సామాన్యం గా 45 సంవత్సరాలు దాటిన వారిలో 
2. ఆసియా వాసులలో ( అంటే భారత ఉపఖండం లో ఉన్న వారు కూడా ! ) 
3. కుటుంబం లో ఎవరైనా డయాబెటిస్ అప్పటికే ఉన్నవారు ఉంటే 
4. అధిక రక్త పీడనం ఉన్నవారు 
5. గర్భం తో ఉన్నపుడు డయాబెటిస్ వచ్చిన స్త్రీలు 
 
ప్రీ డయాబెటిస్ వచ్చిన వారందరూ తరువాత డయాబెటిస్ వ్యాధి గ్రస్తులవుతారా ?:
 
కాదు. పైన తెలిపినట్టుగా ,  ప్రీ డయాబెటిస్ అనే పరిస్థితి  పూర్తి డయాబెటిస్ వ్యాధి వచ్చే ముందు ఉండే పరిస్థితి.  ఈ పరిస్థితి లో కనుక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే , మధుమేహాన్ని లేదా డయాబెటిస్ ను  నివారించుకోవచ్చు ! వచ్చే టపాలో  ప్రీ డయాబెటిస్ ను కనుక్కునే పరీక్షల గురించి తెలుసుకుందాం !